Saturday, September 19, 2020

వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ

 



వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. వయో వృద్ధుల జీవన ప్రమాణాలను పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానం  మెరుగుపరుస్తుందన్న మాట నిజం. ఆరంభంలో అలవాటు లేని అవుపాసనలా అనిపిస్తుంది; మాలిమి చేసుకున్న కొద్దీ వయసు వాటారే వృద్ధులకు  అదే ఊతకర్రకు మించి మంచి తోడు అవుతుంది.

గడచిన ఒకటిన్నర శతాబ్ద కాలంగా మానవ జీవనస్థితిగతుల్లో కనిపించే గణనీఉయమైన మెరుగుదల హర్షణీయం. అందుకు కారణం  పారిశుధ్యం పైన మునపటి కన్నా పెరిగిన శ్రద్ధ; అదనంగా నాణ్యమైన వైద్య సంరక్షణ.  మానవ  ఆయుర్దాయం  క్రమంగా పెరగడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలలో కూడా ప్రస్ఫుటంగా కనిస్తుందిప్పుడు.

విశ్వవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలంలో  చెప్పుకోదగ్గ పెరుగుదల కొత్త శతాబ్దం నుండి ఆరంభయింది. 2016 మధ్య వరకు దొరుకుతున్న లెక్కల ప్రకారం ఈ పెరుగుదల ఐదు సంవత్సరాల ఐదు నెలలు. గత శతాబ్ది ’60 ల తరువాత నమోదైన  అత్యంత వేగవంతమైన పెరుగుదలలో ఇదే గరిష్టం. దేశ జాతీయ గణాంకాలు ఇంతకు మించి ఘనంగా మోతెక్కడం మరో విశేషం.  నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 రికార్డులు చూసుకుంటే, భారతదేశంలో ఆయుష్షు  ప్రమాణం ‘70-‘75లలో 49 సంవత్సరాల ఏడు నెలలుగా ఉంటే, అదే జీవితకాలం 2012-2016ల మధ్యలో  ఏకంగా 68.7 సంవత్సరాలకు ఎగబాకింది. ఇంత పెరుగుదల వల్ల  తేలిన పరిణామం ఏమిటంటే,    జాతీయ జనాభా మొత్తంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరగడం! ఇవాళ దేశ జనాభాలో వయోవృద్ధుల వాటా ఒక బలమైన స్వతంత్ర వర్గంగా తయారయింది.  సమాజంలోని ముఖ్యాంగాలలో ఒకటిగా లెక్కించక తప్పని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానమూ  అనూహ్యమైన వేగంతో అభివృద్ధి పథంలో  దూసుకురావడం..  అదృష్టం.

 

ఆధునిక సాంకేతిక జ్ఞానం సాయం లేకుండా  రోజువారీ దినచర్య క్షణం ముందుకు సాగని పరిస్థితులు ఇప్పడున్నవి. అంతర్జాల పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేసే ఉపకరణలు(యాప్స్)  ఉనికిలో లేనట్లయితే ప్రపంచానికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం కష్టమే! సాంకేతికత సాయం వినా  కోవిడ్- 19 వంటి  మహమ్మారులు ఇప్పుడు సృష్టించే  లాక్-డౌన్లు, ఐసొలేషన్  ఉపద్రవాలను  ఏ విధంగా తట్టుకోవడం?

 

ఉత్పాతాలు ఒక్కటనే కాదు, మహమ్మారులు జడలు విదల్చని ముందు కాలంలో కూడా మనిషి జీవితంలో సాంకేతిక అనివార్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం ఆధారంగా మెరుగయ్యే  జీవనశైలి పైన మారుమూల పల్లెజీవి కూడా మోజుపడే తరుణం ఒకటుంది. అయినా సాంకేతిక రంగ సంబంధిత మార్కెట్  అన్ని రిస్కులు ఎందుకు ఎందుర్కొంటున్నట్లు? క్షణక్షణం మారే ఆ సాంకేతిక పరిజ్ఞానం సృష్టించే అనిశ్చిత వాతావరణమే అందుకు ప్రధాన కారణం.  రైడ్‌-ఆన్-కాల్  సౌకర్యం అందించే ఉపకరణలు ముమ్మరం అయిన తరువాత మధ్యతరగతివారి కార్ల కొనుగోళ్ల వాటా అథఃపాతాళానికి అణగిపోవడమే అందుకు ఉదాహరణ! వంటిఆరోగ్యం నుంచి ఇంటిపనుల వరకు అన్నింటా టెక్నాలజీ నీళ్లలో పాలలా కలగలసిపోయి ఉన్న నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం వయసు మళ్లినవాళ్లకు వాస్తవంగా ఒక గొప్ప వరం కావాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అందుకు విభిన్నంగా ఉన్నాయి. అదీ విచిత్రం!

