ప్రత్యేకమైన ఓర్పు, నేర్పు తప్పనిసరి. లేఖల శైలి విభిన్నంగా ఉండాలి. అంశం
అరుదైనది అయితే సంపాదకుడి దృష్టిని ఇట్టే పట్టేస్తుంది. ఉత్తర రచయిత
ప్రథమ పాఠకుడు పత్రికాసంపాదకుడే కదా!
ఉత్త ఉత్తరాలతో ఉద్ధరించేదేముంది? అనుకోవద్దు. ప్రియురాలు
అంగీకరిస్తుందనేనా ప్రియుడు రక్తంలో ముంచి మరీ తన ప్రేమను లేఖల మూలకంగా
తెలియపరచడం? లక్కుండడం ముఖ్యం! అది లేకుంటే ఎంత 'ఓ పాజిటివ్' గ్రూపు తో
గోడు వెళ్లబోసుకున్నా ఆ నెత్తురు చుక్కలు ఉత్తరంలోనే ఇంకిపోయేది.
పత్రికల ఉత్తరాల పంథా వేరు. వాస్తవ రచయితలు ఎవరో తెలియదు. వాస్తవంగా
ఎవరన్నా దృష్టి పెట్టి చదువుతున్నారా? అని అడిగినా సమాధానం తెలియదు.
వినవలసినవాళ్ళు ఆ విన్నపాలు వింటున్నారో.. నలిపి దిబ్బవతల
పారవేస్తున్నారో పట్టించుకోకుండా తెల్లటి ఉత్తరాన్ని నలుపు చెయ్యాలంటే
రాసే రచయిత చందమామ మార్కు విక్రమార్కుని వంశానికి చెందినవాడయి ఉండాలి.
మామూలు మహజర్లకు మల్లే కాదు.. పత్రికకు రాసే ఉత్తరాలల్లో కొన్ని
ప్రత్యేకమైన సౌకర్యాలూ కద్దు. ఎంత పెద్ద ట్రంపుతోనయినా.. పేకముక్కల
‘ట్రంపాట’ ఆడుకోవచ్చు. ఎదురుపడే ఛాన్సే లేని కొరియా మొం
ది కింగ్ కిమ్ తో అయినా సరే కుమ్ములాటకు దిగిపోవఛ్చు. మోదీ, షాలతో
తలమోదుకునేలాంటి తమాషాలు సామాన్యుడికి ఉత్తరాలతో మాత్రమే సాధ్యమయ్యే
సాహసం.
కొహ్లీకి జై కొట్టటానికైనా, ఉమ్రాన్ ఖాన్ ను 'ఛీఁ' కొట్టడానికైనా
ఉత్తరాలే గత్యంతరం ఎంత లావు అభిమానం, దురభిమానం పొంగిపొర్లిపోతున్నా!
తాడూ బొంగరం చేత లేకుండానే బాలచంద్రుణ్ని మించి ఎంతటివారి మీద
చెలరేగిపోవాలన్నా పత్రికలకు రాసే ఉత్తరాల వల్లే అది సాధ్యం. బిల్ గేట్స్
భుజం తట్టడానికి, కంప్యూటర్ సత్యాన్ని కసితీరా తిట్టడానికి కామన్ మ్యాన్
అనే సామాన్య ప్రాణికి ఉత్తరాలను మించిన మరో శక్తివంతమైన ఆయుధం ఏదీ లేదు
ఎంత ‘ఫైట్ ఫర్ జస్టిస్’ ఉద్యమం నడిచే ప్రజాస్వామ్యంలో అయినా?
పత్రికల్లో పడే ఉత్తరాలు ఎవరు చదువుతారన్న నిర్వేదం వద్దు.
