Friday, January 24, 2020

కవిత్వ సమీక్ష రెండు కవితలు- ఒక సామ్యత; ఒక విభిన్నత -కర్లపాలెం హనుమంతరావు




కైలాస గంగ
-"సంపత్"

కృతయుగం
ఇది ఏమి పొగలుమిసి సెగలెగసి భువికవతరించినది కైలాసగంగ?
 కలియుగం
-కాదు యుగయుగ హృదయశోణిత తరంగ-
 కృత
శివజటాజూటాగ్ర గళిత హిమమణిమిళిత శీకరకిరీట కాదా?
నటరాజభుజగ కంఠాభరణ మణికిరణ చుంబితలలాట కాదా?
 కలి
నర కబంధ ప్రేతములమీద పరదెంచు పెను కాలభూతమేమో!
ప్రేతముల మానసగీతములవలె కదలు రక్తజలపాతమేమో!
 కృత
కైలాసశైల మూర్ధాభిషిక్తతుషార చూడాకలాప కాదా?
కలకలస్వనసలిల ఋక్చంద స్వచ్చంద వేదసంలాప కాదా?
కలి
మృత్యుగళసీమావిలంబివిలయకృశాను తోరణశ్రేణియేమో!
నరకభీకరతమోఘూర్ణితభయద వైతరణివేణియేమో!
కృత
రజతగిరి గైరికా సంవక్త పృథులతర మిహికానితంబ కాదా?
ఈత్రిలోకాభినందితమైన మిన్నేరు అఖిలజగదంబ కాదా!
 కలి
బలినుండి నరమేధములనిండి మిన్నెగయ హోమాగ్ని ధూమమేమో!
భువినుండి దివికి నాల్కలు సాచి కబళించు నాప్రళయకామమేమో!
కృత
ఇది ఏమి పొగలుమిసి సెగలెగసి భువికవతరించినది కైలాసగంగ?
 కలి
-కాదు యుగయుగ హృదయశోణిత తరంగ-
***


ప్రాబ్లెమ్ ఆఫ్ లైఫ్
-"శంపాలత"

ఇబ్బందులకు ఇంటూమార్కులు పెట్టుకుంటూ
స్వేచ్చను స్కేర్ బ్రాకెట్సులో బంధిస్తూ
చిక్కుసమస్యలనూ చిద్విలాసాలనూ
ప్లస్ మైనస్ లతో సూచిస్తూ
జీవన సమీకరణం చివరికి
'జీరో' కే సమానమవుతుంది!

బతుకు బాటలో మనస్సు పెంచుకున్న 'ఏక్స్లలరేషను'
వెతలగతుకుల్లో రిటార్డేషనుగా మారి
జీవనశకటం వెనక్కే పోతుంది
గుండెలో శాంతి-శాతంలో సహస్రాంశంగా
నెగ్లిజిబుల్ అవుతోంది!

ప్రసరించిన ఆశాకిరణం ఎదురుదెబ్బలు తిని తిని
ప్రతిబింబంలోనే పరావర్తనం చెందుతోంది
స్వార్థం గ్రావిటేషను ఫోర్సుతో దురాశలవైపు ఆకర్షింపబడి
నిరాశతో నిట్టూర్పులే విడుస్తోంది!

ఎగిరి-ఉన్నత శిఖరాలందుకోవాలన్న ఆశయాల రోదసినౌక
నెగటివ్ వెలాసిటీతో సగంలోనే
నేల రాలిపోతున్నది!
'స్క్వేర్ రూట్'లో ఒదిగిఉన్న స్వప్నం
చివరి విలువలు గమనించలేకపోతున్నది!

లంబకోణంలా నిటారుగా నుంచోవాలన్న వాంచ
పరతంత్రతలో చిక్కుకొని
'అబ్ ట్యూన్'లా వంగి వాలిపోతున్నది!

నేలిడి ఉహించటానికి లేకుండా జీవిత పరిభ్రమణంలో
సాలిడ్ యాంగిల్ లా మారిపోతున్నది!

హోల్ క్యూబ్ లో ఉన్న ఆర్థికవిపత్తు-ఎంత విడదీసినా
చోటుచాలకుండా విస్తరించుకుపోతున్నది-
అసంపూర్తిగానే మిగిలిపోతున్నది!
కష్టనష్టాలను వేటితో భాగించినా
శేషం మిగులుతూనే ఉంది!

అనుకున్న 'ఆన్సరు' రానందుకు దిక్కులు చూస్తూ
అంతరంగం 'ఆబ్ స్ట్రాక్' గా ఆలోచిస్తున్నది!

నా అభిప్రాయంః

రెండు కవితలు- మధ్య మూడు దశాబ్దాల అంతరం. మొదటిది '40ల నాటి ధోరణి. తరువాతది తరువాతి తరం తాలూకు  అసహనం. రూపాల్లో వైవిధ్యం ఉన్నా అంతర్గతంగా రెండింటిదీ ఒకే తర్కం.

కృతయుగానికి 'శివజటాజూటాగ్ర గళిత హిమమణిమిళిత శీకరకిరీట' oత పునీతంగా కనిపించిన గంగ కలియుగానికి 'నర కబంధ ప్రేతములమీద పరదెంచు పెను కాలభూతం'గా అనిపించింది. వస్తువు ఒకటే. చూసే చూపును బట్టి  రజ్జు సర్పభ్రాంతి.  శ్రీశంకరుని తత్త్వం. కలియుగం నాటికి 'నరకభీకరతమోఘూర్ణితభయద వైతరణివేణి'లాగ అనిపించిన గంగ.. వాస్తవానికి వర్తమాన సమాజరీతికి కవి సంకేతం. రెండో కవితలో  'నేలిడి ఉహించటానికి లేకుండా జీవిత పరిభ్రమణంలో/ సాలిడ్ యాంగిల్లా మారిపోతున్నది’ అని అనడం అంటే..    జీవితం మీద ఆ కవిదీ అదే  పెసిమిస్టిక్ దృష్టి..  మరో కోణం నుంచీ!

తెలుగుకవిత్వ వికాసపరిణామ క్రమాన్నిసవ్యంగా పరిశీలించే వారెవరికైనా ఈ రెండుకవిత్వ రూపాల్లోని సామ్యాలు, తారతమ్యాలు ఇట్టే స్ఫురిస్తాయి. మొదటిది '40ల్లోని భావ విప్లవ నేపథ్యంలో ఛిద్ర జీవిత విధ్వంసానికి పట్టిన అద్దం ఐతే రెండోది '70లోని అస్తవ్యస్త జీవన వ్యవస్థ మీది యువత విసుగు విసురు. మొదటి   వ్యక్తీకరణ ఆనాటికే ప్రాచుర్యంలో ఉన్న కావ్యభాషసరళి. రెండో కవిత-  ఏకమొత్తంగా రూప భావాలు రెండింటిలోనూ కవి ఎంచుకున్న సరికొత్త గణిత పంథా. అది తేడా!

