చికాగో నుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టి ఫోన్
చేసాడు 'మొత్తం పాతిక మందిమి వస్తున్నాం.. మునగడానికి.. అదేరా.. గోదావరి పుష్కరాలు కదా!.. ఆ ఏర్పాట్లూ అవీ అన్నీ చూసే పూచీ నీదే..'అంటూ.
ఇంత మందొచ్చి పడితే నదిలో నీళ్లు చాలొద్దూ! అని మధన పడుతుంటే మా మాధవగాడే దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. 'గోదావరా? .. డోంట్ వర్రీ!' అంటూ. ‘అమెరికాలో మునగడానికేం లేవు కాబోలు పాపం,, చికాగో నుంచి వస్తున్నారు. చికాకు పడితే ఎట్లారా? .. చూద్దాంలే! .. చుట్టం కదా!' అన్నాడు.
ఆ సాయంత్రమే టక్కూ టయ్యీ కట్టుకున్న శాల్తీ ఒకటి 'టక్,, టక్' మంటూ మా ఇంటి తలుపు తట్టింది. మొఖాన కాసంత గంధబ్బొట్టు మినహా మనిషి మనాడే అనేందుకు ఇంకే దాఖలాల్లేవు. అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు! 'మై నేమీజ్ మిష్టర్ డూబే. మాధవ్ పంపించా'డంటూ ఏదో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ అవీ
పూర్తిచెయ్యమన్నాడు. హ్యాండౌట్ ఇచ్చి డౌట్సేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది. 'పన్నెండేళ్లకోసారొచ్చే పవిత్ర గోదావరీ పుష్కర స్నానఘట్టాన్ని మీరు జీవితంలో
మర్చిపోలేని మధుర ఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు గోదావరి నది వడ్డున
వడ్దూ పొడుగూ ఉన్న మా వస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు'
'వస్తాదులెందుకయ్యా?'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకు పోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ ఛాలు. మీరు పరుగులెత్తకుండా గోదావరి నదే మీ పాదాల వద్దకు
పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది'
'బానే ఉంది గానీ, మునిగేందుకే ఫీజు కాస్త ఎక్కువ. తలకు మరీ మూడు వేలా?!'
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసిలివాళ్లకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచేందుకు ఏర్పాట్లు చేసాం. సిక్కులకు మినరల్ వాటర్ మిక్స్డ్ బాత్! సిక్కంటే సర్దార్జీ అని కాదు. సిక్ పర్సన్ అని అర్థం. వి. ఐ. పి లకు విడిగా వేణ్ణీళ్ల స్నానాలు.
'శుద్ధి చేసిన వాటర్ కదా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుందిలేరా మరి' అని అందుకున్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. ‘సౌకర్యాలు చూసుకో.. ఫీజెంత చౌకో తెలుస్తుంది. సొంతంగా వెళ్లాలంటే ఎంతవుతుందీ? పైన యాతన. రద్దీలో ఏదీ దొరిగి చావదు. అదే డూబే వాళ్లయితే అంగవస్తం నుంచి గోచీపాత వరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు చేయిస్తారు. పురోహితుడ్నీ.. అవసరమయితే పితృదేవతల్ని కూడా వాళ్లే చూసిపెడతారు..'
'మరేఁ!' అన్నాడు మిష్టర్ డూబే సెల్ ఫోన్ మీదేవో నెంబర్లు
టకటకలాడిస్తో.
'పితృదేవుళ్లని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే గాదారిలో కెళ్లి
బుడుంగుమని మునగెయ్యాలనిపిస్తుంది. బేడ్ లక్. పుష్కరం రెండు వారాలు నా కింకో దేశంలో క్యాంపు!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముంది సార్ మా దగ్గర. ఆఫీసులో, బిజినెస్ లో బిజీగా ఉంటే మీ తరుఫున ఇంకోళ్లను
ముంచుతాం. పుణ్యం పూర్తిగా మీ కాతాలోకే బదిలే అయ్యే ప్రత్యేక
పూజ కూడా పాకేజ్ లో ఉంది.' అని ఇంకో ఫారం బైటికి తీసాడు. డూబే ఫైలు నిండా ఎన్నో ఫారాలు!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగురులో స్నానం చెయ్యడమెలాగా అని ఇందాకణ్ణుంచి
నలుగుడు పడుతున్నా. ప్రాబ్లం సాల్వడ్' అని తగులుకుంది మా శ్రీమతి. 'ముక్కు మూసుకొని మునగకుండా ముక్కోటి దేవతలనర్చించే పుణ్యఫలం ఈజీగా వస్తుంటే
వదులుకోడమెలా?' అని ఆవిడగారి గోల. పాచినీళ్లలో
మునిగే బాధలేదు. కొట్టుకుపోయే రిస్క్ లేని స్కీమ్. పదివేలు మనవి కావనుకుంటే పుష్కలంగా పుష్కర పుణ్యం.
