Thursday, July 11, 2019

ఆంధ్రౌన్నత్యం -



1
వెల్లబోయెదెవేల విశ్వేశ్వరుని గాంచి హంపీవిరూపాక్షు నరయరాదె
డంబువీడెదవేల టాజుమహల్ గాంచి యమరావతీస్తూప మరయరాదె
భ్రాంతిచెందెద వేల వారనాసిని గాంచి దక్షవాటిక గాంచి తనియరాదె
కళలువీడెద వేల కాళి ఘట్టము గాంచి వైశాఖపురి గాంచి పరగరాదె
గాంగజలముల గనుగొని కలగదేల-గౌతమీ గంగ కనులార గాంచరాదె
యఖిల సౌభాగ్యములు నీకు నమరియుండ-దెలివిమాలెద వేమోయి తెలుగుబిడ్డ!
2
ఆలించినావెందు ద్యాగరాట్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
నాలకించితివెందు నాధ్యాత్మ కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
రహివింటి వెచ్చోట రామదాస్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
మొగివింటి వెయ్యెడ బొబ్బిలిపాటల నాంధ్రభూమినిగాక యన్యభూమి
వింటి వెచ్చోట పల్నాటివీరచరిత- మాంధ్రభూమిని గాకున్న యన్యభూమి
నాంధ్రపదమెంత మధురమో యాంధ్రతనయ-తెలిసికొని, నేటికేనియు గులుకవోయి!

3
చిట్టివడాలను చేర్చిన పోపుతో గమనైన పనసకూర
అల్లముకరివేపయాకుతో దాలింపుగా నొప్పు లంకవంకాయకూర
ఘ్రాణేంద్రియముతో రసనేంద్రియము దన్ను పసమీఱు విఱిచిన పాలకూర
గరమసాలాలతో గమగమవలచెడు వసలేని లే జీడిపప్పుకూర
బుఱగుం జూచబియ్యము పూతచుట్ట- లాదిగాగల దివ్య పదార్థవితతి
యాంధ్రులకెకాని మఱియేరికైన గలదె-సేతుశీతాద్రిమధ్య విశేషభూమి!

4
కాలుసేతులును వంకరలువోవగజేసి వణకించు పెనుచలిబాధ లేక
బండఱాళులు గూడ మెండుగా బీటలు వాఱించు వాతపబాధ లేక
ఏరుళూలుగూడ  నేకమై ప్రవహించు వర్రోడుతతవర్ష బాధ లేక
బండుగనాడైన బట్టెడన్నము లేక రొట్టెలే తినియుండు రోత లేక
చూచితూచినయట్టుగా దోచుచుండు-సీతు నెండయు వానయు బూతమైన
యమలరాజాన్నమునుగల్గునాంధ్రభూమి- దలచికొనిపొంగుమెటనున్న దెలుగుబిడ్డ!

