Wednesday, December 11, 2019

రండి... మళ్ళీ పుడదాం - జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి- విశేషమైన కథ






రండి... మళ్ళీ పుడదాం - జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

చుట్టూ ఆకాశాన్నందుకోవడానికి చేతులు చాస్తున్న పచ్చని చెట్లు.

    అయినా అందనంటున్న ఆకాశం... అప్పటికీ ఆగకుండా ప్రయత్నం కొనసాగిస్తున్న ఆకుల కుంచెలు... గాలికి గలగలలాడుతున్న ఆ కుంచెల కొసల నించీ నేల మీదకి జారడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో వైన వైనాలుగా రంగులు మార్చుకుంటున్న రశ్మి.
        
    కింద, నేల కనపడితేగా...
        
    నేలంతా మెత్తని తివాచీ పరిచినట్టుగా రాలిపడిన ఆకులు.
        
    ఆ ఆకుల్లోంచీ పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కిందో తొండ.  ఒక కొమ్మ రక్షణలో నిలబడి నిటారుగా నిగిడి గర్వంగా తలెగరేసింది. ఎంత తలెత్తుకు తిరిగే మొనగాడయినా తొండంత రాజసంగా తల తిప్పలేడని నరసింహానికి తెలియదు. అందుకే దానితో పోటీ పడ్డాడు.
        
    అది తలవంచింది.
        
    తనూ దానిలాగే తల వంచాడు.
        
    అది వంచిన తలని వంచినట్టే వుంచి, " ఏదీ ఇప్పుడు నాలా తలెగరెయ్యి చూద్దాం " అని సవాలు చేస్తున్నట్టుగా ఒక్క సారిగా తల విదిల్చింది.
        
    తనూ దానిలాగే తల విదిల్చాలనే ప్రయత్నంలో నడుం పైభాగాన్ని నిటారుగా నిలబెట్టి.., వంచిన తలని వంచినట్లే వుంచి.., సరిగ్గా దానిలాగే తల విదల్చబోయాడు. అలవాటులేని ప్రయత్నాన్ని సహించలేని  బొంగరపు కీలు కలుక్కుమనడంతో మెడ పట్టుకుని ముందుకి తూలాడు. ఉన్నట్టుండి అలా తూలడంతో ఏటవాలుగా వున్న ఆ ఉపరితలం మీద కాలు పట్టు తప్పి ఆరడుగులు కిందకి జారాడు. అదృష్టం బాగుండి చేతికందిన చెట్టుకొమ్మని పట్టుకుని నిలదొక్కుకోగలిగాడు.
         
    అలా నిలదొక్కుకోగానే అతను చేసిన మొట్టమొదటి పని చుట్టూ అనుమానంగా చూడటం. ఆ అనుమానానికి కారణం, అతను పెరిగిన వాతావరణంలోని నాగరీకపు జంకు. అయినా తను జారిపడిన సంగతి చూడ్డానికీ, చూసి వెక్కిరించడానికీ, అక్కడ ఎవరున్నారు గనకా అనుకుంటూ ధైర్యంగా జుట్టు సవరించుకున్నాడు.
         
    నేనున్నానుగా అన్నట్టు మళ్ళీ తలెగరేసింది తొండ.
         
    నరసింహానికి నసాళానికి అంటింది. దాంతో కోపంగా చేతికందిన రాయి తీసుకుని దానిమీదకి విసిరాడు. అది ఒక్కసారిగా పరుగందుకుంది.
         
    అలా పరిగెడుతున్న దాని మేని రంగులు మారుతుంటే ఆ రంగులు దానివో లేక దానిమీద పడుతున్న కిరణాలవో అర్ధం కాక గందరగోళం పాలయ్యాడు.
          
    ఇంతకీ అది తొండా ఊసరవెల్లా అని శంకిస్తూ అతి జాగ్రత్తగా అడుగులేస్తూ లోయలోకి దిగడం మొదలు పెట్టాడు.
          
    ఆరు ఋతువులూ ఆమని కోయిలా ఆలమందలూ అన్నీ పుస్తకాల్లో చదివి ఆనందించడమే తప్ప, తనకి ఏనాడూ ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదు. ఆ అవకాశం కోసమే ఎవరికీ కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా తనొక్కడే ఒంటరిగా బయలుదేరి వచ్చాడు. అయితే అలా ఒంటరిగా రావడంలో ఇంతటి ఆనందం వుంటుందని అతను ఊహించ లేదు.
         
    నరసింహం జిల్లా విద్యా శాఖాధికారి.
         
    ఈ మధ్యనే ఆ జిల్లాకి బదిలీ అయి వచ్చాడు.
         
    ఆ బదిలీకి ఓ బలమైన కారణం వుంది.
         
    అతను గతంలో పని చేసిన చోట ఉపాధ్యాయుల్లో బోధనా సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం ప్రతి యేటా పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులు కావడాన్ని తప్పనిసరి అర్హతగా పరిగణించాలని ప్రతిపాదించాడు...
            
    అంతే..,
         
    ఏదో జన్మానికి ఓ శివరాత్రిగా ఉద్యోగార్హతా పరీక్షలు రాయమంటే రాయగలరేమోగానీ.., ఏటా పరీక్షలు రాసి సామర్ధ్యాన్ని నిరూపించుకోవడం అంటే అంత సులభం కాదు. ఒకవేళ ఆయా పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనవారికి జీతాలు పెంచి పదోన్నతులిస్తామంటే ఒప్పుకునేవారేమోగానీ కేవలం బోధనా ప్రమాణాల్ని పెంపొందించుకోవడానికి క్రమం తప్పకుండా ఏటా కష్టపడమంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మాత్రం ఒప్పుకుంటారు గనక ?
          
    అందుకే.., దాన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి... అయినా అతను పట్టు వదల లేదు... దాంతో రాజకీయ వత్తిళ్ళు నానాటికీ పెరిగిపోయాయి... చివరికి అన్నీకలిసి అతని బదిలీకి దారితీశాయి...
         
    అయినప్పటికీ అతని వృత్తి పరమైన నిబద్ధతలో పెద్ద మార్పులేమీ రాలేదు.
         
    ఆ స్థాయి అధికారి మందీ మార్బలం లేకుండా అంత దూరం ఒంటరిగా రావడానికి మూల కారణం ఓ హాజరు పట్టీ. అది హంసల కోన ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేసే అయ్యవారిది. ఆరోజు అనుకోకుండా నరసింహం కంట పడింది. దాన్ని యధాలాపంగా తిప్పి చూశాడు. అందులో ఏడో పుటలో గతేడాది రెండో నెల నాలుగోతారీకు శనివారం అని రాసుంది. కానీ ఆ రోజు శుక్రవారమని తనకి బాగా తెలుసు. ఎందుకంటే, ఆనాడు తన కూతురి పుట్టిన రోజు.
           
    అయినా సరే, అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం తన సంచారవాణిలోఆనాటి తేదీని సరిచూసుకున్నాడు. తన అనుమానమే నిజమని తేలింది.
         
    దాంతో హాజరు పట్టీలో పుటలన్నిటీనీ పరీక్షగా చూశాడు. అందులో శుక్రవారాలన్నీ శనివారాలుగా నమోదై వున్నాయి. అంటే ఆ అయ్యవారు, ప్రతీనెలా జీతాల ముందు రోజు హాయిగా ఇంట్లోనే కూర్చుని ఆ నెలంతటికీ దర్జాగా సంతకాలు పెట్టేసేవాడన్నమాట. లేకపోతే, ఒకనాడు కాకపోతే మరోనాడైనా జరిగిన తప్పు అతని దృష్టికి వచ్చి వుండేది. అలా జరగలేదూ అంటే..,
            
    అది అలవాట్లో పొరపాటు కాదు..! పొరపాటైన అలవాటు..!!
         
    మరి పై అధికారులంతా ఏమైనట్టు ?
         
    పై అధికారులెప్పుడూ పై అధికారులే..! కాబట్టీ వారికి పై పై చూపులే తప్ప తరచి చూసే అలవాటు వుండదు. అందుకే, " చూడు, ఏదో నీమీద నమ్మకం కొద్దీ సంతకం పెడుతున్నాను. ఏమాత్రం తేడా వచ్చినా అంతా నీ మెడకే చుట్టుకుంటుంది జాగ్రత్త " అంటూ ఉత్తుత్తి బెదిరింపు చూపులతో సంతకాలు కానిచ్చేస్తూ వుంటారు. అందుకే సామాన్యంగా ఇలాంటివి బైట పడవు. ఒకవేళ ఇలా కాలం చెల్లిపోయాక బయట పడ్డా పెద్ద నష్టం వుండదు. ఎందుకంటే అధికారులంత నిక్షేపరాయుళ్ళు కేవలం అధికారులు మాత్రమే. కాబట్టీ   ఇలా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకునేంత చాదస్తం వుండదు. ఈ విషయం నరసింహానికి తెలియందేం కాదు.
         
    ఇలా వారానికో పదిరోజులకో చుట్టం చూపుగా బడికి వెళ్ళొచ్చే అయ్యవార్లు అక్కడక్కడా తారసపడుతూనే వుంటారు. కానీ, అలాంటివాళ్ళని శిక్షించడం అంత సులభం కాదు. ఎందుకంటే, వారి బలం వారికుంటుంది. ఎలాంటి అండదండలు లేనివాడికైతే ఇంతటి ధైర్యం వుండదు. అయినా సరే, ఆ అయ్యవారిని ఓసారి చూసి రావాలనే కోరిక కలగడానికి కారణం... ఆ అయ్యవారు పనిచేసే ఊరి పేరు...
         
    హంసల కోన.
          
    ఎంత అందమైన పేరు...
          
    ఆ పేరు వెనక వున్న కథ కూడా అంతే ఆసక్తికరమైనది.
          
    ఒకానొకప్పుడు విద్యాధిదేవత అయిన సరస్వతీమాత భూలోక సందర్శనార్ధం తన హంస వాహనంమీద బయలుదేరింది.
          
    ఆ ప్రాంతానికి రాగానే ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశురాలై అక్కడే విడిది చేసింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పన్నెండామడల దూరంలో ఒక పిట్టని కూల్చిన బోయవాడు పుట్టెడు దుఃఖంతో బాధ పడుతూండగా ఆ  శోక గీతం అమ్మవారి చెవిన పడింది. వెంటనే ఆ బోయని ఓదార్చడానికి తనే స్వయంగా వెళ్ళింది. ఆ నిషాదుని ఊరడించి రామాయణ కథా రచన చేయవలసిందిగా ప్రబోధించి మాయమైపోయింది.
           