 

గడప దాటి  కాలు బైటపెట్టలేని వయోవృద్ధులకు  కుటుంబ సభ్యుల నిరంతర సేవలు ఎల్లవేళలా  లభ్యమయ్యే కాలం కాదు ఇప్పటిది.  ఇంటి పట్టున ఒంటిగా మిగిలుండే వృద్ధులకు అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ నిజానికి ఎంతో అండగా ఉండాలి.  కానీ,  పాతకాలపు ఆలోచనలు ఒక పట్టాన  వదలుకోలేని ముసలివాళ్ల సంశయాత్మక మానసిక బలహీనత సాంకేతిక పరిజ్ఞాన పరిపూర్ణ  వినియోగానికి అవరోధంగా మారుతున్నది.   మొబైల్ అంటే కేవలం టెక్స్టింగ్ మాత్రం చేసుకునే ఓ చేతిఫోన్ సౌకర్యం.. అనుకునే తాతా అవ్వలే జాస్తిగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పటికీ. యాప్ లంటే కుర్రకారు ఆడుకుందుకు తయారయ్యే ఏదో ఫోన్ సరదాలని గట్టిగా నమ్మినంత కాలం టెక్ ఆధారిత  వేదికలను నమ్మి ఆమ్మమ్మలు, తాతయ్యలు గాడ్గెట్లను నిత్యజీవితావసరాలకు ధీమాగా వాడటం  కల్ల. వయసు పైబడినవారిలో  టెక్నాలజీ మీద ఉండే అపనమ్మకం ఎట్లా తొలగించాలన్నదే ఈనాటి టెక్ మార్కెట్లను తొలిచేస్తున్న ప్రధాన సమస్య. 

 

కాలిఫోర్నియా శాన్డియాగో విశ్వవిద్యాలయం ల్యాబ్ డిజైనర్  షెంగ్జీ వాంగ్ ఇటీవల వయసు వాటారిన వాళ్ల మీద సాంకేతిక పరిజ్ఞానం చూపించే ప్రభావాన్ని గురించి ఓ పరిశోధన పత్రం వెలువరించాడు.  పదే పదే ఎదురయ్యే పలు సందేహాలకు సులభంగా సమాధానాలు రాబట్టే సౌలభ్యం తెలీకనే సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొత్త టెక్ అంటే చిరాకుపడతారన్నది  షెంగ్జీ వాంగ్  థియరీ. ఇటు ఉత్సుకత ఉన్న ముసలివాళ్లనైనా  ప్రోత్సహించనీయని చిక్కుముళ్లు అనేకం  పోగుపడటమే వృద్ధజనం ఆధునిక సాంకేతికత వాడకానికి ప్రధానమైన అడ్డంకి అని కూడా అతగాడు తేల్చేశాడు.

 

తరచుగా మారిపోయే అప్ డేట్స్, తత్సంబంధమైన మార్పులు చేర్పులు పెద్దవయసువారికి ఒక పట్టాన అర్థం కావు.    ఉదాహరణకు,  ‘బటన్స్’ ఒక క్రమంలో నొక్కి కోరుకున్న సేవలు పొందటం అలవాటు పడ్డ తరువాత, అవే సేవల  కోసం ఆవిష్కరించిన మరో కొత్త ‘బటన్ లెస్’ విధానం మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడం వృద్ధుల దృష్టిలో  విసుగు పుట్టించే వృథా ప్రయాస. ఒక వయసు దాటినవారి మానసిక ఏకాగ్రతలో వచ్చే సహజ మార్పులను పరిగణనలోకి తీసుకోని పక్షంలో అధునాతన  విజ్ఞానం ఎంత ఘనంగా పురులు విప్పి ఆడినా పెద్దలకు ఆ భంగిమల వల్ల ఒనగూడే లాభాలు ఒట్టిపోయిన గోవు పొదుగు పిండిన చందమే.  గొప్ప సాంకేతిక విజయంగా నేటి తరం భావిస్తున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పెద్దలను ఇప్పటికీ జయించలేని ఒక మాహా మాయామృగంగానే భయపెట్టేస్తోంది. కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడపే   వయసులో మొరటు మృగాలతో పోరాటాలంటే ఏ ముసలిమనిషికైనా ఉబలాటం  ఎందుకుంటుంది?!

 

