కథ
పరామర్శ
రచన - కర్లపాలెం హనుమంతరావు
నాంపల్లి కేర్ హాస్పటల్ ముందు ఆటో ఆగేసరికి సమయం సాయంకాలం ఐదుగంటలు. విజిటర్సుతో ఆసుపత్రంతా కోలాహలంగా ఉంది. రిసెప్షన్ కౌంటర్ దగ్గరికెళ్ళి నేనొచ్చిన పనిచెప్పాను. వెంటతెచ్చుకొన్న కాగితాలూ చూపించాను.
'కంప్యూటర్లో సరిచూసుకొని ' రూమ్ నెంబర్ టూ నాట్ ఫైవ్ మ్యాడమ్! ఫ్లోరు కార్నర్లోఉంటుంది. తొందరగా వెళ్ళండి! ఇంకో గంటలో విజిటింగ్ అవర్స్ అయిపోతాయి' అందిరిసెప్షనిష్టు.
లిఫ్ట్ ఎక్కి ఆ ఫ్లోర్ చేరేసరికి ఇంకో పావుగంట! ఆ ఫ్లోర్ ఇన్ చార్జ్ అనుకొంటా మళ్లీవివరాలు అడిగి 'ఒక టెన్ మినిట్ స్ వెయిట్ చేయండి!లోపల డాక్టరుగారున్నారు' అంటూఓ కార్నర్ సీటు చూపించించింది కూర్చోమన్నట్లు.
వెంట తెచ్చుకొన్న పళ్ళబుట్ట పక్కన పెట్టుకొని కూర్చున్నాను.
ఆసుపత్రి వాతావరణం నాకంతగా పడదు. మందులూ, రోగులూ, పరామర్శలూ.. ఏమంతఉల్లాసకరమని కోరుకోవడానికి! మరీ దగ్గరవాళ్ళను పరామర్శించాల్సి వస్తే సాధారణంగాఇళ్ళకే వెళతాను. ఈ సారే ఇలా!
ఇన్ చార్జ్ నర్సుకి బాతాఖానీ కొట్టేవాళ్ళెవరూ దొరకలేదులాగుంది నా పక్కకు వచ్చి కూర్చొంది. ఇద్దరు ఆడవాళ్ళు ఒకచోట చేరితే కబుర్లకు కొదవేముంది!
'రామారావుగారిని చూస్తే నిజంగా చాలా జాలనిపిస్తుంది మ్యాడమ్! ఈ వయసులోరాకూడని కష్టం. నిజంగా దురదృష్టమే! ఎప్పుడు బాగా లేకపోయినా ఇక్కడికే వస్తుంటారు. ఈ సారే మరీ బాగా చెడిపోయింది. సగం రోగం అసలు కుటుంబం దూరమైందనే! పోనీలేండి! ఇంతకాలానికి మీరైనా వచ్చారు. చూసి ఎంత సంతోషిస్తారో! మీ అబ్బాయికూడావచ్చుంటే బాగుండేది!'
నాకేం సమాధానం చెప్పాలో తోచలేదు. నా సమాధానంకోసం ఆమె ఎదురుచూడలేదు కనకసరిపోయింది!
రూమ్ నుంచి డాక్టరుగారు బైటికిరావడంతో నర్సు వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఇంకోనర్సు వచ్చి నన్ను ఆ రూమ్ లోకి తీసుకువెళ్ళింది.
గదంతా చల్లగా ఉంది. మందుల వాసన. బెడ్ మీద కళ్ళుమూసుకొని ధ్యానంలో ఉన్నట్లుపడుకోనున్నాడాయన. రోగం మూలకంగా వయసు మరీ మీద పడినట్లుంది.
నర్సు ఆయన్ని చేత్తో రెండుమూడు సార్లు తట్టింతరువాత గాని ఆయన కళ్ళు తెరిపిడిపడలేదు.
'సార్! ఎవరొచ్చారో చూడండి.. మీకోసం' అంది ఆమె అభిమానంగా.
