Tuesday, September 1, 2020

కలిసి మునుగుదాం రండి!- కర్లపాలెం హనుమంతరావు ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం




చికాగో నుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టి ఫోన్ చేసాడు 'మొత్తం పాతిక మందిమి వస్తున్నాం.. మునగడానికి.. అదేరా.. గోదావరి పుష్కరాలు కదా!.. ఆ ఏర్పాట్లూ అవీ అన్నీ చూసే పూచీ నీదే..'అంటూ.
ఇంత మందొచ్చి పడితే నదిలో నీళ్లు చాలొద్దూ! అని మధన పడుతుంటే మా మాధవగాడే దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. 'గోదావరా? .. డోంట్ వర్రీ!' అంటూ. ‘అమెరికాలో మునగడానికేం లేవు కాబోలు పాపం,, చికాగో నుంచి వస్తున్నారు. చికాకు పడితే ఎట్లారా? .. చూద్దాంలే! .. చుట్టం కదా!' అన్నాడు.
ఆ సాయంత్రమే టక్కూ టయ్యీ కట్టుకున్న శాల్తీ ఒకటి 'టక్,, టక్' మంటూ మా ఇంటి తలుపు తట్టింది. మొఖాన కాసంత గంధబ్బొట్టు మినహా మనిషి మనాడే అనేందుకు ఇంకే దాఖలాల్లేవు. అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు! 'మై నేమీజ్ మిష్టర్ డూబే. మాధవ్ పంపించా'డంటూ ఏదో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ అవీ పూర్తిచెయ్యమన్నాడు. హ్యాండౌట్ ఇచ్చి డౌట్సేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది. 'పన్నెండేళ్లకోసారొచ్చే పవిత్ర గోదావరీ పుష్కర స్నానఘట్టాన్ని మీరు జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు గోదావరి నది వడ్డున వడ్దూ పొడుగూ ఉన్న మా వస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు'
'వస్తాదులెందుకయ్యా?'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకు పోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ ఛాలు. మీరు పరుగులెత్తకుండా గోదావరి నదే మీ పాదాల వద్దకు పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది'
'బానే ఉంది గానీ, మునిగేందుకే ఫీజు కాస్త ఎక్కువ. తలకు మరీ మూడు వేలా?!'
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసిలివాళ్లకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచేందుకు ఏర్పాట్లు చేసాం. సిక్కులకు మినరల్ వాటర్ మిక్స్డ్ బాత్! సిక్కంటే సర్దార్జీ అని కాదు. సిక్ పర్సన్ అని అర్థం. వి. . పి లకు విడిగా వేణ్ణీళ్ల స్నానాలు.
'శుద్ధి చేసిన వాటర్ కదా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుందిలేరా మరి' అని అందుకున్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. ‘సౌకర్యాలు చూసుకో.. ఫీజెంత చౌకో తెలుస్తుంది. సొంతంగా వెళ్లాలంటే ఎంతవుతుందీ? పైన యాతన. రద్దీలో ఏదీ దొరిగి చావదు. అదే డూబే వాళ్లయితే అంగవస్తం నుంచి గోచీపాత వరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు చేయిస్తారు. పురోహితుడ్నీ.. అవసరమయితే పితృదేవతల్ని కూడా వాళ్లే చూసిపెడతారు..'
'మరేఁ!' అన్నాడు మిష్టర్ డూబే సెల్ ఫోన్ మీదేవో నెంబర్లు టకటకలాడిస్తో.
'పితృదేవుళ్లని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే గాదారిలో కెళ్లి బుడుంగుమని మునగెయ్యాలనిపిస్తుంది. బేడ్ లక్. పుష్కరం రెండు వారాలు నా కింకో దేశంలో క్యాంపు!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముంది సార్ మా దగ్గర. ఆఫీసులో, బిజినెస్ లో బిజీగా ఉంటే మీ తరుఫున ఇంకోళ్లను ముంచుతాం. పుణ్యం పూర్తిగా మీ కాతాలోకే బదిలే అయ్యే ప్రత్యేక పూజ కూడా పాకేజ్ లో ఉంది.' అని ఇంకో ఫారం బైటికి తీసాడు. డూబే ఫైలు నిండా ఎన్నో ఫారాలు!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగురులో స్నానం చెయ్యడమెలాగా అని ఇందాకణ్ణుంచి నలుగుడు పడుతున్నా. ప్రాబ్లం సాల్వడ్' అని తగులుకుంది మా శ్రీమతి. 'ముక్కు మూసుకొని మునగకుండా ముక్కోటి దేవతలనర్చించే పుణ్యఫలం ఈజీగా వస్తుంటే వదులుకోడమెలా?' అని ఆవిడగారి గోల. పాచినీళ్లలో  మునిగే బాధలేదు. కొట్టుకుపోయే రిస్క్ లేని స్కీమ్. పదివేలు మనవి కావనుకుంటే పుష్కలంగా పుష్కర పుణ్యం.
