ఆధునిక
తెలుగు కథానిక పుట్టుక తేదీ ఇటీవలదే అయినా దాని దారుఢ్యం మాత్రం ఎన్నదగినదే.
ప్రాక్ దిశలో పశ్చిమపు పోకడలతో పుట్టి ఎదిగిన కథలకు ఎన్నదగిన కథకులు ఎంతో మంది
ఉన్నప్పటికీ, గత శతాబ్ది అర్థభాగంలోనే పటిష్టమైన కథానిక సృష్టించడం
ద్వారా తెలుగు కథానిక చేవ ప్రపంచానికి తెలియపరిచిన విశిష్ట కథకుడిగా పాలగుమ్మి
పద్మరాజును గుర్తుంచుకోక తప్పదు. మార్గం, భాష, భావం, కథావస్తువు, శిల్పం.. అన్నింటా ఒక విలక్షణత ప్రదర్శించడం పద్మరాజు కలం
బలం. మానవత్వాన్ని, అతిలోక భావాన్ని, మనస్తత్వమర్మాన్ని, తాత్విక సూత్రాన్ని ఒకే పాయగా ఆల్లగల సమర్థుడు. సాధారణంగా
పండితులను మెప్పించే రచనలు పామరులకు రుచించవు. పామరులకు మురిపించే రాతల పండితుల
ప్రశంసలకు నోచుకోవు. పద్మరాజుగారి రచనల్లా ఇద్దరి మనసులను ఒకే విధంగా చూరగొనడం
చాలా అరుదైన విశేషం తెలుగు కథానిక వరకు.. ఇప్పటి లెక్కల్లో చూసుకున్నా. రంజన, మేలుకొలుపులతో సరిపుచ్చుకోకుండా పాలగుమ్మిగారి కథలు చదివిన
చాలా కాలం దాకా మనసును వదిలిపెట్టకుండా వెంటాడుతుండటం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ
విశేషం. వ్యక్తిగత సంస్కారం, మేథోగత ప్రతిభ, మానవత్వాన్ని సహృదయంతో అర్థం చేసుకునే ఆర్తి కలగలిస్తే రచన
ఎలా పండుతుందో పద్మరాజుగారి రచనలను చూస్తే అర్థమవుతుంది. భారతీయత మీద మమకారం
వదులుకోకుండానే పాశ్చాత్య సంస్కృతి పట్ల ఎట్లా అభిమానం పెంచుకోవచ్చో పద్మరాజుగారి
అక్షరాన్ని చూస్తే అర్థమవుతుంది.
ప్రాచీనతను ద్వేషించకుండానే ఆధునికతను ఎట్లా ఆదరించవచ్చో ఆయన భావాలు పాఠాలులా
వివరిస్తాయి. వేదాన్ని విజ్ఞాన్నశాస్త్రంలా, విజ్ఞానశాస్త్రాన్ని
వేదంలా సమదృష్టితో సమన్వయించే బుద్ధి పాలగుమ్మివారి రచనలు మనకు నేర్పుతాయి. ప్రపంచ
రాజకీయానికి, పంచాయితీ బోర్డు తీర్మానికి పద్మరాహుగారిలా ఒకే తరహా
ప్రాథాన్యత కల్పించగలడం ఎంతో అభ్యసించి పట్టుకోవలసిన విద్య. సమాజ పరిణామాన్ని
తర్కబుద్ధితో పరిశీలించి తీర్మానానికి రావడం, ఆర్థిక, సాంఘిక, కళా రంగాల
సిద్ధాంతాలు ఏవైనా సామాన్య మానవుడు మాత్రమే వాటికి కేంద్రకంగా ఉండాలన్న భావన బలంగా
ఉండడం సమాజాలను వ్యాఖ్యానించేందుకు కలం పట్టుకున్న ఆలోచనశీలికి అవసరం అన్న విశ్వాసం
కల రచయిత పద్మరాజు. ఉద్యమాలు, నాగరికతల్లో
పరిణామాలు వంటి తీవ్ర ప్రభావం చూపించే సంఘటనల వెనక మానవీయ కోణం ఎన్నడూ వీడకూడదన్న
ఆలోచనాపరుడు పద్మరాజు. ఆయన కలం నుంచి జాలువారిన ఏ రచన అయినా అటు పండితులతో సమానంగా
పామరులను, రసజ్ఞులతో సమంగా శాస్త్రజ్ఞులను అలరింఛడంలోని రహస్యం కూడా
అదే కావచ్చు.
కళ
కళ కోసమే అన్న సిద్ధాంతంలో పద్మరాజుగారికి బొత్తిగా నమ్మకం లేదు. సాహిత్యానికి
ప్రయోజనం ఉండాలంటూనే ఆ ప్రయోజనం సామాన్యుడికి హితవు చేకూర్చేలా ఉండాలన్నది
పద్మరాజుగారి అభిప్రాయం. ఈ హితవు అనే విషయం దగ్గరే సమాజంలో పేచీ. సుఖభోగం ఒక స్థాయి మీరి మరిగితే ఆరోగ్యానికి
హానికరమని తెలిసీ అవకాశం అందివస్తే
అనుభవించేందుకు సంకోచించని సంకుచిత మనస్తత్వం మామూలు మనిషిది. ఉప్పు కారాలు వంటికి
పడవని తెలిసీ ఆ రుచుల కోసమే అర్రులుచాచే మదుమేహం, రక్తపీడనం
రోగులకు వైద్యుడు మాత్రమే ఏ మోతాదులో అవి వాడితే అపాయం చెయ్యవో చెయ్యగలిగేది. ఆ
వైద్యుడి పాత్ర సమాజంలో మామూలు మనిషి హితం పట్ల నెరవేర్చవలసిన బాధ్యతనే కళారంగం
తరుఫు నుంచి మనం హితవుగా నిర్వచనం చెప్పుకోవచ్చు. స్వార్థప్రయోజనాల కోసమై
సమాజానికి చెరుపు చేసే రచయితను పాలగుమ్మి ఏ రోజూ
ఆమోదించింది లేదు. ఏ అంశాన్నీ అంతిమ తీర్పుగా వెలువరించడం పరిణతి గలిగిన
రచయిత చేసే పనికాదు. పరిణామశీలమైన సమాజంలో కాలనుగుణంగా జరిగే మార్పుల మధ్య జీవిక
గడపక తప్పని సామాన్యుడి హీతాహితాలు లక్ష్యాలను బట్టి మారుతుంటాయని తెలియని రచయిత
ఒక రాజకీయవేత్త తరహాలోనో, ఆధ్యాత్మిక గురువు తరహాలో బోధించడాన్ని పద్మరాజు
తప్పుపడతాడు. నిష్పాక్షికమైన శాస్త్రీయ దృష్టే తప్ప అంతిమ సత్యం అంటూ ఏదో ఉండదన్న
భావం బలంగా గల కళాస్రష్ట పద్మరాజు. 'రాజకీయాలలోగా
సాహిత్యం పందిమంది మీద సమిష్టిగా నడుపవలసిన ఉద్యమం కాదు. ఫలానా రచన రాయాలని పదిమంది కూర్చుని తీర్మానించిన కారణం చేత మంచి కవిత్వం
రాదు. తక్కిన ఉద్యమాలకు గమ్యస్థానం ముందు నిర్ణయమవుతుంది. కాని ఒక్కొక్క రచయిత
ఒక్కొక్క పద్ధతిగా రాసి పడేసిన తరువాత గాని ఒక రూపం ఏర్పడదు' అంటారు పద్మరాజు.
