Monday, January 25, 2021

జల తరంగిణి -కర్లపాలెం హనుమతరావు - ఈనాడు దినపత్రిక సంపాదకీయం

 




పంచ భూతాత్మకమే కాదు.. సహ శక్తులతో భిన్నమైన అనుబంధం కలది జలం. వాయువులో నిక్షిప్తం. అగ్నితో శత్రుత్వం. భూమికి బలిమి. ఆకాశంతో చెలిమి. భూమ్యాకాశల మద్య   రాయబారి.    'సృషికర్త పుటక, సృష్టిభర్త పడక,  సృష్టిహర్త సిగ- జలమే'అని ఒక కవి చమత్కార సమన్వయం. అమృతానికైనా.. హాలాహలానికైనా..  జలనిధే జన్మస్థలి. నిప్పు మనిషి కనిపెట్టింది. నీరు మనిషిని 'కని'పెట్టింది. ఒక్క మనిషనేమిటి.. భోగరాజువారు 'కంకణం'లో సెలవిచ్చినట్లు 'సమస్త జీవరాసులకూ నీరే  జీవనాధారం'. 'స్వాదునీరము త్రావి పద్మము కనువిచ్చె/ మోదవీచికలలో మునిగెను ద్విరేఫమ్ము/ ప్రిదిలి బీటలువారు పుడమి చేడియు మేను/ పదనుతో పులకెత్తు' అని 'వర్షారమణి'లో డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు కొనియాడిందీ జీవాధారమైన సలిల ధారల గురించే.  అన్నం  లేకపోయినా కొంతకాలం బతకవచ్చు. పానీయం లేకుంటే  ప్రాణాలు నిలబడేది కొన్నిక్షణాలే.  ఉమ్మనీరు మొదలు తులసి తీర్థం వరకు మనిషికి నీటికీ మధ్య గల బంధం అంత బలమైనది. సూది మందుకి.. సూతక స్నానానికి, తల మీదకి.. గొంతులోపలకి.. నీరే కావాలి.  దేవాలయం నుంచి శౌచికాలయం దాకా నీరు తప్పనిసరి. దాహానికి, జీర్ణానికి, రుచికి, సుచికి, అందానికి, ఆరోగ్యానికి, పంటకు, వంటకు, ఇంటికి, వంటికి..నీరు అవసరం లేనిది ఎక్కడ..ఎవరికి?  పితృదేవతల పుణ్యావహనం కోసం భగీరథుడు 'శివజటాజూటాగ్ర  గళిత  హిమమణి మిళిత శీకర కిరీటి గంగ'ను భువికి  దించాడు. కురు పితామహుల కోరిక మేరకు పాండవ మధ్యముడు 'పొగలుమిసి సెగలెగసి అడుగులలబడి మడుగు  పాతాళగంగ'ను  పైకి సాధించాడు. భాగవతంలోని రంతిదేవుని ఉదంతమో?  సర్వసంపదలు దానధర్మాలు చేయడం ఒక ఎత్తు. దారా సుతులతోసహా ఎనిమిది దినాలు పస్తులుండీ  దైవవశాత్తు దొరికిన మధురాంబులను క్షుధార్తుడికి ధారాదత్తం చేయడం మరో ఎత్తు.

జీవ ప్రాదుర్భవానికి నీటి లభ్యతే మూలం.  సేకరణ, రవాణా, విసర్జన.. జీవ రసాయన ప్రక్రియలన్నిటికి నీరే మాధ్యమం. అవయవాల సక్రమ కర్మ నిర్వహణకి  క్రమం తప్పని నీటి నిలవలు తప్పని సరి. ఆరు నుంచి ఎనిమిది  లోటాల కొలతకి  మాత్రం వెలితి పడ్డా శాల్తీ అడ్డం పడటం ఖాయమని ఆరోగ్యశాస్త్ర సూత్రం. జీవవ్యవస్థలో నీటిది విశ్వవ్యాప్త ద్రావణి పాత్ర . రసాయనాలేవైనా సరే కరిగే గుణం నీటి లక్షణం. మూడింట రెండు వంతులు మంచి నీరుంటేనే శరీరానికి వాయుపీడనం నుంచి రక్షణ. 'లోటాకి రెండువేల మేలిమి రకాల ఖనిజాలుంటేనే మంచినీరు కింద లెక్క' అంటున్నారు మానవాళి భవిష్యత్తు మీద పరిశోధనలు  సాగించే ప్రజావైజ్ఞానికులు  స్టాంఫోర్డు విశ్వవిద్యాలయ ఆచార్యులు  జాన్ మెక్కార్థీ. స్వచ్ఛమైన నీటి అవసరాలను  గురించి చాలా వివరాలే సేకరించారాయన. బాలింత దశలో  స్త్రీకి కనీసం ఏడున్నర లీటర్ల నీరు అవసరం. రోజుకు మనిషికి రెండు లీటర్లకు  మించి మంచి నీరు దొరకని పరిస్థితి ప్రస్తుతం ప్రపంచానిది. ఐరాస లెక్కల ప్రకారం రెండువందల యాభై కోట్లమంది నిర్భాగ్యులు పారిశుద్ద్యవసరాలకైనా నీరు నోచుకోవటం లేదు! శిశుమరణాలకు అతి పెద్ద రెండో గండం మురికి నీరే. నీటిరోగాల వల్ల రోజుకు నాలుగున్నర కోట్ల బడి దినాలు నష్టపోతున్నామని అంతర్జాతీయ విద్యా వేదికల  ఆవేదన. ఎదిగిన  బాలికలు చదువులకు దూరమవడానికి, చదువులకు వెళ్ళే పిల్లలు వింత రోగాల పాలవడానికి  పాఠశాలల అపరిశుభ్రతే  ప్రధాన కారణమని  ప్రతి ఏటా  సర్వేలూ మొత్తుకుంటున్నాయి. భూగోళం  వేడెక్కుతున్న కారణంగా హిమనదాలు కరిగిపోతున్నాయి. జీవనదులు తరిగిపోతున్నాయి. నేలమీది నీరు ఆవిరైపోయి తాగునీరు అందనంత ఎత్తుకి ఎగిరిపోతున్నది. 'ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది' అని ఒక తెలుగు చిత్రం పాట. నీటికున్న ఉలికిపాటైనా మనిషికి లేకపోవడమే వింత! నగరాల్లో  బోర్ల ముందు  బిందెల బారులు.  బస్తీళ్లో నీళ్ళబళ్ళ వెనక  పరుగులు. పల్లెపట్టుల్లో ఒక్క నీటిబొట్టు కోసం కోసులు కొద్దీ ప్రయాణాలు. విశ్వవ్యాప్తంగా ఇవే వీధి భాగవతాలు.

