Monday, February 15, 2021

అనగనగా ఓ గాడిద- సరదా కథ -కర్లపాలెం హనుమంతరావు

అనగనగా ఓ గాడిద. దానికి బతుకుమీద విరక్తిపుట్టి రేవులో మునిగి చద్దామని బయలుదేరింది. చివరి నిమిషంలో దేవుడు ప్రత్యక్షమై 'ఏవిటి నీ బాధ?' అని అడిగాడు. 'కోకిలమ్మకు కమ్మటి గొంతిచ్చావు. కోతిబావకు గెంతులిచ్చావు. నెమలికన్నెకు అందమైన ఈకలిచ్చావు. మా జాతిదే అయిన గుర్రానికీ మంచి తేజాన్నిచ్చావు. సింహాన్ని సరే వనానికే మహారాజుని చేసావు. చివరికి చిట్టెలుకక్కూడా గణాధిపతి వాహనంగా గౌరవమిచ్చావు. నేనేం పాపం చేసానని నాకీ గాడిద బతుకిచ్చావు?! గాడిదచాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను. చీదరింపులకు అంతే లేదు. ఇన్నిన్ని అవమానాలు పడుతూ బతికేకన్నా ఈ రేవులో పడి చావడం మేలు' అని ఘొల్లుమంది గాడిద. 

'ముందా కొళాయి కట్టేయ్! ఏం జన్మ కావాలో కోరుకో!' అన్నాడు దేవుడు జాలిపడి.

'అందంగా ఉండాలి. అందరూ నా వెంటే పడాలి. పదహారేళ్ళ పడుచుగా పుట్టించు దేవా!' అని అడిగిందా గాడిద ఆశగా.

'తథాస్తు!'అని దీవించి మాయమైపోయాడు దేవుడు.

పదహారేళ్ళ పడుచుగా పదహారు రోజులైనా కాకుండానే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యానుకి ఉరేసుకోబోయిందా మాజీగాడిద. 

'మళ్ళా ఇదేం పిచ్చిపని!' అర్జంటుగా ప్రత్యక్షమైపోయి ఆత్రంగా అడిగాడు దేవుడు అడ్డంబడి.

'నా అందమే నాకు శాపమైంది. అడ్డమైన వెధవా ప్రేమించానని వెంటబడుతున్నాడు. కాదంటే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. ఇక్కడా నాకు గాడిదచాకిరీ తప్పడంలేదు. ఇంట్లో రోజూ పెద్దయుద్ధమైపోతోంది. ఈ మగప్రపంచంలో ఆడదానికి ఇంటా బైటా బేటిలూ.. బాటిలే! ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలన్న సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో ఇప్ప్డు అనుభవంలోకొచ్చింది. మానుగా వద్దుగానీ.. వీలైతే నన్ను ‘జెంటిల్ మేను’గా పుట్టించు! కుదరదంటావా.. నా మానాన నన్ను చావనీయ్!' అని ముక్కు చీదిందా కన్నెగాడిద.

'జెంటిల్మాన్ అంటున్నావు కాబట్టి ఓ గవర్నమెంటు చిన్నబళ్ళో పంతులయ్యలా  తక్షణమే పుట్టు!' అంటూ ఆశీర్వదించి అంతర్దానమైపోయాడు దేవుడు. 

సర్కారుటీచరుగా పుట్టి శతదినోత్సవంకూడా రాకుండానే టేంకుబండుమీదనుంచి దూకబోయిందా గతజన్మగార్దభం.

యథాప్రకారం మళ్లీ విధాత ప్రత్యక్షం! 'పదిమందికీ పాఠాలు చెప్పే పని అప్పగించినా ఇదేం పిచ్చిపని పంతులుగారూ! అయ్యవారి వృత్తీ నీకు నచ్చలేదా?!'

'అయ్యో! నాకసలు పిల్లకాయలకి పాఠాలు చెప్పే అవకాశం ఎక్కడొచ్చింది స్వామీ! అందరూ నాకు పాఠాలు చెప్పేవాళ్ళేనాయ! వేళకు జీతాలు రావు. వచ్చిన జీతాలు చాలవు. ఎవరికీ పంతులంటే లెక్కే లేదు. జనాభా లెక్కల్నుంచి, ఓటర్ల వివరాల సేకరణవరకు అన్నింటికీ అయ్యవార్లకే చచ్చేచావాయ! గాడిద చాకిరీ ఇక్కడా తప్పడంలేదు. గాడిదలకన్నా బుద్ధితక్కువ వెధవాయలతో వేగలేకే ఈ విరక్తి. బడిపంతులైతే అబ్ధుల్ కలాంసారుకిమల్లే  మంచిపేరొస్తుందని ఆశపడ్డాగానీ బడుద్దాయుల నోళ్ళలో  పిచ్చి పిచ్చి మారుపేర్లతో నానుతానని తెలీదు. వంటబట్టని చదువులు, వకపట్టాన అంతుబట్టని జీవోలు, అంతేలేని పదోన్నతుల కౌన్సలింగులు, అంతమేలేని బలవంతపు  బదిలీలు, బెదిరింపులు! బందులదొడ్డిలాంటి బడి. దాని చవుడుగోడలకిందబడి దిక్కుమాలిన చావు చచ్చేకన్నా.. ఈ మురికినీళ్లల్లోకి దూకి ముందే నీ దగ్గరకు రావడం సుఖమనిపించిందయ్యా! మంచిపుటక పుట్టే యోగం ఎటూ లేదు. మనసారా చావడానిక్కూడా నాకు రాసిపెట్టిలేదా భగవాన్?!’ అని ఎదురు దాడికి దిగాడా గాడిద జీన్సు ఉపాథ్యాయుడు. 

'ఆ అవకాశం నీకు రాసిపెట్టిలేదు భక్తా! ‘వైద్యో నారాయణో హరిః’ అనిగదా సామెత. మరి ఆ భూలోక దేవుడి అవతారంకూడా ఓసారి ట్రై చేసి చూడరాదా?' అంటూఅంతర్ధానమయిపోయాడు దేవుడు.

వైద్యుడుగా జన్మించిన ఆ జీవి ఆరునెల్లు తిరక్కుండానే యథాప్రకారం ఆత్మార్పణకు పూనుకొన్నాడు. 

దేవుడికి తప్పుతుందా? తిరిగి ప్రత్యక్షం!

'పదిమంది రోగులకి మంచి మందూ మాకూ ఇచ్చి మానవసేవ చేయమని వైద్యమాధవుడిగా పుట్టిస్తే.. నువ్వేందీ.. మళ్ళీ ప్రాణార్పణకు బైలుదేరావు? మళ్లీ ఏం పుట్టి మునిగింది నాయనా?'

'ప్రాణదానాలు చేయమని ప్రభుత్వాసుపత్రుల్లోనా పారేసేది పరంధామా! ఆపరేషన్లు చేయడానికి పరికరాలే కరువు  వైద్యాలయాల్లో! రోగి ప్రాణంపోతే బంధువులు మా ప్రాణం తీసేస్తున్నారు. ఏళ్లతరబడి కళ్లు గుంటలుపడేటట్లు చదివింది నెలకు సరిపడా ఇంటికి సరిపడా సరుకులైనా కొనలేని జీతభత్యాలకోసమా? పగటికీ, రాత్రికీ తేడా తెలీకుండా ఆ డ్యూటీలేంటి? పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకొంది.. అదిగో.. వాడి తల్లి డెలివరీ  రోజునే! ఈ పరేషాన్లు నా వల్లయే పన్లు కాదుగాని.. వీలైతే నా పూర్వజన్మ గాడిద బతుకే తిరిగి ఇచ్చేయ్! కాదంటే నీ దారిన నువ్వు దయచేయ్!'

'పోనీ ఓ సాఫ్టువేరు ఇంజనీరు బాడీ ఖాళీ కాబోతోంది. అందులోకి నిన్ను ఇన్ స్టాల్  చెయ్యమంటావా?ఇవాళ కుర్రకారంతా  అంతిమంగా కోరుకొంటున్నది  ఆ విలాసజీవితమేగా?'

గాభరా పడింది గాడిద. 'అయ్యయ్యో! అంతపని చెయ్యద్దు దేవయ్యా! ఆ జన్మ జన్మజన్మలకీ వద్దనే వద్దు. ఎవడి బాడీలోకో దూరి మళ్ళీ వాడి కారులోను, కార్డులోను, హోములోను గట్రా క్లియర్ చేసేందుకు గాడిద చాకిరీ చేసేకన్నా.. నా సొంత గాడిద బాడీలోకే దూరిపోయి తంటాలు పడ్డం మేలు ! ఎప్పుడూడిపోతుందో కూడా తెలీని ఆ సంచారజీవి నౌఖరీకన్నా.. ఎవరికీ అక్కర్లేని నా ఖరం పోస్టే మెరుగు!'

'పోనీ మంచి సినిమా స్టారువయ్యే ఉద్దేశం ఉందా? బోలెడంత గ్లామరూ.. డబ్బూ.. అందం.. ఆనందం.. అభిమానులూ నీ సొంతం. కొంతకాలం పోతే సొంత రాజకీయపార్టీకూడా పెట్టుకోవచ్చు. అన్నీ కలసివస్తే అమాంతం ఏ  ముఖ్యమంత్రో, దేశానికీ ముఖ్యమైన మంత్రో అయిపోవచ్చు. భూమ్మీద జన్మించిన ప్రతి జీవీ అంతిమంగా ఆశించే అంతస్తును అందుకొనే అంతిమ సోపానం అంతకు మించింది మరేదీ లేదు బోళాభక్తా! మరి నీయిష్టం!'

'అడ్డదారుల్లో వెళ్ళి అలా పెద్దమనిషయేకన్నా.. నేరుగానే సియమ్మో పియమ్మో అయిపోవడం ప్రాణానికి హాయిగదా దేవా? వీలయితే ఆ రెండు పదవుల్లో ఏదో ఒహటి వెంటనే ప్రసాదించు స్వామీ! మళ్ళీ ఆత్మహత్యలమాట తలపెడితే ఒట్టు!'

దేవుడి మొహంలో చిరునవ్వు.

'మూడు మానవ జన్మలెత్తంగానే ఎంత తెలివిమీరిపోయావే గాడిదా! ఆ పదవులేమీ ప్రస్తుతానికి ఖాళీగా లేవుగానీ దానికన్నా కొద్ది దిగువలో ఉన్న మంత్రిపదవి శాంక్షను చేస్తున్నా.. సర్దుకో!' అంటూ అంతర్ధానమైపోయాడు యథాప్రకారం జనార్దనుడు.

గాడిద ఆ మంత్రి పదవి వెలగబెడుతున్న ఏడాదిలోనే జిల్లా పరిషత్ ఎన్నికలొచ్చిపడ్డాయి. మంత్రిగారి ఇలాకాలోని జనం జెల్లాయి కొట్టేసరికి మాజీగాడిదగారి మంత్రిపదవి ఊడింది. 

ముఖ్యమంత్రిగారి క్యాంపాఫీసు కార్యాలయంలోక్కూడా ప్రవేశం దొరకనంత అధమావస్థకి పడిపోయింది మాజీమంత్రిగారి పరపతి. 

ఆ అవమానంతో.. ఆందోళనతో మంచమెక్కిన మూడోరోజుకే నాడి పడిపోయి దేవుడు కనిపించాడు మళ్లీ. బావురుమన్నాడు గాడిదజీవుడు. 'ఆడపిల్లగా ఉన్నప్పుడు మగాడి వేధింపులకన్నా, అయ్యవారుగా ఉన్నప్పుడు పిల్లకాయలు తిట్టిపోతలకన్నా, వైద్యవృత్తిలో ఉన్నప్పుడు రోగిబంధువులిచ్చిన కాలితాపులకన్నా.. ఇప్పుడు చాలా ఆవేదనగా ఉంది పరమాత్మా! పదవూడిన తరువాత నేతబతుకెంత యాతనగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. దీనికన్నా నా పూర్వజన్మ గార్దభమే ఎన్నోరెట్లు మిన్న. నా పాతజన్మ నాకు తిరిగి ప్రసాదించవూ! చచ్చి నీ కడుపున పుడతాను మహానుభావా!’

'అది కుదిరేపని కాదు గాడిదా! అందుకే నిన్ను నేను ముందే అన్ని విధాలుగా హెచ్చరించింది’ అన్నాడు దేవుడు తాపీగా. 

అయోమయంగా చూసాడు జీవుడు.

'అటు చూడు! అంతా నీకే తేటతెల్లంగా అర్థమవుతుంది!' అన్నాడు దేవుడు. 

జీవుడు అటుగా చూసాడు. గతంలో తను 'ఛీ.. వద్ద'ని చీదరించుకున్న గాడిద బాడీముందు మంగళగిరి చేంతాండంత క్యూ!

ఆ క్యూలో  పడుచుపిల్లగా పుట్టినప్పుడు తనతో ఆడుకొన్న ఆడపిల్లలు బోలెడంత మంది! స్కూలుటీచరుగా పనిచేసినప్పుడు తను కలసి పనిచేసిన గురుదేవులూ తక్కువమంది లేరు! గతంలో ధర్మాసుపత్రిలో తనతో కలసి రోగిబంధువులందరిచేత చివాట్లు, చెప్పుదెబ్బలు తిన్న వైద్యనారాయణులందరూ దాదాపుగా అక్కడే నిలబడున్నారు! 

