Sunday, May 27, 2018

అమరకోశం- కర్త అమరసింహుడు ఎవరు?



పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే.. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు 'యస్య జ్ఞాన దయాసింధో' అని గురువుగారు ప్రార్థన మొదలుపెట్టగానే 'గొడదాటితే అదే సందో' అంటూ గోడ దూకి పారిపోయేవారుట. సరదాగా అనుకునేందుకేగానీ ఈ 'అమరకోశం' ప్రథమ కాండం స్వర్గవర్గంలోని మొదటి
ప్రార్థనా శ్లోకానికి సంస్కృత వాఙ్మయంలో చాల కథే ఉంది.  
'యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః।
సేవ్యతా మక్షయో ధీరాసశ్రియైచా మృతాయ॥'
ఇదీ  శ్లోకం పూర్తి పాఠం.
'ఓ! విద్వాంసులారా  జ్ఞానానికి, దయకు  ఆశ్రయభూతుడు, గంభీరుడు దేవుడు. ఆయన గుణాలు, రాగాది దోషాలు లేని నాశనరహితుడు.  ఆ దేవుణ్ణి సంపద, మోక్షాల కోసం సేవించాలి!’ ఇది పరమాత్మ పరమైన అర్థం.
దోషరహితమైన రత్నాలకు ఆలవాలమైన అగాధం సముద్రం. విష్ణువుకు నివాసం. లక్ష్మి(సంపద) కోసం, అమృతం(చిరాయువు) కోసం సముద్రుణ్ణి సేవించాలి' అని మరో అర్థం చెప్పుకోవచ్చు.  
బౌద్ధ విశ్వాసి అమరకోశ కర్త అమరసింహుడు. హిందూవిశ్వాసుల ఇష్టదేవతలను సేవించమని  మంగళాచరణ శ్లోకం ఎందుకు పఠిస్తాడు? అనే సందేహం సహజంగానే వస్తుంది. అమరకోశానికి  వ్యాఖ్యానం రాసిన క్షీరస్వామి తన 'అమరకోశోద్ఘాటనవ్యాఖ్య'లో ఇదే శ్లోకానికి బుద్ధ పరమైన వ్యాఖ్యానం అందిస్తూ.. పై సందేహానికి సమాధానం ఇచ్చాడు. 'గ్రంథారంభేZభీప్సిత సిద్ధి హేతుం జిన మనుస్మృత్య ఇత్యాది వాక్యాణి’ అన్నాడు.  బౌద్ధమంటే గిట్టని హిందూవిశ్వాసులు తన గ్రంథాన్ని దూరం పెట్టకూడదన్న ఆశతో హింధువుల ఇష్టదేవతలను ప్రార్థించాడు- అని ఆయన జవాబు. (సర్వానంద విరచిత ‘టీకాసర్వస్వవ్యాఖ్య’ వివరణలో కూడా  'బౌద్ధదర్శన విద్వేషిణి ఇహ ప్రవృత్తి ర్న స్యా దతో-త్ర బుద్ధపదోపాదానం కృతం కవినా' అన్న సమర్ధన కనపడుతుంది). అమరసింహుడికి హిందూమతంతో ఏ సంబంధం లేదంటే నమ్మబుద్ధికాదు నిజానికి.  అమరకోశంలో ఆయన వివరించిన పదాలన్నీ ఒక నిష్ణాతుడైన హిందూపండితుడి అవగాహనకు సైతం అందనంత ఉన్నతంగా ఉండడమే అందుకు కారణం. తనతో వాదంలో ఓడిన నిస్పృహలో అమరసింహుడు స్వీయవిరచిత గ్రంథాలన్నీ పరశురామప్రీతి చేస్తున్నట్లు విని శంకరుడు ఆ ప్రయత్నం విరమింపచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అగ్నికి ఆహుతి కాకుండా మిగిలిన ఈ ఓక్క అమరకోశం ప్రాశస్త్యాన్ని భగవత్పాదులే ‘అమరకోశం చాలా గొప్ప గ్రంథం. హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పేర్ల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ప్రతిపాదించింది. స్మృతులు, పురాణాలు తీరులోనే తాత్త్విక అంశాల నామధేయాలను, విషయాలను, వాటి అర్థాలను అమరకోశం ప్రతిపాదించింది' అని శ్లాఘించినట్లు ఒక కథ.
 షోలాపూర్ దాస్ రావ్ జీ సఖారామ్ దోనీ తన అమరకోశం పీఠికలో  అమరసింహుడు జినుడని చాలా ఉదాహరణలతో నిరూపించే ప్రయత్నం చేసాడు. లేఖక ప్రమాదాల వల్ల సుమారు వంద శ్లోకాలు కనిపించడం లేదని.. అందులో 'యస్య జ్ఞాన..' శ్లోకానికి ముందు మరో రెండు శ్లోకాలున్నాయని వాటిని బహిరంగపరిచాడు.
