Sunday, February 14, 2021

ఉత్తమ కథానిక - సాహిత్య వ్యాసం - రచనః కర్లపాలెం హనుమంతరావు

 



ఆధునిక సాహిత్యంలో ఆబాలగోపాలాన్ని అమితంగా ఆకర్షిస్తున్న ప్రక్రియ 'కథానిక'. ప్రచురించే పత్రికల సంఖ్య గణనీయంగా పెరగడం, సర్క్యులేషనుకి ప్రధాన ఆకర్షణగా మారడం, పాఠకుల  రసానందానికి స్వల్ప వ్యవథి సరిపోవడం.. కథానికల ప్రాచుర్యత పెరగడానికి గల అనేక కారణాలలో కొన్ని ముఖ్యమైనవి. లోతైన సాహిత్యాభినివేశంతో నిమిత్తం లేదు.  కేవలం తీవ్ర ఆవేశం, గాఢపరిశీలనాసక్తి ఉంటే చాలు..  సాహిత్యరంగ ప్రవేశం చేయడం కథానిక ద్వారా సులభం.

అక్షరాస్యులంతా కావ్యాలు, ప్రబంధాలే కోరుకోరు. సులభంగా అర్థమవుతూ, సత్వర మానసిక ఆనందానుభూతులకు దోహదం చేసే సాహిత్యానికే అత్యధికుల ఓటు. 

వారానికి కనీసం రెండు, మూడు ప్రచురణ అవుతున్నా వెలుగు చూడని కథానికలు పత్రికల  కార్యాలయాల్లో పేరుకుపోతూనే ఉన్నాయి! కథానికలకు ఆ స్థాయిలో పాఠకుల అభిమానం, రచయితల ఆదరణ ఉందీ కాలంలో. ఒక్క రాశిలోనే కాకుండా వాశిలోనూ తెలుగు కథానిక ఎన్నోరకాలుగా వన్నెచిన్నలు పోవడం  ఆనందించదగ్గ పరిణామమే!

రోజువారీ జీవితంలోని తొడతొక్కిళ్ళ నుంచి తాత్కాలికంగా అయినా ఉపశమనం కలిగించే వినోదప్రక్రియలు పుంఖానుపుంఖంగా పుట్టుకొస్తున్న ప్రస్తుత వ్యాపార వాతావరణంలోనూ కథానికకు అపూర్వ ఆదరణ లభిస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం! వాస్తవజీవితంలోని అనుభవాలను, అనుభూతులను విపులంగా విస్తారంగా చర్చించే వీలున్న 'నవల' ఓ వంక అంతే దూకుడుతో ముందుకుపోతోన్నా.. ఉన్నంతలో సంక్షింప్తంగా సమగ్రతకు లోటు రాకుండా విషయ విశ్లేషణ చేసే 'కథానిక' వైపుకూ పాఠకుడు మొగ్గు చూపడానికి మరేమైనా ప్రత్యేక కారణాలున్నాయా?

కథానిక ప్రధానంగా ప్రజాసాహిత్యం. రచయుతదీ పాఠకుడిదీ ఒకే మేథోస్థాయి కావడం కథానికకు కలిసొచ్చే అంశం. కవిత్వంలోలాగా నియమ నిబంధనలేవీ  కథానిక నడకకు ప్రతిబంధకాలు కావు. చదివే కథ తనదో.. తన చుట్టూ గల సమాజానిదో అనే భావన కథానిక కలిగించినంత బలంగా సాహిత్యంలోని మరే ఇతర ప్రక్రియా  కలిగించలేదు. ఎంత కల్పన అయినా కథ సామాజిక  సరిహద్దులు అతిక్రమించలేదు. సాగతీతలకు, ముక్కు చుట్టూ తిప్పి చూపించడాలకు, విశ్లేషణల మిషతో సుదీర్ఘ చర్చలు సాగించడానికి   అవకాశంలేని స్థల, కాల పరిమితులు 'కథానిక'కు కలసివచ్చే బలమైన అంశాలు.

అశ్వహృదయం అవపోసన పట్టిన యోధుడికి పంచకళ్యాణి స్వారీ అంత  స్వారస్యంగా   ఉంటుంది మంచికథతో  ప్రయాణమంటే.