తాను వద్దని వదిలేసిన సాఫ్టువేర్లు.. ఇంజనీర్లు, పెద్ద పెద్ద సినిమాస్టార్లు, బిజినెస్ మాగ్నెట్లు, నిత్యం బిజీగా ఉండే మీడియా మొఘళ్ళు, ఇంకా బంజారాహిల్సు జూబ్లీహిల్సుల్లో బంగళాలు కట్టుకొని ప్రపంచానికి దూరంగా బతికే పేరులే తప్ప ఫేసులెప్పుడూ చూడని ఫేమస్ పర్శనాలిటీసు బోలెడంతమంది.. ఎంతో సేపట్నుంచి అక్కడే నిలబడున్నట్లు వాళ్ళ మొహాల్లోని అసహనాలే ఆనవాలు పట్టిస్తున్నాయి. 

'ఇంతకీ వీళ్ళందరూ ఇక్కడ నిలువుకాళ్ల ఉద్యోగం చేస్తున్నది ఎవరికోసం? సినిమా థియేటర్లో కనిపించే క్లాసులన్నీ ఇక్కడ క్యూలో కనిపిస్తున్నాయే! దేనికోసం ఈ కోన్ కిస్కాగాళ్ళు, కోటీశ్వరులు ఇక్కడిలా  మునిగాళ్లమీద  జపాలు చేస్తున్నారు? దేవుడెందుకు తనను వీళ్లవంక చూడమన్నాడు?!' తాను అడిగింది తన పాతగాడిద బాడీనే గదా! తన బాడీ తనకు స్వాధీనంచేయకుండా ఏదన్నా తిరకాసు పెట్టడానిక్కాదుగదా ఈ మాయలమారి దేవుడుగారు ఇప్పుడీ'క్యూ' షో పెట్టింది?! ఆమాటే నట్టుకొట్టకుండా సూటిగా అడిగేసింది దేవుణ్ణి గాడిద. 

సమాధానంగా చిదానందంగా నవ్వి చిన్నగా బదులిచ్చాడు భగవంతుడు 'ఆ క్యూ మొదట్లో ఏముందో చూడు! నువు వద్దని వదిలేసిన బాడీనే పడుందక్కడ! ఇప్పుడు దానికీ బోలెడంత గిరాకీ! గాడిదచాకిరీ అని నువ్వు చీదరించుకొన్నావుగానీ.. నిజానికి ఈ క్యూలోని  ఏ ఒక్కడన్నా గంటలో చక్కదిద్దే పనిముందు  నువ్వు జీవితాంతం ముక్కుతూ మూలుగుతూ చేసే పని దూదిపింజెకన్నా తేలిక.'అడ్డగాడిద' అంటూ నిన్నడ్డంపెట్టుకొని మనుషులు తిట్టుకొంటారని నీ కంప్లయింటుగానీ.. వాస్తవానికి ఇక్కడునవాళ్లందరూ నిత్యజీవితంలో నీకన్నా ఎక్కవ అవమానాలు భరిస్తున్నారు. ఆడవాళ్లపేర్లతో మగవాళ్ళు తిట్టుకొనే తిట్లు నరమానవులు విని సహించలేనివి! పంతుళ్లమీదున్నన్ని పిచ్చిసామెతలు ప్రపంచంలో మరెవ్వరిమీదా లేవు. డాక్టర్లకు నిత్యం ఆసుపత్రుల్లో జరిగే సన్మానాలు చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఇహ సినిమావాళ్లమీద నడిచే పుకార్లలో ఒకవంతు నీమీద నడిచినా నువ్వెందుకు మీ అమ్మకడుపులో పుట్టావా అని ఆవేదన చెందేదానివి. డబ్బున్న మారాజులకు పన్నువేధింపులు, మీడియా మొఘళ్లకు గూండా మొగుళ్ళు! నేతాశ్రీల నరకయాతనలముందు నీ బతుకెంత స్వర్గతుల్యమో అర్థం చేసుకో! నీ గాడిద బతుక్కిప్పుడెంత డిమాండొచ్చి పడిందో నీకు తెలీడం లేదు. వానలు పడక ఎండలు మండిపోతున్న ఈ సీజన్లో అందరి నోళ్ళల్లో  నీ నామస్మరణే! మీ గాడిదలకు పోటీలు పడి పెళ్ళిళ్ళు ఆర్భాటంగా చేసేస్తున్నారు జనం. గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తే కుంభవృష్టిగా వర్షాలు పడతాయని వాళ్ల నమ్మకం. గత ఎన్నికల్లో  ధరావతు కోల్పోయిన  నేతాశ్రీలు పోయిన పరువు పరుసు మళ్ళీ ఎలాగైనా  దక్కించుకోవాలని కనీసం నీ గాడిద బాడీలోనైనా దూరిపోవడానికి ఇలా పోటీలు పడిపోతున్నారు..'

'నా గాడిద శరీరం నాకే దక్కడం న్యాయం! నా శరీరం నాకు తిరిగి రావాలంటే నేనేం చేయాలి స్వామీ?' బిక్కమొగమేసుకొని అడిగింది గాడిద.

'చేసేందుకేముంది గాడిదా? నా చేతులుకూడా దాటిపోయింది వ్యవహారం. బాడీ నీదే అయినా నీకిప్పిస్తే  నామీద కేసేసేందుకు  కాచుక్కూర్చోనున్నాయి కొన్ని అదృశ్యశక్తులు. ఆ రిస్కు నాకొద్దు. నువ్వెళ్ళి క్యూలో నిలబడు.  నమోదు చేయించుకో! విధి లాటరీ తీయబోతోంది.  నీ లక్కు బాగుంటే నీ బాడీ నీకు దక్కవచ్చు' అంటూ ఠక్కున మాయమైపోయాడు దేవుడు .. మళ్ళీ గాడిద ఏ పితలాటకం పీకలకు మీదకు తెస్తుందోనని భయపడిపోయి.

***

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యల్ ఎస్ఎ 

18 -02 - 2021

( ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం ) 

పరీక్ష - కథానిక : కర్లపాలెం హనుమంతరావు-

 మొదటి రాత్రి. శశి గదిలోకి వచ్చింది పాలగ్లాసుతో. రామారావా గ్లాసందుకొని టేబుల్ మీదుంచి తలుపులు లోపలికి గడియవేసి బిడియంగా నిలబడున్న అర్థాంగిని మృదువుగా పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. తలొంచుకొని కూర్చోనున ఆమె మొహాన్ని అరచేత్తో కొద్దిగా పైకెత్తి చిర్నవ్వులు చిందిస్తూ అన్నాడు రామారావు 'మనిద్దరికీ ఇది మొదటి పరిచయం కాదుగా!ఎందుకంత సిగ్గు?'

శశి కళ్ళల్లో నీరుచూసి కంగారుగా అన్నాడు' సారీ! నేనేమన్నా అనరాని మాట అన్నానా?'

శశి గభాలున బెడ్ దిగి రామారావుపాదాలు కళ్ళకద్దుకుంది. రామారావు షాక్!

;ఇదేంటి శశీ కొత్తగా! ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? అంటూ ఆమెను పైకి లేపి మళ్లీ బెడ్ మీద పక్కన కూర్చోపెట్టుకున్నాడు. 'ఏదైనా సరదాగా కబుర్లు చెప్పచ్చుగా! ఈ పాదాభివందనాలు.. ఇవీ ఏంటీ.. మరీ పాతకాలంనాటి సినిమాల్లోలాగా!' అనంటుంటే సశి నోరు తెరిచి నిదానంగా అన్నది ఒక్కొక్క మాటే వత్తి పలుకుతూ 'మీకు తెలీదు మీరు నాకెంత ఉపకారం చేసారో! నా జన్మంతా ఊడిగం చేసుకున్నా మీ రుణం తీరేదికాదు'

'ఇది మరీ బాగుంది. డైలాగులుకూడా సినిమాల్లోవే! ఏమైంది శశీ.. మరీ అంత సెంటిమెంటల్ గా ఫీలవుతున్నావు? ఇందులో నేను చేసిన ఘనకార్యంమాత్రం ఏముంది? నువ్వు నాకు నచ్చావు. నా అదృష్టం బాగుండి నేనూ నీకు నచ్చాను. మనిద్దరి అదృష్టం బాగుండి మీవాళ్లకి, మా వాళ్ళకికూడా మనమిలా ఒకటవడానికి అభ్యంతరం లేకుండా పోయింది. కథ క్లైమాక్సు సీన్లుకూడా అయిపోయాయి మ్యాడం! 'శుభమ్' కార్డు వేసేయాలి తమరింక'.

వాతావరణాన్ని తేలికపరఛడానికి రామారావు   అలవాటు లేని సరదాతనాన్ని ప్రదర్శిస్తుంటే .. శశి అంది చివరికి 'పెళ్ళి మగవాడికి ఒక అవసరం మాత్రమే అంటారు. ఆడదానికి అదే జీవితమండీ! ఆ అదృష్టానికి ఆడది నోచుకొనేది జీవితంలో ఒకే ఒకసారి ఈ దేశంలో. ఖర్మకాలి ఆ పెళ్ళిగాని వికటిస్తే జీవితాంతం మోడులాగా మాత్రమే బతకాలని శాస్తిస్తుందీ సమాజం. కాలం ఎంత మారినా.. అభిరుచులు ఎంత మారినా ఆడదాని విషయంలో మాత్రం ఏ తేడా లేదు.. ఈ అధునాతన యుగంలో కూడా! అట్లాంటిది ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చుని భర్తను పోగొట్టుకున్న నష్టజాతకురాలిని .. నాకు మరోసారి ఈ మాంగల్యజీవితం లభించిందంటే ఏదో కలలోలాగా ఉందంతా! మనమంటే వయసులో చిన్నవాళ్ళం. పెద్దవాళ్ళైన మీ అమ్మానాన్నలుకూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారంటే నాకిప్పటికీ నమ్మబుద్ధికావడం లేదండీ!

'ఆఁ..! వూరికే ఒప్పుకొనుంటే అది గొప్పతనమయుండేది. పరీక్షలు పెట్టారుగా..!' అన్నాడు రామారావు నిష్ఠురంగా. 

'అయినా సరే! పరీక్షలో తప్పిన విద్యార్థికి గ్రేసుమార్కులిచ్చి పాసుచేయడంకూడా గొప్పేనండీ!' అంది శశి.

రామారావుకు ఏమనాలో అర్థంకాక శశివంక అలా చూస్తూ ఉండిపోయాడు. 'పరీక్ష' ఏంటో తెలియాలంటే  మనమూ కాస్త వెనక్కి వెళ్ళాల్సుంటుంది.

***

శశి తండ్రి పాపారావుగారు ప్రభుత్వోపాధ్యాయుడు. శశి ఆయనికి మొదటి సంతానం. తరువాత ఇద్దరు ఆడపిల్లలు. శశి డిగ్రీలో ఉండగా సుబ్బరాజు సంబంధం వచ్చింది. పిల్లాడు ఆర్టీసీలో డ్రైవరు. అన్నిరకాలుగా విచారించుకున్న తరువాతే పాపారావుగారీ సంబంధం ఖాయం చేసుకున్నారు. 

ప్రధానం అయిపోయినా  పెళ్ళిమూహూర్తాలు శశి పరీక్షలయిపోయిన తరువాత పెట్టుకున్నారు. శశి రోజూ సుబ్బరాజు ద్యూటీలో ఉన్న బస్సులోనే కాలేజీకి వెళ్ళిరావడం అలవాటు చేసుకుంది. 'కాబోయే దంపతులే కదా.. ఇందులో పెద్దగా అభ్యంతర పెట్టాల్సిందేముంది?' అనుకున్నారు ఇరుపక్షాల పెద్దలు. 

శశి పరీక్షలు అయిపోయిన  నెలలోనే ఏ ఆటంకం లేకుండా పెళ్ళి జరిగిపోవడంతో పాపారావుగారు ఊపిరి పీల్చుకున్నారు. ఆయనకు కాస్త జాతకాలమీద నమ్మకం జాస్తి. మంచి ముహూర్తం చూసుకుని మూడు రోజుల తరువాత 

శోభనం పెట్టుకొన్నారు.

మొదటి రాత్రి అయిపోయిన మర్నాడు సుబ్బరాజు డ్యూటీకి బయలుదేరుతుంటే 'ఈ రెండు రోజులుకూడా సెలవు పెట్టాల్సింది బాబూ!' అని బాధపడ్డారు పాపారావుగారు. 'సెలవులాట్టే లేవు మామగారూ! రేపు శశిని కాపురానికి తీసుకు వెళ్లాల్సివచ్చినప్పుడు మళ్ళా పెట్టాలిగదా! మా అమ్మకుకూడా వంట్లో బాగుండటం లేదు. ఎప్పుడే అవసరమొస్తుందో తెలీదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? సాయంత్రం డ్యూటీ దిగంగానే ఇటే వచ్చేస్తానుగా!' అంటూ వెళ్ళిపోయాడు సుబ్బరాజు. చిక్కడపల్లి క్రాసురోడ్డులో ఎదురుగా వస్తున్న మిలటరీ ట్రక్కు గుద్దుకొని సుబ్బరాజు డ్యూటీ చేస్తున్న బస్సు తుక్కు తుక్కయిపోయింది. ఆ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులకు గాయాలయినా ప్రాణాలు పోయిందిమాత్రం ఒక్క సుబ్బరాజువే!

శశి దురదృష్టజాతకురాలన్నారు. ఆర్టీసీలో శశికి ఉద్యోగం వచ్చిందికానీ.. సుబ్బరాజు తనవెంట తీసుకుపోయిన మాంగల్య సౌభాగ్యమో?!

