‘ 'స్టోరీ టెల్లింగు' స్టోనేజీనుంచి వికసిస్తూ వస్తున్న కళ.
మనిషికీ మిగతా జంతుజాతికీ మధ్యగల పెద్ద వ్యత్యాసం ఈ కథలల్లడంలోనే ఉంది.
గొడ్డూగోదాకి అడ్డమైన గడ్డీ మేయాలన్న యావ ఉండదు. అడ్డదారిలో వెళ్లైనా గద్దెలెక్కాలన్న కసి ఉండదు. కనక కతలు చెప్పుకు తిరగాల్సిన
ఖర్మలేదు. పురుగూ పుట్రకి నాలుగ్గింజలు నోటికందితే రోజు గడిచిపోతుంది. కాబట్టి
పిట్టకథలు చెప్పుకొనే దుర్గతి పట్టదు.'
‘మనిషి జన్మకలా కుదరదురా అబ్బీ! చేతకన్నా ముందు కతల్చెప్పడం వచ్చుండాలి. కష్టం తరుముకొచ్చినా.. దుఃఖం తన్నుకొచ్చినా..
ఉద్వేగం ముంచుకొచ్చినా.. ఉత్సాహం ఉరకలెత్తినా.. కోతులైతే
గంతులేస్తాయి. పాములైతే కోరలు చాస్తాయి. పిట్టలైతే పిచ్చిపిచ్చిగా కూస్తాయి.
పులులుకా గాండ్రింపులు, ఏనుగులుకీ ఘంకరింపులు కథలు చెప్పే కౌశలం
పట్టుపడకే! మనిషొక్కడే తనక్కావాల్సినంత
విషయాన్నికావాల్సినంత మోతాదులో కథావిశేషంగా మలిచి మరీ బురిడి కొట్టించ గలిగేది. అలా కొట్టించే విద్యలో ఆరితేరితేనే వాళ్లే
రాజకీయాల్లో రాణించేది. దాన్నీ నువ్వు ఈసడిస్తే ఎట్లారా?’
‘బాగుంది బాబాయ్! రాజకీయాల్లో కథనకౌశలం కరువైతే కరుణవాదం ఫలించదనా!
కహానీలు కుదరకుంటే సహోదరత్వం రాణించదనా!
కథలు వండే కళ ఎంతలా వంటపడ్డకపోతే ఎన్నికల జాతర్లప్పుడు నేతలు పోతురాజులకు మించి హారతలు పట్టించుకోగలరు?! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదని మహాఘనంగా కతలు
చెప్పుకొంటున్నాం గదా! అంటే మనమెన్నుకుంటున్న నేతాశ్రీల బుర్రల్లో అంతలా
సృజనాత్మకత సుళ్లుతిరుగుతుందనా అర్థం?’
‘ఆ ఎద్దేవానేరా
వద్దనేది!
రాజకీయాల మీదేనా రాళ్లేసేదీ?'
‘మరేం మనమంటావ్ చెప్పు బాబాయ్! మంట పుడుతుంటేను ఇక్కడా! ఇవాళా రేపూ కథలు 'రాయని భాస్కరుల'ని కనిపెట్టడమే మా కష్టంగా ఉంటేనూ! అంతరించిపోయే
జాతుల్లో కాకి.. పిచ్చుకల్లాంటివి ఏవేవో ఉంటున్నాయని ఊరికే ఆందోళన
చెందుతున్నాంగానీ.. కట్టుకతలు చెప్పి
నెట్టుకొచ్చే సజ్జు మాత్రం అంతకంతకూ
పెరిగిపోతోందని కంగారు మాత్రం ఎవరం పడ్డం లేదు! రకరకాల కాలుష్యాలు పెచ్చుమీరుతున్నయని
ఆ మధ్య వందలొందల దేశాలా పేరిస్
లోనో ఎక్కడో అంతలా బుర్రలు బద్దలు
కొట్టేసుకున్నాయి కదా! వాటి వేటికీ ఈ కతల బాపతు హానికరజీవులపైన కన్ను పడలేదు.. ఖర్మ!’
‘మన గురుజాడగారి గిరీశం వారసులెవరన్నా అక్కడా చేరి అసలు విషయాన్నేమైనా పక్కదారి
పట్టించారంటావా?!’
‘డౌటా! ఈ కతలరాయళ్లతో వచ్చే చిక్కేఅది.
మనకు తెలీకుండానే వాళ్ల వ్యూహాల్లో
చిక్కడిపోతుంటాం! తనను సృష్టించిన
గురుజాడనే పెడదారి పట్టించిన ఘనుడు గిరీశం. ఆ గిరీశానిక్కూడా గాడ్
ఫాదర్లాంటి ఘనులు తయారవుతున్నారు కదా రాజకీయాల్లో ఘనపుటడుక్కి ఓ పదైదుగురు లెక్కన? కుంటికథలు చెప్పుకుంటూ ఊరేగే వాళ్లకు అస్సలు గుడ్డిగవ్వంతైనా విలువ ఇవ్వకూడదు బాబాయ్ నన్నడిగితే !’