'ఊరికే నీతులు దంచే నేతలు ప్రజల్నిలా పునీతుల్ని చేసే పనులు ఎందుకు చేపట్టరో! ఎన్నికలున్నాయిగా! ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగాల'ని అనుకున్నా.
తీరాబోతే అమెరికా నుంచి ఒకే ఒక శాల్తీ దిగింది, తెల్లతోలు! తెల్లబోయాం. తెలుగు బ్యాచంతా తీరికలేనంత బిజీగా ఉన్నార్ట, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడ్రౌనింగ్ డాట్.కామ్ వెబ్ సైట్లో. చిట్టిగాడు చిట్టీ రాసి పంపించాడు 'ఇంట్లో కూర్చుని ఇంటర్మెట్లో పుష్కర స్నానాలు.. పితృదేవతలకు పిండప్రదానాలు చేసే సాఫ్ట్ వేర్ డిజైనింగులో  బిజీగా ఉన్నాం. నట్టింట్లోకి గోదావరి నదిని తెప్పించాలని ప్రయత్నం. ప్రతిరోజూ పెరట్లోనే పుష్కరస్నానాలు చేయిస్తాం'అంటో ఏదేదో సోది రాసాడు. 'ఈ తెల్లోడికి మన తెలుగు నదుల్లో మునగాలని తెగ 'ఇది'గా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నాం. మా కొలీగే. జాగ్రత్త. జాతకం ప్రకారం వీడికి ఈ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు కొట్టకుండా చూడండి!' అని రాశాడు.
ఊళ్లో ఉన్నంత సేపూ వాడికి కాపలా కాయలేక చచ్చాం. తీరా బైలుదేరే సమయానికి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాట్ట. గోదావరిలో మునగాల్సిన వాడు అపోలోలో తేలాడు. ఏమైనా సరే నదిలో మునగాల్సిందేనని పట్టుబడితే అట్లాగే కట్లతో డిశ్చార్జ్ చేయించి.. బాసర వైపుకు మోసుకు పోయారుట డూబే బేచి.
తిరిగొచ్చిన తరువాత వీడి ఆనందం చూడాలి. ఆంధ్రా నదుల సౌందర్యాన్ని తిక్కన కన్నా ఎక్కువగా పొగిడేశాడు. వీడియో తీసాట్ట గాని.. విడిగా ఫీజేదో అదనంగా ఎందుక్కట్టాలని ఆర్గ్యూ చేసాడని ఎవడో కెమెరా నీళ్లపాలుచేసేశార్ట! అక్కడికీ పవిత్రస్థలంలో ఫొటోలు తీయడం పాపహేతువని బుకాయిస్తే పాపపరిహారర్థం పన్నెండు వందలు సమర్పించుకుని చెంపలేసుకొన్నాడుట కూడా! తిప్పలెన్ని పడ్డా 'దిస్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ మెరికల్స్' అని అమెరికాపోయిందాకా తెల్లదొర ఒహటే మురిసిపోవడమే విశేషం.
మూడో రోజే చిట్టబ్బాయ్ నుంచి ఫోన్. చిటపటలాడిపోతున్నాడు. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! గోదారికి దారి తెలీకపోతే కనుక్కోవచ్చుగా! మూసీ నదిలో మునకలేయిస్తార్రా మా తెల్లబాసుని! అదే గోదారనుకుని  పాపం మా అందరి కోసం పాతికసార్లు మురికినీళ్లలో మునకలేసాట్ట గదా! ఇప్పుడు పడిశం పట్టుకుంది. మూసిన కన్ను తెరవడంలేదు. 'మిరకల్.. మిరకల్' అంటూ కలవరిస్తున్నాడు పాపం, మానవుడు!' అంటూ తిట్టిపోసాడు మాధవగాడు.
డూబే మోసం అర్థమయింది. బ్యాంకుల్లో ముంచడం తెలుసుగానీ, ఇట్లా రివర్ బ్యాంకుల్లో ముంచినట్లు వినడం ఇదే మొదటిసారి.
