శంకరాభరణం,
మా భూమి చిత్రాలు
ఒకే ఏడాది (1980) విడుదలయి రెండూ ఘనవిజయం సాధించాయి. “ 'శంకరాభరణం' చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో
కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో,
పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన
చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి
ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం”(వికీపీడియా). అవార్డు పొందిన
శంకరాభరణాన్ని పోటీలు పడి ఇలా పొగడ్తలతో ముంచెత్తేసారు అప్పట్లో. నిరసన గళాలు వినిపించినవారు చాలా తక్కువ. అందులో
భాగ్యనగరానికి చెందిన ఒక వామపక్ష విద్యార్థి సంఘం గొంతూ ఒకటి. వాళ్ల అభ్యంతరమల్లా చిత్రంలో ముఖ్య పాత్రధారులంతా బ్రాహ్మణ వర్గానికి
చెందివుండటం.
చిత్రాన్ని అర్థం చేసుకోవడంలో నిజానికి గజ దూరం దాకా వచ్చినా
ఒక మూరలో దారి తప్పిపోయారా తమ్ముళ్ళు. నటీనటుల కులం
సంగతి ‘రిజర్వేషన్' కోసం పోరాడే వర్గాల బాధ. వామపక్షీయులకెందుకు?! ‘శంకరాభరణం బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల కొరకు నిర్మితమైన చిత్రం’ అన్నారు ప్రజాహకుల్ల నేత బాలగోపాల్. ఇక్కడ బాలగోపాల్ వాడిన 'బ్రాహ్మణీయం' కులానికి సంబంధించింది కాదు సుమా! భారతీయుల
సంస్కృతికి తమను తాము ప్రతినిధులుగా భావించుకొనే తరహా వర్గానికి సంబంధించింది. ఆ వివరణా ఆయనే ఇచ్చుకొన్నారు.
బాలగోపాల్ శంకరాభరణం విజయాన్ని విశ్లేషించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
భారతీయ సామాజిక వ్యవస్థ రంగు, రుచి, వాసన సాధారణంగా బూర్జువా, భూస్వామ్య వ్యవస్థలకు దగ్గరగా ఉంటుంది. అది బాహ్య
స్వరూపం.
నయావలస విధాన లక్షణాలనూ
జోడించినప్పుడే దాని సంపూర్ణ స్వభావం అర్థమయేది-అంటారు బాలగోపాల్.
భారతీయ బడా బూర్జువా వర్గం ప్రగతిశీల స్వతంత్ర వ్యవస్థ కాదు. ప్రపంచ పెట్టుబడీదారీ వ్యవస్థ కొంగు పట్టుకుని నడిచే పరాన్నజీవి. వర్తమాన భారతీయ సంస్కృతిలో కనిపించే కళారూపాలేవీ వాటికై అవి వికసించలేదు. అవీ ప్రపంచ పెట్టుబడిదారీ కళలకు అనుకరణలే. ఆ అనుకరణైనా
ఉదారవాద బూర్జువా సంస్కృతి నుంచి ప్రభావితమై ఉండుంటే కొంతలో కొంత మేలు జరిగి ఉండేది. కుళ్ళిపోయిన నిరాశావాదపు సంస్కృతిని
వెకిలిగా అనుసరించాయి ఆ కళలన్నీ. భవిష్యత్తు పట్ల
విశ్వాసం లేని సంస్కృతి అస్తమానం అమూర్త వ్యక్తీకరణల వెనక నక్కే ప్రయత్నం
చేస్తుంది.
కానీ దానిలోని అంతర్గత ప్రజాస్వామ్య తర్కం ఆ పలాయనమంత్రానికి
అడ్దొస్తుంటుంది.
లాభాపేక్ష లాలస అనునిత్యం
వెంటాడే బూర్జువా కళలు ప్రజాస్వామ్యంలో సామాన్యులనుంచి పుర్తిగా మొహం
తిప్పుకోలేవు.
అట్లాగని నిజాయితీగా నిజాన్ని చెప్పనూ లేవు. ప్రజల విచక్షణని తట్టిలేపే బదులు .. భావోద్వేగాలను
రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే నల్లమందులా జనం ఇంగితాన్ని మగతలోకి
నెట్టే ప్రయాస.
కాబట్టే వివేకంతో పనిలేని శృంగారం, భావోద్వేగాలను సులభంగా రెచ్చగొట్టే హింసాత్మక సంఘటనలు చలన చిత్రాల్లో మనకు ఎక్కువగా
దర్శనమిస్తుంటాయి!