ధృతరాష్ట్ట్రుడు వింటాడనేనా విదురుడు అంతలా ఆపకుండా సలహాలు
దంచికొట్టింది! స్వార్థం లేనిదే ఏ పని తలపెట్టడమైనా వ్యర్థమనుకునే ఈ
కలికాలంలో అయిదో పదో వదిలితేనేమి, కలంతో జాతి అంతరాత్మను నిద్రలేపి
తీరాలన్న పంతం పట్టడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. ఉత్తర రచయితలు
ఉత్తర కుమారులతో పోల్చడం పొరపాటు.
అచ్చు ముచ్చట నుంచి పుట్టుకొచ్చింది ఈ ఉత్తర రచనా వ్యాసంగం.
ప్రజాస్వామ్యానికి పిల్లార్స్(మూలస్తంభాలు).. పత్రికలవాళ్లకి ఈ ఉత్తరాలే
స్పేస్ ఫిల్లర్స్. ఎక్కడో ఇరాన్ సులేమాన్ ని అమెరికన్ దళాలు
మట్టుపెట్టేస్తే ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్రేనని.. అంతర్జాతీయ శాంతి
భద్రతల ఒప్పందాలకు విఘాతం కలిగించే దుస్సాహసానికి పూనుకుంటే చూస్తూ
ఊరుకోమని .. అనంతపురం జిల్లా మారుమూల పల్లె పాములపాడు నుంచి కూడా రంకెలు
వేసెయ్యగలగడం సామాన్యపౌరుడికి ఒక్క పత్రికలకు రాసే ఉత్తరాల ద్వారా
మాత్రమే పాజిబుల్.
శ్రీదేవి విదేశాలల్లో చనిపోతే ఆమె అభిమానులందరూ దుబాయ్ దాకా పోయి
భోరుమనలేరు కదా! పత్రికలవాళ్లే కాస్త పెద్ద మనసు చేసుకుని రెండు మూడు
వాక్యాలకు మించకుండా ప్రగాఢమైన శోకతప్త హృదయావేదనని వెళ్లబోసుకొనే
వెసులుబాటు తమ ఉత్తరాల శీర్షిక ద్వారా కల్పిస్తారు! ఇంట్లో కూర్చుని ఈత
ముంజెలు తింటూ కూడా సంతాప సూచకంగా ఈ-మెయిళ్లు పంపుకునే వెసులుబాటుఈ
పత్రికల ఉత్తరాల ప్రత్యేకత. ఈ-కాలంలో కూడా ఈ ఉత్తరాల కాలమ్ ప్రాధాన్యత
ఇంచ్ అయినా తగ్గకపోడానికి ఇదీ ఓ కారణమే!
క్రికెట్టాటలో కొహ్లీ సెంచరీ కొట్టినా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో
తెలుగుతేజం నామినేషన్ వేసినా, నాసా తయారీ వ్యోమనౌక శ్రీహరి కోట నుంచి
అంతరిక్షంలోకి దూసుకు వెళ్లినా.. కాలు బైటపెట్టకుండా కార్యక్రమ
నిర్వాహకులకు జైకొట్టవచ్చు.. అభినందనల మందారమాలలను అందించవచ్చు. ఆ
భాగ్యం కేవలం ఉత్తరాల శీర్షిక వల్లనే సామాన్యుడికి సాధ్యం.
పాఠకుల నాడి పట్టుకునేందుకు పత్రికలకూ ఈ ఉత్తరాలే ప్రధాన సాధనం.
మచ్చుక్కి కొన్ని పత్రికల్లో అచ్చయిన ఉత్తరాలను లోతుగా పరిశీలిస్తే
కాలానుగుణంగా లోకుల ఆలోచనలలో కలిగే మార్పు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో
అర్థమవుతుంది.
రోకళ్ల రామకృష్ణ అనే పాఠకుడు ఒక దినపత్రికకు రాయచూరు నుంచి రాస్తాడూ
'డివైడర్ల వంకతో నడిరోడ్డు మధ్యన కోటగోడలు కట్టేస్తున్నారు హైదరాబాదులో.