    ఆ బోయవాడే వాల్మీకి.
          
    ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమై ప్రేరణనిచ్చిన ప్రదేశమే వాల్మీకి పురం.
          
    అమ్మవారు తనమాట మరచి అటునించటే బ్రహ్మ లోకం చేరిన విషయం తెలియని హంస ఇంకా అక్కడే తిరుగుతూ వుందనీ అందుకే దానికి హంసల కోన అనే పేరు వచ్చిందనీ అంటారు. అంతే కాదు, అక్కడి ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతమనీ ఎంత చూసినా కూడా తనివి తీరదనీ చెప్పుకుంటారు. తనకి జనారణ్యాలే తప్ప నిజారణ్యాలని చూసిన అనుభవం లేదు. కానీ చూడాలనే కోరిక మాత్రం కొండంత. ఒకవేళ బంధు మిత్రులతో విహారయాత్రగా వస్తేగనక ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపడంలోని ఆనందానుభూతులు అనుభవంలోకి రావు. అందుకే ఒంటరిగా బయలుదేరాడు.
          
    చిత్తూరు నించీ బయలుదేరి మదన పల్లె, వాల్మీకి పురం మీదుగా ముష్టూరు వెళ్ళాడు. అక్కడినించీ హంసల కోనకి బండి బాట వుందిగానీ చుట్టు తిరిగి వెళ్ళడానికి కనీసం అయిదు గంటలు పడుతుంది. అదే బండాకొండమీంచీ లోయలోకి దిగితే రెండు గంటల నడక, అంతే..!
         
    అందుకే బండా కొండమీంచీ లోయలోకి దిగడం మొదలు పెట్టాడు.
         
    అలా నడుస్తూ పోతూ వుంటే ప్రకృతి మాత ఒడిలోకి తప్పటడుగులు వేస్తున్నట్టనిపిస్తోంది.
         
    ఎంత అందమైన అనుభవం...
         
    అంతటి అద్భుతమైన అనుభవానికి కారణమైన ఆ హాజరు పట్టీ అయ్యవారికి మనసులోనే కృతజ్ణతలు తెలియజేసుకుంటూ అడుగులో అడుగులేసుకుంటూ జాగ్రత్తగా దిగుతున్నాడు. అలా తనలో తాను ఆలోచించుకుంటూ దిగుతున్నవాడల్లా అప్రయత్నంగా ఓసారి కిందకి చూశాడు. పైనించి చూసినప్పుడు, బొమ్మరిళ్ళ కొలువులా అద్భుతంగా కనపడ్డ ఊరు ఉన్నట్టుండి మాయమైపోయింది.
        
    కంగారుగా చేతి గడియారం చూసుకున్నాడు.
        
    తను బయలుదేరి అప్పుడే రెండు గంటలు దాటింది.
        
    అంటే తను దారి తప్పాడన్నమాట.
        
    ఒక్కసారిగా గుండెల్లో మొదలైంది గుబులు.
        
    వెంటనే వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. కానీ.., వెనక్కి తిరిగి చూస్తే వచ్చిన దారి కనిపిస్తేగా...
          
    నేలంతా పచ్చపచ్చగా పరుచుకున్న ఆకులు...పైనంతా పచ్చి పచ్చిగా విచ్చుకున్న చెట్లు... ఏది ముందో ఏది వెనకో తెలియని ఆ వాలులో తనకి మిగిలింది రెండే దారులు...ఎక్కితే పైకి..! దిగితే కిందికి..! పైకి వెళితే మళ్ళీ బండా కొండ రావచ్చు...లేదా కొండా బండ రావచ్చు...అదే కిందికి దిగితే..? హంసల కోన తప్ప మరో జనావాసం లేదు... అందుకే కిందికి దిగడానికే నిశ్చయించుకున్నాడు.
         
    అలా నాలుగడుగులు వేశాడో లేదో
         
    ఎదురుగా...  నాలుగు మూరల నల్ల నాగు.
         
    పచ్చటి ఆకుల మధ్య నల్లగా నిగ నిగలాడుతూ రెండు దోసిళ్ళ పడగ విప్పి నాలుకలు చాస్తూ బుసలు కొడుతోంది.
         
    అంతే... ఎక్కడివాడక్కడే కొయ్యబారి పోయాడు.
         
    నల్లనాగు ఎదురుపడితే.., అదైనా మిగలాలి లేదా ఎదురు పడ్డవారైనా మిగలాలి.
         
    ఈ మాట గుర్తు రాగానే కనీసం వణకడానిక్కూడా ధైర్యం చాల్లేదు.
         
    అది మాటి మాటికీ పడగని అటూ ఇటూ తిప్పుతూ తననే గమనిస్తోంది.
         
    తనిప్పుడు ఏమాత్రం బెసిగినా కాటు వెయ్యకుండా వదిలిపెట్టదు.
         
    ఒకవేళ వదిలినా తరవాత పగపట్టకుండా వదిలిపెట్టదు.
         
    నల్లనాగు పగనించీ నారాయణుడు కూడా తప్పించుకోలేడంటారు.
         
    నరసింహానికి ఎంత భయం వేసిందంటే ఆ భయంతో కనీసం దాన్నించి తప్పించుకు పారిపోదామనే ఆలోచన కూడా రాలేదు.
         
    ఆ ఆలోచన రాకపోవడమే అతని ప్రాణాలని కాపాడింది.
         
    ఒకవేళ ఆ సమయంలో ఏమాత్రం కదిలినా.., అతను తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడని భావించేది. దాంతో, అతనికా అవకాశం ఇవ్వకుండా తనే అతని మీద ఎదురుదాడికి దిగుండేది. కానీ ఎంతసేపటికీ అతని వైపునించీ ఎలాంటి అపాయకర ప్రతిచర్యా కనపడకపోవడంతో మెల్లగా పడగ దించి తనదారిన తను వెళ్ళిపోయింది.
        
    అది కనుమరుగయ్యేంతవరకూ ఊపిరిబిగబట్టి అలా చూస్తూనే ఉండిపోయాడు.
        
    దానివల్ల తనకేప్రమాదమూ లేదనే ధైర్యం చిక్కగానే తన చుట్టూ కరడు కట్టిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బలంగా వదిలాడు ఊపిరి. అంతవరకూ కొట్టుకోవడం మర్చిపోయిన గుండె ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచి దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
        
    అంతలోనే గుండె లోతుల్లోంచీ "మళ్ళీ పుట్టిన మొనగాడా ముందడుగెయ్యి." అంటూ గుసగుసలు. ఆ  గుసగుసల వెనకే, " నువ్వు శానా గొప్పోనివి పెద్దాయనా" అనే పొగడ్త.
        
    నిజంగా తనా ప్రశంసకి అర్హుడేనా ?
        
    అంతలోనే మరో పొగడ్త, "దైర్నం అంటే అట్టుండాల"
        
    అదేం ధైర్యం..? ఉత్త పిరికితనం..!
         
    "ఆగు పెద్దాయనా"
        
    ఇందాకటి గొంతే...
        
    గుండెల్లోంచీ కాదు..!
          
    ప్రకృతిలోంచీ..!!
        
    పలకరించిందెవరా అని చుట్టూ చూశాడు. 
          
    ఎవరూ కనపడలేదు.
         
    "ఆడ కాదు పెద్దాయనా ఈడ"
       
    తల పైకెత్తి చూస్తే బొమ్మకొయ్య మాను కొమ్మ మీద నిలబడి ఉలింజకాయలు కోసుకుంటున్న ఓ పన్నెండేళ్ళ అమ్మాయి కనిపించింది.
       
    చెట్టు దిగి నరసింహం దగ్గరకి వచ్చింది.
       
    "నల్ల నాగు వచ్చి పడగెత్తి వరమిచ్చినాదంటే నువ్వు సుమారుపాటి  పెద్దాయన కాదు పెద్దాయనా"
       
    "దాన్ని నువ్వు చూశావా ?"
       
    "నీకు ముందే చూసినా"
       
    "మరి నాకెందుకు చెప్పలేదు ?"
       
    "నేనుగానీ ఎచ్చరిస్తే, నువ్వు నాకెల్లా చూసేటోనివి. నువ్వు కిముక్కుమన్నా అది ఆపాట్నే అంటుకునుండేది. నల్ల నాగు గానీ ముట్టినాదంటే, నాలుగు నిమిసాలే  ?"
      
    ఆ అమ్మాయి సమయ స్ఫూర్తికి ఆశ్చర్యపోయాడు నరసింహం.
        
    "నాగుపాము ఎదురు పడితే కదలకూడదని నీకెలా తెలుసమ్మా ?"
        
    "ఐవేరు జెప్పినాడులే "
        
    "బావుంది.., అంటే నువ్వు రోజూ బడికెళ్తావన్నమాట."
        
    "లేదు బడే మా ఇంటి కాడికొస్తాది."
        
    "ఏమిటీ బడే మీ ఇంటికొస్తుందా ? గుడ్ జోక్"
        
    "ఇట్స్ నాటె జోక్ . అయాం సీరియెస్"
       
    ఒక్కసారిగా నరసింహానికి గుండాగినంత పనైంది.
         
    ఈ చీమిడి ముక్కు చింపిరి జుత్తుల పిల్ల నించీ ఇంత చక్కటి  ఇంగ్లీషా ? అనే ప్రశ్న వెనకే మరో ప్రశ్న పొడుచుకొచ్చింది. ఇలా ఇంగ్లీషులో వాగితే తప్ప మీ విద్యాధికుల గొప్పదనం జన సామాన్యానికి అర్ధం కాదనే పిచ్చి భ్రమలనించీ మీరెప్పుడు బయట పడతార్రా వెర్రి మేధావుల్లారా ?
      
    వెంటనే అతని నోరు ఠప్పున మూత పడిపోయింది.
      
    "ఏం పెద్దాయనా గొమ్మునైపోయినావు ?"
      
    "ఏం లేదమ్మా బడి మీ ఇంటికెలా వస్తుందా అని అలోచిస్తున్నాను."
      
    "బడొస్తాదంటే ఆపాట్నే బడే వచ్చేస్తాదనుకుంటే ఎట్టా ? మేం యాడుంటే ఆడికే వచ్చి బడి చెవుతాడు మా అయ్యవారు."
      
    "అంటే ట్యూషనా ?"
      
    "ట్యూషనా.. అంటే ?"
      