'జినస్య లోకత్రయవందితస్య ప్రక్షాళయేత్ పాదసరోజయుగ్మం।
నఖప్రభాదివ్యసరిత్ప్రవాహైః సంసారపంకం మయి గాఢలగ్నమ్॥(1)
'నమః శ్రీశక్తినాథాయ కర్మారాతివినాశినే।
పంచమ శ్చక్రిణాం యస్తు కామస్తస్మై జినేశినే॥' (2).. ఇవీ ఆ రెండు విస్మృత శ్లోకాలు.
లింగయసూరి 'యస్య జ్ఞాన .. ' శ్లోకానికి దైవపరంగా వ్యాఖ్యానం చేస్తే.. మల్లినాథుదు 'సశైవానాం శివః వైష్ణవానాం విష్ణుః జైనానాం జినః బౌద్ధానాం బుద్ధ:’ అంటూ సాధారీకరణం చేసి అందరి సమస్యలు ఒక్క దెబ్బతో తీర్చేసాడు.
ఏదేమైనా
'అమరం నెమరేస్తే కావ్యాలెందుకు కాలరాయనా?'
అష్టాధ్యాయీ జగన్మాతా అమరకోశో జగత్పితా '
'అమరం చదవనివానికి నే నమరను' అని సరస్వతీదేవి పరంగా వినిపించే ప్రచారమూ అమరకోశానికి ఉండే ప్రాముఖ్యం తెలియచేస్తుంది. అమరకోశం మిగతా కోశాలన్నింటికీ మార్గదర్శకంగా మిగిలింది. మరీ కావ్యాలు రాయడానికని కాదు కానీ.. హిందూ సంస్కృతి పారిభాషికా పదాలతొ పరిచయం పెంచుకుంటే సంస్కృతమే కాదు.. తెలుగు పదసంపద మీదా మరింత పట్టు పెరుగుతుందన్న మాట అతిశయోక్తి కాదు. 
కాబట్టి కవి కావాలనుకున్న యువకులు మరీ గతంలోలాగా బట్టీయం వేయకపోయినా ఒకటికి పదిసార్లు  ఆ అమరకోశం పుటలు తిరగేస్తే పోయేదేమీ ఉండదు.. అజ్ఞానం తప్ప!
-కర్లపాలెం హనుమంతరావు
25 -05 -2018


-

Wednesday, May 23, 2018

ప్రార్థనా స్థలాలు.. చరిత్రలో 1




పుట్టటం.. గిట్టటం తప్పవని ప్రకృతిని చూసి గ్రహించాడు ఆదిమానవుడు. విత్తు నుంచి మొలకెత్తిన పిలక పెరిగి వృక్షంగా మారి కాసే పూలు కాయలుగా పండి రాలిన తరువాత వాటి పొట్టవిప్పి చూస్తే కనిపించేవి మళ్లా ఆ విత్తులే. భర్త తన భార్య కడుపున  పుత్రుడుగా జన్మిస్తాడన్న నమ్మకం పెరగడానికి ఇలాంటి దృష్టాంతాలు  సృష్టిలో చాలా కనిపించాయి మనిషికి. కాబట్టే చనిపోయిన తన మనిషి కళేబరాన్ని భద్రం చేయడం అవసరంగా భావించాడు.
మరీ అతి ముతక కాలంలో మృత శరీరం ఏ కుక్కలు, నక్కలు తినకుండా తామే తినేసేవారు  మృతదేహం పరిశుద్ధత నిలబెట్టడం కోసం. తరువాతి దశలో పార్థివ దేహం నేల మీది చీమల, పురుగుల పాలవకుండా ఎత్తైన ఏ చెట్టు కొమ్మల మీదో వదిలేసేవాళ్లు. 'కాకులకు గద్దలకు' వేయడం అనే సామెత అట్లా పుట్టిందే! (మహాభారతం విరాటపర్వం అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను మూట కట్టి జమ్మి చెట్టు మీద వదిలేసి.. దారే పోయే వాళ్ళను చనిపోయిన తమ తల్లి శరీరమని నమ్మిస్తారు). పక్షులు పీక్కు తినగా మిగిలిన బొమికలను ఏరుకొని ఏ గంగలోనో కలిపే తరువాతి సంస్కారం ఒక పద్ధతైతే.. ఆ అస్తికలను మూటగట్టి ఒక ప్రత్యేకమైన నూతిలో పారేస్తారు. (నేటికీ పార్శీలది ఇదే పద్ధతి). అసలు నేరుగానే శవాలను గంగా ప్రవాహానికి వదిలేయడం మరో విధానంగా ఉండేది. కర్మకాండలలోకెల్లా గంగలో కలపడం ఉత్తమ సంస్కారంగా ఇప్పటికీ భారతీయులు నమ్మడం వల్ల దహనం చేసిన తరువాత ఆ చితాభస్మాన్ని కాశీ వెళ్లి మరీ గంగలో కలిపి వస్తున్నారు సంప్రదాయం నమ్మేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత శవదహనం  సంస్కారంగా మారింది. ద్రవిడ సంస్కృతిలో సామాన్యంగా ఖననమే ప్రధాన సంస్కారం.
