24 విభాగాలుగా ఉన్న భారత రాజ్యాంగంలోని మూడో భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ప్రపంచంలోని మరే రాజ్యాంగమూ ఇంత విస్తృతంగా ఈ తరహా హక్కులను గురించి ప్రస్తావించింది లేదు. అయినా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇక్కడే ఎక్కువగా జరగడం.. అదో విచిత్రం!
మాట్లాడే హక్కు నుంచి శాంతికి భంగం కలగకుండా సమావేశాలు జరుపుకునే హక్కు, సంఘాలు.. సంస్థలు పెట్టుకునే హక్కు, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలగడం, నివాసిస్తూ ఓ శాశ్వత చిరునామా పొందడం, చట్టబద్ధమైన పని, వ్యాపారం, ఉపాధి ఏదయినా యధేచ్ఛగా చేసుకోవడం .. వంటి హక్కులన్నింటి మీదా 19 నుంచి ఇరవైరెండో అధికరణ దాకా రాజ్యాంగంలో ఆదేశాలున్నా.. అతి ముఖ్యమైన వ్యక్తిగత హక్కుకు మాత్రం తరచూ తూట్లు పడడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వులపాలు చేసే వికృత చేష్టగా మాత్రమే చెప్పుకోక తప్పదు.
పుస్తకాలలో కాకుండా పౌరుడు వాస్తవ జీవితంలో ఎంత వరకు పౌరుడు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాడన్న అంశం మీదనే కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి సాఫల్యం ఆధారపడడం! అక్కదికీ ఎంత ప్రాథమికమైన హక్కైనా వ్యక్తి అనుభవించే విషయం దగ్గరికొచ్చే సరికి రాజ్యాంగమూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోలేదు. శిక్షాస్మృతి ఆర్టికల్ 124 (ఎ) స్వేచ్ఛను యధేచ్ఛగా అనుభవించేందుకు లేకుండా విధించిన ఈ తరహా జాగ్రత్తలలో ఒకటి. ఇది ఆంక్ష కాదు. ముద్దుగా తెల్లదొరలు ‘రాజద్రోహం’ గా పిల్చుకున్న ఆ కట్టడి స్వాతంత్ర్యం సాధించుకున్న ఇన్నేళ్ల తరువాత కూడా మన రాజ్యాంగంలో భద్రంగా పడివుండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఇంతకూ ఈ సెక్షన్ 124 (ఎ) ‘రాజద్రోహం’ అంటే ఏమిటీ? అంటే- స్థూలంగా ‘మాటలు, సైగలు, హావభావాలు, పీడించడాలు వంటి ఇంకే రకమయిన చేష్టల ద్వారా అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను పడగొట్టాలనిపించేలా పిచ్చి ప్రేలాపనలకు దిగితే సరాసరి ‘రాజద్రోహం’ నేరం కింద గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేలా చర్యలు తీసేసుకోవచ్చు’. వలస పాలకులు అప్పట్లో తమ రాజ్యం భద్రంగా ఉండడం కోసం పెట్టుకున్న ఈ అమానుష ఆంక్ష దేశం స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాత ఇక రాజ్యాంగంలో ఎందుకు? ఇటీవల కాలంలో దేశంలోని చాలా ప్రభుత్వాలకు గిట్టని వాళ్ళ నోళ్ళు మూయించడానికి మాత్రం ఈ సెక్షన్ మహా వాటంగా ఉపయోగిస్తున్నది. అదే దిగులు.
శిక్షాస్మృతిలో ఒకటిన్నర శతాబ్దాలుగా అట్లాగే పడివున్న ఈ భయంకర వ్యర్థ చట్టానికి సవరణలేమైనా వీలవుతాయేమోనన్న సంకల్పంతో సిఫార్శుల నిమిత్తమై రెండేళ్ల కిందట కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ నొకటి వేయడం, ఐపిసి సంస్కరణలకు
సంబంధించిన సూచనలేమన్నా ఉంటే చెప్పమని ప్రజల నుంచి, , ప్రజాసంఘాల నుంచి కోరడం లాంటి లాంఛనాలన్నీ పూర్తిచేసింది కూడా. కానీ, అంతు చిక్కని చిక్కులేవో రాజద్రోహం క్లాజు అంతిమ దహన సంస్కారాలకు అడ్డుపడుతున్నాయ్! బహుశా బెయిల్ కోసం ఏలాంటి నిబంధనలు ఇందులో పొందుపరచవలసిన అవసరం లేనందువల్లనా? ప్రభుత్వాలకు గిట్టనివాళ్లను ఎవరినైనా ఎంత కాలమైనా నిర్బంధంలో ఉంచుకొనే
వెసులుబాటు ప్రభుత్వాలకు ఈ సెక్షన్ కల్పిస్తుంది కదా!