    "అదే, ఇంటికొచ్చి ప్రైవేట్లు చెప్పడం."
       
    "ప్రైవేట్లా ?"
       
    "అదేనమ్మా ఇంటికొచ్చి చదువు చెప్పి జీతం తీసుకోవడం."
       
    "ఏందీ సదూచెప్పిందానికి దుడ్లియ్యాల్నా ?"
      
    ఆ అమ్మాయలా ఎదురు ప్రశ్నించవచ్చని ఊహించని నరసింహం ఆశ్చర్యంగా అన్నాడు. "అంటే చదువు చెప్పినందుకు ఆయనకీ ఎంతో కొంత లాభం వుండాలి కదా..."
       
    అంతకంటె ఆశ్చర్యంగా అడిగిందా పిల్ల ,"ఏందీ సదూ చెప్పిందానికి లాభమా ? లాభం అనేది యాపారం చేస్తేగానీ రాదని చెప్పినాడే మా అయ్యవారు ? మా ఐవేరికాడ సదూ చెప్పిందానికి దుడ్లు తీసుకునే అలవాటు లేదు. నాకేంది మా అన్నకూ మా అమ్మకూ మా నాయనకూ ఎవురికి ఎంత సదూ చెప్పినా దుడ్లనే మాటే లేదు."
         
    ఈసారి నరసింహానికి ఆశ్చర్యం కలగలేదు. ఆనందం కూడా కలగలేదు. అయ్యవారి పట్ల అపారమైన గౌరవం కలిగింది. ఎవరీ అయ్యవారు ? ఎక్కడిదీ అద్భుత సేవాభావం ? ఏనాడూ వినలేదు ! ఎక్కడా కనలేదు ! నిజమే... వృత్తినే దైవంలా భావించే అంకిత భావం కలిగిన అయ్యవార్లకి చదువుకునే పిల్లలు మాత్రమే విద్యార్ధులు కారు. చదువుకోవాలనుకునే ప్రతి వ్యక్తీ విద్యార్ధే. అలాంటి అయ్యవార్లకి హాజరు పట్టీలూ సంతకాలూ పెద్ద విషయాలేం కావు. అలాంటి కర్తవ్య దీక్షా తత్పరులైన వారికి ప్రభుత్వం ఇచ్చే జీతం అనేది కేవలం జీవిక కోసం మాత్రమే.
        
    చూస్తూంటే తానొక అద్భుత వ్యక్తిని కలవబోతున్నాననిపించింది.
        
    అంతే కాదు.., ఆనాడు సరస్వతీ మాత మరచిపోయి వెళ్ళిన హంసే ఈ అయ్యవారి రూపంలో తిరుగుతోదేమో అనికూడా అనిపించింది. అలా అనిపించగానే ఆయన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆతృత కలగసాగింది.
          
    "ఏం పెద్దాయనా, దుడ్లిస్తేనే సదువా?"
        
    "అలాంటిదేం లేదు.  మీ ఇంట్లో మాత్రమేనా లేక మీ ఊళ్ళో పెద్దలందరూ కూడా చదువుకుంటారా?"
        
    "అంతా సదూతారు."
        
    "మరి మీ అయ్యవారు?" నవ్వుతూ అడిగాడు నరసింహం.
        
    "వాయన సదవకుండా మాకెట్లా సెప్తాడు?" అంటూ ఎదురు ప్రశ్నించిందా పిల్ల.
        
    మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు నరసింహం. నిజమే...అయ్యవార్లు నేర్చుకోవడం మానేసిన మరుక్షణంలోనే ఎదుగుదల ఆగి పోతుంది. ఆ మరుక్షణమే వికాసానికీ దారులు మూసుకుపోతాయి. దురదృష్టవశాత్తూ విద్యని వ్యవస్థీకరించే క్రమంలో బోధన అనేది కేవలం ఉద్యోగం స్థాయికి దిగజారిపోయింది. లేకపోతే తనకిలా బదిలీ అయ్యే పరిస్థితి వచ్చేదే కాదు.
        
    ఇద్దరూ హంసల కోనలోకి దిగుతున్నారు.
          
    దగ్గరలో జల జలమనే జలపాతం హోరు వినిపించింది. మరికొంత దూరంలో కనిపించింది జలపాతం. కొండమీంచీ బండలని సానపడుతూ జారి పడుతున్న నీళ్ళు చిన్న మడుగు కట్టాయి.
      
    ఇద్దరూ ఆ మడుగులోకి దిగి ముఖాలు కడుక్కున్నారు. దోసిట్లోకి నీళ్ళుతీసుకుని తాగబోతూ అడిగాడు నరసింహం , "నీ పేరేంటమ్మా?"
       
    "హంస"
       
    "మీ అయ్యవారు పెట్టిందేనా ఈ పేరు?"
       
    "అవునే, నీకెట్టా తెల్సు పెద్దాయనా?"
       
    "తెలీదు. ఊహించానంతే..."
       
    "మా అయ్యవారు కూడా అంతే... తెలుసుకునేదానికి ముందు ఊహించుకోమని చెప్తావుంటాడు."
       
    "అవునమ్మా... లేనిదాన్ని ఉందని ఊహించుకుంటేగానీ ఉన్నదాని గురించి తెలుసుకోలేం."
       
    "ఏం పెద్దాయనా సరింగా మా అయ్యవారి మాదిర్తోనే మాట్లాడతాండావు... నువ్వుకూడా అయ్యవారేనా ఏంది?"
          
    నరసింహం జవాబివ్వలేదు. చిరునవ్వు నవ్వాడు.
          
    ఊరు దగ్గర పడింది. పేరుకి తగ్గట్టుగానే అందంగా... అపురూపంగా... కదిలివచ్చిన కలగా... కనుల పండువగా... హంసల కోన..!
             
    ఊరి మొగదల ఎడం పక్కన కనపడిందో బావి. బావి గడ్డన ఒకాయన కాడెడ్లతో కపిల తోలుతున్నాడు. హంసనడిగి కపిల గురించిన వివరాలను తెలుసుకున్నాడు. కాడి కిందికి దిగ్గానే కపిల బాన పైకి రావడం, నీళ్ళని కాలువలోకి వదలడాన్ని ఆసక్తికరంగా చూస్తూ.., ఆమె ఆరిందాలా చెప్తూంటే తను బుద్ధిమంతుడిలా విన్నాడు.
         
    ఊరిలోకి ప్రవేశించగానే "మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హంసల కోన, ముష్టూరు పంచాయితీ, కలకడ మండలం. చిత్తూరు జిల్లా " అనే మట్టి కొట్టుకుపోయిన చెక్క పేరు పలక కనిపించింది. ఒకవైపు కొక్కెం ఊడిపోయి రెండో కొక్కానికి వేళ్ళాడుతూ.., ఆ పాడుపడిన బండల మిద్దే ఆ వూరి పాఠశాల అనే విషయాన్ని దీనంగా చాటుతోంది. ఆ బడికి ఓ తుప్పట్టిపోయిన తాళం వేళ్ళాడుతోంది. కిటికీ లోంచీ లోపలికి చూస్తే అదో పాత సామాన్ల గదిలా వుంది.
         
    ఇక్కడి బడి అవతారానికీ అయ్యవారి గురించి హంస చెబుతున్నదానికీ ఎంతమాత్రం పొసగడం లేదు. అందుకే అనుమానంగా అడిగాడు, "మీ అయ్యవారీ బడికి రారా ?"
         
    "రాడు పెద్దాయనా..."
         
    "ఎందుకు?"
         
    "అది నన్నడిగితే ఎట్లా?"
       
    ఆ ప్రశ్నకి నరసింహం దగ్గర జవాబు లేదు. అందుకే మౌనంగా ఆమెని అనుసరించాడు.
         
    ఆ బండలు పరిచిన వీధులూ.., వారగా నిలబెట్టిన ఎడ్ల బళ్ళూ.., గోడలకి చేరేసిన కాడిమాన్లూ.., ఇంటికి ముందు గదిలా పశువుల కొట్టాలూ.., కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పసరాలూ చూస్తూంటే నరసింహానికి మొదటి సారిగా ప్రాణముబికే పరిసరాల్లోకి అడుగు పెట్టినట్టనిపించింది.
         
    అంతలోనే, ఇల్లు రావడంతో లోపలికి పరిగెత్తింది హంస.
         
    అబ్బురంగా చుట్టూ చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు. ఎడం వైపు చంద్రికలూ వాటినిండా పట్టు పురుగులూ ఆపక్కనే వాటికి ఆహారంగా కోసుకొచ్చిన రేష్మి ఆకులూ ఉన్నాయి. నడవ దాటి లోపలికి వెళితే ఓపక్క వడ్ల మూటలూ వాటి పక్కనే శనగ విత్తనాల మూటలూ మరో పక్క వరసగా పేర్చిన పుస్తకాలూ కనిపించాయి. అతనలా కలియజూస్తూండగానే రాగుల దిండూ దుప్పటీ తెచ్చింది హంస. గోడవారగా వున్న బల్లమీద దుప్పటి పరిచి గోడకి రాగుల దిండు ఆన్చి నరసింహాన్ని కూర్చోమనిచెప్పి మళ్ళీ లోపలికి పరిగెత్తింది.
        
    తనలోని సహజమైన ఆసక్తితో పుస్తకాల దగ్గరకి వెళ్ళి చూశాడు నరసింహం. అన్నీ సేద్యానికీ బుద్ధి వికాసానికీ  శాస్త్ర విజ్ణానానికీ జీవన మౌల్యాలకీ సంబంధించిన పుస్తకాలే తప్ప వాటిలో పాఠ్య పుస్తకాలు లేక పోవడం గమనించాడు. అయినా పాఠాలన్నీ కూడా ఆ పుస్తకాలనించీ ఎంపిక చేసినవేగా అనుకున్నాడు. అంతలోనే, చల్ల కడవ నీళ్ళలో నిమ్మకాయ పిండి యాలక పొడి వేసి బెల్లం పానకం కలుపుకుని వచ్చింది హంస తల్లి. ఆవిడ పేరు వాణి.
        
    నరసింహం అయ్యవారిని కలవడానికి వచ్చినట్లు తెలుసుకొని చాలా సంతోషించింది.
        
    మీ అమ్మాయేం చదువుతోందంటే ఆవిడ నవ్వేస్తూ ఆ పల్లెలో చదువేగానీ దానికి తరగతుల్లేవంది.
        
