Sunday, February 14, 2021

సేవ -కర్లపాలెం హనుమంతరావు -కథానిక

 




సెల్  మోగుతోంది అదే పనిగా! 

నెంబరు చూసి 'సారీ ఫ్రెండ్స్! మీరు కంటిన్యూ చేయండి! ఫైవ్ మినిట్సులో నేను మళ్ళీ జాయినవుతా!' అంటూ కాన్ఫెరెన్సు ఛాంబర్నుంచి బైటకొచ్చాడు సుబ్బారావుగారు.

'మీరు  ఇక్కడకు రావాల్సుంటుంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్ చెయ్యలేం గదా!' అంది అవతలి కంఠం.

సుబ్బారావుగారికి పరిస్థితి అర్థమైంది. ఫ్లైటుకి టైము కాకపోవడంతో కారులో బైలుదేరారు. 'వీలైనంత వేగంగా పోనీయ్! బట్ బీ కేర్ ఫుల్!' అని డ్రైవర్ని హచ్చరించి సీటు వెనక్కి  వాలిపోయాడాయన.

సుబ్బారావుగారు విజయవాడ దగ్గర్లోని ఓ గాజు ఫ్యాక్టరీ యజమాని.  సంగం మిల్కు ఫ్యాక్టరీలో,  మార్కాపూరు పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా. తరాలనుంచి వస్తున్న చీరాల చేసేత  అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగు వ్యాపారం ఒకటి  నడుస్తోంది. ఆ పనిమీద ఒకసారి చెన్నై వెళ్ళివస్తూ తిరుపతి వెళ్లారు సకుటుంబంగా. పనిపూర్తి చేసుకుని ఘాట్ రోడ్ నుంచి దిగివస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్లు ప్రయాణించే కారు. పెద్దవాళ్లకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదుకానీ.. పిల్లాడికే బాగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన! కరెంటు తీగలు తెగి అంతటా కటిక చీకటి. దూసుకు పోయిన బస్సుకూడా కనుచూపుమేరలో లేదు. బిడ్డ ఏడుపు వినబడుతుందేగానీ.. ఆ చీకట్లో ఏ పొదలో చిక్కుకున్నాడో అర్థమవడం లేదు. భార్య ఏడుపుతో బుర్ర్ర అస్సలు పనిచేయడం మానేసింది. సెల్ ఫోనుకి సిగ్నల్ అందడం లేదు. 'బిడ్డను దక్కించు తండ్రీ! నీ కొండకు  వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటా!' అని మొక్కుకున్నాడు సుబ్బారావుగారు.

ఆ దేవుడే పంపిచినట్లు కనిపించాడు సాంబయ్య అక్కడ ఆ క్షణంలో!  ఆ సమయంలో అతను అక్కడెందుకున్నాడో? కారు లోయలోకి జారే సమయంలో చెలరేగిన ఏడుపులు, పెడబొబ్బలు విని వచ్చినట్లున్నాడు. అలవాటైన చోటులాగుంది!  ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత లాఘవంగా  దిగి..  పొదల్లోనుంచి బైటకు తెచ్చాడు బిడ్డడిని.  రెస్క్యూ టీం ఆ తరువాత అరగంటకు వచ్చి అందర్నీ ఆసుపత్రికి చేర్చిందిలే కానీ.. ఆ సమయంలోగానీ సాంబయ్య చొరవ లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట వట్టిదే!


ఒక్కడే వంశోధ్ధారకుడు. అదీ పెళ్లయిన పదేళ్లకు ఎన్ని తంటాలు పడితేనోగానీ పుట్టలేదు. ఎన్ని  వేల కోట్లు, ఫ్యాక్టరీలుంటే మాత్రం ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించేందుకు ఒక్క అంకురం అవసరమే గదా! సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు..  ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావుగారి వంశం మొత్తాన్ని!


సాంబయ్యకు ఒక పదివేలు ఇచ్చాడు అప్పట్లో! తిరుపతి ఫారెస్టు ఏరియాలో దొంగతనంగా కంప కొట్టి అమ్ముకుని జీవనం సాగించే అశేషమైన బడుగుజీవుల్లో సాంబయ్యా ఒకడని తరువాత తెలిసింది. సాంబయ్యచేత ఆ పని మానిపించి బస్టాండు దగ్గర ఒక బంకు  పెట్టించాడు సుబ్బారావుగారు.

సుబ్బారావుగారు తిరుపతి ఎప్పుడు వచ్చినా సాంబయ్యను పిలిపించుకుని మంచి- చెడు విచారించడం అలవాటు. తన ఫ్యాక్టరీల్లో ఏదైనా పనిచేసుకోమని సలహా ఇచ్చినా ససేమిరా అన్నాడు సాంబయ్య 'ముసిలోళ్ళు తిర్పతి దాటి బైట బతకలేరయ్యా సామీ! ఈ వయసులో ఆళ్లనొదిలేసి నా దారి నే చూసుకోడం నాయవా?' అంటాడు. పని వత్తిళ్లమధ్య ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు. సాంబయ్య కలిసి చాలా కాలమే అయింది.  ఇప్పుడిలా కలుస్తాడని కలలోకూడా అనుకోలేదు.


నెలరోజుల కిందట ఒకసారి తిరుపతినుంచి ఈ డాక్టరే కాల్ చేసి చెప్పాడు 'పేషెంటు ఫలానా సాంబయ్య.. అతని తాలూకు మనుషులు మీ పేరే చెబుతున్నారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సొచ్చిం'దంటూ.

కొత్త అసైన్ మెంటుని గురించి చర్చలు జరుగుతున్నాయప్పట్లో. ఇన్ కమ్ టాక్సు తలనొప్పుల్నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్సు. వాళ్ళు ఇచ్చిన సలహా  ప్రకారం ఆదాయం నుంచి కనీసం ఒక్క శాతంతోనైనా ఏదైనా ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుచేస్తే రెండిందాలా లాభం. గుడ్- విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు. త్రూ ట్రస్ట్.. గవర్నమెంటు ఏజన్సీలతో  వ్యవహారాలు స్మూత్ అవుతాయి.  మెయిన్ బిజినెస్  ఇస్యూసుని తేలిగ్గా  సాల్వ్ చేసుకోవచ్చన్నది ఆ సలహా. ఎలాంటి ట్రస్టు పెట్టాలన్న దానిమీద చర్చ సాగుతున్నప్పుడే తిరుపతి నుంచి కాల్ వచ్చింది.

సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది. నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. బెడ్ మీద పడున్న సాంబయ్య అస్తిపంజరాన్ని తలపిస్తున్నాడు. తనకు పరిచయమయిన కొత్తల్లో పిప్పిళ్ల బస్తాలాగుండేవాడు. డాక్టర్ని కలిసాడు సుబ్బారావుగారు.

'సాంబయ్యకు డయాబెటెస్ టైప్ ఒన్. వంశపారంపర్యంగా ఉంది. ఇప్పుడు జాండిసూ  ఎటాకయింది. కిడ్నీలు రెండూ పనిచేయడం మానేశాయి. ఆల్మోస్టు లాస్ట్ స్టేజ్..'

'హెరిడటరీ అంటున్నారు. మరి వాళ్ళ పిల్లాడికీ…?'

'వచ్చే చాన్సు చాలా ఉంది. జువెనైల్ డయాబెటెస్ అంటాం దీన్ని. అబ్బాయికిప్పుడు ఆరేళ్ళే కనక బైటకు కనిపించక పోవచ్చు. ముందు ముందయితే ఇబ్బందే!'

ఎమోషనలయాడు సుబ్బారావుగారు 'ఏదన్నా చేయాలి డాక్టర్ సాంబయ్యకు! అతని భార్యను చూడ్డం కష్టంగా ఉంది. ఆ రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడా ఇలాగే ఏడ్చింది'

'విధికి కొంత వరకే మనం ఎదురు ఈద గలిగేది. సాంబయ్యది హెరిడటరీ ప్రాబ్లం. ఆశ పెట్టుకొనే దశ దాటిపోయింది సార్! ఏం చేసినా ఆ పసిబిడ్డకే చేయాలింక!' అన్నాడు డాక్టరుగారు.

పలకరించడానికని వెళ్ళిన సుబ్బారావుగారిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు సాంబయ్య. ఏదో చెప్పాలని ఉందిగానీ అప్పటికే మాట పడిపోయిందతనికి. కొడుకు చేతిని పట్టుకుని పిచ్చి చూపులు చూసాడు పాపం!

'సాంబయ్యకు ఆట్టే బంధుబలగం కూడా ఉన్నట్లు లేదు. 'పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాం లేండి! వాళ్లకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపికున్నంతవరకు చదివిద్దాం.  ఆ కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఏర్పాటు చేద్దాం. ఆ పూచీ నాదీ!' అన్నాడు సుబ్బారావుగారు తిరుగుప్రయాణమయేటప్పుడు  సాంబయ్య భార్య వినేటట్లు.


ఆ మర్నాడే సాంబయ్య పోయినట్లు కబురొచ్చింది విజయవాడకి.  ఆ విషయం చెబుతూ  ' మీరు వెళ్ళిపోయిన తరువాత నేనూ చాలా ఆలోచించాను సుబ్బారావుగారూ! పిల్లాణ్ణి హాస్టల్లో పెట్టి చదివించడం, జీవితాంతం వాళ్ళు నిశ్చింతగా బతకడానికి ఏర్పాట్లు చేయడం.. చిన్న సాయమేమీ కాదు. కానీ.. మీ లాంటి వాళ్ళు చేయదగ్గది.. మీలాంటి వాళ్ళు మాత్రమే  చేయగలిగే కార్యం ఒకటుంది సార్!' అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

'ఏమిటో చెప్పండి.. తప్పకుండా చేద్దాం.. వీలైనదైతే!' అన్నాడు సుబ్బారావుగారు.

'జువెనైల్ డయాబెటెస్ కి ఒక విరుగుడు ఉంది సార్! స్టెమ్ సెల్సుతో చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. పిల్లల వూడిపోయే పాలదంతాలను వూడిపోవడానికి ఒక పదిరోజులముందే తీసి భద్రపరిస్తే.. భవిష్యత్తులో  వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం తేలికవుతుంది. పాలదంతాల్లోని మూలకణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువయింది. దంతాల పల్సులో ఉండే మూలకణాలని ముఫ్ఫై నలభై ఏళ్లవరకు భద్రపరిచే ల్యాబులు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ, ముంబై, పూనేవంటి నగరాల్లో పనిచేస్తున్నాయి. మా కొలీగ్ ఒకతను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండీ!'

సుబ్బారావుగారికీ ఆలోచన బాగా నచ్చింది. కంపెనీ తరుఫు నుంచి పంపించిన వైద్యులు  ఢిల్లీ  బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలు ఉన్నాయి. 'మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా.. కొన్ని భాగాల్లో తక్కువగా ఉంటాయి. దంతాల వంటి వాటినుంచి ఒక రెండు మూడు మూలకణాలని రాబట్టినా చాలు.. వాటిద్వారా కొన్ని లక్షల కణాలని సృష్టించుకోవచ్చు. శరీరంలో పాడైన భాగాలను  ఈ కణాలు వాటికవే బాగుచేసుకుంటాయి. బొడ్డుతాడునుంచి మూలకణాలను సేకరించే విధానం చాలా కాలంనుంచి ప్రాచుర్యంలో ఉన్నదే. ఆ అవకాశం లేకపోయినవాళ్ళు నిరాశ పడనవసరం లేదంటున్నారు ఇప్పుడు. పాలదంతాల విషయంలో తగిన జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బోన్ మ్యారో, కిడ్నీలవంటి వాటికి సమస్యలొస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది'.

దంతాలనుంచి మూలకణాలను సేకరించి భద్రపరిచే స్టెమేడ్ బయోటిక్ సంస్థలు ఢిల్లీలోలాగా ముంబై, పూనా, బెంగుళూరు, చెన్నైలలో ఉన్నా..  విభజనానంతరం ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇంకా  ఏర్పడలేదన్న విషయం  సుబ్బారావుగార్లో  మరింత ఉత్సాహం పెంచింది.

సాంబయ్య కొడుక్కి ఆరేళ్లే. అతగాడి పాలపళ్లను గనక భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికొచ్చే జువెనైల్ డయాబెటెస్ కి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్లూ అవుతుంది' అంది సుబ్బారావుగారి సతీమణి ఈ విషయాలన్నీ భర్తనోట విన్నతరువాత.