-పండిత సత్యనారాయణరాజు
రచనాకాలం:1934

Monday, July 1, 2019

గౌతమీ గంగ కాశీచయనుల మహాలక్ష్మి


గౌతమీ గంగ
 కాశీచయనుల మహాలక్ష్మి
 01/03/2013
కవ్వపుతాడును నేర్పుగా త్రిప్పుతుంటే కవ్వం పైకి, క్రిందకూ ఎగురుతూ కవ్వపు బిళ్ల చేసే మధనానికి కడవలో పెరుగులోని వెన్న పూసలు పూసలుగా పైకి తేలుతుంది. శీతాకాలం చలి వలన వెన్న తొందరగా పైకి తేలదు. అప్పుడు గృహిణి నేర్పుగా కొంచెం వేడినీటిని కడవలో పోస్తుంది. గోరువెచ్చగా అయిన చల్లలోని వెన్న కాస్సేపటికి పైకి తేలుతుంది. ఈ విధంగా చల్ల చిలికి వెన్న తీయడం ఇల్లాలి నేర్పుకి నిదర్శనం. వెన్న  ఓ చట్టిలో పెట్టి నాలుగు రోజులకోమారు నెయ్యికాస్తారు. చల్ల వేరొక కడవలోనికి మార్చేక ఈ పాలకడవలో గోరువెచ్చని నీటిని పోసి ఆల్చిప్ప అనే పరికరంతో గోకి ఎండుగడ్డితో శుభ్రంగా తోముతారు. పెద్ద సైజు నత్తగుల్లను అడుగుభాగాన రాతిపై అరగదీస్తే కొంతపదును వస్తుంది. దీనిని మట్టి పాత్రలు తోమడానికీ, మామిడికాయలపై పెచ్చు తీయడానికి నాటి స్త్రీలు ఉపయోగించేవారు. కొందరు వీటిని ఉగ్గు గిన్నెల్లా పసి పిల్లలకు, ఉగ్గు, మందులు పోయడానికి కూడా వాడేవారు. ఇల్లాలు వాడే ఈ చిప్పలు ఆల్చిప్పలు అయ్యాయి. భూదేవమ్మ గారు చల్ల చేయడం అయే వేళకు పాలేర్లు పశువుల దొడ్డి నుండి పాల బిందెలు తెచ్చి వాకిట్లో వుంచేవారు.పసిబిడ్డా`పాలకుండా’ అని సామెత. పసిపాపను సాకినంత ఓర్పుగా, నేర్పుగా పాడి పనులు నిర్వహించాలని దీని అర్థం.
                       చిన్న పాలేరు పళ్లికతో పిడకలు తెచ్చి పాల గది వద్ద వుంచుతాడు. భూదేవమ్మ గారు పాలదాలిలో పిడకలు పేర్చి, నిప్పురాజేస్తారు. ఈ పిడకలు పేర్చడానికి నేర్పుకావాలి. సెగ ఎక్కువ అయితే పాలు పొంగి నిప్పుల్లో పడిపోతాయి. సెగ తక్కువ అయితే పాలు కాగవు. పాలు కడవలో పోసి దాలిపై పెట్టి కొద్దిగా తెరచి వుండేలా మూత అమర్చి ఈవలకు వచ్చేవారామె. ఆ వేళకు పాలగది వద్ద తారాడే పిల్లలకు నిమ్మకాయంత వెన్నముద్ద అందరి చేతుల్లోనూ పెట్టేవారు. అప్పటికి ఊరిలోని పాడి ఏర్పాటు చేసుకోలేని సామాన్య గృహిణులు సత్తు తప్పాల చేత పట్టుకొని వారిల్లు చేరేవారు. సారవంంతమైన పచ్చగడ్డి, తవుడు, తెలకపిండి, ఉడకబెట్టిన ఉలవలు మేసిన పశువుల పాలు మట్టి పాత్రలలో, పిడక దాలిపై కాగిన ఆ చల్ల మంచి రుచిగా వుండేది. ఊరి వారు మాత్రం ఆ రుచి భూదేవమ్మ గారి అరచేతిలో వుంది అనుకునేవారు. వారందర్ని ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ వారి పాత్రల్లో చల్ల పోసి ఇచ్చేవారామే. ఒక రోజు ఆ వేళకు ఆమె ఆడబిడ్డ వచ్చి ఆ పాత్రలలో నిన్నటి పుల్లచల్ల పోసి ఇచ్చేవారు. ఇంటి నిండా పాడి వుండగా ఇదేం పని అని మనసులో అనుకునేవారు కాని పైకి అనలేకపోయేవారు భూదేవమ్మ గారు. చంటి పిల్లలకు, అనారోగ్య వంతులకు ప్రత్యేకంగా ఆవుపాలు ఇచ్చేవారామె.  
                       మేన అల్లుళ్లు, మేన కోడళ్లూ చల్దన్నాలు తింటూ వుంటే భూదేవమ్మ గారి ఆడబిడ్డ వారి వద్దనే కూర్చొనేవారు. కమ్మని కందిపొడిలో అప్పుడే కాచిన నెయ్యి వేసి పెట్టాక, పాలగదిలో ప్రత్యేకంగా దుత్తలో వుంచిన పెరుగు వారికి వడ్డించేవారు. రోజు కొంత మీగడ వారికి కేటాయించవలసిందే. మధ్యాహ్న భోజనాల్లో మగవారికి వెన్న చిలికిన మజ్జిగ పోసినా పిల్లలకు మాత్రం మూడుపూటలా పెరుగే. రాత్రి మగ వారి భోజనాలు ముగిసాక పెరుగు తప్పాల లోపల పెట్టి పుల్ల మజ్జిగ గిన్నె ఆడవారి వద్ద పెట్టేవారు కామమ్మ గారు. అలా పెడ్తూ ఆడ రంఢలకి పెరుగెందుకు అనేవారు తన చర్యను ఎవరూ ప్రశ్నించక పోయినా.  
                 భూదేవమ్మ గారు నాలుగడుగుల పొడవుతో, చామన చాయతో, బక్కపలచగా వుండేవారు. ఆమె ముఖంలో లక్ష్మీకళ తాండవిస్తూ వుంటుంది. అంచేత ఆ ఇల్లు సిరి సంపదలతో వర్థిల్లుతోంది అనుకునేవారు ఊరి వారు. ఆమె నిత్య సంతోషి. నిగర్వి, గృహకృత్యాలను నెరవేరుస్తూనే నిరంతరం భగవత్‌ సంకీర్తన చేసుకుంటూ వుండేది ఆ ఇల్లాలు. భర్తకు వేద గోష్ఠి, అధ్యాపన, వ్యవసాయ పర్యవేక్షణ, ఊరి తీర్పరితనంతో ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక వుండేది కాదు. భర్త ఎదుట పడి ఇది అవసరం అని చెప్పే ధైర్యం, అవకాశం ఆ గృహిణికి లేదు. ఏ సరుకు కొనాలన్నా కొట్టులో కొబ్బరికాయ ఒకటి ఇచ్చి కొనడమే. నాటి రోజుల్లో కోనసీమలో కొబ్బరికాయ ఖరీదు కాణి (రూపాయలో 64వ వంతు) పిల్లలకు బెల్లం, మిఠాయి కావలసినా( ఆ రోజుల్లో పంచదార మిఠాయి, నేటి స్వీట్లు వీరు ఎరుగరు) ఆడ పిల్లలకు కాటుక కాయకాని, అగులు (బియ్యం మాడ్చి అందులో నీరు కలిపి ఉడికించి చేసే పేస్టు ఆరోజుల్లో కన్య పిల్లలు, కొందరు  మగవారు ఆ ఆగులునే బొట్టుగా ధరించేవారు. దువ్వెన, అద్దం, జడ చివర కట్టే ఊలుతాడు ఏది కావాలసి వచ్చినా కొట్టులోంచి తలో కొబ్బరికాయ తీసి తెచ్చుకోవడమే. అమ్మాయిలకు పరికిణీ గుడ్డలు కావాలంటే వర్తకుడు బట్టల మూట భుజాన పెట్టుకొని పెరటిగుమ్మాన ఇంటిలోనికి వచ్చేవాడు. భూదేవమ్మగారు తమకు కావలసిన బట్టలు కొని వారికి పాలేర్ల చేత గాదెలోని ధాన్యం కొలిపించేవారు. నాలుగు గుడ్డలు తీసుకొని వచ్చిన అతడు బరువైన ధాన్యం మూటతో వంగి వెళ్లేవాడు. భూదేవమ్మ గారు దాల్చేవి ఏడాదికి మూడు నేత చీరలే. అవి సాలెవాడు నేసి తెచ్చేవాడు. ఆమె కాళ్లకు వెండి కడియాలు, గొలుసులు, అందెలు వుండేవి. కాలి వేళ్లకు బోటనవేలు వదిలి మిగతా నాలుగు వేళ్లకు మట్టెలు, పిల్లేళ్లూ అనే వెండి నగలు ధరించేవారు. చేతులకు వెడల్పు పాటి గట్టి మురుగులు ఒక్క జతే, మెడలో మంగళసూత్రాలు నేటి వలే బంగారు గొలుసుతో ధరించడం ఆ రోజుల్లో లేదు. పచ్చని పసుపుతాడుకు గుచ్చిన మంగళసూత్రాలు ధరించి రోజూ స్నానం చేసేటప్పుడు దానికి పసుపు పూస్తూ పచ్చగా వుంచుకునేవారు. నల్లపూసలు కూడా పసుపు దారాన్ని గుచ్చి కుత్తిగంటు అని మెడను చుట్టి కొంచెం బిగుతుగా వుండేటట్లుగా ధరించేవారు.
వివాహ వేళ వధువు కంఠాన ఈ నల్లపూసలు కడుతూ నీలకంఠుడైన శివుడు హాలాహలాన్ని కంఠంలో వుంచుకున్నట్లుగా సంసారంలోని కష్టాలు, బాధలనీ వెలికి చెప్పి వెలితి పడకుండా, కడుపులోనే పెట్టుకొని కృంగిపోకుండా ఇక్కడే అదిమి వుంచు అనే అర్థం వచ్చే మంత్రాన్ని వరుడు చదువుతాడు కదా. నల్లని పట్టుదారాన్ని గూర్చిన అరకాసుల దండ, పెద్ద సైజు పగడాల తావళం ఆవిడ మెడలో ఆభరణాలు. రెండు ముక్కులకు బంగారుకాడలు, ముక్కు కొసన ఎర్రని పొడిగల అడ్డబాస ధరిస్తారామె. చెవులకు ఎర్రని పొళ్లు గల కాణీ సైజు దుద్దులు, చెవుల చుట్టూ మరి మూడు కుట్లకు బావిలీలు, చెవి పోగులూ అనే స్వర్ణ ఆభరణాలు వుంటాయి.   