1950లో రాజ్యాంగాన్ని రాసుకుని ఆమోదించే సందర్భంలోనే ఐపిసి తాలూకు ఈ 124 (ఎ)
అధికరణం రద్దు చెయ్యాలనే ప్రతిపాదన బలంగా వినిపించింది. సర్దార్ భోవిందర్ సింగ్, ప్రొఫెసర్ యశ్వంత్ రాయ్ లాంటి రాజ్యాంగ
ప్రముఖులు 1948
డిసెంబరు 2న జరిగిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చర్చలో ఈ ‘దేశద్రోహం’ అనే దుర్మార్గ పదాన్ని
చేర్చడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. రాజద్రోహం క్లాజు మౌలికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనేది మాజీ
ప్రధాని జవహర్ లాల్
నెహ్రూ అభిప్రాయం కూడా.
వక్రీకరించేందుకు, వ్యతిరేకులపై ఉపయోగించేందుకు సులువుగా ఉపయోగపడేది ఈ సెక్షన్ 124 (ఎ) లోని ‘అవిశ్వాసాన్ని’ అనే పదం. అందుకే ప్రసిద్ధ న్యాయవాది ఎ.జి నూరానీ ‘ఈ నిబంధన కింద, మేం ఎల్లవేళలా ప్రభుత్వాన్ని ప్రేమించక తప్పదన్నమాట’ అని ఎద్దేవా చేసేవారు. న్యాయశాస్త్ర కోవిదుడు ఫోలే ఎస్. నారిమన్ వాదన ప్రకారమయితే ప్రభుత్వాన్ని అవమానించడం లేదా విమర్శిస్తూ రాయడం, విద్వేషపూరితంగా మాట్లాడటమైనా సరే.. అసలు ‘దేశద్రోహం’ సెక్షన్ 124 (ఎ) కిందకే రాదు!
కానీ, ఇటీవలి కాలంలో, వివిధ రాష్ట్రాలలో పాత్రికేయుల నుంచి అధికారుల దాకా ఎందరో తరచూ ఈ దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఈ నేపథ్యంలోనే ఈ సెక్షనుతో పాత్రికేయుల ప్రాథమిక హక్కులు నిరాకరించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం బాధ్యులను గట్టిగా హెచ్చరించడం. తప్పు పట్టే పత్రికలది ప్రజల నిరసనగా తీసుకోవాలే తప్పించి, దేశద్రోహంలాంటి నాన్-బెయిలబుల్ అభియోగాలు మోపడమేంటని జనసామాన్యంలాగానే సుప్రీం కోర్టూ అభ్యంతరపెట్టడం ప్రజాస్వామ్యవాదులందరికీ ముదావహం కలిగించే పరిణామం.
ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరంగా, ఆరోపణలు చేసారంటూ ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువాపై బీజేపీ
పరువు నష్టం దావా వేసిందా మధ్యన. భాజపా నేత అజయ్ శ్యామ్ దాఖలు చేసిన అభియోగం మేరకు హిమాచల్ ప్రదేశ్ లో నమోదైన ‘రాజద్రోహం’ కేసును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భావప్రకటనా స్వేచ్ఛకు ఊపిరిపోసే ఔషధం.
భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా వేసిన
రాజద్రోహం వ్యాజ్యం పై 1962 నాటికే
కేదార్ నాథ్ సింగ్ కేసులో న్యాయమూర్తులు యు.యు లలిత్, వినీత్ శరణ్ లతో కూడిన ధర్మాసనం పాత్రికేయులకు
ఊరటనిచ్చింది. మళ్లీ ఇప్పుడు, కోవిడ్.. ఢిల్లీ
అల్లర్ల నేపథ్యంలో ప్రముఖ పాత్రికేయుడు వినోద్ దువా తయారు చేసిన యూ-ట్యూబ్ కార్యక్రమం బిజెపి నాయకులకు ఆగ్రహం తెప్పించిందని, ప్రధాని పరువుకు నష్టం కలిగినట్లు ఏ ఐపిసి 501,
ఐపిసి 505 సెక్షన్లో పోలీసులు బనాయించడాన్ని సుప్రీం కోర్ట్ తీవ్రంగా తప్పుపట్టింది.
ఏ ప్రభుత్వాన్నైనా సరే విమర్శించే హక్కు సాధారణ పౌరుడికి కూడా ఉంటుందని, హింసను ప్రజ్వరిల్లనంత
కాలం ఆ విమర్శను రాజద్రోహం కింద పరగణించడం కుదరదని సుప్రీం మరోమారు తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ప్రజావాణి వినిపించే రెండు ఛానళ్లపై కక్షపూరితంగా రాజద్రోహ నేరం ఆపాదించిన కేసును విచారించే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం అసలీ ‘రాజద్రోహం’ అధికరణ 124(ఎ) మొత్తాన్నే మొదలంటా కూలంకషంగా పరీశీలించవలసిన అగత్యం ఏర్పడిందని అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి తిరిగి మంచి రోజులు వచ్చే ఆస్కారమున్నట్లు న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న ఈ తరహా సంస్కరణవాదమే ఆశ కలిగిస్తున్నది.
-కర్లపాలెం హనుమంతరావు
11
-06 -2021