ఏకాలపు
విశ్వాసాలను ఆ కాలపు విశ్వాసాల నుంచి విడదీసి చూడడం పొరపాటు అన్న భావనా కలవాడు
పద్మరాజు. విశ్వాసాలు విలువ స్థిరంగా ఉండదు. విశ్వాసం మారినంత మాత్రాన పాత
విశ్వాసం విలువలేనిది అయిపోదు. పాత కొత్తల విశ్వాసాల మధ్య గల సంబంధాన్ని గురించి
వివరిస్తూ చెప్పిన ఉదాహరణ విస్మరించలేనిది.'ఒక రాజు
రాజ్య చెయ్యడమనే పద్ధితి నవీనయుగంలో
వెగటుగా అనిపిస్తుంది. అతను కూడా రక్తమాంసాలతో ఉన్న మానవుడని,
దేవుడు ఎంత మాత్రం కాదని మనకు
తెలిసిపోయింది. కాని, ఒకానొక కాలంలో రాజు దేవుడు అనుకోవడం సహజమని, ఆనాటి నాగరికతకు అది అవసరమని, దాని వల్ల సంఘ
చరిత్రకు పునాది ఏర్పడిందని మనం గుర్తించాలి' అంటాడు.
వ్యక్తిని, సంఘాన్ని, చరిత్రను
పద్మరాజులా హేతువాద బుద్ధితో అవలోకించకగల పరిణతి ఉన్నప్పుడే కథా ప్రక్రియ నుంచి
సంఘ సంస్కరణ వరకు ధృఢమైన సాధికార ప్రకటనలు చెయ్యగలిగే శక్తి అబ్బేది.
పద్మరాజుగారి
వ్యక్తిత్వం అనేక పొరల పేర్పు. చిన్నతనంలో సంస్కృతం నేర్చుకుని ఆశుకవిత్వం
చెప్పడం మీద అనురక్తి ప్రదర్శించిన ప్రతిభ
క్రమంగా రాడికల్ భావాల దిశగా ప్రస్థానించిన వైనం ఆశ్చర్య కలిగిస్తుంది. పద్మరాజు
రాసిన 'పురుటిపాట; ఇప్పటికీ
పండిత పామరులకు ఆశ్చర్యానందాలలో ముంచెత్తే ఆద్భుత కవిత. గొప్ప కవిత్వం రాయగలిగిన
కలం గొప్ప వచనం రాసే సందర్భాలు తెలుగుసాహిత్యంలో అరుదు. ఆ అరుదైన ప్రతిభ మనం
పద్మరాజుగారిలో చూస్తాం. కానీ పాలగుమ్మివారి కలం ఎక్కువ కవిత్వానికి నోచుకోలేదు.
గొప్ప భావుకత కలిగివుండీ కవిత్వం మీద ఆట్టే దృష్టి పెట్టని పాలగుమ్మివారు
విమర్శకుల సందేహానికి తన ఒకానొక వ్యాసంలో సమాధానంలా చెబుతూ 'పద్య కవిత్వంలో వ్యక్తమయ్యే వాంఛలన్నీ సామాన్య జీవితంలో
పొందలేనివి. పద్యాలలో కవి పరాయివాడి
భార్యను ప్రేమించవచ్చును. నగ్న స్త్రీని వర్ణించవచ్చును. స్వప్నానుభవానికి పద్య కవిత్వం దగ్గరగా
పోలివుంటుంది. ఒక్క పద్య కవిత్వానికే కాదు, ఊహాప్రధానమైనదీ, వాస్తవికమైన భూమికను విడిచి విహరించే సాహిత్యాని కంతకీ ఇది
వర్తిస్తుంది. కవిత్వం వ్యక్తిగతమైనది. ఎవరి మట్టుకు వాళ్ల అవసరాలను తీర్చడంలో
కవిత్వ ప్రయోజనం ఆగిపోతుంది. కానీ వాస్తవిక రచన వస్తు స్వభావాన్ని మనకు
వ్యక్తీకరిస్తుంది. విశాలమైన అనుభవాన్ని ఇస్తుంది. మనలోనూ, మనం చూసే అనేకమందిలోనూ ఏయే మూల తత్వాలు పనిచేస్తున్నాయో
మనకు నిరూపిస్తుంది. వాస్తవికత ఊహా కవిత్వానికంటే ఎక్కువ పరిణతిని సూచిస్తుందని
శాస్త్రజ్ఞులు అంటారు. అందుకనే ఒక మేధావి సాహసించి అన్నాడుః ముందు యుగంలో అంతకంతకు
పద్యరచన పడిపోయి గద్యరచనే ప్రాధ్యాన్యత వహిస్తుంది- అని'. పద్యరచనను దాటి ఇలా గద్య రచనకు మారిన తరువాత కథలు రాయడం
మొదలుపెట్టాడు. కానీ తమాషా ఏమిటంటే పద్య రచనలో పద్మరాజుకు గల అభినివేశమే ఆయన
గద్యరచనకూ అమితమైన శోభ, సంస్కారాలను అలవర్చింది! ఆయన గద్యం నడకలోని తూగు, హొయలు పద్యకవిత్వం ప్రసాదించిన ప్రసాదగుణాల ఫలితమే. ప్రథమ
పురుషలో రాసిన నాటికలకు అశేషమైన ఆధరణ అభించింది. అసలు పద్మరాజుగారు
తెలుగుసాహిత్యంలో స్థిరపడాలనుకున్నది నాటికా రచయితగానే. కానీ విచిత్రంగా అయనను
తెలుగు సాహిత్యం చివరకు గొప్ప కథారచయితగా స్థిరపరుచుకుంది!
'చెట్లు అలసటగా
నిలబడి ఆకాశంలోకి చూస్తున్నాయి. లోకం ఏదో చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్లు
దీనంగా ఉంది. అయినా చెట్ల మీద్ ఆకులు ముదురుతున్నాయి. గోధుమ రంగు పొలాల్లో
అక్కడక్కడా ఆకుమళ్లు … కనబడుతున్నాయి. గాలిలో మెల్లనిదాహం ప్రాణుల్నిమత్తులో
ముంచెత్తుతోంది. కావుమనలేక కాకులు ఒంటి కన్ను చూపులు అటూ ఇటూ చూస్తున్నాయి.
కూలివాళ్లు తిండి తిని మెల్లగా గిన్నెలు
కడుక్కున్నారు. గట్టు మీద ఉన్న చింతచెట్టు మొదట్లో చుట్టూ కూర్చున్నారు.
తలగుడ్డలలో నుంచి రొంటి నుంచి పొగాకు తీసి కొంచెం నీళ్ళతో తడిపి చుట్టలు
చుట్టుకున్నారు'. 'కూలి జనం' అనే
పాలగుమ్మివారి చిన్ని కథానికలోనిది ఈ దృశ్యం. గ్రామీణ వాతావరణం నేపథ్యంగా రాసిన ఈ కథ తతిమ్మా భాగమంతా
ఇట్లాగే సహజంగా, చెయితిరిగిన ఓ కవి రాసిన కథ మాదిరి కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది! పల్లీయుల సహజమైన
జీవితాలను కళాత్మకమైన కథలుగా మలచిన అతి కొద్దిమంది ఆ నాటి ప్రముఖ కథకులలో పాలగుమ్మి మొదటి వరసలో ఉంటారు.
