నాలుగు రోజులుగా ఒంట్లో బాగుండటం లేదు. టెంపరేచర్
చూస్తే నార్మల్ గానే ఉంది. కానీ ఆకలి మందగించింది. దాంతోపాటే చురుకుదనమూ తగ్గింది
బాగా. ఇదివరకు ఇలాగే సుస్తీ చేసినప్పుడు డాక్టర్ రామనాథంగారి దగ్గర కెళ్లాను. 'అన్నీ వితిన్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం తొందర్లోనే
మెజారిటీలో కలసిపోతారు' అన్నాడాయన.
'మెజారిటీ అంటే?'
'మన దేశంలో నలభై ఏళ్ళు దాటినోళ్ళందరికీ బి.పిలు,
షుగర్లు తగులుకుంటున్నాయి. ఆ మెజారిటీ' అంటూ
నవ్వి టానిక్కులూ అవీ రాసిచ్చి క్రమం తప్పకుండా వాడమన్నాడు. మళ్లా నెలరోజుల తర్వాత
వచ్చి కలవమన్నాడు.
డాక్టరుగారిచ్చిన మందులే కాదు, ఇంకా చాలా మందులు అదనంగా
వాడుతున్నాను చాలా కాలం నుంచి. ఆ డాక్టర్నే కాదు.. ఇంతకుముందు ఇంకా చాలా మందిని
కల్సిన కారణంగా.. తగ్గినట్లే తగ్గి మళ్లా సుస్తీ ఎందుకు తిరగ బెట్టేస్తుందో అర్థం కావడంలేదు.
అందుకే ఈ అవస్తలన్నీ!
ఒంట్లో ఓపికుండంగానే వాలంటరీ రిటైర్మెంటు
తీసుకొన్నాను. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలలో చేరిపోయారు. ఆవిడ ప్రభుత్వోద్యోగి. 'బ్యాంకు ఉద్యోగం. ఎంతొచ్చినా
అవసరానికి మించేం చేసుకుంటాం. బదిలీల మీద ప్రదక్షిణాలు చేయడం తప్ప' అన్న వేడాంతంతో పదేళ్లు ముందే చేసిన అస్త్రసన్యాసం
అది. పనీపాటా లేకపోవడం మొదట్లో సర్దాగానే ఉన్నా.. రాన్రానూ.. సమయం గడవక మహా విసుగు
మొదలయింది.
ఎంతసేపు టీవీ చూస్తే కాలక్షేపం అయ్యేను! ఎన్ని పత్రికలు తిరగేసే
పొద్దు పోయేను!
ఈ మధ్య కంటి చెకప్పుకని వెళ్లినప్పుడు ఆ డాక్టరూ
చావు కబురు చల్లంగా చెప్పేసారు 'మీ ఎడమ కంటికి గ్లాకోమా ఎఫెక్టయింది' అని.
'గ్లాకోమా అంటే?'
'కంటి నరాలకి సంబంధించిన వత్తిడండీ! వంటికి బి.పి
లాంటిదే అనుకోండి. చూపులో మెల్లంగా తేడా వస్తుంది. అలిగి పుట్టింటికి పోయిన
పెళ్లామయితే మనసు మార్చుకొని తిరిగొస్తుందేమో గానీ.. దీందుంప తెగ! పోయిన చూపుకు ఆ మాత్రం కూడా దయ ఉండదు. ఎన్ని మందులు వాడినా చస్తే తిరిగి రాదు. మానవ సంబంధాలను సరిదిద్దేందుకు
ఏమైనా మందులు కనిపెట్టారేమో తెలీదు కానీ.. గ్లాకోమా కారణంగా నష్టపోయిన దృష్టిని
తిరిగి తెప్పించడంలో మాత్రం ఇంత వరకు ఎవరూ సఫలం కాలేదు.
'డాక్టరుగారి సెన్సాఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసే స్థితిలో
లేను నేను. 'మరిప్పుడెలా డాక్టర్ గారూ?' అనడిగాను ఆందోళనగా.