కళ్ళు అటూ ఇటూ తిప్పిచూసాడు. చూపు ఒక చోట నిలబడటంలేదు. దేనికోసమోవెతుకుతున్నట్లున్నాయా చూపులు.
'గుర్తు పట్టినట్లు లేరు. మైండ్ సరిగ్గా ఉండటంలేదు.' అని నాతో చిన్నగా అని, 'ఇటు..ఇటువైపు చూడండి రామారావుగారూ! మీ మిసెస్.. కలవరిస్తున్నారుగా మేడమ్ కోసం! తనివితీరా కబుర్లు చెప్పుకోండింక' అని నా వంక నవ్వుతో చూసి మళ్ళా లోవాయిస్ లో 'సైట్కూడా ఎఫెక్టు అయినట్లుంది. సాధ్యమైనంత వరకూ క్లోజ్ గా కూర్చొని టచ్ చేస్తూమాట్లాడండి! ఈ డిసీజ్ కి పేషెంటుకి కావాల్సింది హ్యూమన్ టచ్! భయపడకండి! ఎయిడ్సు అంటువ్యాధి కాదు. మీరు మాట్లాడుకోండి! నా అవసరం అనిపిస్తే పిలవండి.. వస్తాను. ఇంకో అరగంటదాకా విజిటింగు టైముంది' అని హచ్చరించి డోర్ లాగివెళ్ళిపోయింది నర్సు.
గదిలో నేనూ.. ఆయనా! నర్శు మాటలు గుర్తుకొచ్చాయి.
వెంటతెచ్చుకొన్న పండ్లు సైడ్ డెస్కుమీద పెట్టి వెళ్ళి ఆయన మంచానికి దగ్గరగాకుర్చీలాక్కొని కూర్చొన్నాను.
బలహీనమైన గొంతుతో ఆయన అన్నారు 'నన్ను క్షమిస్తావా జానకీ! నీకు తీరని ద్రోహంచేసాను. అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను.' ధారాపాతంగా ఆయన కళ్ళవెంట నీరు. చాలా జాలిగా అనిపించింది.
ఓదార్పుగా ఆయన చేతిని నా చేతిలోకి తీసుకొని అన్నాను 'ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పండి! నేను వచ్చేసాగా! ఇంక హాయిగా విశ్రాంతి తీసుకోండి!' నా గొంతు నాకే వింతగాఅనిపించింది.
'కాదు జానకీ! నన్ను చెప్పనీయి! నాకు తెలుసు! నాకింక ఆట్టే టైములేదని. నిన్ను క్షమాపణఅడగాలి ముందు! ఎంత హింసించాను నిన్ను! అయినా ఎన్నడూ ఒక్కమాటఎదురుచెప్పేదానివి కాదు. చెడతిరిగిన మాట నిజమే! కానీ ఈ ఎయిడ్సు అట్లా వచ్చిందికాదు. నువ్వు అపార్థం చేసుకొన్నావు. నన్ను విడిచి పెళ్ళిపోయావు. నాకీ రోగం వచ్చిందన్నబాధకన్నా నన్ను నీవు తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోయావన్న బాధే ఎక్కువగా ఉండేది.'
నాకు బదులు ఏమి చెప్పాలో తోచలేదు.
'ఈయన్ని మాట్లాడనిస్తే చాలు. మనసులో ఇన్నాళ్లూ గడ్డకట్టుకుపోయిన దుఃఖం ఇట్లానైనాకరిగి బైటికి వచ్చేస్తే మందు ఆ అపరాధ భావన తొలగిపోతుంది.'
మౌనంగా వింటూ కూర్చున్నాను అందుకే!