ఈ కథానిక ఉన్న సంకలనానికి కీ.శే బుర్రా వెంకట సుబ్రహ్మణ్యంగారు ముందుమాటా రాస్తూ 'నేనెరిగున్నంత వరకు
పల్లెజీవితం గురించి సహజంగానూ, అభిమానంగానూ తెలుగు భాషలో వ్రాసే క్రొత్త కథకులలో
పద్మరాజుగారే ముఖ్యుడని నా ఉద్దేశం. ఆయన మన కథకులలో కెల్లా శక్తిమంతుడని
నేననుకుంటూ ఉంటాను'అని కితాబిచ్చారు. ఈ తరహా ప్రశంసలు పద్మరాజు ఈ ఏడు, ఎనిమిది దశాబ్దాలుగా ఎంత మంది కొత్త కథకులు వచ్చినా
అందుకోవడం ఆగడమేలేదు!
పద్మరాజుగారి
కథల విశిష్టతకు 'ఎదురు చూసిన ముహూర్తం' మరో మంచి
ఉదాహరణ. ఆ తరహా స్త్రీలే భూమ్మీద ఈ కాలంలో
కూడా మన మధ్య మసలుతున్నారన్నట్లు సూచనప్రాయంగా కథకుడు పాత్రలను మలచిన తీరు అప్పటి
కథాపాఠకులకు పరిచయం కాని అపూర్వమైన అంశం.
పద్మరాజు ఆ కథలోని శాంత అనే ముఖ్య
పాత్రను మలచేందుకు ప్రదర్శించిన సాహసం ప్రశంసనీయంగా ఉంటుంది. మనం మరచిన మనలోని మరో
మనిషిని పోతపోసి మన కంటి ముందు నిలబెట్టిన గొప్ప పనితనం పద్మరాజు ప్రదర్శించారా కథానికలో. రచయిత ఊహల్లో
నుంచే పుట్టినా పాత్ర పాఠకుడి ఆలోచనలను కలియబెడితే.. నిస్సందేహంగా ఆ పాత్ర ఉన్న కథానిక నాలుగు కథల నుంచి
ప్రత్యేకంగా తీసి పెట్టుకోదగ్గదే అవుందంటారు ఉత్తమ కథానికకు ఉండవలసిన లక్షణాలను
గురించి ప్రస్తావించే ఓ సందర్భంలో కొడవటిగంటి ఒకానొక వ్యాసంలో. ఆ ప్రమాణాల రీత్యా పాలగుమ్మి వారి ఎదురు చూసిన
ముహూర్తంలో ఏముందో ఒకసారి ముఖ్యమైన అంశాన్ని పట్టి చూస్తే గాని అనుభవానికి రాదు.
కథలోని ముఖ్య పాత్ర శాంతకు స్వతహాగా తానో
అపురూపమైన స్త్రీనన్న భావన అంతర్గతంగా బలంగా ఉంటుంది. వాచ్యంగా ఆమె ఎప్పుడూ బైటకు
తేలకపోయినా ఏదో ఒక ఊహించని ఘట్టం తన జీవితంలో తారసపడి తనను అతలాకుతలం చూస్తుందన్న
గాఢమైన నమ్మకం మాత్రం వదులుకోలేని బలహీనత. కళాశాలలో చేరినప్పటి నుంచి చుట్టూ ఉన్న
పాత్రలలో ఏదో ఒక పాత్రతో తనకు అనిర్వచనీయమైన అనుభవం కలగబోతున్నట్లు.. ఆ అనుభవం
కోసం తాను ఎదురుచూస్తుంటుంది. కానీ ఏ ముఖ్యమైన సంఘటన జరగకుండానే కళాశాల జీవితం
ముగిసిపోవడం, తన వివాహం వైద్యం చదువుకొనే వ్యక్తితో నిశ్చయం కావడం జరిగిపోతుంది. భర్త మామూలు మగవాడు
కాబట్టి అతని నుంచి అపూర్వానుభవం ఆమె ఏనాడూ ఆశించింది లేదు. అలాగాని సంసారంలో
సుఖశాంతులకు కొరవ ఏర్పడిందనీ కాదు. ఇతమిత్థమని తెలియనై ఒకానొక అపూర్వానుభవానికి
తాను ఎంతగా మానసికంగా సంసిద్ధమయి ఉన్నప్పటికి ఎన్నటికి ఆ అపూర్వ ఘట్టం
సంభవించకుండానే గడచిపోతుందేమోనన్న బెంగ బయలుదేరిన సమయంలో ఊహించని పాత్ర భర్త
తమ్ముడు వెంకటం రూపంలో ఆమె మానసిక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. వెంకటం వ్యక్తిత్వం
రీత్యా సక్రమమైన వాడు కాదని, అతనికి
స్త్రీలతో సావాసాలు ఎక్కువని తోడికోడలు ద్వారా విన్నప్పటి బట్టి అమెలో అతని పట్ల
ఒక రకమైన ఆసక్తి , అసహ్యం రెండూ కలగాపులగంగా కదలడం మొదలవుతాయి. తానిక సంభవం
కాదనుకునే సంఘటన ఏదో ఈ వెంకటం ద్వారా కలగబోతుందేమోనన్న భావోద్వేగంలో నిత్యం
కొట్టుమిట్టాడుతున్న దశలో అతగాడు రచయితగా సృష్టించిన కొన్ని కథల్లోని స్త్రీల
వ్యక్తిత్వం పట్ల ఆమెకు జుగుప్స కలుగుతుంది. వ్యభిచారి కాని వాడు ఈ తరహా కథలను
సృష్టించలేడన్న అభిప్రాయం కూడా బలమైన సందర్భంలో వెంకటం కథలను గురించి భర్తతో
వాదనలకు దిగబోయి దాదాపు కయ్యానికి దిగినంత పనిచేస్తుంది. ఒకానొక్ సందర్భంలో ఆమెకు
వెంకటంతోనే నేరుగా ముఖాముఖీ తలపడాల్సిన పరిస్థితి తటస్థించినప్పుడు తానింతకాలం
ఎదురుచూస్తున్న ముహూర్తం ఇప్పుడు వచ్చేసినట్లే దాదాపుగా భావిస్తుంది శాంత. భర్త
ఇంట లేని సమయంలో మరది పక్కగదిలో కథ రాసుకుంటూ కలం కోసం తను వంటరిగా ఉన్న గదిలోకి
రాత్రివేళ రావడం.. ఆమె ఎప్పటి నుంచో ఊహిస్తూ వచ్చిన ఒకానొక రూపంలేని భావానికి రూపం
వచ్చినట్లు భావించి తన వంతు పాత్ర నిరసన పాత్ర పోషించేందుకు ఆమె మానసికంగా
సంసిద్ధమయిపోతుంది. కానీ వెంకటం తాను భావించినంత లాలసుడు కాదని ఆ సమయంలో అతనితో అనుకోకుండా
జరిగిన సుదీర్ఘ సంభాషణ ద్వారా తేలిపోతుంది. వెంకటమే జోక్యం చేసుకుని ఈ ముడి
విప్పేస్తాడు. లోకంలోని చాలా మంది స్త్రీలు అసంభవమని తెలిసుండీ సంభవమవుతున్నట్లు
కొన్ని అకార్యాలు తమకు జరుగుతున్నాయని భావనాత్మకంగా నిత్యం ఆందోళన చెందుతుంటారని, నిజానికి ఎప్పుడో తప్ప ఎక్కడో తప్ప ఎవరో ఒక్క
అదృష్టవంతురాలికి ఆ తరహా అనుభవం ఎదురుగాదని, ఎదురుచూసిన
ముహూర్తం ఎంతకీ అనుభవానికి రాని కారణాన మానసికంగా జడత్వం ఆవహించి భాహ్యరూపంలో అది
ఏ గయ్యాళితనానికో దారి తీస్తుందని వెంకటం వాదించి శాంతను కలవరపరుస్తాడు. వెంకటం తన
ఒకానొక కథలో మలసిచిన విధంగా మంచి
పురుషుడితో పరిచయం కోసం వెంపర్లాడిన ఒక స్త్రీ అది సంభవం కాక,
చివరికి క్రైస్తవం స్వీకరించి నన్
గా మారి ఒక కాన్వెంట్లో సన్యాసినిగా చేరిపోయి పసిపిల్లల పట్ల అతి
కౄరంగా ప్రవర్తించినట్లు తానూ చివరి రోజుల్లో మారిపోతుందేమోనన్న భయంతో శాంత తనను తాను
సరిదిద్దుకునే ప్రయత్నంతో కథ ముగుస్తుంది.