పూడ్చినా కాల్చినా ఆ కాండ జరిగిన స్థలాన్ని పవిత్రంగా భావించేవాళ్లు బంధువులు. ఆ స్థలానికి గుర్తుగా ఒక రాయి పెట్టడం.. దుష్టశక్తుల కట్టడికి గాను చుట్టూతా రాళ్లు పేర్చడం జరుగుతుండేది. ఆ ప్రదేశాన్ని 'చైత్యం'గా పిలిచేవారు. ఆ చైత్యానికి దగ్గర్లోనే ఒక చిన్న కట్టడం కట్టడం ఒక పద్ధతి. ఆ స్థలం మీదో మొక్కను  నాటడం మరో పద్ధతి. తులసి కోటలు కట్టే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. శ్మశానాలను 'పితృవనాలు' గా పిలవడానికి ఇదే కారణం.
ప్రముఖులు మరణిస్తే ఖననం చేసినా, దహనం చేసినా ఆ స్థలాన్ని స్మృతిస్థలాలుగా మార్చే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. జనకళ్యాణం కోసం జీవితాంతం కృషిచేసిన వైతాళికులకు, మంది కోసం ప్రాణ త్యాగం చేసిన పరిత్యాగులకు, యుద్ధాలలో వీరమరణం పొందిన యోధులకు (వీరగల్లులు), శీలరక్షణ కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ స్త్రీలకు గుర్తుగా  చిన్ని చిన్ని  కట్టడాలు, స్తూపాలు, ఆయతనాలు కట్టే ఆచారం ఉంది. ఆ తరహా  ద్రవిడ సంస్కృతి ఆచరించే ప్రాంతాలన్నింటా ఇప్పటికీ ఆ కట్టడాలు కనిపిస్తాయి.
బుద్ధుడి మహాపరినిర్యాణం క్రీస్తుకు పూర్వం 498లో. ఆ అస్తికలను భద్రపరిచిన పాత్ర మీద సమాధి నిర్మించి శాసనం వేయించారు బుద్ధుని సగోత్రీకులు శాక్యులు.
'ఇయం సలిల నిధానే బుధవ భగవతే సకియానాం
సుకుతి ఛటినాం సభగినకం సపుత దలనం'
(బుద్ధ భగవానుని ఈ శరీర నిధానం దేవుని సుపుత్ర భగనీకులు శాక్యులచే నిర్మించబడింది) అని ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రాచీన కట్టడాల మూలకంగా అప్పటి నాగరికతలను గురించి తెలుసుకొనే అవకాశం పురాతత్వశాస్త్రానికి లభిస్తుంది,
బౌద్ధం, జైనంలో చనిపోయినవారి సమాధులకు సమీపంలో చిన్న ఆరామాలు నిర్మించడం ఆనవాయితీగా ఉండేది ఒకానొకప్పుడు. ఆ ఆరామాలనే విహారాలుగా వ్యవహరించేవాళ్లు. బౌద్ధ సన్యాసులు, జైన సన్యాసులు జనపదాలలో నివాసం ఉండేవాళ్లు కాదు. ఈ తరహా ఆరామాలలో నివాసం ఏర్పాటు చేసుకొని  భిక్షకు మాత్రం గ్రామాలలోకి వెళ్లి వస్తుండేవాళ్లు. ఆ కారణం చేత ఆరామాలు సాధారణంగా జనపదాలకు, వ్యాపార మార్గాలకు దగ్గరగానే ఉండేవి. బౌద్ధుల, జైనుల జీవహింస నిషేధం వల్ల పశుసంపద వృద్ధి అవడం, వ్యవసాయం ఊపందుకోవడం, వ్యావసాయిక ఉత్పత్తుల లావాదేవీలకు నెలవైన వ్యాపారాలు అభివృద్ధి చెందడం జరిగింది.  బౌద్ధులకు, జైనులకు కృతజ్ఞతా పూర్వకంగా తృణమో, ఫణమో సమర్పించుకొనే అలవాటు అప్పుడే మొదలు. భూస్వామ్య వ్యవస్థ పుంజుకొని, పెత్తందార్లు, రాజులు బలమైన వర్గంగా ఏర్పడేందుకు ఈ రెండు మతాలు చాలా దోహదం చేసాయనే చెప్పుకోవాలి. అందుకే రాజులు అప్పట్లో ఆ రెండు మతాల వైపు అధికంగా మొగ్గు చూపించేవాళ్లు.