'నిజమే కానీ.. ఇది కాస్త  ఖరీదైన వ్యవహారంలాగుందే?  ప్రారంభంలోనే అరవై వేల వరకు వసూలు చేస్తున్నాయి ల్యాబులు! ఆ పైన మళ్ళీ ఏడాదికో ఆరేడువేలదాకా రెన్యువల్ ఫీజులు!'

సుబ్బారావుగారిలోని వ్యాపారస్తుడి మథనను పసిగట్టింది ఆయన సతీమణి. 

'సాంబయ్య మనింటి దీపాన్ని నిలబెట్టాడండీ! అతనింటి దీపం కొడిగట్టకుండా చూసే పూచీ మనకు లేదా?  మనకింత ఉంది.. ఏం చేయలేమా?' అనడిగింది భర్తను. 

భార్యదే కాదు.. భర్తదీ చివరికి అదే ఆలోచనయింది.

సుబ్బారావుగారికి ఛారిటబుల్ ట్రస్టు తరుఫున ఏంచేయాలో సమాధానం దొరికింది.  బోర్డు మీటింగులో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ప్రపోజల్ టేబుల్ చేసాడు 'సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే  వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఆలోచిస్తారు. కలిగినవాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు.. సేవింగ్సు కాతాలు ప్రారంబిస్తారు. చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే స్పృహ మాత్రం ఇంకా మన సమాజానికి అలవడలేదు. పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించినంత మాత్రానే ఆరోగ్యభద్రత కల్పించినట్లు కాదు. ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే ఎంత సంపద ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతే! స్టెమ్ సెల్సుని సేకరించి భద్రపరిచే ల్యాబులను మన ట్రస్టు తరుఫున ప్రారంభిద్దాం. పేద పిల్లల పాలపళ్లను సేకరించి వాటినుంచి మూలకణాలని రాబట్టి భద్రపరిచే ఏర్పాట్లూ చేయిద్దాం. ఇదంతా ట్రస్టు తరుఫున మనం సమాజానికి అదించే ఉచిత సేవా సౌకర్యం'

సభ్యులంతా ఆమోదపూర్వకంగా బల్లలమీద చిన్నగా చరిచారు.

సుబ్బారావుగారి సంస్థల తరుఫున ప్రారంభమయిన మూలకణాల సేకరణ, భద్రత ల్యాబు ప్రారంభోత్సవంలో లాంఛనంగా డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమన్ సాంబయ్యకొడుకు పాలపళ్లనుంచి సేకరించిన మూలకణాలే!

సాంబయ్యకొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకొంటుంటే.. సాంబయ్యభార్య ట్రస్టువారి  బ్యాంక్ ల్యాబులోనే పనికి చేరింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితం)

బోథెల్, యూఎస్ఎ

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గాథా సప్తశతిలోని కొన్ని పద్యాల అంద చందాలు! -కర్లపాలెం హనుమంతరావు

 



గథా సప్తశతి రచనలో కొంత భాగం (వజ్జాలగ్గం) తెలుగు గడ్డ మీద జరిగిందా? అని ఓ సందేహం. ఈ ఉద్రంథంలోని కొన్ని తియ్యని తెలుగు పలుకుల రుచి నోటికి తగిలినప్పుడు,  ఆ రసాస్వాదన కారణంగా మదిలో ఈ సందేహం రేకెత్తడం సహజం. 

వజ్జాలగ్గం అనే మాట మనకు ఇప్పుడు కొత్తగా వినిపించే పదం. గాథా సప్తశతి దారిలోనే అదీ ఓ ముక్తకాల సమాహారం. కర్త జయవల్లభుడనే శ్వేతాంబర జైనముని. 8వ శతాబ్ది పండితుడు.  'ధర్మ, అర్థ, కోవా' లనే త్రివర్గ  సుభాషితాల సంకలన కర్త ఆయనే. స్వయంగా కవే  చెప్పుకున్న ఆ మాటకు మరో ప్రామాణికత అవసరం లెద! ఇక పజ్జాలగ్గం నుంచి కొన్ని పద్య పుష్పాలను దూసి తెచ్చుకొని ఆ పరిమళాలను ఆఘ్రాణించే  ప్రయాస కొంత చేద్దాం.

 సువ్వన్ను వయణ పంకయ

ణివాసిణిం పణమిఊణ సుయదేవిం,

ధమ్మాఇ సుహాసి అం వోచ్చం  (-1)

దీన్నే సంస్కృతంలో చెప్పాలంటే

సర్వగ్య వదన పంకజ

నివాసినీమ్ ప్రణమ్య శ్రుతదేవీమ్,

ధమ్మాది త్రివర్గ యుతం

సుజనానాం సుభాషితమ్ పక్ష్యామి- అనుకోవాలి.

'వివిధ కవుల గాథలలోని మేలిమిని గ్రహించి జయవల్లభమనే వజ్జాలగ్గం విధిపూర్వకంగా సమకూర్చాను' అంటూ సంకలనకర్త స్వయంగా ఓం ప్రథమంలో చేసుకన్న ప్రకటన ఇదిః

'వజ్జా' అంటే పద్దతి. లగ్గం అంటే 'సంకలనం'. ఒక క్రమంలో చెప్పే గాథల పద్ధతిని పజ్జా(ప్రజ్యా) అంటున్నానని ఆరంభంలోనే స్పష్టంగా చెప్పుకున్న మాట ఇది

జయవల్లభుడికి  'ప్రాకృత' భాష పైన తగని అభిమానం, ఆ వాజ్ఞ్మయాన్ని గురించి గొప్పగా చెప్పుకునే ఏ సందర్భాన్ని ఆయన ఉదారంగా వదిలివేసిందిలేదు. లాలిత్యంతో నిండి మధురమైన భావాలను ప్రోవు చేసే అక్షరాలకు ప్రాకృతంలాగా ఆలవాలమైన భాష మరోటి లేదంటాడాయన.   శృంగార రసయుతంగా సరిత్తులాగా ప్రాకృతం పక్కనే పారుతుండగా ఉప్పు నీరు నిండిన సముద్రంలో మునకలేసి తరించాలని ఏ తరుణి  కోరుకునేది? అని జయవల్లభుడి ప్రశ్న.

లలిఏ మహురక్ఖర ఏ

జువౖ జణ వల్లహే ససింగారే

సంవే(?) పా ఇఅ లవ్వే

కో సక్కై సక్కఅం పఢిఉం-  (29) - అనే పజ్జాపగ్గంలో ఓ పద్యం అర్థం.