పొద్దస్తమానం కొత్త కొత్త పాస్ వర్డ్స్ ఎన్నో పరిమితులకు లోబడి నిర్మిస్తేనే తప్ప  సేవలు అందించని యాప్ లు వయసు మళ్లినవాళ్ల దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క.  జ్ఞాపకశక్తి, నిర్మించే నైపుణ్యం సహజంగానే తరిగిపోయే ముసలివగ్గులకు ఈ తరహా పాస్ వర్డ్ ‘ఇంపోజిషన్స్’ శిక్ష దాటరాని ఆడ్డంకిగా తయారవుతున్నది. లాగిన్ కాకుండా ఏ సేవా లభించని నేపథ్యంలో అన్ని వెబ్ కాతాలకు ఒకే తరహా లాగిన్ ఉంటే  వృద్ధజనాలకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుంది. ఆ తరహా వెసులుబాటుకు గూగుల్ వంటి పోర్టల్సు ఒప్పుకుంటున్నా, సెక్యూరిటీ కారణాలు అవీ ఇవీ చెప్పి   చుక్కలు చూపించే అప్రమత్తత వాటిది. దిక్కులు చూస్తూ కూర్చునే దానికా    వేలు పోసి  స్మార్ట్ ఫోనులు పెద్దలు కొని ఒళ్లో పెట్టుకొనేదీ! ఎన్నో రకాల అంతర్జాల వేదికలు(ఇంటార్నెట్ ఫ్లాట్ ఫారమ్స్)! అంతకు వంద రెట్లు అయోమయ ఉపకరణలు(యాప్స్)! ఒక్కో  అంతర్జాల కాతా కు ఒక్కో తరహా నియమ నిబంధనలు! సాంకేతిక సంక్లిష్టత   కురుక్షేత్ర యుద్ధం నాటి అభిమన్యుడి సంకట స్థితి తెచ్చిపెడుతుంటే, తాజా టెక్నాలజీ వల్ల వృద్ధజనాలకు ఒనగూడే  ప్రయోజనం ఏమిటన్నది జవాబు దొరకని ప్రశ్నయింది. 

 

కొత్త టెక్నాలజీ హంగూ ఆర్భాటంగా రంగ ప్రవేశం చేసేది  ముసలితరంగా తమను  మరంత వంటరి చేసేందుకే అని పెద్దలు భావించడం మొదలయితే  నూతన సాంకేతిక పరిజ్ఞాన వికాసం మౌలిక లక్ష్యమే సమూలంగా దెబ్బతిన్నట్లు లెక్క.  కనీసం డబ్బు చింత లేని పెద్దవారికైనా..  ఆధునిక   సాధనాలతో   ఆ దివి  సదుపాయాలన్నీ భువి మీదకు  దింపుతామనే హామీ  అత్యాధునికమని చెప్పుకునే లేటెస్ట్ టెక్ నిలుపుకుంటుందా?  మనవళ్ల, మనవరాళ్ళ తరం మాదిరి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే కదా ఏ ఆధునిక  పరిజ్ఞానం వాడకం వైపుకైనా అవ్వాతాతల ఆసక్తులు రవ్వంతైనా మళ్లేది!  అట్లాగని సైబర్ నేరాలతో  రాజీపడిపొమ్మని కాదూ.. అర్థం.

 

తప్పేమన్నా జరిగిపోతుందేమోనన్న భయం  పెద్దవయస్కుల్లో  ఎక్కువ మందిని  స్మార్ట్ ఫోన్  రిస్క్ తీసుకోనివ్వడంలేదు. ఈ కాలంలో పసిపిల్లలు సైతం అతి సులువుగా  ఆడేస్తున్న  విసిఆర్ రిమోట్..  ముందు తరాన్ని విధంగానే మహా బెదరగొట్టింది. వాస్తవానికి టచ్,  వాయిస్ వంటి సదుపాయాలతో సీనియర్ సిటిజన్లు అద్భుతమైన సేవలు అందుకునే సౌలభ్యం మెండు. హై- టెక్’ అద్భుత దీపంతో  పని చేయించుకునే సులువు సూత్రం ముందు ముసలితరం అల్లావుద్దీన్ తరహాలో స్వాధీనపరుచుకోవాలి.  మొబైళ్లూ, యాప్ ల నిర్మాతలే, టి.వి అమ్మకాల పద్ధతిలో డోర్ స్టెప్ డెమో సర్వీసులు అందించైనా అందుకు పాతతరాన్ని  సిద్ధం చేసుకోవాలి. ఒకే రకం సేవలకు పది రకాల పరికరాలతో ముసలి మనసులను మయసభలుగా మార్చకుండా సీనియర్లే  తమ  అవసరాలు, అభిరుచులకు  తగ్గట్లుగా ప్రత్యేక ఉపకరణాలు  స్వంతంగా ఎంచుకునే తీరులో ఈ శిక్షణా పరంపరలు కొనసాగాలి. పాతతరానికి  కొత్త నైపుణ్యాలు నేర్పించడంలోనే ఆధునిక టెక్నాలజీ విజయ రహస్యమంతా ఇమిడి వుందన్నముఖ్య సూత్రం మరుగున పడటం వల్లే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధుల విషయంలో పేరుకు మాత్రమే కాళ్లున్నా కదలలేని కుర్చీలా కేవలం అలంకారప్రాయంగా ఆర్భాటం చేస్తున్నది.