కవిత్వ రూప, తత్వాలమీద మొదటి నుంచీ ఏవేవో  వాద వివాదాలు. విశ్వవ్యాప్తంగా అదే తరహా. మిగతా అన్నిసాహిత్య ప్రక్రియలకన్నాకవితారంగంలోనే ఈ రచ్చ ముందుగా ఎందుకు అన్నది చర్చ. 

కవిత్వం  ప్రధానంగా హృదయ సంబంధి కావడమూ,  జీవితాన్ని, సమాజాన్ని నిర్వచించాల్సిన పెనుభారం తన కవిత్వం మీదే ముందుగా ఉందన్న భ్రమ కవితాప్రపంచం భ్రమ బలంగా ప్రబలి ఉండటమూ కారణం  కావచ్చును.   భావాత్మకమైన ప్రతిస్పందనకు శైశవదశలో సుఖంగా మనసుకు  అందివచ్చే సంతృప్తికరమైన ప్రక్రియ కవిత్వం  కావడమూ మరో కారణం కావచ్చును.   సూక్ష్మంలో మోక్షంలా వ్యక్తీకరించే సౌలభ్యం పాఠకుడి మనసును కవిత్వం వైపుకు తొందరగా బలంగా ఆకర్షిస్తుంది. కవి  ఉత్సాహానికి అదీ కారణం కాదనలేం.

వాదం ఏదైనా.. ప్రధానంగా కవిత్వం హృదయప్రధానం. రూపం ఏదైనా.. కవిభావం అద్దంలో మాదిరి కనబడడం అందుకే అవసరం. నడక ఎలా సాగింది అనే అంశం ఎంత ప్రధానమో..  కవిత చూపు నేలకు ఎంతకు దగ్గరగా ఉందన్నది అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత గల విశేషం.
రాసేది మనిషి. చదివేది.. వినేది మనిషి. చెప్పేది  మానవ జీవితాన్ని, మనిషి అంతర్భాగంగా ఉండే సమాజాన్ని గురించి. మరి భాష- భావం, నడక-నడత, ఆకారం-అలంకారం  పాఠక మేధో పరిమితులకు అనువుగా ఉంటేనే  అందం చందం! అర్థమయే   కవితకే ఆదరం. పదుగురితో పంచుకోబుద్ధవాలంటే ఆ కవితలో కొత్త విశేషం ఏదైనా ఉండటమూ తప్పని సరే. భావన గంగయితే యమున రూపమైతే.. కనిపించకుండా సాగే వ్యంజన సరస్వతి! ఈ కొలమానాల ప్రకారం పై రెండు  కవితలూ నా మనోసాగరాన సమ్మిళితమయేందుకు  ఉధృతంగ ప్రవహిస్తూ వచ్చే  త్రివేణీ సంగమ రస తరంగిణుల
-కర్లపాలెం హనుమంతరావు
25 -01 -2020
బోథెల్, వాషింగ్టన్ స్టేట్, యూ.ఎస్.ఏ



వర్ధమాన రచయితకు శ్రీవాత్సవ లేఖ- పాత బంగారం



అఖిలభారత తెలుగు రచయితల 2వ మహాసభ 1963, జనవరిలో రాజమండ్రిలో జరిగిన సందర్భంలో ఒక సావనీర్ తెచ్చారు.సుమారు 200పేజీలకు పైనే ఉంటుందా ప్రత్యేక సంచిక. పి.వి.నరసింహారావు గారు "ఉన్నత లక్ష్యాలతో రచనలు సాగించాల"ని ఉద్భోధిస్తూ చేసిన ప్రసంగపాఠం ఉందందులో. విశ్వనాథవారి నుంచీ కాశీ కృష్ణమాచార్యుల వారి దాకా... మధునాపంతుల, సినారె, సోమంచి యజ్ఞన్నశాస్త్రి, దాశరథి, తిలక్, మధురాంతకం, సంపత్కుమార, పిలకా, పురిపండా వంటి  ప్రముఖుల వ్యాసాలు, రచనలు ఎన్నో ఇందులోకనిపిస్తాయి.
ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ- వర్ధమాన రచయితలను ఉద్దేశించి  లేఖారూపంలో ఒక మూడుపుటల  చక్కని రచన చేశారు. ఆ వ్యాసం మొత్తాన్నీ మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం కుదరదు కానికొత్తగా రచనలు చేసే ఔత్సాహికులకు ఈ నాటికీ పనికొచ్చే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.కొన్ని భాగాలను క్లుప్తంగా ఇస్తాను.చూడండి!
రచయితలు అష్టకష్టాలుపడి  రాసిన తమ రచనలకు ఎందుకో(బహుశా సరదావల్లో..మోజుతోనో) కలంపేర్లు పెట్టుకుని ప్రచురించుకుంటుంటారు. మళ్ళా ఆ రచన ప్రచురింపబడ్డప్పుడు ఆ రాసింది తామే అని నలుగురికీ తెలియచెప్పటానికి నానాతంటాలు పడుతుంటారు. ఇంచక్కా సొంతపేరుతో ప్రచురించుకుంటే ఈ తిప్పలుండవు కదా అని శ్రీవాత్సవ అభిప్రాయం. సరే..అదేమంత పెద్ద  విషయం కాదుకానీ…కాస్త అలోచించదగిన సంగతులు ఇంకా  కొన్నున్నాయి.
సాధారణంగా రైళ్ళలోనో..బస్సుల్లోనో ప్రయాణంచేస్తూ ప్రేమలో పడిపోయే మధ్యతరగతి యువతనో, నిత్యనీరసంగా ఉండే సతీపతికుతూహల రహస్యాలనో ఇతివృత్తాలుగా తీసుకుని కాలక్షేపం రచనలు చేస్తే వచ్చే ప్రయోజన మేముంది? అంటారు శ్రీవాత్సవ. మన చుట్టూ...  జీవితాలతో నిత్యం సంఘర్షిస్తూ అంతులేని పోరాటం చేసే జనావళి అశేషంగా  కనపడుతుంటే  వాళ్ళ జీవితాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడో..ఎప్పుడో.. కదాచిత్ గా కనిపించే అసాధారణమైన అద్భుత సంఘటనలను గ్లోరిఫై చేసే రచనలు చేయడం ఎంతవరకు సబబు? అలాంటి రాతలు తాత్కాలికంగా సంతృప్తినిస్తాయేమో గానీ.. కలకాలం నిలిచుండేవి మాత్రం కావు.
మరీ ముఖ్యంగా మనలోని కొందరు రచయితలు అవినీతిని ఆకర్షణీయంగా చిత్రించే ధోరణికీ పాల్పడుతుంటారు. మనచుట్టూ ఇంత అవినీతి పెరిగిపోతూసామాన్యుడి బతుకును అతలాకుతలం చేస్తుంటే..అదేమీ పట్టించుకోకుండాసంఘాన్ని మరింత  దిగజార్చే  నిమ్న వాంచల్నీ, నికృష్ట తత్త్వాల్ని, దుర్మార్గాన్నీ, దుర్నీతినీ, సౌఖ్య వాంచల్నీ,  కామోద్రేక్తలనీ సమర్ధించే సమ్మోహన విద్యను రచయిత ఉపయోగిచడం ఎంత వరకు ధర్మం? రచయిత అన్నవాడు మనసులో దాగున్న మధురాత్మను మేల్కొలిపి మహనీయ కార్యాలు చేయడానికి పురికొల్పే స్థితిలో ఊండాలి. మంచి రచనలతో మనిషిలోని మంచితనాన్నితట్టి లేపవచ్చు.
కవిత చెప్పినా,  కావ్య మల్లినా,  పాట పాడినా, పద్యం పలికినా, కథ వినిపించినా.. మానవతలోని తరగని విలువలను పైకి తీసేవిగా ఉండాలి. పదిమందీ పదే పదే పలుమారు తలుచుకునే రీతిలో  రచన సాగాలంటే.. మన ముందు తరం రచయతలు తొక్కిన దారేమిటో తెలుసుకోవాలి. ఆ దారిలో మనం నడుస్తే.. మన అడుగుజాడలు తరువాత తరం వారికి అనుసరించేవిగా ఉంటాయి…అంటున్నారు- ఆ లేఖలో శ్రీవాత్సవ.
ఈ రచన చేసి ఇప్పటికి సుమారు అర్థశతాబ్దం గడిచిపోయింది. ఈ కాలానికీ శ్రీవాత్సవ చెబుతున్న విషయాలు కొత్త రచయితలు సరిగ్గా అతికినట్లు సరిపోతుండటమే.. ఆశ్చర్యం.. బాధా కలిగించే విషయం. కదా?
-కర్లపాలెం హనుమంతరావు
24 -01 -2020
బోథెల్, వాషింగ్టన్ స్టేట్, యూ.ఎస్.ఎ