    నరసింహానికి ఎందుకోగానీ వాణి కూడా హంస లాగే నర్మగర్భంగా మాట్లాడుతోందనిపించింది.
        
    అందుకే నెమ్మదిగా వివరాలడగడం ప్రారంభించాడు. ఆవిడ చెబుతున్న మాటలు వింటున్న కొద్దీ నరసింహానికి అయ్యవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కోరిక క్షణ క్షణానికీ పెరిగిపోసాగింది.
        
    ఎందుకంటేవిద్యాబోధనలో ఆయన అనుసరించే విధానాల గురించి ఆవిడ చెబుతున్న విషయాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో అంతే ఆసక్తి దాయకంగానూ ఆలోచనలు రేకెత్తించేవిగానూ ఉన్నాయి. అంతేకాదు.., ఆచరణాత్మకంగా అవి సాధించిన విజయాలు కూడా అతని కళ్ళముందే కనపడుతున్నాయి.
          
    అయ్యవారు చేసినవాటిలో అన్నిటి కంటే కష్ట సాధ్యమైనది పిల్లలకి చదువు చెప్పడం కాదు. పిల్లలు చదువుకోవలసిన అవసరం గురించి వారి తల్లిదండ్రులకి అర్ధమయ్యేలా తెలియజెయ్యడం కూడా కాదు. తమ పిల్లలు ఏం చదవాలని వారు భావిస్తున్నారో దాన్ని వారి పెద్దలు కూడా చదివేలా చెయ్యడం. అలా చదవడం ద్వారా తమకి ఎదురయ్యే సమస్యలని గుర్తించడం, ఆయా సమస్యల గురించి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ సమష్టిగా ఆలోచించడం, ఆయా సమస్యల్ని అధిగమించే ప్రయత్నంలో తమవే అయిన పరిష్కారాల్ని కనుక్కోవడం, తద్వారా తమ స్వంత విధానాలని తామే రూపొందించుకోవడం...ఇవన్నీ అంత సామాన్యమైన విషయాలు కావు.
             
    అవన్నీ అక్కడి సామాజికుల సామూహిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనాలు.
             
    ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం వున్నట్టుగానే ప్రతి పరిష్కారమూ మరిన్ని సమస్యలని సృష్టిస్తుందనే విషయాన్ని ఊరు ఊరందరికీ అర్ధం అయ్యేలా చెయ్యడం, ఆ సమస్యా పరిష్కారాన్వేషణల నిరంతర మహా యజ్ణంలో అందరూ పాలు పంచుకునేలా ప్రోత్సహించడం అద్భుతం. అందరికీ ఎవరి పరిధిలో వారు విద్యావంతులయ్యే వాతావరణాన్ని కల్పించడం అపూర్వం. ఆ చైతన్య స్ఫూర్తిని వాడనివ్వకుండా కాపాడుకుంటూ రావడం అనితర సాధ్యం. కేవలం అయిదేళ్ళ కాలంలో ఊరు ఊరంతా విద్యావంతులుగా రూపొందడం అనూహ్యం.
          
    అక్కడ...
          
    అందరూ విద్యార్ధులే..! అందరూ అయ్యవార్లే..!
          
    అక్కడ...
          
    నేర్పడం నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.
          
    అక్కడ...
             
    బడంటే కేవలం బడి మాత్రమే...
          
    నాగరీకుల చదువుల బళ్ళలోలా అది భవిష్యత్తుకి పెట్టు "బడి" కాదు.., నవ చైతన్యానికి కట్టు "బడి" అందుకే అక్కడ వైవిధ్యాలున్నాయిగానీ వైరుధ్యాల్లేవు... అదే నిజమైన వివేక వాణి.
              
    అంతటి అద్భుత విజయాన్ని సాధించిన అయ్యవారికి ప్రభుత్వం ఎంతగా ఋణపడిందంటే దాన్ని తీర్చుకోవడానికి దేశాద్యంతం ఆయన బోధనా విధానాలని అమలు పరిచేలా చర్యలు తీసుకున్నా ఋణం  తీరదు. అలాంటిది హాజరు పట్టీలో ఎక్కడో దొర్లిన చిన్న పొరపాటు కారణంగా తనో పెద్ద దొంగని పట్టుకునే మొనగాడిలా బయలుదేరి రావడం తలుచుకుంటే నరసింహానికి నవ్వొచ్చింది. అదే సమయంలో తనావిధంగా బయలుదేరి రావడం వల్లే ఇంతటి అద్భుతమైన సామాజిక ప్రయోగ శాలని చూసే అదృష్టం కలిగిందని కూడా అనిపించింది.
           
    తనని వెంటనే అయ్యవారి దగ్గరకి తీసుకువెళ్ళవలసిందిగా ఆవిడని కోరాడు. దాంతో అతన్ని వెంటబెట్టుకుని బయలుదేరింది వాణి.
           
    దారిలో ఆవూరికి బడిని రప్పించడం కోసం ఆవూరి పెద్దయన పడ్డ పాట్ల గురించి చెప్పడం మొదలు పెట్టింది, " మడిసి బతికేదానికి గాలీ నీల్లూ తిండీ తీర్తం గుడ్డా గుడుసూ ఎంత ముఖ్యమో సదువు కూడా అంతే ముఖ్యమనే మాట మా పల్లె పెద్దాయనకి బాగా తెల్సు. కానీ ఈ పల్లె కొంపలో సదూకునేదానికి వల్ల పడదనే మాట కూడా ఆయనకు బాగా తెల్సు. అంతే కాదు, మనకి లేనిది మన పిల్లకాయలకైనా చిక్కితే బాగుంటాదని అందరి మాదిరే ఆయప్ప కూడా అనుకునె. అంతలోకే, అమర నాతరెడ్డప్ప కలికిరికి అమ్మను పిలవనంపినాడనే మాట తెలిసె.
               
    ఆపాట్నే మా అంచల కోనకి బడి కావాల అంటా అర్జీ రాపిచ్చుకొని పాయె. అమ్మ చేత బెట్టె.
            
    అమ్మ పాయె..! అర్జీనూ పాయె..!!
            
    మల్లా పదైదేండ్లకు అన్న కలకడకు వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె. అన్న చేత బెట్టె.
             
    అన్న పాయె..! అర్జీనూ పాయె..!!
             
    మల్లా పదైదేండ్లకు అల్లుడు గుర్రం కొండకు వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె. అల్లుని చేతబెట్టె.
             
    అల్లుడు పాయె..! అర్జీనూ పాయె..!!
             
    మల్లా పదేండ్లకు అప్ప ముష్టూరికి వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె
             
    అప్ప పాయె..! అర్జీనూ పాయె..!!
             
    పాయె పాయె పాయె అనుకుంటా వుండంగానే ఎట్టొచ్చినాదో ఎప్పుడొచ్చినాదో తెలవదుగానీ మా పల్లెకు బడొచ్చె... "
              
    అంతలోనే ఎప్పుడొచ్చిందో గానీ హంస, " అమ్మ పోయి అన్న వచ్చె ఢాం ఢాం ఢాం ఢాం... అన్న పోయి అల్లుడొచ్చెఢాం ఢాం ఢాం ఢాం...  అల్లుడుపోయి అయ్య వచ్చెఢాం ఢాం ఢాం ఢాం... అయ్య పోయి అయ్యోరొచ్చె  ఢాం ఢాం ఢాం ఢాం... " అని పాడ్డం మొదలు పెట్టింది.
              
    ఆ పిల్లని అల్లరి చెయ్యద్దని గదిరింది వాణి.
              
    అంతలోనే అయ్యవారిల్లు వచ్చింది.
              
    ముగ్గురూ లోపలికి అడుగు పెట్టారు.
              
    అక్కడ దాదాపు తొంభై సంవత్సరాల పెద్దాయన నలుగురు పిల్లల్నేసుకుని గోలీలాడుతున్నారు. సోడా గోలీతో కొట్టగానే...ఎర్రగోలీ వేగంగా ముందుకి వెళ్ళింది. సోడా గోలీ మళ్ళీ వెనక్కి  తిరిగి వచ్చింది. స్థిరంగా ఉన్న ఎర్ర గోలీ ముందుకెళ్ళడం, సోడా గోలీ తిరిగి వెనక్కి రావడాలని కేంద్రంగా చేసుకుని చలన సూత్రాల్ని వివరించి చెబుతున్నాడు. ఆ చెప్పడంలో వాళ్ళని మరిన్ని ప్రశ్నలడగడం ఆప్రశ్నల, ద్వారా పిల్లలే జవాబుల గురించి ఆలోచించించేలా చెయ్యడం చూస్తూంటే, నరసింహానికి తను చూస్తున్నది కలో నిజమో అర్ధం కాలేదు.
            
    ఆ పెద్దాయనలోనే అంతటి ఉత్సాహాన్ని వెలిగించాడంటే, ఆ అయ్యవారు సామాన్యుడు కాదు. అలాంటి ఒక అయ్యవారు తన పరిధిలోనే ఉపాధ్యాయుడిగా పని చేస్తూండటం నిజంగా గర్వకారణం అనుకున్నాడు. తను చిత్తూరు వెళ్ళగానే ముందు, ఆ అయ్యవారిని జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి సిఫార్సు చెయ్యాలనుకున్నాడు.
           
    వాణి చెబుతూనే వుంది, "వాండ్లాడతా వుండేది తోకా తొంబై. మా పల్లెలో ఇంతే. ఆడినా సదువే. పాడినా సదువే. పనికి పోయినా సదువే. సేద్యం చేసినా సదువే."
          
    ఆమె చెబుతున్న మాటల్లో ఏమాత్రం అతిశయోక్తులు లేనని నరసింహానికి అర్ధం అవుతూనే వుంది.
             
    "అది సరేగానీ మీ అయ్యవారెక్కడమ్మా "
             
    "సంకన సట్టి పెట్టుకొని నేతి సుక్క కోసం ఊరంతా తారాడినట్టుండాది. వేరే ఐవేరు ఏడుండాడు..?ఆయనే మా పల్లె అయ్యవారు."
             
    "మరి పెద్దాయన ?"
             
    "అదీ ఆయనే"
             
    "మరిందాకా ఆయనకి చదువు రాదన్నారు..?"
             