తాగుకి, సాగుకి, పాడికి, పరిశ్రమకి..  నీరే మొదటి అవసరం. సీసాలో నింపి వ్యాపారం చేసేందుకూ నీరే ముడి సరుకయింది ప్రస్తుతం! దేశాలు , రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య వివాదాలకీ నీరే కారణం. భూతలం మీద నాల్గింట మూడు వంతులు నీరే.  ఘన, ద్రవ, వాయు స్థితుల్లో విస్తారంగా దొరుకుతున్నదీ నీరే. ఐనా నీటి జాడల కోసం వేరే గ్రహాల వెంట పడాల్సిన దుస్థితి దాపురించిందెందుకు? భావి అవసరాలకి సరితూగే నీటి నిల్వలు భూమ్మీదే  భద్రపరుచుకునే తెలివి ఉండవద్దా?కరవు ప్రకృతి పరంగా ముంచుకొస్తే  ముందస్తు అదుపు  చర్యలు తప్పవు సరే.. మరి మానవ తప్పిదాల మాటేవిటి?రోజు గడిచే లోపు ఇరవై లక్షల టన్నుల చెత్త మంచినీటిని కలుషితం  చేస్తున్నది.యుద్దాలు, రహదారి ప్రమాదాలు,  ఉగ్రవాదుల దాడులు, ప్రాణాంతక వ్యాథులన్నీ కలుపుకొన్నా కలుషిత జలాలవల్ల జరిగే చెరుపుకు సరి తూగటం లేదు. ఎరువులు, పురుగుమందులు ఎడాపెడా వాడకం, బొగ్గు విద్యుత్తుకూ మంచినీరు దుర్వినియోగం.. ఎంత వరకు సమర్థనీయం? నీరు పసిడికి మించి మిడిసి పడుతున్నప్పుడు తరచు మాంసాహార విందులతో మజాలెందుకు?వరి సాగును తగ్గించి  రాగులు, జొన్నలు పండిస్తే సాగునీరు మిగులుతుందని వ్యవసాయశాఖల సూచనలు..చెవిన పెట్టేదెవరు? ఇజ్రాయెల్ దేశ పద్దతిలో బిందుసేద్యమూ   మంచి మందే. పొదుపులన్నిటిని  మింగేసే జనాభాను అదుపు చేసుకోవాలి ముందు. నీటి సరఫరా మెరుగుపడితే ఒనగూడే లాభాలో! 'అపారం' అంటున్నాయి గణాంకాలు. ఆరోగ్యవంతుడి ఉత్పాదకశక్తి స్థాయి  అత్యుత్తమంగా ఉంటుందంటుంది వైద్యశాస్త్రం. బీమా మీద ఆదా అయే నిధులు  నిర్మాణాత్మక విధులకు మళ్ళించుకోవచ్చు.  నీటిని మనిషి  ప్రాథమిక హక్కుగా పరిగణించమనడానికి ఐరాసకి ఇంకా ఇన్ని కారణాలు. తాగునీటి వృథాకి ముంబైలో జైలు శిక్షో.. జరిమానానో ఎదుర్కొనాల్సి ఉంది!   నీటి దుర్వినియోగాన్ని   నేరంగా పరిగణించే దారుణ పరిణామాలు ప్రపంచమంతటా   దాపురించరాదనే ఐ.రా.సా  ముందస్తు జాగ్రత్త. నడుస్తున్న దశాబ్దాన్ని(2005-2015) 'జీవనం కోసం జలం' దశాబ్దంగా, ఏటి అంతర్జాతీయ  జీవవైవిధ్య దినం(మే 22) అంశాన్ని 'నీటి కోసం సహకారం'గా ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటన వెనకున్న పరమార్థం ఇదే.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం కోసం రాసినది)

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...