కళ కళ కోసమే కాదు - కళాభిమానం కళ కోసమే కర్లపాలెం హనుమంతరావు




సౌందర్యాన్ని  విజ్ఞాన శాస్త్రంలోలాగా నిర్వచనంలో బంధించలేం. ఒక్కొక్కరికి ఒక్కో  చిత్రం, ప్రకృతి దృశ్యం, జీవితం, సాహిత్యంలోని ఓ విభాగం ఒక్కో కారణం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకరి ఆకర్షణకు కారణం వాళ్లే చెప్పగలరే తప్పించి, వేరే వారు ఆ ప్రయత్నం చేసినా నూరు శాతం న్యాయం చేయలేరు. వాల్టరు అన్న ఈ మాటనే. కాళిదాసూ దుష్యంతుడి పాత్ర  ద్వారా వెలిబుచ్చడం ఆశ్చర్యం కలిగించదు. మేధావులు వేరే వేరే ప్రదేశాలలో ఉన్నప్పటికి ఒకే తీరులో ఆలోచనలు కొనసాగిస్తారన్న నానుడి ఉండనే ఉంది కదా! రమ్యమైన వస్తువులను వీక్షించడం,, మధురమైన శబ్దాన్ని ఆలకించడం పర్యుత్సకతకు దారి తీస్తుంది. జననాంతర సౌహృదాలు జ్ఞప్తికి వస్తాయని కాళిదాసు భావన.  ఓంకారనాథ ఠాకూరు నీలాంబరి’, సైగల్ 'దాబుల్ మోరా'  ఇదే తరహా భావాలను సమర్థిస్తాయి.

కాళిదాసు దృష్టిలో 'రమ్యాణి' అంటే సౌందర్యమే. ప్రతీయ మానం పునరన్య దేవ/ వస్త్వస్తి వాణీషు మహాకవీనా/యత్తత్ ప్రసిద్ధావ యవాతి రిక్తం విభాతి లావణ్య మివాంగనాసు- అంటాడు కదా ఆనందవర్థనుడు! లావణ్యాన్ని కావ్యగత సౌందర్యంగా  ప్రతిపాదించే మాట ఇది.

 అసలు లావణ్యం అనే శబ్ద స్వరూపమే విచిత్రంగా ఉంటుంది. లవణం- లావణ్యం దగ్గర దగ్గర సంబంధం కలవిగా అనిపిస్తాయి కదా! నిజానికి కూడా ఆ రెండింటి మధ్యనా సంబంధం లేకపోలేదు.  స్ఫటికం ఆకారంలో ఉంటుంది లవణం. ఆ ఆకృతిలోనే అంతర్లీనంగా కాంతులీనే లక్షణం కద్దు.  కాంతులీనే ముత్యం స్ఫటికాకారంలో కనిపిస్తుంది. కాబట్టే దానికి ఆ మెరుపులీనే విశిష్ట లక్షణం. అయితే ఆ ఆకర్షణ ఎక్కడి నుంచీ? అంటే సమాధానం కష్టమే! . పాలరాయికి ఉండే షీన్ కూడా  ఇలాంటిదే.

అంతు చిక్కని అంశాన్ని ఓవెన్ దార్ 'ఫీల్డ్' కవితలో 'ప్రికేరియస్  ఎలిమెంట్ ఇన్ పొయిట్రీ' గా సరిపెట్టుకున్నాడు. గ్రీకు భావాల బట్టి చూస్తే కళోస్ లక్షణాలు ఐక్యత, అవయవాల అబురూప్యత(రూప నిష్పత్తి) లో ఉంటుంది. లావొకూన్ రూపం, బీతోవెన్ నవమస్వర సమ్మేళనం, యూక్లిడ్ రేఖా గణితం, గ్రీకు త్రాసదరూపకాలూ సౌందర్యవంతంగా కనిపించడానికి ఈ రూప నిష్పత్తులే సమన్వయమే మూలమని గ్రీకుల భావిస్తారు.

విడి విడిగా అందంగా ఉండే వస్తువులన్నింటినీ ఒక చోట కుప్ప పోస్తే అందంగా ఉంటుందా? అంటే.. ఏమో ఉంటుందని.. ఉండదని ఏదీ చెప్పలేం.  