మత విశ్వాసులు ఇచ్చే కానుకలతో జైనులు, బౌద్ధులు ఆర్థికంగా బలపడ్డారు. వారు నివాసముండే ఆరామాలకు కళ పెరిగింది. మత పెద్దల మెప్పు కోసం రాజులు, వ్యాపారులు ఆరామాలను కళలకు కాణాచిగా ఎంత ఖర్చైనా వెచ్చించి మరీ తీర్చి దిద్దేవాళ్లు. ఆ అలంకరణల్లో భాగంగానే ఆరామాల గోడల మీద అందమైన ప్రకృతి దృశ్యాలు, స్త్రీల చిత్రాలు, ఆనందాన్ని ప్రేరేపించే కామకార్యాలు చిత్రీకరణలు క్రమంగా పుంజుకున్నాయ్. ఆరామాల కుడ్యాల మీద కనిపించే పోర్నోగ్రఫీ క్రమంగా దేవాలయాలకు ఎలా పాకిందో మరో సారి..!
-కర్లపాలెం హనుమంతరావు
***

Monday, May 21, 2018

కన్యాశుల్కంలో మూఢనమ్మకాలు


నమ్మకానికి ఆధారం అవసరం. ఆధారం లేకుండా నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది. మూఢవిశ్వాసాలు విశ్వవ్యాప్తంగా అన్ని జాతుల్లోనూ అనాదిగా   వస్తున్నవే. సేకరించడం మొదలుబెడితే ఆ చాదస్త విశ్వాసాల సమాచారం దస్తాల కొద్దీ బైటపడుతుంది.  
మూఢనమ్మకానికి మూలస్తభం అజ్ఞానం. ఆదిమ మానవుడికి విద్యాబుద్ధులు తక్కువ. ఆ కారణంగా విచక్షణాజ్ఞానమూ అంతంత మాత్రమే! ప్రకృతి శక్తుల విజృంభణ, మనో వైకల్యం, శారీరక రుగ్మతవంటి  ఉపద్రవాలు  ఎదురైనప్పుడు సమన్వయించుకునే మేధోసామర్థ్యంలేక ఆ ఉపద్రవాలను అదృశ్యశక్తుల ఆగ్రహాలుగా భ్రమపడ్డాడు. భయపడ్డాడు. శాంతించమని, అనుగ్రహించమని కనిపించని ఆ శక్తుల ముందు సాగిలపడ్డాడు. ఆ భయభక్తులే  మూఢనమ్మకాలకు మూలకారణమయ్యాయి క్రమక్రమంగా!
సమాజాన్ని కుంగదీసే, వ్యక్తిచైతన్యాన్ని అణగదొక్కే మహమ్మారులు ఈ మూఢనమ్మకాలు. అంటువ్యాధులకన్నా ప్రమాదకరం. ఈ తరహా ఊహపోహలను తీవ్రంగా  అపహాస్యం చేస్తుంది గురుజాడవారి ప్రగతిశీల 'కన్యాశుల్కం' నాటకం.
అవిద్య ఒక్కటే అంధవిశ్వాసాలకు కారణమా? విద్యావంతుల్లో వింతనమ్మకాలు లేవా? అని ప్రశ్నించేవారూ ఉన్నారు. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు అందుకు ఉదాహరణ. ఆయన జటాంతస్వాధ్యాయి. అయినా వేదానికి అర్థం తెలీదు! 'మా మేనత్తలందర్నీ కూడా అమ్మారండీ! వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు' అంటాడు. ‘కన్యాశుల్కం’ దురాచారాన్నీ అచ్చివచ్చిన సంప్రదాయంగా నమ్మే ఆ మూఢుడు! ఆ అవివేకి దృష్టిలో  ‘దిబ్బావధాన్లు కొడుక్కి వూష్ణం వచ్చి మూద్రోజుల్లో కొట్టేయడానికి’ ఇంగ్లీషు చదువే కారణం. ఆచరించడం సంగతి ఆనక.. అసలు దురాచారమని అనుకొనేదాన్ని మనసులో తలుచుకున్నా చాలు.. ఏదో కీడు తప్పదని భయపడే బుద్ధిహీనులు తక్కువేమీలే రీ లోకంలో. బుచ్చబ్బి కొడుక్కి చచ్చినంత ఖాయిలా చెయ్యడానికి ఇంగ్లీషు చదువుదామని అనుకోవడమే కారణమని దబాయించే  అగ్నిహోత్రావధాన్లు తరహా మూర్ఖులున్నంత కాలం ‘కన్యాశుల్కం’ నాటకం నిత్యజీవితంలోని అస్తవ్యస్తతకు అపహాస్య దర్పణంగానే  వర్ధిల్లుతుంటుంది.