 

పొదుగు పితికే కళ అంతుబట్టక  ఆవులను బాధకు గురిచేసే మొరటువాళ్లున్నట్లే.. పాకృత గాథల అంతరార్థం గ్రహించలేని  అరసులు అర్థం వివరించే మిషతో దాన్ని ఈకకు ఈక, తోకకు తోక లాగి రూపం వికారంగా మార్చేస్తున్నారని జయవల్లభుడి వాపోత. "ఓ గాథా! నిన్ను మోటు మనుష్యులు అడ్డదిడ్డంగా చదువుతారు. చెరుకు తినడం తెలీని మొరటులు  నమిలి ఊసినట్లు నిన్ను ఎక్కడ బడితే అక్కడ విరిచి వికారం చేస్తున్నారు' అన్న ఆనాటి కవి జయవల్లభుడి ఘోషలో ఇప్పటి మన తెలుగు భాష వికృత రూపి కావడానికి కారణంకూడా కనిపిస్తున్నది.

 

'వజ్జాలగ్గం' భర్తృహరి సుభాషిత పద్ధతిలో సంకలనం చేసినలాంటి కావ్యం. దీనిలో 96 పగ్గాలలో సుమారు వేయి గాథలున్నాయి. సామాన్యుడే  ఈ కావ్య కథానాయకుడు.. ప్రముఖంగా వ్యథార్తులను, విధి వంచితులను స్వేచ్చగా వర్ణించాడీ కావ్యంలో. నిర్భాగ్యుడు అంటే జయవల్లభుడి దృష్టిలో  సిద్దులందరిలోకి మహా సిద్ధుడు.

'దీనంతి జోయసిద్ధా

అంజణ సిద్దా వి కౌని దీసంతి,

దాంద్జ జో యసిద్దం

మం తె లోఆని పచ్చంతి  (141)

(దృశ్యంతే యోగసిద్ధాః

అంజన సిద్దా అపి కేచన దృశ్యంతే,

దారిద్ర్యయోగ సిద్ధం

మాం తే లోకా న ప్రేక్షంతే)

 -యోగ సిద్ధులు కనబడతారు. అంజన సిద్ధులూ కనబడతారు. నాబోటి దారిద్ర్య యోగసిద్ధులు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించరు- అని ఓ దరిద్రుడు వాపోత. దరిద్రులను సమాహం ఉన్నా లేనట్లే లెక్కలోకి తీసుకోని నిర్లక్ష్యపు ధోరణి పై ఆ నాడే ఇంత పెద్ద వెటకారం!)

 జై నామ కహని సోక్ఖం

హూఇ తులగ్గేణ సేవఅజణస్య,

తం ఖవణాఅ సగ్గారో

హణం న విగ్గో వా సఏహి   (153)

 (యది నామ కథమపి సౌఖ్యం

భవతి తులాగ్రేణ సేవకజనస్య,

తత్ క్షపణక స్వర్గారోహణ

మివ వ్యాకుల భావసతైః)

-రాజసేవకులు, డాంబికరాయళ్లు, వస్త్ర వ్యాపారులు, పల్లె గడసరులు, వడ్డెవాళ్ళు, వైద్యులు, జ్యోతిష్కులు వంటి వాళ్ల మనస్తత్వాలను ప్రత్యేకంగా చిత్రించాడీ జయవల్లభకవి. రాజ సేవకునికి ఏదైనా సౌఖ్యం కాకతాళీయంగా వస్తే, అది క్షపణకుని స్వర్గారోహణం లాగా ఎన్నో కష్టాల తర్వాత మరణానంతరం సంభవించవచ్చునంటాడు.  క్షపణకుడు( అంటే సమ్యాసి. సన్యాసికి సుఖం  మరణానంతరమే. తనువు చాలించిన తరువాత అతని ఘనతను గుర్తించి విమానం కట్టి మోసుకుపోతారు. వాయిద్యాలు మోగిస్తూ, దానాదులు అంత్య సంస్కారాల వంకన చాలా ఘనంగా నిర్వహిస్తారు.  రాజుల కొలువు చేసుకొనే సేవకుడికిది కూడా అదే  తంతు   కాకాతాళీయంగా ఏదైనా సుఖం కలిగిందంటే  అది ఏ వీర మరణం తరువాతనో!

పజ్జాలగ్గంలో ఈ తరహా విచిత్రమైన పద్యాలు జయవల్లభుడు చాలానే సేకరించి హృద్యంగా సంకలించాడు.

 ఒక సేవకుడు అనుకుంటాడుట 'మంచి పొదుగు ఉన్న మూడు ఆవులు, నాలుగు మంచి ఎడ్లు, చేతినిండా  వరికంకులు ఉంటే చాలు.. ఓ సేవా ధర్మమా, నీవు ఎక్కడన్నా సుఖం ఉండు' అని.

తంబాఉ తిన్ని సుపఓహరా ఉ

చత్తరి పక్కల ఎఇల్లా,

నిస్సన్నా రాలయ మంజరీ ఉ

సేవా సుహం కుణవు'   (160)

 (గాన స్తి సః సుపతీధరాః

చత్వారః సనర్థ బలీవర్గాః

నిష్పన్నా రాలవ మంజర్యః

సేవా సుఖం కరోతం)- అన్న పద్యానికి భావం ఇదే!

గ్రామాలలోని చతురులను గురించి కవి చాలానే మనస్తత్వ విచారణ చేసినట్లుంది. ఓ పెద్దామె వయసులో తన కన్నా చిన్నదైన మరో  అమ్మాయిని హెచ్చరిస్తూ 'పల్లెల్లోని మగవాళ్లు బహు కూట నిపుణులు. వారి చేతుల్లో పడ్డ వాళ్లకు కలలో కూడా సుఖం ఉండదు.  ఆ మాయగాళ్లకు  ఆరో జ్ఞానం(సిక్స్త్ సెన్సు) వరం. ఆ చూపుల్లో పడిన ఆడదానికి అదే శాపం' అంటుంది. పల్లెల పేరే కవి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లో కవి? ఇప్పుడైతే అన్నిచోట్లా ఆడదానికి మగవాడితో అగచాట్లే!