తలిసెట్టి వారి ప్రబంధనాయిక కార్టూనులాగా కనిపిస్తుంది. కారణం ఎవరు చెప్పగలం?  అళినీ లలాక, కమలాక్షి, చంద్రానన, పల్లవపాణి, బిసబాహు, చక్రస్తని, సింహమధ్య, పులిన జఘన, రంభోరు- లంటూ ప్రబంధకవులు పదబంధాలతో కుస్తీలు పట్టడానికి ముందే తిక్కన వస్తువులను కాకుండా వస్తువుల సౌందర్య సారాన్ని  మాత్రమే విడదీసి  నెత్తమ్మి రేకుల మెత్తదనం(పాదం), చక్రవాకాల  చందం(స్తనాలు), చందురు నునుకాంతి(ముఖం), అళికులంబుల కుప్ప(జడ)లతో  ద్రౌపదీదేవి సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అందుకే అనేది.. సౌందర్యానికి సార్వత్రిక సూత్రం సాధ్యం కాని పని.. అని. ఏ కళా ఖండానికి ఉండే విశిష్టత ఆ కళాఖండ సౌందర్య పటిమను బట్టి  ఉంటుందనేది సారాంశం.

సౌందర్యం వస్తువును బట్టి ఉంటుందా? వస్తువులోని అనిర్వచనీయమైన లక్షణాన్ని బట్టి ఉంటుందా? అని ఎవరైనా ఓ సందేహం లేవదీస్తే?

 పర్షియా రాజు  'లైలా ఏమంత అందంగా ఉంటుందని ఈ పిచ్చి పోకడలు?' అని ఎద్దేవా  చేస్తే 'రాజా! నా కళ్ళతో చూస్తేగాని నా బాధ నీకు అర్థం కాదు' అని మజ్నూ బదుకిస్తాదు. 'తా వలచింది రంభలాంటి సామెతలు సౌందర్య ఆత్మాశ్రయ తత్వాన్ని తెలియ చేస్తూ పుట్టుకొచ్చినవే!  

చూసే కళ్లను బట్టి సౌందర్యం మారుతుంటుంది. సమయ సందర్భాలను అనుసరించి కూడా! ముళ్లమధ్యలో ఉన్నా రోజాపూవు  అందంగానే ఉంటుంది. ఎడారిలో కాసినా వెన్నెల వెన్నెలేసౌందర్యం చర్మదఘ్నం అన్నారు.చప్పట్లు కొట్టేందుకు రెండు చేతులూ చాలవు. ఆకర్షణ ఐనా వికర్షణ ఐనా రెండు ధృవాల మధ్య కలిగే స్పందన. ఒక వస్తువు , ఒక వ్యక్తి సౌందర్య భావనకు ఆ విధంగానే తప్పని సరి.

 

సౌందర్యం వస్తువులో ప్రతిష్టించిన పదార్థమా? మనిషి దానికి ఇచ్చే విలువ పైనా ఆధారితమా? అని మళ్లీ మరో  సందేహం రావచ్చు. అరటి పండులోని తీపిదనం వస్తు నిష్ఠం. 'మధురాధిపతే రఖిలం మధురం'   విలువను ప్రతిపాదించే సూక్తివజ్రం,, బొగ్గు- ఒకే తరగతివి అయినా వజ్రానికి బ్రిటిషు రాణి తలపై స్థానం లభించింది. ఇక్కడ బొగ్గు కన్నా వజ్రానికి మనిషి ఎక్కువ విలువ ఇవ్వబట్టే కదాఏ కారణం చేత అట్లాంటి విలువ ఇవ్వడం.. అన్న ప్రశ్న వచ్చినప్పుడు అరుదైన లభ్యత వల్ల అని కొంత మంది జవాబు చెబుతారు. సబబే అనిపించినా .. అన్ని సందర్బాలకూ  అదీ వర్తించదు. మహాత్మా గాంధీ వాడి వదిలేసి పోయిన బొడ్డు గడియారాన్ని, విరిగిన చేతికర్రను వేలానికి పెడితే విరగబడి ఎక్కువ ధరకు కొనుక్కున్న సందర్భాలు మనం చూస్తున్నాం. బాలాపూర్ వినాయకుడి లడ్డూ ప్రతీ ఏటా లక్షల ఖరీదు పెట్టి కొనుక్కునే హిందూ విశ్వాసులు కద్దు. అదే లడ్డును ముస్లిములు ఇరవై రూపాయలకు తీసుకోమన్నా తీసుకోరు కదా? 'మహాత్మ' అనే చిత్రంలో ఒక సేఠు తులసీ రామాయణాన్నిరద్దీవాలాకు రెండు కాసులకిస్తే.. ఆ  పేపరువాలా దాన్ని మిఠాయి కొట్టుకు వేయకుండా కళ్ళకద్దుకుని దేవుడి మందసంలో ఉంచుతాడు. ఒకడు పక్కా వ్యాపారి ఐతే..ఇంకొకడు భావుకత్వం ఉన్న వ్యాపారి. వస్తువుల సౌందర్యం - విలువలు కూడా సాపేక్ష లక్షణాలు కలవని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

అయితే సౌందర్యాన్ని అందరూ సొంతం చేసుకోవాలని , అనుభవించాలని, హక్కుదారులుగా ఉండాలని ఎందుకు కోరుకోవడం? సౌందర్యం అభిలషణీయమైన వస్తువుగా గుర్తింపబడటానికి మనిషి ప్రోద్బలించే లక్షణాలు ఏవి? అన్నది కూడా ఆసక్తి కలిగించే చర్చనీయాంశమే!

తిలక్ 'నా కవిత్వంలో' తన అక్షరాలను 'కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, ప్రజా శక్తుల ప్రవహించే విజయ ఐరావతాలు, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'తో ఎందుకు పోల్చుకున్నాడో కనిపెడితే సమాధానం దొరుకుతుంది.  'చీకటిలో అలమటించే వికారపు పిల్లలను ఎవరు తలుచుకుంటారు?' అని శిబితో గద్ద మొర పెట్టుకుంటుంది. అందం, ఆనందం మాత్రమే ఎందుకు కావాలి మనుషులకు? అన్నమయ కోశంతో ఆరంభమైన  ఉపనిషత్తులూ ఆనందమయ కోశం దగ్గరికొచ్చిన తరువాత ఆగిపోతున్నాయి.ఆ తరువాత ఏముంది? అని అడిగితే

'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్' అని సమాధానాలు  దాటేస్తున్నాయి. కీట్సు 'అందమైన వస్తువు సదా ఆనందదాయకం' అన లేదూ?

కావ్యం నుంచి వచ్చే ఆనందాన్నే మమ్మటుడు 'సద్యః పర నిర్ వృతయః' అన్నాడు. 'కావ్యం హ్లాదైక మయీం'. కళల్లోని ఈ ఆనందవాదం విశ్వతోభిముఖంగా వ్యాపించి ఉంది. మనిషి పుట్టుక ముందు నుంచే ప్రకృతి తన చలనానికి ఈ సౌందర్యాన్ని, ఆకర్షణ వికర్షణల్ను ఉపకరణాలుగా వాడుకుంటూనే ఉంది. పరభృతాల ఆకర్షణకై పూవులకు ప్రకృతి ఆకర్షణీయమైన రంగులు ఎందుకు అద్దుతుందో అర్థం చేసుకొంటే సృష్టి చాలనంలో సౌందర్యం పాత్ర ఎంతో బోధపడుతుంది.