గోరు తడవకుండా  గోదావరి స్నానమంటూ  ఇదేంటో మరి?!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎంతకీ కలవదే!
'మళ్లీ పుష్కరాల వరకు మనకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు ఆ మధ్య కనబడ్డప్పుడు. జరిగినదంతా చెప్పి చొక్కా పట్టుకు జగడానికి దిగబోతే 'వాడికి జాతకంలొ జలగండం ఉందన్నారుగా! నేనూ.. ఆ డూబేగాడు కేవలం నిమిత్తమాత్రులం.. అంతే' అంటూ కాలరు విడిపించుకుని దర్జాగా వెళ్లిపోయాడు మిత్ర్రుడు.
కర్లపాలెం హనుమంతరావు
01 -09 -2020
***
(ఈనాడు దినపత్రిక 08 -07 -2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)




Monday, August 31, 2020

ఖర్చు తక్కువ వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు - ప్రకృతి -కర్లపాలెం హనుమంతరావు






ప్రకృతితో ఒక్కోరికి ఒక్కోరకమైన అక్కర. కవి, గాయకుడు ప్రకృతిని చూసి స్పందించే మంచి కవిత్వం, గానం ప్రసాదించేది.  ఆ మధ్య చైనీస్ యువకులు కొంత మంది ప్రకృతిలో దొరికే గుమ్మడి, బీర, దోస వంటి కూరగాయలను సంగీత పరికరాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఒక యూ ట్యూబ్ వీడియోలో చూపించి అందరిని అవాక్కయేటట్లు చేసారు. నిజానికి ప్రకృతిలో దొరికే కాయగూరలు, దుంపలు, పండ్లు ఫలాలు సౌందర్య పోషణకు ఉపయోగించుకునే తెలివితేటలు పెంచుకుంటున్న మహిళామణులు వాటి అవసరం ముందు తిండి తిప్పలకు, మందుమాకులకు ఎంత వరకు ముఖ్యమో తెలుసుకుంటున్నారా?
మందుల దుకాణాలలో  ఔషధాలకు కొదవ ఉండదు, నిజమే కాని, అన్ని రకాల మందులు అందరు వాడటం అంత క్షేమం కాదు. కొన్ని సార్లు వికటించే ప్రమాదం కద్దు. ఏవి హాని చెయ్యనివో తెలుసుకోవడానికి మళ్ళీ  ఏ అలోపతి వైద్యుడి దగ్గరకో పరుగులెత్తాలి. వేళకు అన్ని చోట్లా డాక్టర్లు అందుబాటులో ఉండే దేశమా మనది? భారతదేశం వరకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యుడు ప్రకృతి నారాయణుడు. ఆ వైద్యనారాయణుడి థెరపీని నమ్ముకుంటేనే  మన ప్రాణాలకు తెరిపి.
ఉదాహరణకు, గోళ్ల కింద గాయమయిందనుకోండి. ఒక్కో సందర్భంలో కొనుక్కొచ్చుకున్న మందు గోరు చివుళ్ల సందున సరిగ్గా అమరదు. వాడినట్లే ఉంటుంది కాని, ఫలితం కనిపించదు. కనిపించినా దాని ప్రభావం నెమ్మది మీద గాని తెలిసే అవకాశం లేదు. అదే వంటింట్లోనే కూరగాయల బుట్టలో ఏ వేళకైనా దొరికే బంగాళా దుంపను ముక్కలుగా కోసి ఒక ముక్కతో ఆ గాయమయిన భాగం కవర్ అయే విధంగా కట్టుకట్టుకుంటే సరి. మూడు రోజులు వరసగా ఉదయాన్నే పాత ముక్క స్థానంలో కొత్త ముక్కను పెట్టి కట్టుకుంటే నాలుగో రోజున అక్కడ గాయమైన ఛాయలు కూడా కనిపించవు.  చర్మం పైన పొక్కులు, బొబ్బలు కనిపిస్తే బంగాళా దుంపల ముక్కలతో గట్టిగా రుద్దితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది.  అలాగే బంగాళా దుంపను ఉడకబెట్టిన నీరు షాంపూ కండిషనర్ కన్నా మంచి ప్రభావం చూపిస్తుంది. రెగ్యులర్ షాంపూతో తల శుభ్రం చేసుకున్న తరువాత ఆరబోసిన వెంట్రుకలను ఉడికిన బంగాళా దుంపల నీళ్లతో కడిగి ఆరబెట్టుకుంటే ఆ శిరోజాల మెరుపు సహజంగా ఉందటమే కాదు, జుత్తుకు భవిష్యత్తులో హాని కూడా కలగదు. బూడిద రంగుకు తిరుగుతున్న జుత్తును దారిలోకి తేవాలన్నా ఈ బంగాళాదుంపల ద్రవంతో కడిగే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే సరిపోతుంది. కాణీ ఖర్చు లేని వైద్యం. పిలవగానే పలికే వైద్యుడు ప్రకృతి.