ఖర్చులకు రొక్కం కావాలన్నా కాళ్లు పీకేటట్లు బ్యాంకుల ముందు పడిగాపులు తప్పని కాలం ఒకప్పడిది. తపాలా కార్యాలయానికి వెళ్లి కార్డు ముక్క గిలకనిదే   అయినవాళ్ల సమాచారం అందే  పరిస్థితి లేదు అప్పట్లో! మరి ఈ తరహా  తిప్పలన్నిటినీ తప్పించేటందుకే  నెట్ బ్యాంకింగొచ్చిందన్నారు; ఈ మెయిలింగొచ్చి గొప్ప మార్పులు తెచ్చిందన్నారు!   ఇంటి  కిరాణా సరుకు నుంచి బైటకు వెళ్ల దలిస్తే  కావలసిన రవాణా సౌకర్యం వరకు,  సమస్త సర్వీసులు దబాయించి నొక్కే బటన్ కిందనే దాగి ఉండే స్మార్ట్ ఫోన్ సీజన్లో లోకం ఊగిపోతుందంటున్నారు! ఏమేమి సేవలు వచ్చాయో, ఎవరిని మెప్పించే ఏ మహా గొప్ప మార్పులు తెచ్చి ఊపేస్తున్నాయో!?  చురుకుపాలు తగ్గిన పెద్దవాళ్ల అవసరాల గొంగడి మాత్రం ఎక్కడ వేసింది అక్కదే పడి ఉందన్న అపవాదు మాత్రం తాజా టెక్నాలజీ మూటకట్టుకుంటున్న మాట  నిజం. ‘అయ్యో! ఐ-ఫోనుతో పనా ?  అయ్యేదా పొయ్యేదా నాయనా?’ అన్నముసిలివాళ్ల పాత  నసుగుడే  సర్వత్రా ఇప్పటికీ వినవస్తున్నదంటే.. లోపం ఎక్కడుందో లోతుగా తరచిచూసుకొనే తరుణం తన్నుకొచ్చిందనే అర్థం!   

వయసు మీద పడే కొద్దీ పంచేద్రియాల పటుత్వం  తగ్గడం సహజం. సౌలభ్యం ఒక్కటే  కాదు, పనిసులువూ పెద్దల దృష్టిలో అందుకే ప్రధానంగా ఉంటుంది! రవాణా, ఆరోగ్య సంరక్షణల వంటి ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలలో పెద్దవయస్కులకు మద్దతు ఇచ్చే తేలికపాటి డిజైన్ల పైన దృష్టి పెట్టాలి. టచ్ బటన్ టెక్నాలజీలో గొప్ప సేవాభావం ఉంటే ఉండవచ్చు. కానీ, ముందుతరం అతి కష్టం మీద అలవాటు పడ్డబటన్సిస్టమ్  పూర్తిగా తొలగిస్తే ఎంతస్మార్ట్అయివుండీ పెద్దలకు వనగూడే ప్రయోజనం మళ్లీ ప్రశ్నార్థకమే అవుతుంది కదా! విసిగించకుండా, కంటిని, వంటిని అతిగా  శ్రమపెట్టకుండా సేవలు  అందించే ఉపకరణాలు  ఉపయోగంలోకి  తెచ్చినప్పుడే సీనియర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మీద మోజు మొదలయేది. వాడకం  పెరిగేది. కోరకుండానే సాయానికి రావడం, ఆపరేషన్ పరంగా తప్పు జరిగినా ఆంతర్యం గ్రహించి సేవలు చేయడం, వేళకు మందులు మాకులు, తిండి తిప్పల వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండి ఆత్మీయంగా సేవలు అందించడం వంటి సామాజిక కార్యకర్తల బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులను మించి శ్రద్ధగా నిర్వహించే  సాంకేతిక పరిజ్ఞానం సాకారమయిన రోజే  సినియర్ సిటిజన్ల మార్కెట్టూ స్మార్ట్ టెక్నాలజీ రంగం బ్యాలెన్స్ షీటులో క్రెడిట్ సైడుకు వచ్చిపడేది.    వయసు వాటారిన వారి స్మార్ట్ టెక్నాలజీ వాటా  మార్కెట్లో మరంత పుంజుకున్నప్పుడే అటు సీనియర్ సిటిజన్ల సంక్షేమం, ఇటు ఆర్థిక రంగ పునరుజ్జీవం  సమాంతరంగా ముందుకుసాగేది.

వృద్ధాప్యానికి మద్దతు ఇచ్చే బాధ్యత సమాజం మొత్తానిది. మొబైల్ కంపెనీలు ముసలివారి ప్రత్యేక అవసరాల కోసం ఉపకరణలు తయారు చేయడమే కాదు, అదనంగా ధరవరలలోనూ ప్రత్యేక రాయితీలు కల్పించాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా  నిర్దిష్ట ప్రచారాలను ముమ్మరం చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి.  సరసమైన ధరకు నాణ్యమైన వైఫై అంతరాయం లేకుండా అందుబాటులో ఉన్నప్పుడే  పెద్దవయసువారి అడుగులు ప్రధాన సాంకేతిక స్రవంతి వైపుకు నిమ్మళంగా పడే అవకాశం.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు దాదాపు విచ్ఛిన్న దశకు చేరి దశాబ్ద కాలం దాటిపోయిన మన దేశంలో పెద్దవయస్కుల  పట్ల పిన్నవారి ప్రేమానురాగాల ప్రదర్శనల్లోనూ పెనుమార్పులు తప్పటంలేదు. కాలం తెచ్చే మార్పులను మనస్ఫూర్తిగా అంగీకరించడం మినహా మరో ఐచ్ఛికం లేని నేపథ్యంలో.. సమాజం తీరును   వేలెత్తి చూపే కన్నా    వేలు కింది బటన్ నొక్కడం ద్వారా  కుటుంబానికి మించి  సమాజం అందించే సేవా సౌకర్యాలు అనుభవించడమే కుటుంబాలలోని పెద్దలకూ మేలు. వృత్తి వత్తిళ్ల మధ్యనే  వీలయినంత శ్రద్ధ తీసుకుని కన్నబిడ్డలు, దగ్గరి బంధువులే ఇంటిపెద్దలను నవీన టెక్నాలజీకి దగ్గర చేయడం తక్షణావసరం.