స్వల్పవ్యవధానంలోనే కల్పాంతజీవితాన్ని  ఆవిష్కరించే గొప్ప శిల్పకథలకు మన తెలుగు గొడ్డుపోలేదు.  అందుబాటులో ఉన్న పరికరాలతోనే మనసులను అందలాల్లో ఊరేగించే అందమైన కథలకూ మనదగ్గర కరువు లేదు. కొండను అద్దంలో చూపించడమే కథానిక ఉత్కృష్ట లక్షణం  అనుకుంటే .. అ కళలో విశ్వస్థాయికి దీటుగా కలం నడిపిన తెలుగు కథకుల జాబితా అప్పటిలా  ఇప్పుడూ సశేషమే!

కథానికకు ఇంత ప్రత్యేకమైన స్థానం సాహిత్యంలో ఎందుకున్నట్లు? కుదింపు, మదింపు లక్షణాలవల్ల ఎన్నుకున్న అంశం మీదే ఏకాగ్రత నిలబడుతుంది. వేళకు ప్రయాణీకుణ్ణి రైలుకు అందించే జట్కాబండి గత్తర కథానికలోని ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. వట్టి వేగమేకాదు.. ఒడుదుడుకులేవీ లేకుంటేనే ఆ  ప్రయాణం ప్రాణానికి సుఖం. గోలీ పేలీ పేలకముందే పరుగందుకునే పందెం ఆటగాడి చురుకుతనం కథానిక ప్రతి పదం పుణికిపుచ్చుకోవాలి. ఎత్తుగడ, నడక, ముగింపులో చదరంగంతో పోలిక కథానికది. ఆసాంతం చదివిన పాఠకుడి మానాసిక ప్రపంచం కొలతల్లో సగుణాత్మకమైన మార్పు సాధించగలిగినప్పుడే కథానికకు సార్థకత చేకూరినట్లు.   మంచికథానిక మెదడుకు కళ్ళు మొలిపించాలి. మనసుకు కన్నీళ్ళు తెప్పించాలి.  సాధారణ జంతుజాలంతోనే వింత వింత విన్యాసాలు చేయించే సర్కస్ ప్రదర్శనలాంటిది కథానిక రచన. మామూలు పదాలే విచిత్ర భావాలుగా  కూడబలుక్కుని పాఠకుడి మానసంమీద చేసే రసదాడి కథానిక.

ఎడ్గార్ ఎలెన్ పో దృష్టిలో కథంటే- స్వీయభావనలను పాఠకుడి మదిలో ముద్రించేందుకు రచయిత ఎన్నుకునే సహజసంఘటనల సంక్షిప్త కల్పిత సన్నివేశ మాలిక. ఫ్రెంచి కథారచయిత గైడీ మొపాసాకు కథంటే- నీరవ మానవ జీవన అగాథల్లోకి దూకి అక్కడ జరిగే యుద్ధాలను ఉత్కంఠభరితంగా చిత్రించడం. మొపాసా దృష్తిలో కథానిక అంటే సమాజమనే అంశంమీద రాసుకున్న షార్టుహ్యాండ్ నోట్సు. సత్యాన్ని సూటిగా చెప్పడం మించిన మంచి కథావిధానం మరొకటి లేదంటాడు రష్యన్ రచయిత చెకోవ్. అనుభవానికి రాని సంఘటనలకు దూరం పాటించడం చెకోవ్ నిజాయితీకి నిదర్శనం.  ముగింపు, బిగింపుల మీదకన్నా జీవితంలోని కొత్తకోణాలని అనూహ్యరీతిలో ఆవిష్కరించడంలోనే చెకోవ్ కి ఆసక్తి జాస్తి. 'అప్రస్తుతమైనది ఏదీ కథలో ప్రస్తావించరాదు' అనే  ప్రసిధ్ధ సూక్తి చెకోవ్ దే! సహజ సుందర సరళ ప్రాకృతిక వర్ణనలు కథానిక ‘కళ’నెలా పెంచుతాయో నిరూపించిన కథకుడు చెకోవ్. మొదలూ చివరా ముందే రాసి మధ్యభాగమంతా వంతెనలా నిర్మించడమే మంచికథ శిల్పరహస్యమని  చెకోవ్ భావిస్తాడు. మామూలు మనుషుల మామూలు జీవితాలనుంచి యధాతథంగా ఎత్తిరాసినట్లుండే సంఘటనలు సైతం చెకోవ్ మేధోకొలిమిలో పడి నిప్పులు విరజిమ్ముతుంటాయి. చెకోవ్ ఒక్కో కథానిక ఎంతమంది కొత్తరచయితలను సృష్టించిందో లెక్కతేల్చడం కష్టం. మొపాసా చెకోవ్ కిమ్ ఆదర్శం అంటారు.  