శశి తన జీవితాన్ని గురించి ఆలోచించడం మానేసి చెల్లెళ్ళిద్దరి బతుకుల్ని తీర్చిదిద్దడంలో తండ్రికి సాయపడ్డంలో మునిగిపోయింది. రెండోకూతురు పెళ్ళికూడా అయిందనిపించి పాపారావుగారు టపా కట్టేసారు. ఇంటిపెద్ద హోదాలో చివరిచెల్లెలికి పెళ్ళిసంబంధాలు చూసే పని శశిమీదే పడింది. ఆ సందర్భంలో కలిసాడు రామారావు.

శశి మ్యారేజి బ్యూరోలో ఇచ్చిన ప్రకటనకు స్పందించి శశిచెలెలు సుభద్రను చూడటానికని వచ్చాడు రామారావు. రామారావు ఏజీ ఆఫీసులో యూడీసీ. కట్నం మీదాట్టే ఆశలేదు. చూడ చక్కంగా ఉండి ఇంటి పనులు చక్కపెట్టుకునేపాటి తెలివితేటలుంటే చాలనుకునే పెద్దలు రామారావు తల్లిదండ్రులు. సుభద్ర వాళ్లకన్ని విదాలా నచ్చింది. సుభద్రకూ ఓకేనేగానీ.. రామారావే అడ్డం తిరిగాడు. 'పిల్ల మరీ చిన్నపిల్ల' అని అతగాడి పేచీ. సర్ది చెప్పడానికని వెళ్ళిన శశిని ప్రత్యేకంగా పక్కకు తీసుకు వెళ్ళి నిజం చెప్పేశాడు రామారావు' నాకిది మొదటి పెళ్ళి కాదు. కాన్పు ఇబ్బందై ఆవిడ పోయింది. బిడ్డా పోయింది. ఈ విషయాలన్నీ పెళ్ళైన తరువాత నెమ్మదిగా చెబుదామనుకుంటున్నారు మా వాళ్ళు, మీరూ అనుభవంలేక తొందరపడుతున్నారు. సారీ! ఇలా అన్నానని మరో విధంగా భావించకండి! మీ చెల్లెలైతే నా కంటికి నా చెల్లెల్లాగానే ఉంది'

విషయం తెలిసిన తరువాత సుభద్రా మొండికి దిగింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందనే అనుకొంది  శశి.. మూడు నెలల తరువాత ఆ రామారావు శశి పనిచేసే ఆఫీసు వెతుక్కుంటూ వచ్చి ఓ  ప్రపోజల్ ముందుంచిందాకా. 'మీ చెల్లెలు చక్కనిది. చిన్నపిల్ల. ఇవాళ కాకపోతే రేపైనా మంచి జోడు దొరక్కపోదు. పి. జి. పూర్తి కానీయండి! మీ సంగతే మీరు ఆలోచించుకోవాలి ముందు!' అన్నాడతను.

'అంటే?' భృకుటి ముడిచింది శశి కాస్త సీరియస్ గా.

'సారీ! ఉచితసలహాలు ఇస్తున్నాననుకోవద్దు మ్యాడమ్!  చెల్లెలు వెళ్లిపోయింతరువాత మీరు ఒంటరిగా ఉండాలి. సమాజం ఏ తీరులో ఉందో నాకన్నా ఆడవారు మీకే బాగా తెలుసు. '

రామారావు ఏ ఉద్దేశంతో అన్నా అతనన్న మాటల్లో వందశాతం వాస్తవముంది. వయసులో ఉన్న ఆడది వంటరిగా ఉందని తెలిస్తే చాలు..  దొరలమనసుల్లో కూడా దొంగబుద్ధులు తొంగిచూస్తున్నాయి.  తను రోజూ   అనుభవిస్తున్నదే ఈ రంపపుకోత. అలాగని ఒకసారి పెళ్లయి మొగుణ్ణి పోగొట్టుకొన్న స్త్రీని ఏ స్వార్థంలేకుండా జీవితంలోకి ఆహ్వానించేంతగా మగజాతిమాత్రం అభివృద్ధి చెందిందా?! సంస్కారవంతులమని అనిపించుకోడానికి ఏ కొద్దిమందో ముందు  ముందుకొచ్చినా .. కలకాలం ఆ ఉత్సాహం అలాగే ఉంటుందన్న గ్యారంటీమాత్రం ఎక్కడుంది?!'

ఆ మాటే అన్నప్పుడు నీళ్ళు నమలకుండా మనసులోని మాట బైటపెట్టేడు రామారావు'మీ చెల్లెల్ని చూసింతరువాత నేను రెండు మూడు సంబంధాలు చూసాను. ఎక్కడ పెళ్లచూపులకని వెళ్ళినా  ఆ పిల్ల స్థానంలో మీరే కళ్లముందు కదిలేవారు. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కానీ నా మనసులోని మాటను ఇంకెలా చెప్పాలో తోచటంలేదు.  ఊరికే మధనపడుతూ కూర్చునేకన్నా ఒకసారి నా ఫీలింగ్సుని మీకు తెలియచేస్తే బాగుంటుందని ఇలా సాహసం చేసాను. ఆ తరువాత మీ ఇష్టం. నా అదృష్టం' అంటూ శశి స్పందనకోసమన్నట్లు ఆగాడు.

ఇలాంటి విషయాల్లో సత్వరం స్పందించడం అంత తేలికా?! అందులోనూ ప్రపోజల్ పెట్టిన వ్యక్తి ఎదురుగా ఉంటే ఏ ఆడపిల్లయినా ఏమని చెబుతుంది?! శశిదీ అదే పరిస్థితి. తను కలలోనైనా ఊహించని ప్రపోజలుతో వచ్చాడితను. ఏం చెప్పాలి? ఏమీ చెప్పకపోయినా ఇబ్బందే! అదే అలుసుగా తీసుకుని ఆనక వేధించడని గ్యారంటీ ఏమిటి? కాస్త కరుకుదనం రంగరించి అడగదలుచుకున్నది సూటిగానే అడిగింది శశి' నా గురించి మీరు అన్నీ తెలుసుకొని రాలేదనుకుంటాను!'

'తెలుసు మ్యాడమ్ గారూ! సుబ్బరాజుగారి స్నేహితుడు మోహనరావు నా క్లోజ్ క్లాస్ మేట్'

'మోహనరావుగారిక్కూడా తెలీని కొన్ని విషయాలు ఉన్నాయండీ! సారీ! .. బట్ థేంక్యూ ఫర్ యువర్ కన్సర్న్.. సర్!' అని లేచి వచ్చేసింది శశి.

అంతటితో ముగిసిపోతే ఈ కథే ఉండేది కాదు. మూడునెలల తరువాత ఒకాదివారం మధ్యాహ్నంపూట రిలాక్సుడ్ గా కూర్చుని టీ.వీ చూస్తున్న వేళ.. ఒక ముసలి జంట గేటు నెట్టుకుని లోపలికి వచ్చారు. ముందు గుర్తుపట్టలేదుకానీ వాళ్ళు రామారావు తల్లిదండ్రులు. ఇంతకుముందు సుభద్రను చూడటానికి రామారావుతో కలసి వచ్చారు. సుభద్ర విషయం మాట్లాడటానికి వచ్చారేమో అనుకుంది. రామారావు సలహా తరువాత సుభద్రపెళ్ళి చదువయిందాకా వాయిదా వేయాలనే ఉద్దేశంలోనే  ఉంది శశి. ఆ మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే పెద్దావిడ అంది 'మా అబ్బాయి రామారావు నీకు తెలుసుటకదమ్మా! వాడు నిన్ను తప్ప చేసుకోనని మొండికేస్తున్నాడు. నువ్వే కాస్త నచ్చచెప్పాలి తల్లీ!మాకీ వయసులో భగవంతుడీ కష్టం ఎందుకు తెచ్చిపెట్టాడో అర్థం కాకుండా ఉంది.'

ఆమె అభ్యర్థిస్తుందా? నిష్ఠురమాడుతుందా? అర్థం కాలేదు శశికి. ఐనా వాళ్ళబ్బాయికి తను నచ్చచెప్పడమేమిటి? ఏమని నచ్చచెప్పాలి?

ముసలాయన మాత్రం మనసులోని మాటను సూటిగా చెప్పేసాడు. 'మా వాడి కడుపున ఒక కాయకాసి  వంశం నిలబడడం మాకు ముఖ్యం తల్లీ! వాడి మొదటి భార్య పోయిన సంగతి నీకూ చెప్పాట్టగా! నీ పరిస్థితీ మాకూ చెప్పాడు. అయినా మీ ఇద్దరికీ ముడిపెట్టి ఉంటే ఆపడానికి మేమెవరం? ఆ సంగతి చెప్పిపోదామనే వచ్చాం ఇంత దూరం. ఇక పదవే పోదాం!' అంటూ భార్యతో సహా వెళ్ళిపోయాడు పెద్దాయన. 

శశి ఆశ్చర్యానికి అంతు లేదు. మళ్ళా పెళ్ళి అనే ఆలోచనే మనసులో లేని తనవెంట పడుతున్నాడేమిటీ రామారావు ఇలా?! కొంపదీసి అతను తనను నిజంగానే ప్రేమిస్తున్నాడా సినిమాల్లోకి మల్లే! ఇప్పుడు తనేం చేయాలి? మెదలకుండా ఉన్నా  నిలవనిచ్చేట్లు లేడే ఈ మహానుభావుడు! ఊళ్ళో ఉన్న మామయ్యను 'ఒకసారి వచ్చి కలిసి పొమ్మ'ని కబురు చేసింది శశి. 

మామయ్య రాకతో పరిస్థితి మరింత ముదిరింది. విషయం విని ఆయనా సంతోషంతో గంతులేసేంత పని చేసాడు. 'ఆ రామారావుని దేవుడే పంపించినట్లున్నాడమ్మా! ఈ అవకాశం వదులుకోవద్దు! ఆడది వంటరిగా ఉండాలంటే ఈ సమాజంలో కుదిరే పని కాదు. సమస్య శారీరకమైనదే కాదు తల్లీ! ఒక వయసుదాటిన తరువాత ఒంటరి జీవితం తెచ్చిపెట్టే యాతనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు నీకు అర్థం కాదు. బిడ్డలు లేకుండా ఈ వయసులో నేనూ , మీ అత్తమ్మా పడుతున్న అవస్థలు చూడు! ఏం చేయాలో నీకే తెలుస్తుంది' అంటూ నచ్చచెప్పడం మొదలుపెట్టాడు. 

మామయ్యకుకూడా చెప్పలేని సంకటం తనది. ఆయనే రామారావుని కలిసాడో, రామారావే ఆయన్ని కలిసాడో! ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చాలాకాలంగా పరిచయమున్నవాళ్ళకు మల్లే కలివిడిగా తిరగడం మరీ ఆశ్చర్యమనిపించింది శశికి. సుభద్రమీదా ఏ మత్తుమందు చల్లాడోగానీ.. అదీ మాటమాటకూ ఈ మధ్య 'బావగారం'టూ రామారావునే తలుచుకొంటోంది! ఇంతమంది దృష్టిలో మంచివాడు అనిపించుకున్న మనిషిలో నిజంగా మంచితనం ఉండకుండా ఉంటుందా? మంచి ఉద్యోగం. వయసూ మరీ అంత మించిపోలేదు. కావాలనుకుంటే అతను పెళ్ళిచేసుకోడానికి ఆడపిల్లలే దొరక్కపోతారా? అందాకా ఎందుకు? తను సుభద్రను ఇవ్వాలనుకోలేదూ! అయినా ఇవేవీ కాదనుకుని తనమీదే దృష్టి నిలిపాడంటే.. సినిమాల్లోలాగానే తనంటే ఇష్టమున్నట్లుంది!

తను ఇష్టపడేవాళ్లకన్నా ..తనను ఇష్టపడేవాళ్ళు దొరకడం నిజంగా అదృష్టమే! చేతిదాకా వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకోవడం తెలివైన పనేనా? శశిమనసులో సుడులుతిరిగే ఆలోచనా తరంగాలు.

ఒకసారి ఆలోచనంటూ చొరబడాలేగాని.. దాన్ని మనసులోనుంచి తరిమేయడం అంత సులభం కాదు. ఆర్నెల్ల పైనుంచి నడుస్తోందీ వ్యవహారం. శశికి తెలియకుండానే రామారావు ఆమె మనసులో తిష్టవేసాడు. సుబ్బరాజుతో ఆమె పరిచయం కేవలం రెండునెలలే! రామారావుతో స్నేహం ఎన్నో ఏళ్లబట్టి నడుస్తోన్నట్లనిపిస్తుందీ మధ్య మరీ. 

శశి పెళ్ళికి 'ఊఁ' అనడంతో కథ సుఖాంతమయింది. ఈ మాఘమాసంలోనే శశి, రామారావుల పెళ్ళి జరిగిపోయింది. ఇవాళ మొదటి రాత్రి.

*** 

'ఎళ్ళి చూపులు అంటేనే ఆడపిల్లకు ఒక పరీక్ష. అందులో నెగ్గితేనే కదా 'శ్రీమతి' డిగ్రీ వచ్చేది! నాకా బాధ లేకుండా పోయింది. ఇక మీ వాళ్ళు పెట్టిన పరీక్ష అంటారా? ఒకసారి పెళ్ళిపీటలమీద కూర్చొని లేచినదాన్ని. ఇలాంటి పరీక్షలు తప్పవులేండి! దానికి మీ అమ్మానాన్నలను తప్పుపట్టడం భావ్యంకాదు.' అంది శశి రామారావువంక ప్రేమగా చూస్తూ. 