***

--కర్లపాలెం హనుమంతరావు






 

 

 

Monday, September 14, 2020

ధర్మ మార్గమే ధ్యేయంగా నడిచిన మనుషుల కథ మట్టి మనుషులు(శ్రీమతి తాతినేని వనజ విశ్లేషణ)- పురిపండావారి అనువాద నవల


 శ్రీ పురిపండా అప్పలస్వామి అనువాద నవల 'మట్టి మనుషులు' పై ప్రముఖ రర్చయిత్రి శ్రీమతి తాతినేని వనజ చేసిన అతి చక్కని విశ్లేషణః నవల ఎంతలా ఒకే ఊపున చదివిస్తుందో వనజగారి రివ్యూ కూడా అంతే  హృద్యంగా మనసును ఆకట్టుకుంటుంది. 




దీపక రాగం - మేఘమల్లార్ రాగం - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 



దీపక రాగం ఆలపిస్తే దీపాలు వెలుగుతాయంటారు! మేఘమల్లార్ రాగం ఆలపిస్తే మేఘాలు వర్షిస్తాయని నమ్మిక!  మొదటి రాగం వేడిని రగిలిస్తే, రెండో రాగం చల్లదనం కలిగిస్తుందన్న అర్థంలో ఈ హిందూస్తానీ రాగాలను గురించి  అతిశయోక్తి అలంకారంలో జనం చెప్పుకునే మాటలు. సామాన్యులలో ఆసక్తి రేకెత్తించేందుకు సాధారణమైన విషయాలని అసాధరణ రీతిలో చెప్పడం 'కథనం' ప్రక్రియలో ప్రత్యేక విశిష్టిత. ప్రధానమైన అంశాన్ని ఒక కథగా మలచి వినిపిస్తే విన్నంత సేపూ విసుగు పుట్టదు. తరువాత మననం చేసుకునేందుకు కథా విధానం ఒక మంచి పద్ధతి. ఈ దీపకరాగం, మేఘమల్లార్ రాగాల చుట్టూ కూడా ఇలాగే ఎవరో ఒక కాల్పనిక జీవి సృజనాత్మకమైన చక్కని కథ అల్లాడుః


అక్బర్ పాదుషాను గొప్ప కళాభిమాని, కళాపోషకుడుగా చెప్పుకుంటారు కదా! ఆయన కొలువులో అన్ని రకాల కళలకు చెందిన నిష్టాతులకు గౌరవం దక్కేదని వినికిడి. తాన్ సేన్ ఆ బాపతు హిందూస్తానీ సంగీత కళాకారుడు.

అక్బర్ దగ్గర చనువుగా ఉండే బీర్బల్ ఒకరోజు దీపకరాగం గురించి పాదుషాలో కథలు కథలుగా చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. అక్బర్ తాన్ సేన్ ను నిండు సభలో తనకు ఆ దీపకరాగం ఆలపించి వినపించమని ఆదేశించాడు. అప్పటి దాకా సుఖంగా గడిచిపోయే తాన్ సేన్ సంగీత జీవితానికి ముప్పు  ఏర్పడిందన్న మాట. దీపకరాగం తాన్ సేన్ కు రాక కాదు. అది ఆలపించి ఇంచక్కా దీపాలు వెలిగించి చూపరులకు ఆనందం కలిగించవచ్చు. కానీ గానం చేసిన గాయకుడు కొద్ది రోజులలోనే అనారోగ్యం పాలవుతాడని, చికిత్సలేని రుగ్మత వల్ల దుర్మరణం సంభవిస్తుందన్న ఒక  నమ్మకం  ప్రచారంలో ఉంది. పాదుషా ఆజ్ఞాపించిన మీదట కాదనేందుకు లేదు కదా! కనక, దీపకరాగం ఆలపించి నిండుసభలో పాదుషా ప్ర్రశంసలు పొందినా, తాన్ సేన్ తొందర్లోనే అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స చేసిన రాజవైద్యులు పెదవి విరిచి 'దీపకరాగం వల్ల వచ్చిన పీడకు మేఘమల్లార్ రాగం ఒక్కటే మందు. అది పాడినా, విన్నా క్రమంగా తగ్గుముఖం పట్టాల్సిందే తప్ప ఈ గుండెల్లో మంట రోగానికి మరో  ఉపశమనం లేదు.' అని తేల్చిచెప్పారు. తాన్ సేన్ కు ఆ రాగం రాదు. అది వచ్చినవారు ఎక్కడ ఉంటారో .. ఆ వివరాలు కూడా తెలీవు.  వెదుకులాట మొదలయింది. 'పాడేవారు దొరికేదాకా  గుండెల్లో ఆరని ఆ మంటకు ఉపశమనంగా ఉండేందుకు వీలుగా తాన్ సేన్ ను ఏదైనా చల్లని నదీ తీరానికి పంపించండి' అని సలహా  ఇచ్చారు వైద్యులు.