'షిర్డి వెళ్ళాను గుర్తుందా నీకు.. ప్రమోషన్ వచ్చిందని. తిరిగొచ్చేటప్పుడు ఏక్సిడెంటయింది. చాలామంది పోయారు. ప్రాణాలతో బైటపడ్డవాళ్లలో నేనూ ఒకణ్ణి. చాలా రక్తం పోయిందనిదగ్గర్లో ఉన్న అదేదో ఆసుపత్రిలో రక్తం ఎక్కించారు. ఎక్కడ జరిగిందో పొరపాటు ఇదితగులుకొంది. బాగా ముదిరిందాకా తెలీలేదు. తెలుసుకొని ఇప్పుడు ప్రయోజనమూ లేదు. విషయం చెప్పుకొనే అవకాశంకూడా ఇవ్వకుండా నువ్వెళ్ళిపోయావు. మిగతావాళ్ళ సంగతివదిలేయ్! నువ్వూ నన్ను అపార్థం చేసుకొన్నావన్నదే నా బాధ. నీ బాధ నేను అర్థంచేసుకోగలను. ఎయిడ్స్ వచ్చిన మొగుడితో ఏ భార్యయినా ఎట్లా కాపురం చేస్తుంది? నువ్వువెళ్ళిపోవడాన్ని తప్పుపట్టడంలేదు. నా తప్పు ఏమీ లేదని చెప్పుకొనే అవకాశం కూడా ఏమీఇవ్వకుండా వెళ్ళావు.. ' ఆయాసంతో ఆయన రొప్పుతున్నారు.
ఏదో విధంగా ఆ ధోరణిని ఆపకపోతే ఇంకా రొష్టు పడతారు.
'ఇప్పుడు తిరిగి వచ్చేసాగా! ఇంకెందుకండీ ఆ పాత విషయాలన్నీ! నేను మిమ్మల్నితప్పుపట్టివుంటే తిరిగి వచ్చేదాన్నా! మీరు చెప్పాలనుకొన్నది చెప్పారు. గుండెబరువుదించుకొన్నారు. ఇకనైనా ప్రశాంతంగా నిద్రపోండి.. కాస్సేపు! బాగా అలసిపోయారు' అనిలేవబోయాను. 'ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ రొష్టు పెట్టినట్లవుతుంది' అనిపించింది.
గభాలున నా చేతిని గట్టిగా పటుకొన్నారు.. సంతలో తప్పిపోకుండా పిల్లాడు తల్లిచెయ్యిపటుకొన్నట్లు!
'లేదు జానకీ! నువ్వు వెళ్ళొద్దు! నువ్వు దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నువ్వుపక్కనుంటే యమధర్మరాజుతోనైనా యుద్ధం చేస్తా!' అంటూ వలవలా ఏడ్చేస్తుంటే.. ఎలాఓదార్చాలో అర్థంకాలేదు.
'ఇట్లా బాధపడతారని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఇంకా బాధపడుతుంటే ఇప్పుడేవెళ్ళిపోతాను!' అన్నాను బెదిరింపు ధోరణితో.
నిజంగానె వెళ్ళిపోతాననుకొన్నట్లున్నారు.. కాస్త సర్దుకొన్నారు!
'లేదులే.. కుర్చో.. ఇట్లా.. నా పక్కన.. నాకు హాయిగా ఉంటుంది. నిద్రపోతే నువువెళ్ళిపోతావని భయంగా కూడా ఉంది.'అన్నారు నా రెండుచేతుల్ని తన గుప్పిటమధ్యగట్టిగా బంధించి గుండెలకి అదిమిపెట్టుకొంటూ.
'ఎక్కడికీ పోను. నిశ్చింతగా నిద్రపోండి!' అన్నాను. నర్శు ఇచ్చిన ఇంజెక్షన్ ఇప్పుడుపనిచేయడం మొదలుపెటినట్లుంది. మెల్లిగా మగతలోకి జారుకొన్నారాయన ఐదునిమిషాల్లో.
నిద్రపోయే ఆయన మొహంలో పసిపిల్లవాడే కనిపిస్తున్నాడు. ఎంతసేపు అలాకూర్చుండిపోయానో తెలీదు!