    "రాదు... కానీ నేర్చినాడు... అర్జీలు పెట్టీ పెట్టీ అల్సిపోయినంక, మా పల్లెకి మీ బడితోగానీ మీ అయ్యవార్లతోగానీ, మీ పనికి మాలిన రాజకీయాల్తోగానీ పనిలేదనుకున్నాడు. మన మడక మనం కడతావుండాం... మన గింజలు మనమే పండించుకుంటా వుండాం... మన బిడ్డల్ని మనమే సాక్కుంటా వుండాం...  అట్లాంటిది మన బిడ్డల సదువుకోసం కన్నోళ్ళ కాళ్ళు పట్టేది దేనికనుకున్నాడు. మన దావ మనమే తారాడుకునేది మేలనుకున్నాడు. దానికే మా పెద్దాయన సదువు నేర్చినాడు... మా కోసం  సదువు నేర్చినాడు... మా పిల్లకాయల కోసం సదువు నేర్చినాడు... మా పల్లె కోసం సదువు నేర్చినాడు...ఆయనే మాకు అయ్యవారైనాడు. ఈ పొద్దు మా పల్లెలో సదువు లేని మనిసే లేడు తెల్సా?"
            
    వ్యక్తిలో ప్రారంభమైన చైతన్యం వ్యవస్థనే అబ్బుర పరచేంతగా విస్తరించిన వైనం నరసింహాన్ని చకితుణ్ణి చేస్తోంది. ఇక్కడ హంసల కోనలో వాలిన అమ్మవారి హంస గురించి ఇంతకాలంగా బయటి ప్రపంచానికి ఎందుకు తెలియలేదన్నది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే అడిగాడు నరసింహం, "అయిదేళ్ళుగా ఇంత మంది ఇన్ని అద్భుత విజయాలు సాధిస్తున్నా బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియలేదంటే..."
                 
    "తెలిసేదానికేముంది? మా అయ్యవారు ఒక్కమాట అంటే చాలు పేపరోల్లూ టీవీలోల్లూ వచ్చి పడతారు. కానీ అయ్యవారే ఇప్పుటి దంకా ఎవుర్నీ దగ్గరకి రానియ్యలా. అయ్యవారికి కావలసింది సదువు రావటం. అంతేగానీ పేరు రావటం కాదు."
                  
    "పోనీ నన్ను మీ బడిలో చేర్చుకుంటారా?"
                  
    "మీయట్లా సదూకున్నోల్లు మా బడిలో చేరే దానికి వల్ల పడదు."
                  
    "ఎందుకో?" చిరునవ్వుతో అన్నాడు.
                  
    "దేనికంటే, మీరు పట్టాలకోసం సదూతారు. పట్టాలు కొలువులిస్తాయి. కొలువులు జీతాలిస్తాయి. మనుసులను జీతగాల్లను చేస్తాయి. జీతగాల్లకి జీతాలు ఎగేసుకునేదెట్లా అనేదే గానీ మందికి మంచి చేసేది ఎట్లా అనేది సచ్చినా మతికిరాదు." వాణి మాటలు వింటుంటే నరసింహానికి తనీ జిల్లాకి బదిలీ అయి రావడానికి గల కారణం గుర్తొచ్చింది.
              
    అతనేం మాట్లాడకుండా వుండటంతో తన మాటలు వింటున్నాడో లేదో పరీక్షించాడానికా అన్నట్టు, "ఏం సామీ గొమ్మునైపోయినావు. ఈయమ్మేంది అన్నీ తెలిసిందాని మాదిరి పెద్ద పెద్ద మాటలు చెప్తావుందనా?"
                
    "కాదు. మీరు మాలా బళ్ళలో చదువుకోక పోవడం వల్లే మీకు నిజమైన చదువంటే ఏమిటో ఇంత స్పష్టంగా తెలిసిందేమో అనుకుంటున్నాను."
                 
    "దానికే మా అయ్యవారు ఏమంటాడో తెలుసునా మీయట్లా సదివినోల్లంతా మల్లా పుడితే కానీ సదువంటే ఏంటనేది తెలవదు అంటాడు."
               
    అదీ నిజమే అనిపించింది నరసింహానికి.
              
    అంతలోనే అయ్యవారు అతిధుల్ని గమనించి.., ఆటలాపి నరసింహం వైపు చూశారు.
              
    ఆ చూపులు అద్భుత చైనన్యదీప్తులై అతన్ని ఆప్యాయంగా తడుముతూ కర్తవ్య బోధచేస్తున్నట్టనిపించింది.
            
    ఎవరైనా సరే... అనుకున్న పనిని సాధించే ఏకైక మార్గం...  ఆ పనిని చెయ్యడం మాత్రమే అనే  దివ్యమైన సందేశాన్నిస్తున్నట్టనిపించింది.
            
    అందుకే..
            
    అయ్యవారు చదువనే మాటకి నిలువెత్తు భాష్యంలా లేచి నిలబడగానే...
            
    వినమ్రంగా చేతులు జోడించాడు నరసింహం.

(సాహితీ స్రవంతి సాహిత్య పత్రిక సెప్టెంబర్-అక్టోబర్ 2011 సంచికలో ప్రచురితం)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
          11 -12 -2019, బోథెల్, డబ్ల్యు.ఎ
          యూ. ఎస్. ఎ


Monday, December 9, 2019

సెటైర్ కు రిటైర్ మెంటా ! వ్యంగ్య వ్యాసం - జి. సరోజినీదేవి ( కర్లపాలెం హనుమంతరావు) సూర్య దిన పత్రిక ప్రచురితం




  పాలకులు కలాలకు కళ్ళేలు వేయచూస్తున్నారంటే.. తమ పాలనలోనే లోపాలు ఉన్నట్లు లెక్క! పెద్దల తప్పులను చమత్కారంగా ఎత్తిచూపే వ్యంగ్య రచనలకు ఈ సూత్రం చక్కగా సరిపోతుంది!ఈ అంశాన్నే విస్తారంగా చర్చించిన ఈ వ్యంగ్యల్పిక ఈ నాటి (ఆదివారం)సూర్య దినపత్రికలోనది ఈ వ్యాసం. భావస్వేచ్ఛ ప్రాధాన్యతని నొక్కి చెప్పిన ఈ వ్యాసాన్ని ఎంతో ధైర్యంగా ప్రచురించిన సూర్య దినపత్రిక సంపాదకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు.. రచయితల అందరి తరుఫునా నమస్సులు!

సెటైర్ కు రిటైర్ మెంటా!
శబ్దరత్నాకరంలాంటి ఏ పద కోశమో తిరగేసి చూడండి.. 'వెక్కిరింత' అంటే  తిట్టిపోయడం అనో బెదిరించడం అనో అర్థం కనిపిస్తుంది! అబ్బెబ్బే..  బెదిరించే పాటి బలమే ఉంటే ఈ తెరచాటు  సూటిపోటీ మాటలెందుకండీ సెటైరిస్టుకు? నేరుగా ఏ స్వతంత్ర అభ్యర్థిగానో పోటీకి దిగిపోయి ప్రచారం వంకతో  చివర్రోజు ఆఖరి క్షణం దాకా హాయిగా కడుపులో ఉన్న ఉబ్బరమంతా సుబ్బరంగా తీర్చేసుకోడా? ఈ.సి కోడా.. పాడా!  ముందు మీడియా ఫోకస్  ప్లస్ పాయింటవుతుంది కదా! 