బంగాళా దుంపలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. తడిగా ఉన్న భాగం వేపుని కొద్దిసేపు కళ్ల కింద పెట్టుకుని, ఆ తరువాత రుద్దుకుంటే  ముడతలు బిగిసుకుంటాయి. క్రమం తప్పకుండా చేసేవారికి కళ్ల కింద ఉబ్బు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. మో చేతుల కింద అదే పనిగా వత్తిడి  ఉన్నవాళ్లకు ఆ ప్రదేశంలో నల్లటి మరకలు నిలబడిపోతాయి, వాటి మీద  క్రమ తప్పకుండా బంగాళాదుంప ముక్కలను రుద్దుతుంటే మరకలు తొలగిపోతాయి.
బంగాళాదుంపలకు చర్మానికి భలే లింకు. దుంపలు కడిగిన నీళ్లలో నిమ్మ రసం పిండుకుని దానితో మొహం శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉన్నవాళ్ల మొహంలో ఆ కళే వేరు. వదనం  సమ్మోహనంగా మారుతుందిఎండపొడికి చర్మం కమిలిన  చోట బంగాళా దుంపల తడి చెక్కలు ఉంచితే చర్మం అతి తొందరలో తిరిగి సహజ స్థితికి  వచ్చేస్తుంది. ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో వేళ్లతో ఎత్తిపెట్టిన పెరుగు రవ్వంత కలిపి ఆ పేస్టును మొహానికి పట్టించుకోవడం అలవాటు చేసుకుంటే మొగం ఎప్పుడూ మంచి  నిగారింపుతో కళకళలాడుతుంది. బంగాళా దుంపల పేస్టుకు దోసకాయ పేస్టు, సోడావుప్పు కలిపి ఆ పేస్టుతో  మొహం శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికి వయసు పైబడిన తరువాత  చర్మం మీద ఏర్పడే ముడతలు వెనకడుగు పడతాయి.
పిల్లలు తిరుగుతున్న ఇంటిలో గోడలకో, గడపలకో పెయింటింగు వేయించాల్సిన అవసరం వస్తుంటుంది ఒక్కోసారి. పెయింట్లలో వాడే పదార్థాలకు తోడు, వార్నిష్ నుంచి వచ్చె గాలి ఇంటి వాతావరణంలోఒక రకమైన ఘాటుతనం పెంచి, ఒక్కోసారి వాంతులు అయేంత వరకు పరిస్థితి వికటిస్తుంది. పసిపిల్లలను, ముసలివాళ్లను ఎక్కువగా బాధించే ఈ కాలుష్య సమస్యకు ఉపాయం, పెయింట్ చేసే స్థలంలో సగం తరిగిన ఉల్లి ముక్కలు ఉంచితే ఆ ఘాటుకు ఈ ఘాటు సరితూగి కాలుష్య ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. ఆ ధాతువు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. చెవికి సంబంధించిన వ్యాధులకు ఉల్లిపాయ బ్రహ్మౌషధం. చెవిపోటు వచ్చిన సందర్భాలలో చెవి దగ్గర ఉల్లిపాయ ముక్క ఉంచి కట్టు కట్టి రోజంతా వదిలేస్తే కర్ణభేరిలోని కాలుష్యకారకాలు నశించి బాధ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.  
పాదాలపైన గాయాలు, వ్రణాలు అయినప్పుడు తేనెను మందులా ఉపయోగించాలి. గాయమైన చోట తేనె రాస్తూ ఉంటే కొత్త కణాలు తొందరగా పుట్టుకొచ్చి గాయం పూడే సమయం తగ్గిపోతుంది.  తేనెకు సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణం ఉంది.
