Tuesday, April 26, 2016

తెలుగు వెలుగులు- ఈనాడు సంపాదకీయం

తెలుగువారికోసం తెనిగించిన ప్రమ సంపూర్ణ వైష్ణవ ప్రధాన తత్వకావ్యం నన్నయ మహాభారతం. ఆదికవిగా నన్నయను ఆదరించింది తెలుగుతల్లి. నన్నెచోడునివంటి శైవ ప్రజాకవినీ అంతే ప్రేమగా చేరదీసింది. హరిహరులకు అబేధం చాటుతూ గొప్ప నాటకీయతతో పదిహేను పర్వాల భారతాన్ని అపూర్వంగా పూరించిన తిక్కననూ అక్కున చేర్చుకుని ధర్మ నిష్పక్షపాతాన్ని నిరూపించుకుంది. ఎర్రనవంటి ప్రతిభా ప్రబంధ పరమేశ్వరులు ఎందరో తెలుగుతల్లి కడుపున  జన్మించారు. ప్రౌఢశైలి, శబ్దగుంభన, పదమాధుర్యం, చమత్కృతులతో ‘చమక్ మనిపించే మనుచరిత్ర, వసుచరిత్ర, కళాపూర్ణోదయం, విజయవిలాసం,
పారిజాతాపహరణంవంటి ఆభరణాలు తెలుగుతల్లి గళంనిండా కనులపండువుగాఎన్నెన్నో! శ్రీనాథుని కాశీఖండం, పోతనామాత్యుని మహాభాగవతం, మొల్లతల్లి రామాయణం, కదిరీపతి శుకసప్తతి, అన్నమయ్య పదకవితలు, త్యాగయ్య పంచరత్నాలు, క్షేత్రయ్య మువ్వగోపాలపదాలు, రంగాజమ్మ యక్షగానం.. వేమన ధూర్జటి కుమార కుమారి సుమతీ నీతిశతకాలూ... మన్నికైనవి ఇవీ అని- ఎన్నెన్ని ఎంచి చూపించాలి! రాయలవారి నుంచి రామదాసులవారి వరకు- ఒకరినిమించి ఒకరు అమ్మకు సమకూర్చిపెట్టిన సొమ్ము సమ్మంధాల వివరాలను.. వాటి తళుకు బెళుకులను వర్ణించుకుంటూపోయేందుకు ఒక జన్మ చాలదు. తూర్పు చాళుక్యుల పాలనంతటి పురాతనమైన తరువోజ అలంకారాలు, శతాబ్దాలకిందటి కందుకూరి శాసనమంతటి సౌందర్య 'సీస'లు, ద్విపదలు. తుమ్మెదపాటలు, గొబ్బిపదాలు, వెన్నెలపాటలు, ఊయలగీతాలు, గౌడుగేయాలు, అభినయంతో కూడిన అలతులు.. పెట్టెనిండా పట్టకుండా పొంగిపొర్లే అలంకారాలు- తెలుగుతల్లికి న్నెన్నో!

'చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో/ మెక్కిన భంగి.. మక్కువ పళ్ళెరంబున స/ మాహిత దాస్యమనేటి దోయిటన్/ దక్కెనటంచు' రామదాసు జుర్రుకొన్నది రామయ్య రూపంలో ఉన్న సుధారసమా? తెలుగుభాష సౌందర్య రూప విశేషమా? ఒక్క రామదాసువంటి భక్తశిఖామణులని ఏముంది.. సాక్షాత్ ఆ భగవంతుడినే అలరించిన సుమధుర భాషాక్షరాలు ..లు. ఆంధ్ర మహావిష్ణువు.. శ్రీ కృష్ణదేవరాయలకి కలలో కనిపించి గోదాదేవి కల్యాణ గాను తెలుగులోనే రాయాలన్న పురమాయింపుకు కారణం  శ్రీవారే స్వయంగా సెలవిచ్చారు కదా! 'తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ' నడమేనా! 'యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి!' అని చురక కూడా అంటించారు. రాయలవారిది  ప్రారంభంనుంచీ పెను ఆంధ్రభాషాభిమానమేనని. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనస్ఫూర్తిగా నమ్మిన భాషాపోషకులని చరిత్ర చెపుతూనే ఉంది. స్వయంగా 'తుళువు' అయినా తమిళ గోదాదేవి గాను తెలుగులోనే రాయ సంకల్పించేందుకు  కారణం ఆంధ్ర భాషమీదున్న గాఢాభిమానమే. 'అక్షరం కొసను అచ్చుతో ముగించగల అజంత సౌలభ్యం ప్రపంచభాషలన్నింటిలో ఇటాలియనుకిలాగా ఉన్నందు వల్లనే  తెలుగ పలుకుకీ కలకండ పలుకు తియ్యదనం' అని ముందు గుర్తించిన మహానుభావుడు హాల్డెన్ దొర. 'వ్రాసిన- పద్య మాంధ్రమున వ్రాయవలెన్' అని దాశరథి అన్నారంటే ఆశ్చర్యపోవలసింది ఏముంది! అప్పయ్య దీక్షితులవంటి ఉద్దండ తమిళపిండమే 'తెలుగు నేలపై పుట్టుక పూర్వజన్మ సుకృతఫలం' ని పొగడ్తలకు దిగిన తరువాత- ఆంధ్రభాష ఘనతకు మరో ధ్రువపత్రం అవసరమా! మధ్యమధ్యలో స్వరం, స్వరూపం మారుతూ వచ్చినా శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంనాటి తెలుగక్షర సౌందర్యం, మాధుర్యం ఈ నాటికీ అమరావతీ స్థూపమంత స్థిరంగానే ఉంది. సరే! తెలుగువారి గుండెలమీదా అంతే స్థిరంగా ఉందా? గిడుగు, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, శ్రీ శ్రీ, జాషువావంటి మహామహులు తెలుగుతల్లి గుమ్మంలో వెలిగిస్తున్నా.. ఆ గుమ్మటాల వెలుగులు వెలా తెలా తేలిపోతున్నాయే! ఆ తెగులేనయ్యా  ఇప్పటి మన దిగులు.