'డోంట్ వరీ టూ మచ్ మిష్టర్ రావ్! అందువల్ల ఒరిగేదేమీ
కూడా లేదు. కొన్ని మందులు రాసిస్తాను. క్రమంగా తప్పకుండా వాడాలి. విజన్ లాస్
కట్టడి చేయడం కుదరక పోయినా.. ఆ స్పీడును కాస్త కంట్రోలు చేసుకోవచ్చు. కావాల్సింది
పేషెంట్ లో మనో నిబ్బరం.. క్రమ శిక్షణ. భోజనం ఓ పూట మానేసినా సమస్య లేదు. కానీ ఈ
మందులు మింగడం మాత్రం మానేయకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ!' అంటూ ప్రిస్కిప్షన్ రాసిచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాడా కళ్ల
డాక్టర్.
కాస్త ఖరీదైన మందులే అయినా క్రమం తప్పకుండా
వాడుతున్నాను. అయినా మధ్య మధ్యలో ఈ సుస్తీ పరామర్శలేవిఁటో! నా ఆందోళన చూసి మా
పక్కింటి రమణమూర్తిచ్చిన సలహామీద ఇదిగో.. ఈ పంజగుట్టలో ఉన్న డాక్టర్ సహాయ్ గారిని
కలవడానికని వచ్చాను.
'రమణ మూర్తి చెప్పాడు' అంటూ
ఆయన క్యాజువల్ గా పరీక్షించి మళ్లా రెండు రోజుల
తర్వాతొచ్చి కలవమన్నాడు. రెంద్రోజులయ్యాక వెళ్లినప్పుడు మళ్లా జస్ట్ క్యాజువల్ గా
పరీక్షించి మరో మూడ్రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు! ఆయన చెప్పిన టైముకే వెళ్లాను
మూద్రోజుల తర్వాత.. పడుతూ లేస్తూ! యధాలాపంగా
ఏదో చిన్న పరీక్షలాంటిది చేసి .. ఇంకో వారం రోజుల తర్వాత వచ్చి
కలవమన్నాడు! వెళ్ళిన ప్రతీ సారీ ఇదే తంతు!
ఏదో చెక్ చేస్తాడు. బరువు చూస్తాడు. ఆకలిని గురించి అడుగుతాడు.
ఆహారం అలవాట్లను గురించి అడిగిందే అడుగుతాడు. నాకు ఎందుకో కాస్త అసహజంగా
అనిపిస్తుంది. అసహనంగా కూడా ఉంది. కొంతమంది డాక్టర్లకు
పేషెంట్లను ఇలా వూరికే తిప్పుకోడం సరదా అనుకుంటా. సాడిజమా?'డబ్బు
కోసవాఁ ఈ తిప్పలన్నీ! అనుకోవడానికీ లేదు ఈయన కేసులో. మొదటిసారి వెళ్ళినప్పుడు
ఛార్జ్ చేసిందే! తరువాత ఇన్ని సార్లు వెళ్లినా పైసా అడగడం లేదు. మరెందుకు ఇన్నేసి
సార్లు తిప్పించుకుంటున్నట్లు?!
ఈ నెలరోజుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చిన
మార్పులు కూడా ఏవీఁ లేవే?!
ఎప్పటిలాగే ఈ డాక్టర్ను కూడా మార్చేయడం ఒక్కటే మంచి మందు.' అని నిశ్చయానికొచ్చేసాను. మార్చేసే ముందు కడుపులో ఉన్న ఆలోచనను ఆయన ముందు పెట్టడం మంచిదనిపించింది. ఆయన చెప్పిన
టైముకి వెళ్లి కలిసాను.
ఎప్పట్లానే బి.పి, బరువు, ఆకలి,
ఆహారం అలవాట్లు.. అన్నీ అడిగాడు. అనుకున్నట్లుగానే మరో మూడు
రోజులాగి రమ్మన్నాడు మందూ మాకూ ఏవీ ఇవ్వకుండానే! ఇహ ఉండబట్టలేక గట్టిగానే
అడిగేశాను మనసులో ఇంతకాలం బట్టీ రొళ్లుతున్న ఆ సందేహం!