వంటి దురదలకు యవలు మంచి మందు. యవల జావను ఒక గుడ్డలో కట్టి  నీటిలో ముంచి ఆ తడి మూటను దురద పుట్టిన చోట రుద్దుతూ పోతే బాధ  క్రమంగా తగ్గిపోతుంది. మశూశికం పోసినప్పుడు చర్మం మీద పొక్కులు లేచి దురద పుట్టిస్తాయి. వాటిని గోకినందువల్ల చుట్టు పక్కలకు ఆ దురద క్రిములు మరంతగా విస్తరించే అవకాశమే ఎక్కువ. ఈ తరహా సందర్భాలలో యవల జావ వైద్యం అపకారం చేయనై ఉత్తమ ఉపశమనం.
తాజా నిమ్మరసం వాసనచూడడం వల్ల, మద్యం అతిగా తాగిన హాంగోవర్ బాధ నుంచి ఉపశమనం సాధ్యమే. నిమ్మ, ద్రాక్ష, నారింజ, తొక్కలను మూడు నాలుగు రోజుల పాటు ఎండకు పెట్టి ఆనక నిల్వచేసుకుంటే సబ్బులాగా వాటిని వాడుకోవచ్చు. బొప్పాయి తొక్కల గుజ్జును అరికాళ్ల కింద రాసుకుంటే అందులో ఉండే రసాయనాల ప్రభావం వల్ల అక్కడ ఉండే మృత చర్మకణాలన్నీ తొలగిపోయి పాదాలు పరిశుభంగా కనిపిస్తాయి. అరటి తొక్కల గుజ్జు భాగం వైపు పంధదార జల్లి స్నానం చేసే ముందు వంటికి పట్టిస్తే చర్మం మీద చేరిన మకిలంతా తొలగి స్నానానంతరం శరీరం నిగనిగలాడుతుంది
ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయనుకుంటా మన బేరీ పండ్లను పోలి ఉష్ణమండలాలలో పెరిగే ఒక రకమైన కాయ అవకాడో! దానితో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖం రుద్దుకుంటే మొహం చల్లగా హాయిగా ఉండి శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పనసపండులోని రసాయనాలు మనిషి శరీరం మీది మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగిస్తాయి
స్ట్రా బెర్రీ పళ్లు దంతాలను ధవళ కాంతితో  ధగధలాడించే ఇంద్ర్రజాలం ప్రదర్శిస్తాయి. వడదెబ్బకు పుచ్చకాయలు మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ పుచ్చకాయల పాత్ర అమోఘమైనది.
ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువుల నుంచి లాభం పొందే కళ అభివృద్ధి చేసుకోబట్టే మనిషి మిగతా జీవజాతులతో పరిణామదశ పోటీలో ముందున్నది.  ప్రాణమిచ్చి, ఆ ప్రాణం నిలబెట్టే ప్రకృతిని ప్రాణప్రదంగా చూసుకోవాలే తప్పించి, ప్రకృతి వైద్యుడి ఉనికికే చేటు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కష్టనష్టాలు చివరికి మనుషులుగా మనకు మనమే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది!
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020

ఇల్లే ఒక పార్లమెంట్ - ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం





(ఈనాడు శ్రీధర్ గారికి క్షమాపణలతో, ధన్యవాదాలతో)

ఇల్లొక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇంటాయన ప్రసిడెంటా? ప్రధానమంత్రా?’
పాకిస్తానయితే ప్రధానమంత్రి.. ఇండియా ఐతే ప్రెసిడెంట్ అనుకోరాదూ?శ్రీమతి  లండన్లో మాదిరి  ప్రధాన మంత్ర్ర్రిగా పవర్ ఫుల్ గా ఉంటేనే  ఉంటేనే ఇంటికి, మగాడి వంటికి మంచిదని నా అభిప్రాయం' అంది  చెంచులక్ష్మి.
చెంచులక్ష్మి పత్రికలలో స్త్రీల పక్షం వహించి ఘాటుగా  రాస్తుంటుంది. హైదరాబాద్ లో మా ఆడపడుచుగారింటికి వెళ్లినప్పుడు ఆవిడ వాళ్ల ఫ్లాట్స్ లోనే ఉంటుందని తెలిసి ఒక మధ్యాహ్నం పూట మా ఆడపడుచుతో కలసి చూడ్డానికి వెళ్లాను. చెంచులక్ష్మి బాగా రాయటమే కాదు.. బాగా మాట్లాడుతుంది కూడా. ఇంటిని పార్లమెంటనడంలోనే గొప్ప పాయింట్ లాగిందావిడ.