మొపాసా మరో అభిమాని సోమర్ సెట్ మామ్. అనుకోని సంఘటనలు అతని కథావస్తువులు. నాటకీయత పాలు జాస్తి. వినోదమే ప్రధాన ఎజెండా. ఒక్క తత్వానికే కట్టుబడని మనస్తత్వం. మానవ నైజం చుట్టూతానే మామ్ కథలు ప్రదక్షిణం చేస్తుంటాయి. సంప్రదాయం మీద తిరుగుబాటంటే  మొపాసాకు మహాఇష్టం. 'మనిషంటే మంచి చెడుగుల సమ్మిశ్రితం. సమస్యకు పరిష్కారం చూపించడం  రచయిత బాధ్యత కాదు. ఉపదేశాలు ప్రవక్తల పని. సాహిత్యేతర ప్రయోజనలకోసం రాయడమంటే రచనను దుర్వినియోగం చేయడమే!' ఇవీ స్థూలంగా కథానికమీద మామ్ అభిప్రాయాలు. మన బుచ్చిబాబు 'ఉత్తమ పురుష' కథావిధానంమీద మామ్ ప్రభావమే ఉందని  విమర్శకులు అభిప్రాయపడుతుంటారు.

పడమటిదేశాల్లో కథానిక ప్రక్రియమీద అమోఘమైన ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. సన్నివేశ చమత్కారం ప్రధానంగా 'పో' కథలు రాస్తే.. హెన్రీ జేమ్స్, హాథరన్ ఆంతరంగిక జగత్తుమీద ధ్యాస ఎక్కువ పెట్టి కథలు రాశారు. దేశీయ వాతావరణంమీద దృష్టి చెదరకుండా బ్రెట్ హార్టే కథలు రాస్తే.. భాషలో బిగువు చూపిస్తూనే నిరలంకార శైలిలో మంచికథలు సృష్టించిన మహానుభావుడు క్రేన్.  ఓ. హెన్రీ కథలు కొసమెరుపుకి పెట్టింది పేరు.

 

దేశాల మధ్య సాంస్కృతిక హద్దులు చెదిరిపోయిన నేటి నేపథ్యంలో.. కళాకారులు విశ్వవ్యాప్తంగా పరస్పరం ప్రభావితమయే వేగమూ అమితంగా పెరుగుతున్నది. తెలుగు కథానికకూ ఈ సూత్రం మినహాయింపు కాదు. పాలగుమ్మి, చలం, విశ్వనాథ,  బుచ్చిబాబు, కొకు, రావిశాస్త్రి, మధురాంతకం, చాగంటి, కాళీపట్నంవంటి కథావశిష్టులు ఒక తరాన్ని ఊపేస్తే.. ఖదీర్ బాబు, పతంజలి,  వేంపల్లి, తుమ్మేటి, సలీం, పెద్దింటి అశోక్ కుమార్ వంటివారు ఇప్పటి తరాన్ని    మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.

(ఏ తరంలోనైనా జాతిని ప్రభావితం చేసే సాహిత్యవేత్తల జాబితా సహజంగానే చాలా పెద్దదిగా ఉంటుంది. అందరి పేర్లు సోదహరణంగా ఉటంకించే  సమయం, సంధర్భం, స్థలం, కాలం, సావకాశం లేనికారణానే స్థాలీపులాకన్యాయంగా ఏ కొద్దిమందినో  స్మరించుకోవడం జరిగింది తప్ప.. మిగతా గొప్ప కథారచయితలను తక్కువచేసి చూపడంగా దయచేసి సహృదయ రచయితలు అపార్థం చేసుకోరాదని  మనవి)

కథలు ఎలా రాయాలి? అన్న విషయంలో  భిన్నాభిప్రాయాలెన్నైనా ఉండవచ్చుగానీ, 'ఎందుకు రాయాలీ?' అనే విషయంలో మాత్రం ప్రజాపక్షం వహించే సాహిత్యవేత్తలందరిది ఒకే అభిప్రాయం.