అక్బర్ అనుమతితో  గుజరాత్ లోని శబర్మతీ నదీ తీరాన ఒక కుటీరం వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు తాన్ సేన్.

రాష్టం మీద మొగలాయీల కన్ను పడిందన్న అనుమానంతో ఉన్న  గుజరాతీ సమాజంలో దానికి తగ్గ విధంగా ఆడవారు తమ నడవడికను మార్చుకున్నారు. పగలు బయట మొహాలూ చూపించడం దాదాపుగా తగ్గించేశారు. ఇంటి అవసరాలకు కావలసిన నీళ్లు తెల్లవారు ఝామున చీకట్లలోనే నదీ తీరానికి గుంపులుగా వెళ్లి తెచ్చుకునేవాళ్లు.  ఆవిధంగా నీరు తెచ్చుకునేందుకు నదీ తీరానికి వచ్చిన అక్కచెల్లెళ్ళు నది ఒడ్డున కుటీరం బైట గుండెలోని ఆవేదన ఆగక బాధపడే తాన్ సేన్ ను చూశారు. 'అక్కడెవరో దీపకరాగం ఆలపించి పాపం అనారోగ్యం పాలయినట్లున్నారే!' అంది ఒక ఆడగొంతు. రెండో గొంతు 'ష్.. ష్.. మనకెందుకు? పోదాం పద!' అంది. ఆడవాళ్ళిద్దరూ గబగబా బిందెలో నీరు నింపుకొని గట్టు ఎక్కి పైకి రాసాగారు. గట్టు మీద నిలబడి ఉన్న తాన్ సేన్ వాళ్లను చూశాడు. ఆ ఆడవాళ్లిద్దరు పడుచువయసులో, అందంగా, పొందికగా ఉన్నారు. 'నేను దీపకరాగం ఆలపించినట్లు మీకు ఎలా తెలుసు తల్లులూ?' అని అడగాలని తాన్ సేన్ ఉద్దేశం. ఆయన పెదవి విప్పి అడిగే లోపలే  ఆ ఆడవాళ్లు ఇద్దరూ ఎవరో తరుముతున్నట్లు వెళ్లిపోయారు!

మర్నాడు అదే చోట వాళ్ళ కోసం కాపు కాసి కష్టపడి ఎట్లాగైతేనేం ఆడపిల్లలు ఇద్దరిని నిలబెట్టాడు తాన్ సేన్. తన పేరు ఫలానా అని, అక్బర్ పాదుషా కొలువులో పాటలు పాడే ఉద్యోగిన'ని చెప్పుకోగానే ఇద్దరిలో పెద్దపిల్ల 'అమ్మో! అక్బరు పాదుషానే! ' అంటూ కంగారుపడుతూ చెల్లెలు చెయ్యి పట్టుకుని  లాక్కెళ్లిపోయింది. విచారణ  మీదట తాన్ సేన్ కు ఊరిలో మొగలాయీల మీద ఉన్న బెదురు అర్థమైంది

మర్నాడు తెల్లారుఝాము చీకట్లలో మళ్లీ ఆ అప్పచెల్లెళ్లను కలుసుకుని 'చెల్లెమ్మల్లారా! నన్ను చూసి భయపడనక్కర్లేదు! మీరు చూస్తే  సంగీతజ్ఞులకు మల్లే కనిపిస్తున్నారు. మేఘమల్లార్ రాగం మీకు గాని తెలిస్తే పాడి నాకు సాయం చేయండమ్మా! లేదా ఆ రాగం తెలిసినవాళ్ల వివరాలు చెప్పినా మీ పుణ్యం వృథా పోదు తల్లులూ!' అంటూ  పరిపరి విధాల ప్రాథేయపడ్డాడు


అమ్మాయిలు ఇద్దరకూ జాలి కలిగింది. చిన్నపిల్ల అన్నది' మాకూ కొద్దిగా సంగీతం వచ్చు. మేఘమల్లారం పాడి వినిపిస్తామురేపు పౌర్ణమి కదా! తెల్లారుఝామున చీకట్లు విడకముందే ఈ నదీ తీరానికి వచ్చేయండి. ఇట్లా వస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి!' అన్ని వెళ్లిపోయారు