సికందరాబాదు నుంచి సంజీవయ్య పార్కు చేరాలంటే ట్యాంక్ బండ్ ఎక్కి
బుద్ధవిగ్రహం మీదుగా వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి రావాలి. కాలహరణం, చమురు
వృథా! బిజీ సమయాలల్లో .. కరువు కాలాలల్లో సామాన్యుడుకి భారం కదా!
పిల్లలు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు రోడ్డు దాటేందుకుగాను ప్రత్యేక
సహాయకబృందాలు ఏర్పాటు చెయ్యడం అవసరమని ప్రభుత్వానికి మనవి. సంబంధిత
అధికారులు సత్వరమే స్పందించాలి!'. అందరి మనసులలోని చింత దాదాపుగా అదే
ఉంటుంది! లేఖల కాలమే కనుక లేకపోయివుంటే ఉత్తిపుణ్యానికి గాలిలో
కలిసిపోయే చింతన కదా ఉత్తరాల రచయితలు నస్వార్థంగా పూనుకోకపోతే!
పత్రికలలోని ఉత్తరాల శీర్షికకు పలు కోణాల నుంచి బాణాలు
దూసుకొచ్చిపడుతుంటాయ్! యాభై పైసల చెల్లుబాటును గురించి కరీంనగర్ నుంచి
రమాకాంతరావు అనే పౌరుడు ఈ విధంగా వాపోతుయాడో ప్రాంతీయ సాయంకాలంపత్రికలో.
'ఐదు, పది, ఇరవై, పావలా బిళ్లలు కాలదోషం పట్టడానికి కారకులైన అజ్ఞాత
శక్తులే మళ్లీ ఇప్పుడు యాభై పైసల బిళ్ల చిల్లుగవ్వ విలువైనా చెయ్యవని
దుష్ప్రచారం మొదలుపెట్టాయి. యాభై నోటు, నకిలీది అయినా కళ్లకద్దుకుని
పుచ్చుకునేవాళ్ళే అసలు సిసలు యాభై పైసల బిళ్ల స్వీకరించడానికిమాత్రం
ఠలాయిస్తున్నారు. అర్థరూపాయి బిళ్లల చెలామణిపై పెద్ద ఎత్తున ఉద్యమం
చేపట్టాల్సిన అవసరం ఉంది. జాతికి చెందిన విలువైన వనరులతో ముద్రించే ఈ
చిల్లర బిళ్లలు ఇప్పటికే ముష్టివాళ్ల దృష్టిలో కూడా ముష్టిబిళ్లలుగా
మారిపోయాయి. మరింత నిర్లక్ష్యం ఈ తరహాలోనే గానీ కొనసాగే పక్షంలో తమ అంతిమ
యాత్రలలో చల్లేందుకు పాడె మీది శవాలు ఒప్పుకోని ప్రమాదం ముంచుకురావచ్చు.
ఏడాదికి ఒక్కసారి వచ్చే పసిబిడ్డల భోగిపళ్ల కోసరమని ఎంతని చిల్లర
పోగేసుక్కూర్చోడం? జేబు బరువు అన్న చిన్నచూపు తగదు. హారతి పళ్లెంలో యాభై
పైసలు పడంగానే గుడ్లు ఉరిమి చూసే గుడిపూజారుల మీద తక్షణమే ఆర్థికనేరాల
సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం..' ఎన్ని
రూపాయలు పోస్తే ఇంత పెద్ద లేఖ రాయడం అవుతుందో! అందునా పత్రికలకు!
ఇన్నిన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఏ ఒక్కటీ కరీంనగర్ వాసి
రమాకాంతరావుగారి మొర ఆలకించినట్లులేదు. యాభైపైసల బిళ్లలిప్పుడు కనీసం
పిల్లలు ‘బొమ్మా.. బొరుసా?’ ఆటాడుకునేందుకైనా కనిపించడం లేదు!