ఆయన కోపం తెచ్చుకోలేదు. సరికదా.. నవ్వుతూ
అన్నాడు 'చూడండి
రావుగారూ! మీరు మోతీనగర్లో ఆంజనేయస్వామివారి టెంపుల్దగ్గర కదా ఉంటారు? మా ఇల్లూ ఆ టెంపుల్కి ఆ రెండో వైపే ఉంది. నేను రోజూ అయిదు గంటల ప్రాంతంలో
ఆ గుడి పక్క పార్కులో జాగింగ్ చేస్తుంటాను. నేను మిమ్మల్ని అక్కడ చూస్తుంటాను.'
'నన్నా! పార్కులోనా! ఇంపాజిబుల్ సార్! నేనసలెప్పుడూ
ఆ జాగింగులూ.. గట్రా కోసం పార్కులకు రానేఁ!
''జాగింగుకి రారు. కానీ పాల ప్యాకెట్లు పికప్
చేసుకోడానికైతే వస్తుంటారు కదా? నిజానికి మీరా పాకెట్ల వంకతో
అయినా మీ ఇంటి నుంచి నడుచుకుంటూ రావాలి ఈ వయసులో! కానీ
స్కూటీ మీద వస్తుంటారు. పార్కు గేటు ముందు స్కూటీ ఆపి పార్కు అడ్డ దారి గుండా
అటువైపున్న డాబ్బా నుంచి పేకట్లు తీసుకుని మళ్లా స్కూటీ మీద వెళ్లి పోతుంటారు. నడక
మీకు పడదని నాకప్పుడే అర్థమైపోయింది. మీ కేస్ షీట్ చూసాను. ఈ రెండేళ్ళల్లో నలుగురు
డాక్టర్లని మార్చేసారు. ఇప్పుడు నన్ను కూడా మార్చేయబోతున్నారేమో! నిజానికి మీరు
మార్చాల్సింది డాక్టర్లను కాదు రావుగారూ! మీ అలవాట్లను. లైఫ్ స్టైల్ ని. ఉద్యోగం
మానేశారు. అది మీ పర్సనల్. కానీ ఆరోగ్యం కోసం ఆ స్థానంలో మరేదైనా చేయాలి కదా!
ముఖ్యంగా శరీరానికి అలవాటైన శ్రమనుంచి వంట్లో ఓపికున్నప్పుట్నుంచే అనవసరంగా విరామమిచ్చేస్తే..
ఇదిగో పరిణామాలిలాగే ఉంటాయి.
నేనేదో సంజాయిషీలాంటిది ఇవ్వబోతుంటే వారించి
ఆయనే కొనసాగించాడు 'మీ
గురించి మీ నైబర్ రమణ మూర్తి అంతా చెప్పారు. కనీసం అపార్టుమెంటు వెల్ఫేర్
పనుల్లో అయినా బిజీగా గడపేయచ్చు మీ లాంటి ఎర్లీ రిటైరీస్! ఏదో ఓ
రూపంలో బాడీకి ఎక్సర్సైజెస్ చాలా అవసరమండీ ఈ రోజుల్లో! సారీ! ఇలా అన్నానని ఏమీ
అనుకోకండీ.. ఔట్ పుట్ లేకుండా.. ఒన్లీ ఇన్ పుట్ మీదే ధ్యాస పెట్టేస్తే ఇదిగో..
ఇలాంటి అనారోగ్య సమస్యలే దాడి చేస్తాయ్ శరీరంమీద. బాడీ
బరువెక్కడం.. ఆకలి మందగించడం..ఆసక్తి సన్నగిల్లడం.. ప్రతికూలమైన ఆలోచనలు
పెరిగిపోవడం.. ఇవన్నీ సోమరితనం వల్లనే సంభవించేవని వందేళ్ల కిందటే పరిశోధనల్లో
తేలాయి. మందులు.. చికిత్సల పేరుతో నేనూ ఇంతకు ముందు మీరు చూపించుకున్న డాక్టర్ల మాదిరిగానే
ఎంతైనా గుంజుకోవచ్చు. మీక్కూడా ఏదో ట్రీట్ మెంటు జరుగుతోందన్న తృప్తీ ఉండేది.
