Sunday, December 12, 2021

పుల్లవిరుపు మాటలు భలే తీపి - సరదాకి -కర్లపాలెం హనుమంతరావు సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట కాలమ్ ప్రచురితం )

 పుల్లవిరుపు మాటలు భలే తీపి - సరదాకి 

-కర్లపాలెం హనుమంతరావు   


 వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజాస్వామికవాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధానకారణం.   

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. కట్టుకున్నదాని కోపాన్ని ఏ రవ్వల సెట్టుతోనో, చీకట్లో కాట్లట్టుకునో పోగొట్టవచ్చు.   రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు, గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం! తలట్టుకొని ఉండేవాళ్లే సజీవులై ఉండుంటే!  తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చచ్చుట ఖాయమ’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దురాలోచనలే తప్ప దూరాలోచన తక్కువ కాబట్టే కథ అక్కడి నుంచి కంచిపోలేదు. కానీ ఇది కలియుగం బ్రాండు ప్రజాస్వామ్య బేండు మేళం. ఇండియన్ నేతకు ఓటరు అజాతు శత్రుత్వం మీద బొత్తిగా నమ్మకం కుదరక గందరగోళం.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకని నాయకులు ఎన్నికల దుర్దినాలు గడిచే దాకా ఓటరుకు దేవతాపీఠాలు అప్పగించెయ్యడం వెనుక బోలెడంత పొలిటికల్ బ్యాగ్రౌండ్ వర్కుండేది అందుకే మరి!

'గడియలోపల తాడి కడగి ముత్తునియగా తిట్టిన మేధావిభట్టు కంటె/

రెండు గడెల బ్రహ్మదండి ముండ్లన్నియు డుల్ల దిట్టిన కవిమల్లు కంటె

మూడు గడియలకు మొనసి యత్తిన గండి పగుల దిట్టిన కవిభాను కంటె

అరజాము లోపల చెరువు నీళ్ళింకంగ దిట్టిన బడబాగ్ని భట్టు కంటె

ఉగ్రకోపి నేను ఓపుదు శపియింప క్రమ్మరింప శక్తి కలదు నాకు

వట్టి మ్రాను జిగురు బుట్టింప, గిట్టింప బిరుదు వేములాడ భీమకవిని' అంటూ వెనకటికి ఓ ముక్కోపికవి తన శాపదానుగ్రహ శక్తిని గూర్చి గొప్పలుపోయాడు.

భీమకవి బడాయి జస్ట్ ఓ మచ్చుక. తిని హరాయించుకొనే వికటరసాస్వాదులకు తెలుగు కవుల షష్ఠాష్టకాలు  అష్టాదశ పురాణాలకు మించి సుష్టైన విందు. కాసుల పురుషోత్తమం అని మరో కవి మహాశయుడు పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువంతటి శ్రీవారిని పట్టుకుని దులపరించేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులు! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మ అయితే, నువ్వే ఏదో  కామితార్థుడికి మల్లే వీర పోజు! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మాజీగారయితే  ఇంటి పెద్దగా ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుక్కూర్చుంటివి! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి  తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీ కెందుకు పెద్దమనిషీ  పతితపావనుడువన్న   బిరుదంత బారుగా? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు వట్టి  దామోదరుడివి(పనికిమాలినవాడివి)’ అంటూటే అది  తిట్టో మెప్పో తెలీక  ఆ దేవుడే గుళ్లోని రాయికి మల్లేనే గట్టెక్కడ బయటపడుతుందోనని   గమ్మునుండిపోయాడు! 


నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయినో మెట్టు కిందికి దిగజార్చడవేఁ. దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షనుంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్క దేవుడిదిక్కు భక్తుడికి ఠక్కున బంపర్గా  ఆఫరయే సీజనిది. 

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో ఠక్కున మటుమాయం చేసెయ్యచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయగాడు  మరీ పాతకాలం నాటి నాటు రథాలను మాత్రమే నమ్ముకునే ఉత్సవ విగ్రహంలా పడి ఉండటం లేదిప్పుడు! 

డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా ఓటు మిషను మీట నొక్కే మనిషి ఎదుగుతున్నాడు. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పదివేలన్నా చేత పెట్టనంటే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే ప్రయోజకత్వం దాకా పరిపక్వత సాధించాడు. ముష్టి మున్సిపాలిటీ ఎన్నికలక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే నేతలే ఓటర్ని ఈ స్టేటు దాకా ఎగదోసుకొచ్చింది. జిల్లేడుకాయకు మసిపూసి మారేడుకాయ చేసే ఇంద్రజాలం మరింకెంతకాలమంట? కడుపులో మంటలు ఎగసిపడితే  ఓటరే   నేత ముఖాన కసి కొద్దీ బుడ్ల కొద్దీ సిరాలు పూసి, బురద జల్లే క్రేజీ  రోజులు! ఎంత కేజ్రీవాల్సులోనైనా కదలికలు రాక ఛస్తాయా!

పాలిటిక్స్ అంటేనే శతకోటి దరిద్రాలకు అనంతకోటి చిట్కాల ఫీల్డు కదా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు పోషించుకుంటున్నట్లు?  కోన్ కిస్కాగొట్టంగాళ్ల కోపతాపాలన్నీ ఒకే షేపుకి మళ్ళించడం ఆ ముఠాల ఎత్తుగడ. ఎన్నికలివిగో.. ఈ ఎల్లుండి పొద్దున్నే ఆనంగానే,  చల్లంగా  వరాల జల్లులు కురిపించేస్తే సరి! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకోవచ్చు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా? చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుందిగ!  అయినా తిట్లకూ ఉట్లు తెగే సత్యకాలమా ఏంటిదీ   .. పిచ్చిగానీ? 

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలకు భక్తుల తిట్లు తప్పడం లేదు కదా!  ‘ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!” అంటూ భక్తులు   తిట్టిపోసినా  దేవుళ్లే  కిమ్మనడంలేదిప్పుడు!  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరు చెప్పి నోరుజారారనో,  లైంగిక దృష్టితో వేధింపులకు దిగజారారనో    మనిషి మధనపడ్డం.. యుద్ధకాండ  మొదలెట్టడం   విలువైన ప్రజాస్వామ్యంలో  ‘దండుకోవలసిన సమయాన్ని’  శుద్ధ దండగ చేసుకోడం కదూ!  

దూర   దూరంగా తగలడితే తూలనాడుకొనే పగే ఊండదు. ఒకే చూరు కింద పది రోజులు చేసిపోయే కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముట  ముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి. జానా బెత్తెడు భరత భూమి మనది. మూడు వేల చిల్లర పొలిటికల్ పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు.  మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రారాదంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్య జరిగిన గలాటా మాటేమిటి మరి  ? 

‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునుండిపోయాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట అంటించలా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు, బాకులు విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు, అవాకులు చెవాకులు తప్పవు! క్లైమాక్సులో ఆ మాత్ర్రం తిట్ల వాసన కూడా తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీగా వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ డైలాగులు దంచి కొట్టే    నటులూ పొలిటికల్ ఎంట్రీలిస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాలిక్కి పదును పెట్టే ప్యూర్ ఫుల్ టైం పొలిటికల్  లీడర్ల  మీదనే అందరి నిందలు! 