ఎన్నెన్నో పాత్రల మధ్య కథ నడుస్తున్నా, కథ ఎక్కడా
శాంత మీద నుంచి కాని, వెంకటం మీద నుంచి కాని పక్కకు పోకుండా ఉండటం, శాంత తన హృదయాన్నిఆవిష్కరించుకునే తీరులో ఎక్కడా పాఠకుడికి
గందరగోళం లేకుండా ఉండడం కాని, కథను నడిపించేందుకు
రచయితగా పద్మరాజు ఎన్నుకున్న సంఘటనల్లో ఆసక్తి, ఉత్కంఠ పాళ్లు
తగ్గకపోవడం కాని, సంభాషణలు క్రిస్ప్ గా నడిచిన తీరు గాని, పదాలను ఎంచుకున్న భావజ్ఞత గాని, అత్యంత సంక్లిష్ణమయిన ఘట్టాలను కూడా సంక్షిప్తంగా ఉంచుతూనే
అప్తత పాళ్లు తగ్గకుండా కథనం నడిచిన ధోరణ గాని.. ఇట్లా ఎన్నో కోణాలలో 'ఎదురు చూసిన ముహూర్తం' ఎంతో చెయ్యి
తిరిగితే తప్ప కథకుడు కథాప్రయోజనం దెబ్బతినకుండా ఉత్తమ విధానంలో నడిపించడం
సాధ్యమయే నైపుణ్యం కాదు.
ఇదే
తరహాలో పద్మరాజుగారి కలం నుండి జాలువారిన పడవ ప్రయాణం, కుర్రతనామా? మానవ స్వభావమా? లాంటి ఎన్నో కథానికలను ఉత్తమ కథల జాబితాలోకి నిస్సందేహంగా
చోటీయవచ్చు. పట్నవాసపు అల్లుడుగారు, అత్తారిల్లున్న
పల్లెకు వస్తే ఎట్లాంటి విచిత్రమైన ఊహలు వస్తాయో మనస్తత్వశాస్త్ర పాఠ్యాంశంలా
పద్మరాజుగారు చెప్పే విధానం విస్తుగొలిపిస్తుంది.
ప్రపంచ
కథానికల పోటీలో రెండవ బహుమతి పొంది పలు భాషలలోకి అనువాదం చెందిన 'గాలివాన' ను గురించి ఇప్పటికే ఎంతో మంది ఎన్నో వేదికల మీద పొగడ్తలతో
ముంచెత్తేసారు, ప్రత్యేకంగా ప్రస్తావించుకునేటంత విస్తారమైన సమాచారం ఉన్న
గాలివానను గురించి అందుకే ప్రస్తుతానికి ప్రస్తావించే ప్రయత్నం చేయడం లేదు. కానీ, స్థూలంగా ఒకటి రెండు ముఖ్యాంశాలనైనా ప్రస్తావించకుండా
వదిలేయడం భావ్యమూ కాదు. గాలివాన కథకు బహమతి వచ్చిన తరువాత జరిగిన ఒకానొక రచయితల
సమావేశంలో 'గాలివాన కథకు బహుమతి సాధించి పెట్టిన ప్రత్యేకాంశాలు మీ
దృష్టిలో ఏమిటి' అన్న ప్రశ్న ఎదురైనప్పుడు రచయిత ఇచ్చిన సమాధానం
గుర్తుచేసుకుని వదిలేయడం ధర్మం. బిహేవిరియల్ కోణాన్ని ప్రధానాంశంగా తీసుకుని రాసిన
కథానికకు అన్ని వడపోతల తరువాత ఎన్నో స్థాయిలు దాటి ఆఖరుకు ప్రపంచ ఉత్తమ కథానికల
సరసన స్థానం చేయించుకున్న తరువాత ఆసక్తి కలవాళ్లు స్వయంగా కథను చదివి
మదింపువేసుకోవడం ధర్మం అవుతుంది. సృష్టించిన రచయితను పట్టుకుని ఇప్పుడు దానికి
విలువ కట్టమనడం … ఎన్నిక చేసిన విమర్శకులందరి విజ్ఞతను తిరిగి బోనులో నిలబెట్టిన
చందమవుతుంద'ని సమాధానం ఇచ్చారు.
గాలివాన
కథలోని ప్రధాన పాత్ర రావుగారు జీవితంలో కొన్ని నీతి నియమాలకు కట్టుబడ్డ
పెద్దమనిషి. వాటిని అతిక్రమించవలసి వచ్చిన సందర్భాలు గతంలో ఎదురైనప్పుడూ
అతిక్రమించకుండా కట్టుబాటును సాహసంతో అమలు జరపగల నిగ్రహం ఆయనకు ఉంది. నీతినియమాల
పట్ల పిచ్చిపోకడలు లేవు.. కానీ మనిషిని సక్రమ మార్గంలో నడిపించడానికి కొన్ని నిబంధనలు అవసరమని గట్టిగా నమ్మే వ్యక్తి.
రావుగారూ మానవుడే. అతనిలోని మానవీయ కోణం అవసరమైన సందర్భాలలో కొద్దిగా చిన్ని
చిన్ని కట్టుబాట్లను సడలించడానికి అభ్యంతరం ఏమీ చెప్పదు. ఉదాహరణకు పిల్లలకు చిలిపి
చిలిపి కోరికలు ఉంటాయి. అవి తీరిపోతే తాత్కాలికంగా వాళ్లకు కలిగే ఆనందం అపరిమితం.
ఆ తరహా సడలింపుల పట్ల రావుగారికి మూర్ఖ్యత్వం ఏమీ లేదు. ఇట్లాంటివి కాకుండా జీవితంలోని సీరియన్ అంశాల
పట్ల మాత్రం ఆయన అభిప్రాయాలు చాలా గాఢమైన పట్టుదల కలిగిఉంటాయి. ఒక్క ముక్కలో
చెప్పాలంటే ఆయన ఒక వేదాంతి. దానికి తోడు గొప్ప వక్త. ఆయనకొక సిద్ధాంతం ఉంది.
వేదాంతం జీవితం తోటే, జీవన విధానం తోటే, వ్యక్తికీ
సంఘానికి ఏర్పడే రకరకాల సంబంధాలతోటే ముడిపడివుంటుందనేది ఆయన వాదం. వేదాంతానికి, మరణానికి, నిశితమయిన
అనుభవాలకి అతీతమైన విషయాలతో సంబంధం ఏమీ లేదు. ఇటువంటి అభిప్రాయాలు గల రావుగారు
ఒకసారి రైలులో ప్రయాణం చేస్తున్నారు. మార్గామధ్యంలో తుఫానులాంటి గాలివాన వచ్చింది.