లేకపోతే ప్రజల నిజమైన
సమస్యలను పట్టించుకుంటూ వాటి పరిష్కార మార్గాల కోసం నిజాయితీగా వెతికుతూ తమ గొయ్యి
తామే తీసుకుంటాయా ఏక్కడైనా బూర్జువా
స్వభావముండే చిత్రాలు? ఈ తరహా చిత్రాల పలాయనవాదానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. తమకున్న పరాధీనత అనే బలహీనత కారణంగా ప్రగతిశీల బూర్జువావర్గంతో కన్నా
భూస్వామ్యవర్గాలతోనే రాజీపడేందుకు ఇష్ట పడతాయి.
ఈ ఆధిపత్య సంస్కృతిలో మరో సగభాగం భూస్వామ్య సంస్కృతి. ఇదీ పతనావస్థలోనే ఉంది.
అయినా కాలం చెల్లిపోతున్న బూర్జువా సంస్కృతికీ దీనికీ ఒక విషయంలో తేడా
కద్దు.
భూస్వామ్య సంస్కృతికి
ప్రజాస్వామ్య సంస్కృతితో సంబంధ బాంధవ్యాలు గిట్టవు. కనక అది పూర్తిగా ముడుచుకుపోయి
మృతప్రాయంగా ఉన్నట్లే లెక్క. బెరడుకట్టిన భూస్వామ్య
సంస్కృతి అసభ్యకరమైన నయా వలస విధానానికి తోడైతే ఏమవుతుందో అదే ఇప్పడు కళారంగాలలో కనిపిస్తున్న
వికార సంస్కృతి.
సినిమా కూడా సంస్కృతిలో ఒక భాగమే. కాబట్టి భారతీయ చలనచిత్రకళలో
కూడా ఈ వికార మిశ్రమత్వం తప్పదు. వ్యాపార దృష్టితో చూస్తే అది సినిమావాళ్లకు అవసరమే కదా?
దేశ జనాభాలో అధిక శాతం ఫ్యూడల్ వ్యవస్థ దోపిడీకి గురయినవాళ్లుంటున్నారు. వాళ్లకి భూస్వామ్య సంస్కృతిని ఉన్నతంగా చూపించే చిత్రాలు నచ్చవు. అట్లాగని పూర్తిగా హాలివుడ్ తరహా కల్చర్ని హైలైట్ చేసి తీసినా జనాన్ని సంతృప్తి పరచడం కష్టం. వాళ్లు తమకు పరిచయమయిన నేటివిటీనే కోరుకుంటారు. ఆ మాస్ కల్చర్ కి తగ్గట్లు తీయడం ఉదారవాదికి
గిట్టదు.
అశ్లీషతకు పెద్దపీట వేయడం బ్రాహ్మణిజానికి నప్పదు. అయినా అలగా సినీప్రేక్షక జనాలని ఏదో విధంగా సంతృప్తి పరచాలి కనక అంతో ఇంతో అశ్లీలం చలన చిత్రాల్లో చొప్పించక
తప్పదు.
సినిమా కూడా వ్యాపారమే! ‘మనకూ లాభాలు
రావాలి కదా’ అని తమను తాము సమాధాన
పరుచుకుంటారు.
కానీ అప్పుడప్పుడు ఆ స్పృహలోనుంచి బయటకు వచ్చే అద్భుతాలు
జరుగుతుంటాయి. అలాంటి విచిత్రమే ‘శంకరాభరణం’ చిత్రం- ఇలా సాగుతుంది బాలగోపాల్ విశ్లేషణ.
అతను శంకరాభరణం కథను క్లుప్తంగా చెప్పిన తీరూ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
కథానాయకుడు ఒక బ్రాహ్మణుడు. అతగాడికి సంగీతం పిచ్చి. అదీ ప్రాచ్య తరహా సంగీతమంటేనే. పాశ్చాత్య
సంగీతం మీద సదభిప్రాయం లేదు. సరి కదా పిచ్చికూతలు అని తగని ఆగ్రహం. కానీ ఉదారభావాలు కలవాడా శాస్త్రిగారు.. సంగీతం మీద తనకు
లాగానే పిచ్చి ఉన్న ఒక వేశ్యను చేరదీస్తాడు. ఆ అకార్యానికి
శిక్షగా కులబహిష్కరణ జరిగినా
పట్టించుకోడు.