 తిట్టించుకొనే వాడి మనసు చివుక్కుమంటుందో లేదో తెలీదు. వినే వీనులకు మాత్రం వీనులకు  భలే పసందైన విందు పరుష పురాణం. చట్టసభల్లో జుట్టూ జుట్టూ పట్టుకునే కురుక్షేత్ర సంగ్రామానికి ముందు రెండు వైపుల నుంచి లైవ్ లో వినిపించే సంస్కృతం ఎంత లవ్లీగా ఉంటుందనీ! సమయానికి ప్రసారాలు కట్ అయ్యాయని జనం సరదా కోసం  చిందులేయరు గదా? కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే భాగ్యం మిస్సయిపోతామనేగదా జనం బాధ !

 బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ చేసుకుని  చచ్చిపోతే నరకంలో మనకేమీ మడత మంచాలేసి హాయిగా బజ్జోమనరు కదా! దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పితో ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వడ్డిస్తారు. 

తిట్లన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగకుంకలు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది. తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు కొన్ని కోట్లున్నాయీ దేశంలో బైటపడుతుంది! 

రాచి రంపాన పెట్టే పై దేవుళ్లనేమీ పట్టించుకోకుండా కిందున్న సాటి నేతల మీదనే ఎందుకిన్ని సూటిపోటీ మాటలు?

 భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించేటప్పుడు పశ్చిమ దిక్కుగా ఉన్న బ్రహ్మ ముఖం నుంచి ఆరభటీవృత్తితో కూడిన రౌద్రం ఉత్పన్నమయిందని 'భావప్రకాశం'లో శారదాతనయుడు శలవిచ్చాడు. ఆ దక్షాధ్వర ఘట్టంలో పోతనగారి హింసనచణ ధ్వంసరచనకు  మించి సాగుతుందా ఇప్పడు పొలిటికల్ ఫీల్డులో కోపతాపాల సీన్లు? ఉత్తిగా వేలెత్తి చూపమనా ఓటుకు అన్నేసి వేలిచ్చి ఎన్నికల్లో దేవులాడింది లీడర్లు?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసారు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసారు. ఎవరి అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న. కోపం ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడైనా     ఆ రామదాసుగారి విచక్షణా బుద్ధికి? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లు?  


'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అంటాడు 'కొత్త సిలబస్' కవితలో బాలగంగాధర్ తిలక్. ఆ  పాత 'కొత్త సిలబస్' కు ఈ ట్వంటీ ట్వంటీస్ లో కూడా  శిల వేయద్దంటే ఎలా? కొత్త తరం నేతల్నయినా  ఫాలో అవ్వద్దంటే ఎలా? అదేం ‘లా’? నో..వే ! నేటి తరం నేతల దారి నేరుగా బూతుల భాగోతాల ‘హై వే’ పైనే!

బూతుందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలవా? అని మనగలవా? ఎంతాచారం వప్పచెప్పిన  పెద్దాయన అయినా ఆ కూటికే పోక తప్పని కాలమిది నాయనా! జనస్వామ్యం గ్రహచారం అలాగుంది మరి.  ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా తిరుగుతోంది. ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటుండ బట్టే శనిగ్రహం అనే   ముద్ర పడింది.  ‘విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి’ అంటూ మరో నింద పడ్డానికి సిద్ధంగా కూడా      ఉంది!  

 స్వగృహంలో పడగ్గదయినా  సరే నో ప్రాబ్లం!   చాటుగా ఓ నాలుగు బూతు సినిమా పాటలు బై హార్ట్ చేసుకునే బైటికి రమ్మనండి రాజకీయ పరమపద సోపానంలో నిచ్చెనలుండి చచ్చినా .. లేకపోయినా పైకెగబాకాలనుకునే పట్టుదల వదలని విక్రమార్కు మార్క్ నేతలందరూ!   చక్రం తిప్పాలన్న కుతి ఒక్కటుంటే చాలదు! వక్రమార్గంలో అయినా పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక తప్పదు. 

  'పురాస్త్రరసగిరి రుద్రే ష్యకచటహ మాతృకా నింద్యాః' అంటే అర్థం తెలుసా? పోన్లెండి! అజ్ఞానం కూడా ఒక్కోసారి ప్రాణానికి తెరిపే. కానీ అజ్ఞాతంగా అదే ఒక్కోసారి మహా హాని. 'శ్రీవాణి గిరిజాశ్చిరాయ' అన్న ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఓ 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే ఇరుక్కుపోయింది. 'ఆ.. అంతా చాదస్తం' అనుకోవద్దు ప్రమాదం ! నన్నెచోడుడూ  'శ్రీవాణీం ద్రామరేం ద్రార్చిత' అంటూ 'మ'గణం తరువాత 'ర'గణం ఉండే స్రగ్ధరతో అశ్రద్ధగా కుమారసంభవం ఆరంభించి  యుద్ధంలో దారుణంగా మరణించాడు! తిట్ల వల్ల ఎదుటి త్రాష్టుడికి ఎంత నష్టమో తేలక పోవచ్చునెమో కానీ తిట్టే తిట్టు స్పష్టంగా లేకుంటే కుంటి కూత కూసిన వాడికే ముందు మూడేది. అనని ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతలు కూడా అన్నట్లు ప్రచారంలో కొచ్చేసే  సామాజిక మాధ్యమాల కాలం బాబూ ఇది   ! గాంధీజీ నీతుల మీదింకా నమ్మకమున్నది ముష్టి మూడు కోతులకే!  మిగతా జాతి  మొత్తం  తూలనాడే కొత్త నాయకత్వం వైపు ఒరుగుతున్నదిప్పుడు! 

బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనడం.. రామాయణంలో రామా అనే శబ్దం వద్దనడమంత అసంబద్ధం. అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.  తిడితే తప్ప నెగ్గ లేని నేతలకు ‘తిట్లు వద్దు.. కోపాన్ని ఉగ్గబట్టుకో’ మంటూ  చొప్పదంటు సుద్దులు చెప్పడమెందుకు?   ఎన్ని తట్టల నోట్ల కట్టలైనా సాధించిపెట్టలేనంత పాజిటివ్ ఇమేజ్.. తిట్టు పదాల ఎమేజింగ్ పవర్లో ఉంటున్నప్పుడు ఏ  ప్రవక్తో ఎన్నడో చెప్పిన పిచ్చి ప్రవర్తనతో   ఇప్పుడు పొడిచేదేముంది! 

తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని ఇంకా సందేహమా? కొందరు సీనియర్ నేతల్ని  ఎన్ని తిట్టీ   నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా కాలమ్  వేస్ట్!