ఏవో కౄర శక్తులు విజృంభించి మానవ నిర్మితాలు, ప్రకృతి
సహజాతాలు అన్న భేదం లేకుండా భూమ్మీద ఉన్నవన్నీరూపుమాపడానికి పూనుకున్నట్లు
వాతావరణం మారిపోయింది. ఆ గందరగోళంలో రావుగారు నమ్ముకున్న వేదాంతం ఏది ఆయనకు ఉపశమనం
కలిగించలేకపోయింది. సరిగ్గా అటువంటి సందర్భంలో అతగాడికి ఒక ముష్టిమనిషి
తటస్థపడింది. ముఫ్ఫై ఏళ్లుంటాయా మనిషికి. చాలా చిత్రమైన వేదాంతం మాట్లాడుతుంది.
ఎంతటి వాళ్లనైనా సరే ఆమె తన మాటల్తో కిందా మీదా పెట్టేయగలదు. ఆమెకు మనసులో వేటి మీదా
అంత లోతైన ఇష్టాఇష్టాలు ఉండవు. జరుగుతున్న క్షణంతోనే ఆమెకు సజీవమైన సంబంధం.
గతకాలపు స్మృతుల బరువు గాని, భావికి
సంబంధించిన ఆశల భారంగాని లేని మనసు. మనిషి నడవడికను నిర్దేశించే సూత్రాలేవి ఆమె
ఏర్పరుచుకోలేదు. విధి నిషేధాలు వగైరాలు గాని, ధర్మాధర్మ
చింతలతో బాధపడే అంతరాత్మగాని, నాగరికులకు
సహజమైన సంక్లిష్టత గాని లేని మనస్తత్వం ఆమెది. ముఖమైనా ఎరగని మగవాడికి దేహార్పణ
చేసి తేలికైన మనసుతో సుఖించగల మనస్తత్వం. ఆ మనిషికి రావుగారికి రైలులో ఓ కాని
డబ్బు ఇచ్చేందుకైనా మనసొప్పింది కాదు. బిచ్చమెత్తుకుని జీవించడం మీద సదభిప్రాయం
లేకపోవడమే కారణం. కానీ రైలు దిగే సమయం వచ్చేసరికి సామాను దించే సాయమవసరానికి ఆ
మనిషే అవసరమయింది! రాత్రంతా ఆయన స్టేషన్ వెయిటింగ్ రూంలోనే గడపవలసి వచ్చింది.
గాలివాన అంతకంతకు తీవ్రమవుతూ వచ్చింది. ముష్టి మనిషి భౌతిక దేహాన్ని చూస్తే
రావుగారికి తగని అసహ్యం. కానీ ఆ భయంకరమైన రాత్రివేళ ఆమే తనకు గొప్ప తోడు
అనిపించింది మొదటిసారి. గాలి విసురుకు గది తలుపు ఊడిపడేసరికి ఆ భయకంపనలో ఆమెను
హఠాత్తుగా కరుచుకున్నారు రావుగారు. ఆపాదమస్తకం వణికే ఆ ప్రాణికి ఆమె కౌగిలి
వెచ్చదనం గొప్ప సాంత్వన భావం కలిగించినమాట నిజం. ఆ క్షణంలో ముష్టి మని నోటితో ఒక
గొప్ప మాట పలకించి భారతీయ తాత్వికతకు ఉందని చెప్పుకునే ఉదాత్తతను చాటిచెప్పారు. 'బాబుగారికి చక్కని కూతుళ్లుండుంటారు ఇంటి కాడ. బాబుగారు
ఆరిని తలుచుకుంటున్నాడు' .
ఈ మాటలని ఆమె తన గొడవలు కూడా చెప్పుకుంటుంది. ఒక
మానవహృదయంలో నుంచి వెలువడ్డ ఆ మాటలన్నీ వింటున్నప్పుడు రావుగారు తన చుట్టూ కట్టుకున్న గోడలన్ని మాయమవుతున్నట్లు
భావిస్తారు. భయంకరమైన ఆ తుఫానులో ఇద్దరి శరీరాలు ఆలసి నిద్రలోకి జారుకుంటాయి.
గాలివాన వెలసిపోయింది. నిద్ర నుంచి లేచిన రావుగారికి ఎదుట ఉండవలసిన ముష్టిమనిషి
కనిపించలేదు.గదిలో నుంచి వచ్చి చూస్తే టిక్కెట్లు అమ్మే గదిలో ఆమె సామానుల కింద
పడి చచ్చిపోయివుంది. రావుగారికి చిన్నపిల్లవాడికి మల్లే ఏడుపు తన్నుకురావడమే ఈ
కథలో హైలైట్!
ఆమె
చేతిలో తన పర్స్ ఉంది! కానీ.. కానీ బిడ్డ చేతిలో తండ్రి ఆస్తి వలె దాన్ని
భావించాడేమో.. మనసులో కూడా దూషించాలన్న ఆలోచన రాలేదు. ముష్టిపిల్ల కొంటెతనాలు, చిలిపిమాటలు రావుగారిలోని ఈ మానసిక వికాసానికి దోహదాలు
అయ్యాయి. ఆమె మృత్యువాత పడ్డ క్షణం గాలివాన వచ్చినప్పటి కన్నా ఎక్కువ బాధ
కలిగించిందిప్పుడు రావుగారిలో. జీవిత వేదాంతంలోని నిఖర్సైన సారం అక్షరం ముక్క రాని
దిక్కులేని పిల్ల ఒక మహామేధావికి ఈ విధంగా గురువై బోధించడమే ఈ కథానికను ప్రపంచ
సాహిత్యంలో మన్నికయిన రచనగా ఎన్నిక చేసింది. తన ఆత్మీయురాలి దగ్గర ఆఖరి క్షణాలలో
తన తాలూకు ఏదైనా ఒక గుర్తు మిగిలివుండాలన్నంత తపన రావుగారిలో ఆవేశించిన తరువాత
మనీపర్స్ ను అలాగే ఉంచి.. అమె మీద ఆఖరు క్షణంలో దొంగ ముద్ర పడకూడదన్న జాగ్రత్తతో
కేవలం తన తాలూకు గుర్తులున్న కాగితం మాత్రం తీసుకుని వచ్చేస్తారు రావుగారు.