రసపాక సిద్ధాంతాలు వంట యింటి నుంచి పుట్టుకొచ్చాయి. భోగలాలసత నుండి రామణీయకత,  శయ్యా వాదాలు వెలికి వచ్చాయి. అలంకారవాదం దేహాభిమానం వల్ల వచ్చింది. వక్రోక్తి, ధ్వని వాదాలకుమూలం పగటి వేషగాళ్ల ప్రలాపాలు. ఒక్క ఔచిత్య విచారం మాత్రం ఆనందాన్ని ప్రతిపాదించటం లేదు. పైపెచ్చు సంతోషాన్ని సంహరించే  గుణం దానికి ఉంది. జనం తమాషా కథలు చెప్పుకుని నవ్వుకుంటుంటే 'నాకు నచ్చలేదు' అని గుడ్లురిమి నోరుమూయించే విక్టోరియా మహారాణి పెడసరి వైఖరి ఇలాంటిదే.

'పిబరే రామ రసం' అంటే ఏమిటి? సౌందర్య రస పిపాసువులు అంటే ఏమిటి? అందాన్ని అనుభవిస్తే ఆనందం ఎందుకు కలుగుతుంది? ధర్మరాజుకి కర్ణుడు అన్న అని తెలిసిన తరువాత మాత్రమే ఆ ఏడుపులు ఎందుకు? పాట్రొకస్ మరణ వార్త విన్న అక్లీజు ఆవేదన సంగతో? తానాజీ శవాన్ని చూసి శివాజీ అంగలార్పడం ఎ బంధాన్ని సూచిస్తుంది? అ దుఃఖాలు  ఆనంద దాయకాలు ఎలా అయ్యాయి?! భవభూతి ఉత్తర రామ చరితంలో మాత్రం? సీతాపహరణం, జటాయు వధ వంటి దృశ్యాలను చూసి సీత అలా మూర్చ పోవడం ఆనందదాయకాలు ఎలా అవుతాయి? దానికీ ఒక త్రాపద సిద్ధాంతం లేవదీసాడు అరిస్టాటిల్. భయానక, కరుణ  దృశ్యాలు బాగా భయపెట్టి, ఏడిపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి కాబట్టి వత్తిడి నరాలకు ఉపశమనం కలిగి మనసులు కడిగి ఆరబోసినట్లు తేలిక పడి ఆ నిర్మలత్వం ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన సిద్దాంతం. తమాషాగా ఉంది కదూ!

పాశ్చాత్యుల్లో జార్జి సంతాయనా, వాల్టరుపాటర్ ఆనందవాదులుగా ప్రసిద్ధులు. ఆనందమనేది స్వార్థ రహితంగా, బహుజన సేవ్యంగా ఉండాలని వీళ్ల వాదం. కళాభిమానం కళ కోసమే అయి ఉండాలన్నఆ వాదనను తప్పు దారి పట్టించి 'కళ కళ కోసమే' అని ఆయన అన్నాడన్నట్లు  వక్ర భాష్యాలు వ్యాపించడమే సౌందర్యాత్మక కళారంగానికి కలిగిస్తున్న పెద్ద నష్టం. 