***

కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట కాలమ్ ప్రచురితం ) 


                            


చెలిమి కలిమి - కర్లపాలెం హనుమంతరావు -ఈనాడు సంపాదకీయం

( ఈనాడు ఓసాటి సంపాదకీయం ) 

ప్రకృతి మన వేళ్లమధ్య సందుల్ని ఎందుకు వదిలింది? ఆ శిష్యుడి సందేహానికి గురువు ఇచ్చిన బదులుకు మించిన మంచి వివరణ- స్నేహానికి మరేదీ లేదు. వేళ్లసందులతో మరో వేళ్ల సందులను సంధానించడానికన్నది ఆ జ్ఞాని సమాధానం. పెద్దలు చెప్పిన సప్త సుగుణాల్లో స్నేహ సౌఖ్యం ప్రముఖమైనది. మనసుతో మనసు, రహస్యంతో రహస్యం, ప్రజ్ఞతో ప్రజ్ఞ క్షీరనీర న్యాయంగా కలగలసిపోవడమే స్నేహం- అని శ్రీసుభాషిత రత్నావళి సూక్తి. ఆదిశంకరులు ప్రబోధించిన ముక్తిమార్గమూ సజ్జన సాంగత్య సోపాన నిర్మితమే. లౌకికంగా చూసుకున్నా మనిషి దుర్భాగ్యాన్ని మాపగలిగే ముఖ్యమైన నాలుగు సాధనాల్లో సన్మిత్ర సాహచర్యం ప్రధానమైనదని భర్తృహరి భావన. మనిషి సంఘజీవి. 'చివరికి మిగిలేది'లో బుచ్చిబాబు తర్కించుకొన్నట్లు- లోకంతో సంపర్కం లేకుండా ఏకాంతంలో మనం సాధించిన జీవిత రహస్యమే యథార్థమని నమ్మి సమాధానపరచుకోవడం మనిషన్న వాడికి సాధ్యమా? పద్యపాదం చక్కటి నడకకు యతిమైత్రి ఎలాగో... జీవితం మంచి నడతకు సన్నితుడి తోడు అలాగ. ప్రేమతో విత్తనాలు వేసుకోవడానికి, కృతజ్ఞతతో పంట కోసుకోవడానికీ పనికివచ్చే మన పొలంలాంటివాడు నిజమైన మిత్రుడు- అంటాడు ఖలీల్ జిబ్రాన్. ధన సాధన సంపత్తి లేనివారైనా బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని స్వకార్యం సాధించుకుంటారన్నది పంచతంత్రంలో మిత్రలాభం మొదటి కథ చెప్పే నీతి. పొరుగువాడితో స్నేహపూర్వకంగా మసలుకోవడమే భూలోకవాసానికి మనమిచ్చే సరైన కిరాయి- అన్న అలనాటి బాక్సింగ్ యోధుడు మహమ్మదాలీ వాదం నిజమేకదా! ప్రేమభావంతో చూస్తే జీవనం సర్వస్వం మైత్రీవనమే.



మిత్రుడు అంటే సూర్యుడని మరో అర్థం. ఏ లాభాపేక్ష లేకుండానే తన చుట్టూ పరిభ్రమించే భూగోళాదిగ్రహాలకు ఉదారంగా వెలుగురేకలు పంచిపెట్టే ప్రభాకరుడు నిజంగా సార్థక నామధేయుడే. 'మేఘుడు బుధికి బోయి జలంబులు దెచ్చి యీయడే/వాన సమస్త జీవులకు వాంఛిత మింపెన లార!-' అని భాస్కర శతకపద్యం. మేఘం చెట్టుకు చుట్టమా, పక్కమా? ఉసిరితొక్కును దానంచేసిన పేదగృహిణి ఇంట కనకధారలు కురిపించడానికి శంకరుణ్ని ప్రేరేపించిందీ పరోపకారమే పరమార్థంగా ఉన్న స్నేహభావమే. పెదవి విప్పి చెప్ప పనిలేదు; మౌనహృదయం లయను కూడా గుర్తించగలడు నిజమైన నేస్తం. కలిమి లేములకు సంబంధం లేనిది చెలిమి. కృష్ణ కుచేల సంబంధమే దానికి ఉత్తమ ఉదాహరణ. రాధా మాధవుల మధ్య నెలకొన్నది ప్రేమభావానికి అతీతమైన స్నేహసౌందర్యమే. స్థాయీ భేదాలతో నిమిత్తం లేనిది స్నేహం. నరనారాయణుల సాహచర్యమే దీనికి చక్కని తార్కాణం. శ్రీకృష్ణుని నిర్యాణానంతరం హస్తినకు తిరిగి వచ్చిన పార్థుడు అన్నగారితో ఆవేదనగా పలికిన మాటలే చాలు నేస్తభావ సంపూర్ణ నిర్వచనానికి. స్నేహితుడు- సన్నిహితుడు, సారథి, సచివుడు, వియ్యం, సఖుడు, బాంధవుడు, విభుడు, గురువు... అన్నింటికీ మించి దేవర. గజేంద్రమోక్షంలో కరిరాజు మొరపెట్టుకున్నట్లు 'పెంజీకటి కవ్వలనెవ్వడు/నేకాకృతి వెలుగునో, ఆ వెలుగే మన అంతరంగాన్ని వెలిగించే స్నేహదీపం. ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ నేస్తం. తడికన్నులను తుడిచే ఆ స్నేహహస్తం- ఒడుదొడుకుల బతుకుబాటలో చివరివరకు తోడు దొరకటమే... మనిషి జన్మ ఎత్తినందుకు మనం చేసుకునే అదృష్టం.



వేడితే గాని వరాలివ్వని దేవుడి కన్నా వేడుకలా మన జీవితంలోకి నడిచి వచ్చే నేస్తం ఎందులో తక్కువ? ఎక్కడుంటాడో తెలియని దైవం కన్నా కష్టంలో సుఖంలో, ఎత్తులో పతనంలో... ఎన్నడూ చేయి విడవక పక్కనుండే సన్మిత్రుడి సన్నిధిని మించిన పెన్నిధి మరేముంటుంది? కృష్ణపరమాత్మను చెలికాడిగా పొందిన గోపబాలకుల జన్మే జన్మమని వ్యాస భగవానుడిలా మనమూ ఈసుపొందాల్సిన పనిలేదు. ఠాగోర్ చెప్పినట్లు మన హృదయ కవాటం తెరిచి ఉంచాలేగాని... చొచ్చుకుని వచ్చేందుకు ప్రేమవాటికలో తచ్చాడే నెచ్చెలులు లక్షలు లక్షలు. తండ్రి బిడ్డకు స్నేహితుడు. భార్య భర్తకు సహచరి. ఇరుగిల్లు పొరుగిల్లుకు తోడు. లోకమే ఏకైక కుటుంబంగా మారిన ఈ కాలంలో స్నేహసామ్రాజ్యం విస్తరించుకోవడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు, స్థాయీ భేదాలు- అడ్డుకావు. అమృత సాధనకోసం దేవదానవులే ఒక్కటై శ్రమించారు. స్నేహామృత సాధనకోసం జాతి మతాలకు అతీతంగా అందరూ ఒకటి కావడానికి అడ్డుగోడల్ని పడగొట్టలేమా?  ఆస్ట్రియా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం- స్నేహబంధం కలిగించే ఆత్మసంతృప్తి మరే ఇతర బంధం కలిగించలేనంత బలమైనది. హృదయపూర్వకంగా స్నేహహస్తం చాచేవారికి హృద్రోగ సంబంధ రుగ్మతలూ అధికంగా రావంటున్నారు. మైత్రికి విలువిచ్చేవారి జీవితకాలం ఒంటరిజీవులకన్నా ఎక్కువనీ వారి పరిశోధనల సారం. ఆరుద్ర చెప్పినట్లు- ఎవరినీ ప్రేమించకపోవడం ఒక నేరం, ప్రేమ తెలియని జీవితం భూమికి భారం! 