ఎదుటి పోటీదారుడు ఏ మాజీ సి.యమ్మో.. అతగాడి ముద్దుల తనయుడో అయితేనో! అమ్మో.. కోరి కోరి ఎద్దుకొమ్ముల ముందుకెళ్లి కుమ్మించేసుకున్నట్లే గదా! ఈ పీడాకారమంతా ఎందుకనే.. అధిక శాతం చేతి జిలగాళ్లు కుండ బద్దలుకొట్టె రిస్కులకు దిగకుండా రస్కుల్లాంటి రాతల బాటపట్టేది! ఇప్పుడా సైడూ ‘నో ఎంట్రీ’ బోర్డ్ వేలాడుతోంది. అందుకే వెటకారిస్టుల ఈ గోల! 
నేరుగా పబ్లిక్ మీటింగుల్లో పాతచెప్పులు విసిరేసినా ‘పోనీలే.. పాప’మని  క్షమించేసే మన నేతలు కొందరు అదేందో మరి.. ఆ దయాగుణం మాత్రం దెప్పిపొడిచే రచయితల మీద వీసమైనా చూపించడం లేదు!  
 పిచ్చి చేష్టలను తప్పుపట్టడం వెనకాల.. ఛాన్సు వచ్చింది కదా..  కచ్చ తీర్చుకోవచ్చన్న పిచ్చి దుర్బుద్ధి ఒక్కటే ఉండదు సుమండీ! చపలచిత్తుడి బుద్ధిని శుద్ధి చేద్దామన్న మంచి  ఉద్దేశమూ కొంతమందికి కద్దు. ఒకానొక కాలంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక వెలుగు వెలిగిన   వాంఛానాథుడు రాజుగారి పాలనలోని ప్రజాపీడనకు అలిగి దున్నపోతును అడ్డం పెట్టుకుని మరీ ఓ వంద పద్యాల్లో తిట్టిపోసాడు. అన్నీ చమత్కారాలే అందులో! కుపరిపాలన సాగించే అసమర్థులను వ్యంగ్య విధానంలో దెప్పి దారికి తెచ్చే మంచి పద్ధతి మొరటు కాలమని మనం వెక్కిరించే ఆ 15వ శతాబ్దిలోనే ఉంది కదా! అన్ని విధాలా అభివృద్ధి చెందిన అతి మహా పెద్ద ప్రజాస్వామ్యంలో మనం సుపరిపాలన సాగించేస్తున్నామని ప్రపంచానికి గొప్పలు చెప్పుకుంటున్నాం కదా! అయినా.. నిరసన స్వరాలు వినిపిస్తాయన్న జంకుతో వ్యంగ్యం మీద ఇంకా ఇన్ని రుసరుసలా? పెన్నును గన్నులా వాడేవాడిని కూడా ఓపిగ్గా అర్థంచేసుకోడమే ఓపెన్ డెమోక్రసీ ఉత్తమ లక్షణం పాలకులారా! 
గాడి తప్పినవాడుగా  సెటైరిస్టుగాడిని ఊరికే ఈసడించుకోడం తగదు!  వాచాలత్వాన్నీ ఏ కవిత్వం మల్లేనో అల్లి గిట్టనివాళ్లని గిల్లడానికీ  బోలెడంత గడుసుతనం కావాలి  .   సెటిలర్సునే గుండెల్లో పొదువుకుంటామంటూ వాడవాడలా తిరిగొచ్చే దొరలు..   సెటైరిస్టుల్నీ ఆ కౌగిట్లోనే ప్రేమగా పొదువుకోవచ్చుగదా! రాసే రాసే కలాలని వాలంటరీ రిటైర్మెంటు తీసుకొమ్మనడం ధర్మమా? బాంచెన్.. మీ కల్మొక్తా .. జర చెప్పుండ్రి సార్లూ!  
 పిల్లులు గోడల మీదా, ఎలుకలు గాదెల కిందా చేరి రాజకీయాల పేరున  రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. ఆ విరక్తితోనే కదా  ఆ  పిల్లి మీదా, ఈ  ఎలుక మీదా  పెట్టి అన్యాపదేశంగా పెద్దయ్యల అన్యాయాల మీద దండెత్తేది!డైరెక్టు ఎటాకర్సుతోనేమో ఏదోలా చీకట్లో మాటలు కలిపేసుకోవచ్చు.. వీలును బట్టి తమలో కలిపేసుకోవచ్చునేం! ఇన్ డైరెక్టు భాషలో ఏదో గుసగుసలు పోయే  వెటకారిస్టుల మీదనేనా  ఈ గుడ్లురమడాలూ! 
సెటైరిస్టుల స్క్రిప్టుల  సాయం లేకుండా ఏ పొలిటీషియన్ స్టేజ్ మీద ఎట్రాక్టివ్ ఉపన్యాసాలివ్వగలడో తేల్చండి! కామెడీ రాతగాళ్లు కేవలం మందు పార్టీలల్లో వినోదాల విందుల వరకేనా పరిమితం? 
ఎంత కసి ఉంటే  ఆ జోనాథన్ స్విఫ్టంతటి సెటైరిస్టు గలివర్ని అడ్డుపెట్టుకొని మరీ తన కాలం నాటి   పాలకులకు గడ్డిపెట్టాడు! బతుకు తెరువు కోసమే కదా మహానుభావులారా ఎప్పట్లా పిట్టల్ని కొట్టిందా నిషాదుడు రామాయణ కాలంలో! అయినా ఆనాడు  వాల్మీకంతటి మహర్షికే అంత లావు కోపం తన్నుకొచ్చేసిందే! అంత ఉక్రోషంలో కూడా ఆయన నిషాదుడి  మీద చెయ్యెత్తింది లేదు.  ప్రపంచం పూజించే ఉత్కృష్ట కావ్యం చెప్పవతల గిరాటేశాడు! వాల్మీకిని అసలు కలమే పట్టవద్దని   ఏ శ్రీరామచంద్రుడో వారించుంటే? లోకం గర్వించే రామాయణం అసలు రూపుదిద్దుకొనేదేనా? రాసే కలాలకి  అందుకే  పాలకులు పూర్తి స్వేచ్ఛనివ్వాలి.  సజావుగా జనాలను పాలించడం రాక  నేతలు సెటైరిస్టుల మీద పడితే ఎట్లా? 
చేతి ఉంగరం పోయిందని చెరువు మీద, రాసుకునే వేళకు పత్రాలందించలేదని  తాటిచెట్టు మీద.. అలిగి తిట్లపురాణాలకు దిగిన బండకవులకేమో తమరు గండపెండేరాలూ, పూల దండలతో సత్కారాలూ?! చెరువు పూడికలు తీయించాలని, చెట్లు ఏపుగా పెంచి ట్రీ గార్డులు పెట్టించాలని..  ఏదో వంకన జనం సొమ్మును మూటకట్టి    చంకనేసుకుపోయే వంకరబుద్ధి ఆషాఢభూతులను వెటకరించినందుకేమో వెంటాడి వెంటాడి వేధించడాలా? 
చెడ్డకు ఎదురొడ్డి నేరుగా గోదాలో కలబడే గుండె నిబ్బరం  అందరికీ ఉంటుందా? ఆ  సత్తా లేనప్పుడే కదా  పిల్లి మీదా ఎలుక మీదా పెట్టి జబ్బసత్తువ కొద్దీ దెప్పిపొడవడాలూ!    
ఎదుటి శాల్తీ పిచ్చి చేష్టలను నేరుగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడే దెప్పిపొడుపు భాషను పుట్టుకొచ్చేది! బైటికి కనిపించే పదాన్ని పట్టుకొచ్చి.. లోపల గూఢార్థం చొప్పించి దెప్పడంలో ఎంత గడుసుతనం కావాలో! ఆ లోపలి అర్థాలకే లోపాలున్న శ్రీరంగనీతి జాతికి ఉలుకుపాటు. నవ్వించే విధంగా ఉంటుంది కాబట్టి నలుగురి ముందూ తానూ నవ్వక తప్పదు. కానీ ‘బిడ్డా! నా టైము రానీ.. అడ్డంగా నరుకుతా!’ అని పాలకులు హూంకరించడమే ప్రజాస్వామ్యానికి పెద్దహాని. 
పాలకులే కానక్కర్లేదు .. పలు సందర్భాలలో సమాజమే తన మూర్ఖత్వం వల్ల దెప్పులపాలవడం కద్దు.  వీరేశలింగం వంటి పెద్దలు ఇదిగో ఈఎత్తిపొడుపు  దారినే పోయి సమాజానికింత సోయి తెప్పించే ప్రయత్నం చేసింది. సంఘాన్ని గమ్మత్తుగా మరమ్మత్తు చేసేందుకు సెటైర్ ను మించిన  ఆయుధం లేదని గురజాడగారికీ గట్టి నమ్మకం.  కాబట్టే  కన్యాశుల్కం నాటకం వంకన నాటి సొసైటీ తాట తీసారు.  చిలకమర్తి  గణపతి, మొక్కపాటి పార్వతీశం,  పానుగంటి జంఘాలశాస్త్రి..  మనిషిలోని, సంఘంలోని వంకరబుద్ధుల్ని, వెంగళాయితానాన్ని, అమాయకత్వాన్ని, అహంభావాన్నీ ‘ఇహ నా వల్ల కాదురా బాబూ!’ అన్నంత గొప్పగా కడుపుబ్బా నవ్విస్తూనే కడిగవతల పారేసారు సారులూ! చమత్కారం,  వెక్కిరింతల వంటి జోడు గుర్రాలను పూన్చి వ్యంగ్యరథాన్ని పిచ్చి కలుపు మొక్కలు పెరిగిన  వ్యవస్థల మీదుగా  లాగుతుండబట్టే  నలుగురూ నడిచే బాట ఈ మాత్రమైనా చదునుగా ఉండింది!  నేరుగా పడే గంటె వాతల  కంటే కొంటెపూలు కట్టిన కుచ్చుల జడతో కొట్టే దెబ్బల్లోనే  మజా ఉంటుంది!    'జమీందారు రోల్సు కారు, మహారాజు మనీపర్శు..  మాయంటావా? అంతా/ మిథ్యంటావా?' అంటూ ముద్దుల వేదాంతిని సైతం వదలకుండా తలంటుపోసాడా మహానుభావుడు శ్రీ శ్రీ! అంత మాత్రానికే జాతికి ఆసారాం బాపూలు, నీరవ్ మోదీల వంటి పీడలు వదులుతాయనా?  సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి  ఇవ్వరని ఆడంగుల మీదా, రాజకీయ నేతల హంగు ఆర్భాటాల మీదా చలం ఇలాగే చిందులేసాడు ముందు. ఆఖరికి ఆ అరుణాచలం యోగీ  శ్రీ శ్రీ తరహా ఎకసెక్కాలని ఎరక్కపోవడం క్షమించరాని నేరమని బాహాటంగానే ఒప్పుకున్నాడు!  అదీ వ్యంగ్యం తాలూకూ హంగూ ఆర్భాటం.  ఇప్పటి నేతలకే మరి ఎందుకో వ్యంగ్యమంటే అంత ఖంగూ.. కంగారూ!
వేరే చేసేదేం లేకపోయినా దారే పోయే దానయ్యనైనా తన దాకా రప్పించుకుని కాసేపు నవ్వించే గారడీ కాదు స్వాములూ  వ్యంగ్యమంటే! చేత్తో చూపించిన టెంకెను కళ్ల ముందే భూమిలో పాతి.. లోటాడు నీళ్లైనా పోయాకుండానే ఒక్క నిమిషంలో  మొలిచిన చెట్టు నుంచి  దోర మాగిన మామిడి పండంటూ  ముక్కలుగా కోసి ఉప్పూ కారాలద్ది నాలిక్కి రుద్ధి ‘ఆహాఁ.. ఏమి రుచిరా!’ అని మైమరపించే అతితెలివి  నేటి  నేతాగణాలది. మతులు పోగొట్టే ఆ విద్యలన్నింటి వెనకాల ఉన్న  అసలు టక్కు టామారలన్నింటినీ నవ్విస్తున్నట్లే నవ్విస్తూ విప్పిచెప్పే సత్తా ఉండేది ఒక్క సెటైర్ రైటరుకే! లోకం కళ్లు నాజూగ్గా తెరిపించేది ఒక్క   సెటైరిస్టే.  తమ   గుట్టు రట్టవుతుందన్న కంటు పెట్టుకుని నవ్వించే కలాల  మీద నిర్భంధం విధించే కన్నా ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాలేవీ వమ్ముకాకుండా విధులు సక్రమంగా నిర్వర్తిస్తామంటే ప్రజాప్రతినిధులను అడ్డుకునేదెవరు? చెయ్యాల్సిన ప్రజాసేవలు మాని తమను అభాసు పాల్చేస్తున్నారని సెటైరిస్టులను రిటైరైపొమ్మనడమే అన్యాయం! ఎత్తిపొడుపులతో సెటైరిస్టులు ఎత్తిచూపే  లోపాలను కాస్తింత అవగాహన చేసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేసేస్తే సరి.. సర్వే జనా హాపీ! చేతిలో కత్తి ఉంది కదా అని.. పూలగుత్తి కుత్తిక కత్తిరించేస్తామంటేనే ఇబ్బంది? తుగ్లక్ పాలకులున్నంత కాలమూ  గజ్జెల మల్లారెడ్డి  జజ్జనక జనారేలు గజ్జెకట్టి పాడుతూనే ఉంటాయి సుమా! 
కారుణ్యకవి జాషువా ’వర్ణమునకన్న పిశాచము భారతంబునన్/ కనుపడలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ దెప్పిపొడుపు వెనకాల ఎంత గుండెనొప్పి ఉందో మతికి తెచ్చుకోవాలి  ముందు మంచి మంచిపాలకులనేవాడు! 'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు మూఢంగా ఎందుకు  నమ్ముతున్నాడో సంఘం ముందుగా స్వీయవిమర్శ చేసుకోవాలి. ‘మును సుముహూర్తము’ నిశ్చయించినా సతి ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలు కొట్టినందుకు వేమన బుర్ర బద్దలు కొట్టకుండా అతి మత విశ్వాసులే  ముందు తన బుర్రబద్దలు కొట్టుకొనయినా మూఢవిశ్వాసాల ఊబి  నుండి బైటపడాలి. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి మార్క్సు కావాలా?నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే నేరస్తుడు  లేడు' పొమ్మన్నాడు గుంటూరు శేషేంద్ర శర్మ. అధర్మం, అన్యాయం, దోపిడీ, మూఢత్వం, అజ్ఞానం, దౌర్జన్యం, అవినీతి, అమానుషాల వంటి దురాచారాలు, బలహీనతలు, నైచ్యాల మీద  ఎక్కుపెట్టిన రాంబాణం దొరా వ్యంగ్య రచయిత చేతిలోని లేఖిని అనే  బ్రహ్మాస్త్రం. అవసరాన్ని బట్టి అది రావణసంహారానికి ఎదురొడ్డి నిలబడ్డట్లే.. సందర్భాన్ని బట్టి చెట్టు చాటు నుంచైనా వాలి వంటి అపరాధిని వధిస్తుంది. మొట్టితే తప్ప ఖలుడే కాదు దేవుడూ దారికి రాడని నమ్మకం నుంచి పుట్టింది బాబులూ ఈ సెటైర్!  సున్నితంగా, సుతారంగా హాస్యంతో కలగలిపి వడ్డించి మరీ మెక్కేవాడికైనా భుక్తాయాసం తెలీనంత గమ్మత్తు వ్యంగ్యంలో ఉంది.  బలవంత పెట్టినా రిటైర్  అయ్యేది కాదు సెటైర్!    పాలకులు దారికి వచ్చే వరకు చాటుమాటుగానైనా సరే సెటైరిస్టుల యుద్ధానికి రెస్టంటూఉండదు!
- కర్లపాలెం హనుమంతరావు '