-కర్లపాలెం హనుమంతరావు

Wednesday, October 15, 2014

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 





Saturday, January 18, 2020

పుస్తకం .. ఓ ప్రియ నేస్తం! -కర్లపాలెం హనుమంతరావు- సూర్య ప్రచురితం



వసు చరిత్ర’ వంటబట్టించుకుంటే  తెలుగు
సాహిత్యమంతా ‘మంచి నీళ్ళప్రాయమ’ని బాల వీరేశాన్ని ఎవరో బాగా నమ్మించారు. ఆ గ్రంరాజం విలువ ఆ పిల్లవాడి కాలంలోనే  రెండున్నర అణాలు. చిల్లుకానీ బిళ్ళ దర్శనానికైనా  ఎన్నడో కానీ నోచుకోని బాలకందుకూరి పంతం వదల్లేదు. దినం తప్పకుండా ప్రతీ పరగడుపునా పుస్తక దుకాణ దర్శనం.. పొద్దెక్కేదాకా అక్కడే పుస్తక పఠనం! పంతులుగారి పంతం చూసి  ఉదారంగా ఆ పుస్తకం ప్రదానం చేసేసాడు దుకాణం పెద్దమనిషి. విద్య విలువ, ఆ విద్యను అందించే  ద్గ్రంథాల ప్రాధాన్య గురించి ఎంత తవ్విపోసినా  అడగడుగునా ఈ మాదిరి ఏవేవో వింతలూ.. విశేషాలు అలరిస్తూనే ఉంటాయి.
ఆరువందల ఏళ్ల కిందట బడికి వెళ్లే పిల్లకాయల సంచుల్లో ఇప్పట్లా పుస్తకాల దిండ్లు వందలొందలు ఉండేవి కావు. ఒక్క చెక్కపలకే వాళ్లకు అప్పట్లో  రాసుకునేందుకు దిక్కు. వేరే దేశాల్లో అయితే మైనం పూసిన చెక్కపలకలు. వింత వింత రాత సాధనాలు కనిపిస్తాయి మరీ పుస్తక చరిత్ర తవ్వుకు పోతుంటే! 
ఏది కంటబడితే దాని మీదనే చేతి గోటితొ గీసే అలవాటు ఆదిలో మానవుడిది. గోలుకొండ కోట జైలులో కంచెర్ల గోపన్న గోడ మీద శ్రీరామచంద్రుణ్ని దెప్పుతూ సంకీర్తనలు రాసుకున్నదీ చేతి వేళ్ల గోళ్ళతోనే!
రాతిబండలు, తాటాకులు, భూర్జపత్రాలు,  జంతుచర్మాలు, చెట్టుపట్టలు, కుండ పెంకులను కూడా వదలకుండా ఒకానొక కాలంలో బండ మనుషులు రాయడానికి వాడేవాళ్లు.   రాత పరికరాల  రూపంలో మార్పు రావడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో విసుగెత్తి మనిషి ఈ రాత బెడద మనకెందుకులెమ్మని లేచిపోయి గాని ఉంటే మన తలరాతలు ఇప్పుడు మరోలా ఉండేవేమో కదా!
మహమ్మద్ పైగంబర్ ఖురాన్ షరీఫ్ ను గొర్రెమూపు చర్మాలను ఎండబెట్టిన ముక్కల మీదనే రాసాడుట పాపం. గ్రీకులు ఓస్ట్రక్ అనే  కుండ పెంకులను పలకలుగా వాడేవాళ్లు. మన దేశంలో అయితే గణతంత్ర రాజ్యాలలో ముద్రలు వేసి ఇచ్చే నోట్లకు కర్రముక్కలను వాడినట్లు చరిత్ర. ఇదే ‘శలాకా పద్ధతి’.
పశ్చిమ దేశాలలో పైపరస్ కాగితాలకు గిరాకీ. అంత ధర పెట్టలేని  బీద రచయితలు కుండపెంకులతో సరిపెట్టుకొనేవాళ్లే కాని రాత పని మాత్రం వదిలిపెట్టే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఈజిప్టులో పనిచేసిన రోమన్ సైనికులు తమ కాతాలకు సరిపడా పైపరస్ సరుకు దొరక్కపోయినా  కుండపెంకులను పట్టుకు వేళ్లాడారే తప్ప కాతాలెక్కలు రాయడానికి పాలుమాలిందీ లేదు!  
గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు’ అంటూ తెలుగు  అడిదం సూరకవి ఎట్లా కోతలు కోసాడో.. తెలియదు కానీ.. మన దేశంలో  మొదటి నుంచి తాటాకులదే(తాటియాకులదే) రాత సాధనాలలలో రాజాపాత్ర. సమయానికి రాసుకునేందుకు ఆకులు ఇవ్వలేదని వేములవాడ భీముడు తాడిచెట్టు మొత్తాన్నే వేళ్లతో సహా  బూడిద చేసినట్లో కథ. ఆ కట్టుకతలో పక్కన పెట్టినా చరిత్రను బట్టి  చూస్తే   రాయిని కూడా రాజుల శాసనాలు రాయించేందుకు ఉపయోగించినట్లే రూఢవుతుంది. అవే 'శిలాశాసనాలు'. శాశ్వతత్వానికి నేటికీ ప్రతీక శిలాశాసనం’ అనే పదం. ‘అల మీద అక్షరాలు క్షరాలు/ శిల మీది అక్షరాలు అక్షరాలు/ అలా? శిలా? ప్రియా.. నా ప్రేమాక్షరాలకు నీ హృదయ ఫలకం?’ అని నేనే గతంలో ఓ మినీ కవిత రాసినట్లు గుర్తు!
క్రీస్తుకు నాలుగు వందల ఏళ్ల కిందటిదైనా మహాస్థాన్ శాసనం ఇప్పటికీ మనం కళ్లారా చూస్తున్నామంటే అందుక్కారణం  అది శిల మీద చెక్కింది కావడమే. మన భట్టిప్రోలు, అశోక శాసనాలూ శిలాలిఖితాలే.  వేల ఏళ్ల కిందటి  బౌద్ధ స్తూపాల మీద  చెక్కిన జాతక కథలు నేటికీ చెక్కు చెదరని స్థితిలో తవ్వకాల్లో బైటపడుతున్నాయి ఎన్నో చోట్ల. ఈజిప్టులో  కళా చిత్రాలు సమాధుల మీద, దేవాలయ కుడ్యాల మీద రాయడం ఓ సంప్రదాయం.
రాతి పుస్తకాలు మోతబరువు. 177 పుటల బరువున్న ఈజిప్టు శిలాశాననం అసలు ప్రతి చదవాలంటే ఎవరైనా ఈజిప్టు దేశం దాకా వెళ్లి రావాలి.  గవిమఠం శిలాశాసనం చదవాలంటే  కొండలు.. బండలుక్కి పైకిపోవాలి. అశోకచక్రవర్తి  మహానుభావుడు  దాన్ని అంత ఎత్తు  కొండ మీద ఎందుకు చెక్కించినట్లో ? రాసే వాళ్లకి కష్టం ఎటూ తప్పదు. చదివేవాళ్లకీ ఇన్ని ఇబ్బందులా? బహుశా సీరియస్ పరిశోధకులు మాత్రమే ఆ శాసనాల జోలికి పోతారన్న ఉద్దేశముందేమో.. చక్రవర్తి కడుపులో!  పోనీ ప్రత్యామ్నయంగా  పోష్టులో పంపిద్దామన్నా ఉండవల్లి గుహశాసనాలు వంటి  బండరాళ్ల శాసనాలను ఉండచుట్టేందుకైనా వీలు కావే! హ్హేవిఁటో! రాత కష్టాలు!
ఇన్ని రాతి  కష్టాలు ఎదురయ్యాయనే కావచ్చు పరిష్కారంగా కొంతలో కొంత బరువు తక్కువ లోహాలు  కంచు, రాగి వంటివి  వాడుకలోకి వచ్చింది. విదేశాలలోని చాలా ప్రార్థనాలయాలు, రాజప్రాసాదాలు ఎక్కువగా కంచు ఫలకాలతోనే కనువిందు చేస్తుంటాయి. బ్లోయిన్ నగరవాసులతో ఎట్ లీన్ ప్రభువు ఓ కంచు ఫలకంపైన చేసుకొన్న ఒప్పంద పత్రం  అక్కడి ఓ చర్చి తలుపులకు పుస్తకం మాదిరి తాపడం చేయించిపెట్టారు.  రాజప్రాసాదం నేల కూలింది కానీ.. కంచు పుస్తకం మాత్రం నేటికీ చెక్కు చెదరకుండా  ఉంది! పుస్తకమా.. మజాకానా!