మాతృభాష మీద ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులను పక్షానికి ఒక పర్యాయం
నిరసిస్తూ మండిపడే టైపు ఉత్తరాలు ఎన్ని దశాబ్దాలు దాటినా రావడం ఆగడంలేదు
పత్రికలల్లో. మండపేట నుండి ఓ జ్వాలా శర్మ, తెలుగు భాషా పండితుడు;
హైయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్, నెలకు రెండు రౌండ్లు, పత్రిక మార్చి
పత్రికలో ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకిస్తూ మండిపడ్డం రివాజు. ' ‘తెలుగు
నేర్చుకోండ’ని చదువు రానివాళ్లను కూడా హడలుగొట్టే ప్రభుత్వాలు ముందు
'హుడా'ని 'హైనస' (హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ)గా ఎందుకు మార్చుకోవు?’
అని అయ్యవారి కలంవాత. శర్మగారి రాతలే తప్పించి తెలుగు భాష ‘తలరాత’లో
వీసమంతైనా మార్పు కనిపించడంలేదు. అది వేరే కత.
ఓపిక, తీరక ఉండాలి.. ఓ నెల రోజుల పత్ర్రికలు నానా రకాలవి
ముందేసుక్కూర్చున్నా చాలు ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని,
ప్రాంతాలను, ప్రజలను ఎన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయో ఇట్టే
తెలిసిపోతుంది. పాలిటిక్సు మీద వచ్చే రొటీన్ లేఖలు పక్కన పెట్టినా
ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న ప్రమాదం మీద కనీసం ఓ అయిదారు ఆందోళనకరమైన
ఉత్తరాలు కంపల్సరీగా దర్శనమిస్తాతయి! వాతావరణ కాలుష్యాల మీద వారానికి
కనీసం ఒకటైనా హెచ్చరికలతో కూడిన లేఖ తప్పనిసరి. ప్రభుత్వ రంగ సంస్థల్లో
జరిగే అవినీతి, బ్యాంకులవారు విధుల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరుల
మీద నిప్పులు కక్కే ఉత్తరాలు తప్పనిసరిగా నాలుగయిదుకు తగ్గకుండా ఉండకపోతే
ఒట్టు. జాతి విలువలు పడిపోతున్నాయని, దేశభక్తి గణనీయంగా తగ్గిపోతోందని,
విద్య వ్యాపారమయమైపోయి సామాన్యుడికి అందని ద్రాక్షగా తయారవుతుందనే టైపు
ఏడుపుగొట్టు లేఖలు రోజు మార్చి రోజు ఏదో ఓ పత్రికలో గ్యారంటీగా
కనిపిస్తుంటాయి.
మద్యాన్ని బహిష్కరించాలని గర్జించే లేఖల సంగరి ఇహ సరే సరి!
అచ్చువేయని పక్షంలో ప్రజాపక్షంగా తాము పనిచేస్తున్నట్లు మరో రుజువు
చూపించి నమ్మించడం కష్టమని పత్రికలు భావించే అన్ని రకాల అంశాల పైన
అంకుశాల వంటి లేఖాస్త్రాలు సంపాదకుకుల పేజీలలో సంధింపడే రోజులు ఇప్పడివి.
ఉత్తరాల రచయితలను ఉత్త రాలుగాయి సరుకుగా భావించరాదని భావించే
ప్రజాస్వామ్య పంథా కదా ప్రస్తుతం నడుస్తున్నట్లు కనిపిస్తున్నది!