'మేడలు, మిద్దెలు, ప్రాకారాలు, శిఖరాలు ఒక్కటే కాదు.. మాయగాళ్లు గాని ఉంటే పల్లైనా నగరంలానే జాగ్రత్త వహించాల్సిన స్థలం! అని అర్థం వచ్చే

తహ చంపిఊణ భరి ఆ

నిహిణా లావణ్ణ ఏత తణు అంగీ,

జహ సే చిహారతరంగా

అంగుళి మగ్గ దీసంతి   (314)

(తథా నిసీడ్య భృతా

నిధినా లాణ్యేన తన్వంగీ,

యథా అస్యాః చికురతరంగా

అంగుళీమార్తా ఇవ దృశ్యంతే) అని అర్థం వచ్చే పద్యాలెన్నిటితోనో  ఈ పాకృత గాథా సప్తశతి నిండివుంటుంది.  

శారీరక సౌందర్యం, అంగ సౌష్టవం వంటి ఆహ్లాదకరమైన విశిష్టతల పైన ఈ కవికుండే భావనలు బహుచమత్కారంగా ఉంటాయి.  ఓ లావణ్యవతిని చూసిన ఈ కవికి విచిత్రంగా   ఇళ్లల్లో ధాన్యం, పత్తి వంటి వస్తువులను   సంచుల్లోకి కూరే  దృశ్యం జ్ఞప్తికి వస్తుంది. విధి ఓ తన్వంగిని లావణ్యంతో కూరి కూరి నింపినందువల్లనే పై నుంచి విధి నొక్కి నొక్కి కూరిన చేతుల గుర్తులు వంకీల జుత్తులా కనిపిస్తోందని చమత్కరిస్తాడు కవి.

జయవల్లభుడి వజ్జాలగ్గం ఆసాంతం రసపానం చేస్తే గాని, ప్రాకృత భాషలోని అందచందాలు సోదహరణంగా  చదువరిని అలరించవు. చదువకుండా , పరిచయం వినా  ఏర్పరుచుకునే అభిప్రాయాలలో ఎప్పుడూ శాస్త్రీయ కోణం ప్రశ్నార్థకమే.. కదా!

కీ.శే శ్రీ తిరుమల రామచంద్రగారు గాథా సప్తశతి పై కొంత లోతైన పరిశోధనే సాగించారుగతంలో వారు భారతిలో వజ్జాలగ్గం పై వెలువరించిన వ్యాసం ఆధారంగా కొన్ని పసందైన విశేషాలు సహృదయ తెలుగు సాహితీ మిత్రులతో పంచుకుందామన్నదే ఈ చిరువ్యాసం ఉద్దేశం.

-కర్లపాలెం హనుమంతరావు

15 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Saturday, February 13, 2021

చలంగారి వేదాంతం- పిట్ట కథ - కర్లపాలెం హనుమంతరావు

 



గురు శిష్యుల మధ్య అద్వైత సిద్ధాంతాన్ని గురించి గంభీరమయిన చర్చ జరుగుతున్నది. 
ఓ రాజు గారు అ సమయంలోనే ఏనుగు మీద ఊరేగుతూ అటుగా వెళుతున్నారు.
"ఏమిటండీ అది?" అని ఎప్పట్లానే అడిగాడు శిష్యుడు .
"కనబడటంలేదుటరా...రాజు గారు ఏనుగు మీద ఊరేగుతున్నారు ." అన్నారు  గురువు గారు .
రాజు గారంటే ఎవరండీ? ఏనుగు అంటే ఏమిటండీ ?" అని అడిగాడు శిష్యుడు.
"పయిన వున్నది రాజు ...క్రింద వున్నది ఏనుగురా మూర్ఖుడా!" అన్నారు గురువుగారు చిరాకుగా.
"పయిన అంటే ఏమిటండీ ?...క్రింద అంటే ఏమిటండీ?" అని మళ్ళీ శిష్యుడు సందేహం.
గురువు గారికి వళ్ళు మండి అమాంతం ఎగిరి శిష్యుడి భుజాలమీద కెక్కి కూర్చుని"నేను ఉన్నది పైనా, నువ్వు వున్నది క్రిందా ...అర్ధమయిందా?" అనడిగారు.
శిష్యుడు తొణకలేదు. "నేను అంటే ఏమిటండీ?..మీరు అంటే ఏమిటండీ?" అని అడిగాడు .
గురువు గారు గభాలున క్రిందకు దిగి శిష్యుడి కాళ్ళు పట్టుకున్నాడు "పైన వున్నది నువ్వూ..క్రింద వున్నది నేనురా " అన్నాడు.
"అర్ధమయింది "  అన్నాడు శిష్యుడు .
ఇంతకీ పాఠం నేర్చుకున్నది శిష్యుడా? గురువా?
(భగవద్గీత కు ముందు మాటలో చలం గారు రాసుకున్నది) 

-కర్లపాలెం హానుమంతరావు 
బోథెల్, యూఎస్ ఎ
 
*****


చిన్న కథః ఉరుము కథ -కర్లపాలెం హనుమంతరావు

  



దేవుడు, మనిషిదానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.

దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు. 

'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ 'అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." '' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు

మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. '' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటానుఅని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు. 

ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ 'శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! 'శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తానుఅని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు. 

వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. దఅంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమదానదయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***

కర్లపాలెం హనుమంతరావు

(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)

 

పాప ఇచ్చిన సందేశం చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 



ఉమ్మడి కుటుంబం లో అత్తారింట్లో పెట్టే ఆరళ్ళు తల్లికి చెప్పుకుందామని పుట్టింటి కొచ్చింది కల్పన కూతురు తో సహా.అపిల్లకి ఏడేళ్ళు. తల్లితో మాట్లాడనీయకుండాఒకటే అల్లరి చేస్తుంది.

ఆ గోల భరించ లేక గోడ మీడున్న ప్రపంచ పటం తీసి ముక్కలు ముక్కలు గా చించి "వీటినన్నింటిని మళ్ళి ఒక షేపు లోకి తీసుకొంచ్చిన దాక నా జోలికి రావద్దు" అని పని పురమాయించింది. ఆ రాకంగానయినా కాస్సేపు తల్లితో ప్రశాంతంగా మాట్లాడనిస్తుందేమోనని ఆశ. 

ఐదు నిముషాలు కూడా కాకుండానే పాప అతికించిన పటం పట్టుకొచ్చేసింది.

అంత తొందరగా ఎలా పెట్టింది?!