సనాతధర్మం మిషతో ప్రచారమయే ఆచారాలలో  అంధవిశ్వాసాల పాలు తక్కువేమీ కాదు. వాటి ప్రస్తావనలేవీ లేకుండా  అట్టడుగు జాతులు అవగాహనాలేమితో గుడ్డిగా నమ్మే విశ్వాసాలను మాత్రమే అవహేళన చేయడం.. నాగరీక సమాజంలో కనిపించే  ఒక అవలక్షణం. కన్యాశుల్కం  ఈ తరహా 'ద్వంద్వనీతి'ని అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఉతికి ఆరేసింది. 'నా పిల్లేమిటి, ఫకీరు ముండ. రేపు ఇంటికి వెళ్తూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను' అంటాడు అగ్నిహోత్రావధాన్లు లేచిపోయిందనుకున్న బుచ్చెమ్మ మీద ఆగ్రహంతో. వేదార్థం సాకల్యంగా అర్థంచేసుకొన్నవారెవరూ ఈ సందర్భంలో వాడే మాటకాదు ఘటాశ్రాధ్దం. కర్మకాండ విధానాలు అదను తప్పి ఎంత గుడ్డిగా పెద్దకులాల్లో కూడా అమలవుతున్నాయో 'ఘటాశ్రాద్ధ' చలనచిత్రం చూస్తే అర్థమవుతుంది.  
తెలుగుజాతిని పట్టి పీడించే మూఢాచారాల మీద వీలున్న అన్ని దారుల్నుంచి దాడులు చేసిన అభ్యుదయ యోధుడు కందుకూరి అయితే వీరేశలింగం వేసిన ఆ సంస్కార మార్గంలో 'కన్యాశుల్కం' బండిని మహా దూకుడుగా నడిపించిన ప్రగతికాముకుడు  గురుజాడ.  శ్రద్ధగా పరిశీలిస్తే మూఢాచారాల ప్రస్తావనలే కాదు.. వాటి అతిక్రమణలూ  కన్యాశుల్కంలో  ప్రహసన పూర్వకంగా అలరిస్తాయి. మూఢవిశ్వాసాలను సృష్టించేది, సానుకూలంగా ఉన్నప్పుడు ప్రస్తావించేది,  లేనప్పుడు వాటిని  అతిక్రమించేదీ సంఘంలోని పై తరగతులకు చెందిన పెద్దమనుషులే. ఈ వైరుధ్యానికి కన్యాశుల్కం అత్యద్భుతంగా అద్దంపట్టింది.
గిరీశం పాశ్చాత్య సంస్కృతితో బాగా ప్రభావితమైన పాత్ర. వైదికాచారాలు కొన్నింటితో పరిచయం కద్దు. కానీ వాటిని విశ్వసించడు. అయినా సందర్భం వచ్చినప్పుడు ఆ మూఢవిశ్వాసాలనే తన స్వార్థప్రయోజనాల కోసం వాడుకోవడం మానడు!  'నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయిత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను' అని ఫొటోగ్రాఫుపంతులి బంట్రోతుని నమ్మిస్తాడు బకాయి వసూలుకు వచ్చి పీకల మీద బైఠాయించినప్పుడు. అంధవిశ్వాసాలకు ఉండే సామాజిక బలిమి గిరీశానికి బాగా ఎరికే. ఈ సమాజంలో లంచాలకి లొంగనివాడినయినా ‘విశ్వాసాల’తో మచ్చిక చేసుకోవడం సులువని వాడికి తెలుసు. ‘తమ వరకు వస్తే గాయిత్రిని, సావిత్రిని జపించక పోబట్టే ఆధునిక యుగం ఇంత అభివృద్ధి చెందింద’న్న గిరీశం థియరీలో అణులేశమైనా అతిశయోక్తిలేదు. వట్టి మంత్రాలు వల్లించడం వల్ల ఒరిగి పడేదేమీ లేదన్న స్పృహ నేటి మనిషికి మల్లే ఉండబట్టే 'తోవలో ఏటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను' అని అబద్ధమాడి మరీ 'చల్దివణ్ణం' లాగించేసాడు గిరీశం జంకూ గొంకూ లేకుండా అగ్నివోత్రావధానులు ఇంట్లో. 'కాలిస్తే కోవిల్లోనే చుట్టలు కాల్చాలోయ్' అన్న గిరీశంలో ఈ కాలపు నయవంచకుల ప్రతిరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మూఢవిశ్వాసాల సంగతి అటుంచి.. అసలు 'విశ్వాసాల’ జంజాటాలే పెట్టుకోవడం లేదు కదా నేటి మరీకొత్తతరం? 'మయిలా గియిలా మా ఇంగ్లీషువాళ్లకు జాన్తా నై' అని మధురవాణి దగ్గర గిరీశం కూసిన కూతలు ఈ నవనాగరీకుల బరితెగింపు బుద్ధిని ప్రదర్శిస్తాయి నగ్నంగా. 