ఎక్కణ్ణుంచి ఓ ఉత్తరం ముక్కయినా రాని పక్షంలో 'ఎన్నార్సీ చట్టం అందరి
కోసమా.. కొందరి కోసమా?’ అంటూ ఏదో ఓ సందర్భం చూసుకుని పెద్దక్షరాలతో ఓ
బుల్లి ఉత్తరం పత్రికలే బనాయిస్తాయని వాదు. జనాభిప్రాయం తీర్చి
దిద్దడంలో తమ వంతు పాత్ర సక్రమంగా నిర్వహిస్తున్నట్లు అచ్చుపత్రికలు
రుజూ చూపించుకునేవీ ఈ ఉత్తరాల శీర్షిక ద్వారానే కదా! సర్క్యులేషన్లో
గొప్ప మార్పేమీ లేకపోవచ్చును. కానీ ‘లేఖల కాలమ్’ అంటూ ఒకటి ఏ మూలో లేని
పక్షంలో సంపాదక పుట వన్ సైడెడ్ లవ్ లెటర్స్ కట్ట తరహాలో వండేసిన
వంటకాలన్న అన్న నిజం భైట పడుతుందని పత్రికల బెంగ!
ఫ్లోరోసిస్ ఇస్యూల మీద ఇస్సులుతొక్కే ఉత్తరాలు ఇప్పట్లా కాకుండా గత
దశాబ్దిలో చాలా పెద్ద ఎత్తునే పత్రికల్లో వస్తుండేవి. ఆ దిశగా
లేఖాసాహిత్యం ఒక్కసారిగా సద్దుమణగడానికి ఉల్లేఖించలేని కారణాలు ఏవో
ఉండుంటాయి! కానీ పాలకులు తమ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. ‘ఏలికల మొండి
వైఖరి కారణంగా జనంలో ఆవరించిన నిస్సత్తువ’ని సహజంగానే ప్రతిపక్షాలు
కసురుతుంటాయి. కసుర్లకయినా, విసుర్లకయినా అడ్రస్ లేని మనిషికి మాత్రం
పత్రికల లెటర్స్ మాత్రమే గతి. ప్రజాస్వామ్యం ఉండి, ప్రజలకు గొంతున్నంత
ఎయిడ్స్, ధూమపానం, సెల్ దుర్వినియోగం, పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు,
పరీక్షల తేదీలు, పండుగ ముహర్తాలు, అరకొర రవాణా సౌకర్యాలు, రైళ్ళ
రాకపోకడులు, వేళకు రాని ఎరువులు, కల్తీ విత్తనాలు, కృత్రిమ మార్గాలలలో
పదార్థాలు మాగబెట్టడం, ధర్మాసుపత్రుల్లో వైద్యుల కొరత, రేషను దుకాణాల
సరుకు సరఫరా, పరీక్షల తేదీలు, మూల్యాంకనాల మీద శంకలు, ఫలితాల పైన
అయోమయాలు, పభుత్వోద్యోగుల జీత భత్యాలు, రాని సర్కారు మార్కు కొలువులు,
అచ్చు కాని పాఠ్యపుస్తకాలు, అచ్చయినా వాటిలోఅడుగడుగునా కనిపించే దోషాలు..
ఒహటనేమిటి.. ఏరువాకల వేళలకు రుతుపవనాల రాక ఆలస్యం నుంచి, ఏరు గట్లు తెగి
నీరు ఊళ్ల మీదకొచ్చిపడే వరకు పత్రిక ఉత్తరాల రచయితలు టచ్ చెయ్యని టాపిక్
అంటూ దాదాపు భూమ్మీద ఏదీ ఉండదు. కామారెడ్డిగూడెంలో కండోమ్స్ సమస్యను
గురించి స్వామి బ్రహ్మానందస్వామి పేరుతో ఓ ప్రముఖ పత్ర్రికలో ఉత్తరం
అచ్చయిందంటే.. లేఖలకు పత్రికలలో ఉండే ప్రాథాన్యత ఎంతటిదో ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదిహ.
మరీ ఆకాశరామన్న ఉత్తరాలకు అచ్చుపత్రికలలో అవకాశం దక్కకపోవచ్చు. కానీ,
ఆకాశ పురాణాలు ఏవైనా విశదంగా వివరించి మరీ తిట్టిపోసే ఛాన్స్ పత్రికలలో
ఒక్క ఉత్తరాల రచయితలకే సొంతం. ఎవరెన్ని విమర్శలైనా చేసుకోనీయండి.. ఓషో
భక్తి ఉద్యమం నుంచి ఓజోన్ పొర చిరుగుడు వరకు పత్రికా లేఖకులకు పనికిరాని
అంశం అంటూ భూమండలం మీద ఏదీ ఉండదు.