తలుపు చిన్నగా కొట్టి లోపలికొచ్చింది నర్సు.
గభాలున మంచం దిగిపోయాను. గుప్పిటలోనుంచి నా చేతులు విడిపించుకోబోతేవీలుకాలేదు. ఆ గుప్పిట గట్టిగా ఉంది! చల్లగా ఉంది! ఆయనచేతినరాలుబిరుసెక్కుతుండటం గమనించాను. నా అనుమానం నిజమే అయితే..
నర్సుసాయంతో ఆయన గుప్పిటపట్టు నుంచి నా చేతిని విడిపించుకొన్నాను. చివరిసాగిగాఆయన్నొక్కసారి చూసి బైటికివచ్చేసాను.
'చాలాకాలం తరువాత ఇవాళ ఆయన మొహంలో ఆనందం చూసాను మేడమ్! ఇంజెక్షన్లు, మందులద్వారా మేమివ్వలేని ప్రశాంతత మీరు అందించారు. మెనీ మెనీ థేంక్స్!' అందిఆయన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ హాస్పటల్నుంచీ నేను బైటకు వచ్చేటప్పుడు.
'యువర్ కాంప్లిమెంట్స్ గో టు మై హజ్ బండ్ అండ్ టు మేక్ ఏ విష్ ఫౌండేషన్!'అన్నాను.
ఇక్క డికి బైలుదేరేముందు నా విజిట్ వర్కవుట్ అవుతుందా? కాదా?' అని నాకేసందేహంగా ఉండేది. ఈ రామారావుగారు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్. భార్యాబిడ్డలతో కలసి షిర్డీ వెళ్ళివస్తుంటే బస్సు ఏక్సిడెంటయింది. ఆ ప్రమాదంలో భార్య, బిడ్డ అక్కడికక్కడే చనిపోయారు. ఈయన తలకు బలమయిన గాయమయిమతిమరుపువ్యాధి మొదలయింది. కాలంతోపాటు ముదురుతూ వచ్చింది. ప్రమాదసమయంలో జరిగిన చికిత్స లోపంవల్ల ఎయిడ్స్ ఉన్నరక్తం ఒంట్లో చేరింది. ఇన్సూరెన్సుఉన్నందువల్ల డబ్బుకి ఇబ్బందిలేదుగానీ.. లేని భార్యాబిడ్డలని తీసుకురావడం ఎట్లా? చివర చివర్లో ఆయన భార్యనుగురించే కలవరిస్తుంటే.. ఆసుపత్రివాళ్ళ ద్వారా ఆ వార్త 'మేక్ఏ ఫౌండేషన్' వాళ్లకి చేరింది. మావారు ఆసంస్థలో యాక్టివ్ మెంబరు. ప్రాణాంతకమయినవ్యాధులబారినబడ్డ బాలల చివరి తీరని కోరికలను వీలయినంతవరకు తీర్చే ప్రయత్నంచేసేస్వచ్ఛంద సేవాసంస్థ 'మేక్ ఎ ఫౌండేషన్'. సమస్యల్లా వారి సేవలు నియమ నిబంధనలప్రకారం బాలలకే పరిమితం.
చివరి రోజుల్లో ఉన్న రామారావుగారి చివరికోరికను తీర్చాలన్న సదుద్దేశం మావారికి కలిగింది'మేక్ ఏ విష్ ఫౌండేషన్' వారి స్ఫూర్తితోనే.
నన్ను రామారావుగారి భార్య జానకిగా వెళ్ళి పరామర్శించి రమ్మని ప్రోత్సహించింది మావారే!
బైలుదేరే ముందు కాస్త గిల్టీగా అనిపించినా.. ఇప్పుడు ఒక మంచిపని చేసానన్న సంతృప్తిమిగిలింది.
రామారావుగారి మతిమరుపువల్లే నా పరామర్శ విజయవంతమయింది.
***
('చిత్ర' మాసపత్రికలో ప్రచురితం)