(ఈనాడు సంపాదకీయం, 08-04-2011)

వెంకప్ప.. అను నేను..( సరదాకే ) - కర్లపాలెం హనుమంతరావు

  1. వెంకప్పగారు అబ్బల కాలం బట్టీ దిబ్బలగూడెం  ప్రజాప్రతినిధులు. అధికారం ఆయనకు విషంతో సమానం. ఆ విషం వేరెవరో పుచ్చుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదన్నది ఆయన సిద్ధాంతం. తన ధన మాన ప్రాణాలు రిస్కులో పెట్టుకొనైనా కొన్ని తరాల బట్టి ఆ విషాన్ని అందుకనే తాను పళ్లబిగువునైనా పుచ్చుకొనేది. ఈ దఫా ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం  ఆయన్నా  కష్టం నుంచి విముక్తి చేయదల్చింది.  విషం లేకుండా ఒక్క క్షణమైనా ఊపిరాడదు వెంకప్పగారికి. కాలకూటం పార్టీతో అందుకే లోపాయికారీ మంతనాలు నడిపిస్తున్నది. ఒక్కటే మెలిక. నియోజకవర్గ మెజార్టీ ఓటర్ల ‘ఓ.కే’ తీర్మానం తేవాలి. వెంకప్పగారీ మధనలో ఉన్నప్పుడే వార్ రూమ్ తలుపులు ధడేల్మని తెరుచుకున్నాయి.
  2. ఎదురుగా అల్లుడుగారు. మొహమైనా కనిపించకుండా పూల దండలతో పక్కన అమ్మాయి. ‘పూలలో పెట్టుకు పూజించుకుంటాన’న్నది  అల్లుడుగారి పెళ్లినాటి  ప్రమాణం! ఎంత మాట నిలకడ్! అపర శ్రీరామచంద్రుడు! 
  3. "సారీ.. మాజీ మామాజీ! మీ బేబీకి ఆల్రడీ గుడ్ బై చెప్పేసాన్, దిసీజ్ మై న్యూ బీబీ!’ అల్లుడి బాంబుకు వెంకప్పగారికి తన్నుకొచ్చింది బి.పి! పిచ్చి కోపంతో  రెచ్చిపోతో. ‘కట్నం కింద పది కోట్లు అచ్చుకుంటినిరా పాపీ! కుంటి సాకులొద్దు! పచ్చి మోసం చెయ్యద్దు!’ 
  4. పకాల్మని నవ్వి అల్లుడబ్బి అన్నాడూ ‘అప్పనంగా కుమ్మరించావా మామా కట్నం  సొమ్ము? గుమ్మటంలా ఉంది నీ కూతురు వెంకప్పా! ఆమెతో ఆర్నెల్ల సంసారమే  మా గొప్ప!’
  5. ’పెళ్లప్పటి ‘నాతి చరామి’ మాటేమిట్రా? పదిమంది ముందు అప్పుడలా కూసి ఇప్పుడింత కుట్రా?’ 
  6. ‘ధర్మపన్నాలా వెంకప్పంకుల్? నమ్మి ఓటేసిన దిబ్బలగూడేనికి తమరిచ్చిన హామీల మాటేమిటో మరి?’ 
  7. నోరెళ్లబెట్టేసారు ప్రజాప్రతినిధులు వెంకప్పగారు!
  8.  
  9.  ‘చింతాకాతా చిత చింతకాతా.. చింతకాతా చిత చింతాకాతా.. చిన్..’
  10. సెల్ఫోన్ రింగుటోన్ బొంగురుపోతోంది. పోలీస్టేషన్నుంచీ కాల్. ‘సార్! ఈ గాడిద కొడుకు మీ కొడుకేనా?’ స్టేషనాఫీసరు చిందులు.
  11. ‘ఏ గాడిదో తెలిస్తేనే గదయ్యా నా కొడుకో కాదో తేలిచచ్చేదీ!’ వెంకప్పగారి కౌంటర్.
  12. ‘మీ ఫొటోనే చూపిస్తుండు! వీడి బుద్ధుల్ని బట్టీ నమ్మబుద్ధేస్తోంది. గోడ దూకుతూ పట్టుబడ్డాడు కదా సార్ మరీ!’ లైన్లోకొచ్చి సుపుత్రుడిచ్చిన సమాచారం విని వెంకప్పగారి మైండ్ కంప్లీట్ గా  బ్లాంకయింది. అబ్బగారు అడ్డమైన గడ్డీ మేసి గడించిందంతా  అబ్బాయిగారు ధారాళంగా పేకాటకి ధారపోసారు! ధారపోసేందుకింకేమీ మిగలక క్లబ్బుగోడ దూకేస్తో పట్టుబడ్డారు. ‘తండ్రిగారేమో ఓట్ల కోసం ప్రామిస్ మాటలా! సన్ను గారేమో  నోట్ల కోసం ప్రాంసరీ నోటులా!’ పోలీసోడి సెటైర్లకు వళ్లు మండింది గౌరవనీయులు వెంకప్పగారికి. ‘వీడు రాసిచ్చాడు సరే సామీ! దమ్మిడీక్కొరగాని మా గాడిదతో మనీ డీలింగ్స్   నడిపే వాళ్ల మాటేమిటంట మరి?’ 
  13. ‘నోట్లు గిలికే టైముకి నోట్లో వేలెట్టినా కొరకని బుజ్జిపాపాయిని కాదు డాడీ. కాలేజీ ధరఖాస్తన్న భ్రమలో  నువ్వు దస్తఖతులు గిలికింది  దాన వినిమయ విక్రయాది సర్వ హక్కుల్తో నీ  స్థిర చరాస్తి యావత్తూ నాకు ధారాదత్తమయే స్టాంప్పేపర్లో!’ 
  14. వెంకప్పగారి కళ్లల్లో ధారాపాతంగా నీళ్లు.  
  15. ‘కన్న తండ్రినిరా! నాకే వెన్నుపోటా?’ 
  16. ‘వెన్నతో నువ్వు పెట్టించింది ఈ విద్యనే కదా నాన్నారూ! దిబ్బలగూడెం పబ్లిక్కు  నిన్నడిగే మాట నువ్వు నన్నడగడం  నాట్ గుడ్ టేస్ట్!’ 
  17. కొడుక్కొట్టిన దెబ్బకు పాపం కూలబడ్డారు వెంకప్పగారు!
  18. ...  
  19. ‘ఇప్పటికైనా నిజం కక్కకపోతే నా బతుక్కిక నిష్కృతి లేదండీ!" వెక్కి వెక్కి ఏడుస్తోంది పక్కనే పక్కలో  ధర్మపత్ని .
  20. ‘నీ బతుక్కంత నిష్కృతిలేని ఆ నిజం ఏమిటి సావిత్రీ?’  ‘నా కడుపున పడ్డ బిడ్డల్లో ఒకరు.. ఒకరు.. మీ రక్తం పంచుకు పుట్టలేదేమోనని అనుమానంగా ఉందండీ! భగవంతుడా! ఏ ఆడదానికీ రాకూడదురా ఇంత పెద్ద కష్టం’  
  21. ‘ఎవరే ఆ ఒక్కరూ? ఇంత దౌర్భాగ్యంలో కూడా  మళ్లీ సస్పెన్సా.. నా ఖర్మం కాకపోతే!’ 
  22. ‘ఏమోనండీ! ఎంత గింజుకున్నా గుర్తుకు రావడంలా. ఎవరితో కాలు జారినప్పుడు ఈ పొరపాటు జరిగిపోయిందో!’. 
  23. ‘షష్టిపూర్తి తరువాతటే ఈ నిప్పుమూటను నా గుప్పేట్లో పెట్టేది పాపిష్టీ!’ 
  24. సావిత్రీదేవి తిరగబడింది.‘తప్పంతా నాదేనంటే ఓప్పుకోను సుమండీ! పెళ్లిచూపుల కొచ్చినప్పుడు మాంగారిదే పార్టీ అన్న విచారణే గానీ కట్టుకునేదాని కడుపు వంకోసారైనా చూసారా తమరు? లొసుగంతా మీదే!’
  25. ‘తాళి కట్టిన దౌర్భాగ్యుణ్ని.. మరీ ఇంత భారీగానా దగాచేయడం?’
  26. ‘సారీ! మీ దిబ్బలగూడెం దగా ముందు నాది చీమతలంత. ఎన్నికైనాక తమరు దివిని సరాసరి దిబ్బలగూడెం మీదకే దింపేస్తానంటిరి కదా!   మంచి పదవులొస్తాయని ఇప్పుడు గోడలు దూకేస్తుంటిరి. ఎవరు స్వామీ పదహారణాల తుంటరి?’ ధర్మపత్ని దెబ్బకు ధడాల్మని కిందపడ్డారు  వెంకప్పగారు. నిద్ర తేలిపోయింది. 
