తేర వస్తువులంటే ఎంత తీపో! కోట్లు పుచ్చుకుని ఆడే క్రికెట్టాటల్లో కూడా చాటుమాటుగా ఆ తీపి తాయిలాలు తిన మరిగే వికెట్లేవీ పడని బంతులు విసురుతుండేది మన క్రికెట్ వీరులు! ఆ ఆటల్ని మించిన ఆటలు ప్రజాస్వామ్యంలో ఎన్నికటాలు! అందుకే ఇక్కడా తాయిలాలకు అంతలావు డిమాండ్!
అతి తొందర్లోనే రాబోతున్నాయి కదా మన దేశం మొత్తం కుమ్ముకు చచ్చే సాధారణ ఎన్నికలు! ఆ ఓట్ల పోట్లాటలో ఎవరి జాతకాలు ఏంటో ముందే నిగ్గు తేల్చేస్తామని టీ.వీ డబ్బాలల్లో చేరి డబ్బాలు కొట్టుకునే సర్వేరాయుళ్ళకు తెలుసు ఆ తాయిలాల రుచి ఏంటో మా బాగా! పప్పరుమెంటు బిళ్లలు ఏ పక్షం వాళ్ళెక్కువ జేబుల్లో పోస్తే వాళ్ళ పక్షం వాళ్లకే మొగ్గు చూపించే చాణక్యం అబ్బో ఇప్పటిదా! ఉచితాలు అనుచితాలని చితచితలాడే బుద్ధిమంతులకు తాయిలాల రుచి తెలీకనే ఆ సణుగుళ్లన్నీ!
బేవార్సుగా బహుమతులెన్నో వరదలా వచ్చి పడే మహదవకాశం ఉండే ప్రజాస్వామ్యం మించి నిస్సందేహంగా మరో మంచి పాలనా వ్యవస్థ ఉండే అవకాశమే లేదు. రెండేళ్లు నోట్లోకి పోని బీద బిక్కీలకి ప్రజాస్వామ్యం తరహాలో వచ్చే ఐదేళ్ల ఎన్నికల పుణ్యమా అని కదా ఎన్నికల తతంగం నడిచే నెలనాళ్ల పాటైనా ఏ పనీ పాటూ లేకుండా తిని తాగి తొంగొని స్వర్ణయుగం మార్కు కమ్మని కలలు కనే మహదవకాశం దక్కేది! విస్తృతంగా ప్రజామోదం పొందిన మందూ మాకూ, ఆటా పాటల టైపు రకరకాల పథకాల మోత ముందు ఔట్ డేటెడ్ ఆదర్శాల చూర్లు పట్టుకుని వేళ్లాడే ఏ కొద్ది మంది వెర్రి వెంగళప్పల గోల బలాదూర్!,
వామవావతారంలో కూడా ఆ దేవుడంతటి వాడు మారువేషంలో వచ్చి నోరు విప్పి అడిగితే తప్ప బలి చక్రవర్తిగారికి ఆ ముష్టి మూడడుగులైనా ఇవ్వబుద్ధి అయింది కాదు! అప్పటికి ఈ మన ఎన్నికల తరహా ప్రజాస్వామ్యం తిప్పలు పాడూ లేవు. ఉండుంటేనా? అంత లావు బలి మహారాజైనా వామనుడు ఎక్కడున్నాడోనని వెతుక్కుంటూ పాతాళం నుంచి వైకుంఠం వరకు గాలించక తప్పుండేది కాదు. ప్రజాస్వామ్యం.. ఎన్నికలు అంటూ ఏ పితలాటకం లేదు కాబట్టి ద్వాపరంలో మనకు ఒక్క దాన వీర కర్ణుడు పేరే కర్ణబేరుల నిండా మారుమోగేది. అప్పుడే కనుక మన ఇప్పటి తరహా డెమోక్రసీ మార్కు ఎలక్షన్లు అమల్లో ఉండుంటే! నేటి మన దానవేంద్రుల ఉచిత పథకాల ముందు ఆ రాధేయుడి కర్ణ కుండలాలు సోదిలోకైనా వచ్చుండేవి కావు. డొక్క చూపించి యాచిస్తే తప్ప కొన్నైనా మధురాంబులు ఇవ్వాలని తోచింది కాదు భక్త అంబరీషుడికి. దున్న పోతుల్లా బలిసున్నవాళ్లకైనా సరే పనీ పాటల్తో నిమిత్తమేమీ లేకుండా ముప్పొద్దులా వూరకే మెక్కపెట్టే ఉచిత ఆహార పథకాలు మా దగ్గర బోలెడు ఉన్నాయి' అంటున్నారు ఎన్నికల్లో నిలబడ్డ మన దీన జన ఆపద్భాంధవులందెరో ఇప్పుడు. అడిగినవాడు దేవతలకు మహారాజు కాబట్టి కిమ్మనకుండా వెన్నెముక ముక్కలు రెండు వజ్రాయుధంగా మలుచుకొమ్మని దానమిచ్చాడు దధీచి. ఎదో విధంగా తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకోవాలన్న పాచిక లేదా దధీచి దానంలో? మరి చివరి రక్తపు బొట్టు వరకూ బడుగుల బాగోగుల కొరకే పోరాడి తీరతామని లేకుంటే ఆత్మార్పణలకు దిగిపోతామన్న మన నేతల కుమ్ములాటలను ఎన్నికల గిమ్మిక్సుగా మేధావులు హేళనచెయ్యడం ఎంత వరకు సబబు?