'… ఎగువ సభ సభాపతిలా మామగారు, దిగువ సభ ప్రతిపక్షంలా అత్తగారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు మామూలే అది . పిల్లలు రకరకాల రాజకీయ పార్టీలు. ఇరుగుపొరుగువారు చైనా పాకిస్తాన్ లాంటి వాళ్లు. మిత్రబృందాలు కల్చరల్ ఎక్ఛేంజికి వస్తుంటారు. వీళ్లందర్నీ పర్యవేక్షించాల్సిన వాళ్లం మాత్రం మనమే కదా చివరికి !'
'లెక్చర్ పిచ్చగా ఉంది. ప్రొసీడ్' అని ఎగదోసింది మా ఆడపడుచు ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ.  ట్రెజరీ పక్షాల వాళ్లు ప్రధాని మాట్లాడినప్పుడు మధ్య మధ్యలో బల్లలు బాదేస్తారే .. ఆ  మోడల్లో. డైనింగ్ టేబుల్ మీద మోదేస్తూ ఈవిడ ఇలా ప్రోత్సహించడంలో ఇద్దరి మధ్యా ఏదైనా లోపాయికారి ఒప్పందంలాంటివి ఏమన్నా ఉన్నాయేమో! అని నాకు అనుమానం మొదలయిన మాట నిజం సుమా!
చెంచులక్ష్మి రెచ్చిపోతూ 'ఇంట్లో ఏ ప్రాబ్లమొచ్చినా డైనింగ్ టేబుల్ దగ్గర చర్చకు వచ్చి తీరాల్సిందే ఏ కొంపలో  అయినా. దాన్నే మేం ముద్దుగా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ అని పిలుచుకుంటుంటాం ఇంట్లో. మేటరెంత కాన్ఫిడెన్సయినా సరే,  ఎట్లా లీకవుతుందో తెలీదు .. మాకన్నా ముందు పక్కింట్లో చర్చ మొదలయిపోతుంది ఈ మధ్య  ఈ అపార్ట్ మెంట్స్ లో.
'స్వగృహ రహస్యాలను పొరుగిళ్లకు చేరవేసే కోవర్టులు ప్రతీ ఇళ్లలోనూ ఏదో రూపంలో ఉంటారులే’ అని గునిసింది మా ఆడపడుచు  నా వంక చూపులు సాధ్యమైనంత వరకు పడకుండా జాగ్రత్త పడుతూ. ఆవిడగారి నిందార్థాలు బహుశా మా అమ్మ మీద అయివుంటాయని అర్థమయింది.
'మేటర్ మరీ సీరియస్సయితే ఉభయసభలనూ సమావేశపరచి లోతుగా చర్చించ వలసిన అవసరం ఉంటుంది. మా అమ్మాయి ఈ మధ్య రాత్రుళ్లలో వీరప్పన్ ను గురించి ఒహటే కలవరిస్తోంది. దీం దుంపతెగ! పోయి పోయి ఆ దుంగల దొంగ వెధవ వలలో  పడిందేమిటి చెప్మా' అని మా వారు ఉప్మా తింటున్న ప్రతి పరగడుపునా కన్నీళ్లు పెట్టుకొనే సీను చూసి చూసి నాకూ  ఝడుపు జొరం పట్టుకుంటుందేమోనని అనుమానం మొదలయింది. ఒక రోజు పిల్లదాన్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పాపం పసిదానికి. ఆ బూచాడికి బారెడు మీసాలు మొలుస్తుంటాయి కదా! రెండేపులా గుమ్మడికాయలు నిలబెట్టినా  లొంగనంత ధృఢంగా ఉంటాయి. ఏ చందనం తైలం వాడుతున్నాడో చచ్చినోడు .. కనుక్కోడమెట్లా అని అలోచిస్తూ పడుకుంటున్నానే మమ్మీ! నేరుగా నిద్రలోకే వచ్చి ఆ ఒక్కటి తప్ప మిగతా ముచ్చట్లన్నీ చెప్పి చస్తున్నాడు' అని బావురుమనేసింది. నమ్మక చస్తామా?
'దేశమో వంక తగలడి చస్తోంటే మీసాలకు రాసుకునే సంపెంగ నూనె వివరాలంత అవసరమా దీనికి?' అని మా మగాయన గెంతులేస్తుంటే నేనే గుడ్లురుమి ఎట్లాగో అదుపులో పెట్టా!'
'ఈ కాలం పిల్లకాయలను గురించి ఈ మగాళ్లకేం తెలుసు. కెరీర్ ఓరియెంటెడే కాని.. కాలేజీకి తీసుకెళ్లే కేరేజి ఎలా సర్దుకు చావాలో కూడా కోర్సులో చేరితే తప్ప బుర్రకెక్కని మట్టిముద్దలు. పిల్లల్ని అట్లా పెచుతున్న పాపం నిజానికి మన పేరెంట్సుదే! సరే! మీ మైనస్సును గురించి చెప్పావు. మరి ప్లస్సును గురించి కూడా మా ఆడపడుచుచెవిలో వెయ్యి!' అంది మా ఆడపడుచు.