ఆ మాటే పాపను అడిగితే "ఇందులో ఏముందే అమ్మా! పటం వెనక నువ్వ్వు ఇదివరకు వేసిన పాప బొమ్మ ఒకటుంది కదా!..దాన్ని బట్టి టకటక పెట్టేసా" అనేసింది.

ఆలోచనలో పడింది కల్పన.

'ఆరళ్ళు పెట్టే అత్తగారు తనకు వంట్లో నలతగా వుంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన దాక కొడుకుతో దెబ్బలాడటం గుర్తుకొచ్చింది .తంటాలు పెడుతుందనుకునే తోడికోడలు తాను పది రోజులు ఆసుపత్రిలో వుంటే వేళ తప్పకుండ పథ్యం తయారుచేసి స్వయంగా ఆసుపత్రికి తెచ్చి తిన్న దాక దగ్గ్గర నుంచి కదలక పోవటం గుర్తు కొచ్చింది. అస్తమానం అల్లరి పెట్టే ఆడపడుచు అవసరానికి రక్తం ఇచ్చి ఆదుకోవటం గుర్తుకొచ్చింది.ఊరునుంచి వచ్చి మూడు రోజులు కూడా కాకుండానే ఇంటికి పోదామని పాప ఎందుకు మారాం చేస్తుందో ఇప్పుడు అర్ధమయింది కల్పనకు. 

ఏ విషయాన్నయినా పాజిటివ్ కోణం లో చూడాలనే సందేశం పాప నోటితో చెప్పకుండానే పటం ద్వార చూపించినట్లయింది.

తల్లికి ఇక తన గొడవలు చెప్ప  దలుచుకోలేదు. 

ఆ సాయంత్రమే అత్తగారింటికి బయలు దేరింది. 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ 

15 -02-2021  


 

 

 


జంతు లోకం! - కర్లపాలెం హనుమంతరావు - సరదా వ్యాసం

 



" మేన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ . మనిషీ మనలాగే జంతువు. కాకపోతే మనం అడవిలో ఉంటాం,  వాడు తనలాంటి మనిషి జంతువుల  మధ్యన నిత్యం రాజకీయాలకు సరదాపడతాడు  దానికి మనమేం చేస్తాం!" అంది కోతి వచ్చీ రాని బట్లర్ ఇంగ్లీషులో గంభీరంగా. 
"అక్కడికి మనమంతా సైన్స్ మ్యూజియంలో మాత్రమే ఉండాల్సిన  జంతువులమైనట్లు!  ఏంటా కిచకిచలూ? ఎట్లాగైనా మనవాడు మన మనవడు  గదా ! అందుక్కాబోలు మన వానరానికి నరుడిగారంటే అంత గారాం ?" అంది నక్క ఎకసెక్కంగా. 
"జోకులొద్దు! మేటర్ సీరియసిక్కడ . మాటిమాటికి మాటమాటకు కంపు మనిషి మనతో తనని కంపేర్ ఎందుకు చేసుకుంటాడో అర్ధం కాకుండా ఉంది. ఎవడైనా కొద్దిగా బుద్ధి తక్కువ పని చేస్తే చాలప్పా .   "గాడిద కొడకా!" అని తిడతాడు! గాడిదలకు మెదడు అంత తక్కువనా ఆ మట్టి బుర్ర ఉద్దేశం?" అని  గార్దభం కోపంగా.
"మరే!  ఎవరైనా సరే సరిపడక పోతే బండ తిట్లకు దిగేస్తాడు. కొండవీటి చాంతాండంత కవిత్వాలు రాస్తున్నారని కవులను ... 'వాడలవాడలందిరిగి వచ్చెడువారలు గోడల గొందులలో వొదిగి కూయుచుండెడి'  వారు అంటూ  వాళ్లందర్మీ గాడిదలతో పోల్చేశాడు ! గాడిదయితే మాత్రం కవిత్వాలు రాయకూడదని రూలుందా!" అనింకా ఎక్కించింది నక్క.
"అందుకేగా.. వీడా నా కొడుకని, కందంలో ఈ గాడిద కూడా అంత అందంగానూ ఏడ్చిందా రోజు ! గాడిద కనుక కాస్తోకూస్తో దీనికి  కవిత్వ మొచ్చు. మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసింది పాపం!  ఊర కుక్కలు, బోర కుక్కలని  అంటూ  రాజకీయ పార్టీయి  అట్లా ఒకళ్ళనొకళ్ళు  కుక్కలను అడ్డం పెట్టుకొని ఆడిపోసుకోడానికి! " అంది కోడి ముక్కుతో కాళ్ళు గీరుకుంటూ.
"అట్లాగే మా పేర్లు పెట్టి కూడా  ముట్టె   పొగరని మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు కదా!"అంది పంది కూడా బాధగా. "దున్నపోతులాగా మా చేత పని చేయించుకుంటూ ఒళ్ళొంగని వాళ్ళని మళ్ళా దున్నపోతులని దులిపేస్తాడు ..అదేం మాయరోగమో గానీ మనిషికి! " అందో ఆంబోతు ఆవేదనగా.
"అందరు నందరే మరియు నందరు నందరే అంటూ సభలోని వాళ్ళందరినీ కలగలిపి కుక్కలూ, కోతులూ, పందులూ, దున్నలూ, గాడిదలంటూ  శ్రీనాథుడనే ఓ కవిసార్వభౌముడు     తిట్టిపోయటం గుర్తొచ్చి గట్టిగా నిట్టూర్చు కొన్నాయి అభయారణ్యంలో సభ తీరిన ఆ జంతువులన్నీ.
"మనిషి తీరుతో పడ లేకుండా వున్నానబ్బీ ! నాలుగుగింజలు ఇలా రాల్చి నాచేత నానా ఊడిగం చేయించుకుంటున్నాడు. ముందు వాడి నుంచి నాకు విముక్తి కలిగించండి  మహాప్రభో!" అంటూ  పావురాయి అడివికొచ్చి కన్నీళ్ళు పెట్టుకోవటం చేత ఇలా సభ మొదలయింది.
"మనవాడి  తీరే అంత! మన మనవడని చెప్పుకోవటానికే సిగ్గేస్తోంద"అని పక్క కోతితో చెప్పుకుని బాధపడిందో పాతకాలం నాటి ఓ పండు కోతి . 
"వాడొక్కడికే దేవుడు పెద్ద బుర్ర ఇచ్చాడన్న పొగరు కాబోలు! వెళ్ళి ఆ దేవుణ్ణే అడుగుదాం పదండి!" అంది జంబూకం. జిత్తులన్నీ  తానే ప్రదర్శిస్తూ 'జాకాల్'  అన్న తన పేరుని బద్నామ్ చేస్తున్నాడని మనిషి మీది ఆ నక్కగారికి ఎక్కడలేని అక్కసు.
...