రామారావు సీరియస్ గా అన్నాడు 'శశీ! నీకు ఒక విషయం చెప్పాలి. ఇద చెప్పకుండా దాచిపెడితే నాకూ .. మా అమ్మానాన్నలకూ తేడా ఉండదు'

'ఏంటండీ.. ఉన్నట్లండి అంత సీరియస్సయి పోయారు?' అంది శశి భయంభయంగా.

'విషయం కాస్త సీరియస్సే! నువ్వెలా రిసీవ్ చేసుకొంటావోనని బెంగగా కూడా ఉంది.  అయినా చెప్పడం నా ధర్మం. దాచివుంచడం నా నైజంకూడా కాదు'

'ఏంటండీ.. అంతగా దాచివుంచిన రహస్యం?' శశి గుండెలు గుబగుబలాడుతున్నాయి. 

'నీతో పెళ్ళికి ఒప్పుకోవడానికి మా అమ్మావాళ్ళు ఒక షరతు పెట్టారు. నిన్ను మెడికల్ గా పరీక్ష చేయించాలని. కన్య అని రుజువయితేనే తాళి కట్టాలని..'

శశి మొహం ఒక్కసారిగా జేవురించింది. రామారావు తనధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు. 'నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకూ ఇట్లాంటి సమస్యే ఒకటి ఎదురయింది. టైపు, షార్టుహ్యాండు ప్రాక్టీసు చేస్తున్నానారోజుల్లో. మా తాతగారు ఆరోగ్యం బాగోలేక దాదాపు డెత్ బెడ్ మీదున్నారు. ఆ వత్తిడిలో నాపరీక్ష పోయింది. నేనా పరీక్ష పాసయితే తను పనిచేసిన కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించాలని మా తాతగారి ఆశ. డాక్టర్లింక కొన్ని రోజులు మాత్రమే టైముందని ప్రకటించిన సమయంలోనే  నా పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 'పరీక్ష ఏమయిందిరా?' అని ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకొని అడిగితే 'పాసయ్యాను తాతయ్యా!' అంటూ స్వీటు నోట్లో పెట్టాబోయాను. స్వీటయితే తినలేదుగానీ..  ఆ సంతోషంలో తృప్తిగా కన్నుమూయడం నాకింకా బాగా గుర్తు. నా చేత ఆ రోజు అట్లా అబద్ధమాడించింది మా నాన్నే!'

'ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నట్లు?!'అని అయోమయంగా అడిగింది శశి.

'అట్లాంటి సంఘర్షణే మళ్ళా వచ్చింది శశీ నా జీవితంలో! పెళ్ళికిముందు క్యాజువల్ గా చేయించామని చెబుతున్న  పరీక్షలు నిజానికి  'వర్జిన్ టెస్టులే'

'కావే! అయుంటే నాకు తెలిసుండేవి' అంది శశి ఆశ్చర్యంగా. ఆమె పెదాలు ఆవమానభారంతో వణుకుతున్నాయి. 

'కావు. నాకు తెలుసు. కానీ ఉద్దేశం అయితే అదే కదా! అమ్మానాన్నలను ఒప్పించడానికి నాకు తెలిసిన డాక్టర్లచేత అట్లాంటి నీచమైన నాటకం ఆడించాను. లేకపొతే నువ్వు నాకు దక్కవని భయమేసింది'

శశినుంచి సమాధానం రాలేదు. రెండు మోకాళ్ళమధ్య తల పెట్టుకొని అలా ఉండిపోయిందామె చాలా సేపు.

ఏం చేయాలో అర్థంకాలేదు రామారావుకి. సాహసంచేసి  బలవంతంగా ఆమె చుబుకం  పైకెత్తాడు. అగ్నిగోళాల్లా మండుతున్నాయి శశి రెండు కళ్ళు. 'మీరు మీ వాళ్ళకి నిజం చెప్పుండాల్సింది. సుబ్బరాజుగారు నేనూ ఆ మొదటి రాత్రి.. ' 

చప్పున ఆమె నోరు మూసేసాడు రామారావు 'మోహనరావు చెప్పాడదంతా.  సుబ్బరాజుగారు చనిపోయేముందు అందుకే తనకన్నా నీ గురించే ఎక్కువ వర్రీ అయాడనీ చెప్పాడు. అది వినప్పట్నుంచే నిన్నెలాగైనా నా దాన్ని చేసుకోవాలనుకున్నాను శశీ!'

నమ్మలేనట్లు  చూసింది శశి కళ్ళింతింత చేసుకుని. 

'అయితే జాలితో పెళ్ళి చేసుకున్నారా?' అనినువ్వడగచ్చు.  చూడకముందు సానుభూతి.. చూసిన తరువాత ప్రేమానుభూతి.. అదీ టూకీగా నా ప్రేమకథ' అన్నాడు రామారావు.

'సినిమాల్లోనే ఉంటారనుకున్నాను.. మీలాంటి మంచివాళ్ళు నిజంగాకూడా ఉంటారన్నమాట!' అంటూ శశి రామారావు గుండెలమీద వాలిపోయింది. 

'పెళ్ళి తరువాత నువ్వు గడిపింది ఒక్కరాత్రే. నా భార్య పోయింది నా బిడ్డను కనలేక. తనూ పోయేటప్పుడు సుబ్బరాజుగారిలాగానే నా గురించి ఎక్కువ బాధపడింది. నేను నిన్ను స్వీకరించడంలో గొప్పేముంది? నువ్వు నన్ను ఆమోదించడంలోనే ఉందసలు గొప్పదనమంతా!' అంటూ శశిని తన గుండెలమీదకు లాక్కున్నాడీసారి చొరవగా రామారావు. గువ్వలా అతని గుండెల్లోకి ముడుచుకుపోయింది ఆమె కూడా!

*** 

( ఆంధ్రభూమి- వారపత్రిక- 4 జూన్ 2015 సంచికలో ప్రచురితమైన నా కథ) 

బతకనేర్చిన వాడు రచనః కర్లపాలెం హనుమంతరావు-- చిన్నకథ

 



రాంబాబు నావలో బొబ్బర్లంక చేరాడు. అల్లుడుగారిని రిసీవ్ చేసుకోడానికి వెంకయ్యగారే స్వయంగా ఒడ్డుమీద వేచివున్నారు. వెంకయ్యగారు ప్రస్తుతం ఆ పరగాణామొత్తానికి ఎన్నికైన ప్రజాప్రతినిధి.

సామానంతా దిగిం తరువాత అందరితోపాటే నావయజమాని రామలింగానికి రవాణాచార్జీలు చెల్లించబోయాడు రాంబాబు. రామలింగం చాలా నొచ్చుకొన్నాడు

'వెంకయ్యగారి అల్లుడంటే ఊరంతటికీ అల్లుడేనండీ బాబూ! అల్లుళ్లదగ్గర డబ్బులు దండుకొనే అథమస్థాయికి చేరలేదండీ ఈ రామలింగం ఇంకా!' అంటూ ఏవేవో నిష్ఠురాలాడాడు.

వెంకయ్యగారు రొయ్యమీసాలు మెలేసుకొంటూ అంతా ప్రసన్నంగా విన్నారు.

మామగారికా ఇలాకాలో ఎంత మందాన మర్యాద మన్ననలు అందుతున్నాయో స్వయంగా చూసిన అల్లుడురాంబాబు ఆనందంతో తబ్బుబ్బయిపోయాడు.

పెద్దపండుగ మూడురోజులు అదే పద్ధతిలో బ్రహ్మాండంగా గడిచిపోయింది రాంబాబుకు అత్తారూర్లో.

భార్యాపిల్లలు మరో వారం రోజులుండి వస్తామన్నారు.  ఏడాదికి సరిపడా ఊరగాయ పచ్చళ్ళు, పండుగకట్నంగా మామాగారిఛ్చిన టీవీ సెట్టులాంటి భారీసామానుతో ఒంటరిగానే తిరుగు ముఖం పట్టాడు రాంబాబు. వెంకయ్యగారే స్వయంగా లాంచి దాకా వచ్చి వీడ్కోలు పలికారు.

నావ అవతలి ఒడ్డు చేరుకోగానే ప్రయాణీకులంతా రామలింగానికి చార్జీలు చెల్లించి సామాను దింపుకొని పోతున్నారు. వెంట తెచ్చుకొన్న సామాను దింపించుకొని పోయేందుకు రామలింగం కోసం ఎదురుచూస్తూ నిలబడున్నాడు రాంబాబు.

రామలింగం ఇటువైపు రావడంలేదు సరికదా.. రెండుమూడుసార్లు పిలిచినా విననట్లే ఎటో వెళ్ళిపోతున్నాడు! రాంబాబుకి పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మామగారు ఎదురుగా లేరు కదా! ఈ ఓడమల్లయ్య ఇప్పుడు నిజసరూపం చూపిస్తున్నాడన్నమాట!

చేసేదేముంది! రాంబాబూ అందరికి మల్లేనే రవాణా చార్జీలు రామలింగం చేతిలో పోసి 'ఇహనైనా నా సామాను వడ్డున పెట్టిస్తారా?' అనడిగాడు సాధ్యమైనంత వెటకారం జోడిస్తూ!’

రామలింగం అదేమీ పట్టించుకోకుండా వెకిలిగా నవ్వుతూ 'అల్లుడుగారు వచ్చినప్పటి  చార్జీలుకూడా ఇప్పిస్తే .. ఇదిగో ఇప్పుడే సామాను వడ్డుమీదకు పట్టిస్తా..' అనేసాడు.

అవాక్కయిపోవడం రాంబాబు వంతయింది.

దక్కిస్తూ పాత చార్జీలుకూడా పైసలుతో సహా రామలింగానికి సమర్పించుకొని సామాను వడ్డుకు పట్టించుకొన్నాడు బతుకుజీవుడా అనుకొంటో!

'బతకనేర్చినవాడురా బాబూ!' అని గొణుక్కునే రాంబాబు దగ్గరికొచ్చి 'హి.. హి..హి' అన్నాడు రామలింగం 'తెలుసు బాబూ! తవరు నన్ను 'బతకనేర్చిన వాడురా బాబూ!' అని తిట్టుకొంటున్నారని తెలుసు. మరేం చెయ్యమన్నారు  చెప్పండల్లుడుగారూ! ఇదంతా మీ మాంగారిదగ్గర్నుంచి వంటబట్టించుకొన్న విద్యేనండీ బాబూ! ఎన్నికలముందు ఇంటిగుమ్మందాకా వచ్చి మరీ ఓటుకు  ఓ ఐదొందలనోటు చొప్పున  లెక్కెట్టి  ఇచ్చిపోయారండీ ధర్మప్రభువులు! అందరం ఓట్లేసినాం. ఎన్నికల్లో గెల్చినారు సారు. మేం ఎన్నుకొన్న ప్రజాప్రతినిధేకదా.. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు కదా అని.. మా పేదోళ్లందరికీ తలా ఓ నాటుపడవైనా ఇప్పించమని ఆడగాడానికని వెళ్ళాం బాబూ! ఏం చేసారో తెలుసా మీ మాంగారు? నావలు కొనుక్కోడానికి బ్యాంకోళ్ళు ఇచ్చే అప్పుకు సిఫార్సు చేయడానికి మడిసికి ఐదువేలు చొప్పున లెక్కెటి మరీ  వసూలు చేసేసారండీ! పెద్దోళ్లకేనా మరి బతకనేర్చిన విద్యలన్నీ? పేదోళ్ళకు మాత్రం కావద్దా? మేం నేర్చుకొంటేనే తప్పయిపోతుందాండీ? ఏం చోద్యం సాగుతోందండీ లోకంలో!’ అంటూ నావను నెట్టుకొంటో వెళ్ళిపోయాడు రామలింగం.

(సూర్య దినపత్రికలో ప్రచురితం)

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ

10 -02 -2021

***

 

పుష్పాభిషేకం - కథానిక - కర్లపాలెం హనుమంతరావు- ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురణ


 

పుష్పాభిషేకం - కర్లపాలెం హనుమంతరావు - ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక మే - 11 2000 నాటి సంచికలో ప్రచురితం 

కవిత : నిరాశ-అత్యాశ కర్లపాలెం హనుమంతరావు

 


అన్నం పళ్ళెం బైట  పడ్డ మెతుకును నోట్లో వేసుకోవచ్చు. కానీ ఎందుకో ఊడ్చిఓ మూలకి .. వీలైతే చెత్తకుప్పలోకి తోసేస్తావు!

నట్టింటికి ఓ నల్ల వెంట్రుక కొట్టుకొచ్చినా అంతే.  మైల వస్తువు కంటబడ్డంత  చిరాకు. తప్పుకు  పోతావు. మరీ దయ పుడితే ఓ చీపురు సాయంతో ఓపిగ్గా  చెత్తబుట్ట శ్మశానంలో సమాధి చేస్తావు!

ఏ వెంకి నాయుడుబావకని ఎంతిష్టంగా వండిందో  సన్నన్నం  కూడు! వడ్డించే వేళ జారి  పడుంటుందీ  మెతుకు!

ఏ ఏడుమల్లెల  రాకుమారి ఒంటిస్థభం మేడ చివరంతస్తు కిటికీ ముందు నిలిచి ప్రియతముణ్ణి తలచుకుంటూ కురులారబోసుకుందో!

పిల్లగాలి అల్లరికి జారి భువిసీమకి దిగి వచ్చిందీ  జలతారు కారుతీగ!