శాస్త్రి గారికి పొలాలు కొనడం, డబ్బు కూడపెట్టి ఊరి వారి అవసరాలకు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడం తప్పించి డబ్బు వలన మరో ప్రయోజనం లేదు. స్త్రీల అలంకారాలూ, అవసరాలు అనే ఉహే వారికి కలిగేది కాదు. శిష్యులకు ఎంత విద్యాప్రదానం చేసినా అది ఆర్థికంగా ఖర్చు లేనిదే. వారి ఇంట ఎందరు భుజించినా కొదువ లేదు. ఇంట్లో పాడిపంట తరుగనిది, ఎర్రని ఏగాణీ ఖర్చు లేదు.  కొంత సేపు  చూసి భోజనాల వేళ అయిపోతుంటే మరదలు రోటి ముందు కూర్చున్నాక ‘ఇదేమిటే నేను రుబ్బుతాను కదా అంతలోనే తొందరా’’ అన్నా అమెకు జవాబు చెప్పరాదు.  వీటన్నిటి వల్లా కామమ్మ గారికి మరదలు అంటే ఇష్టం లేదు అనుకుంటే అది పొరపాటే. మనసులో మరదలి పట్ల ఆమెకు ఎంతో ఆపేక్ష. ఆ పిల్లల తల్లికి అన్ని విధాల అండ ఆడబిడ్డ. బిడ్డల సంరక్షణా బాధ్యత పూర్తిగా ఆమెదే. అత్తవారి నుండి సాలీన వచ్చే మనోవర్తి డబ్బు పాతిక రూపాయలూ మేనళ్లుడూ, మేన కోడళ్ళ కొరకే ఖర్చు పెడతారు ఆమె. వాళ్లకు తలలు దువ్వడం, స్నానాలు చేయించడం ఆమె బాధ్యత. రాత్రి పూట ప్రక్కలో వేసుకొని పాడ్యమి సంవత్సరాది పాడ్యమి, విదియ భాను విదియ అంటూ తిథుల పేర్లు, చైత్రము, వైశాఖమూ అంటూ పన్నెండు నెలల పేర్లు, ప్రభవ, విభవ అంటూ అరవై సంవత్సరాల పేర్లు వారికి నేర్పుతూ వుంటారు ఆమె. ఆంధ్రదేశంలో అప్పటికి వ్యాప్తిలో వుండి ఆ తరువాత కొంత కాలానికి మధిర సుబ్బన్న దీక్షితులు అనేవారిచే గ్రంధస్థం చేయబడ్డవి కాశీ మజిలీ కథలు.
ఈ జానపద కథల్లో ఒక గురువు కాశీ యాత్రకు పయనమయ్యాడు. అతడికి పరిచర్య చేయడానికి 12 సంవత్సరాల బాలుడు వెంట వెళ్తాడు. అక్కడ దేవాలయ కుడ్యాలపైనా, సత్రపు గోడలపైన వున్న శాసనాలూ, ఊళ్లో వార్తలు సేకరించుకొని వచ్చి వాటి వివరాలు గురువుని అడుగుతాడు శిష్యుడు. గురువు సావకాశంగా భోజనాలు ముగించి వాటి వివరాలు శిష్యునికి చెప్తాడు. ఈ కథలు కొంత అద్భుత రస ప్రధానంగా వుంటాయి. ఒక్కో కథకు పరిష్కారం సూచించబడుతుంది.  కొన్నిటి పరిష్కారం శ్రోతలకే విడవబడుతుంది. ఇందులో రాజకుమారుల సాహసగాథలు, చతురులైన వారి నేర్పరితనం, యుక్తులు, స్త్రీల పాతివ్రత్యం, నాటి సంఘంలో నెలకొని వున్న వేశ్యల నెఱజాణతనం చిత్రింపబడి వుంటాయి. ఈ కథలలో బ్రహ్మాండమైన సస్పెన్స్‌ వుంటుంది. భట్టి విక్రమార్కుల కథలు అన్న పేరుతో భారత వర్షాన్ని ఏలిన విక్కమార్క చక్రవర్తి కథలుగా కొన్ని అద్భుత, సాహసగాధలు కూడా ప్రచారంలో వుండేవి. ఈ కథలను మేనత్త చెప్తుంటే వింటూ మహదానందంతో కేరింతలు కొడుతూ ఆమె చుట్టూ చేరిన పిల్లలు నిద్రపోయేవారు. పాలేర్లు వేసిన ప్రక్కలపై వారు పడుకుంటే వారి సమీపంగా ముక్కాలి పీట మీద కూర్చొని వున్న ఆమె వద్దకు మగవారి భోజనాలు ముగిసాక భూదేవమ్మ గారువచ్చి వదినగారు వేడి నీళ్లు పెట్టాను మీరు స్నానం చేస్తే ఫలహారం చేద్దురు గాని అంటారు. అప్పటికి రాత్రి మొదట జాము పూర్తి అవబోతూ వుంటుంది. ఆమెకు ఒక విస్తరిలో కొయ్య రోట్లో మినప రొట్టో వడ్డించి పచ్చళ్లు వేసి మజ్జిగ, మంచినీళ్ల చెంబు ప్రక్కన పెట్టి ఆమె భోజనం ముగుస్తుంటే భూదేవమ్మగారు వడ్డించుకుంటారు. ఫలహారం ముగించిన కామమ్మ గారు తిరిగి పిల్లల వద్దకు వచ్చి వార్ని నిద్ర లేపి తలో మినప సున్ని వుండో, ఆరిసో, చక్కిలమో పెట్టి ఇన్ని మంచినీళ్లు ఇచ్చి ఆవగింజంత నల్లమందు మాత్ర వేస్తారు. ఆ విధంగా వేస్తే పిల్లలకు కలత లేని నిద్ర పడుతుందని, ప్రక్క తడపరనీ ఆవిడ నమ్మకం. పిల్లల మధ్యలో ఒరిగి భగవన్నామ స్మరణ చేస్తూ నిద్రపోతారామె..
బాప్పా। (బాబుకు అప్ప) అంటూ పిల్లలంతా ఆమెకు ప్రాణం పెడతారు. మడీ తడితో పిల్లల్ని పట్టించుకోవడానికి కుదరని తల్లికి ఆమె పెద్ద అండ. శాస్త్రి గారికి పెద్ద దిక్కు ఆమె. ఆయన ఏ పని చేసినా ఆమె అనుమతి తీసుకోనిదే చేయరు. ఆస్తి పాస్తుల వ్యవహారాల నుండి పెళ్లి సంబంధాల వరకూ అన్నిటా ఆమె తన విశేషానుభవంతో తమ్మునికి సలహా ఇస్తూ వుంటారు.    
గ్రామ స్త్త్రీలు పొరుగూర్లకు వెళ్లాలంటే సామాన్యులకు కాలినడకే శరణ్యం. శాస్త్రిగారి ఇంట వారి అప్పగారు, కుమార్తెలు ప్రయాణం అయితే పొలం నుంచి రెండెడ్లు పూన్చిన గూడు బండి వస్తుంది. భూదేవమ్మ గారు పయనమైతే పెరట్లో శాలలో పైన వేలాడకట్టిన మేనా క్రిందకు దింపుతారు. ఇది చెక్కలతో పెట్టి ఆకారంగా తయారు చేయబడి వుంటుంది. దీనికి తలుపులు వుంటాయి. లోన మెత్తలు పరచి చలువ దుప్పటి పరుస్తారు. నలుగురు చాకలులు ఒహొం ఒహోం అని లయబద్ధంగా ధ్వని చేస్తూ భుజాలపై మోసుకొని వెడతారు దీన్ని. శాస్త్రిగారు పయనం చేయాలంటే అందలం అనే ఒక రకం పల్లకీవస్తుంది. క్షత్రియ సంప్రదాయాలు పాటించే ఆ ఊరిలో సంపన్న క్షత్రియులు ప్రయాణించే ప్రయాణ సాధనాలు ఇవి. రాచ వారితో సరితూగే శాస్త్రిగారు, భార్య మాత్రమే వాటిని వాడుతారు.
భూదేవమ్మ గారికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. ఆ ప్రాంతాల మహిమ గల తల్లిగా పేరు పొందిన మరిడే మహాలక్ష్మమ్మకు మ్రొక్కుకున్నాక ఆమె కడుపు పండి బాలిక కలిగింది. పచ్చన పసిమి చాయతో బొద్దుగా తండ్రి పోలికతో వున్న ఆ బాలిక అందరికీ అపురూపమే శాస్త్రిగారు బాలిక జాతకాన్ని పరిశీలించారు. ఆమెకు కీర్తవంతుడైన భర్త, ప్రయోజకులైన కొడుకులూ కలుగుతారు. ఆర్థిక పరిస్థితే ఒడిదుడుకుగా కనపడుతున్నాయి. తాను వుండగా దానికి లోటెలా వుంటుంది అనుకున్నారాయన. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆడపిల్ల జాతకాన్ని బట్టి పుట్టినింట, అత్తింట సౌభాగ్యం వుంటుంది. ఇంట్లో ఆ అమ్మాయిది ప్రథమ స్థానం. చిన్న పిల్ల అయినా పండుగ, పబ్బం ఏదయినా ఆమె చేతుల మీదుగానే జరగాలి. ఆమె తరువాత క్రమంగా నలుగురు ఆడపిల్లలు కలిగారు వారికి. శాస్త్రిగారికి అప్పగారికి ఈ పిల్లలందరూ ప్రేమపాత్రులే. భూదేవమ్మ గారికి గృహకృత్య నిర్వహణలో తలమునకలౌతూ వీర్ని పట్టించుకోనే తీరిక వుండదు. చాలా కాలానికి ఆమె మళ్ళీ గర్భం దాల్చారు. ఈ సారయిన మగ పిల్లవాడు కలిగితే బాగుంటుందని శాస్త్రిగారితో సహా అందరూ అనుకుంటున్నారు. ఆమె సవతి కొడుక్కి మాత్రం కంగారు బయలుదేరింది. ఇంతవరకూ వున్న వాళ్లు ఆడపిల్లలు గనుక ఏ విధంగా వారికి పెళ్ళిళ్ళు చేస్తే వారి దారిన వారు పోతారు. ఈ సారిగాని మగపిల్ల వాడు కలిగాడా, తండ్రి ఆస్తిలో సగభాగం పంచుకొని పోతాడు. అతడు తన సవతి తల్లికి మగపిల్లవాడు కలుగకుండా వుంటే గ్రామ దేవతకు మేకపిల్లని బలి ఇస్తానని మ్రొక్కుకున్నాడనుకుంటుంటే విన్నామని చుట్టు ప్రక్కల పొలాల్లో పని చేసుకొనే  రైతులు అంటూ వుంటారు.