వెలేసిన సంఘాన్ని ఏమనడు కానీ ఆ కోపం అంతా పాపం దేవుడు మీద చూపిస్తాడు. తన సంగీతం రవంధాళితో ఉరుములు మెరుపులు పుట్టిస్తాడు. ఏం ప్రయోజనం ఆశించాడో ఆయనకే తెలియాలి! కూతురికి పెళ్లిచూపులప్పుడు కూడా అదే తంతు. పాడే పాటలో అపశృతి దొర్లినందుకు పదిమంది ముందు పాపం బిడ్డ మీద విరుచుకుపడతాడు. కాబోయే అల్లుడికి సంగీత జ్ఞానం లేనందుకు బిక్కచచ్చేట్లు కూకలేస్తాడు కూడా. సినిమా అంతా ఒకటే సంగీత ఘోష. కళలు ఉన్నది కామోద్రేకం కలిగించడానికి కాదు.. ఆవటా అని. ఆ సందేశం అలగా జనానికి ఉద్దేశించింది.
విచిత్రం ఏమిటంటే ఎవరిని ఉద్దేశించి ఆ చిత్రం నిర్మాణమయిందో
వాళ్లకా చిత్రం బొత్తిగా అర్థం కాదు. ఆ చిత్రాన్ని సూపర్
హిట్ చేసింది శంకర శాస్త్రిని తిట్టి
పోసి.. వెలేసిన బ్రాహ్మణ సంస్కతి వర్గమే! అదీ తమాషా!
నాటి నయా వలసవాద సాంస్కృతిక బానిసత్వానికి 'శంకరాభరణం'
లాంటి చిత్రాలను ప్రత్యామ్నాయంగా కోరుకోవడం హైదరాబాద్
వామపక్ష విధ్యార్థుల అమాయకత్వం. వాళ్ల వంటి ఆశావాదుల కోరికను తీర్చే చిత్రం ఆ ఏడే విడుదలై
ఘనవిజయం కూడా సాధించింది. ఆ ఘనత సాధించిన సినిమా గౌతమ్
ఘోష్ దర్శకత్వంలో తయారైన 'మా భూమి'.
1930 - 1948 ప్రాంతంలో హైదరాబాదు నిజాముకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన
సినిమా ఇది. కిషన్ చందర్ నవల ‘జబ్ ఖేత్ జాగే’ ఈ చిత్రానికి ఆధారం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-1980లో
ప్రదర్శితమైంది. కార్వే వారీ చలనచిత్రోత్సవంలో, కైరో సిడ్నీ చలనచిత్రోత్సవాల్లో భారతదేశపు అధికారిక ఎంట్రీ
హోదా సాధించుకుంది. సిఎన్ఎన్-ఐబీఎన్ వారి 100 గొప్ప భారతీయ చలనచిత్రాల జాబితాలో చోటుచేసుకుంది.
1940 దశకంలో సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ తిరుగుబాటు ఈ చిత్రం ఇతివృత్తం. సినీ సాంకేతిక నిష్ణాతుల
ప్రకారం చిత్రం ఆరంభంలో కొంత తడబాటు కనబడుతుంది. ముఖ్య పాత్రధారుల
నోట గ్రామీణ తెలంగాణా యాస అంత సహజంగా పలకలేదు. లంబాడా పాత్ర
వేసిన అమ్మాయి పలికిన భాష ఏ లంబాడా జాతుల్లోనూ వినిపించేది కాదన్నారు బాలగోపాల్. కానీ ఈ ప్రాథమిక లోపాల పొరలు దాటుకుని మరికొంత లోతుల్లోకి పోయి చూస్తే మెచ్చుకోదగ్గ అంశాలు ‘మా
భూమి’లో చాలానే కనిపిస్తాయి.
కథ క్లుప్తంగాః
50 వేల ఎకరాల భూ ఆసామీ
దగ్గరి జీతగాడి కొడుకు రామయ్య, చిన్నప్పటి బట్టి
తిరగబడే తత్వం ఆ బుడతడిది.
పల్లెలోని దౌర్జన్యం తట్టుకోలేక పట్నం చేరి ఓ కర్మాగారంలో
పనికి కుదురుకుంటాడు.