విషయం అంతా ఓపికగా విన్నాడు దేవుడు. జంతులోకం ఆక్రోశం చూసి   గాఢంగా నిట్టూర్చాడుకూడా .  మడిసి మిడిసిపాటు తనకూ కొత్తేం కాదు. ఒళ్ళు మండినప్పుడు వాడు   తననీ  విడిచిపెట్టింది లేదు. "తిరిపమునకిద్దరాండ్రా... పరమేశా! గంగ విడుము... పార్వతి చాలున్!" అని దులిపి పారేయడం  గుర్తుకొచ్చింది. అయినా దేవుడి పాత్ర  లో ఉన్నప్పుడు  సర్ది చెప్పడం తన బాధ్యత. 
 కనక "మనిషి మహాశయుడి తీరంతే! తెగనాడేటప్పుడు గాడి తప్పటంలో వాడు  మహా  మొనగాడు ! అదంతా  మనిషి మార్క్ రాజకీయం.  పాలిటిక్సన్నాక ఇలాంటి హాట్ ఫూట్స్   తప్పవు అప్పుడప్పుడు . వాడికి ఎన్నికలంటే పోలింగు 'బూతులు'. 'నబూతో నభవిష్యత్తు ' అని నమ్మే సజ్జు రాజకీయాలలో  రోజురోజుకు ఎక్కువౌతోంది.  అశ్లీలమే వాళ్ళ అసలైన శీలమైపోయింది. అట్లాంటి వాళ్ళ తిట్లనట్లా పట్టించుకొంటే ఉన్న ఒక్క కంటితో కూడా నిండా   నిద్రపోలేదు మీ భల్లూకం . థూఁ! నా బొడ్డనుకోవాలి" అన్నాడు దేవుడుబొడ్డు నిమురుకుంటూ. 
"వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు మెంటలనో, శుంఠలనో ఎంత  అన్  ప్రిన్ టబుల్ లేంగ్వేజీలో  ఏడ్చినా  పర్వాలేదు కానీ మహాప్రభో!... మధ్యలో మా కుక్కలనీ, పందులనీ... లాక్కు రావటమెందుకంట ?! ఈ వానర వారసుడి వరుస చూస్తే మీరింకో అర్జెంటు  అవతారమెత్తాల్సిన అవసరమున్నట్లుంది" అని జంతువులన్నీ మోరలెత్తి మరీ భోరుమని మొత్తుకున్నాయ్. .
"సరే.. ముందసలు సందర్భమేంటో కనుక్కుందాం. మానవుడి వాదనా విందాం.. 'రమ్మనమ' ని కాకి చేత కబురంపించాడు దేవుడు.