మహాలక్ష్మమ్మ పెళ్ళి గురించి శాస్త్రిగారు ఆలోచించసాగారు. వారి ఎరికలో కొన్ని సంబంధాలు వున్నాయి. వారు ఆస్థి పరులేకాని వరులకు విద్యాగంధం లేదు. పెద్ద కుమారుడు తన పేరు నిలిపేవాడు కావాలని ఆయన ఎంతగానో ఆశించారు. అతడికి చదువు అబ్బలేదు. ‘‘పండిత పుత్రః పరమ శుంఠః’’ అన్నట్లుగా వుంది అతడి పని. ‘‘యస్య జ్ఞాన దయా సింధోః। అగాధ స్యాన ఘాః గుణాః।’’ అన్న అమరకోశపు ప్రార్థనా శ్లోకానికి ‘‘సత్యజ్ఞాన దయాసింధోః। గోడ దూకితే అదే సందు’’ అనీ అధ ప్రజానామపః ప్రభాతే॥ అన్న రఘువంశపు రెండవ సర్గలోని మొదటి శ్లోకానికి ‘‘అధప్రజానామీది కంది పప్పు।’’ అని పరిహాసంగా విపరీతార్థలు చెప్తూ సాహిత్యం పట్ల అతడు ఎగతాళి బుద్ధి కలిగి వున్నాడు. ఇంట్లో వున్న అశేష బంధు బలగాన్ని చూస్తే అతడికి ఒళ్ళు మండిపోయేది. ఇంటిలోన తండులంబు నసంతి। నేడు పొండు రేపు రండు’’ అనీ ‘‘ఇంటిలోన తండ్రులంబులు నసంతి। తిండికైతే పది మంది వసంతి’’ అని పరిహసించేవాడు. చిన్నవాడు ఏదో అంటున్నాడు అని కొందరు సరిపెట్టుకొనేవారు. కొందరైతే అది హేళనగా తలచేవారు. ఇటువంటి విషయాలు శాస్త్రిగారి చెవి వరకు  రావడానికి కొంతకాలం పట్టింది. విన్నాక వారు కొడుకును మందలించాలని చూచారు గాని అతడు సరకు చేయలేదు. తనకన్నా 3 ఏళ్లు మాత్రమే పెద్ద అయిన సవతి తల్లిపై అతడికి మాతృ గౌరవం కలగటం లేదు. తన ఆస్తి తేరగా తినడానికి వచ్చిన దానిలా తోస్తుంది.
    కొడుక్కు ఎటూ చదువు అబ్బడం లేదు. విద్వాంసుడూ, బుద్ధిమంతుడూ అయిన పిల్లవానిని అల్లుడుగా తెచ్చుకొని ఈ లోటు కొంతయినా భర్తీ చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. చాలా వాకబులు చేసాక గోదావరి ఆవల ఆత్రేయపురం గ్రామంలో వేద పండితుడూ, యజ్ఞ నిర్వహణాదక్షుడు అయిన యువకుడు వున్నట్లుగా తెలిసింది. తండ్రి గతించాడు. తాత మహా పండితుడు, వంశ వృద్ధుడు, ఆస్థిపాస్తులు పెద్దగా   ఏం లేవు. శాస్త్రి గారు తమ కుమార్తెను ఈ వరునకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.   
స్వయంగా ఆత్రేయపురం వెళ్లి ముసలి కృష్ణ సోమయాజులు గారి దర్శనం చేసారు. ఆ యజ్ఞ పురుషుని చూడగానే శాస్త్రి గారికి భక్తి ప్రతివర్తులు కలిగాయి. శాస్త్రిగారు తమ అభిప్రాయం చెప్పగానే ఆయన బాబు నీవు అభిమానంగా ఇంత దూరం వచ్చావు సంతోషం ‘‘వివాహశ్చ వివాదశ్చ సమయోరేమశోభతే’’ అని కదా పెద్దలు చెప్తారు. విద్యలో సంప్రదాయములో మనకు పొత్తు కుదురుతుంది. కాని నీవు లక్ష్మీ పుత్రుడివి. రాచ మర్యాదలతో మెలుగుతున్న వాడివి. ఈ ఇల్లు చూచావు కదా. ఇక్కడ బ్రహ్మ దేవుడూ ఆయన ఇల్లాలూ కొలువై వున్నారు కాని ఆమె అత్తగారు మాత్రం ఈ వంక కన్నెత్తి కూడా చూడదు. ఈ ఇంట అంతా కోడలిదే పెత్తనం అన్నారు లక్ష్మీ సరస్వతుల్ని వుద్ధేశించి, శాస్త్రిగారూ మామగారు మహా పురుషుడైన  శ్రీ కృష్ణుడు అష్ట ఐశ్వర్యాలు వున్నాక కౌరవుల్ని కాదని తన చెల్లెల్ని అర్జునునికి ఎందుకు ఇచ్చాడంటారు ? మీరు మరీ అడ్డు చెప్పకుండా నా సంకల్పాన్ని మన్నించి నన్ను దీవించండి. మీ అనుజ్ఞతో నేను కన్యాదానం చేసుకొని ధన్యుణ్ణి కానీయండి అని కృష్ణ సోమయాజులు  గారికి నమస్కరించారు. వంటింటి గడప దగ్గకు వెళ్లి ‘‘ అప్పా! పెళ్ళీడు వచ్చిన పిల్లను ఎన్నాళ్ళు ఇంట వుంచుకుంటావమ్మా! నీ కోడల్ని చేసుకొని సొమ్ము నువ్వు తెచ్చుకో’’ అన్నారు. నాటి రోజుల్లో పెళ్ళి బేరాలు లేవు. ఇంతటి సంపన్నులతో నేను ఎలా తూగగలను అని సోమయాజులు మధన పడుతుండగానే నడవపల్లి గ్రామం నుంచి పెళ్ళి సంబరాలన్ని బండ్ల మీద వచ్చాయి. ఆ రోజుల్లో గోదావరిలో నీరు లేని వేసవి రోజుల్లో రెండెడ్ల బండ్లను గోదావరిలో దింపి మొలబంటి నీళ్లతో ఎడ్లను తోలుతూ బండి నడిపి గోదావరి దాటేవారు. ఆ విధంగానే పెండ్లి వారు రెండెడ్ల బండ్లపై పెళ్ళికి తరలి వెళ్లారు.  
                           జమిందారీ స్తాయితో మెలగుతున్న శాస్త్రి గారు తమ గారాబు కుమార్తెకు ఎంతటి సంబంధం తెస్తారో అని ఊరి జనం, అశేష బంధుమిత్రులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ పెండ్లి వార్ని చూస్తూనే వారంతా పెదవి విరిచారు. వరపంచకం అన్నట్లుగా పెండ్లి వారి తరపున వచ్చిన వారే పదిమంది. శాస్త్రిగారు పంపిన  10 బండ్లలో 8 బండ్లు ఖాళీగానే తిరిగి వచ్చాయి. శాస్త్రిగారు ఏర్పాటు చేసిన భజంత్రీలు విడిది పందిట్లో మేళం చేసాక పెండ్లి వారు పందిరిలో విడిసారు. శాస్త్రిగారు ముసలి కృష్ణ సోమయాలుగారికి అగ్గగ్గలాడిపోతున్నారు. వారి సోదరుని కుమారులు, బావమరదులూ నలుగురు ముత్తయిదువులు మాత్రమే వచ్చిన పెళ్ళివారు వితంతువులు వివాహాది శుభకార్యాలకు వెళ్లడం  నాటి ఆచారం కాదు  కనుక సోమయాజులు గారి మరదలు, కోడలూ, కుమార్తెలూ కూడా రాలేదు. ఆడ పెళ్ళివారు ఎవరికి మర్యాదలు చేయాలో  తెలియక ముఖాముఖాలుచూసుకొని వచ్చిన బంధువుల్లో వృద్ధ ముత్తయిదువును కూర్చోబెట్టి వియ్యపు వారి మర్యాదలూ, ఆడపడుచు లాంచనాలు అన్నీ ఆమెకే జరిపారు. మహాలక్ష్మి దబ్బ పండు చాయ పండిన మామిడి పండులా మిస మిసలాడే నేవళీకం వరుడు నల్లని నలుపు, జమిలి ఎముకతో దృఢమైన శరీరం, పళ్ళు ఎత్తు కన్యావరయతే రూపం, మాతావిత్తం, పితాశృతం, భాంధవాః కులచ్చమృష్టాన్న మితరేజన్నాః। అని కదా అర్యోక్తి ఇక్కడ లోకం ఎరుగని అమాయకపు బాల మహాలక్ష్మికి వరుని అంద చందాల్ని ఎంచుకొనే ఊహ ఇంకా రాలేదు. భూదేవమ్మ గారు వరుని సిరి సంపదల్ని గణింపగల వ్యవహర్త కాదు. శాస్త్రిగారు కోరే పాండిత్యం వరునిలో సమృద్ధిగా వుంది. కులమంటే జటావల్లభుల వారంటే ఆ చుట్ట పట్ల పాండిత్యంలో సదృత్తంలో ప్రఖ్యాతి పొందిన వారు. ఊరి జనం కోరే మృష్టాన్న విందులు శాస్త్రిగారింట ప్రతినిత్యం జరుగుతూ వుంటాయి. ఇక నేడు చేప్పేదేముంది ఆ చుట్టు ప్రక్కల ఏ ఇంట్లోనూ 10 రోజుల పాటు పొయ్యి రాజేసింది లేదు. బట్రాజుల బిరుదు పఠనం వారాంగనా నృత్యాలూ, డోలు సన్నాయి మేళాలు మొదలైన  లాంఛనాలన్నీ పెళ్ళి ఐదు రోజులూ జరిగాయి. ఇంటి ఆడవారు మాత్రం గడపదాటి బైటకు వచ్చేవారు కారు. ఎంత పెద్ద ఆవరణ వున్నా కన్యా ప్రదానం ఇంటి పెద్ద సావిడిలోనే జరిగింది. స్త్రీలు తమ వేడుకలన్నియు ఇంటిలోపలే జరుపుకొన్నారు.
కాశీచయనుల వెంకటమహాలక్ష్మి
విహంగ మాసపత్రిక సౌజన్యంతో