 ఎన్నెన్ని మధుర భావనల్లో మునిగి తేలుతూ  ముగ్ధ ఎన్నేసి దినాలు ఎంత ప్రేమగా  ఎన్నిలక్షల  ప్రియక్షణాల నర్పించి నునుపు తేల్చిందో బంగారమూరే  అంగుళీయక శిరోభాగానికి  రంగుల కిరీటమద్దానికి!

ఒక కరకు కత్తెర మొరటు వేటు చాలు..  తల తెగి నేలబడి ఉత్తర క్షణమే  అశుభ సూచకంగా  భయపెట్టడానికి!

ప్రేమ అంటాం. ప్రణయమంటాం. ఎన్నెన్ని జన్మలకైనా విడదీయలేని అపురూప బంధమనుకుంటాం. ఈ నునుపు తేలిని వంటి తుంటరి భావానికి మరో మెరుపు తీగ వంటిమీదున్న అంటుని రంగరించి ఏవేవో ఊహించుకుంటాం!

ఆ చూపు మన మీదకి సోకనప్పుడు లోకం వట్టి శూన్యబిలమని దుఃఖమొస్తుంది. అటువైపు గాలి తగిలితే చాలు వళ్ళు పులకించి  తటాకం మీది తామరతూడులను ఆదిలించే చిరు కెరటమై మనసు అలలు అలలుగా పరుగులు పెడుతుంది.   ఊహ మనసునావరించిందా.. ఇహలోకమే 'ఇహ నా కవసరం లేనే లేదు పొమ్మ'నాలనిపిస్తుంది.

ఒకపలకరింపు, ఒక కంటి మెరుపు,  ఒక నవ్వు చూపు, ఒక ఒప్పుకోలు పెదవి వంపు, ఒక చెక్కిలి చిరుసిగ్గు ఎరుపు, ఒక చాటు చిలిపి తలవూపు చాలు.. ఎన్ని జన్మలు చాలవు  పదిలంగా  గుండెల్లో భద్రపర్చుకునేందుకు- అనుకుంటాం. 

కానీ

బతుకు పచ్చి సత్యం గెలుపు పరుగుపందెం ఉరుకు పరుగుల వత్తిళ్ళు వగర్పుల మధ్య.. ఒక చోట మనసుని ఒకరక్షణమైనా  నిలిపి ఉంచగలవా?

ఆ పాత స్మృతులెంత ఆపాత మధురాలైనా  ముచ్చట్లు పెట్టుకో గలవా.. 

ఎప్పుడో  ఓ పూట మధ్యర్థరాత్రి  నిద్రపొరల అడుగు మడతల్లోనుంచి  కలత మనసుతో ఆప్యాయంగా  తడుముకోడం తప్పించి!

తెల్లారి మెలుకువలో మళ్లీ తల్చుకుని చూడు.. ఆ ఊహంతా వట్టి గుప్పెట పట్టిన పొగ కుప్పేగా!

కంటికింపుగా  చిటారు కొమ్మకు వేళాడే గులాబి పువ్వు ను నువ్వు చూస్తున్నావు.

రేపు  వాడి వసై  నేల రాలే రేకులను చూస్తున్నాను నేను.

నాది అంతంమీది నిరాశ.

నీది అంతకు ముందటి అందంమీది అత్యాశ.

 -కర్లపాలెం హానుమంతరావు

 

ధర్మ నిర్ణయం - కథానిక - కర్లపాలెం హనుమంతరావు

 


ధర్మనిర్ణయం- కథానిక 

- కర్లపాలెం హనుమంతరావు 


 

బ్యాంకుడ్యూటీనుంచి ఇంటికి వస్తూ వసూ రామకృష్ణాపురం ఓవర్ బ్రిడ్జిమీద వెనకనుంచీ వస్తున్న ఇసుకలారీ గుద్ది బైకుమీదనుండి పడిపోయాడు గోవిందరావు.

ఆ సమయంలో చీకటి. వర్షంకూడా జోరుగా పడుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే సాధారణంగా ఆ బ్రిడ్జిమీద జనసంచారం కనిపించదు అంతగా.

దాదాపు రెండు మూడు గంటలు అపస్మారక స్థితిలో పడివున్నాడు గోవిందరావు.

ఎవరో గమనించి అతని దగ్గర ఉన్న సెల్ఫోనులోనుంచి ఇంటివాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఆయన్ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి అర్థరాత్రి దాటిపోయింది. 

మెడికో లీగల్ కేసు కనక ముందు పోలీసు రిపోర్టు అవసరం. ఆ తతంగమంతా పూర్తయి చికిత్స ఆరంభమయే వేళకి తెలిసింది.. పేషెంటు కోమాలోకి వెళ్ళిపోయాడని!

గోవిందరావు కొడుకు శరత్ గ్రూప్ త్రీ సర్వీస్ కమీషన్  ఇంటర్వ్యూలకని ఢిల్లీ వెళ్ళివున్నాడా సమయంలో. ఇంటార్వ్యూ ముగించుకొని ఇంటికి ఎలా వచ్చిపడ్డాడో తెలిదు.. ఇల్లంతా శోకసముద్రంలో మునిగివుంది.

'లాభంలేదు.. ఇంటికి తీసుకువెళ్లమంటున్నార్రా డాక్టర్లు! ఏం చేద్దాం?' అనడిగాడు గోపాలరావు. ఆయన శరత్ కి బాబాయి. అన్నగారు చేసే బ్యాంకులోనే లీగల్ ఆడ్వైజరుగా ఉన్నాడు. 

'నాన్న ఉన్నది కోమాలో కదా! ఎంత డబ్బు ఖర్చైనా సరే బతికించుకుంటాం బాబాయ్' అన్నాడు పళ్లబిగువున పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకొంటూ శరత్. 

'విషయం ఖర్చును గురించి కాదురా!..' ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు గోపాలరావుకి. 

'మరి?'

'శరత్ ని ఆసుపత్రి బయటవున్న కేంటిన్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి విపులంగా చెప్పే ప్రయత్నం చేసాడు గోపాలరావు. 'నాన్న కోమాలో ఉన్న మాట నిజమేకానీ.. డాక్టరులు చెబుతున్నదాన్నిబట్టి ఇంక హోప్స్ లేవురా!.. మనకింకో రెండు మూడు లక్షలు ఖర్చవడం తప్ప! ఇలా అంటున్నందుకు నాకూ బాధగానే ఉందిగానీ.. కొన్ని కొన్నిసార్లు వాస్తవాన్ని డైజస్టు చేసుకోక తప్పదు' 

'వాస్తవమేంటి బాబాయ్! నాన్న సజీవంగానే ఉన్నాడు. డబ్బుకోసం చూసుకొనే సమయం కాదిది. అమ్మకు తెలిస్తె చాలా బాధ పడుతుంది. పదండి.. వెళదాం!' అని లేచాడు శరత్.

బలవంతంగా శరత్ ని కూర్చోబెట్టాడు గోపాలరావు. 'అమ్మలాగా నువ్వూ ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎలారా! ప్రాక్టికాలిటీ కావాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో!' 

'బతికున్న మనిషిని డబ్బుఖర్చు చూసుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ చేయించుకొని పోవడమేనా ప్రాక్టికాలిటీ అంటే!' 

శరత్ గొంతులోని వెటకారాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు గోపాలరావు. 'చిన్నపిల్లాడు. జీవితమంటే ఏంటో అనుభవం లేనివాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలున్న ఏ కొడుకైనా అలాగే ఆలోచిస్తాడు. అన్నీ తెలిసిన తనే ఎలాగో నచ్చచెప్పి అన్నయ్యకుటుంబాన్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించాలి' అనుకొన్నాడు గోపాలరావు.

'మీ నాన్న తరువాత నాన్నంత వాణ్ని. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినరా!'అన్నాడాయన.

'తొందరగా చెప్పు బాబాయ్! అమ్మెందుకో కాల్ చేస్తోంది' అంటూ రింగ్ టోన్ కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు శరత్.

గోపాలరావు చెప్పాడు' మీ నాన్న రిటైర్మెంటు ఇంకో వారంలో ఉంది. కంపాషియేనెట్ గ్రౌండ్సుమీద బ్యాంకునుంచి బెనిఫిట్స్ రావాలంటే రూల్సు ప్రకారం ఎంప్లాయీ రిటైర్మెంటునాటికి  సజీవుడై ఉండకూడదు'

'డెత్ బెనిఫిట్స్  అంటే మనీనా? ఆ ముష్తి రెండు మూడు లక్షలకోసం జన్మనిచ్చిన తండ్రిని బతికుండగానే చంపేయడం నావల్ల కాదుగానీ.. పద బాబాయ్.. ఇక వెళదాం!.. డాక్టర్లతోకూడా మాట్లాడాల్సిన పని చాలా ఉంది' 

లేవబోయిన శరత్ ని బలవంతంగా లాగి కూర్చోబెట్టి అన్నాడు గోపాలరావు 'సాంతం వినిపోరా! బెనిఫిట్స్ అంటే నాటోన్లీ మనీ.. ఎంప్లాయిమెంటుకూడా! మీ నాన్న సర్వీసులో ఉన్నప్పుడే పోయాడని డాక్టర్లు సర్టిఫై చేస్తేనేగానీ మీ ఇంట్లో ఒకళ్లకి ఉద్యోగం రాదు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం కాదు. చెల్లాయి పెళ్ళి చెయ్యాల్సి ఉంది. మీ నాన్న చేసిన అప్పులున్నాయి!'

గోవిందరావు ఇంటిపరిస్థితులు గోపాలరావుకు తెలియనివి కావు. నీతికి, నిజాయితీకి నిలబడే అధికారిగా మంచిపేరైతే ఉందిగానీ.. కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో అన్నగారు విఫలమయ్యారనే ఒప్పుకోవాలి. శరత్ కి బాగా చదువు అబ్బినా విదేశాలకు పంపించి ఊడిగం చేయించడానికి ఇష్టపడలేదు. కొడుకుచేత ఇక్కడే ఎమ్మెస్సీ చేయించాడు. కూతురు పెళ్ళి ఇంకా వరాన్వేషణ దశలోనే ఉంది.

అయినా బిడ్డలకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి బతికుండగానే 'నీ వల్ల నాకేంటి ప్రయోజనం? వ్యాపారం చేసుకోవాలి.. పెట్టుబడి తెచ్చివ్వు! నీ ఉద్యోగం నాకిప్పించేసి నువు విశ్రాంతి తీసుకో!' అనే సంతానం అంతకంతకూ అధికమవుతున్న ఈ కాలంలో ఇలాంటి బిడ్డల్ని కలిగివుండటంకూడా అదృష్టమే!'శరత్ ను మనసులోనే అయినా  అభినందించకుండా ఉండలేకపోయాడు గోపాలరావు. 

'ఈ విషయాన్ని ఎలాగూ తల్లితో, చెల్లితో సంప్రదించడు వీడు! పోనీ తనే నేరుగా ఒకసారి వదినతో మాట్లాడితేనో!' అనిపించింది గోపాలరావుకి.

***

గోవిందరావుకి ఇంకో ఆపరేషన్ అవసరమన్నారు ఆసుపత్రి వైద్యులు. ఫస్టు ఆపరేషను వల్ల ఫర్దర్ డేమేజీ కంట్రోలయింది. ఈ ఆపరేషను సక్సెస్ అయితేనే పేషెంటు తొందరగా రికవరయే అవకాశం ఉంది. వికటిస్తేమాత్రం ప్రాణానికి ముప్పు. రిస్క్ ఫ్యాక్టరుమాతం కాస్త ఎక్కువే! ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి! బట్.. మేటర్ అర్జంట్! 'ఓకే' అనుకొంటే మాత్రం ఒక హాఫ్ ఇన్స్టాల్మెంటుకింద రెండు లక్షలు కౌంటర్లో కట్టేయండి' అంటూ పెద్ద ఫార్మాలిటీస్ లిస్టే చదివాడు ఆసుపత్రి సూపరింటెండు శరత్ ని పిలిచి కూర్చోబెట్టుకొని.

తల్లితో, చెల్లితో సంప్రదించి బాబాయిచేత రెండులక్షలు కౌంటర్లో కట్టిస్తున్నప్పుడు మాత్రం శరత్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. 

'కూలి పనయినా చేసి నీ సొమ్ము అణాపైసలతో సహా చెల్లిస్తాను బాబాయ్!' అని తన రెండు చేతులూ పట్టుకొన్న అన్నకొడుకుతో అన్నాడు గోపాలరావు 'ఆ కూలీపని చేసే ఖర్మనీకు పట్టకూడదనే అంతగా నీకు చెప్పుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు! మరోసారి ఆలోచించుకొన్న తరువాతే డబ్బు కడదాం!'

'ఈ నిర్ణయం నాదొక్కడిదే కాదు బాబాయ్! అమ్మకూ, చెల్లాయిక్కూడా నాన్నను మళ్లీ మామూలు మనిషిగా చూడాలని ఉంది' అని శరత్ అన్న తరువాత గోపాలరావు మౌనంగా సొమ్ము చెల్లించేసాడు.

ఆ సాయంత్రమే ఆపరేషన్ అయిపోయింది. రాత్రంతా కండిషన్ బాగానే ఉందన్నారు డాక్టర్లు. తెల్లారుఝామునుంచి కంగారు పడటం మొదలుపెట్టారు. 