( సూర్య దిన పత్రిక ప్రచురితం ) 

Sunday, December 8, 2019

చెత్త చట్టాలు! -కర్లపాలెం హనుమంతరావు సూర్య దినపత్రిక వ్యంగ్య వ్యాసం




ఇజ్రాయిల్లో పుచ్చకాయలు బహిష్కరించారు ఒకానొకప్పట్లో. అయినా ఏ నిందలపాలూ కాలేదు అక్కడి ప్రభుత్వాలు అప్పట్లో. అదే మన ఇండియాలో అయితేనో? పాలుపోసే సాంబయ్య చెంబులో  నాలుగు చుక్కల నీళ్లెక్కువ కలిపినా  పాలకులదే ఆ పాపభారమంతా! ఇండిగో విమానం ‘ఫర్ సేల్‘కని వచ్చినప్పుడు చూసాం గదా ఇండియాలో హోరెత్తిన  కనీ వినీ ఎరుగని ఆ  గోలంతా!
నార్త్ కొరియాలో ‘నో మెక్డొనాల్డ్’ అన్నారింకోసారి.  నారికేళాలతో సరిపుచ్చుకున్నారే తప్పించి నోరెత్తి.. ‘ఆయ్ఁ! ఇదేం పిచ్చి పని’ అని  ఒక్క బక్కజీవైనా గద్దించిన పాపాన పోలేదు సర్కార్లని. అదే ఇక్కడయితేనా? ఖాళీ మందు గళాసులతో నడిరోడ్ల మీద కొచ్చిపడి చేసే గలాటా అంతా  ఇంతానా! పాక్షిక మద్యపానమైనా సరే.. సంపూర్ణంగా నిషేధించిందాకా  బీహార్ నితీష్ బాబును  నిద్రపోనిచ్చారా దేశీయ దేవదాసు ఔరసులు!  
మరీ అంత చుక్క మీద మనసు చావకపోతే ఇంచక్కా  ఐర్లాండు పోతే సరి అయిన ఓ పెద్దాయన సలహా ఉపరి! అక్కడయితే ఏ పరీక్ష రాసే నెపంతోనో హాల్లో చేరగిలబడి బల్ల మీదో కత్తి గుచ్చేస్తే ఫినిఫ్! ఫ్రీగా పీకల్దాకా ఎన్ని పింటులైనా తాగేసేయచ్చంట! విద్యార్థులు టెస్టులు గట్రా రాసేటప్పుడు నోట్లో గొట్టం పెట్టే టైపు ఆల్కహాల్ టెస్టింగులు చట్టవిరుద్ధంటండీ అక్కడ!
అంత కన్నా పిచ్చి రూలుందంట ఓరేగావ్ అని ఓ మరో చోట కొన్ని ఉద్ధరింపుళ్ళల్లో! ఎంత వరకు నిజమో.. అబద్ధమో నికరంగా తెలీదు కానీ.. అచ్చోట బళ్లల్లో ఆడపిల్లలు అచ్చోసిన లేగదూడలకు మల్లే జుట్టూ జుట్టూ పట్టేసుకొని కొట్టేసుకోడం గొప్ప నేరం. ఆ తరహా జుట్టు చట్టం మన దగ్గర సర్దాకైనా ఊహించుకు చూడండి! టీవీ చర్చల్లో ఒక్క పురుగైనా కనిపిస్తుందా? చట్టసభల   పోటీకి  ఒక్క శాల్తీ  అయినా సిద్ధపడుతుందా?
మిన్నెసోటా అనే మరో చోట మగాళ్లు గడ్డాలు గీక్కుంటే నేరంట.. మరీ విడ్డూరం కదా!  నెబ్రాస్కా అనే ఇంకో వింత ప్రాంతంలో  పబ్లిక్ షేవింగులకు చట్టం ఒప్పుకోదు. మన దగ్గర బాహాటంగా తలలు తెగతరుక్కుంటున్నా రక్షకదళాలు ఆ తరహా సిల్లీ గలాటాల జోలికి పోవు.. నరికే శాల్తీ ఏ పెద్దమనిషి తాలూకూ సరుకు కాదని తేలే వరకు!  
థాయ్ లాండులో అండర్ వేర్ లేకుండా అపార్టుమెంటు గ్రౌండులో కూడా కనిపించకూడదంటండీ!  ఇండియాలో మాదిరి బండచట్టాలేం పచేస్తాయ్? బంజారా, బూబ్లీ, ఫిల్మ్ నగర్ పరిధులయినా సరే.. నో ప్రాబ్లం! ఎంత జాలీగా బజార్లల్లో పడి బడితె మార్క్ ప్రొటెస్టులు చేసుకుంటే అంత పాప్యులారిటీ ప్లస్సవుతుంది! పది హిట్ మూవీలల్లో తన్నుకులాడి చచ్చినా  పట్టించుకోని జనాలు ఒక్క పావుగంట వైరల్ వీడియోతో  నీరాజనాలు పట్టేస్తారు!
ఇండియన్ పీపుల్ ఎంతో  లక్కీ అండీ ఇక్కడ!  ఇంటావిడ కారూ గట్రాలు బైటికి తీసి షికారుకని బైలుదేరితే ఎర్ర పీలికోటి చేతపట్టి మొగుడనేవాడు ముందు నడవాలి ఊటాలో! గాడి ఏ మాత్రం గాడి తప్పినా  ఆమగాడి బతుకు తెల్లార్లూ కటకటాల్లో !
మిన్నెసోటాలో మరీ సోద్దెం బాబూ! వంటి మీదొక్క నూలు పోగైనా లేకుండా కంటి మీదకు కునుకు రాకూడదు. కాదంటే తెల్లారి లేచేసరికల్లా పళ్లు తోముకొనేది సరాసరి జైలు ఊచలకు అవతాలే!  
న్నట్లు రోజులో రెండోసారి పళ్లుతోమేందుకు ట్రై చేస్తే  పొలోమంటూ పోలీసోళ్ళొచ్చి పట్టుకుపోడం  రష్యాలో రూలుట! హాస్యం కాదు సుమా! ఇదాహో అని మరో వింత ప్రాంతం! ఇదీ  ఎంత వరకు నిజమో తెసిసేడవదు కానీ.. ఇక్కడ తలకు తుండు  చుట్టుకుని బాహాటంగా  కనపిస్తే మరుక్షణమే ఆ శాల్తీకి  శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు! మరదే  మన దేశంలోనో? తుండు తుపాకీ గుండు కన్నా  పవర్ఫుల్! మన నేతాశ్రీలేసే వేషాలేన్నీ చూస్తున్నాంగా! గుండు మీద తుండు, మెళ్లో ఓ  ఎర్రటి  తువ్వాలూ ఉంటే సరి తుక్కుజనాల కష్టసుఖాలల్లో పాలుపంచుకుంటున్నట్లే కదా! తిక్క లెక్క!
ఇటలీది ఇంకా ఇరగబాటుతనమండీ బాబూ! జుట్టుకు రంగేసుకోడం.. విరగబోసుకు తిరిగేయడం  అక్కడ మహా విశృంఖల పాతకం!   ఇక్కడో? నోట్లో పళ్లన్నీ రాలిన పండుకోతి తాతయినా ఓకే! తలకో బెత్తెడు మందాన నల్లరంగు బెత్తి ‘తా తై.. థక్ దిమ్.. తా తై థక్ ధిమ్’ అంటూ రిథమిక్కా  ఓ రెండు వీణ స్టెప్పులేస్తే సరి!   అభిమాన సందోహాల ఆనంద పారవశ్యాలతో వెండితెరలన్నీ చిరిగిపోవాలి! నెత్తి మీద ఏ రంగూ పడనందుకే   కదండీ.. పాపం అంత లావు  సీనియర్సయి ఉండీ ‘అద్వానీజీ  అండ్ కో’ మాజీ మహానేతల గుంపులో కలిసిపోయిందీ!
అంగోలాలో మరో రకం గోల! ఆడజీవిగా పుట్టడం శాపం అక్కడ. అడపా దడపా అయినా సరే జీన్స్ డ్రస్సులేసుకోడం పాపం! మరి మన దగ్గర? నయీం లాంటి బడాచోర్లూ, వంచకులక్కూడా చోళీ.. లంగాలే తప్పించుకొనే షార్ట్ కట్ రూట్లు. ఆడవేషంలో అతగాడేసిన హిజ్రా వేషాలకు పక్క పాకిస్తానులో అయితేనా.. మడిచి పొయ్యిలో పెట్టెయ్యరూ!
ఫ్లోరిడాలో కోడిపిల్లలు రక్షణకేటగిరీకి చెందిన జీవాలుట. తినే బొచ్చెలో వాటి బొచ్చింత కనిపించినా చచ్చినట్లు..  తతిమ్మా భోజనమంతా బొక్కలోకెళ్లిన తరువాతే బొక్కాల్సింది! 
చీకట్లో ‘మ్యావ్’ మన్నా కొలొరాడో పిల్లుల  ఖర్మ కాలిందన్నమాటే! పర్మినెంటుగా వాటి తోకలు కటింగ్ చెయ్యాలన్నది అక్కడి గవర్నమెంట్ ఫిటింగ్! అదే ఇండియన్ పిల్లులయితేనో? గోడల మీద చేరడం తరువాయి.. దిగేటంత వరకూ వాటికి అలకపాన్పు మీది  అల్లుడి వైభోగాలే కదా రాజకీయ పార్టీలల్లో!