మానవుడు తనకు తానుగా ఏర్పరుచుకొనే నీతినియమాలకు.. వాటిని ఆచరించే సమయ సందర్భాలలో
ఎదురయ్యే ద్వైదీభావానికి గాలివాన కథానిక ఒక సూచిక వంటి సృజన. ఎన్ని కట్టుబాట్లు ఏర్పరుచుకున్నప్పటికి
చివరికి మనిషి అడుగుపొరలలో పడివుందే ప్రాథమిక మానవీయతదే ఆధిపత్యం అవుతుందనీ ఈ
గాలివాన కథ తెలియచేసే వేదాంతం. ఒడుదుడుకులు లేనప్పుడు మనిషి పలికే నీతిపన్నాలు
కాదు అసలు జీవితసారం. ఉత్పాతం ఎదురయినప్పుడు ఎదుర్కొనే సందర్భంలో అతగాడి అహాన్ని
లొంగదీసుకునే అబ్సొల్యూట్ హ్యూమనిజమే నిజమైన మానవీయవాదమన్న సందేశమూ ఈ కథలో
కనిపిస్తుంది. ధర్మ చింతన, వేదాంతం, సంస్కారం, మనిషి నుంచి మనిషికి పరిస్థితులు స్థాయిని బట్టి విభిన్నంగా
రూపొందినప్పటికీ .. ఆఖరు ఉత్పాతంలో అందరిలో మేల్కొనేది ముడి మానవీయత మాత్రమే అనే
జీవనసూత్రం వివరించేందుకు పద్మరాజు రచించిన ఈ గాలివానకు అన్నివిధాలా అన్ని వర్గాల
నుంచి ఇప్పటికి ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. అతి చిన్నకథలో బహుముఖీనంగా చీలిన
మానవీయత వైరుధ్యాన్ని, తిరిగి అవి సంగమించక తప్పని పరిస్థితుల వాస్తవాన్ని
రావుగారు, ముష్టిపిల్ల, గాలివాన అనే
మూడు కోణాల నుంచి పద్మరాజు పాశ్చాత్య ధోరణిలో ప్రాచ్య నేపథ్యం చెదరకుండా నడిపించడం
వల్ల సార్వజనీనత అసంకల్పితంగా సమకూరింది. కులాసా అయిన మనిషిని ఒక వైపు, అత్యంత గంభీరమైన వ్యక్తిత్వం సంతరించుకున్న మనిషిని మరో
వైపు నిలబెట్టి ఇద్దరి హృదయాలు ఒకే పాయలోకి ప్రవహించే విన్యాసాన్ని పద్మరాజు
ఆద్యంతం ఎక్కడా విసుగు అనేది పుట్టకుండా, ఉత్కంఠ చెదరని
వడుపుతో నడిపించడంతో శిల్పం దృష్ట్యా కూడా
కథ శిఖరాయమానంగా భాసించింది. అత్యంత
అసహజమైన సంఘటనను కల్పించుకుని, ఈ కథలో లాగా
అతి సహజమైన రీతిలో కథనం చెయ్యడం సామాన్య రచయితను బోల్తాకొట్టించే విన్యాసం. సర్కస్
గుడారంలో ఇద్దరు చమత్కారులు ఆకాశంలో పల్టీలు కొడుతూ చేతుల మీద స్థలాలు మార్చుకునే
దృశ్యం చూసినప్పుడు ఎంతటి సంభ్రమానందాలు కలుగుతాయో.. ఈ కథలో అతి గంభీరమైన
రావుగారు.. మాటలతో ఎవరినైనా ఇట్టే బోల్తా కొట్టించేయగల ముష్టిపిల్ల మధ్యల
వ్యక్తిత్వాల మార్పు అంతే సంభ్రమానందాలను కలిగిస్తుంది. వ్యక్తికి వ్యవస్థకుఅడుగున
ఎక్కడో ప్రవహించే సనాతన సార్వజనీన మానవీయతను ఈ కథలో పద్మరాజుగారు నిరూపించారు.
ఆదర్శాల
కోసమో, సామ్యవాద సిద్ధాంతాల విజయం నిరూపించడం కోసమో పాత్రలను
సృష్టించే పద్ధతిని పద్మరాజు ఇష్టపడరు. అట్లాంటి ప్రయత్నం చెయ్యడం రచయిత బలహీనత
అని ఆయనే ఒకానొక సందర్భంలో వ్యాసం ద్వారా చెప్పుకొచ్చారు. పాత్రల పట్ల సానుభూతి కాకుండా కేవలం గౌరవ
మర్యాదలు మాత్రమే చదివే పాఠకుడిలో ప్రేరేపించడం అంటే కథ బోధగురువు పాత్రను మాత్రమే
పోషించిందని అర్థం. గుళ్లో పురాణం వినివచ్చే భక్తులంతా ఆ విధంగా మాత్రమే
నడుచుకుంటారన్న భరోసా ఉండనట్లే, కథ బోధ గురువు
పాత్ర పోషించే రచయిత పాఠకుడి చేర్చాలనుకున్న సందేశం ఉపదేశంలా నిరుపయోగమయిపోయే
ప్రమాదముంది. ఆప్తుడు, స్నేహితుడు పక్కన కూర్చుని కులాసా కబుర్లతో కలిపి చెప్పాలను
కున్నది చెప్పినప్పుడు వినే మనిషికి వద్దన్నా మనసుకు పట్టక తప్పదు. కథ కులాసా
మిత్రుడి పాత్ర పోషించాలని పద్మరాజు భావిస్తారు. 'కథకుడు ఏ వాదీ
కానక్కర్లేదు. కథలోని ధనికుడికి నిష్కారణంగా దుర్మార్గం అంటగట్టినంత మాత్రాన
సామ్యవాదానికి కలిగే ప్రయోజనం ఏముంటుంది? కథ విలువను చంపేసే ఈ తరహా కథలను గోర్కీ చాలా రాశారు.
ఆదర్శాలను ఆత్మగతం చేసుకుని కూడా చనువుగా, చొరవగా
మానవీయతను దర్శింపచేయగలిగినవాడే అసలైన రచయిత' అంటారు
పద్మరాజు. క్లియోపాట్రాను కూడా ప్రేమించగలగడమే షేక్స్పియర్ విశిష్టత. రష్యా
విప్లవం తరువాత కూడా ఆస్తి మీద వ్యామోహం వదులుకోని ధనికులను అర్థంచేసుకోవడమే గోర్కీ
ఘనత.' అన్నది పద్మరాజుకు కథకుల మీద గల అభిప్రాయం.
పద్మరాజు
'వాసనలేని పూలు' ఈ
అభిప్రాయాన్ని స్పష్టపరుస్తుంది. మనసుకు, శరీరానికి
ఉండే సంబంధం పట్ల కూడా కొంత చర్చ చేసే ఈ కథానికలో అలౌకికుడు, కవి అయిన రాజారావు భార్య కొంత కాలం కాపురం తరువాత ఆత్మహత్మ
చేసుకుంటుంది. చనిపోయిన తన భార్యను ఇంటి ముందు వాసన లేకుండా వికసించే పూలతో
పోల్చుకుంటూ కొత్తగా రాసిన ఖండకావ్య సంపుటిలో మానసిక, దైహిక సంబంధాలను గురించి తన ఆలోచనలను బైటపెడతాడు రాజారావు.
విశాలమైన సంస్కారాలు ల్
లేకుండా
ప్రౌఢమైన గాఢవ్యక్తిత్వం కలిగి ఉంటే లౌకికలోకంలో
సహచరిస్తూ సుఖంగా కాపురం ఎవరికైనా అసాధ్యమే. నేను నా భార్యను
ప్రేమించకుండాలేను. కానీ అది ఆమె అభిలషించిన రీతీలో బాహ్య సౌందర్య సౌష్టవాన్ని
చూసి ఆకర్షితుడినయికాదు. ఆధ్యాత్మిక సమానత కోసం తపించే నాకు ఆర్థిక సమానత కోరుకునే
నా భార్యకు సహజంగా మనసులు కలవడం అయింది.
తన ప్రౌఢత్వం నాకు ప్రతిబంధకం అయిందని నా మనసులో ఉన్న మాట తాను పసిగట్టిందో ఏమో..