మర్నాడు అనుకున్న సమయానికే అక్కచెల్లెళ్లిద్దరూ ఆ నది తీరంలొ ఎదురుచూస్తూ కూర్చునివున్న  తాన్ సేన్ ను కలుసుకున్నారు. చిన్న అమ్మాయి కుటీరంలోకి వెళ్ళి తాన్ సేన్ సితారా తీసుకువచ్చింది. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆ పండు వెన్నెలలో ప్రశాంత వాతావరణంలో నదీ తీరాన అత్యంత మధుర స్వరాలతో మేఘమల్లార్ రాగం అలపిస్తుంటే వింటూ తన్మయుడయిపోయాడు స్వయంగా  సంగీత విద్వాంసుడు అయిన తాన్ సేన్. మేఘమల్లార్ ఆలాపన  వింటుంటే తాన్ సేన్ కంటి వెంట నీరు ఆగలేదు. గానం పూర్తవగానే 'మీరు మానవులు కాదు తల్లులూ! దివి నుంచి దిగివచ్చిన గంధర్వులు. మీ స్వరాలకు చిక్కి సంగీతలక్ష్మి స్వయంగా తానే పునీతమయింది తల్లుల్లారా' అన్నాడు  కంటి వెంట కారే బాష్పధారలను తుడుచుకోకుండానే. మరంత విచారించిన మీదత తమ పేర్లు 'తానా.. నానా' అని మాత్రం చెప్పుకొచ్చారు ఆడపిల్లలు


తానా నానాలు మూడు రాత్రులు మొదటి ఘడియల్లో అట్లా మేఘమల్లార్ రాగం ఆలపించగానే తాన్ సేన్ గుండెల్లోని జ్వాల చల్లారింది. మనుషుల్లో పడ్డ  తాన్ సేన్ తిరిగి వెళ్లిపోయే సమయంలో తానా నానాలకు బహుమానాలు ఇవ్వబోతే  తీసుకోలేదు 'మా గురించి మూడో కంటికి తెలియనీయకండి! అదే మీరు మాకు ఇచ్చే అతి పెద్ద బహుమానం అన్నయ్యగారూ!' అని మాత్రం మాట తీసుకున్నారు.

కోలుకొని తిరిగివచ్చిన తాన్ సేన్ ను చూసి అక్బర్ పాదుషా అమితంగా ఆనందించాడు.  కానీ సాటి సంగీత కళాకారులలో ఈసు రగిలింది. 'మేఘమల్లార్ రాగం పాడి వినిపించమని మీరే స్వయంగా అడిగినా  రాదని తాన్ సేన్ తమకు చెప్పాడు. ఆ మాట అబద్ధం అని ఇప్పుడు తేలింది కదా హుజూర్ఆ తప్పుకు దండన ఉండద్దా?' అన్నది వాళ్ల ప్రశ్న.

 అక్బరు కూడా  ఇదే ప్రశ్న వేసినప్పుడు  సమాధానం ఏం చెప్పాలో తెలీక బిక్కమొగమేశాడు తాన్ సేన్. అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం వారి గురించి ఎవరికీ చెప్పకూడదు కదా! ఎంత అడిగినా మేఘమల్లార్ రాగాలాపన చెయ్యడానికి గాని, అందుకు సంబంధించిన వివారాలు చెప్పడానికి గాని మొరాయించే తాన్ సేన్ మీద అక్బర్ పాదుషాకు పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. 'వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈ లోగా పాడి తీరాలి. లేదా ఆ పాట ఎవరి ద్వారా విన్నావో  ఆ వివరాలైనా చెప్పి తీరాలి. కాదంటే ఉరిశిక్ష ఖాయం. చక్రవర్తితో అబద్ధాలాడిన నేరానికి ఇంత కంతే మరో పెద్ద శిక్షలేదు మరి' అని  హుకూం జారీ చేశాడు అక్బర్ మహారాజు.

ప్రాణాల మీద తీపితో 'తానా నానా' ల   గురించి బైటపెట్టేశాడు తాన్ సేన్అక్కచెల్లెళ్ల నోట ఆ మేఘమల్లార్ రాగం వినాలని ఉవ్విళ్ళూరాడు అక్బర్. ఉన్నపళంగా దండు  శబర్మతీ నదీ తీరానికి తరలింది. ముదే తాన్ సేన్ తానా నానాలను కలసి తన వల్ల జరిగిన తప్పును కాయమని, 'ఒక్కసారి వచ్చి పాదుషా సమ్ముఖంలో మేఘమల్లార్ రాగం ఆలపించకపోతే తన ప్రాణాలు  పోవడం ఖామయ'ని దుఃఖిస్తూ చెప్పాడు. అక్కచెళ్లెళ్లిద్దరూ విన్నారు ఓపిగ్గా. తాన్ సేన్ స్థానం హిందూస్తానీ సంగీతంలో ఎంత ఉన్నతమైనదో వాళ్లకి తెలుసు. పాదుషా సమ్ముఖంలో రాగం ఆలపించడానికి సమ్మతించారు.