'ఇప్పుడిస్తున్నారనేనా?
ఎందుకురా నీకా ఏడుపు?’
‘ఏడవక ఇంకేం చెయ్యగలం బాబాయ్ మా బోటి బక్కోళ్లం! టూ మినిట్స్ లో తయారయ్యే నూడీల్లో
నిజంగా అన్నేసి హానికారక పదార్థాలున్నాయా' అనడిగమా ఆ మద్యన!
రెండు రీములకు సరిపడా నవల
వినిపించిందో తయారుచేసే కంపెనీ! 'కట్టుకున్న
దౌర్భాగ్యుడు కదా! అంత కర్కశంగా
పొట్టనెట్లా పెట్టుకొన్నావమ్మా!’ అని ఓ మహాతల్లిని విచారించిందీ మధ్య మీడియా! అలవాటైన
అంతర్జాతీయస్థాయి అత్యాచారం కథ
వినిపించేసింది! లక్షలు కోట్లు గడించిన బడాబాబుల బ్యాంకప్పులకు మాఫీ లవసరమా? అనడిగి చూడు! ఊకదంపుడు కతలు ఆపకుండా ఊరుతాయి చట్టసభల బావుల్లో! ఐపిఎల్
వంకతో విచిత్రమైన ఆటొకటి కనిపెట్టి
పిల్లకాయల జేబులు కొల్లగొట్టిన లలిత్ మోదీ గుర్తున్నాడా బాబాయ్? అప్పనంగా బొక్కేసిన సొమ్ముకు లెక్కలడిగితే ఎక్కడెక్కడికో పోయి
దాక్కున్నాడా?'
'దాక్కునుంటే కథేముందిరా బాబీ! ట్విట్టరు ఖాతా
సాక్షిగా రోజుకో ట్విస్టిచ్చే కథ ప్రచారంలో పెట్టి మరీ పార్లమెంటు మొత్తంతో పేకాటాడేసుకొన్నాడు! దటీజ్ రియల్లీ గ్రేట్!'
' అది గ్రేటా?! జనం మర్చి పోయిన నేతాజీలను గూర్చి
తాజాగా తయారయే కతల మాటో మరి?’
'కథలు చెప్పడం కవుల పనేరా! ఒప్పుకుంటాను.. నిజమే!
కానీ ఆ కర్తవ్యం ఏ
కవులూ సాకారం చేయడం లేదే! నాయకులే పూనుకొని కథాసాహిత్యానికి న్యాయం చేస్తున్నర్రా బాబూ? మెచ్చుకోకపోతే మానె..
ఈ నొచ్చుకోడాలేంటంట.. విచిత్రంగా!'
'చిత్రంగా ఉన్నాయ్ బాబాయ్ నీ మాటలు! అడ్దదారిలో గద్దెలెక్కిన కుర్ర కుంకలు వాళ్ల వాళ్ల వంశ చరిత్రలను గూర్చి చెప్పుకొంటున్న పురాణాలు వింటూనే..'
' కన్నవారిక్కాక పక్క పార్టీ కాకాకు వన్నె తెచ్చేందుకా బిడ్డలు
కతలు చెప్పేది?
కాక ఎక్కువైనప్పుడు ఏవో రెండు మూడు కబుర్లు శృతి మించే వీక్ నెస్ శ్రీనాథుడంతటి
కవిసార్వభౌముడికే తప్పింది కాదురా! అంత మాత్రానికే పాపం కాకమ్మ కథలు చెప్పేవాళ్లని కేకిరించడమేంటంట? 'కదిలేదీ.. కదిలించేదీ.. కావాలోయ్ నవకవనానికి' అని మీ మహాకవి కదా కవిత్వాన్ని గురించి కలవరించిందీ!’
‘అహాఁ!
అందుకేనా.. సమాజాన్ని ఊరికే
కదిలిస్తే ఉపయోగమేంటని ఏకంగా కుదుళ్లతో సహా
కుదిపేస్తున్నదో మన రాజకీయ కతలరాయళ్ళు!'
‘ఆపరా ఆ దెప్పుళ్ళు! కథాప్రక్రియని మరీ అంతలా కించపరచొద్దు! రిమ్మ తెగులు బ్రహ్మయ్య ఎప్పుడో
భార్యామణికి తప్పు చేస్తూ దొరికిపోయుంటాడు.
నారులకు వట్టి 'సారీ'లు సరిపోతాయా! స్టోరీలేవో అల్లి మరీ ఆ గండం గట్టెక్కి ఉంటాడా
తెల్లగడ్డం బ్రహ్మయ్య. దేవతా ముఖంగా పుట్టుకొచ్చిన కథాప్రక్రియను వృథా చెయ్యడం
మాత్రం ఏమంత సబబు?