సోర్యోదయానికన్నా ముందే గోవిందరావు అస్తమించాడు. ఏడుపులు.. పెడబొబ్బలు.. అయినవాళ్ళొచ్చి పరామర్శించడాలు.. చివరిచూపులకని ఎక్కడెక్కడివాళ్లో తరలివచ్చారు. ఫార్మాలిటిసన్నీ యథావిధిగా జరిగిపోయాయి. శరత్ తండ్రి చితికి కొరివిపెట్టాడు.

కొత్తసంవత్సరం ప్రపంచమంతా వేడుక జరుపుకొంటుంటే.. గోవిందరావు లేని లోటును  జీర్ణించుకొంటూ విషాదంగా గడిపింది శరత్ కుటుంబం.

శిశిరం శాశ్వతం కాదు. వసంతం మళ్ళీ రాక మానదు. ప్రకృతి చెప్పే పాఠం ఇదే!

మళ్లీ ఏడాది గడిచేసరికల్లా ఆ ఇంట్లో మరో బుల్లి గోవిందు కేరింతలు వినిపించాయి. తండ్రిపోయిన ఆర్నెల్లలోపే కూతురికి పెళ్ళి జరిపిస్తే ఆ కన్యాదానఫలం తండ్రికె దక్కుతుందని- శరత్ పంతంకొద్దీ చెల్లికి మంచిసంబంధం చూసి కళ్యాణం జరిపించాడు.

శరత్ కి తండ్రి చేసే బ్యాంకులోనే ఉద్యోగం వచ్చింది కంపాషియనేట్ గ్రౌండ్సుమీద. గోవిందరావు యాక్సిడెంట్ సందర్భంలో అయిన ఖర్చంతా బ్యాంకే భరించింది రూలు ప్రకారం. 

గోవిందరావు- రిటైర్మెంటుకి సరిగ్గా ఇరవైనాలుగ్గంటలముందు ఆసుపత్రిలో చేసినా ఆ రెండో ఆపరేషన్ విఫలమై చనిపోవడంవల్లే ఇవన్నీ సంభవమయాయి!

ఆసుపత్రి సూపరింటెండెంటుగారి సహకారంలేనిదే ఇవన్నీ సాధ్యమయేవి కాదు. గోవిందరావు చొరవవల్లె బ్యాంకునుంచి లభించిన రుణం సాయంతో చిన్న ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి పెంచగలిగాడు సూపరింటెండెంటు. గోవిందరావు ఇంటి పరిస్థితి వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకొమ్మని ప్రాఢేయపడింది మాత్రం గోపాలరావే!

డెసెంబరు ముప్పైఒకటో తారీఖునే అంత అర్జంటుగా అవసరం లేకపోయినా.. ఉన్నట్లు కలరిచ్చి రెండో ఆపరేషను చేయాలని నిర్ణయించడం వెనకున్న అంతరార్థం ఇప్పటికీ శరత్ కుటుంబానికి తెలీదు.

***

'ఇంతకాలం మీరు తోటివైద్యులందరికీ నిత్యం బోధించే మెడికల్ ఎథిక్సన్నీ ఇలా గాలికి వదిలేయడం న్యాయమేనా?' అని అడిగింది సూపరింటెండెంటుగారి భార్యామణి భర్తద్వారా ఇంట్లో అసలు విన్నతరువాత.

''నేను ఎథిక్సుని ఎప్పుడూ జవదాటను. ఇప్పుడూ జవదాటలేదు  మైడియర్ శ్రీమతిగారూ! మైండిట్.. ప్లీజ్! ఒక పేషెంట్ అన్ని రోజులు కోమాలో ప్రోగ్రెస్ లేకుండా పడివున్నాడంటేనే మెడికల్ భాషలో 'క్లినికల్లీ డెడ్'.  రిటైర్మెంటుకి ముందే గోవిందరావుగారి మరణాన్ని ధ్రువీకరించడంవల్ల ఏజ్ బార్ కి దగ్గరగా ఉన్న అతని కొడుక్కి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆర్థికపరమైన చిక్కుల్నుంచి ఆ కుటుంబం బైటపడింది. నేనా రోజున లోనుకోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ గోపాలరావుగారు ఏమన్నాడో తెలుసా! 'ఏ వృత్తికైనా ఎథిక్సుంటాయండీ! ఎథిక్సంటే రూళ్లకర్రపట్టుకొని చండశాసనం చేసి నిజాయితీపరుడనిపించుకోవడం ఒక్కటేనా? మేథస్సిచ్చిన వివేకాన్ని  ఉపయోగించి నిజమైన అర్హులను ప్రోత్సహించడంకూడా  కదా! అఫ్ కోర్సు  ఆయనే అన్నట్లు అది అన్నంపెట్టే తల్లిలాంటి సంస్థకి కన్నంపెట్టి చేసే ఘనకార్యంమాత్రం కాకుడదనుకో! నాలాంటి ఎంతోమందికి కొత్తజీవితాలను ప్రసాదించిన ఆ మంచిమనిషికి ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఇలా సాయంచేయడంలో ఎథిక్సును ఎక్కడ అతిక్రమించినట్లు! మరో ముఖ్యమైన విషయం చెప్పనా! అసలీ ఆలోచన చేసిందే ఆ గోవిందరావుగారి తమ్ముడు గోపాలరావుగారు. వృత్తిపరమైన ఎథిక్సుకి ఆయన పెట్టింది పేరు 'అన్నాడు ఆసుపత్రి సూపరింటెండుగారు. 

***

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్;  యూఎస్ఎ 

(స్వప్న కథలపోటీలో 'శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం పొందిన కథ- జూన్ 2012 సంచికలో ప్రచురితం)

 

 


అజ్ఞాన సమ్ 'ఉపార్జన’- సరదాగా - కర్లపాలెం హనుమంతరావు

 



" 'అజ్ఞానం' అంటే ఏంటి గురువా?"

" 'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?"

"తెలియదు కనకనే కదా స్వామీ.. తమరి  దగ్గరికీ రాక!"

"ఆ తెలియక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా"

"ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా కాస్త సెలవివ్వండి స్వామీ!’

" 'స్వ'  అనవద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది.  ఆ విశేషణం నీ సొంతానికి వర్తించేది.   రాజకీయాలల్లో ఉంటే  మినహా డాంబిక పదప్రయోగాలు  హాని చేస్తాయ్. ఆ  తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే'"

"చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడ ఉంటుందో  కూడా తమరే  వివరించి పుణ్యం కట్టుకోండి స్వామీ!"

గురువుగారు గడ్డం నివురుకున్నారు.

గురువుగారి గుబురు గడ్డంలో అజ్ఞానం  దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు..  అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు గోక్కుంటుంటారు! సీదా సాదా జీవులకు మల్లే బుర్రలు గోక్కోరు, 

"గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డు వంటిదని  ఎవరో  స్వాములవారా మధ్యో టీ.వీలో ప్రవచిస్తుండంగా  విన్నాను. అదెంత వరకు నిజం?"

" 'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టేన అబద్ధానికి 'గాడిద గుడ్డు' ఒక సంకేతంరా శుంఠా!  ఆ స్వామి వారన్న  మాట నూటికి నూటొక్కపాళ్లు  నిజమే!"

"మరి ఆ 'ఆజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?"

"'ఇంద' 

చిటికెడు పంచదార అప్పటికప్పుడు  గాలిలోనుంచి సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చెప్పు!' అన్నారు స్వామీజీ.

"తియ్యగా ఉంది స్వామీ!"

"ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు  తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు!" అన్నారు. 

ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ..!

కప్పు పెదాలకందించుకుని "కషాయంలాగా ఉంది స్వామీ!" అని  ముఖం చిట్లించాడు శిష్యుడు.

"'ఇంద" 

 ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 

“ఈ సారి కాఫీ రుచి చూడు! ఆదేశించారు గురువుగారు.

"భలే ఉంది స్వామీ!  కానీ ఏ రుచో చెప్పలేను"

"ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా సన్నాసీ!"

ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్డం శిష్యుడి వంతయింది. 

''అయితే స్వామీ…"

"..అర్థమయింది. వాసన గురించే కదా నీ నెక్ట్స్ క్వశ్చన్? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికేలేని అజ్ఞానానికి  వాసనేముంటుందిరా అజ్ఞానీ!"అన్నారు గురూజీ!

శిష్యుడికి మెల్ల మెల్లగా బోధపడుతోంది  అజ్ఞానసారం. అయినా ఇంకా ఏదో ఇతమిత్థంగా తేలని సందేహం. 

"స్వామీ! ఆఖరి ప్రశ్న. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలు మీద  జపం చేస్తుంటారు. నా వంటివాళ్ళు  మీ బోటి జ్ఞానుల పాదాల చెంత  చేరి తత్త్వబోధనలు వింటుంటారు. ఇంకొందరు గ్రంధపఠనం,  మరికొందరు ప్రపంచ పర్యటన.. ఇలా ఎవరికి తోచిన పద్ధతులు   వాళ్లు ఆచరిస్తుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు లేకపోతే మరి ఇన్నేసి తంటాలు అవసరమా స్వామీ?"

''మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి  కాబట్టి ఆ యాతనలేవో వాళ్లు అలా నిత్యం తలో రూపంలో పడుతుంటారురా బాలకా!"

"మరి అజ్ఞానం వల్ల ఏం ప్రయోజనం ఉందని  స్వామీ.. ఇంతమంది ఈ లోకంలో జ్ఞానసముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా  మూర్ఖవర్గంలోనే ఉండిపోడానికి కొట్టుకు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?"

"ఇదేరా భడవా.. అసలు సిసలు  అజ్ఞానభాండరమంటే! పొరుగువాడిని ప్రేమించు! నిత్యం సత్యమును మాత్రమే వచించు! ఆడవారిని తోబుట్టువులవలె గౌరవించు! పెద్దలమాట చద్దిమూటగా మన్నించు. ఆడి తప్పకుము. దొంగతనము చేయకుము. అహింస పరమ ధర్మము. జంతుహింస అమానవీయము. దుర్భాషలాడబోకుము! నీతి మార్గం వదలబోకుము!' వంటి మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ  ఏ మంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో  గడ్డి కరిస్తేనే కదరా  బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా  కూడబెట్టే  పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుండా అలా గాలికి వదిలేస్తే వాళ్లు అజ్ఞానం వల్ల చేసే అల్లరి చిల్లర్లతో సొంత ఇమేజి డేమేజవుతుంది కదా శిశువా?   పెద్దతనంలో  ఏ రోగమో రొప్పో వచ్చి   మంచాన పడ్డాక నీ ఏ మంచీ.. మన్నుగడ్డా పక్కగుడ్డలు మార్పించే  నాధుణ్ని రాబట్టలేదు. ఎక్కడెక్కడి రాబందులో సహేలీలు.. స్నేహితులంటూ  సంబంధాలు కలుపుకొని పొయస్ గార్డెన్లలోక్కూడా వచ్చి పాగా వేస్తారు.  సంపాదించుకున్న మంచి పేరుకు  తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా  కూడబెట్టుకుంటేనే కదరా అమాయకుడా ..  కోట్లు లక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదాట్లోకి దూకినప్పుడు గట్టెక్కగలిగేది! ఈదే పాదసేవకులకు సాయపడేదీ?  అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని  పడగొట్టాలన్నా  చెడ్డదారి  తొక్కడం మినహా  మంచి మార్గం మరోటేమన్నా ఉందా మూర్ఖా?   ఇందాక నువ్వన్నావే.. ఆ  జ్ఞానం  గన్నీ బ్యాగులు ఎన్ని గుట్టలు  గడించినా  జీవితంలో  సాధించింది సున్నా.  ఇలా వివిధ   మంచి చెడ్డలను  తర్కిస్తూ   భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాల కోసం దేబిరించటం కన్నా.. పదవుల్లో    పచ్చగా  ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో  పేర్రాయించుకునే దారులు వెదుక్కోవడం మేలు. ధనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ లేదీ లోకంలో! జ్ఞానసముపార్జన ధనసంపాదన కాళ్లకడ్డంరా శుంఠా! ఏ ఎన్నికల కోడి ఎప్పుడు కూస్తుందో ఎవడికీ తెలియని రోజుల్లో  ఎన్నికల సంఘం కోడులకు జడుస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది గోడుగోడుమనే ఏడుపులూ.. మొత్తుకోళ్లే! అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పడటానికి తొక్కలోని   జ్ఞానమార్గం నమ్ముకుంటే  అంతకు మించిన అజ్ఞానం మరోటి ఉండదు. ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?" 

శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోవడం మొదలు పెట్టాడు."కళ్లు తెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వసంగపరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్కొక్క   ప్రశ్నకే  లక్ష చొప్పున భక్తుల నుంచి నిర్మొహమాటంగా గుంజుతున్నారు!   తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజున్నాయి. ఏ శిష్యుడికైనా గురువు దారే అనుసరణీయం. అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది స్వామీ! మరీ ముఖ్యంగా పొలిటికిల్ సర్కిల్లో.  నా బిడ్డలకూ బారెడు  గడ్డాలూ మీసాలు పెరిగి నాలుగైదు ఆశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు  దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించుకోవాలి కదా! తమరిలాగా  అజ్ఞాన సమ్ 'ఉపార్జన'కే  నా ఓటు కూడానూ!" సభక్తిపూర్వకంగా చేతులు జోడించి  నిలబడ్డాడు శిష్యపరమాణువు.. 