"ఎక్కడి టైమూ  ఈ దిక్కుమాలిన పాలిటిక్సుకే చాలటం లేదు. నా తరపున చిలకను పంపిస్తున్నా!  చర్చించుకోండి!' అన్నాడు మనిషి.  
చిలక వచ్చి  మనిషి పలుకులు వినిపించింది.
"కుక్కంటే మాకూ మక్కువ ఎక్కువే. డాగ్ అనగా తిరగేసిన గాడ్  కిందే కదా లెక్క!(DOG-GOD). కనకనే  శునకాన్ని భైరవుడిగా కొలుస్తుంటాం. దాన్ని   గ్రామసింహమమని నామధేయవిచ్చి మరీ గౌరవిస్తుంటాం. ధర్మరాజు తమ్ముళ్ళందరినీ వదిలేసి, ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికి తీసుకెళ్ళిన సందర్భం జంతుతంతు  మర్చిపోయింది. కుక్క పిల్లా... అగ్గిపుల్లా... కాదేదీ మా  ఆంధ్రా కవుల కనర్హం. ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ తక్కువ చేసింది  లేదు. చివరికి పావురాయిని కూడా.  మీ దశావతారాల్లో జంతువులన్నింటికీ దేవుడి హోదా కల్పించామా ? కాదా ?! గాడిదైనా  మా దృష్టిలోగాడ్ ది గ్రేటే!. పేపరు వాళ్ళు, టివీల వాళ్ళు మా ప్రసంగాలు  పూర్తిగా వినకుండా వాళ్ళకి నచ్చినట్లు రాసుకుంటే  మాదా బాధ్యత? ! ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ భుజాలు.. మీ ఇష్టం" అని మనిషి మాటలుగా  వప్పచేప్పింది చిలుకమ్మ      .
చిలుక పలుకులకు పాము ఫ్లాటయి పోయింది. మనిషిని అపార్ధం చేసుకున్నందుకు గార్ధభం కుమిలి పోయింది. మొసలి కూడా     కన్నీరు కార్చింది. కానీ నక్కే... 'ఈ మనిషి జిత్తులు నాకు కొత్తా! మనిషిని పనిష్ చేయాల్సిందే!'' అని వాదనకు దిగింది.
ఉడుంది కూడా అదే పట్టు.
"మనిషితో మాది రక్త సంబంధం. మాట పోతుంద"ని దోమ తెలివిగా సమయానికి  తప్పుకుంది.
"మురుగు లేనిదే మాకు మనుగడలేదు. నరుడే మా గురుడ'ని ఈగలూ, నల్లులూ, పేలు లాంటి కీటకాలు ఉమ్మడిగా ప్రకటన జారీ చేశాయి.
కోడికి మాత్రం కోపం  ఇంకా      తగ్గలేదు."నేను కూయటం మానేస్తాను. ఘడియ ఘడియకు కూయించుకొని ఆకలేసినప్పుడు కూరగా దోరగా వేయించుకొని తింటాడీ తిండిపోతు.  వాడికి పెద్ద పండుగ వస్తే మా కోడి  జాతికి పెనుగండం. పందేలలో  నిష్ట దరిద్రుడికేమో మా వల్ల అష్టభోగాలు. మాకేమో అష్టకష్టాలు" అంది కసిగా.
"బోడి కోడి లేకపోతే  తెల్లవారదా ఏంది? మనిషికి  బోలెడన్ని గడియారాలేడ్చాయి మనిషికి " అంది  మనిషి తరపున చిలుక.
"నేనూ దున్నటం మానేస్తాను. తిండిగింజలు లేక చస్తాడ" ని కసిగా   కాడి కింద పడేసింది దున్నపోతు. "నీ సాయం లేకపోతే వ్యయసాయం సాగదా!. మిషన్లతో పనులు నిమిషాల్లో అయిపోతాయి" అంది  మళ్ళీ చిలుక
మనిషిని శిక్షించే విషయంలో అడవి నడిమికి చీలింది. 
 గోవులూ, గుర్రాలూ, చిలుకలూ, ఎలుకలూ, నెమళ్ళూ, తేళ్ళూ లాంటివి ఒకవైపు. 
కాకీ, నక్క, గద్ద, గబ్బిలం లాంటివి మరో       వైపు.
పులులూ చర్చల్ని బహిష్కరించాయి. మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ అని గొరిల్లాల  ప్రకటించేసాయి. కప్పమాత్రం గంటకో వైపుకి గెంతుతోంది. గోడ మీదున్న పిల్లికి ఎటు దూకాలో పాలుపోవటం లేదు. చివరికి ఎన్నికలు తప్ప లేదు ! 
--- 
 ఒక్క కుక్క  ఓటు మీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితులొచ్చి పడ్డాయిప్పుడు.
"మనిషి నీ మాస్టర్ .  మాకే నీ ఓటం"టూ మనిషి ఏజెంట్ చిలక     ఒకవైపు,  
"మాస్టర్ కాదు! వాడొట్టి మాన్ స్టర్ .. అనగా రాక్షసుడు! మాకే నీ ఓటం"టూ నక్కల ఊళలింకోవైపు.   ప్రతి కుక్కకూ ఓ  రోజొస్తుందని సామెత  నిజమైన .
 పోలింగు రోజు అది.   
ఓటేసే టైము ముగిసింది. ఒక్క ఓటు మెజార్టీతో మనిషి ఘన విజయం సాధించినట్లు ప్రకటించాడు దేవుడు.
అంటే అ ఒక్క ఓటు కుక్కదే నన్నమాటే గదా !
"ఛీ...కుక్క కుక్కబుద్ధి పోనిచ్చుకున్నది కాదు... కనకపు సింహాసనమ్మీద కూర్చోబెడతామన్నా వెనుకటి బుద్ధి ఎలా పోతుంది! " అన్న శతక పద్యం తలుచుకుని  చీదరించుకొంది కాకి & కో . :
 లోకులు పలుకాకులు.
 " ఈ శునకం ఓటెలాగూ మనిషికే వేస్తుంది.  గెలిచే పక్షంలో  వుండటమే  తెలివయిన పని అని నేనూ అటు దూకేసాను !" అని సంబర పడిపోయింది   మార్జాలం.
"నువ్వటు దూకటం చూసి నేనూ అటే గంతేశాలే    ఆఖరి నిమిషం లో!" అంది కప్ప నాలిక అదోలాచప్పరిస్తూ.    
'"ఎదయితేఏం!  మనిషి గెలిచాడు. గెలిచిన వాడితో సంధి చేసుకోవటం ఓడిన పక్షానికి శ్రేయస్కరం. ఎందుకు చెపుతున్నానో అర్ధం చేసుకోండి!" అని ఓ  ఉచిత  సలహా పారేసి ఇంచక్కా అంతర్థానమయి   పోయాడు దేవుడు. 
దేవుడి మాట మేరకు పావురాయిని  రాయబారానికి పంపాయిజంతువులు .
  పోయిన కపోతానిది అదే పోత! ఎంతకూ  తిరిగిరాలేదు! పావురాయికి పాపం ఏమయినట్లు?!
రెండు రోజుల తరువాత మనిషి దగ్గరనుంచి చిలుక ద్వారా వర్తమానం   వచ్చింది.  "డబుల్ థేంక్స్! ఒకటి గెలిపించినదుకు.రెండు పావురాయిని గిఫ్ట్  గా పంపించినందుకు!మీ  రెండో బహుమానం   మహా పసందు " అంటూ. పావురాయిని మనిషి మసాలో కూరి విందు లాగించుకున్నట్లు జంతువులకు అర్థమయింది. తన మీద దేవుడికి ఫిర్యాదు చేసిన ఏ జీవిని మనిషి వదిలిపెట్టడన్న  మనిషి ఆటవిక నైజం అడవి జంతువులకు అప్పుడు గాని  బోధపడింది కాదు. 
 '                             మనిషెంత దుర్మార్గుడు! మన అడవిలో కూడా మరీ ఇంత అన్యాయం లేదు .' అనుకున్నాయి అన్ని జంతువులు ఆ వేదనగా.
 "అందుకే నేను వాడికి ఓటు వెయ్యనిది.  ఒట్టు... నన్ను నమ్మండి"అని గోల పెట్టింది శునకం. 

       మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆ ఒక్క ఓటూ ఎవరిది?!ఎవరిది? ఎవరిది?!   
ఆ దేవుడికే తెలియాలి. చివరికి ఆ దేవుడే సస్పెన్స్  తేల్చేయాల్సొచ్చింది  కిందికి దిగి    .
'ఇదంతా ఆ వరహవతరంగారి పుణ్యఫలమే !' అని తేలిపోయింది దేవుడు పెదవి విప్పడంతో.
" మామనిషికి గనుక  ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషివయి పుట్టటమే కాదు   రాజకీయాల్లోకూడా పడతావని చిలుక      చాటుగా  బెదిరించి పోయింది బాబోయ్! అందుకే . అదిరిపోయి అటే  ఓటు వెయ్యాల్సి వచ్చింది"  అంటూ బురదలో మొహం దాచుకొని కుళ్లి కుళ్లి ఏడవడం    మొదలు పెట్టింది  పాపం ఆ వరాహమిప్పుడు.
 
నీతి :ఇకనయినా  మనం , మనుషులం కనీసం జంతువులయినా అసహ్యించుకునే స్థాయి దాక రాజకీయాలను దిగాజార్చు  కోకుండా  వుండటం మంచిది కదా!
 
-- కర్లపాలెం హనుమంతరావు
ఆగష్టు 19, 2010
(ఈనాడు దినపత్రిక సంపాదకీయ ప్రచురణ)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...