అన్న పానీయాలతో సహా అన్నీ వదిలేసుకుని వంటి కాలుమీద ఉగ్ర తపస్సులు చేసే మహా మునీశ్వరులకైనా ఆ పరమేశ్వరుడు ఒక్క పట్టాన ప్రత్యక్షమై వరాలు ప్రసాదించింది లేదు ! అట్లాంటిది పిలవా పెట్టకుండా హఠాత్తుగా ప్రత్యక్షమైపోయి 'నరుడా! ఏమి నీ కోరిక?' అని విధాయకంగానైనా అడగా పెట్టకుండా ఇంటి మధ్యో రంగుల టి.వి సెట్లు పెట్టిపోయే నయా దేవుళ్లు ఇప్పుడు ఎన్నికల సీజన్లో పుట్టగొడుగుల్లా పుట్తుకొస్తున్నారు. తప్పేముంది? ప్రజస్వామ్యం తరహా ఎన్నికలు క్రమం తప్పకుండా ఈ మత్రమైనా నిస్వార్థంగా నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా తరహా నియంతల బాట ఎంచుకోడంలేదు.. అదెంత గొప్ప ప్రజాసేవ? ఎచ్చివో పచ్చివో ఓ వరసలో ఎన్నికలు వస్తుండబట్టి కాదూ.. బోడి మల్లయ్యలు కూడా కల్లోనైనా ఊహించే సాహసం చెయ్యలేని బ్రాండ్ ‘సెల్ ఫోనులు’ సైతం చెవుల్లో జోరీగల్లా రింగుమంటున్నది! తాడో పేడో తేల్చుకుంటే తప్ప మరో ఐదేళ్ల పాటు జనం మాడు పగలగొట్టే అధికారం చేతికి దక్కదన్న పెద్దమనుషుల దుగ్ధల వల్లే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు తాయిలాల ఎన్నికలుగా మారిపోయింది! ఏ సుపరిపాలనకైనా అసలు పరమార్థం సమాజంలోని అట్టడుగు స్థాయి మనిషిక్కూడా కళ్లు తెరిపిడి పడకపోయినా కాళ్లు బార్లా జాపుకుని కునుకుతీసేపాటి సుఖం దక్కడమే కదా! ప్లాటో గానీయండి, అరిస్టోటిల్ గానీయండి ఇంతకు మించి ఊడబొడిచే ఉటోపియా మాత్రం ఇంకేముంటుంది? చదూకున్నోళ్ల బడాయి కూతలు కాకపోతే మార్క్సే కావాలా.. మహాత్ముడే మళ్లీ రావాలా? ప్రజల పగటి కలలను నిజం చేస్తున్నారు ఇప్పటి నేతాశ్రీలు.. స్వచ్చందంగా.. అదెంత గొప్ప విషయం? తప్పస్సులు గట్రాల్లాంటి బాధలేవీ పడకుండానే ప్రార్థించుకోని దేవుళ్ళు సైతం గుడిసెల్లోకి దూరొచ్చి మరీ అడిగినవాటి సంగతి అటుంచి అడగనివి అడక్కూడనివి కూడా
అడక్కుండానే రెండు చేతుల్నిండా పోసి పోతున్నారు! ఏడుకొండలవాడి దర్శనార్థం రోజుల కొద్దీ క్యూలల్లో పిల్లాజెల్లల్తో కలసి అల్లాడిపొయ్యే అల్లాటప్పగాళ్లం మనం. మన్లాంటి అమాంబాపతుగాళ్ల అనుగ్రహాల కోసం మన గుడిసెల ముందు ఆ గుడులకు మించి మరీ సాగిలపడిపోతున్నారీ నేతాగణం!