గిరీశం గడుసుదనం ఎట్లా ఉన్నా గురజాడవారి గడుసుదనం కన్యాశుల్కంలో అడుగడునా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మూఢవిశ్వాసాలను సృష్టించి, వ్యాప్తి చేసే ఉన్నత సామాజిక వర్గాల ద్వారానే వాటి నిష్ప్రయోజకత్వాన్నీ చెప్పించడం గురజాడ గొప్ప టెక్నిక్. గ్రహచారాల ఆధారంగానే లుభ్దావధాన్లుని ముగ్గులోకి దింపాడు రామప్పపంతులు. 'శీఘ్రమే వివాహయోగం.. ఆ యోగం వల్ల ధనయోగం'ఉందని నమ్మబలికాడు. తప్పితే 'మారకం' ఉందన్నాడు. (పెళ్లికూతుళ్ళు మారడం మీదే తరువాతి  ప్రహసనమంతా నడిచింది కదా)! అక్కడేమో అగ్నిహోత్రావధాన్లు బిడ్డ చేతిలో కూడా 'ధనరేఖ' జెర్రిగొడ్డులా కనిపించింది! ఇదంతా హస్తసాముద్రికం మీద వ్యంగంగా నడిచిన తంతు.  ‘అన్నగారూ!’ అని సంబోధిస్తూ లుబ్ధావధాన్లుకు గిరీశం 'చిన్నది బహు లక్షణంగా ఉంటుంది. గాని కొంచెం పెయ్యనాకుడు కద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువు అండ్రు' అంటూ బనాయించిన  ఉత్తరంలో కూడా 'శరీరశాస్త్రం' ప్రస్తావన వస్తుంది. తిధి, వార, నక్షత్రాల, గ్రహ స్థితుల ఆధారంగా పుట్టే జాతకాల గుట్టును రామప్పపంతులే  రట్టు చేస్తాడు మరో సందర్భంలో. 'మా బ్రాహ్మల్లో ఇది పరిపాటే. పెళ్లిళ్లలో పంపించే ఒహ జాతకవు నిజం ఉండదు' అంటూ జాతకాల బూటకాన్ని స్వయంగా బట్టబయలు చేసుకుంటాడు. జాతకాలను నమ్మేవాళ్ల గాలి తీస్తాడు వకీలు నాయుడు. అంగీరసలో పుట్టిన పిల్ల 'భావ'లో పుట్టినట్లుండటం చూసి 'బ్రాహ్మల పరువంతా తీస్తివే' అంటూ అగ్నిహోత్రావధాన్లను కలెక్టరు మందలిస్తాడు. శుభ ముహూర్తాలను సైతం అనుకూలతని బట్టి మార్చడం అప్పటిలాగా ఇప్పుడూ నడుస్తున్న 'లౌక్య ప్రజ్ఞే' లోకంలో.
దయ్యాలు, భూతవైద్యుల భాగోతం కన్యాశుల్కంలో అన్నిటికన్నా రసవత్తరమైన అభూతకల్పనలు. ఒక సన్నివేశంలో లుబ్ధావధాన్లు, మీనాక్షి, అసిరిగాడు, రామప్పపంతులు ప్రధాన పాత్రలు. తాను పెళ్లాడింది 'రెండో పెళ్ళి ముండ' అన్న లుబ్ధావధాన్లు  అనుమానం నుంచి మొదటిమొగుడు దయ్యమై పుట్టుకొచ్చాడు. మాయగుంట నూతిలో పడిందన్న మరో అనుమానం నుంచి రెండో దయ్యం పుట్టుకొచ్చింది. అక్కణ్నుంచీ గవరయ్య రంగప్రవేశం, లూటీ కార్యక్రమం మొదలవుతాయి. భయస్తుల దడుపు నుంచి ఒడుసుకోవడం చాలా సులవు. బ్రహ్మరాక్షసినీ, కామినీ పిశాచాన్నీ ఒకే సీసాలో బంధించానని గవరయ్య అన్నప్పుడు, 'ఇద్దర్నీ ఓ సీసాలో పెడితే దయ్యప్పిల్లల్ని పెడతారేమో?' అంటుంది మీనాక్షి. ఆధారంలేని విశ్వాసాల చూర్లు పట్టుకు వేలాడుతూనే ఆ పట్టు వదిలేస్తే జారిపడతామన్న తర్కం సమాంతరంగా మనిషి మెదడులో ఎలా పనిచేస్తుందో గురజాడ చక్కగా చూపిస్తాడిక్కడ. అజ్ఞానం వెలిబుచ్చే తర్కంలో  హాస్యరసం చిప్పిల్లుతుంది సహజంగానే. కానీ ఈ మాదిరి అభాసంతా సమాజ వికాసానికి సమాంతరంగా సాగే వికృతత్వానికి నిదర్శనం. ఈ తరహా మౌఢ్యాన్ని కన్యాశుల్కంలో గురజాడ అంత  తీవ్రంగా, వికటంగా బహుశా ప్రపంచ సాహిత్యంలో ఇంకెవ్వరూ ఎండగట్టి ఉండరేమో! రాసి శతాబ్ది దాటినా 'కన్యాశుల్కం' ఈ నాటికీ  తిరుగులేని ప్రహసనంగా జనాకర్షణ నిలుపుకోవడానికి కారణం సమాజాన్ని నిత్యం పీడించే అంధవిశ్వాసాలు ఇందులో ప్రతిభావంతంగా చిత్రీకరించడమే.