కార్మికసంఘ నేతతో పరిచయం పెరుగుతుంది. రామయ్యతో పాటే సినిమా ప్రేక్షకులకూ అదనపు విలువ, అక్టోబరు విప్లవం లాంటి కొత్త విప్లవ విశేషాలు ఎరికలోకి వస్తాయి. పట్నం వదిలి గ్రామం తిరిగెళ్లిన రామయ్య అక్కడ జరిగే తిరుగుబాటులో కీలకపాత్ర వహిస్తాడు. అప్పటికే బలహీన పడ్డ నిజాం సైన్యం మీద విజయం సాధించినా.. భారత సైన్యం చేతిలో సర్కారు 'శాంతి భద్రతల
పునరుద్ధరణ'
పర్వంలో రామయ్య ప్రాణాలు విడవడం ప్రేక్షకుల్లో కొత్త
ఆలోచనలను రేకెత్తిస్తాయ్!
అన్నదాత కర్మాగారపు పనివాడుగా పరివర్తన చెందడం, శ్రామిక చైతన్యం అందిపుచ్చుకోవడంలో గ్రామీణుడు చూపించిన చొరవ, ప్రజాస్వామ్య పంథాలోనే తిరుగుబాటు బావుటా ఎగరేయాలనే సంకల్పం, ఆ క్రమంలో ఆదివాసులను సైతం కూడగలుపుకొని ఐక్య పోరాటాలు చేయవలసిన అగత్యాన్ని
గుర్తించడం,
జాతీయ బూర్జువాగా గుర్తింపబడ్డ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థతో
రాజీపడే తీరు గ్రామీణ ప్రేక్షకులక్కూడా అర్థమయే తీరులో చిత్రీకరించారు ఈ చిత్రంలో. షేర్వాణీలో పట్నం తారుకున్న దొర పల్లెకు తిరిగొచ్చే వేళకి నెత్తికి గాంధీ టోపీ తగిలిస్తాడు. ఇలాంటి చక్కటి ప్రతీకలతో
నిండి ఉండటంతో చెప్పదలుచుకున్న విషయాలు సులభంగా సామాన్య జనానికి చేరాయి. నిజాముతో అందరితో కలసి పోరాడిన రైతాంగంలోని సంపన్న వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం
హయాంలో మాత్రం జమీందారీ వర్గం
ఆధిపత్యాన్ని అంగీకరిస్తాయి. పోరాటం నాటి, ముందు, వెనుకల పరిస్థితులన్నింటినీ వాస్తవికంగా చిత్రీకరించడంలో 'మా భూమి'
సఫలమైంది. చేరవలసిన ప్రేక్షక
సమూహాలకు చేర్చవలసిన సందేశం చేర్చడంలో చిత్రం విజయంతమైంది. కనకనే 'మా భూమి'
విజయం 'శంకరాభరణం' విజయం కన్నా విశిష్టమైనది. వాస్తవమైనది. ప్రగతిశీలమైనది- అంటారు బాలగోపాల్.
'కళ కర్తవ్యం ఏమిటి' అన్న ప్రశ్నకు శంకరాభరణం'విజయం కన్నా మిన్నగా 'మా భూమి'
విజయం సమాధానం ఇచ్చినట్లయింది. గత విజయాలను,
వైఫల్యాలను గుర్తు చేయడం, గడచిన సామాజిక ఉద్యమాలను విశ్లేషించడం, తద్వారా ప్రజాస్వామిక విప్లవ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లడం కళ కర్తవ్యం.
అలా అని నమ్మే వాళ్లంతా 'మా భూమి' చిత్ర విజయాన్నే మనసారా
ఆస్వాదించారు.
సాయుధ పోరాటం తాలూకు చేదు, తీపి ఫలాలు రెండింటినీ చవి చూసిన తెలంగాణా
గడ్డ మీదే 'మా భూమి'
ఘన విజయం సాధించడం అదో గొప్ప విశేషం. లెనిన్ ని చదువుకున్న మేధావి వర్గమే
కాకుండా సాయుధ పోరాట స్ఫూర్తి ఇంకా తమ
రక్తంలో రగిలే మధ్యతరగతి, శ్రామిక వర్గాలూ ఎగబడి చూస్తూ 'మా భూమి'ని విజయవంతం చేయడం మహదానందమైన విశేషంగా బాలగోపాల్ చేసిన విశ్లేషణ సమంజసమైనది.
-కర్లపాలెం హనుమంతరావు
‘సాహిత్యం పై బాలగోపాల్’
పుస్తకంలో సినిమా సమీక్ష విభాగం కింద ‘శంకరాభరణం, మా భూమి’ వ్యాసం ఆధారంగా చేసిన
రచన (పుటలు..237 - 241)
***
No comments:
Post a Comment