చలం, కొడవటిగంటిలకు వాస్తవికతే కథకు ప్రధానం. గ్రీకుల కళాదృష్టికి దగ్గరి అభిప్రాయం ఇది. భారతీయుల కళాదృష్టికి కాస్తంత విభిన్నమైనది ఈ ధోరణి. అగోచరాన్ని ఆవిష్కరించడమే నిజమైన కళాప్రయోజనంగా భావించడం భారతీయుల కళాతత్వం. భూసారాన్ని గ్రహించి భూమినే అంటిపెట్టుకుని ఉన్నా చిటారుకొమ్మను చేరి పరిసరాలను పరిమళభరితం చేస్తేనే కదా  ఏ కుసుమాలకైనా బతుకు సార్థకం! కళకూడా కసుమ సమానమే మరి  భారతీయులకు భావనలో!

వినోదమే ప్రధానమనుకునే కథలు ఆట్టేకాలం నిలబడడం కష్టమే! రసానందానికి సంస్కారమూ జతకూడినప్పుడే 'కథ' కాలానికి ఎదురొడ్డి నిలబడేది. తొలినుంచీ ‘తూర్పు’ వివిధ సంస్కృతులకు సంగమస్థానంగా వెలుగొందుతూ వస్తున్నది.  పాశ్చాత్యులకు లేని సమన్వయ దృష్టి అందుకే  ప్రాచ్యసాహిత్యానికి  అవసరమయింది. భారతీయసాహిత్యం ప్రారంభంనుంచి వైవిధ్యానికి ప్రతిబింబప్రాయంగానే ప్రకాశిస్తూ వస్తున్నది.  తెలుగు సాహిత్యంలో కథానిక హాలుని కాలంనుంచి  ఈ బహుముఖత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది.

మంచికి, అందానికీ మధ్య విరోధమేమీ లేదు కదా! తుక్కును బంగారంగా మార్చే విద్య వాస్తవికంగా ఉందో లేదో గానీ.. సాహిత్యప్రపంచంలో మాత్రం ఆ రసవిద్య నిస్సందేహంగా   చెల్లుబడిలో ఉంది. కథలకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఈ రసవిద్యలో అహుముఖ నైపుణ్యం ప్రదర్శించడమే!

 

రసానందమా? సమాజ శ్రేయస్సా? కథకుండవలసిన అంతిమ లక్ష్యం ఏది? అన్న వాదనే సహేతుకమైనది కాదు. కథానిక (ఆ మాటకొస్తే ఏ ఇతర సాహిత్య ప్రక్రియ అయినా సరే) నాలుగు రాస్తాల కూడలి మధ్యలో నిలబడిన 'సైన్ బోర్డు' లాంటిది. ఫలకంమీది అక్షరాలు కొట్టొచ్చినట్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటేనే బాటసారులను దృష్టిని ఆకట్టుకునేది. ఫలకం ప్రయోజనం సిద్దించేది. ఫలకం అందంగా ఉందికదా అని.. పెకిలించుకొని తెచ్చి ఇంటి పెరట్లో నాటుకుంటానంటే!

రసానందానికి సామాజిక హితానికి మధ్య వేసిన అందమైన బంధమే కథానిక. (ఇతర సాహిత్య రూపాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది). సానలు తీరిన వజ్రం ఒక్కో కోణం నుంచి ఒక్కో రంగును వెదజల్లినట్లు చిత్రిక పట్టిన కథ ఒక్కో చదువరికి ఒక్కో విధమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఏతావాతా తేలేదేమంటే.. తాత్విక దర్శనం, నైతికావేశం, సొందర్యదృష్టినుంచి మళ్ళకుండా, దైనందిక జీవితమో, పరిసరాల పరిశీలనమో, ఔన్నత్యం కోసం చేసే పోరాటమో.. ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలనుంచి  నిజాయితీగా గ్రహించిన కథావస్తువును.. సంక్షిప్తీకరించో, యధాతధంగా కానీ, చిలవలు పలవులుగా పెంచో.. సరళంగా, సరసంగా, సహజంగా, సుందరంగా.. సమగ్రతకు లోటు లేకుండా.. సూటిగా, తేటగా, చమత్కారంగా ఎత్తుగడ, మధ్యనడక, ముగింపులు చెడకుండా ఎక్కడా ఉత్కంఠ సడలకుండా పాఠకులచేత చదివించి.. చివరికి కలకాలం నిలిచే రసానందం అందించగలిగితే.. అదే ఉత్తమ కథానిక!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...