నిండు సభలో ఆ బంగారు బొమ్మలు ఎత్తైన వేదిక మీద మేలి ముసుగుల వెనుక నుంచి చెవులు రిక్కించి ఆలపించిన మేఘమల్లార్ రాగం సభ్యులను అవాక్కయేలా చేసింది. ఆగకుండా కరతాళధ్వనులు! అక్బర్ పాదుషా ఆనందానికయితే హద్దే లేదు. మెడలోని ముత్యాల సరం తెంపి తానా నానాల మీదకు విసిరిపేసాడు. అయినా ఆ అభిమానవతులు వాటి వంక తేరిపారయినా చూసింది లేదు.

తమ కోసం గాను ఏర్పాటు చేసిన సభామధ్యమం లోని ఎత్తైన ఆ వేదిక నుంచి కిందికి దిగి ఒకరి వంక ఒకరు సాభిప్రాయంగా చూసుకుంటూ కౌగలించుకున్నారు. ఉత్తర క్షణంలో అలంకరించిన అందమైన పందిళ్లు హఠాత్తుగా నేలకూలినట్లు  కుప్పకూలిపోయారు. వారి డొక్కల్లోని బాకులు రక్తసిక్తమై ఆ ఘనకార్యం చేసింది తామే అన్నట్లు ఎర్రగా నవ్వుతున్నాయి!

అదే క్షణంలో సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు యువకులు ఘొల్లుమన్నారు. వాళ్ళిద్దరు తానా నానా భర్తలు. సభకు బైలుదేరే ముందు భర్తలను క్షమించమని వేడుకుంటూ  రాసిన ఉత్తరాలు అప్పుడు గాని అందరి కంటపడ్డాయి కాదు. 'మహా సంగీత విద్వాంసుడు తాన్ సేన్ విలువైన ప్రాణాలు కాపాడవలసిన అవసరం గుర్తించాము. అందుకని నిండు సభలో అక్బర్ పాదుషా ముందు మేఘమల్లార్ రాగం ఆలపించవలసి వచ్చింది. ముందుగా భర్తలైన  మీ అనుమతి తీసుకోలేదు. మా వల్ల తప్పు జరిగింది అని తెలుసు. మన జాతి నీతి ప్రకారం భర్తల సమ్మతి లేకుండా భార్యలు పరపురుషుల కంటబడకూడదు. ఆ రివాజును తప్పినందుకు మేము నిస్సందేహంగా శిక్షకు అర్హులమే. మీకు మా మీద ఉన్న ప్రేమ తెలుసు. మీరు మమ్ములను శిక్షించలేరు. కాబట్టి మమ్మల్ని మేమే ఇలా శిక్షించుకుంటున్నాము. మిమ్ములను మనసారా ప్రేమిస్తున్న భార్యలుగా మమ్ములను క్షమించమని ఆఖరి విన్నపం'. 

ఉత్తరం బిగ్గరగా చదివి భర్తలిద్దరూ 'మా తానా నానాలను తిరిగి ఎవరైనా తెచ్చివ్వగలరా?' అని హృదయవిదారకంగా రోదిస్తుంటే అక్బర్ తన తొందరపాటుకు తలదించుకోవలసి వచ్చింది.

తాన్ సేన్ యువకులు ఇద్దరిని పైకి లేపి పరితాపంతో అన్నాడు 'చెల్లెళ్లు ఇద్దరిని నేను తిరిగి తెచ్చి ఇస్తానని హామీ ఇస్తున్నా. భౌతికంగా నాకు సాధ్యమవని ఆ పనిని కళాకారుడుగా సాధించి చూపిస్తాను. ఇక నుంచి నేను ఆలపించే సంగీత స్వరాలలో ఇప్పటి వరకు  ధ్వనించిన 'ఓం' అనే స్థానంలో 'తోమ్ తానా నానా' అంటూ ఆలపిస్తాను.  ఆ రకంగా మీ తానా నానాలను కాలానికి అతీతంగా శాశ్వతం చేస్తాను ' అని వాగ్దానం చేసాడు.

 తానా, నానాల పేరున శబర్మతీ నదీ తీరాన ఒక స్వరాలయాన్ని నిర్మించాడు తాన్ సేన్.

తరువాతి కాలంలో కాలగర్భంలో ఆ సంగీతాలయం కలిసిపోయింది. మహా పాదుషా అక్బర్ చక్రవర్తి  ఉనికీ మలిగిపోయింది. చివరికి శాశ్వతంగా మిగిలింది మాత్రం  హిందుస్తానీ మహా సంగీతవిద్వాంసుడు తాన్ సేన్ గొంతులో తారట్లాడే 'తోమ్ తానా నానాలలోని  ఆ తానా నానా' లు మాత్రమే!

***

సేకరణః

-కర్లపాలెం హనుమంతరావు

14 -09 -2020

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...