  27. పోతే పోయింది పాడు నిద్ర..  తానిప్పటి దాకా కన్నది కేవలం పీడకలేనని తేలిపోయింది. మనసు తేలికయిపోయింది.
  28.  
  29. ‘తేలికవడానికి కారణం పీడకల నుంచి బైటపడ్డం కాదప్పా!  పీడాకారపు  దేహం నుంచి  బైటకు దూకిపడ్డం! పద.. పద! నరకమో.. స్వర్గమో .. తేల్చుకుందువుగాని ముందు!’ 
  30. తానిప్పుడున్నది వేరే వేరే లోకాలకెళ్లే కూడలి  దగ్గరా! యముడి సర్వెంట్లూ.. దేవేంద్రుడి ఏజెంట్లూ,, చెరో సైడూ! తన బదులు కోసమే ఎదురుచూస్తున్నాడు చిత్రగుప్తుడు! గయ్యిమని లేచాడు వెంకప్పగారు తాను చచ్చానన్న సత్యం హరాయించుకోలేని కచ్చ ‘ఎవర్రా మీరంతా? అడగా పెట్టకుండా లాక్కొస్తార్రా! లాగిచ్చి కొడతా! లాకోర్ట్లకెళతా!’ 
  31. ‘షటప్ యువర్ మౌత్! దీసీజ్ ఆల్సో యమ్ దర్మరాజాస్  కోర్ట్!’ చిత్రగుప్తుడింకా పెద్దగా షౌటింగ్! ‘ఇదేం మీ భూలోకం బాపతు ఎన్నికల సభ కాదప్పా.. ఏదంటే  అది కూసేసెయ్యడానికీ! నువ్వే నీ చావుని నోరారా కోరి తెచ్చుకొంటివిరా మూర్ఖా! మొన్నటి ఎన్నికల్లో గెలిచి చట్టసభకెళ్లిన  మొట్టమొదట్రోజు మొదటగా ఏం చేసావో గుర్తుందా నీకింకా?’   
  32. ‘ప్రజాప్రతినిధిగా పదవీ  ప్రమాణ స్వీకరణ. గోడదూకుడు వీర వేంకట వెంకప్ప అను నేను దిబ్బలగూడెం నియోజకవర్గ ప్రజల ఆంకాక్షల మేరకు నిస్వార్థంగా కర్తవ్యం  నిర్వహిస్తానని, నా ప్రజల యొక్క  హక్కులకు భంగంకలుగనీయనని,  భయ రాగ ద్వేషాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాన’ని దైవసాక్షిగా ప్రమాణం చేసాను చిత్రగుప్తా! అది తప్పా?’ 
  33. ‘అదిగో! ఆ అతే నీ చావుకొచ్చింది వెంకప్పా! దైవసాక్షిగా చేసిందయ్యా నీ పదవీ స్వీకార ప్రమాణం. ఉల్లంఘిస్తే దైవధిక్కారం కిందే లెక్క! చూస్తూ కూర్చోడానికి దేవుడేమన్నా మీ ప్రధాని తాలూకూ తాలుసరుకా? స్వార్థమే కదా నీ గోడ దూకుడు నిర్ణయం  వెనకున్న  పరమార్థం? దేవుడి ముందు చేసిన ప్రమాణప్పా! దాన్ని ధిక్కరించిన మరుక్షణమే రాజకీయంగా మా మృతుల చిట్టాలోకెక్కేసినట్లే! లెక్క ప్రకారం ఫోర్ ట్వంటీ గాళ్లను నేరుగా నరకంలోనే శాశ్వతంగా తొక్కేయాలి. అక్కడా  నీలాంటి దిక్కుమాలిన సరుకే కిక్కిరిసిపోతోంది.  నువ్ లక్కీ వెంకప్పా! యమధర్మరాజుగారు  ప్రక్షాళన పథకం  ప్రారంభించిన మొదట్రోరోజే మా  కళ్లబడ్డావ్!  సో నీకో ఛాయిస్ ఛాన్స్! స్వర్గమో.. నరకమో.. తొందరగా  తేల్చుకో! అవతల నీ లాంటి గోడ దూకుడు పాపులు బోలెడంతమంది క్యూలో పాపం  పడిగాపులు పడుతున్నారు’
  34. వెంకప్పగారు  కోరిందే తడవుగా స్వర్గధామం ద్వారాలు బార్లా తెరుచుకున్నాయి.
  35.  కడుపులో దేవుతోంది  దేవనగరం తీరు.
  36. ‘స్వర్గధామం కూడా ఇంత బురదమయమా?’
  37. ‘బురదేంటప్పా? పూజాదికాలక్కూడా వాడే మంచితీర్థం ఇదే మాకు! బురదంటే అదీ’ వీధులెంటపడి పెడబొబ్బలు పెడుతో పరుగులెత్తే కొన్ని వింత ఆకారాలని   చూపిస్తూ అన్నాడు దైవదూత.  
  38. ‘కీచడ్ తో   క్రీడా వినోదాలూ?!’
  39. ‘క్రీడలు కాదప్పా! గోడలు దూకే నీ బోటి భడవాయిలకు శుద్ధి కార్యక్రమం. స్వర్గమని ఊరిస్తే తప్ప రారు కదర్రా మీరు!  పద.. పద! నీ వంతు వచ్చే దాకా ఆ ముళ్ల కుర్చీ మీద నిశ్చింతగా పొర్లుదువుగానీ!’ కుర్చీ మీదకు తోసేసాడా దైవదూత. ‘కెవ్వు’ మన్నాడు వెంకప్పగారు. ఏ వైపు నుంచొచ్చి పడిందో.. అంగిట్లో ఇంత  మందాన బురద కళ్లె! 
  40. మింగాలో కక్కాలో తెలీని వెంకప్పగారి చెవిలో మరో రొద ‘ఎదుటి వాళ్ల మీద  బురదజల్లడం.. భలే సరదా కదరా మీ నేతలందరికీ! ముందుకు పదా! అసలు మజా ఇంకా మొదలే కాలేదప్పా!’
  41. ‘స్వర్గమంటే ఇంత నరకమా? ముందే చెప్పాలి కదా స్వామీ? తమరు చేసేది మాత్రం పచ్చిమోసం కాదా?’ ఉగ్గబట్టలేక  బిగ్గరాగా అరిచేసాడు వెంకప్పగారు! 
  42. అప్పుడు పలికింది దైవవాణి ‘ఇప్పుడు  తెలిసొచ్చిందా మోసమంటే  ఏమిటో  వెంకప్ప మానవా! నీ  నియోజకవర్గ ప్రజానీకం ప్రతీక్షణం  పడే క్షోభ ఇంతకు పదింతలు. కొత్త బంగారు లోకం సృష్టించిపారేస్తామని వాగ్దానాలు కుమ్మి గద్దెనెక్కారయ్యా తమరంతా..  గుర్తుందా గత ఎన్నికల ఫార్సు? గెలిచిన మరుక్షణం నుంచే జనం గోలే మరిచారు.  స్వర్గధామం అంటూ ఊరించిన లోకం నరకాన్ని మించి హింస పెడుతుంటే ఆ బాధ  ఎంతలా సలుపుతుందో స్వానుభవంలో తెలుసుకుంటావనే  నిన్నిక్కడ దాకా రప్పించింది వెంకప్పా! తత్వం ఇప్పటికైనా తెలకెక్కినట్లేనా?’ 
  43. తలొంచుకున్నారు గోడ దూకుడు వెంకప్పగారు. కంటి నిండా నీరు!
  44. ‘ఇదంతా పశ్చాత్తాపమేనని నమ్మమంటావా? ప్రాయశ్చిత్తానికింకో అవకాశం ఇమ్మంటావా? నిన్నే కాదు నీ పార్టీ గుర్తును చూసీ ఎన్నుకున్న జనమూ ఉన్నారప్పా నీ నియోజకవర్గం నిండా! జనమంతా నిజంగా నిన్ను తమ ప్రతినిధిగా భావించుకునేలా  నీ సేవలుండాలి ఇహ నుంచి! బుద్ధికా ప్రచారం చేసుకో! ఎన్నికైతే నిజమైన ప్రజాసేవ చేసుకో.. పో!’ 
  45. రెండు చేతులూ జోడించి తలాడించేసాడు వెంకప్పగారు.
  46. ***
  47. ( కౌముది - ప్రచురితం ) 
  48.  