అందుకే కృష్ణావతారంలో
వెన్నదొంగ ఆ కథాప్రక్రియను కంటిన్యూ చేసుంటాడు. కాళయ్యనూ ఏదో బోళా
శంకరుడని బోలెడంత జాలిపడి పోతాం గానీ.. ఒక
ఆలిని పక్కనుంచికొని.. మరో ఆలిని నెత్తినుంచుకొన్న మహానుభావుడు! అయినా ఆదిభిక్షువనంటూ ఎన్ని కథలల్లి భక్తగణం చేత ప్రచారం చేయించాడు! దేవుళ్ల కథలే ఇంత లచ్చనంగా ఉంటే వాళ్ల కనుసన్నల్లో కదిలే మామూలు మనుషులం మనం. ముఖ్యంగా ఏదో ఓ దేవుడి పేరు
చెప్పుకుంటే తప్ప పబ్బం గడవని రాజకీయజీవుల్ని మూగమొద్దుల్లా ఓ మూల
చేరి మూలగమంటావా? అదేం భావ్యంరా! పాలిటిక్సులో పొర్లే సరుకు కథలు అల్లలేకపోతే సంసారాలే కాదు..
సర్కార్లూ నిలబడవు. అనుభవం తక్కువ సన్నాసివి నీకేం తెలుస్తాయీ మల్లగుల్లాలు? కతలు కతలంటో ఆ ఎగతాళులే వద్దు. అమెరికా భారత్ స్నేహ సంబంధాలు ఈ మాత్రమైనా
పండుతున్నాయంటే ఇరు పక్షాలు ఒకరి కొకరు వినిపించుకొనే కథావిశేషాలే కారణం.
ప్రధాని.. ప్రతిపక్ష నేతలు పది మాటలు అటూ ఇటూ విసురుకుంటున్నా.. అవీ జనం వినోదం కోసం చెప్పుకునే కతలేరా.. నీకు బోధ
పడ్డంలేదు కానీ ఈ మతలబులన్నీ! కహానీలే వద్దంటే ఇహ వెంకయ్యగారి మార్కు
‘పన్’లు వినబడే ఛాన్సుండదు. యువనేతలు
వివిధ జనయాత్రల మధ్య వినిపించేందుకు 'థీమ్'లుండవు. ప్రసార మాధ్యమాల జోరుకిహ
జోషెక్కడేడుస్తుంది? ఒక్క తెలుగు మూవీలు మినహా ప్రపంచంమొత్తం ఈ కథాప్రక్రియ చుట్టూతానే కదరా
గింగిరాలు కొడుతుండేదీ!
స్టోరీలు వద్దంటే ఇహ మళ్లీ స్టోనేజీ యుగంలోకి వెళ్లిపోవడమే!'
‘మరే! కథలనేవే లేకపోతే ఆదికవి వాల్మీకీ సోదిలో కొచ్చేవాడు కాదు కదా?'
‘ఆ సోది సంగతేమో కానీ.. ఒక్క
సూక్ష్మం మాత్రం నువ్వు సూటిగా అర్థం
చేసుకోవాలిరా అబ్బిగా! తన మానానికి తానేవేవో యుద్దాలు.. తీర్థయాత్రలు
చేసుకుంటూ తిరిగే
శ్రీకృష్ణదేవరాయలుకే కల్లోకొచ్చి
మరీ తన పెళ్ళిని గూర్చి కమ్మని కథలు
చెప్పమని శ్రీకాకుళాంధ్ర దేవుడు ఎందుకు
పోరు పెట్టాడంటావ్?! కత్తి తిప్పడంలోనే కాదబ్బాయ్.. కథలు చెప్పడంలోనూ గొప్ప మెళుకువలు
పట్టుపడ్డప్పుడే రాజ్యాధికారం రాయలువారి పాలనలాగా పదికాలాలపాటు పకడ్బందీగా సాగిపోయేది ! హిస్టరీ తెలీని పిల్లతనం నీది! స్తోరీలతో
నెట్టుకొచ్చే వాళ్లని గద్దె మీద నుంచి నెట్టి పడేయడం ఎన్ని లక్షల నెటిజన్లను
కూడగట్టి అల్లరి పెట్టించినా వల్లయ్యే పని
కాదు! ముందది తెలుసుకోరా!
అసహనం నటించబాకరా పిల్ల సన్నాసీ?'
'ఆహాఁ! హేమాహేమీలు అలవోకగా ఇచ్చేసే హామీలు, వాటి మీద అస్మదీలుగా
ఉన్నప్పుడు చేసే 'హైఁ..
హైఁ'లు.. తస్మదీయులుగా మారినప్పుడు కూసే 'హ్హీఁ..హ్హీఁ'లు.. అన్నీ ఈ కథాప్రకియ చుట్టూతానే
గింగిరాలు కొట్టే ప్రహసనాలు కదా బాబాయ్! ఈ కుర్చీకతల
కిక్కుని గూర్చి ఓట్లేసే జనమైనా అప్రమత్తం
కాకపోతే ప్రజాస్వామ్యానికిహ పర్మినెంటుగా 'జనగనమనే..'!
జనం మనిషిగా అదే నా దిగులు'
‘మరే!
బాగుందిరా అబ్బాయ్ నీ
దిగులు కత కూడా! హ్హీఁ.. హ్హీఁ..హ్హీఁ!' 'కత'లరాయళ్ళు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక 17-02-2018 సుత్తి.. మెత్తంగా కాలమ్)