ఇట్లా భౌతికంగా విడిపోయింది' అన్న అర్థంలో
ఉపోద్ఘాతం రాసుకొస్తాడు. కవిజగత్తులో ఆర్థిక సమానత ఒక సమస్యగా ఉండదు. కానీ వాస్తవ
జీవితంలో దాని తరువాతే అన్నీ. సామ్యవాద మిత్రులందరూ నా జీవితాన్ని ఒక పాఠంగా
స్వీకరిస్తారన్న ఉద్దేశంతోనే చనిపోయిన నా భార్య మీద కూడా నిందాపూర్వకంగా మాట్లాడక
తప్పడంలేదు. తన ఆత్మ వాసన లేని ఒక ఎర్రటి పుష్పంలా అనిపిస్తుంటుంది నాకు
ఎల్లవేళలా. నా వల్ల తన దైహిక జీవనం ఎండిపోయిందో ఏమో తెలీదు. వెళ్లిపోయింది. ఎవరికి
ఏమి కావాలో స్పష్టంగా తెలిసే అవకాశం ఈ లోకంలో ఎప్పుడూ లేదు. ఆమె వెళ్లిపోయిన
తరువాత తనలో నాకు ఇప్పుడు దివ్యత్వం గోచరిస్తుంది' అని బాధను
ప్రకటిస్తాడు రాజారావు. సామ్యవాదలోకంలో ఆదర్శాలను పట్టుకుని వాస్తవ జీవితాన్ని
కష్టపెట్టేవాళ్లందరు గ్రహించవలసిన పాఠం నా జీవితంలో ఉంది'అన్నట్లు బాధపడతాడు రాజారావు. తన ఈ కథపై పద్మరాజు ఒక
సందర్భంలో వ్యాఖ్యానిస్తూ 'ఆధ్యాత్మికవాది అయిన రాజారావు చింత అంతా అన్ని పూలకూ వాసన
సమానంగా అందించే శక్తి లేదనే. వాసనా సంపద అన్ని పూలకూ అసమానంగా ఉండటం ద్వరా
లోకంలోని వస్తుసంపద అసమానతను గురించి చింతించిన భావుకుడు రాజారావు.
సిద్ధాంతాల
ఆధారంగా కథలు రాసినా వాటి విలువ తాత్కాలికమే. కొంత కాలం గడచిన తరువాత అవి ఆ రాసిన
రచయితకే తృప్తినీయవు. ప్రచార సాహిత్యంగా మిగిలిపోయే సాహిత్య సృష్టి వల్ల రచయితకు
శాశ్వతంగా కలిగే లాభం సున్నా- అన్నది పద్మరాజు అభిప్రాయం. పద్మరాజు కథలన్నీ
గమనిస్తే సామాన్యంగా బైటికి తీయదగ్గ ఒక విధానం.. వస్తు వైవిధ్యంలో ఒక రెండు
విరుద్ధ కొసలు అందుకొని వాటి మధ్య
సంఘర్షణను చిత్రించడం, సాధ్యమైతే సహజమైన సమన్వయం సాధించడంగా అర్థం చేసుకోవచ్చు.
ఎదురు చూస్తున్న ముహూర్తం, గాలివాన ఈ కోవకు చెందిన ప్రముఖ రచనలే. కథారచనకు తనను ప్రేరేపించే
వస్తువు, విధానం గురించి ఒక సందర్భంలో పద్మరాజుగారే స్వయంగా
చెప్పుకొచ్చారు. 'గొప్పవిగా ఆమోదించబడిన కథలలోని సారమంతా పురాతనమైదైగానే
ఉండటం గమనార్హం. అనాగరకమైన స్వభావాన్ని చిత్రించేందుకే వాటిలో ప్రాథాన్యం
కల్పించబడింది. ఆ తత్వం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న విజ్ఞానప్రపంచం అడుగునా
కూడా ఉంది. ఎన్ని యుగాలు గడచినా, నమ్మకాలు
మారినా మనకు అర్థంకాని తత్వం ఒకటి ఎప్పుడూ ఒకటి మిగిలే ఉంటుంది. ఆ తత్వానికి మనిషి
తార్కిక బుద్ధికి వ్యత్యాసం ఉండి తీరుతుంది. అటువంటి వ్యత్యాసమే నా కథలకు
మూలవస్తువు. ఒక తీక్షణమయిన వ్యత్యాసాన్ని గుర్తించినప్పుడు గాని నాలో కథ రాయాలన్న
తపన పుట్టదు. అభిరుచిని, విజ్ఞానాన్ని సేకరించి వాటిని వాడుకుంటూ సంఘంలో
ప్రసిద్ధులయిన వారి జీవితాల నుంచి కథలు పుట్టే సావకాశం తక్కువ. వాళ్ల
బుద్ధివికాసమే వాళ్ల మనఃప్రవృత్తులను అణచివుంచుతుంది. ఇక సంఘంలోని మిగిలిన వర్గాలు
పెరుగుతున్న విజ్ఞానం దృష్ట్యా విపరీతమైన పెంకితత్వాన్ని చిత్త ప్రవృత్తులను
ప్రదర్శిస్తాయి. మారే కాలం తాలూకు తత్వం అర్థం చేసుకోలేక మూర్ఖంగా ముందుకు సాగే
వారి జీవితాల నుంచి ఆనందంగా బోలెడన్ని కథలు పుడతాయి. కథారచనకు ప్రధానమైనది కూడా
పెరిగే ఈ నాగరిగత అడుగున్న అసాంస్కృతికత. ఇరువురు విభిన్నమైన వ్యక్తులలోనూ అసాంస్కృతికతంగా మిగిలివున్న ఈ చిత్తప్రవృత్తుల
మధ్య సారూప్యాన్ని కథకుడు నిరూపించగలగాలి. ఎంత చదువుకున్నా, ఎంత అనాగరిక వ్యక్తులలోనైనా మిగిలివున్న అసాంస్కృతికత మనకు
వింతగా అనిపిస్తుంది. అందుచేత కథకులు
అనాగరిక లోకాన్నే పరీక్షించాలి. నాగరిక సంఘంలోని అనాగరికతను గుర్తించాలి. వాటితో
తాదాత్మ్యం పొందితే మంచి కథలు అసంకల్పితంగా ఆవిర్భవిస్తాయి. పద్మరాజుగారి కథలలో
కనిపించే అపురూపమయిన పాత్రల సృష్టికి ఇదీ
కారణం. పాత్రలలో ఏదో ఓ ప్రత్యేకత ఉంటే తప్ప చదువరిని కదలకుండా కూర్చోపెట్టే పట్టు
దొరకదు.
ఉత్తమ
కథకు ఉండవలసిన అనేక మంచి లక్షణాలలో భాష కూడా ఒకటి. భాషలోని విలక్షణత వల్ల పాఠక
పపంచంలోకి వెళ్లే దారి రచయితకు సుగమం అవుతుంది. నోబెల్ బహుమతులకు దీటుగా
సాహిత్యాన్ని సృష్టించిన సోమర్ సెట్ మామ్ భాషాపరంగా విమర్శలపాలయిన విషయం ఇక్కడ
ప్రస్తావనార్హం. ఎడ్మండ్ విల్సన్ అనే సాహిత్య విమర్శకుడి చేత భాష విషయంలో సెకండ్
రేటెడ్ రచయితగా నిందకు గురయిన సందర్భం గుర్తుంచుకోవాలి. వస్తువులో వైవిధ్యం ఉండి, శిల్ప పరంగా సమున్నతమైన స్థాయి కలిగిన కథలూ భాషాపరంగా
పరిణతి ప్రదర్శించని పక్షంలో పాఠకహృదయాలను ఆకట్టుకోవలసినంతగా ఆకట్టుకోలేవు.