Tuesday, April 16, 2019

రామా అన్నా బూతేనా!

 

రామా! అన్నా రావే.. అమ్మా..! లానే వివిపిస్తోన్నదీ మధ్య మరీను! సూత పురాణాలు ఎలాగున్నా.. బూతు పురాణాలతో పునీతమవుతున్నాయి తాజా రాజకీయాలు!  తిట్లు నోటికి పట్టకపోతే ఎన్ని కోట్లు  పోసినా నేతల నుదుటికి  నామాలులాగా మారింది వ్యవహారం!  బూత్ స్థాయి నుంచి ఎదిగొచ్చే నేతల కన్నా బూతుల సైడు నుంచి దూసుకునొచ్చే అప్ కమింగ్ లకే ఇప్పటి పాలిటిక్సులో హవా!  ఏ బేవార్స్ పార్టీ టిక్కెట్ కట్ కావాలన్నా.. సిఫార్సుల కన్నా ముందు నోటి దురుసు పోర్సెంతో నిరూపించాలి పెద్దల ముందు. నోటికి కుట్లేసుక్కూర్చుంటే పని అవ్వదు. ‘అవ్వ్హ!’ అంటూ బుగ్గలు నొక్కుకునే బుద్ధిమంతులకు ఎవ్వరూ కవరేజీలివ్వరు. . నాలుగు పూటల పాటైనా జనం నోళ్లల్లో నలగాలంటే పడతిట్టాలి..  పదంతలు తిట్టించుకోవాలి! పరువూ.. ప్ర్రతిష్టలంటూ రాజ్యాంగం బుక్కులు పట్టుక్కూర్చుంటే శని దేవుణ్ని సరాసరి తెచ్చి నెత్తి మీద ప్రతిష్ఠించుకున్నట్లే! పుట్టి బుద్ధెరిగినప్పటి బట్టి  పార్టీ సిధ్ధాంతాలకు మాత్రమే బద్ధులయే బుద్ధిమంతులు కొందరున్నారింకా.  మంద రాజకీయాలు ముందుకొచ్చినాక వాళ్లంతా మందబుద్ధుల జాబితాలో చేర్రిపోయారు! ‘ఛీఁ’ అన్నా చీదరింపేనని భావించే ఈ మాననీయులకు  చివరికి మిగిలే ఆస్తి ఓన్లీ స్వీయ  చింతలతో కూడుకున్న సొంత బ్లాగులు మాత్రమే సుమా! బ్లా,,, బ్లా.. బ్లా అంటూ మైకు వదలకుండా వాగేవాడిదే ఏ ఊరైనా.. వాడైనా! దుడ్డొక్కటే ఇప్పటి రాజకీయాలకు చాలదు. చలాకీగా దుడ్డుకర్రా చేతపట్టే ఆడిస్తేనే గొప్పనేత.  అమాయక ఓటర్లు గుండె దడతో అయినా జే.. జే..లనేది ఆ మాదిరి నాయకమ్మన్యులకే!    పదవి దొరసానమ్మ  వరువాలు సాంతం సొంతమవాలంటే అవిశ్రాంతంగా రాజకీయ విరాట పర్వంలో కీచకపాత్ర పోషించడమే కీలకం. కీలెరిగితేనే వాత పెట్టాలన్న స్కూల్ ఆఫ్ థాట్.. తాతల జమాలో చెల్లిందేమో గానీ.. తాజా రాజకీయాలల్లో ముందు వాత.. ఆ తరువాతే కీలు కోసం వెతుకులాట! శివ తాండవాలు.. వితండ వాదాలల్లో పండిపోయిన దుందుడుకు పిండాలకు వెనక వచ్చినా ముందు వరసలో సీటు! కొండను పిండి కొట్టి చూపిస్తామనే పిస్తా ఒకడైతే.. అదే పిండిని మళ్లీ కొండ కిందకు మార్చే మ్యాజిక్ చేసి చూపిస్తామని మరొకడు! కొట్టుకోడాలు, డబ్బాలు కొట్టుకోడాలల్లో కొట్టిన పిండిగా తయారైనవాడికే   నేటి  పాలిటిక్సులో నొంటికి నిండుగా తిండి! ఆ తిండి తిప్పల కోసమే నేతల వేషాలు .. రోషాలూ నేడిక్కడ ఎక్కడైనా చూడు! శేషమ్ కోపేన పూరయేత్ అన్న లోకోక్తిని రాజకీయాలే ఇప్పుడు మా బాగా రక్తి కట్టిస్తునన వినోదం.

 నిగ్రహం ప్రదర్సిస్తే ఏమోస్తుంది? మహా అయితే కర్నాటకంలో మాదిరి మైనర్ పార్టీల పట్ల కూడా ఔదార్యం ప్రకటించినట్లు మంచి పేరొస్తుంది.  అదే  మరి ఆగ్రహాలు ప్రదర్శిస్తేనో.. కుమార స్వామికి మల్లే మంఛి ముఖ్యమంత్రి పదవొస్తుంది. నిన్నటి ఎన్నికల్లో రైతన్నలు అంతలా అలిగి ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెట్ట బట్టి కదా దేశమంతా ఓ సారి వారి వంక మోరెత్తి చూసిందీ!  ఎంతటి మహరాణుల భవంతుల్లో అయినా కోపగృహాలంటూ ప్రత్యేకంగా ఎందుకుంటాయ్? తాపాలకు మించి కోపాలకే ఎక్కువ పవరుంటుంది. కాబట్టే రాజకీయాలల్లోనూ అలకపాన్పుల సీనులు కంపల్సరీ!   

జాతికి నీతులు ప్పేదానికంటూ పుట్టిన   రామాయణమే వాల్మీకులవారి వ్యాకులం నుంచి పుట్టింది కదా! కిరాతకుడు, పొట్ట కూటి కోసం పిట్టల్ని కొట్టడం తప్పెట్లా అవుతుంది?! అయినా వాల్మీకి మహర్షులకు పూనకం వచ్చేసింది! ఆ వూపులోనే  ఐదు కాండల నీతికావ్యం   జాతికి దక్కింది! స్మితపారిజాతుడు శ్రీరామచంద్రుడు అన్నగా  పక్కనే ఉన్నా ఒక్క క్షణం తిన్నగా  మాట్లాడి ఎరుగడు   క్ష్మన్న! ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ  భార్య నోరు విడిచి అడిగిందాకా  గుర్తుకే రాలేదు  దశరథ మహారాజుకు. సాత్వికత గుణగణాలన్నింటికీ గురువు వంటిదన్న గౌరవంతో కైకమ్మ తల్లే కనుక గమ్మునుండుంటే ఎవరికీ పట్టని పాదుకలకు అంతలా  పట్టాభిషేకమనే అదృష్టం పట్టివుండేదా? మంచి మర్యాదలేవీ పట్టించుకోకుండా కట్టుకున్నవాడినే పొట్టన పెట్టేసుకుందని పాపం ఆ ఆడకూతురుని ఈ నాటికీ జాతి ఆడిపోసుకుంటున్నది! ఎంత వరకు సబబు?

కంస మహారాజంత కర్కోటకంగా తోడబుట్టిన దానితో వ్యవహర్రించ బట్టే కదా వసుదేవుడంతడి వాడి చేత ఓ  కోన్ కిస్కా గాడిద  కాళ్లలా పట్టించుకోగలిగింది. భవిష్యత్తరాల  ముందు తన శీలం  హననమవుతుందని తెలిసీ పాపం..  ఎంత సహనంతో అంతలా  తన అసహనం ప్రదర్శించి మరీ మురారికి అంతలా  దుష్ట శిక్షణోపహతుడన్న కీర్తి తెచ్చుంటాడు  శిశుపాలుడు? రావణాసురుడు, కార్తవీర్యుడి వంటి ఎందరో  నీచులు యధాశక్తి తమ కాముకత్వం,   వాచాలతత్వం వంటి దుష్టబుద్ధుల నెన్నింటినో  ధైర్యంగా  కార్యాచరణలో పెట్టబట్టే ఒక రాముడు, మరో కృష్ణుడు జాతికి ఆరాధ్యదైవాలుగా పూజనీయులయ్యారు!      

మంచి పేరు కోసం నాలుగు చల్లని కబుర్లు వల్లించడం మోకాళ్లు లేపలేని ఏ మూడు కాళ్ల ముసలైనా సులువుగా చేసేసే ఘనకార్యమే. దుర్మార్గుడన్న చెడ్డ పేరు వచ్చి పడుతుందని తెలిసీ   ఏ కొద్ది మందికో బుద్ధిమంతులన్న సత్కీర్తి సాధించిపెట్టేందుకు   హిరణ్యాక్షుణ్ని మించి  హింసాప్రవృత్తులను ప్రదరిండమే ప్రశంసనీయమైన దుస్సాహసం. రుక్మిణమ్మ పాత్రివ్రత్య మహిమను లోకానికి చాటించడం కోసమే  పిచ్చి సత్యభామ తల్లి తనను తానో కోపిష్టి భార్యగా చిత్రీకరించుకుంది!

ఆ లెక్కకొస్తే అలకలంటూ లేని మహితాత్ములెక్కడున్నారో నిర్మొహమాటంగా నోరిప్పి చెప్పండి! అలుగుటయే యెరుంగని  ధర్మరాజంతటి మహామహితాత్ముడే అలా అలవోకగా అలిగి అంత లావు కురుక్షేత్రం సృష్టించాడే!  ఉప్పూ కారాలు పప్పూ బెల్లాల్లా మెక్కే నోళ్లకు కళ్లెమేయాలని చూడ్డమంటేనే పెద్ద  కుట్రకు చాటుగా వ్యూహం నడుస్తున్నట్లు లెక్క! ఎన్నికల సీజన్! ఈసీల దృష్టికే గనక  ఈ ఘనకార్యమెళితేనా!  మేటరెంత సీరియస్ అవుతుందో ముందది తెలుసుకోడం మేలు!  ఎన్నికల కోడు ఏ క్షణంలో ఎవరి మాడుకు తగులుతుందో ! ఊహించుకోడం సాక్షాత్తూ ఆ దేవుడిక్కూడా తరం కాదు!