'యూ మీన్ .. మా అబ్బాయా? అబ్బాయిల్ని ప్లస్సులు, అమ్మాయిల్ని మైనసులు అనుకుని పెంచడానికి మనమేమన్నా సంసారాలని వ్యాపారాలకు మల్లే నడుపుతున్నామా?డెబిటైనా, క్రెడిటైనా రెండు సైడ్లు చివర్లో సమంగా ఉంటేనే అది సరైన బ్యాలన్స్ షీట్ అవుతుందని మా వారెప్పుడూ అదేదో వాళ్ల బ్యాంకు గోలలో ఘోషిస్తుంటారు. నిజం చెప్పాలంటే మా వాడో పెద్ద వాజపేయి. మేథావే గానీ, ఏదీ ఇతమిత్థమని ఒక పట్టాన తెమల్చడు. మొన్నటికి మొన్న పరీక్షలని తెల్లార్లూ చదివి చదివి తీరా పరీక్ష హాలు కెళ్లి తెల్లకాగితం ఇచ్చొచ్చాడు. 'రాయడానికి మరీ అంత బద్ధకమేంట్రా వెధవా?' అని గట్టిగా నిలదీస్తే ' ఈ కింది దానిలో ఏదేని రెండిటికి మాత్రమే సమాధానం వ్రాయుడు!' అని రాసుందట. 'టూ ఓ క్లాక్ దాకా కూర్చునే ఓపిక లేక తిరిగొచ్చేసాను మమ్మీ!' అని దిక్కుమాలిన జవాబు. పిల్లల్ని ఇట్లా చెడగొట్టింది వాళ్ల డాడీ గారాబమే!'
'పవరంతా ఈవిడ చేతిలో పెట్టేసుకుని అప్పోజిషన్ వాళ్లను పి.యం తిట్టినట్లు ఎట్లా తిడుతుందో చూసావా మహాతల్లి! ' అంటూ నా చెవిలో గుసగుసలు పోయింది మా ఆడపడుచు, ఆవిణ్ణి అట్లా పక్కకు పోనిచ్చి.
'అన్నయ్యగారు ఓన్లీ ప్రెసిడెంట్ లాంటి వాళ్లని నువ్వే అన్నట్లు గుర్తు' అ ని మళ్లీ రెచ్చగొట్టే పని మొదలుపెట్టింది మా ఆడపడుచు. '
'ఆడది మొగుడు అడుగుజాడల్లో నడిచి తీరాలని కదండీ మన  శాస్త్రాల నుంచి తెలుగు సినిమాల వరకు అన్నీ ఘోషిస్తున్నది' అని అడిగాను అక్కడికి నేనూ కొద్దిగా లేని ధైర్యం కూడగట్టుకొని.  
'మొగుడు అడుగుజాడల్లో నడిస్తే మన దేశంలో ముప్పావు వంతు మంది ఆడవాళ్లు ఏ బారుల్లోనో, పేకాట క్లబ్బుల్లోనో తేలుండేవాళ్లు.' అని గుర్రుమందావిడ.
'నీ తీరు చూస్తుంటే  నువ్వింట్లో మీ వారి మీద వార్ గ్రూప్ మాదిరి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుందే! ఇట్లా అయితే అన్నయ్యగారెప్పుడో 'భాబా’  సంఘంలో చేరిపోతారేమో వదినా! ముందది చూసుకో!' అంది మా ఆడపడుచు.
'భాబా సంఘమా? అంటే?'