మూఢవిశ్వాసాలు పై తరగతులవారికి ఎంతలా  ఆటివచ్చాయో.. ఎంత అడ్దువచ్చాయో.. కింది తరగతులవారికీ ఆ మోతాదుల్లోనే అక్కరొకొచ్చాయ్.. అడ్డూ వచ్చాయ్! ఆ పార్శ్వమూ గురజాడ గురి నుంచి తప్పిపోలేదు.  రెండు రూపాయలిస్తే ముహూర్తం మార్చేస్తానంటాడు సిధ్దాంతి! ఉన్నతవర్గాలవారు స్వార్థప్రయోజనాల కోసం మూఢవిశ్వాసాలను సృష్టించి సందర్భాన్ని బట్టి వాడుకుంటే, దిగువ తరగతులవారు ఆకలి వంటి ప్రాధమిక జీవితావసరాల కోసం మాత్రమే ఆ అంధవిశ్వాసాలను వాడుకుంటారు. ఈ రెండు పార్శ్వాల మధ్య ఉండే తారతమ్యం గుర్తించనివారు ‘కన్యాశుల్కం’ నాటకం జీవసారాన్ని సక్రమంగా గ్రహించలేరు.
మోసగాడితో లాలూచీపడి మోసపోయినవాడు దుకాణదారుడు. అతగాడితో కత్తు కలిపినవాడు గవరయ్య. ఉద్యోగధర్మాన్ని అనుసరించి మాయగుంటను, కరటక శాస్త్రిని పట్టుకోవాల్సింది పోయి బైరాగి అంజనం మీద ఆధారపడే  మూర్ఖుడు హెడ్డు. కన్యాశుల్కం పాత్రలన్నింటిలో మూర్ఖత్వమో, అమాయకత్వమో ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. ఒక్క మధురవాణి, సౌజన్యారావు పంతులు మినహాయింపు. అమాయకులను, ఆశపోతులను, అదుపుతప్పినవాళ్లను, దిక్కులేనివాళ్లను, విశ్వాసాల వంకతో వంచకులు ఎట్లా ఆటలాడిస్తారో గిరీశం, బైరాగి, రామప్పపంతుళ్ళు వంటి పాత్రల ద్వారా సాటిలేని రీతిలో నిరూపించాడు కన్యాశుల్కంలో గురుజాడ. కన్యాశుల్కంలో బైరాగి  ప్రాతఃకాలంలో కాశీలో గంగను సేవించి, పవనం బంధించి, వాయువేగం మీద విశాఖపట్టణం వీధిలో విజయం చేస్తాడు! విశ్వేశ్వరుడి కోవిలలో ఆకాశం మీంచి పడ్డ బంగారపు రేకు మీద చెక్కిన లిపి బ్రాహ్మలెవరికీ బోధ అవక తనను చిత్తగింజమన్నట్లు బైరాగి చెప్పుకొస్తాడు. యోగదృష్టి, ఖేచరీగమనం, తిరస్కరణీవిద్య, వాయువేగం, వాగ్బంధం, అంజనం, రసవాదం, వాయుస్తంభన లాంటి అపరవిద్యల్ని గూర్చి హేతువుకు అంతుబట్టని కబుర్లతో పబ్బం గడుపుకొనే బైరాగి  మోసగాడని వాసన పట్టే పాఠకులే, వాస్తవ జీవితంలో మూఢవిశ్వాసల కారణంగా అదే మాదిరి మాయాజాలంలో సులభంగా పడిపోతున్నారు! లుబ్ధావధాన్లు మల్లే విలవిలలాడుతున్నారు! నాటకంలోని ఏ సన్నివేశమూ అసహజం అనిపించక పోవడానికి అదే కారణం.
భాగవత గ్రంధం తలకింద పెట్టుకు పడుకోవడం, దీపాలార్పి ప్రమాణం చెయ్యడం, పేకాట దగ్గర ముణుకు పెట్టడం, ఇనప చేతులు(ఐరన్ లెగ్) వంటి అపశకునాలు  అడుగడుగునా నిత్యజీవితంలో మాదిరి ప్రత్యక్షమవుతుంటాయి ఈ నాటకంలో. చదువుకొనే సంస్కృతకావ్యం మీద నమ్మకంలేక.. ఇంగ్లీషు పుస్తకం పైన  ప్రమాణంచేస్తే తప్ప కరటకశాస్త్రి శిష్యుడు గురువును నమ్మడు! మారే తరాలకు తగ్గట్లు వస్తువు మారినా మౌలిక ఆలోచనల్లోని మూఢత్వం చెక్కుచెదరని పరిస్థితిని గురజాడ ఎంతో గొప్పగా చిత్రీకరించాడీ నాటకంలో.