ప్రిస్కిప్షన్ పేపరి వంక మీరొక్క సారైనా చూసారా?'
'చూడ్డానికి మీరసలు మందులేవైనా రాసిస్తేగదా డాక్టర్!'
ఛాన్సొచ్చిందని నిష్ఠురానికి దిగబోయాను.
'మందులు రాయడం లేదా?.. ఏదీ
చూపించండి?' అని ఫైల్ తెరిచి ప్రిస్కిప్షన్ పేపరు నా ముందు
పరిచారు.
'రోజూ ఉదయం..
సాయంత్రం ఏదైనా కడుపులోకి తీసుకొన్న
తరువాత.. కనీసం ఓ గంటపాటు నడవాలి' అని రాసుంది.. ఇంగ్లీషులో!
నేనా సలహా చూడకపోలేదు. నడవమని సలహా ఇవ్వడం
మందులు రాసినట్లెట్లా అవుతుందని నా ఆలోచన. అందులోనూ నాకు మొదట్నుంచి నడకంటే మహా
చిరాక్కూడా!
‘ప్రిస్కిష్పన్నలా వదిలేయండి రావుగారూ! మోరొచ్చిన
ప్రతీసారీ నేను నడక ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూనే ఉన్నాను. నా దగ్గర 'ఊఁ' గొడుతూ పోయారే కానీ.. కనీసం మీ ఇంటి దగ్గర
పాలడబ్బాకి వెళ్లేటప్పుడైనా పార్కు అడ్డదారిని ఎంచుకోడం మానేయలేకపోయారు! మీరు
పార్కు చుట్టూ కాలినడకన వెళ్లి పని ముగించుకోడం మొదలు పెట్టేవరకైనా నేను ట్రీట్
మెంటు మొదలు పెట్టకూడదనుకున్నాను. మొదల పెట్టీ ప్రయోజనం ఉండదు. ఇదివరకటి
డాక్టర్లకు మల్లే మీ చేత వందలొందలు ఖర్చు పెట్టించడం.. ఆనక చేతకాని డాక్టర్నని
తిట్టించుకోడం తప్ప. పెరటి చెట్టును కదా.. అందుకు చులకనయానేమో మరి.. మీకే తెలియాలి'
అని నవ్వుతూ లేచాడు డాక్టర్ సహాయ్!
అప్పుడర్థమయింది.. ఇంటిముందు బంగారంలాంటి పార్కు
పెట్టుకొనీ.. జాగింగ్ చేసేందుకు బద్ధకించి రోగలు కొని తెచ్చుకొన్న నా పొరపాటు. మందులకోసం వేలకు
వేలు పోసాను. పదుల కొద్దీ డాక్టర్లను తెగ మార్చేసాను.. లోపం నాలో ఉంచుకొని.
మర్నాడు పాలపాకెట్టుకు బైటకు వెళ్లేటప్పుడు
స్కూటీ తీయ లేదు. ఎప్పటి కన్నా ఓ గంట ముందే లేచి బైటకు వెళ్లే నన్ను చూసి మా ఆవిడ
ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం నేను గమనించక పోలేదు.
పార్కులో జాగింగ్ చేస్తున్న డాక్టర్ సహాయ్ నన్ను
చూసి గుర్తు పట్టి 'హాయ్'
అంటూ చేతులూపాడు కూడా! నెక్స్ట్ విజిట్ కి వెళ్లినప్పుడు 'పార్కు చుట్టూతా అలా నెమ్మదిగా కాకుండా ఇంకాస్త వేగంగా పరిగెడితే..
నెనిప్పుడు రాసిస్తున్న మందులు మరీ ఎక్కువ కాలం వాడాల్సిన పనుండదు' అని భుజం తట్టాడు డాక్టరు సహాయ్ గారు!
-కర్లపాలెం హనుమంతరావు
బోథెల్,యూఎస్ఎ
(చతుర- ఆగష్టు, 2012 నెల సంచిక
ప్రచిరతం)