పెయిడ్ ఇన్ ఫుల్ -. చిన్నకథp హనుమంతరావు

 



సుబ్బుకు పదేళ్లు.  ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా.  కూడికలు తీసివేతలు  రెండంకెల వరకు  నోటితోనే  చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు. 

వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి  ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః  రూ.2

అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3

ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3

అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా  మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1

బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3

కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు  తోడుగా వెళుతున్నందుకుః రూ.2

ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే  రెండో ర్యాంకు పోయినవారం కూడా  తెచ్చుకున్నందుకు  ఆ వారం  వాయిదాః రూ.10

చిల్లర  పనులుః రూ.10


పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు  ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34వీడియో గేమ్ కు  లెక్క తక్కువ పడింది. 

సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న 

అమ్మకు అందించాడు సుబ్బు .


వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ. అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది .


అమ్మ రాసిన లెక్కః

నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0 

రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0


నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0


ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి బెట్టి  ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు,  ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి  చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను.  ముందు ముందూ చేయాలి, ఆ సేవలకు రూః0' అంటూ రాసే రాసే కాగితం వెనక్కు ఇచ్చేస్తూ అంది అమ్మ : 

" సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం  చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి! నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది  మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!


అమ్మ తిరిగి ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిలూ వెనక్కు తీసుకుని  

ఈ విధంగా రాసుకున్నాడు 

' పైడ్ ఇన్ ఫుల్' కాగితం మీద

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ

04-04-2020



కరోనా

వీధి పట్టున ఎంత బలంగా ఉంటేనేమంట.. ఆ కృష్టయ్యలంతా ఇంటి పట్టునే రామయ్యల్లా పడుండే పాడురోజులు వచ్చిపడ్డాయిప్పుడు. కాలజ్ఞానం మార్కు
బ్రహ్మంగారు కూడా  ఊహించినట్లులేదు ఈ తంటా. ‘గోవిందుణ్ని నమ్ముకో చాలు!
స్వర్గంలో లగ్జరీ బెడ్ ఖాయం’ అని  నమ్మబలికిన  దేవుడి స్పెషల్ ఏజెంట్లూ
ఇప్పటి ఈ కోవిడ్ - పంధొమ్మిది దెబ్బకు కుదేలయి కూర్చోడం విచిత్రం.
సర్వజగత్తునూ కాపాడే డ్యూటీ ప్రస్తుతానికి పక్కనలా పెట్టి గర్భగుడి
తలుపులు గట్టిగా బిడాయించుకోవడమే సర్వదా శుభదాయకమని భగవంతుడే
భావిస్తున్నప్పుడు.. ఆఫ్ట్రాల్ ఆయన ఏజంట్  మాత్రం చేసేదేముంది? రెండు
నిద్ర మాత్రలు మింగి ముంగిలా కొంపలోనే బబ్బోడం మించి!

విధి బలీయం. అయినా సరే! దానికి ఎదురీదడంలోనే ఉంది సరదా అంతా’ అంటూ దసరా
బుల్లోళ్లకు మల్లే కథలెన్నో చెప్పే వికాసగురువుల కత మాత్రం? ఆ విధికి
మించిన బలీయమైన కరోనా వైరస్ బారిన పడిపోతామని భయపడిపోయి ‘ప్రబోధాలు ఫ్రమ్
హోమ్’ స్కీములు మొదలెట్టేసారు కదా ఇప్పుడు!

‘ఇల్లు ఇరకటం.. ఆలి మరకటం’ అంటూ వెటకారాలు వెళ్లబెట్టిన తిరుగుబోతులకు
ఉగాది వేప్పచ్చడి. ఇంటావిడ ‘పంచాంగాల’ శిక్ష వేసి కక్ష తీర్చుకున్నది
విధి, కరోనా వైరస్ పేరు చెప్పి మరీ ఈ ఉగాది శార్వరికి!

సృష్టి సర్వం తనే ప్రకృతి వేసిన బిడ్డింగులో పాడేసుకున్నట్లు ఎంతలా
విర్రవీగాడీ  మానవుడు! ఏ పశువుదో, పక్షిదో కన్ను కుట్టినట్లుంది!
కంటికైనా కనిపించని కరోనా వైరస్ దెబ్బకిప్పుడు వెర్రిమొగం
వేయాల్సొచ్చింది! మానవసంచారం తగ్గుముఖం పట్టేకొద్దీ జంతుజాలం ఆ లోటును
మెల్లగా భర్తీ చేస్తున్నదిప్పుడు తిరుమల ఘాట్ రోడ్ల మీద పులులు తిరగాడడం,
 థాయ్ లాండ్ ప్రధాన వీధులలో కోతులు షికార్లు చేయడం ఇందుకు తాజా ఉదాహరణలు.
పశువును, పక్షిని తరిమికొట్టి కదూ మనిషి ఈ భూగోళాన్నంతా కేవలం తన
మీరాశిగా అనుభవించడం!  వాడి స్థానం భూమండలం మీద ఎక్కడో.. ఏ మేరనో  గీత
గీసి మరీ చూపెట్టే ప్రకృతి చిట్కానే ఏమో  ఈ కొత్త గత్తర కరోనా వైరస్!