'భార్యా బాధితుల సంఘం'
'తలకిందులుగా నడిస్తే నవ్వొస్తుంది కదా అని మగాళ్లే ఇలాంటి తలతిక్క సంఘాలు పెట్టి మన పరువు తీసేది. పత్రికల్లో వచ్చే అప్పడాల కార్ట్యూన్లన్నీ మన ఆడవాళ్ల ఇమేజీని నెగటివ్ గా చూపిస్తున్నాయని నేనంటాను. మనం ఆకాశంలో సగం అంటారు కానీ.. మూడో వంతు వాటా ఇవ్వడానిక్కూడా ఎన్నేసి నాటకాలు ఆడుతున్నారో చూడు! పేరుకెన్ని రిజర్వేషనులుంటే ఏమి? అవన్నీ మొగాడు ఆడదాని ముసుగులో వేసే వేషాలే! హక్కులు దేబిరించి తెచ్చుకుంటే  వచ్చిపడేవా? పోరాడి గెల్చుకునేవి. రాజకీయలనగానే మనకు ఒక్క ఇందిరమ్మ పేరు మాత్రమే ఎందుకు గుర్తుకురావాలి? జయలలితో, మాయావతో, మమతమ్మ  బెనర్జీనో, ఇలా ఏవో ఓ పుంజీడు పేర్లు మాత్రమే పలుకుతున్నామంటే  మనమెంత వెనకబడి ఉన్నామో అర్థంచేసుకోవాలి? 'అర్థరాత్రి పూటయినా ఆడదిస్వతంత్రంగా బైట తిరగ్గలిగే రోజు వచ్చినప్పుడే మనకు నిజమైన్న స్వాతంత్ర్య్యమొచ్చినట్లని బాపూజీ అన్నాడంటే, 'ఆడది అసలు అర్థరాత్రిళ్లు బైటెందుకు తిరగడం' అనేసే మాగాళ్లు. పొట్టపగిలిపోయేటట్లు  అదో జోకన్నట్లు నవ్వి చచ్చే జోకరుగాళ్లు  ఉన్నారంటే  ఆ తప్పెవరిది? 'మగాడు ఎందుకు తిరుగుతున్నాడో అందుకు' అని ఆడది తెగించి జవాబు చెప్పినప్పుడు కదా మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్లు గుర్తు!' అంది చెంచులక్ష్మి ఆవేశంగా.
మేటర్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆవిడగారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదే! ఎమోషన్లో పదాలేవో అటూ ఇటూ పడతాయి. అది కాదు; విషయం ప్రధానం. రిజర్వడ్ చైర్లకు ఎన్నికైన ఆడవాళ్లలో ఎక్కువ భాగం ఆయా మొగుళ్ల చేతిలో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని ఒకానొక ప్రముఖ దినపత్రికలో ఆవిడ రాసిన వ్యాసం చదివిన రోజు నుంచి మా ఊరి మహిళామండలి సభ్యురాళ్లందరికీ ఆవిడంటే తగని అభిమానం పుట్టుకొచ్చినమాట నిజం. ఒకసారి చెంచులక్ష్మిగారిని మా ఊరు తీసుకెళ్లి సభ పెట్టిస్తే నాకు మంచి క్రెడిట్ దక్కుతుంది.  ఆ విషయమే అడగడానికి  అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా.  నా ఆహ్వానం విన్న మీదట నవ్వుతూ 'దాందేముందండీ! మా వారెప్పుడు ఖాళీగా ఉంటారో కనుక్కొని చెబుతాను. ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చెయ్యాల్సుంటుంది మరి! ఒక్కదాన్నే అంత దూరం ప్రయాణమంటే ఏమంటారో మరి.. రోజులు అసలే బాగా లేవు కూడా !' అంటూ లేచి నిలబడింది!
'మమ్మీ! ఇంకెత సేపే! డాడీ నిన్ను టిక్కెట్లు తీసుకోమన్నాడు. లేడీస్ క్యూలో అయితే రష్ తక్కువగా ఉంటుందట!' అంటూ పుత్రరత్నం సెల్ చేతిలో పట్టుకుని పరుగెత్తుకుంటు వచ్చేసాడు.
'సినిమాకా?' అని అడిగింది మా ఆడపడుచు. 'అవును ఏడుపు టీవీలు చూడలేక పిక్చర్కే ప్లాన్ చేసారు మా వారు. సీరియల్ అయితే మళ్లీ రేపు కూడా వస్తుందిగా. అందునా మగాళ్లు అడిగినప్పుడు కాదంటే ఇల్లో పార్లమెంట్ అయిపోతుంది' అని హడావుడిగా లోపలికి పరుగెత్తింది. తయారవడానికి కాబోలు !
'ఏం సినిమారా.. చిన్నా?' అని మా ఆడపడుచు అడిగిన ప్రశ్నకు ' రేణుకాదేవి మాహాత్యం' అనేసాడు అభం శుభం తెలియని ఆ ఇంటి పార్లమెంట్ నామినేటెడ్ మెంబర్ భడవా !
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020
***
(ఇల్లే పార్లమెంట్ - పేరుతో ఈనాడు దినపత్రిక 17 -02 -2003 లో ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...