***

కర్లపాలెం హనుమంతరావు 

16 -02 - 202| 

బోథెల్ ; యూఎస్ఎ


జనం మంచి - కథల లక్ష్యం- సాహిత్య వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు




కొన్ని కథలు ఎప్పుడు చదివినా కొత్త పాఠాలు అప్పగిస్తాయి. అ కథలు కథల కార్పొరేట్ విశ్వవిద్యాలయాల నుంచి తర్ఫీదు పొందినవా.. బతుకు వీధి బళ్లల్లో గుంట ఓనామాలు నానా తంటాలు పడి దిద్ది నేర్చుకొచ్చినవా ఇట్టే వాసనపట్టేయచ్చు. మట్టి రంగు కొట్టుకొచ్చిన ఆ కథల వంటి మీద వెంటనే గుర్తుపట్టే యూనీఫారాలేమీ తొడిగుండవు. అయితేనేం,  వానొచ్చినప్పుడు తాటాకు గొడుగేసుకుని, ఎండ ప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నప్పుడు మాడు మీద ఇంత ముసుగేసుకొని అయినా పరామర్శకు రాకుండా ఉండవు. చలి బెబ్బులలకు జడిసే రకం కావు బురద మళ్లను దాటుకుంటూ వచ్చే కథలు! బైట పడేందుకు నీరెండ ఎప్పుడు కాస్తుందా .. కాస్తింత వళ్లు ఆరుబయలు వేడిమికి ఆరబెట్టేసుకుని వీలైనంత తొందరగా మళ్లీ గదుల్లో దూరిపోదామనుకునే రకం కథలను వాకిలి ముంగిట్లోనే ఇట్టే గుర్తుపట్టేయచ్చు సులువుగా. ఏ వెన్నెల కోసమో, గంట కూడా కాకుండానే బైటకెళ్లిన మరే మధుర ప్రియభావుకుడి కోసమో విరహాలు నటిస్తో ఎదురు తెన్నులు చూసే నున్నితమైన కథల దారి వేరు. మొరటు కథలు ఎంత మంచు సోనలనైనా, వరద ఉధృతినైనా, అగ్గి గుండం తాకిడినైనా సరే.. ఆటకోటితనంగా  తట్టుకుని ఏదో ఓ వేషంలో చదువరి కంఫర్ట్ జోనులోకి జొరబడక మానవు.  వెదురు పొదల్లా వేణురాగాలు పలవరించి వలలోకి దింపేసే తరహా  కుట్రలు చెయ్యాలని అసలు ఆ పిచ్చి కథలకు తట్టనే తట్టవు. గిరిజనం సంబరాలొచ్చేదాకా  ఆగుతుందా ఏమిటీ.. దసరా పండగలకు మాత్రమే సరదాగా కోలాటాలాడుకునే ఖర్మ మాయామర్మమేమీ ఎరుగని అమాయక కథల కేమిటికి? చీమొచ్చి కుట్టినప్పుడు చివుక్కుమని ఎట్లా అనిపిస్తుందో.. చింత చెట్టు చిటారు కొమ్మ మీంచి పండు చేతి కందే లోపే కాల్జారి కిందపడ్డా అట్లాగే అనిపిస్తోందా కథలకు. ప్రకృతి కొట్టే మొట్టికాయల కెప్పుడూ జడిసింది లేదు కానీ.. ఇదిగో ఈ మానవ మృగంగాడె గాడెక్కువై వంటికి చేసే గాయానికి మరో మందేమీ దొరక్క విలవిలలాడ్డం కథలయి పుట్టిన పాపానికి అక్షరాల గుత్తులు!  చిన్నబళ్లో పెం బెత్తమాడిస్తూ అయ్యోరు సాయిలెన్స్ అన్నప్పుడే మూతి మీద వేసుకున్న వేళ్ల సందుల గుండా కిసకిసలాడడం ఆపుకోడం రాని పిచ్చి కతలకు.. ఎన్నేళ్లు వంటి మీద కొచ్చి  సలపరింఅలు పెడితేనేమి.. కాకీ నిక్కరోళ్ల తోలు బెల్టుల చురుకులకు, లాఠీ కర్రలాడినప్పుడు పిర్రల కయ్యే కమురు దెబ్బలకు వెన్నక్కి తగ్గుతాయనే!  పెద్దలు పనులు చక్కబెట్టుకునే వేళ  పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటయిన్ చెయ్యాలన్న బుద్ధీ జ్ఞానం మప్పాలంటే ముందీ బుద్ధీ జ్ఞానం కరుడు కట్టిన కథలను కాన్వెంటు నరకాలలోకి తోసి ఏం పెట్టి కొడితె దెబ్బ తగులుతుందో కూడా ఆనవాలు  పట్టే వీల్లేని పనిష్మెంటులివ్వడం ఒక్కటే ట్రిక్! కథలు చెప్పడమంటే  పిల్లకాయలాడుకునె ఆటపాటలా? కోతి కొమ్మచ్చులా? అని అడిగే బుర్ర బరబరా గొరుక్కొనేదు భయభక్తులు దండిగా మప్పున్న ఫుల్ వైట్ కాలర్డ్  జనాలకు గానీ..   ఎన్ని ధర్నా చౌకుల బహిష్కరణలైనా అణచలేని ఆందోళనలతో ఏదో దిక్కు కుండా కట్టు దిట్టమైన ఖరీదు కాపలాను ఛేదించైనా తెగించి ముళ్ల కంచెలు కూకొచ్చే రణరంగ సిపాయీ కతల బారులకా!  పిచ్చోళ్లల్లారా! తీరి కూర్చుని కొలతల లెక్కలేసుకుంటూ ఉత్తమత్వాన్ని కొలుచుకుంటూ ఎక్కించే పుస్తకాల బస్తాలకు ఈ కాయా కసరూ కతలు కనరు అనిపించి  చోటివ్వకపోవచ్చును. కథలకు కావాల్సింది చదువుకునే మనిషి బుర్రలోని  అన్కంఫర్ట్ జోనులో  కాస్తింత తన  వేదనాక్షరం ఇరుక్కునైనా సర్దుక్కూర్చునే చోటు. పూల కుండీలల్లో ఖరీదైన ఎరువులేసి ఎండ కన్నెరగక్కుండా  వేళ కిన్ని నీళ్లూ నిప్పులు పోసి  పెంచుకునే బోన్సాయ్ కథల మీద  మోజుంటే ఈ చిట్టడివి ప్రయాణం పెట్టుకోకపోవడమే మేలు!   దుబ్బుగా పెరిగి దారెక్కడికో ముందే తెలీని చీకటి కోనలో పెరిగే  గద్డీ గదాన్ని పలకరిద్దామంటేనే  ఈ తుప్పల్లోకి ఆహ్వానం. 

నిర్వచనాలు చూసుకుని కథలు పుట్టలేదు. పుట్టిన కథలకే నిర్వచనాలు పుట్టుకొచ్చిన నిజం మర్చిపోరాదు.  ఒక్కో మనిషికి, ఒక్కో మనసుకు, ఒక్కో జాతికి, ఒక్కో దెశానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో కులానికి, ఒక్కో ధర్మానికి, ఒక్కో నియమానికి, ఒక్కో నీతి రీతికి, ఒక్కో జాతి తీరుకి, ఒక్కో కాలాని బట్టి, ఒక్కో పెత్తనం అనుసరించి, ఒక్కో గుంపు నడకను బట్టి, ఎన్నైనా కథలు వస్తూనే ఉంటాయి. మనిషి ఉంది, మేధస్సు వికాసం చెందుతున్నంత కాలం కాల్పనిక లోకానికి ఎవరం హద్దులంటూ గీయలేం. గీసినా సఫలం కాలేం. ఈ సత్యం సత్యాన్వేషణకై ప్రస్థానించిన వైతాళికుల ప్రయాణం సగం దారిలోనే నిరోధించే ప్రయాస చేసేన గతకాలపు ప్రగతి నిరోధ శక్తుల వైఫల్య పరంపరలను బట్టే అర్థమవాలి నిజానికి. అయినా, తమ ఒక్క మాట మాత్రమే నిత్యం చెల్లుబాటు కావాలని తుళ్లింతలు పోయిన ఏ దుష్టశక్తికీ శాశ్వత సంస్మరణం లభించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనిపించవు. వక్రీకరించి మలచబడిన మంచితనం ఎంతకాలమని బలంగా వీచే ప్రకృతి సహజ ధర్మానికి ఎదురీది మనగలుగుతుంది? జీవంలోని సానుకూల పదార్థమేదో  ఎవరెంత  పన్నాగాలు పన్నినా మానుషత్వ ప్రగతిని నిరోధించలేని  అసంకల్పిత శక్తిని కల్పిస్తుంది. కవులు, కళాకారులు ఆ మానుషత్వానికి ఏజెంట్లు ఎప్పుడూ! రాముడిని గూర్చిన రాసిన రామాయణానికి ఎవరి ప్రోద్బలమూ అవసరం లేకుండానే దైవత్వం సిద్ధించింది. తామే కొత్త అధినాయకులమంటూ ఎప్పటికప్పుడు రెచ్చిపోయే  రాక్షసత్వ జాతికి ఎప్పుడు సమాజంలో మన్నించే స్థానం దక్కింది కాదు. అయినా రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, భస్మాసురుడు, నరకాసురుడు .. రావడాలు ఆగిపోలేదు. వారి కథల కో అంత మంటో వచ్చే దాకా రాముడు, కృష్టుడు, నరసింహుడు. బలరాముడు వంటి కథానాయకుల పుట్టుకల కథలూ అగడమూ   లేదు. కాకపోతే కాగల సత్కార్యం కాస్తింత  ముందుకు లాగేందుకే కళాకారుల సన్మార్గ సూచనలు.. దుర్మార్గ ఆలోచనలను తుంచె ప్రక్రియలు! అందులో ఒక ప్రక్రియ  ‘ కథ’ ! మంచిని ప్రోత్సహించడం, చెడు పొడగడితే ఎండగట్టడం.. అందుకే ఏ కథకైనా కంచికి పోయే ముందు ‘జనం మంచి’  లక్ష్యం కావాల్సుంది. 

- కర్లపాలెం హనుమంతరావు

జనవరి 21, 2021 

- బోథెల్ ; యూఎస్ఎ  

16 - 02 – 2021 

 


Sunday, February 14, 2021

ఉత్తమ కథానిక - సాహిత్య వ్యాసం - రచనః కర్లపాలెం హనుమంతరావు

 



ఆధునిక సాహిత్యంలో ఆబాలగోపాలాన్ని అమితంగా ఆకర్షిస్తున్న ప్రక్రియ 'కథానిక'. ప్రచురించే పత్రికల సంఖ్య గణనీయంగా పెరగడం, సర్క్యులేషనుకి ప్రధాన ఆకర్షణగా మారడం, పాఠకుల  రసానందానికి స్వల్ప వ్యవథి సరిపోవడం.. కథానికల ప్రాచుర్యత పెరగడానికి గల అనేక కారణాలలో కొన్ని ముఖ్యమైనవి. లోతైన సాహిత్యాభినివేశంతో నిమిత్తం లేదు.  కేవలం తీవ్ర ఆవేశం, గాఢపరిశీలనాసక్తి ఉంటే చాలు..  సాహిత్యరంగ ప్రవేశం చేయడం కథానిక ద్వారా సులభం.

అక్షరాస్యులంతా కావ్యాలు, ప్రబంధాలే కోరుకోరు. సులభంగా అర్థమవుతూ, సత్వర మానసిక ఆనందానుభూతులకు దోహదం చేసే సాహిత్యానికే అత్యధికుల ఓటు. 

వారానికి కనీసం రెండు, మూడు ప్రచురణ అవుతున్నా వెలుగు చూడని కథానికలు పత్రికల  కార్యాలయాల్లో పేరుకుపోతూనే ఉన్నాయి! కథానికలకు ఆ స్థాయిలో పాఠకుల అభిమానం, రచయితల ఆదరణ ఉందీ కాలంలో. ఒక్క రాశిలోనే కాకుండా వాశిలోనూ తెలుగు కథానిక ఎన్నోరకాలుగా వన్నెచిన్నలు పోవడం  ఆనందించదగ్గ పరిణామమే!

రోజువారీ జీవితంలోని తొడతొక్కిళ్ళ నుంచి తాత్కాలికంగా అయినా ఉపశమనం కలిగించే వినోదప్రక్రియలు పుంఖానుపుంఖంగా పుట్టుకొస్తున్న ప్రస్తుత వ్యాపార వాతావరణంలోనూ కథానికకు అపూర్వ ఆదరణ లభిస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం! వాస్తవజీవితంలోని అనుభవాలను, అనుభూతులను విపులంగా విస్తారంగా చర్చించే వీలున్న 'నవల' ఓ వంక అంతే దూకుడుతో ముందుకుపోతోన్నా.. ఉన్నంతలో సంక్షింప్తంగా సమగ్రతకు లోటు రాకుండా విషయ విశ్లేషణ చేసే 'కథానిక' వైపుకూ పాఠకుడు మొగ్గు చూపడానికి మరేమైనా ప్రత్యేక కారణాలున్నాయా?

కథానిక ప్రధానంగా ప్రజాసాహిత్యం. రచయుతదీ పాఠకుడిదీ ఒకే మేథోస్థాయి కావడం కథానికకు కలిసొచ్చే అంశం. కవిత్వంలోలాగా నియమ నిబంధనలేవీ  కథానిక నడకకు ప్రతిబంధకాలు కావు. చదివే కథ తనదో.. తన చుట్టూ గల సమాజానిదో అనే భావన కథానిక కలిగించినంత బలంగా సాహిత్యంలోని మరే ఇతర ప్రక్రియా  కలిగించలేదు. ఎంత కల్పన అయినా కథ సామాజిక  సరిహద్దులు అతిక్రమించలేదు. సాగతీతలకు, ముక్కు చుట్టూ తిప్పి చూపించడాలకు, విశ్లేషణల మిషతో సుదీర్ఘ చర్చలు సాగించడానికి   అవకాశంలేని స్థల, కాల పరిమితులు 'కథానిక'కు కలసివచ్చే బలమైన అంశాలు.