మూరగండరాయడుగా శత్రుమూకల చేత మూడు  గంగల నీళ్లు తాగించిన శ్రీకృష్ణదేవరాయలు ‘మను చరిత్ర’ కర్త పెద్దనామాత్యుడి కాళ్లు కడిగి ఆ నీళ్లు శిరస్సు మీద  జల్లుకున్నాడు. చేత్తో కాలికి ఆ మహారాజు తొడిగిన గండపెండేరం కన్నా ..  నోటితో ‘చతుర వచోనిధి/వతుల పురాణాగమేతిహాస కథార్థ/ స్మృతి యుతుడ’ వని పొగడటమే పెద్దన ఆధిక్యాన్ని పదింతలు గుర్తింపు. పెద్దనగారి ఆ ఆధిక్యానికి కారణం ఆ కవిగారు రాసిన ‘మనుచరిత్ర’ పుస్తకమే కదా! ‘విద్యా సమం నాస్తి శరీర భూషణమ్- విద్యను మించిన అలంకారం మనిషికింకేమీ లేద’న్న మాట అక్షరాలా నిజం. ఆ విద్యాప్రసాదం మన జిహ్వకు  రుచి చూపించే పళ్లెరం పుస్తకం.. తాళపత్రగ్రంథాలైనా మరోటైనా!
అప్పటికీ మన దేశంలో రాగి లోహం మీది రాతలే ఎక్కువ. గోరఖ్ పూర్ జిల్లా తాలుకు  బుద్ధుని కాలం నాటి పాలీ లిపి తామ్రశాసనం క్రీస్తుకు పూర్వం 450 ఏళ్ల కిందటిది. ఇప్పటి వరకు దొరికిన వాటిలో ఆ శాసనమే అతి ప్రాచీనమైనది.
తెలుగు దేశాల్లో తెలుగులో చెక్కిన తామ్రశాసనాలయితే తామర తంపరలుగా కనిపిస్తుంటాయి. తాళ్లపాక అన్నమాచార్యులవారు. ఆయన బిడ్డ తిరువేంగళాచార్యులవారు చెక్కించిన సంకీర్తన రాగిరేకులే సుమారు ముఫ్ఫైరెండు వేలకు పై చిలుకు! రాజులు తమ  వైభవ ప్రాగల్భ్యాల ప్రదర్శన కోసం, ప్రజలు భక్తిభావ ప్రకటన కోసం బంగారం, వెండి వంటి వాటి రేకుల మీద స్త్రోత్రాలు చెక్కించడం ఆచారంగా వస్తున్నది అనూచానంగా. తక్షశిలలో గంగు స్తూపంలో  బంగారురేకు శాసనం, భట్టిప్రోలు స్తూపంలో వెండిరేకు శాసనం లభ్యమయ్యాయి. అన్ని కళాఖండాల మాదిరే అవీ ఇప్పుడు చివరకు బ్రిటిష్ మ్యూజియంలో తేలాయనుకోండి! అది వేరే కథ.
ఎన్ని నయగారాలు పోయినా చివరికి రాతకు కాగితమే గతి అని తేలిపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్నది చెట్టు బోదెల నుంచి రాబట్టే గుజ్జుతో తయారయే కాగితం. రాతకు, మోతకు, ఖరీదుకు, వాడకానికి అన్నిందాలా అనువైనది కావడమే కాగితం విజృంభణకు ముఖ్య కారణం.  ఇప్పుడిప్పుడే ఈ-బుక్స్ పేరుతో ఎలక్ట్రానిక్ పుస్తకాలు  ఉనికిలోకి వస్తున్న మాటా నిజమే. అయినా అత్యధికులకు అచ్చు కాగితాలతో తయారయే పుస్తకాలంటేనే ముచ్చట.
 ఏ రూపంలో ఉన్నా పుస్తకాలు మనిషికి గొప్ప నేస్తాలు సుమా! దుర్బలంగా జబ్బురోగిలా ఉన్నాడన్న దిగులుతో  కన్నబిడ్డ ప్రహ్లాదుణ్ని ‘విద్యాభ్యాసంబున గాని తీవ్రమతి గాడని’ భావించి చండామార్కులవారికి అప్పగించాడు రాక్షసరాజై ఉండీ హిరణ్యకశిపుడు. ‘చదివిన వాడజ్ఞుండగు/ చదివిన సద సద్వివేక చతురత గలుగుం’ అన్న ఆ రాజు అప్పుడన్న  మాటలు అక్షరాలా అందరికీ శిరోధార్యమే. అసురుల చేత కూడా పొగిడించుకున్న  విద్య వట్టి నోటి మాటతో సాధించే కృష్ణ కుచేలుల సాందీపనీ గురుకుల విద్యా ప్రణాళికగా మాత్రమే సాగలేదు.  తావికి పూవులా విద్య పుస్తకంలోకి  ఒదిగిపోయింది.
'పాత చొక్కా అయినా తొడుక్కో! కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!' అన్న కందుకూరి హితవు పాత చింత తొక్కు కింద మారడం మేలు కలిగించే పరిణామం కాదు.   దుస్తుల ధారణలో చూపించే శ్రద్ధ నేటి తరం పుస్తక పఠనంలో ప్రదర్శించడంలేదు. క్రమంగా కనుమరుగయే జాతుల జాబితాలో పిచ్చుక, పావురాల మాదిరి పుస్తకమూ చేరడంలో తప్పెవరిది అన్న చర్చ ఆనక. ముందు  తగు దిద్దుబాటు చర్యలు వేగిరం తీసుకోవడం అవసరం.   
అంతర్జాలం అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వస్తున్న  మాయాజాలం. అయినా పుస్తకంలాగా  చేతితో ముట్టుకొని, ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని  సారం గ్రహించేందుకు వీలయే వాస్తవిక ప్రపంచం కాదు అది.  ఎవరైనా.. ఏమైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా.. ఏ హద్దులు, పరిమితులు, నిజ నిర్థారణలు, వడపోతలు గట్రా లేకుండా   ప్రామాణిక పరీక్షల ముందు నిలబడలేని సమాచారం అన్ని వర్గాల పాఠకులకు వయో లింగ భేదాలనేవేవీ లేకుండా అందుబాటులోకి తెచ్చేది ఈ జిత్తులమారి ‘వర్చ్యువల్’ ప్రపంచం. కల్లో.. కనికట్టో నిర్థారణ కాని విషయాల వల్ల మంచి ఎంతో.. హాని  అంతకు మించి. ఈ తరం ఆ నిజం ఎంత తొందరగా గ్రహిస్తే పుస్తకం మనుగడకు అంత మంచిది.
పుస్తకప్రపంచంలోనూ కొన్ని బెడదలు లేకపోలేదు. అయినా సరే.. ఫేసుబుక్కు కన్నా ఏ ఫేమస్ పర్శనాలిటీని గూర్చో చర్చించే బుక్కే పాఠకుడికి ఎక్కువ  ఉపయోగం.  చెడు పుస్తకం వడపోతలు, నిబంధనలు, పర్యవేక్షణలు, ట్టబద్ధమైన నియమాల అడ్డు గోడలు దూకుతూ ఆట్టే కాలం నిలబడేది కష్టం. కాలపరీక్షకు తట్టుకు నిలబడే విజ్ఞానానికే   పుస్తక రూపంలో చదువరి ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఎక్కువ. ఇంటర్నెట్ హోరెత్తించే  అగాధ సాగరమైతే.. గ్రంథలోకం హృదయాహ్లాదం కలిగించే   గందర్వ లోకం!