ఈ దేశంలో ఎన్నికలు జరిగే తంతుని దేశదేశాలల్లో ఏదోదో కథలు కమామిషులు అల్లి ఎద్దేవా చేస్తుంటారు కానీ మేధావులంతా కలసి.. కనీసం ఒక్క కాంణబ్బైనా బ్యాలెన్స్ లేకుండా కాతాలు ఇంకే దేశంలోని బ్యాంకులు పేదోళ్ల కోసం ఓపిగ్గా ఓపెన్ చేస్తున్నాయో చెప్పమనండి! గోచీపాత కూడా వంటి మీద లేనోడి చేతిలో బ్యాంకు పాసుబుక్కులు పెట్టిసే మ్యాజిక్కులు మరే దేశంలొ జరుగుతున్నాయో.. ఆ గుట్టు విప్పమనండి! ఈ మాదిరి ఆలీ బాబా వండర్ ల్యాండ్స్ అద్భుతాల సృష్టికి ముఖ్య కారణం మనం మన రాజ్యాంగంలో తెగించి మరీ రాసుకున్న ఎన్నికల విధానం.. ఐదేళ్లకో సారైనా నేతలు జనాల ముఖం చూసొచ్చే తతంగం కంపల్సరీగా ఉండాలనడం.. అంటారా? ఆ రాజ్యాంగం బౌండుబుక్కుల్లో ఉన్నవాటన్నింటికల్లా బైండయివుండాలన్న రూలేమన్నా ఉండిందా? అయినా ఉంటున్నారు.. మేధావులు కావాలనే మన నేతల ఔన్నత్యం దాటేస్తున్నారు. అదే అసలు సత్యం.
ముష్టి రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలకే ప్రపంచంలోనే తాము అగ్రరాజ్యమని పద్దాకా సొంత డబ్బాలు కొట్టుకునే అమెరికా అంతలా అతలాకుతలమై పోతుంటుందే ఎన్నికల రోజుల్లో ఎన్నో కలర్లు మారుస్తుంటుందే! సైజులో ఆ దేశానికన్నా ఐదింతలు పెద్దది. జనాభాకి పదింతల కన్నా ఎక్కువది. గలభాల్లో మరెన్ని రెట్లు ఎక్కువో ఎక్కడా రికార్డు కాని నేపథ్యంలో సైతం ఇన్ని వేల రాజకీయ పార్టీలల్లో నుంచి కొన్ని లక్షల మంది అసమర్ధుల్ని కోట్ల మంది లుల్లాయిలూకా ఓటర్లు ఒక్క అయిదారు వారాలల్లోనే ఇట్టే తైర్పారపట్టేసి నెత్తికి ఎక్కించేసుకోవడం ఏ శతాబ్దంలోనైనా ఎక్కణ్నుంచైనా ఇంత నిశ్శబ్దంగా సాగుతున్నదా?
గమ్మత్తు కాదు మరి మన భారతీయ ప్రజాస్వామ్యం తరహాలో ఎన్నికలు జరగాలంటే? బడికెళ్లే ఈడు లేని బుడ్డోళ్ళు క్కూడా బాహాటంగా బూతుల కెళ్లి ఓట్లేసేటంత స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఈ దేశంలో ఉన్నాయ్! ఎనేళ్ల కిందటో పైకెళ్లిపోయినా సరే ఎన్నికలొచ్చాయంటే చాలు.. చచ్చిన పీనుగలు సైతం చంగు చంగున కిందకి దిగొచ్చేసి ఇంచక్కా ఓటు హక్కు వినియోగించుకుంటాయి! ఏ దేశంలో ఉంటుందండీ ఈ మాదిరి ప్రజాస్వామ్యం స్ఫూర్తి? ముసలీ ముతకా మాదిరి ఓటర్లు గంటల కోద్దీ క్యూలల్లో నిలబడి టై వేస్టు చేసుకొనే శ్రమ లేకుండా అన్ని పార్టీలు తమ శక్తి కొద్దీ కార్యకర్తల ద్వారా ఓటర్లను సేవించుకునే సౌకర్యం ఈ దేశంలో మాదిరి మరింకెక్కడా కనిపించదు. స్వాతంత్ర్యయోధులు కలలు కన్న స్వయంపాలనా విధానం ఆనక.. ముందు స్వీయ ఓటింగు విధానానికి కట్తుబడి చిత్తశుద్ధితో మన నేతాగణం ఇన్నేళ్ల బట్టి అమలుచేయడం మనకు మహా గర్వకారణం. బాలెట్ పద్ధతి నుంచి యాంత్రిక విధానం వరకు ఎన్ని మార్పులకు మన ఎన్నికల విధానం లోనయినా ఒక్క సిధ్హాంతంలో మాత్రం మనమే రాద్ధాంతాలకు పోకుండా ఏకీభావంతో పనిచేసుకుపోతున్నాం. నచ్చినా నచ్చకున్నా చచ్చినట్లు ఎవరో ఒక చచ్చు నేతను ఎన్నుకోక తప్పని పరిస్థితి నుంచి మనం ఎన్నడూ పక్కకు తప్పుకున్నదిలేదు. అదీ రాజ్యాంగస్ఫూర్తి పట్ల చెక్కుచెదరని మన విధేయత.