అశ్వహృదయం అవపోసన పట్టిన యోధుడికి పంచకళ్యాణి స్వారీ అంత  స్వారస్యంగా   ఉంటుంది మంచికథతో  ప్రయాణమంటే.

స్వల్పవ్యవధానంలోనే కల్పాంతజీవితాన్ని  ఆవిష్కరించే గొప్ప శిల్పకథలకు మన తెలుగు గొడ్డుపోలేదు.  అందుబాటులో ఉన్న పరికరాలతోనే మనసులను అందలాల్లో ఊరేగించే అందమైన కథలకూ మనదగ్గర కరువు లేదు. కొండను అద్దంలో చూపించడమే కథానిక ఉత్కృష్ట లక్షణం  అనుకుంటే .. అ కళలో విశ్వస్థాయికి దీటుగా కలం నడిపిన తెలుగు కథకుల జాబితా అప్పటిలా  ఇప్పుడూ సశేషమే!

కథానికకు ఇంత ప్రత్యేకమైన స్థానం సాహిత్యంలో ఎందుకున్నట్లు? కుదింపు, మదింపు లక్షణాలవల్ల ఎన్నుకున్న అంశం మీదే ఏకాగ్రత నిలబడుతుంది. వేళకు ప్రయాణీకుణ్ణి రైలుకు అందించే జట్కాబండి గత్తర కథానికలోని ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. వట్టి వేగమేకాదు.. ఒడుదుడుకులేవీ లేకుంటేనే ఆ  ప్రయాణం ప్రాణానికి సుఖం. గోలీ పేలీ పేలకముందే పరుగందుకునే పందెం ఆటగాడి చురుకుతనం కథానిక ప్రతి పదం పుణికిపుచ్చుకోవాలి. ఎత్తుగడ, నడక, ముగింపులో చదరంగంతో పోలిక కథానికది. ఆసాంతం చదివిన పాఠకుడి మానాసిక ప్రపంచం కొలతల్లో సగుణాత్మకమైన మార్పు సాధించగలిగినప్పుడే కథానికకు సార్థకత చేకూరినట్లు.   మంచికథానిక మెదడుకు కళ్ళు మొలిపించాలి. మనసుకు కన్నీళ్ళు తెప్పించాలి.  సాధారణ జంతుజాలంతోనే వింత వింత విన్యాసాలు చేయించే సర్కస్ ప్రదర్శనలాంటిది కథానిక రచన. మామూలు పదాలే విచిత్ర భావాలుగా  కూడబలుక్కుని పాఠకుడి మానసంమీద చేసే రసదాడి కథానిక.

ఎడ్గార్ ఎలెన్ పో దృష్టిలో కథంటే- స్వీయభావనలను పాఠకుడి మదిలో ముద్రించేందుకు రచయిత ఎన్నుకునే సహజసంఘటనల సంక్షిప్త కల్పిత సన్నివేశ మాలిక. ఫ్రెంచి కథారచయిత గైడీ మొపాసాకు కథంటే- నీరవ మానవ జీవన అగాథల్లోకి దూకి అక్కడ జరిగే యుద్ధాలను ఉత్కంఠభరితంగా చిత్రించడం. మొపాసా దృష్తిలో కథానిక అంటే సమాజమనే అంశంమీద రాసుకున్న షార్టుహ్యాండ్ నోట్సు. సత్యాన్ని సూటిగా చెప్పడం మించిన మంచి కథావిధానం మరొకటి లేదంటాడు రష్యన్ రచయిత చెకోవ్. అనుభవానికి రాని సంఘటనలకు దూరం పాటించడం చెకోవ్ నిజాయితీకి నిదర్శనం.  ముగింపు, బిగింపుల మీదకన్నా జీవితంలోని కొత్తకోణాలని అనూహ్యరీతిలో ఆవిష్కరించడంలోనే చెకోవ్ కి ఆసక్తి జాస్తి. 'అప్రస్తుతమైనది ఏదీ కథలో ప్రస్తావించరాదు' అనే  ప్రసిధ్ధ సూక్తి చెకోవ్ దే! సహజ సుందర సరళ ప్రాకృతిక వర్ణనలు కథానిక ‘కళ’నెలా పెంచుతాయో నిరూపించిన కథకుడు చెకోవ్. మొదలూ చివరా ముందే రాసి మధ్యభాగమంతా వంతెనలా నిర్మించడమే మంచికథ శిల్పరహస్యమని  చెకోవ్ భావిస్తాడు. మామూలు మనుషుల మామూలు జీవితాలనుంచి యధాతథంగా ఎత్తిరాసినట్లుండే సంఘటనలు సైతం చెకోవ్ మేధోకొలిమిలో పడి నిప్పులు విరజిమ్ముతుంటాయి. చెకోవ్ ఒక్కో కథానిక ఎంతమంది కొత్తరచయితలను సృష్టించిందో లెక్కతేల్చడం కష్టం. మొపాసా చెకోవ్ కిమ్ ఆదర్శం అంటారు.  

మొపాసా మరో అభిమాని సోమర్ సెట్ మామ్. అనుకోని సంఘటనలు అతని కథావస్తువులు. నాటకీయత పాలు జాస్తి. వినోదమే ప్రధాన ఎజెండా. ఒక్క తత్వానికే కట్టుబడని మనస్తత్వం. మానవ నైజం చుట్టూతానే మామ్ కథలు ప్రదక్షిణం చేస్తుంటాయి. సంప్రదాయం మీద తిరుగుబాటంటే  మొపాసాకు మహాఇష్టం. 'మనిషంటే మంచి చెడుగుల సమ్మిశ్రితం. సమస్యకు పరిష్కారం చూపించడం  రచయిత బాధ్యత కాదు. ఉపదేశాలు ప్రవక్తల పని. సాహిత్యేతర ప్రయోజనలకోసం రాయడమంటే రచనను దుర్వినియోగం చేయడమే!' ఇవీ స్థూలంగా కథానికమీద మామ్ అభిప్రాయాలు. మన బుచ్చిబాబు 'ఉత్తమ పురుష' కథావిధానంమీద మామ్ ప్రభావమే ఉందని  విమర్శకులు అభిప్రాయపడుతుంటారు.

పడమటిదేశాల్లో కథానిక ప్రక్రియమీద అమోఘమైన ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. సన్నివేశ చమత్కారం ప్రధానంగా 'పో' కథలు రాస్తే.. హెన్రీ జేమ్స్, హాథరన్ ఆంతరంగిక జగత్తుమీద ధ్యాస ఎక్కువ పెట్టి కథలు రాశారు. దేశీయ వాతావరణంమీద దృష్టి చెదరకుండా బ్రెట్ హార్టే కథలు రాస్తే.. భాషలో బిగువు చూపిస్తూనే నిరలంకార శైలిలో మంచికథలు సృష్టించిన మహానుభావుడు క్రేన్.  ఓ. హెన్రీ కథలు కొసమెరుపుకి పెట్టింది పేరు.

 

దేశాల మధ్య సాంస్కృతిక హద్దులు చెదిరిపోయిన నేటి నేపథ్యంలో.. కళాకారులు విశ్వవ్యాప్తంగా పరస్పరం ప్రభావితమయే వేగమూ అమితంగా పెరుగుతున్నది. తెలుగు కథానికకూ ఈ సూత్రం మినహాయింపు కాదు. పాలగుమ్మి, చలం, విశ్వనాథ,  బుచ్చిబాబు, కొకు, రావిశాస్త్రి, మధురాంతకం, చాగంటి, కాళీపట్నంవంటి కథావశిష్టులు ఒక తరాన్ని ఊపేస్తే.. ఖదీర్ బాబు, పతంజలి,  వేంపల్లి, తుమ్మేటి, సలీం, పెద్దింటి అశోక్ కుమార్ వంటివారు ఇప్పటి తరాన్ని    మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.

(ఏ తరంలోనైనా జాతిని ప్రభావితం చేసే సాహిత్యవేత్తల జాబితా సహజంగానే చాలా పెద్దదిగా ఉంటుంది. అందరి పేర్లు సోదహరణంగా ఉటంకించే  సమయం, సంధర్భం, స్థలం, కాలం, సావకాశం లేనికారణానే స్థాలీపులాకన్యాయంగా ఏ కొద్దిమందినో  స్మరించుకోవడం జరిగింది తప్ప.. మిగతా గొప్ప కథారచయితలను తక్కువచేసి చూపడంగా దయచేసి సహృదయ రచయితలు అపార్థం చేసుకోరాదని  మనవి)

కథలు ఎలా రాయాలి? అన్న విషయంలో  భిన్నాభిప్రాయాలెన్నైనా ఉండవచ్చుగానీ, 'ఎందుకు రాయాలీ?' అనే విషయంలో మాత్రం ప్రజాపక్షం వహించే సాహిత్యవేత్తలందరిది ఒకే అభిప్రాయం.

చలం, కొడవటిగంటిలకు వాస్తవికతే కథకు ప్రధానం. గ్రీకుల కళాదృష్టికి దగ్గరి అభిప్రాయం ఇది. భారతీయుల కళాదృష్టికి కాస్తంత విభిన్నమైనది ఈ ధోరణి. అగోచరాన్ని ఆవిష్కరించడమే నిజమైన కళాప్రయోజనంగా భావించడం భారతీయుల కళాతత్వం. భూసారాన్ని గ్రహించి భూమినే అంటిపెట్టుకుని ఉన్నా చిటారుకొమ్మను చేరి పరిసరాలను పరిమళభరితం చేస్తేనే కదా  ఏ కుసుమాలకైనా బతుకు సార్థకం! కళకూడా కసుమ సమానమే మరి  భారతీయులకు భావనలో!

వినోదమే ప్రధానమనుకునే కథలు ఆట్టేకాలం నిలబడడం కష్టమే! రసానందానికి సంస్కారమూ జతకూడినప్పుడే 'కథ' కాలానికి ఎదురొడ్డి నిలబడేది. తొలినుంచీ ‘తూర్పు’ వివిధ సంస్కృతులకు సంగమస్థానంగా వెలుగొందుతూ వస్తున్నది.  పాశ్చాత్యులకు లేని సమన్వయ దృష్టి అందుకే  ప్రాచ్యసాహిత్యానికి  అవసరమయింది. భారతీయసాహిత్యం ప్రారంభంనుంచి వైవిధ్యానికి ప్రతిబింబప్రాయంగానే ప్రకాశిస్తూ వస్తున్నది.  తెలుగు సాహిత్యంలో కథానిక హాలుని కాలంనుంచి  ఈ బహుముఖత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది.

మంచికి, అందానికీ మధ్య విరోధమేమీ లేదు కదా! తుక్కును బంగారంగా మార్చే విద్య వాస్తవికంగా ఉందో లేదో గానీ.. సాహిత్యప్రపంచంలో మాత్రం ఆ రసవిద్య నిస్సందేహంగా   చెల్లుబడిలో ఉంది. కథలకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఈ రసవిద్యలో అహుముఖ నైపుణ్యం ప్రదర్శించడమే!

 

రసానందమా? సమాజ శ్రేయస్సా? కథకుండవలసిన అంతిమ లక్ష్యం ఏది? అన్న వాదనే సహేతుకమైనది కాదు. కథానిక (ఆ మాటకొస్తే ఏ ఇతర సాహిత్య ప్రక్రియ అయినా సరే) నాలుగు రాస్తాల కూడలి మధ్యలో నిలబడిన 'సైన్ బోర్డు' లాంటిది. ఫలకంమీది అక్షరాలు కొట్టొచ్చినట్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటేనే బాటసారులను దృష్టిని ఆకట్టుకునేది. ఫలకం ప్రయోజనం సిద్దించేది. ఫలకం అందంగా ఉందికదా అని.. పెకిలించుకొని తెచ్చి ఇంటి పెరట్లో నాటుకుంటానంటే!

రసానందానికి సామాజిక హితానికి మధ్య వేసిన అందమైన బంధమే కథానిక. (ఇతర సాహిత్య రూపాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది). సానలు తీరిన వజ్రం ఒక్కో కోణం నుంచి ఒక్కో రంగును వెదజల్లినట్లు చిత్రిక పట్టిన కథ ఒక్కో చదువరికి ఒక్కో విధమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఏతావాతా తేలేదేమంటే.. తాత్విక దర్శనం, నైతికావేశం, సొందర్యదృష్టినుంచి మళ్ళకుండా, దైనందిక జీవితమో, పరిసరాల పరిశీలనమో, ఔన్నత్యం కోసం చేసే పోరాటమో.. ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలనుంచి  నిజాయితీగా గ్రహించిన కథావస్తువును.. సంక్షిప్తీకరించో, యధాతధంగా కానీ, చిలవలు పలవులుగా పెంచో.. సరళంగా, సరసంగా, సహజంగా, సుందరంగా.. సమగ్రతకు లోటు లేకుండా.. సూటిగా, తేటగా, చమత్కారంగా ఎత్తుగడ, మధ్యనడక, ముగింపులు చెడకుండా ఎక్కడా ఉత్కంఠ సడలకుండా పాఠకులచేత చదివించి.. చివరికి కలకాలం నిలిచే రసానందం అందించగలిగితే.. అదే ఉత్తమ కథానిక!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...