పేదల సంక్షేమ పథకాలు గట్రా పవరొస్తే  మరో టర్మ్ లోనైనా తీరిగ్గా చేసుకోవచ్చు. పెట్రేగే అధికార పక్షాలని ముందు కట్టడి చేయడం ముఖ్యం. దేవుడు ఇంత పెద్ద నోరిచ్చింది ఎందుకంట? బుద్ధిమంతులకు మల్లే స్వర్గానికి పోతే దేవుడి ముందు దేభ్యంలా నిలబడాలి..  బోడి ,మంచీ మర్యాదకోసమని బతుకునంతా ఇక్కడిట్లా ఏ తిట్లూ పాడూ వాడకుండా వృథాచేసుకుంటూ గడిపేసుకుపోతుంటే! దేవుడు పెట్టే దిక్కుమాలిన చివాట్లన్నీ  వింటూ దోషిలా  నిలబడే బడుద్ధాయిలకేం బాబూ.. ఎన్ని ధర్మపన్నాలైనా కుళ్లుబుద్ధితో వల్లించేస్తారు! పాపభీతితోనే నాయనా ప్రతిపక్షంలో కుములుతుండీ శాపనార్థాల శాస్త్రాన్ని వృథాచేయకుండా యధాశక్తి నోటి బలుపు కొద్దీ పాటుపడుతున్నదీ!  అధికారులన్న భీతైనా  లేకుండా పోలీసు బాసుల నుంచి పాలనాధికారుల దాకా  అందరి మీదా మాటలతో దాడి  చేసున్నందుకైనా  ముందు  ఆ దుందుడుకుతనాన్ని అభినందించాల్సుంది.

 భగవంతుణ్ణి చేరేందుకు భక్తి కన్నా వైరమే దగ్గరి దారని గదా జయవిజయులనే యక్షులిద్దరూ అంత వత్తిళ్లున్న  రాక్షస ప్రవృత్తులను ఎంచుకుమ్మదీ? మరా యక్ష పితామహుల అడుగుజాడల్లో నడిచినా ఆగడాలేనా?

కోపతాపాలు ఇవాళే ఏమన్నా కొత్తగా పుటుకొచ్చిన వికారాలా? కాలుడి మూడో కంటి పరమార్థమేంటో వేరే చెప్పాలా? కాలికి గుచ్చుకున్న ముల్లుకేమన్నా ప్రాణముందనా.. అంత కసిగా కాల్చి మరీ కోకోకోలా మాదిరి  చాణక్యుడలా కడుపులో పోసుకుందీ? బోజనాలకి  పిలవలేదని ఒహళ్ళూ, దండిగా సంభావనలు అందలేదని ఒహళ్ళు.. ఒళ్ళూ పై తెలీకుండా సిల్లీ కారణాలతో  పిల్లినో, పిచ్చుకనో అడ్డమేం వేసుకోడం లేదే!   కూసే అడ్డమైన   కూతలూ అందరికి అనుక్షణం కళ్లబడే ఏ ట్విట్టరు వంటి సామాజిక ఖాతాలల్లో ట్రోలుగా ఇస్తున్నప్పుడు ఇంకెక్కడుంది నీచత్వానికి ఆస్కారం? దుర్వాసులు, పరశు రాములు, కన్నబిడ్డలని కూడా కనికరించకుండా అడుక్కు తినమని తిట్టిపోసిన విశ్వామిత్రులు.. వీళ్ళనంతా మహర్షులు, రాజర్షులు, అవతారమూర్తులుగా హర్షామోదాలతో ఓ చెంపన కీర్తిస్తూనే.. దాం దుంప తెగ.. మరో చెంపన ఇప్పటి నేతలను ఆడిపోసుకోడంలో సమన్యాయమేమన్నా ఉందా?   అవసరార్థం ఏదో రాజకీయమే పరమార్థంగా ఏవో నాలుగు పిచ్చి కూతలు అటు మొదలవడం.. ఇటు కొనసాగడం.. వాస్తవంగా కళాహృదయం ఉన్నవాళ్లకి ఒక వినోదభరితమైన చిత్రంలా ఉండాలి!

గుడి కట్టి  మరీ రామచంద్రుడి మీది తన ప్రేమ భావనను చాటుకున్న గోపన్నంతటి గొప్ప దాసభక్తుడి నోటనే  విసుగు పుట్టిన్నప్పుడు వినరానన్ని తిట్లు వినిపించినప్పుడు ఇహ తిట్లన్నవి తప్పుడు కూతలన్న తీర్మానానికి రావడం ఎట్లా ఒప్పు?!  కీర్తి నిందల పాలవని దేవుళ్లే లేని తెలుగునాళ్లల్లో పాలకులకు మాత్రం ఆ  రాళ్లూ పూల దెబ్బల నుంచి మినహాయింపులెందుకు?! ఆ పరంధాముళ్లకు మల్లేనే గుళ్ళో రాళ్లల్లా గమ్మునుండటమే  రాజకీయాల సారం  ఆసాంతం వంటబట్టినవాళ్లంతా అనుసరించదగ్గ ఉత్తమ మార్గం. ఇవాళ తిట్టిపోసిన నోళ్లే రేపెంత ఆకాశానికి ఎత్తేస్తాయో! ఎంత బద్ధ శత్రువులైనా మళ్లీ కావలించుకునేటందుకు తెర చాటున అట్లా వెంపర్లాటలు సాగుతున్నప్పుడు .. దాం దుంప తెంప.. ఇహ ఏ కూతంటే కంపు! ఏ మాటంటే వినసొంపు!    

ఎండలకూ    చెమటలకూ ఓర్చి. తిండీ తిప్పలనన్నింటిని మరచి, చంటి బిడ్డలను ఇంటి వాకిళ్లకలా వదిలేసి. ముసిలీ ముతకా, ఆడా మగా, కుంటీ గుడ్డీ సైతం మంచి నేతల కోసమని అట్లా  గంటల తరబడి  ఏ ఈవియమ్ములు ఎంతగా  తంటాలు పెట్టినా   పట్టించుకోకూడదన్న పంతంతో మరీ అర్థరాత్రిళ్ల వరకూ నిద్రా నిప్పులు వదిలి వంటి కాలి మీద క్యూలల్లో నిలబడి మరీ ఓటేసిన దృశ్యాలు ఎన్నడూ ఎరగని రీతిలో మన నేతలు కూడా చూసుంటారు. చెడ్డ మాటలకేం ఎప్పుడైనా విసిరుకోవచ్చు. సొంతవారి మంచి కోసమూ చేసుకొనే సమయం చాలా ముందుంది, ఇహనైనా ఇంగితం తెచ్చుకొని ముందు జనం మంచీ చెడ్డను గురించి కొంచెమైనా ఆలోచిస్తారేమోనని ఆశించడంలో తప్పేముంది? ఆశలను నిరాశ చేస్తే తప్పేముంది? మళ్లీ  ఎన్నికలనేవి రావా! ఓట్లేసే జనాలకు మాత్రం తిట్లేం పాతవా? అందాకా రాకుండా గిలిచిన పార్టీలన్నీ  సుపరిపాలన అందిస్తాయని, ఈ సారైనా గెలవాలనుకొనే ప్రతిపక్షాలన్ని జనం మేలు కోసం పాలనకు సహకరిస్తారని ఆశిద్దాం.  అదే కదా అసలైన రామరాజ్య వ్యవస్థకు ఏ రామాయణ కావ్యమైనా ఇచ్చే   సిసలైన పరమార్థం మరి?

రామా అంటే బూతేనా అంటే  బూతే అవుతుంది కదా మరి! తప్పర్థం చేసుకొనద్దు!  పోలింగ్ బూత్ స్థాయి నుంచి మొదలయే ప్రజాసేవల సువ్యవస్థ అని మాత్రమే సవినయంగా నా మనవి!

-కర్లపాలెం హనుమంతరావు

(14, ఏప్రియల్, 2019 తేదీ నాటి సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 

 

 

 