ఉత్తరాల శీర్షికే కదా అని పుట తిప్పి పారేయద్దు! ఆస్వాదించగల మనసుండాలే
కానీ లేఖా సాహిత్యంలో లేని రసం ఉండదు. రాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డూ
ఆపూ లేకుండా సాగే అక్రమ ఇసుక రవాణా వ్యాపారం వద్దని గోదావరిఖని నుంచి
ముకుందరావనే మేధావి ఉత్తరం ద్వారా ఎంత ఆర్ద్రంగా ఆక్రోశిస్తున్నాడో!
'.. ఇసుక లారీల విచ్చలవిడితనాన్ని అరికట్టమని ఎన్ని ఏళ్ల బట్టో సంబంధిత
అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నాం. చూద్దాం అన్న ఆ పెద్దలే ఇప్పుడు
గుత్తేదారులతో కుమ్మక్కై జనం కళ్లల్లో దుమ్ము కొడుతున్నారు, బంగారం లాంటి
చెరువు ఇసుక! పరాయి రాష్ట్రాలకు తరలిపోతుంటే గుండె చెరువైపోతున్నది. ఈ
కుతంత్రాలకు ఇక ముందైనా అడ్డుకట్ట వెయ్యకపోతే గోదావరిఖని వాసులకు సెంటు
భూమి మిగలదు. నీరే తప్ప భూమిలేని జనానికి నిలువునా గోదావరిలో
మునకేయటమొక్కటే నిఖార్సుగా మిగిలిపోయిన పని ఇక..' ఒక్కయిదు వాక్యాల
ఉత్తరంలో ఎన్నేసి కవిసమయాలు! ప్రధానాంశం పక్కదారి పట్టినా ఉత్తరం తాలూకు
సాహితీ సౌరభాలను శిరసున ధరించక తప్పదు.. కదా!
పెట్టే శీర్షికలు కూడా ఉత్తేకరంగా ఉండటం ఉత్తరాల పెట్టె మరో కొత్త
విశేషం. అంత పెద్ద పుటలో ఇంత బుల్లి బాక్సు చదువరుల దృష్టిని చటుక్కున
ఆకర్షించడమంటే వట్టి మాటలతో అయ్యే పని కాదు. అందుకోసమై శీర్షికల చేత
శీర్షాసనం వేయించయినా సరే ఏదో ఓ కొత్త ఆకర్షణ రాబట్టడం అవసరం. వందేమాతరం
జాతీయగీతం సార్వజనీనతను గూర్చిరచ్చ నడిచే రోజుల్లో అత్యధిక సర్క్యులేషన్
గల ప్రముఖ పత్రికలోని ఓ ఉత్తరం వేసిన శీర్షాసనం 'వందేమాతరం ఆందోళనలకు
అంత మందా హాజరు?! వంద ఏ మాత్ర్రం?' ఆ ఉత్తరం మకుటం పుట్టించిన మంటల
సంగతి ఇహ ప్రత్యేకంగా చెప్పాలా?
ఉత్తరాల రచయితలను తక్కువ చేసే ఉద్దేశం బొత్తిగా లేదని మనవి. అదుపు
లేకుండా పెరుగుతున్న అపరాల ధరల నుంచి, కుదుపులే తప్పించి నిలకడ మరచిన
స్టాక్ మార్కెట్ల షేర్ల వరకు ఎక్కడా సామాన్య మానవుడికి ఊపిరి సలపనీయని
రోజులివి. ఉపశమనం కోసం హాస్య చిత్రాలు చూద్దామన్నా
ఏడుపులొచ్చేస్తున్నాయి. మండే ఎండలు, ఇంగ్లీషు బళ్ళు, నిర్భయ కేసులు, రచ్చ
ఎన్నికలు, రౌడీ రాజకీయాలు! కొత్తగా తత్తర పుట్టిచ్చేస్తున్న మహమ్మారి ఈ
కరోనా వైరస్ కోవిడ్-పంథొమ్మిదులు! ఇన్ని దుఃఖాల మధ్యన ఎన్ని
పారాసిటమాల్ బిళ్లలు కడుపులో పడినా ఫలితమేముంటుందని?