'శ్రామికులారా ఏకం కండి!' అంటూ  అదే పనిగా చెండుకుతినేది చైనా. దాని
ప్రసాదం కరోనా దెబ్బకు ఆ చైనా నినాదమే పూర్తిగా మారిందిప్పుడు. 'మనిషికి
మనిషి మీటరు దూరంలో ఉండాలి. శ్రమదామాదులు మరచి కొంపలోనే పడుండాలి!'
అన్నది ఆ కొత్త నినాదం! కారల్ మార్క్సా?  కరోనా వైరస్సా?  దేని ఫోర్స్
ఎక్కువో తేలిపోలేదూ! హ్హా.. హ్హా.. హ్హా!

ప్రపంచం ప్రమాదంలో పడ్డా హాస్యానికి హాల్ట్ ఉండకూడదంటాడు ఛార్లీ
చాప్లిన్.  కరోనా వైరస్ ను కామెడీ దమ్మిడీ లెక్కచేయదు అందుకే. ప్రాణాలు
హరాయించే మహమ్మారి కరోనాకు ప్రాణాలకు తెరిపినిచ్చే థెరిపీ హ్యూమరసమే కదా!
పద్దాకా ఇంటి పట్టునే పడుంటున్నారంతా. ఎన్ని గంటలని మొగుడూ పెళ్లాల మధ్య
 కీచులాటలు? అందుకే పగటి పూట మందులా  పనిచేసే ఈ వినోదాల విందు!

అందరికీ అ కొరియా కింగు కిమ్ము మాదిరి అతితెలివితేటలు అబ్బవు కదా!
రాసుకోడం పూసుకోడం పనేదైనా సరే పుర్రచేతితో కొనసాగిస్తే కాణీ ఖర్చు
లేకుండా కరోనాని కట్టడిచెయ్యచ్చు అంటున్నాడా చిచ్చరపిడుగు. ఏ
పప్పుగుత్తితోనో మొగుడు నెత్తిన రెండు మొత్తేటప్పడు తప్ప ఆట్టే ఉపయోగపడని
పుర్రచెయ్యి, ఇంతకాలానికి ఇంత వింతగా ఉపయోగిస్తుందని సూరేకాంతమ్మత్తైనా
ఊహించి ఉండదు. బతికుండుంటే ఆ కిమ్ముగాడి పుచ్చె మీదే పుర్రచేత్తో ‘ఆరి..
అబ్బోసి’ అంటూ రెండు తగిలించుండునేమో కూడా కదా మరి!

భగవంతుడికైనా ఆర్తుల  పట్ల  ఒకింత అనురాగం, దుష్టుల పట్ల చచ్చే కోపం
కద్దేమో కానీ కరోనా వైరస్సుకు ఆ తరతమ బేధాలు బొత్తిగా లేవు.  కులం, మతం,
జాతి, రంగు, దేశం తో నిమిత్తాలుండవు. ఒక్క ఆరోగ్యం అంటేనే మహా ద్వేషం.
అనారోగ్యం ఎక్కడుంటే అక్కడే దాని స్వర్గం. పసివాళ్లు, ముసిలాళ్ల మీద  మహా
ప్రాణం దానికి. అన్ని చోట్లా తానుండి భయపెట్టడం కుదరదు కదా పాపం! కాబట్టే
ఆ లోటు తీర్చేందుకు పెనుభూతం లాంటి అనుమానానికి ప్రాణం పోసి మరీ
ఉసిగొల్పేదీ  మహమ్మారి నలు దిశలకూ ఇప్పుడు! నూట తొంభై ఆరు ప్రపంచ దేశాలలో
నూట అరవై ఐదు దేశాలు ప్రస్తుతం కరోనా దెబ్బకు విలవిలలాడడమే అందుకు
ఉదాహరణ.
‘నీ గాలి సోకిన వారు- గాలి దూరని గదిలో/నీ వార్త విన్ననాడు- భయం దూరేను
మా మదిలో’ అన్నాడు ఒక ఆధునిక కవి అర్భకుడు కరోనా సృష్టించే కలవరాన్ని
చూసి. ఏదేమైనా.. లక్షలకోట్లు జనంసొమ్ము కుమ్మేసీ  బాహాటంగా దొరతనం
వెలగబెట్టే బడాబాబులకు ఏళ్ల తరబడి న్యాయం, చట్టం వెయ్యలేని ఏకాంతవాస
శిక్షలు  ప్రస్తుతం వేస్తున్నది ఈ కరోనా మహమ్మారి ఒక్కతే! ఈ మహమ్మారి
వైరస్ వల్లనే   పిల్లల వైముఖ్యం పిజ్జాలు, పబ్బుల పైకి
మళ్లుతున్నదంటున్నారు మెల్లమెల్లగ. వెల్లుల్లి రసం కల్చర్ మళ్ళీ
వెలివిరుస్తుందని మన ఆహారవ్యవహారాలను మహా ఉత్సాహంగా ఆచరించేవాళ్ల ఉల్లాసం
కూడా.
అయినా సరే..

దగ్గద్దు. తుమ్మద్దు. ముక్కులు రుద్దద్దు. అసలు మొహం మీదకే చేతులు
పోనీయద్దు.. అంటూ ఒహటే వేపుకుతింటున్నారే ఎటు వేపు చూసినా ఇంటా బైటా
పెద్దలు! హితం కోరి చెబుతున్నాం.. ఎవరికీ సన్నిహితంగా పోవద్దని
పోరుపెడుతున్నారే ఆరోగ్యశాస్త్రవేత్తలు! నా మొహం.. ఇహ మనిషిగా పుట్టి
మాత్రం ప్రత్యేకంగా పొడిచేదేముందంట? రామాయణంలో అహల్యమ్మలా హాయిగా ఏ
శిలాఖండం మాదిరో ఓ మూల పడుంటే పోలా! అడవిలో మానుగా పుట్టడం ఒక్క ఆడదానికే
కాదబ్బీ .. మనిషన్న ప్రతీవాడికి నయమనే భయానకమైన మూడ్  ప్రపంచమంతా
ప్రస్తుతం మనోవేగంతో విస్తరిస్తున్నది. రామరాజ్యం కోరుకుంటే..  ఇదేమిటి
రామచంద్రా! కరోనా మహాసామ్రాజ్యం అవతరిస్తున్నది! ఇంకెంత కాలమోరా బాబో ఈ
కాష్మోరా  కరోనాల కింద ఆలనా పాలనా?  తల మొత్తుకుందామన్నా చేతులు తలకు
తగలనీయద్దంటున్నారే!