తిరుపతి వేంకటశాస్త్రిగారు ఒకానొక శతావధాన ప్రదర్శన సందర్భంలో 'రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు'  రోషంతో మీసం మెలివేశారని వినికిడి. దేవభాషలో దిట్టయివుండీ తన మాతృభాషాభిమానాన్ని  దానికి ఈటుగా చాటుకున్న శ్రీనాథుడి వారసత్వాన్ని గూర్చి చెప్పుకోవాలి. 'అత్యంత సుకుమారి ఆంధ్రభాషా యోష/ ఆత్మీయ ముద్దుచెల్లి నాకు' అన్న అన్నప్రేమ ఎంతలా పొంగిపొర్లకుంటే శృంగారనైషధంమీది శ్రద్ధ చాటువుల్లోనూ చాటుకుంటాడు! వామనభట్టువంటి దిట్టలున్న వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడికి విద్యాశాఖాధికారి పట్టం కట్టబెట్టింది ఈ తెలుగు భాషమీది దిట్టతనమే! అచ్చుకు తగినట్లు వర్ణక్రమాన్ని సంస్కరించి, ఎన్నో విస్తృత ఉద్గ్రంథాలను పండితుల సాయంతో పరిష్కరించేందుకు బ్రౌనుదొరను పురిగొల్పిందీ తెలుగు పలుకుబడిలోని తళుకు బెళుకులే! తరిగొండ వేంగమాంబ చేత- జనం నాలికలమీద నేటికీ నాట్యమాడే సరళ తత్వాలను రాయించింది తెలుగుభాషలోని అజరామరమైన  సౌందర్య లక్షణమే! కాలంతోపాటు వేగం పెరిగింది. వినిమయ విస్తృతికున్న ఎల్లలు చెదిరిపోయి ఇల్లే వైకుంఠమనుకునే కాలం చెల్లిపోయింది. అంతర్జాతీయ సాంకేతికావసరాలకు సరితూగటంలేదన్న వంకతో తల్లిభాషను చిన్నచూపు చూసే పెడధోరణి ప్రమాదకర స్థాయికి పెరిగింది! మాతృభాష కన్ను వంటిది. పరాయిభాష ఎంత ఘనమైనదైనా కళ్లజోడుకన్నా ఎక్కువ ఉపయోగానికి రానిది. తల్లిపేగు ప్రాణధార, తల్లిభాష జ్ఞానధార. తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే తల్లిభాషకూ ప్రత్యామ్నాయం ఉండదు.  కోట్లాదిమంది బిడ్డలుండీ తల్లికి చీకటి కొట్టే గతి కావడం జాతికి శుభం కాదు. కంప్యూటరీకరణకు అచ్చుగుద్దినట్లు అమరే ఏకైక భారతీయ భాష తెలుగు లిపే. భావవేగాన్ని అత్యంత సమర్థవంతంగా అందిపుచ్చుకునే  పరుగు పందెంలో  రోమనువంటి యూరోపియను భాషలతోనే కాదు..  మన దేవనాగరి లిపితోనూ ముందంజలో ఉంది  తేనెలొలుకే మన తీయని తెలుగుభాషే అని సైన్స్‌ టుడే’ లో  ఎన్నడో వచ్చిన  వ్యాసం ప్రస్తుతించింది. ప్రస్తుతం కొరతపడిందల్లా తెలుగు వారి గుండెల్లో కాస్తంత ఆత్మగౌరవం.. మాతృభాషమీది అభిమానం.. మన తెలుగు కదా.. ఎలాగైనా మళ్లీ  నిలబెట్టుకోవాలన్న ధృఢ సంకల్పం
-సేకరణః
కర్లపాలెంహనుమంతరావు
(ఈనాడు, సంపాదకీయం, 08-01-2012 లో ప్రచురితం) 
(ఈనాడు సంపాదకులకు .. యాజమాన్యానికి ధన్యవాదాలు.. కృతజ్ఞతలు)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...