కర్ఫ్యూలు, లాక్డౌన్లు, స్కూళ్ల మూతలు! కళ్లు మూతలేసుకొని ఎన్ని గంటలని
ఇట్లా కాళ్లాడిస్తూ కుళ్లు టీవీలోకి చూస్తూ జుత్తు పీక్కోడం! ముక్కూ
మూతీ, నోరు చెవులూ సర్వం ముసుక్కూర్చోక తప్పదని వైద్యనారాయణల అంత గట్టిగా
హెచ్చరించినాక .. చేసే ఘనకార్యం మాత్రం ఇంకేముంది గనక?
అందుకే.. దాచుకున్న పాత పత్రికలు కొన్ని అటక మీద అట్లాగే మిగులుంటే
భద్రంగా కిందకి దించింది! డేటొక్కటి మార్చుకుంటే చాలు సుమా! దశాబ్దాల
కిందటి ఆ పాత పత్రికల ఉత్తరాల పురాణాలే చిన్ని చిన్ని మార్పులతో
ఇప్పటికీనూ! దిక్కుమాలిన కరోనా వైరస్ బెంగ నుంచి దృష్టి మళ్లించుకొనే
ప్రయత్నంలో భాగంగా ఉల్లాసం కలిగించే ఈ పత్రికల ఉత్తరాల సాహిత్యాన్ని
ఆశ్రయించడం ఉత్తమ మార్గం!
కుటుంబానికి పిల్లలు ఒక్కరు చాలా.. ఇద్దరు కావాలా? అన్న అంశం పైన
పార్లమెంటులో తీవ్రంగా చర్చ నలిగే రోజులవి. ‘పాలకపక్షం నుంచి గౌరవనీయులు
శ్రీ వాజ్పాయిజీ, ప్రతిపక్షం నుంచి గౌరవనీయురాలు శ్రీమతి సోనియా
గాంధీజీ ఏకాభిప్రాయానికి వస్తే కుటుంబ నియంత్ర్రణ ఏమంత సాధ్యం కాని
కార్యం కాదు గదా?' అని చీపురుపల్లి నుంచి పీపాల పాపారావానే సామాజిక
చించనాపరుడు చేసిన లోతైన సూచన ఓ ప్రముఖ దినపత్రిక లేఖల కాలమ్ లో
కనిపించింది! ఉల్లాసంగా ఉండదా మరి? ఈ తరహా ఇంచక్కని హాస్యరసం చిప్పిల్లే
ఉత్తరాలే అలసిన మనసులకు ఉపశమనం కలిగించేది!
ప్రజా సమస్యలకు ఫలితాలు రాబట్టడంతో నిమిత్తం పెట్టుకోకుండా కష్టకాలంలో
కూడా కష్టపడి ఉన్న విలువైన సమయాన్ని, ధన్నాని వెచ్చించి మరీ
వార్తాపత్రికల ద్వారా జాతిని జాగృతం చేసే ప్రయాస నిరంతరాయంగా
చేస్తోన్నందుకు వార్తాపత్ర్రికల లేఖారచయిత గణాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
తెలుపుకునే సంకల్పమే ఈ సరదా వ్యాసం వెనుక ఉన్న ఉద్దేశం. ఉత్తపుణ్యానికి
ఉత్తర కుమారులు నొచ్చుకోవద్దని ప్రార్థనేం!
'
=కర్లపాలెం హనుమంతరావు
బోథెల్; యా