Saturday, February 23, 2019

గమ్మత్తు ఎన్నికలు -జి.ఎస్.దేవి వ్యంగ్యల్పిక




తేర వస్తువులంటే ఎంత తీపో! కోట్లు పుచ్చుకుని ఆడే క్రికెట్టాటల్లో కూడా చాటుమాటుగా ఆ తీపి తాయిలాలు తిన మరిగే వికెట్లేవీ పడని బంతులు విసురుతుండేది మన క్రికెట్ వీరులు! ఆ ఆటల్ని మించిన ఆటలు ప్రజాస్వామ్యంలో ఎన్నికటాలు! అందుకే ఇక్కడా తాయిలాలకు అంతలావు డిమాండ్!
అతి తొందర్లోనే రాబోతున్నాయి కదా మన దేశం మొత్తం కుమ్ముకు చచ్చే సాధారణ ఎన్నికలు! ఆ ఓట్ల పోట్లాటలో ఎవరి జాతకాలు ఏంటో ముందే నిగ్గు తేల్చేస్తామని టీ.వీ డబ్బాలల్లో చేరి డబ్బాలు కొట్టుకునే సర్వేరాయుళ్ళకు తెలుసు ఆ తాయిలాల రుచి ఏంటో మా బాగా! పప్పరుమెంటు బిళ్లలు ఏ పక్షం వాళ్ళెక్కువ జేబుల్లో పోస్తే వాళ్ళ పక్షం వాళ్లకే మొగ్గు చూపించే చాణక్యం అబ్బో ఇప్పటిదా! ఉచితాలు అనుచితాలని చితచితలాడే బుద్ధిమంతులకు తాయిలాల రుచి తెలీకనే ఆ సణుగుళ్లన్నీ!
బేవార్సుగా బహుమతులెన్నో వరదలా వచ్చి పడే మహదవకాశం ఉండే ప్రజాస్వామ్యం మించి నిస్సందేహంగా మరో మంచి పాలనా వ్యవస్థ ఉండే అవకాశమే లేదు. రెండేళ్లు నోట్లోకి పోని బీద బిక్కీలకి ప్రజాస్వామ్యం తరహాలో వచ్చే ఐదేళ్ల ఎన్నికల పుణ్యమా అని కదా ఎన్నికల తతంగం నడిచే నెలనాళ్ల పాటైనా ఏ పనీ పాటూ లేకుండా తిని తాగి తొంగొని స్వర్ణయుగం మార్కు కమ్మని కలలు కనే మహదవకాశం దక్కేది! విస్తృతంగా ప్రజామోదం పొందిన మందూ మాకూ, ఆటా పాటల టైపు రకరకాల పథకాల మోత ముందు ఔట్ డేటెడ్ ఆదర్శాల చూర్లు పట్టుకుని వేళ్లాడే ఏ కొద్ది మంది వెర్రి వెంగళప్పల గోల బలాదూర్!,
వామవావతారంలో కూడా ఆ దేవుడంతటి వాడు మారువేషంలో వచ్చి నోరు విప్పి అడిగితే తప్ప బలి చక్రవర్తిగారికి ఆ ముష్టి మూడడుగులైనా ఇవ్వబుద్ధి అయింది కాదు! అప్పటికి ఈ మన ఎన్నికల తరహా ప్రజాస్వామ్యం తిప్పలు పాడూ లేవు. ఉండుంటేనా? అంత లావు బలి మహారాజైనా వామనుడు ఎక్కడున్నాడోనని వెతుక్కుంటూ పాతాళం నుంచి వైకుంఠం వరకు గాలించక తప్పుండేది కాదు. ప్రజాస్వామ్యం.. ఎన్నికలు అంటూ ఏ పితలాటకం లేదు కాబట్టి ద్వాపరంలో మనకు ఒక్క దాన వీర కర్ణుడు పేరే కర్ణబేరుల నిండా మారుమోగేది. అప్పుడే కనుక మన ఇప్పటి తరహా డెమోక్రసీ మార్కు ఎలక్షన్లు అమల్లో ఉండుంటే! నేటి మన దానవేంద్రుల ఉచిత పథకాల ముందు ఆ రాధేయుడి కర్ణ కుండలాలు సోదిలోకైనా వచ్చుండేవి కావు. డొక్క చూపించి యాచిస్తే తప్ప కొన్నైనా మధురాంబులు ఇవ్వాలని తోచింది కాదు భక్త అంబరీషుడికి. దున్న పోతుల్లా బలిసున్నవాళ్లకైనా సరే పనీ పాటల్తో నిమిత్తమేమీ లేకుండా ముప్పొద్దులా వూరకే మెక్కపెట్టే ఉచిత ఆహార పథకాలు మా దగ్గర బోలెడు ఉన్నాయి' అంటున్నారు ఎన్నికల్లో నిలబడ్డ మన దీన జన ఆపద్భాంధవులందెరో ఇప్పుడు. అడిగినవాడు దేవతలకు మహారాజు కాబట్టి కిమ్మనకుండా వెన్నెముక ముక్కలు రెండు వజ్రాయుధంగా మలుచుకొమ్మని దానమిచ్చాడు దధీచి. ఎదో విధంగా తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకోవాలన్న పాచిక లేదా దధీచి దానంలో? మరి చివరి రక్తపు బొట్టు వరకూ బడుగుల బాగోగుల కొరకే పోరాడి తీరతామని లేకుంటే ఆత్మార్పణలకు దిగిపోతామన్న మన నేతల కుమ్ములాటలను ఎన్నికల గిమ్మిక్సుగా మేధావులు హేళనచెయ్యడం ఎంత వరకు సబబు? 
అన్న పానీయాలతో సహా అన్నీ వదిలేసుకుని వంటి కాలుమీద ఉగ్ర తపస్సులు చేసే మహా మునీశ్వరులకైనా ఆ పరమేశ్వరుడు ఒక్క పట్టాన ప్రత్యక్షమై వరాలు ప్రసాదించింది లేదు ! అట్లాంటిది పిలవా పెట్టకుండా హఠాత్తుగా ప్రత్యక్షమైపోయి 'నరుడా! ఏమి నీ కోరిక?' అని విధాయకంగానైనా అడగా పెట్టకుండా ఇంటి మధ్యో రంగుల టి.వి సెట్లు పెట్టిపోయే నయా దేవుళ్లు ఇప్పుడు ఎన్నికల సీజన్లో పుట్టగొడుగుల్లా పుట్తుకొస్తున్నారు. తప్పేముంది? ప్రజస్వామ్యం తరహా ఎన్నికలు క్రమం తప్పకుండా ఈ మత్రమైనా నిస్వార్థంగా నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా తరహా నియంతల బాట ఎంచుకోడంలేదు.. అదెంత గొప్ప ప్రజాసేవ? ఎచ్చివో పచ్చివో ఓ వరసలో ఎన్నికలు వస్తుండబట్టి కాదూ.. బోడి మల్లయ్యలు కూడా కల్లోనైనా ఊహించే సాహసం చెయ్యలేని బ్రాండ్ ‘సెల్ ఫోనులు’ సైతం చెవుల్లో జోరీగల్లా రింగుమంటున్నది! తాడో పేడో తేల్చుకుంటే తప్ప మరో ఐదేళ్ల పాటు జనం మాడు పగలగొట్టే అధికారం చేతికి దక్కదన్న పెద్దమనుషుల దుగ్ధల వల్లే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు తాయిలాల ఎన్నికలుగా మారిపోయింది! ఏ సుపరిపాలనకైనా అసలు పరమార్థం సమాజంలోని అట్టడుగు స్థాయి మనిషిక్కూడా కళ్లు తెరిపిడి పడకపోయినా కాళ్లు బార్లా జాపుకుని కునుకుతీసేపాటి సుఖం దక్కడమే కదా! ప్లాటో గానీయండి, అరిస్టోటిల్ గానీయండి ఇంతకు మించి ఊడబొడిచే ఉటోపియా మాత్రం ఇంకేముంటుంది? చదూకున్నోళ్ల బడాయి కూతలు కాకపోతే మార్క్సే కావాలా.. మహాత్ముడే మళ్లీ రావాలా? ప్రజల పగటి కలలను నిజం చేస్తున్నారు ఇప్పటి నేతాశ్రీలు.. స్వచ్చందంగా.. అదెంత గొప్ప విషయం? తప్పస్సులు గట్రాల్లాంటి బాధలేవీ పడకుండానే ప్రార్థించుకోని దేవుళ్ళు సైతం గుడిసెల్లోకి దూరొచ్చి మరీ అడిగినవాటి సంగతి అటుంచి అడగనివి అడక్కూడనివి కూడా
అడక్కుండానే రెండు చేతుల్నిండా పోసి పోతున్నారు! ఏడుకొండలవాడి దర్శనార్థం రోజుల కొద్దీ క్యూలల్లో పిల్లాజెల్లల్తో కలసి అల్లాడిపొయ్యే అల్లాటప్పగాళ్లం మనం. మన్లాంటి అమాంబాపతుగాళ్ల అనుగ్రహాల కోసం మన గుడిసెల ముందు ఆ గుడులకు మించి మరీ సాగిలపడిపోతున్నారీ నేతాగణం!
ఈ దేశంలో ఎన్నికలు జరిగే తంతుని దేశదేశాలల్లో ఏదోదో కథలు కమామిషులు అల్లి ఎద్దేవా చేస్తుంటారు కానీ మేధావులంతా కలసి.. కనీసం ఒక్క కాంణబ్బైనా బ్యాలెన్స్ లేకుండా కాతాలు ఇంకే దేశంలోని బ్యాంకులు పేదోళ్ల కోసం ఓపిగ్గా ఓపెన్ చేస్తున్నాయో చెప్పమనండి! గోచీపాత కూడా వంటి మీద లేనోడి చేతిలో బ్యాంకు పాసుబుక్కులు పెట్టిసే మ్యాజిక్కులు మరే దేశంలొ జరుగుతున్నాయో.. ఆ గుట్టు విప్పమనండి! ఈ మాదిరి ఆలీ బాబా వండర్ ల్యాండ్స్ అద్భుతాల సృష్టికి ముఖ్య కారణం మనం మన రాజ్యాంగంలో తెగించి మరీ రాసుకున్న ఎన్నికల విధానం.. ఐదేళ్లకో సారైనా నేతలు జనాల ముఖం చూసొచ్చే తతంగం కంపల్సరీగా ఉండాలనడం.. అంటారా? ఆ రాజ్యాంగం బౌండుబుక్కుల్లో ఉన్నవాటన్నింటికల్లా బైండయివుండాలన్న రూలేమన్నా ఉండిందా? అయినా ఉంటున్నారు.. మేధావులు కావాలనే మన నేతల ఔన్నత్యం దాటేస్తున్నారు. అదే అసలు సత్యం. 
ముష్టి రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలకే ప్రపంచంలోనే తాము అగ్రరాజ్యమని పద్దాకా సొంత డబ్బాలు కొట్టుకునే అమెరికా అంతలా అతలాకుతలమై పోతుంటుందే ఎన్నికల రోజుల్లో ఎన్నో కలర్లు మారుస్తుంటుందే! సైజులో ఆ దేశానికన్నా ఐదింతలు పెద్దది. జనాభాకి పదింతల కన్నా ఎక్కువది. గలభాల్లో మరెన్ని రెట్లు ఎక్కువో ఎక్కడా రికార్డు కాని నేపథ్యంలో సైతం ఇన్ని వేల రాజకీయ పార్టీలల్లో నుంచి కొన్ని లక్షల మంది అసమర్ధుల్ని కోట్ల మంది లుల్లాయిలూకా ఓటర్లు ఒక్క అయిదారు వారాలల్లోనే ఇట్టే తైర్పారపట్టేసి నెత్తికి ఎక్కించేసుకోవడం ఏ శతాబ్దంలోనైనా ఎక్కణ్నుంచైనా ఇంత నిశ్శబ్దంగా సాగుతున్నదా? 
గమ్మత్తు కాదు మరి మన భారతీయ ప్రజాస్వామ్యం తరహాలో ఎన్నికలు జరగాలంటే? బడికెళ్లే ఈడు లేని బుడ్డోళ్ళు క్కూడా బాహాటంగా బూతుల కెళ్లి ఓట్లేసేటంత స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఈ దేశంలో ఉన్నాయ్! ఎనేళ్ల కిందటో పైకెళ్లిపోయినా సరే ఎన్నికలొచ్చాయంటే చాలు.. చచ్చిన పీనుగలు సైతం చంగు చంగున కిందకి దిగొచ్చేసి ఇంచక్కా ఓటు హక్కు వినియోగించుకుంటాయి! ఏ దేశంలో ఉంటుందండీ ఈ మాదిరి ప్రజాస్వామ్యం స్ఫూర్తి? ముసలీ ముతకా మాదిరి ఓటర్లు గంటల కోద్దీ క్యూలల్లో నిలబడి టై వేస్టు చేసుకొనే శ్రమ లేకుండా అన్ని పార్టీలు తమ శక్తి కొద్దీ కార్యకర్తల ద్వారా ఓటర్లను సేవించుకునే సౌకర్యం ఈ దేశంలో మాదిరి మరింకెక్కడా కనిపించదు. స్వాతంత్ర్యయోధులు కలలు కన్న స్వయంపాలనా విధానం ఆనక.. ముందు స్వీయ ఓటింగు విధానానికి కట్తుబడి చిత్తశుద్ధితో మన నేతాగణం ఇన్నేళ్ల బట్టి అమలుచేయడం మనకు మహా గర్వకారణం. బాలెట్ పద్ధతి నుంచి యాంత్రిక విధానం వరకు ఎన్ని మార్పులకు మన ఎన్నికల విధానం లోనయినా ఒక్క సిధ్హాంతంలో మాత్రం మనమే రాద్ధాంతాలకు పోకుండా ఏకీభావంతో పనిచేసుకుపోతున్నాం. నచ్చినా నచ్చకున్నా చచ్చినట్లు ఎవరో ఒక చచ్చు నేతను ఎన్నుకోక తప్పని పరిస్థితి నుంచి మనం ఎన్నడూ పక్కకు తప్పుకున్నదిలేదు. అదీ రాజ్యాంగస్ఫూర్తి పట్ల చెక్కుచెదరని మన విధేయత. 
నిజమే! రెండు రూపాయిలు పోసినా చార్లోకేసుకునే కరివేపాకు ఓ రెండు రెబ్బలయినా రానప్పుడు, బుక్ చేసి వారాలు గడిచినా గ్యాసు బండ అలికిడి గుమ్మంలో వినబడనప్పుడు, పంపుల నుంచి వచ్చే మంచి నీళ్ళు తారు కంపు కొడుతున్నప్పుడు, గతుకుల రోడ్డ దెబ్బకి దారి మధ్యలోనే బండి మొండికేసినప్పుడు, ధర్మాసుపత్రి రంగుగోళీలతో యమధర్మరాజపుర సందర్శనం జరిగినప్పుడు, బడికంటూ బైటకెళ్లిన చిట్టితల్లి బడుద్ధాయిల దాడికి చిట్లి ఇంటికి తిరిగొచ్చినప్పుడు, చదువులు సరిగ్గా అబ్బక ఒకడు, అబ్బిన సతుకులకి సరిపడ్డ కొలువు దొరక్క ఇంకొకడు గుబురు గడ్డాలూ మీసాలతో చెట్టంత బిడ్డలిద్దరూ నట్టింట ఊడలు దిగిన మానులకు మల్లే భయపెడుతున్నప్పుడు 'చీ! పూర్వ జన్మలో ఏ పిచ్చిపూలతో పూజలు చేసిన ఖర్మమో ఇది!' అని ఏదో శాపనార్థాలకు దిగిన మాటా నిజమే! కానీ ఆ తెలుగు సినిమా కహానీలన్నీ ఎన్నికలని ఇలా వచ్చీ రాగానే చిటికేసినట్లు ఎటో మటుమాయమైపోతాయి! అదీ ఈ దేశం పాలనా వ్యవస్థలోని గొప్ప వైశిష్ట్యం. నయా నాయకమ్మన్యుల ఉపిరి సలపనీయని ఉచిత హామీల జడివానలో తడిసి ముద్దై పోతున్నప్పుడు మేధావులనుకునే మన పెద్దలకేమనిపిస్తుందో తెలీదు కానీ.. పూటకు గతి లేని బికారికి మాత్రం ఎన్నికల కాలమంతా పూటుగా చుక్కా.. ముక్కా పడుతున్నప్పుడు ఏమనిపిస్తుందో ఊహించడానికేమీ మనం పెద్ద మహాకవి గురజాడలమేం కానక్కర్లేదు! ‘ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో.. జనియించినాడ వీ స్వర్గఖండమున.. ఏ మంచిపూవులన్ ప్రేమించినావో.. నిను మోచె ఈ తల్లి కనక గర్భమున’ అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఇక్కడ జరిగే ఎన్నికల మాదిరి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిబ్బరంగా బతుకుల నెలాగో నెట్టుకొచ్చేందుకు ఫిట్. అట్లా కాకుండా ‘ లేదురా ఇటువంటి భూదేవి యెందూ.. లేదురా మనవంటి పౌరులింకెందు’ అని గాని వెగటుగా అనిపించిందా.. వాడిహ ఈ మేధావి పుటక నుంచి ఈ జన్మకు బైటపడనట్లే లెక్క. నజరానాలకు మాత్రమె జనాలు నీరాజనాలు పడుతున్నారన్న నిజం మేధావుల బుర్రలకిహ ఈ జన్మకెక్కదన్న నిజం మరో మారు రుజువయినట్లే లెక్క! ఈ దేశంలో సుఖంగా జీవించడానికి మేధావులు అందుకే సెంట్ పర్సెంట్ అన్ ఫిట్!
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట-24. ఫిబ్రవరి, 2019) ప్రచురితం
*** 