నిజమే! రెండు రూపాయిలు పోసినా చార్లోకేసుకునే కరివేపాకు ఓ రెండు రెబ్బలయినా రానప్పుడు, బుక్ చేసి వారాలు గడిచినా గ్యాసు బండ అలికిడి గుమ్మంలో వినబడనప్పుడు, పంపుల నుంచి వచ్చే మంచి నీళ్ళు తారు కంపు కొడుతున్నప్పుడు, గతుకుల రోడ్డ దెబ్బకి దారి మధ్యలోనే బండి మొండికేసినప్పుడు, ధర్మాసుపత్రి రంగుగోళీలతో యమధర్మరాజపుర సందర్శనం జరిగినప్పుడు, బడికంటూ బైటకెళ్లిన చిట్టితల్లి బడుద్ధాయిల దాడికి చిట్లి ఇంటికి తిరిగొచ్చినప్పుడు, చదువులు సరిగ్గా అబ్బక ఒకడు, అబ్బిన సతుకులకి సరిపడ్డ కొలువు దొరక్క ఇంకొకడు గుబురు గడ్డాలూ మీసాలతో చెట్టంత బిడ్డలిద్దరూ నట్టింట ఊడలు దిగిన మానులకు మల్లే భయపెడుతున్నప్పుడు 'చీ! పూర్వ జన్మలో ఏ పిచ్చిపూలతో పూజలు చేసిన ఖర్మమో ఇది!' అని ఏదో శాపనార్థాలకు దిగిన మాటా నిజమే! కానీ ఆ తెలుగు సినిమా కహానీలన్నీ ఎన్నికలని ఇలా వచ్చీ రాగానే చిటికేసినట్లు ఎటో మటుమాయమైపోతాయి! అదీ ఈ దేశం పాలనా వ్యవస్థలోని గొప్ప వైశిష్ట్యం. నయా నాయకమ్మన్యుల ఉపిరి సలపనీయని ఉచిత హామీల జడివానలో తడిసి ముద్దై పోతున్నప్పుడు మేధావులనుకునే మన పెద్దలకేమనిపిస్తుందో తెలీదు కానీ.. పూటకు గతి లేని బికారికి మాత్రం ఎన్నికల కాలమంతా పూటుగా చుక్కా.. ముక్కా పడుతున్నప్పుడు ఏమనిపిస్తుందో ఊహించడానికేమీ మనం పెద్ద మహాకవి గురజాడలమేం కానక్కర్లేదు! ‘ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో.. జనియించినాడ వీ స్వర్గఖండమున.. ఏ మంచిపూవులన్ ప్రేమించినావో.. నిను మోచె ఈ తల్లి కనక గర్భమున’ అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఇక్కడ జరిగే ఎన్నికల మాదిరి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిబ్బరంగా బతుకుల నెలాగో నెట్టుకొచ్చేందుకు ఫిట్. అట్లా కాకుండా ‘ లేదురా ఇటువంటి భూదేవి యెందూ.. లేదురా మనవంటి పౌరులింకెందు’ అని గాని వెగటుగా అనిపించిందా.. వాడిహ ఈ మేధావి పుటక నుంచి ఈ జన్మకు బైటపడనట్లే లెక్క. నజరానాలకు మాత్రమె జనాలు నీరాజనాలు పడుతున్నారన్న నిజం మేధావుల బుర్రలకిహ ఈ జన్మకెక్కదన్న నిజం మరో మారు రుజువయినట్లే లెక్క! ఈ దేశంలో సుఖంగా జీవించడానికి మేధావులు అందుకే సెంట్ పర్సెంట్ అన్ ఫిట్!
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట-24. ఫిబ్రవరి, 2019) ప్రచురితం
***