ఇండోనీషియాలో, ఐస్ బెర్గ్ లో కుక్కల్ని వేటాడ్డం, పెంచడం శిక్షార్హమైన నేరంరా నాయనా! మన దగ్గర  అందుకు పూర్తిగా విరుద్ధం.  ఆవేశకావేశాల్లో ఏదో  కుక్కల  మీద  కాస్తింత మొరిగినా.. ఎన్నికలొచ్చినప్పుడు  మాత్రం ప్రధానంతటి పై  స్థాయి పెద్దమనిషీ  దేశానిక్కావలి కాసే కాంపిటీషన్లో బుల్ డాగ్స్ తో సైతం ‘సైరా’ అనేందుకు సిద్ధం!
నార్త్ కరోలినాలో రక్తసంబంధీకలు అయినా సరే ‘విత్ ఇన్ లా’ లో ఉంటే  ఏ ‘సన్-ఇన్-లా’ నో,,, ‘డాటర్-ఇన్‌-లా’ నో అయుపోవచ్చు.  సొసైటీకే మాత్రం నో అబ్జెక్షన్! 'ఛీఁ పాడూఁ' అంటూ తమరలా ఫేస్ పెట్టేయకండి సారూ! గెలిపించిన పార్టీకే ‘ఛీఁ’ కొట్టేసి మళ్లీ  మరో పార్టీ జెండా పట్టుకొనొచ్చినా ‘ఛీఁర్స్’ అంటూ మరి ఆ నేతగాడిగేగా తమరూ ఓటేసి మరీ గట్టెక్కించేసేదీ! 
కంప్యూటర్లో  సవాలక్ష ప్రశ్నలడుక్కోండి! ఏ మాత్రం ఉడుక్కోదు ఫ్లోరిడాలో ‘సిరి’! ఏదో ఫ్లోలో ఎవరైనా అన్నారేమో తెలీదు కానీ.. హాస్యానికైనా ’ఫలానా శవం ఏ గదిలో దాగుందమ్మీ?’ లాంటి దగుల్భాజీ సమాచారం దాన్నుంచీ రాబట్టాలని చూసావవనుకో!  ఆనక  తీరిగ్గా  తమరే విచారించాలి తతిమ్మా జీవితమంతా కటకటాల వెనకాతల చేరి!  ఆ ‘సిరి’ సంగతి  ఓకే! మరి మన దగ్గర్నో?  నడి బజార్న ఆడబిడ్డను  ఏ మదమెక్కిన కుంకలో చిత్రహింసలు పెట్టినా ఎన్ కౌంటర్లకు ఎన్నో ఆటంకాలు!
---
 “అబ్బబ్బ! ఆపవయ్యా సామీ!  పది నిమిషాల బట్టి ఒహటే సోది! అసలే అవతల పురపాలక ఎన్నికలతో పుంజెం పుంజెంగా ఉంటేనూ! వేళాకోళాలకు లేదా వేళాపాళా? మరీ అంతలా గిల్లాలని చెయ్యి సలపరంగా ఉంటే  మన  దగ్గరే  చచ్చుబండ చట్టాలు సవాలక్ష ఏడుస్తున్నాయ్ ఏళ్ల తరబడి! కలేజా ఉంటే వాటి మీదయ్యా ముందు నీ కత్తి ఝుళిపించాలి! ఎక్కడివో న్యూ జెర్శీ కహానీలు ఇక్కడ మనకెందుకు చెప్పు? చెప్పులు నేరుగా ముఖం మీద పడుతుంటేనే దులపరించుకునే దున్నపోతులు కదా మన నేతలు! అన్యాపదేశాలు, ధర్మోపదేశాలు చెప్పి నువ్వేదో ఉద్ధరించబోతే.. ముందు అన్యాయమైపోయ్యేది నువ్వే బాబూ! నెట్టింట్లో టైం పాసు వరకే సుమా నువ్వు చెప్పుకొచ్చే ఈ సరదా చట్టాలన్నీ! ఆ పక్కనే ఓ మూల పడున్నదా బుల్లి దేశం జపాన్! అక్కడ ఈడొచ్చిన ఆడబిడ్డలు తొమ్మిది సార్లకు మించి డేటింగులకు ‘నో’  అనరాదు, అంటే డేంజర్! మొగుడుగారు రాలగొట్టిన పళ్లైనా సరే మళ్లీ కట్టించుకోడానికి ఆ  మొగాడి  పర్మిషనే తప్పనిసరి ‘పెర్మెంటో’లో!  ఆర్కాన్సానో మరేదో దిక్కుమాలిన దేశమో.. అక్కడా మొగుళ్లు పెళ్లాలను చిత్తమొచ్చినంత సేపు  చితక్కొట్టుకోవచ్చునంట పేంబెత్తంతో. బట్ ఆ  కోటింగు గాని నెలకోటి దాటిందా.. ముందా   మొగుడుగారి పనే శ్రీమద్రమారమణ గోవిందో హరి! ఒక్క సెకనుకు మించి సొళ్లు కారుస్తూ ముద్దులాడేస్తే పోలీసోళ్ల చట్టం ప్రకారం నేరం మైనే అనే ఓ మినీ దేశంలో.  పెళ్లాం పుట్టిన రోజును మొగుడు మర్చిపోతే  నమోనా దేశంలో అదో క్షమించరాని నేరం.    ఇట్లాంటి చెత్తనా నెట్లోంచి పోగేసుకొచ్చి నువ్వు మన మీద దెబ్బలాటకొచ్చేసేదీ!  మన దగ్గర ఆడజీవులకేమన్నా మా లావు స్వేచ్చా స్వాత్రంత్ర్యాలు కొల్లపోతున్నాయా నాయనా? ఈడూ పాడూ చుసుకోకుండా గుళ్లూ గోపురాల వైపుక్కూడా రావద్దని పెద్దాళ్లయి కూడా  గద్దిస్తున్నారే బుద్ధిమంతులు కొందరు!  ఆడకూతురిని పాడుచేసే త్రాష్టుడు  గానీ ఈడేరకపోయుంటే ఏ శిక్షకు అర్హులు కాదనేస్తున్నారే! రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల మీద ఎవళ్ల నిఘాలు  పెద్దమనుషులు ఎందుకు వద్దంటున్నారో.. ముందు అర్థం చేసుకో మొద్దు రాచిప్ప మొహమా! సాగు  పేరు చెనితే  ఎంత దొంగాదాయాన్నైనా  సర్కార్లకే లెక్కా డొక్కా చెప్పకుండా ఇంచక్కా దాచేసుకొనే  దౌర్భాగ్య దేశమయ్యా బాబూ.. నువ్వూ నేనూ పుట్టి బతుకు జీవుడా అంటూ రోజులు ఈడుస్తున్నది!  ఓనామాలు ఆనమాలు పట్టనోడైనా ఎన్నికలొచ్చినప్పుడు గెలిచిపోగలితే  ఏకంగా చట్టసభలకెళ్ళి పోయి చాపచుట్ట పరిచేసుకోవచ్చు.  సర్కారు కొలువులు దొరకబుచ్చుకునే దొరల పై   ఏ దొంగ తిళ్ల కేసులూ చివరి వరకు నడిచిన దాఖలాలు నువు చూసావా ఈ దేశంలో? బక్కోళ్లక్కూడా అక్షరం ముక్క ఉచితంగా అందాలన్న విద్యాహక్కు చట్టం ఏ చెట్టెక్కిందో ఎవరికీ తెలీదు! సర్కారు దఫ్తర్ల దస్త్రాల వివరాలు అడిగిందే తడవుగా ఎవడికీ దొరికిచావడంలేదు!  జల్లికట్టో, కోడి పందెమో.. మూగజీవాలు మన పైశాచికానందాల పాలబడి  రక్తాలోడడం ఏ చట్టమూ అడ్డడంలేదు. ట్రిపుల్ తలాకులూ, అయోధ్య రామయ్య గుళ్ల చుట్టూతా ప్రదక్షిణాలు చేసేటందుకే మన చట్టాలకు ఎక్కడి టైమూ చాలడంలేదు. తప్ప తాగిస్తే.. దగ్గరుండి పేకాటలాడిస్తే తప్ప ఎన్నికల్లో ఓటు రాలే పరిస్థుతుల్లేవు. పైసా చేత లేకపోయినా  ప్రజానీకం తరుఫున  ప్రాపర్ గా చట్టసభలకెళ్లి  కూర్చుని పనిచేయగలడా నూటపాతిక్కోట్లలోని ఏ ఒక్క పాపర్ గాడైనా ఈ దేశంలో? నోటికి   తిరగని పేర్లుండే చిట్టి పొట్టి దేశాలు. ఏది సత్యం..ఏదసత్యమో.. నిర్ధారణకేదీ నిలబడలేని కాకమ్మ కబుర్లు!  వాటి చెత్తచట్టాల వంకతో ఇట్లా మనలో  కాక పుట్టించడాలెందుకు? అసలు సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించి సొంత పబ్బం గడుపుకొన చూసే  మీ లాంటి కుంకలకు పడాలిరా ఢింబకా ముందు వందేళ్ల  ద్వీపాంతర కఠిన కారాగారవాస శిక్ష! అదే మన దేశ ప్రజాస్వానికి అసలైన శ్రీరామ రక్ష!
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపదాకీయ పుటలో ప్రచురితం)  
***.


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...