'ఆకాశంబు శూన్యంబు' అని మనవాళ్లయ్య అన్నప్పుడు.. 'తెల్లోడు యెర్రోడా? పట్టంలో గొట్టావెట్టి అదే సూస్తాడే ఆకాశం కేసి?' అని ఎదురు ప్రశ్న వేస్తాడు మునసబు. పాశ్చాత్య విజ్ఞానం వెలుగులోకి వచ్చేకొద్దీ పల్లెటూళ్లల్లో కూడా ఆలోచనా విధానం ఎట్లాంటి మార్పుకు గురయిందో గురజాడ ఇటువంటి సందర్భాలలో మర్చిపోకుండా ప్రస్తావిస్తాడు. 'ఆంజనేయస్వామికి పదిశేర్లు నెయ్యితో దీపారాధన చేస్తాన’ని కరటక శాస్త్రి అన్నప్పుడు .. ‘కడుపులోకి వెళ్లవలసిన నెయ్యి కాల్చివెయ్యడం నాకేమీ ఇష్టంలేదు. మొక్కుకోండి చాలు'అంటాడు అతగాడి శిష్యుడు.  ఈ దేశపు అజ్ఞానపు కోటలకు ఇట్లాంటి సందర్భాలలో బీటలుపడ్డమూ  కదాచిత్ లేకపోలేదు. కానీ ఆ చిట్టి దీపాలు గాఢమైన చిమ్మచీకట్లను పారదోలేటంత వెలుగులు ఎన్నడూ ప్రసరించింది లేదు. అదే విషాదం.
మూఢ విశ్వాసాలను నమ్మేవాళ్లే తోసిరాజనేవాళ్లు. తోసిరాజన్నవాళ్లే నమ్మినవాళ్ళు కన్యాశుల్కం నాటకం నిండా కనిపిస్తారు వాస్తవ లోకంలోలా. వాస్తవానికి మధురవాణి, సౌజన్యరావు పంతులు మినహాయించి  ఈ ప్రహసనంలోని ఏ పాత్రకూ దేని మీదా స్థిరమైన నమ్మకం లేదు. ఏది నమ్మాలి? ఏది నమ్మరాదు? అనే అంశానికి ఎప్పుడూ అంతగా ప్రాధాన్యతా లేదు. అవకాశవాదమే నాగరికులకు పక్కవాడిని బోల్తా కొట్టించే పక్కా చిటుకు! బైరాగి కనిపిస్తే మాయలేడిని, కరటక శాస్త్రిని అంజనం వేసి కనిపెడతాడని ఆశపడే హెడ్డుతో 'హెడ్డుగారూ! ఇదంతా ‘గ్రాండచ్చీ ఆఫ్ బాడన్' అని వాదిస్తాడు గిరీశం.  మూఢనమ్మకాల లోతుపాతులన్నీ ఆ ఒక్క ముక్కతో తేల్చిపారేసాడు గిరీశం పాత్ర  ద్వారా గురజాడ కన్యాశుల్కం నాటకంలో!
 కన్యాశుల్కంలోని మూఢపాత్రల విశ్వాసమల్లా జీవిత భద్రత మీద, డబ్బు మీద. వాటి కోసం ఏది ఎప్పుడు అవసరమనిపిస్తే  దాన్ని అప్పుడు వాడుకున్నాయి  దాదాపు అన్ని పాత్రలు. వాస్తవంగా అధికశాతం లౌకికుల  అసలు మనస్తత్వం కూడా ఇదే. ఈ విధమైన స్వీయనయవంచన జీవన సరళిగా కొనసాగుతున్నంత కాలం సమాజంలో పతనం భీభత్సంగానే కొనసాగుతుంది. ఈ భీభత్సాన్నుంచి బైటపడాలంటే  ఉదారవాదం, హేతువు ఆధారంగా వికాసం పొందే మానవవాదం అలవడాలి. కన్యాశుల్కంలోని మూఢవిశ్వాసాల చిత్రీకరణ ద్వారా గురజాడ జాతికి ఇవ్వదలుచుకున్న సందేశం కూడా ఇదే.
-కర్లపాలెం హనుమంతరావు
***
(కన్యాశుల్కం - మూఢవిశ్వాసాలు- పు.200- 205 - డా।। యు.. నరసింహమూర్తి- కన్యాశుల్కం 19 వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు- ప్రేరణతో


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...