ప్రతిభగల రచయితకు భాషా ఎంత ముఖ్యమైన దినుసో అర్థమయింది కాబట్టే పద్మరాజు కథనానికి
వాడే బాషాలో ఎన్నో విధాల మెళుకువలు ప్రదర్శించారు. కానీ ఓం ప్రధమంలో త్రివేణి వంటి
వంటి పత్రికలకు ఆంగ్లంలోనే కథలు రాసిన కారణంగా ఆ ప్రభావం అక్కడక్కడా అసంకల్పితంగా తెలుగు
కథలలో కూడా కనిపిస్తుంది. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసిన పోకడలు కనిపిస్తూనే ఉంటాయి. నిశిత
పరిశీలన మీదట గాని ఎక్కడో ఒకచోట ఈ తరహా తబ్సీలు కనిపించకపోవడం పద్మరాజుగారు
చేసుకున్న అదృష్టం అనుకోవాలి. వర్ణనల దగ్గర, ముఖ్యంగా
ప్రకృతికి సంబంధించిన వర్ణనల దగ్గరకు వచ్చేసరికి రచయితలోని కవి నిద్ర లేచి తనలోని
వ్యంజనా బలం ఏపాటిదో నిరూపించేందుకు ఉత్సాహపడతాడు. జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్లుంది, రైలు వానపాములా పాకుతోంది, ఆమె పెదవులు
ఇంకా విచ్చుకోని గులాబీ మొగ్గల్లా ఉంటాయి, పొద్దు గుంకిన
తరువాత లోకమంతా దిగులుగా ఉంది.. ఇలాంటి వాక్యాలు లేకుండా పద్మరాజుగారి కథ నడవనే
నడవదు. గాలివాన కథలో 'రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది' అని రాశారు ఒకచోట పద్మరాజు 'రావుగారికి
ఆకలి వేసింది' అనవచ్చు. కానీ అట్లా అనకపోవడమే పాలగుమ్మివారి పదాల నడకలోని
విచిత్ర విన్యాసం. పాఠకులని తన వైపు తిప్పుకునేందుకు రచయిత చూపించే చమత్కారాలు
ఇలాంటివి చాలా కనిపిస్తాయి పద్మరాజుగారి కథల నిండా. రాజుగారు కథలకు పెట్టే
శీర్షికలలో కూడా విలక్షణీయతే.శబ్దాలంకార ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది.
సత్యము- తత్వము, ప్రకృతి- పరిష్కృతి, సామ్యవాదము-
రమ్యరసామోదము.. లాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వవచ్చు. శబ్దం అర్థాన్ని డామినేట్
చేస్తుందని ఎవరైనా విమర్శకు పూనుకున్నా..ధ్వనిని బట్టే కదా అర్థం అనుసరించేది? అంటూ ముందు కాళ్లకు బంధాలేసేయడం .. అదో బలమో బలహీనతో ఎవరికి
వాళ్లుగా అన్వయించుకోవాల్సిందే! పాలగుమ్మివారు తన మనో పరిపాకంలో కావాత్మను
విడదీయరాని పాళ్లలో రంగరించుకుని ఉన్నందున, అసంకల్పితంగా
కలం ప్రకృతి ఊహల్లోకి వచ్చీరాగానే పరవశమయి చేసే కలవరింతలు ఇవన్నీ! రాజుగారి వర్ణనా
వైదుష్యం, సరికొత్త వాక్య ప్రయోగ నిర్మాణ కౌశలం అనుభవానికి రావాలంటే
ఆయన ప్రథమంగా వెలువరించిన 'కూలీజనం' కథల సంపుటం
ముందు పెట్టుకుని కూర్చుంటే సరి.
నేటి
కథానిక నడక పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించి సాగుతోందన్న వాదనతో పద్మరాజుగారికి
విభేదం లేదు. కథానికా రచనకు వారిని పురికొల్పిందీ ఆ పాశ్చాత్య కథారీతులే. తన రచనలు
పామరజన రంజకంగా ఉంటాయన్న పరిశీలనను ఆయన కేవలం పై పై పొగడ్త కిందే తీసుకుంటారు.
బెంగాలీ రచయిత శరత్ బాబు విషయమై ప్రస్తావన కొచ్చిన ఓ సందర్భంలో 'నవభావాలు కలిగి, పతితులతో
తిరిగి, చిత్రమయిన వారి ప్రవృత్తులను పట్టుకుని పామరజనులకు
అందుబాటులో ఉండే పాత్రల రూపకల్పన చేసిన మహానుభావుడు ఆయన. ఆ తరహా రచనలు తెలుగులో
కూడా రాసినవాళ్లని గౌరవించాలి. ఏనాటికైనా అట్టివి రాయగలిగితే చాలని ఆశిస్తాను' అనడాన్ని బట్టి తను అప్పటి వరకు పామరజనం పాఠకులుగా చదివి అర్థంచేసుకొనే సాహిత్యం
సృష్టించనే లేదని స్వయంగా ఆయనే ఒప్పుకున్నట్లు అయింది కదా!
కొత్తగా
కథాలు రాయదల్చుకున్నవారిని ఉద్దేశించి తన అనుభవాల పురస్కరించుకుని పద్మరాజు రెండు
మూడు విలువైన మాటలు సెలవిచ్చాడు. 'ఇంగ్లీషు కథా
సాహిత్యం చదువలేని వారు ఆంగ్లసంప్రదాయంలో కథకు ప్ర్రయత్నించి ప్రయోజనం లేదు.
జాతీయవిధానంలో కథానిర్మాణం ఎలా సాగతుందని తెలుసుకోవాలన్నా పరాయి భాషాజ్ఞానం తప్పనిసరి.
ఇవేవీ కుదరని పక్షంలో ఇళ్లల్లో మన బామ్మలు కథలు చెప్పే పధ్ధతిని నిశితంగా
గమనించండి. మా బామ కథ చెప్పినట్లు నేను కథ
రాయగలిగితే ప్రపంచాన్ని జయించినట్లుగా భావిస్తాను. మనం కథలు రాసేటప్పుడు మన పూర్వీకులు మనకు కథలు
చెప్పిన తీరును పరిశీలించాలి. ఆ కథలు, పాత్రలు, వాటిని చెప్పడంలోని సొగసు వగైరా మనసుకు
పట్టించుకోవాలి. వాటి నుంచే కదా మనం మన
కథలు నిర్మించుకునే విధానం ప్రారంభించాలి? ఆ పాత్ర
సంప్రదాయమే మనకు విశిష్టమైన కథానిర్మాణ కౌశలాన్ని అందించేది. ఇతర భాషలను గుడ్డిగా
అనుకరించినందువల్ల ప్రయోజనం లేదు. మన నాగరికతకు చరిత్ర ఉంది. దానిని విడిచి సాము
చెయ్యలేము. మనం వదుల్చుకోలేని విశ్వాసాలు మనల్ని వెంటాడుతున్నాయి. వాటిని
ఏవగించుకుని మనం మన సంప్రదాయాన్ని సృష్టించుకోలేం.
విశ్వసాహిత్యంలో
తెలుగు కథానికను తలెత్తుకు నిలబడేలా చెయ్యాలంటే విశ్వకథకుడు పాలగుమ్మి పద్మరాజు
పలికిన హిత్తోక్తులు అవశ్యం అనుసరణీయం.
(స్రవంతి
మాసపత్రిక - అక్టోబర్,
1955-శ్రీ డి. రామలింగం విశిష్ట వ్యక్తిత్వంగల
కథకుడు పద్మరాజు- ప్రేరణ)