రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభ (29-07-1982 నాటి) వారపత్ర్రికలోని నా కథానికః
ఎన్ని కమ్మని ప్రేమ కబుర్లు పోటీ కొచ్చినా జీవతమనే పరుగుపందెంలో ఆఖర్న బంగారు పతకం సాధించేది,, విచ్చు రూపాయే! ఆర్థిక సంబంధాల ప్రాబల్యం అప్పటికీ ఇప్పటికీ,, ఇంకెప్పటికీ ఎవరూ పడగొట్టలేని వస్తాదే బతుకుగోదాలో అని మరో సారి చెప్పిన చిన్న కథ.. రాధమ్మ పెళ్లి జరిగిపోయింది!
కథానిక :
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం )
రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "
' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు మంది!' అన్నాడో కవి!
అయితేనేం పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు. పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక.
సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు.
ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం.
సరే వాళ్లు మాత్రం వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ?
బోర్ బోర్!
కడుపు నిండేనా, కాలు నిండేనా?
ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే 'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా!
' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు.
వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు. మరి ఇరుపక్షాల పెద్దలు?
"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.
" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ
" ఒకవేళ ఒప్పుకోకపోతే?”
“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".
"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "
" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"
" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా. అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?"
"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ! ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు "
"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."
"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ ది సేమ్ ...' అని నవ్వింది.
రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి.
అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది. ప్రణయం ముదిరి పాకాన పడింది.
రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని గాడ్యయేట్ తమ్ముడూ, పించను ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు.
ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట.
భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు.
నా అంత ఎత్తు ఎదిగిన వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .
“నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “
" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"
రాజు మాట్లాడలేకపోయాడు.
తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"
"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! "
"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో తలెత్తుకు తరగాలా. . వద్దా ?” అని అందుకుంది తల్లి.
" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి ఖాయమంటున్నారు. గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క . అందుకే మీ మహదేవన్నయ్య ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం రాధ తండ్రి చుట్టూతా తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?"
" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "
"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”
రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి.
ఆయన మెత్తబడినట్లు తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక
నువ్వు పెద్ద ఆచారాలను గురించి చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను వ్యవహారం తొందరగా సెటిల్ చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”
"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా రానీయడం? "
శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే .. మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!"
"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు. తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి? మీరు చల్లగా ఉండటం కావాలి మాకు. మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా! రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి.
" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.
ఈశ్వరావుతో జరగదనుకున్న పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి శాంత కళ్ళ లోకి మెరుపులు వచ్చేశాయి.
రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో.
కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో!
మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు.
అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు. తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది.
వారం రోజులయింది. కానీ , రాధ జాడ అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు.
ఆ రోజు పోస్టులో రాజాకు కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం,
ఆత్రుతగా కవరు ఓపెన్ చేశాడు. రాజు.
శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది!
రాజ గారికి!
అర్థమయిందనుకుంటాను.
నా పెళ్ళి నిశ్చయమై పోయింది.
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం.
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి.
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు.
నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ ఊరే.
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి.
మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే ఫార్స్ అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు;
ఇట్లు,
...
రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా కాదని ఒప్పుకుంది!
అదే మార్గంలో రాధ తల్లిదండ్రులూ వెళ్లారు.
రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ. అన్నీ ఒకే ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా!
శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా పైకి ఎగబాకాలని చూస్తున్నాడు!
మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే!
ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.
***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)
రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది - కథానిక