'ఊరికే నీతులు దంచే నేతలు ప్రజల్నిలా పునీతుల్ని చేసే పనులు ఎందుకు చేపట్టరో! ఎన్నికలున్నాయిగా! ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగాల'ని అనుకున్నా.
తీరాబోతే అమెరికా నుంచి ఒకే ఒక శాల్తీ దిగింది, తెల్లతోలు! తెల్లబోయాం. తెలుగు బ్యాచంతా తీరికలేనంత బిజీగా ఉన్నార్ట, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడ్రౌనింగ్ డాట్.కామ్ వెబ్ సైట్లో. చిట్టిగాడు చిట్టీ రాసి పంపించాడు 'ఇంట్లో కూర్చుని ఇంటర్మెట్లో పుష్కర స్నానాలు.. పితృదేవతలకు పిండప్రదానాలు చేసే సాఫ్ట్ వేర్
డిజైనింగులో బిజీగా ఉన్నాం. నట్టింట్లోకి గోదావరి నదిని తెప్పించాలని ప్రయత్నం. ప్రతిరోజూ పెరట్లోనే పుష్కరస్నానాలు చేయిస్తాం'అంటో ఏదేదో సోది రాసాడు. 'ఈ తెల్లోడికి మన తెలుగు నదుల్లో మునగాలని తెగ 'ఇది'గా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నాం. మా కొలీగే. జాగ్రత్త. జాతకం ప్రకారం వీడికి ఈ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు కొట్టకుండా చూడండి!' అని రాశాడు.
ఊళ్లో ఉన్నంత సేపూ వాడికి కాపలా కాయలేక చచ్చాం. తీరా బైలుదేరే సమయానికి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాట్ట. గోదావరిలో మునగాల్సిన వాడు అపోలోలో తేలాడు. ఏమైనా సరే నదిలో మునగాల్సిందేనని పట్టుబడితే
అట్లాగే కట్లతో డిశ్చార్జ్ చేయించి.. బాసర వైపుకు మోసుకు పోయారుట డూబే బేచి.
తిరిగొచ్చిన తరువాత వీడి ఆనందం చూడాలి. ఆంధ్రా నదుల సౌందర్యాన్ని తిక్కన కన్నా ఎక్కువగా పొగిడేశాడు. వీడియో తీసాట్ట గాని.. విడిగా ఫీజేదో అదనంగా ఎందుక్కట్టాలని ఆర్గ్యూ చేసాడని
ఎవడో కెమెరా నీళ్లపాలుచేసేశార్ట! అక్కడికీ పవిత్రస్థలంలో ఫొటోలు తీయడం పాపహేతువని
బుకాయిస్తే పాపపరిహారర్థం పన్నెండు వందలు సమర్పించుకుని చెంపలేసుకొన్నాడుట కూడా! తిప్పలెన్ని పడ్డా 'దిస్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ మెరికల్స్' అని అమెరికాపోయిందాకా తెల్లదొర ఒహటే మురిసిపోవడమే విశేషం.
మూడో రోజే చిట్టబ్బాయ్ నుంచి ఫోన్. చిటపటలాడిపోతున్నాడు. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! గోదారికి దారి తెలీకపోతే కనుక్కోవచ్చుగా! మూసీ నదిలో మునకలేయిస్తార్రా మా తెల్లబాసుని! అదే గోదారనుకుని పాపం మా అందరి కోసం
పాతికసార్లు మురికినీళ్లలో మునకలేసాట్ట గదా!
ఇప్పుడు పడిశం పట్టుకుంది. మూసిన కన్ను తెరవడంలేదు. 'మిరకల్.. మిరకల్' అంటూ కలవరిస్తున్నాడు పాపం, మానవుడు!' అంటూ తిట్టిపోసాడు మాధవగాడు.
డూబే మోసం అర్థమయింది. బ్యాంకుల్లో ముంచడం తెలుసుగానీ, ఇట్లా రివర్ బ్యాంకుల్లో ముంచినట్లు వినడం ఇదే మొదటిసారి.
గోరు తడవకుండా గోదావరి స్నానమంటూ ఇదేంటో మరి?!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబర్
ఎంతకీ కలవదే!
'మళ్లీ పుష్కరాల వరకు మనకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు ఆ మధ్య కనబడ్డప్పుడు. జరిగినదంతా చెప్పి చొక్కా పట్టుకు జగడానికి దిగబోతే 'వాడికి జాతకంలొ జలగండం ఉందన్నారుగా! నేనూ.. ఆ డూబేగాడు కేవలం నిమిత్తమాత్రులం.. అంతే' అంటూ కాలరు విడిపించుకుని దర్జాగా వెళ్లిపోయాడు
మిత్ర్రుడు.
కర్లపాలెం హనుమంతరావు
01 -09 -2020
***
(ఈనాడు దినపత్రిక 08 -07 -2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)
No comments:
Post a Comment