రోజంతా టీ.వీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లకే  మీదు కట్టే బలహీనత కట్టేసుకోవాలి పెద్దలు ముందు. వీలున్నంత మేరకు విలువైన  పుస్తక పఠనానికే సమయం కేటాయించాలి.  కన్నబిడ్డలకు తాము మార్గదర్శకులయినట్లే  మంచి పుస్తకం తమకు  సన్మార్గ సూచిక అని  పెద్దలు గుర్తించినప్పుడే  గత కాలం మాదిరి గ్రంథస్త జ్ఞానం పదహారు కళలతో పునః ప్రవర్థిల్లే అవకాశం.
ఇంటి పట్టున ఉండే అమ్మలక్కలక్కూడా ఇప్పుడు పుస్తకమంటే  ఎకసెక్కెమైపోయింది. అమ్మ, అమ్మమ్మల కాలంలో మాదిరి కనీసం ఓ వారపత్రికనైనా తిరగేసే ఓపిక బొత్తిగా కరువయింది అమ్మళ్లకు. కంటి సత్తువంతా ఎన్నటికీ ఎడతెగని ఏడుపు, పెడబొబ్బల   ధారావాహికాలే ధారపోతాయ! ఉన్న మానసిక వత్తిళ్లకు తోడు ఉపరి దైహిక వత్తిళ్లు అంటగట్టేవి టీవీ, మూవీ మంధరలు!   కొత్తగా నట్టింట చేరిన కంప్యూటరుతో సరికొత్త తుత్తర్లు. పద్దస్తమానం  చెవులు కొరికే స్మార్ట్ ఫోన్ దూరభారపు చుట్టంతో కాపురాలు కూల్చేసే దొంగచాటు ఛాటుల కన్నా.. కూలే కాపురాలను నిలబెట్టే పుస్తకాలే మిన్న కదా! అన్నుల మిన్నల కన్నులు తెరిపిడి పడితేనే  నట్టింటి పుస్తకాల గూటిలో  మళ్లీ రంగనాయకమ్మ స్వీట్ హోమ్ లు, బాపూ రమణల బుడుగులు, చక్రపాణిగారి చందమామ వెలుగులు!
పిల్లలు తప్పని సరిగా చదివే పాఠ్యపుస్తకాల సంగతి వేరు. ఇప్పటి ఘోషంతా వినోదంతో పాటు విజ్ఞానం, సంస్కారం, సాంఘిక దృష్టి, ప్రాపంచిక ఇంగింతం.. పెంపొందించే కాల్పనిక సాహిత్య పఠనం గురించే. అపూర్వ  పూర్వ వైభవాన్ని పరిచయం చేస్తూ.. దివ్యమైన బంగరు భవితవ్యం కోసమై వర్తమానంలో ప్రవర్తించవలసిన తీరుతెన్నులను గురువులా, స్నేహితుడిలా, తాత్వికుడిలా శాసించి, లాలించి, బోధించే సత్తాగలది  పుస్తకం ఒక్కటే! ఆ విశిష్టత నేటి తరాలకు తెలియచేసేదెవరు?
 ‘శ్రీవాణి వదనంలో నివాసమున్న వాడెన్నడూ దైన్యు డు కాలేడ’ని  శంకర భగవత్పాదులేనాడో భాష్యంలో చెప్పుకొచ్చారు. ఆ వాణీ ముఖ వాస్తవ్యుల  పుణ్య చరిత్రలు  మనకందించేవి పుస్తకాలే! మనిషి తనకు తానుగా తనకోసం తాను మనిషిగానే మెలగడానికి  తయారు చేసుకొన్న గొప్ప చమత్కార మార్గదర్శి  పుస్తకం.
చిన్నతనం నుంచే పుస్తకాన్ని పిల్లల జీవితంలో అంతర్భాగం చేయవలసిన బాధ్యత నిజానికి కన్నవారి మీదే ఎక్కువ ఉంటుంది.  భవిష్యత్తులో గొప్ప కలిమి  గడించాలన్న  అడియాసలో పడి బిడ్డల ఒడి నుంచి మంచి పుస్తకం వడలాగేసుకోడం మంచి పెంపకం అనిపించుకోదు.  తమంతట తాముగానే మంచి పుస్తకాలని  ఎంచుకొని  చదువుకొనే దిశగా పసిమనసులను ప్రోత్సహించవలసిన బాధ్యత వాస్తవానికి కన్న తల్లిదండ్రులకే అందరికన్నా ఎక్కువ సుమా!
విభిన్న రంగాలకు, రుచులకు చెందిన గ్రంథాలు వారి అంతరంగాలను అలరించే  తీరులో అందుబాటుకి తెచ్చినప్పుడే  కదా బాలలకు  వాటిపై  ఆసక్తి,  అభిరుచి  పెరిగే అవకాశం.  పుస్తకమే లోకంలా పిల్లలు ఎదగాలంటే ముందు ఇంటినే పుస్తకలోకంగా మార్చేయడమే మందు. 
భావి  జీవితం మీద ఓ స్పష్టమైన వైఖరి తీసుకొనే శక్తిసామర్థ్యాలను కల్పించేవి మంచి పుస్తకాలే. కన్నవారు,    అనుభవం పుష్కలంగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉంటారా? ఆ లోటు భర్తీ చేసే మంచి నేస్తాలే పుస్తకాలు. పుస్తక పఠనమంటే ఓ ఆటలా ఇంటిని ఆటల మైదానంలా తీర్చి దిద్దినప్పుడే పిల్లలలో క్రీడాస్ఫూర్తి పుంజుకునేది! ఎదర జీవితంలో ఎన్నైనా సవాళ్లుదురు కానీయండి.. తిరగబడి పోరాడే తత్వం పుస్తక పఠనం వల్లనే బాలల్లో గట్టిడేది.
పుస్తకాలు చదివే వాళ్లకు.. చదవని వాళ్లకు  సంస్కారంలో హస్తిమశకాంతరం తేడా. సయమానికి విలువ ఇవ్వడం. సమాజావగాహన కలిగి ఉండటం, సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడం, పరిష్కరించడంలో చురుకుదనం ప్రదర్శించడం,  తప్పులుంటే ఒప్పుకోవడం,  సరిదిద్దుకొనేందుకు సిద్ధంగా ఉండటం, విభిన్నంగా ఆలోచించడం, విశాల దృక్పథం కలిగి ఉండటం.. మంచి పుస్తకాలు విసృతంగా చదివే బుద్ధిజీవులకు సులభంగా పట్టుబడే సిద్ధవిద్యలు.
పుస్తకాల పండుగలు ఏటేటా రెండు తెలుగు రాష్ట్రాలలో కనుల పండువుగా జరుగుతూనే ఉంటాయి. తీరిక ఉన్నప్పుడు కాదు.. తీరిక చేసుకొని మరీ  పుస్తకాల కొలువులని  చిన్నా పెద్దా కలసి సందర్శించండి! కొన్నైనా మంచి పుస్తకాలు కొని  ఇంటికి తెచ్చుకోండి!  
మంచి పుస్తకం పైన మనసు లగ్నమవడానికి మంచి లగ్నం అవసరమా?  పుస్తక ప్రదర్శన  మహోత్సవ సందర్భమే ఈ శుభ మూహూర్తానికి నాంది! శుభం!


-కర్లపాలెం హనుమంతరావు

***
(సూర్య ఆదివారం కాలం - సరదాకే - 18 -01 -2020 )

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...