Wednesday, February 20, 2019

సెటైర్ కు రిటైర్ మెంటా!-సరదా వ్యాఖ్య






శబ్దరత్నాకరంలాంటి ఏ పద కోశమో తిరగేసి చూడండి.. 'వెక్కిరింత' అంటే  తిట్టిపోయడం అనో బెదిరించడం అనో అర్థం కనిపిస్తుంది! అబ్బెబ్బే..  బెదిరించే పాటి బలమే ఉంటే ఈ తెరచాటు  సూటిపోటీ మాటలెందుకండీ సెటైరిస్టుకు? నేరుగా ఏ స్వతంత్ర అభ్యర్థిగానో పోటీకి దిగిపోయి ప్రచారం వంకతో  చివర్రోజు ఆఖరి క్షణం దాకా హాయిగా కడుపులో ఉన్న ఉబ్బరమంతా సుబ్బరంగా తీర్చేసుకోడా? ఈ.సి కోడా.. పాడా!  ముందు మీడియా ఫోకస్  ప్లస్ పాయింటవుతుంది కదా!

ఎదుటి పోటీదారుడు ఏ మాజీ సి.యమ్మో.. అతగాడి ముద్దుల తనయుడో అయితేనో! అమ్మో.. కోరి కోరి ఎద్దుకొమ్ముల ముందుకెళ్లి కుమ్మించేసుకున్నట్లే గదా! ఈ పీడాకారమంతా ఎందుకనే.. అధిక శాతం చేతి జిలగాళ్లు కుండ బద్దలుకొట్టె రిస్కులకు దిగకుండా రస్కుల్లాంటి రాతల బాటపట్టేది! ఇప్పుడా సైడూ ‘నో ఎంట్రీ’ బోర్డ్ వేలాడుతోంది. అందుకే వెటకారిస్టుల ఈ గోల!
నేరుగా పబ్లిక్ మీటింగుల్లో పాతచెప్పులు విసిరేసినా పోనీలే.. పాప’మని  క్షమించేసే మన నేతలు కొందరు అదేందో మరి.. ఆ దయాగుణం మాత్రం దెప్పిపొడిచే రచయితల మీద వీసమైనా చూపించడం లేదు!  
 పిచ్చి చేష్టలను తప్పుపట్టడం వెనకాల.. ఛాన్సు వచ్చింది కదా..  కచ్చ తీర్చుకోవచ్చన్న పిచ్చి దుర్బుద్ధి ఒక్కటే ఉండదు సుమండీ! చపలచిత్తుడి బుద్ధిని శుద్ధి చేద్దామన్న మంచి  ఉద్దేశమూ కొంతమందికి కద్దు. ఒకానొక కాలంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక వెలుగు వెలిగిన   వాంచానాథుడు రాజుగారి పాలనలోని ప్రజాపీడనకు అలిగి దున్నపోతును అడ్డం పెట్టుకుని మరీ ఓ వంద పద్యాల్లో తిట్టిపోసాడు. అన్నీ చమత్కారాలే అందులో! కుపరిపాలన సాగించే అసమర్థులను వ్యంగ్య విధానంలో దెప్పి దారికి తెచ్చే మంచి పద్ధతి మొరటు కాలమని మనం వెక్కిరించే ఆ 15వ శతాబ్దిలోనే ఉంది కదా! మరి అన్ని విధాలా అభివృద్ధి చెందిన అతి మహా పెద్ద ప్రజాస్వామ్యంలో మనం సుపరిపాలన సాగించేస్తున్నామని ప్రపంచానికి గొప్పలు చెప్పుకుంటున్నాం కదా! అయినా.. నిరసన స్వరాలు వినిపిస్తాయన్న జంకుతో వ్యంగ్యం మీద ఇంకా ఇన్ని రుసరుసలా? పెన్నును గన్నులా వాడేవాడిని కూడా ఓపిగ్గా అర్థంచేసుకోడమే ఓపెన్ డెమోక్రసీ ఉత్తమ లక్షణం పాలకులారా!
గాడి తప్పిన వాడని సెటైరిస్టుగాడిని ఊరికే ఈసడించుకోడం తగదు!  వాచాలత్వాన్నీ ఏ కవిత్వం మల్లేనో అల్లి గిట్టనివాళ్లని గిల్లడానిక్కూడా బోలెడంత గడుసుతనం కావాలండీ.   సెటిలర్సునే గుండెల్లో పొదువుకుంటామంటూ వాడవాడలా తిరిగొచ్చే దొరలు..   సెటైరిస్టుల్నీ ఆ కౌగిట్లోనే ప్రేమగా పొదువుకోవచ్చుగదా?  రాసే రాసే కలాలని వాలంటరీ రిటైర్మెంటు తీసుకొమ్మనడం ధర్మమా.. బాంచెన్.. మీ కల్మొక్తా .. జర చెప్పుండ్రి సార్లూ! 
 పిల్లులు గోడల మీదా, ఎలుకలు గాదెల కిందా.. చేరి రాజకీయాల పేర రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. ఆ విరక్తితోనే కదా    పిల్లి మీదా,   ఎలుక మీదా  పెట్టి అన్యాపదేశంగా పెద్దయ్యల అన్యాయాల మీద దండెత్తేది?  డైరెక్టు ఎటాకర్సుతోనేమో ఏదోలా చీకట్లో మాటలు కలిపేసుకోవచ్చు.. వీలును బట్టి తమలో కలిపేసుకోవచ్చునేం! ఇన్ డైరెక్టు భాషలో ఏదో గుసగుసలు పోయే  వెటకారిస్టుల మీదనేనా  ఈ గుడ్లురమడాలూ!
సెటైరిస్టుల స్క్రిప్పుల సాయం లేకుండా ఏ పొలిటీషియన్ స్టేజ్ మీద ఎట్రాక్టివ్ ఉపన్యాసాలివ్వగలడో తేల్చండి! కామెడీ రాతగాళ్లు కేవలం మందు పార్టీలల్లో వినోదాల విందుల వరకేనా దొరబాబులూ పరిమితం?
ఎంత కసి ఉంటే  ఆ జోనాథన్ స్విఫ్టంతటి సెటైరిస్టు గలివర్ని అడ్డుపెట్టుకొని మరీ ఆనాటి  పాలకులకు గడ్డిపెట్టాడు? బతుకు తెరువు కోసమే కద మహానుభావులారా ఎప్పట్లా పిట్టల్ని కొట్టిందా నిషాదుడు రామాయణ కాలంలో! అయినా ఆనాడు  వాల్మీకంతటి మహర్షికే అంత లావు కోపం తన్నుకొచ్చేసిందే! అంత ఉక్రోషంలో కూడా ఆయన నిషాధుడి మీద చెయ్యెత్తింది లేదు.  ప్రపంచం పూజించే ఉత్కృష్ట కావ్యం చెప్పవతల గిరాటేశాడు! వాల్మీకిని అసలు కలమే పట్టద్దని ఏ శ్రీరామచంద్రుడో వారించుంటే? లోకం గర్వించే రామాయణం అసలు రూపుదిద్దుకొనేదేనా? రాసే కలాలకి  అందుకే  పాలకులు పూర్తి స్వేచ్ఛనివ్వాలి.  సజావుగా జనాలను పాలించడం రాక  నేతలు సెటైరిస్టుల మీద పడితే ఎట్లా?
చేతి ఉంగరం పోయిందని చెరువు మీద, రాసుకునే వేళకు పత్రాలందించలేదని  తాటిచెట్టు మీద.. అలిగి తిట్లపురాణాలకు దిగిన బండకవులకేమో తమరు గండపెండేరాలూ, పూల దండలతో సత్కారాలూ?! చెరువు పూడికలు తీయించాలని, చెట్లు ఏపుగా పెంచి ట్రీ గార్డులు పెట్టించాలని..  ఏదో వంకన జనం సొమ్మును మూటకట్టి    చంకనేసుకుపోయే వంకరబుద్ధి ఆషాఢభూతులను వెటకరించినందుకేమో వెంటాడి వెంటాడి వేధించడాలా?
చెడ్డకు ఎదురొడ్డి నేరుగా గోదాలో కలబడే గుండె నిబ్బరం  అందరికీ ఉంటుందా! ఆ  సత్తా లేనప్పుడే కదా  పిల్లి మీదా ఎలుక మీదా పెట్టి జబ్బసత్తువ కొద్దీ దెప్పిపొడవడాలూ!   
ఎదుటి శాల్తీ పిచ్చి చేష్టలను నేరుగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడే దెప్పిపొడుపు భాషను పుట్టుకొచ్చేది! బైటికి కనిపించే పదాన్ని పట్టుకొచ్చి.. లోపల గూఢార్థం చొప్పించి దెప్పడంలో ఎంత గడుసుతనం కావాలో! ఆ లోపలి అర్థాలకే లోపాలున్న శ్రీరంగనీతి జాతి  ఉలిక్కిపడేది. నవ్వించే విధంగా ఉంటుంది కాబట్టి నలుగురి ముందూ తానూ నవ్వక తప్పదు. కానీ బిడ్డా! నా టైము రానీ.. అడ్డంగా నరుకుతా! అని అనుకోడమే ప్రజాస్వామ్యానికి పెద్దహాని.
పాలకులే కానక్కర్లేదయ్యా.. పలు సందర్భాలలో సమాజమే తన మూర్ఖత్వం వల్ల దెప్పులపాలవడం కద్దు.  వీరేశలింగం వంటి పెద్దలు ఇదిగో ఈ దెప్పిపొడుపు దారినే పోయి సమాజానికింత సోయి తెప్పించే ప్రయత్నం చేసింది. సంఘాన్ని గమ్మత్తుగా మరమ్మత్తు చేసేందుకు సెటైర్ ను మించిన  ఆయుధం లేదని గురజాడ నమ్మకం.  కాబట్టే  కన్యాశుల్కం నాటకం వంకన నాటి సొసైటీ తాట తీసారు.  చిలకమర్తి  గణపతి, మొక్కపాటి పార్వతీశం,  పానుగంటి జంఘాలశాస్త్రి..  మనిషిలోని, సంఘంలోని వంకరబుద్ధుల్ని, వెంగళాయితానాన్ని, అమాయకత్వాన్ని, అహంభావాన్నీ ఇహ నా వల్ల కాదురా బాబూ! అన్నంత గొప్పగా కడుపుబ్బా నవ్విస్తూనే కడిగవతల పారేసారు సారులూ! చమత్కారం,  వెక్కిరింతల వంటి జోడు గుర్రాలను పూన్చి వ్యంగ్యరథాన్ని పిచ్చిగా కలుపు మొక్కలు పెరిగిన  వ్యవస్థల మీదుగా  లాగుతుండబట్టే  నలుగురూ నడిచే బాట ఈ మాత్రమైనా చదునుగా ఉండింది!  నేరుగా పడే గంటె వాతల  కంటే కొంటెపూలు కట్టిన కుచ్చుల జడతో కొట్టే దెబ్బల్లోనే  మజా ఉంటుంది!    'జమీందారు రోల్సు కారు, మహారాజు మనీపర్శు..  మాయంటావా? అంతా/ మిథ్యంటావా?' అంటూ ముద్దుల వేదాంతిని సైతం వదలకుండా తలంటుపోసాడా మహానుభావుడు శ్రీ శ్రీ!. అంత మాత్రానికే జాతికి ఆసారాం బాపూలు, నీరవ్ మోదీల వంటి పీడలు వదులుతాయని  కాదూ!  సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి  ఇవ్వరని ఆడంగుల మీదా, రాజకీయ నేతల హంగు ఆర్భాటాల మీదా చలం ఇలాగే చిందులేసాడు ముందు. ఆఖరికి ఆ అరుణాచలం యోగీ  శ్రీ శ్రీ తరహా ఎకసెక్కాలని ఎరక్కపోవడం క్షమించరాని నేరమని ఒప్పుకున్నాడు!  అదీ వ్యంగ్యం తాలూకూ హంగూ ఆర్భాటం.  ఇప్పటి నేతలకే మరి ఎందుకో వ్యంగ్యమంటే అంత ఖంగూ.. కంగారూ!
వేరే చేసేదేం లేకపోయినా దారే పోయే దానయ్యనైనా తన దాకా రప్పించుకుని కాసేపు నవ్వించే గారడీ కాదు స్వములూ వ్యంగ్యమంటే! చేత్తో చూపించిన టెంకెను కళ్ల ముందే భూమిలో పాతి.. లోటాడు నీళ్లైనా పోయాకుండానే ఒక్క నిమిషంలో  మొలిచిన చెట్టు నుంచి  దోర మాగిన మామిడి పండంటూ  ముక్కలుగా కోసి ఉప్పూ కారాలద్ది నాలిక్కి రుద్ధి ఆహాఁ.. ఏమి రుచిరా! అని మైమరపించే అతితెలివి  నేటి  నేతాగణాలది. మతులు పోగొట్టే ఆ విద్యలన్నింటి వెనకాలున్న అసలు టక్కు టామారలన్నింటినీ నవ్విస్తున్నట్లే నవ్విస్తూ విప్పిచెప్పే సత్తా ఉండేది ఒక్క సెటైర్ రైటరుకే! లోకం కళ్లు నాజూగ్గా తెరిపించేది ఒక్క   సెటైరిస్టే.  తమ   గుట్టు రట్టవుతుందన్న కంటు పెట్టుకుని నవ్వించే కలాల  మీద నిర్భంధం విధించే కన్నా ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాలేవీ వమ్ముకాకుండా విధులు సక్రమంగా నిర్వర్తిస్తామంటే ప్రజాప్రతినిధులను అడ్డుకునేదెవరు? చెయ్యాల్సిన ప్రజాసేవలు మాని తమను అభాసు పాల్చేస్తున్నారని సెటైరిస్టులను రిటైరైపొమ్మనడమే అన్యాయం! ఎత్తిపొడుపులతో సెటైరిస్టులు ఎత్తిచూపే  లోపాలను కాస్తింత అవగాహన చేసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేసేస్తే సరి.. సర్వే జనా హాపీ! చేతిలో కత్తి ఉంది కదా అని.. పూలగుత్తి కుత్తిక కత్తిరించేస్తామంటేనే ఇబ్బంది? తుగ్లక్ పాలకులున్నంత కాలమూ  గజ్జెల మల్లారెడ్డి  జజ్జనక జనారేలు గజ్జెకట్టి పాడుతూనే ఉంటాయి సుమా!
కారుణ్యకవి జాషువా వర్ణమునకన్న పిశాచము భారతంబునన్/ కనుపడలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ దెప్పిపొడుపు వెనకాల ఎంత గుండెనొప్పి ఉందో మతికి తెచ్చుకోవాలి  ముందు మంచి మంచిపాలకులనేవాడు! 'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు మూఢంగా ఎందుకు  నమ్ముతున్నాడో సంఘం ముందుగా స్వీయవిమర్శ చేసుకోవాలి. మును సుముహూర్తము నిశ్చయించినా సతి ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలు కొట్టినందుకు వేమన బుర్ర బద్దలు కొట్టకుండా అతి మత విశ్వాసులే  ముందు తన బుర్రబద్దలు కొట్టుకోనైనా మూఢవిశ్వాసాల ఊబి  నుండి బైటపడాలి. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి మార్క్సు కావాలా?నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే నేరస్థుడు లేడు' పొమ్మన్నాడు గుంటూరు శేషేంద్ర శర్మ. అధర్మం, అన్యాయం, దోపిడీ, మూఢత్వం, అజ్ఞానం, దౌర్జన్యం, అవినీతి, అమానుషాల వంటి దురాచారాలు, బలహీనతలు, నైచ్యాల మీద  ఎక్కుపెట్టేన రాముడి ఆయుధం దొరా వ్యంగ్య రచయిత చేతిలోని లేఖిని బ్రహ్మాస్త్రం. అవసరాన్ని బట్టి అది రావణ సంహారానికి ఎదురొడ్డి నిలబడ్డట్లే.. సందర్భాన్ని బట్టి చెట్టు చాటు నుంచైనా వాలి వంటి అపరాధిని వధింస్తుంది. మొట్టితే తప్ప ఖలుడే కాదు దేవుడూ దారికి రాడని నమ్మకం నుంచి పుట్టింది బాబులూ ఈ సెటైర్!  సున్నితంగా, సుతారంగా హాస్యంతో కలగలిపి వడ్డించి మరీ మెక్కేవాడికైనా భుక్తాయాసం తెలీనంత గమ్మత్తు వ్యంగ్యంలో ఉంది.  బలవంత పెట్టినా రిటైర్ అయ్యేది అయ్యేది కాదు సెటైర్!    పాలకులు దారికి వచ్చే వరకు చాటుమాటుగానైనా సరే సెటైరిస్టుల యుద్ధానికి రెస్టంటు ఉండదు!
జి.ఎస్.దేవి
(కర్లపాలెం హనుమంతరావు) 
(సూర్య దినపత్రిక వ్యంగ్యల్పిక- ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)




Tuesday, February 19, 2019

భార్య.. ఏమండీ అన్నదంటే ..! సరదా వ్యాఖ్య -సేకరణ




బాత్రూమ్ లో నుండి " ఏమండి"
అని పిలిచిందంటే
బొద్దింకని కొట్టాలని అర్ధం..


రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ"
అని పిలిచిందంటే
బిల్లు కట్టమని అర్ధం


కళ్యాణమండపంలో " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలిసినవారొచ్చారని అర్ధం


బట్టల షాపులో " ఏమండీ"
అని పిలిచిందంటే
వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..


బండిలో వెళ్ళేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
పూలు కొనాలని అర్ధం..


హాస్పిటల్ కి వెళ్ళినపుడు " ఏమండీ "
అని పిలిచిందంటే
డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం


వాకిట్లోకి వచ్చి బయట చూసి " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలియనివారెవరో వచ్చారని అర్ధం..


బీరువా ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
డబ్బు కావాలని అర్ధం..


డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి " ఏమండీ "
అని పిలిచిందంటే
భోజనానికి రమ్మని అర్ధం..


భోజనం చేసేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్ధం


అద్ధం ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
చీరలో తనెలా ఉందో చెప్పమని అర్ధం..


నడిచేటపుడు " ఏమండి "
అని పిలిచిందంటే
వేలు పట్టుకుని నడవమని అర్ధం


అను నిత్యం తనతో చెప్పినా
నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం...


# అను నిత్యం " ఏమండీ " అంటూ చంపేస్తుందని అపార్ధం చేసుకోవడం కాదు అర్ధం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది.
(సేకరణ .. )

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...