గంటకో సారి కనీసం ఇరవై సెకండ్లకు తగ్గకుండా చేతులు శుభ్రంచేసుకోమని
సూక్తులు!  ప్రబోధం బాగుంది! శుభం! నూట ముప్పై కోట్ల మందీ దేశం జనాభా!
కశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా నీళ్ల కోసం కొట్లాడని జాగా గజమైనా లేదు
గదా!  తాగు, సాగు నీటికే తగినంత జలవనరులు దాచుకోడం రాని  దేశంలో ఎన్ని
గంగా గోదావరులు, పెన్నా తుంగభద్రలు ఆటివచ్చేను బాబూ చేతులూ మూతుల
శుభ్రతలకు! ఇన్ని కడగళ్లకు ఉపరి ఇప్పుడు ఈ చేతులు కడుగుళ్లు కూడానా!
భగవంతుడా! నమస్కారం చేద్దామన్నా  భయమేస్తుందయ్యా దయామయా! ఎక్కడ కరోనా
వైరస్ ముక్కూ మూతుల మూలకంగా ఠక్కున అంగిట్లోకెళ్ళి తగులుకుంటుందోనని!
చేతిలోనే కరోనా భూతాన్ని పెట్టుకుని వేరే భూతాల మీద యుద్ధమంట! కామెడీ!
ఇలాంటి వింత కాలం ఒకటి రాబోతున్నదని కనీసం ఆ నోస్టర్ డ్యాం మహాశయుడు కూడా
పసిగట్టినట్లులేడు!

నలుగురు మించి ఒకే చోట గుమిగూడడం పాపం! నలుగుపెట్టి పంపించడమే ఇప్పటి
ఖాకీల కొత్త రకం ప్రతాపం! ఒకానొక పార్టీ  ఒకే ఒక అధినేతగారు కవితలల్లి
మరీ జనాలను కల్లబొల్లి కబుర్లతో కడుపు నింపేస్తారు. కానీ అదే పార్టీ
కవితమ్మగారు ఊరి బైట రిసార్టు క్యాంపు  రాజకీయం గుమ్ముగా నిర్వహిస్తారు!
ఖాన్ ఒక్కడితోనే కాదు సుమా!  కరోనాతోనూ గేమ్స్ వద్దు!  ఒలంపిక్సునే
డౌట్సులోకి నెట్టిన ఘనత కరోనా  వైరస్సుది!   కోవిడ్ పంథొమ్మిదితోనా కోతి
మార్కు జంప్ పాలిటిక్సు? కోరి ప్రమాదం తెచ్చుకోవద్దు!

అనారోగ్యంతోనే ఆ మాయదారి మహమ్మారికి శాశ్వత మిత్రత్వం! అసమ్మతి రాగంతో
దాన్ని కుదెయ్యాలంటే ఆరోగ్యంతో మినహా మరో వర్గంతో పొత్తు వద్దు. జనాభాలో
ఐదుకు ముగ్గురు, ఒకటికీ, రెంటికీ ఒక్కసారి పోవాలన్నా ఏ గోడచాటుల ఏర్పాటూ
లేని దిక్కుమాలిన దేశమిది బాబూ! ఎన్ని నెలలని ముక్కూ, మూతీ మూసేసుకొని
కొంపలోనే ఓ మూల నక్కి మూలగడం? నక్కడానికైనా నెత్తి మీద గూడు లేని
దౌర్భాగ్యుల ఎక్కడకని చావడం? రెక్కాడితే తప్ప డొక్కాడని బీదా బిక్కీ ఎంత
కాలమని సర్కారువారు ఉదారంగా విదిల్చే ముక్కిన సరుకు మెక్కుతూ బతకడం?
కరోనా వైరస్సుతో ఇప్పుడు పోయే ప్రాణాలు కొన్నే!  వాటికి ఎన్ని రెట్లు
కరువులు కాటకాలు, వానలు వంగడాలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి
ఉత్పాతాలతో రాలిపోతున్నాయో! కరోనా వైరస్ ప్రభుత్వాల పనితీరును
మారుస్తోంది. మొండికేస్తే ప్రభుత్వాలనే మార్చేస్తుంది అన్నిచోట్లా.
చూస్తున్నారా పాలకులారా! పౌరుల్లా కాదు కరోనా వైరస్! తస్మాత్ జాగ్రత్త!
మనుషులపై కరోనా దాడి! అది చాలక అదనంగా కరోనా వంకన కవులు దాడి! మేడిన్
చైనా అంటే  మహా హడావుడి కదా మన దేశంలో ప్రతి పౌరుడికి! ‘కరోనా  కూడా
మేడిన్ చైనానే! కాబట్టే ఇప్పుడింత అలజడి’ అన్నాడో అర్భక కవి.  ’నువ్వు
పుట్టిన దేశంది /వస్తువు అయితే వారెవ్వా! వైరస్ అయితే ‘ఛీఁ! పోవా!’ అన్న
పొట్టి కవితలో భావం ఎంత దిట్టంగా కూరి దంచాడో మరో గట్టికవి. ‘కరం కరం
కలిపితే మనిషికి హానికరం అన్నావు/మందు బిళ్ళ లేదని మందిలోకి
వెళ్ళద్దన్నావు/ సూది మందు లేదు సుట్టాలింటికి పోవద్దంటున్నావు!/ నువు
తొలిసారి కళ్లు తెరిచింది చైనాలో కదా! అందుకే నీ చుప్పనాతి బుద్ధిని
పోనించుకున్నావు కావు!’ అంటూ సందు దొరికిందే చాలని పక్క దేశాన్ని
నిష్కారణంగా ఆడిపోసుకున్నాడింకో ఢింబకుడు. కొత్తగా వచ్చి పడ్డ ఈ కరోనా
గండ గత్తెరను పాత కవి ‘కుక్కల, నక్కల వదలక/సందుల పందుల విడువక/రంజుగ
నంజుకు తింటివి’ అంటూ చైనావాడి తిండియావకు అంటగడితే, ‘ ‘చైనా హద్దును
దాటావు/స్విస్ ముద్దును ఆపావు/చేతులు పిసుకుట పాయే/మూతులు నాకుట పాయె/
'నమస్తే' నే శ్రేష్ఠంబను/సత్యం అవగతమాయే!’ అంటో మరో  దేశవాళీ కవి
సంస్కృతి మీదున్న తనకున్న మమకారం చాటుకున్నాడు.  ‘డ్రాగన్’కు కన్నబిడ్డవు
నీవు/సామ్రాజ్యవాదానికి ముద్దుబిడ్డవు నీవు /ప్రపంచానికి పాడు బిడ్డవు
నీవు/ స్వార్ధానికి సొంత బిడ్డవు! అయినా కరోనా నీవు వచ్చావు. కరచాలనాలకు
స్వస్తి చెప్పావు/ఇంగ్లీష్ రాజును సైతం/చేతులు జోడించి వందనం చేసేలా
చేసావు/పడమటి దేశాల వ్యవహారాలకు/పాశ్చాత్యదేశ నాగరికతలకు/గులాంగిరీ
చేసే/పద్ధతులకు స్వస్తి పలికించావు’ అంటూ తిట్టి. మెచ్చిన కవులకూ
కొదువలేదు. పబ్బులు, పిజ్జాలు, ఐస్ క్రీంలు, ఏ.సి లకు దూరం చేసినందుకు,
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోని వారి  ముక్కూ, చెవులూ మూసేసినందుకు
కరోనా భూతం వీపు తట్టిన పెద్దమనుషులూ తక్కువలేరు. బయట తిళ్లకు
మరిగినవాళ్లను ఇంటి దారి పట్టించడం, బస్సుల్లో, రైళ్లల్లో  పైనపడి రాసుకు
పూసుకు తిరిగే పోచికోలుతనాలు మానిపించడం కరోనా వల్ల కాక మన ఖాకీల లాఠీల
వల్ల ఎన్ని యుగాలకవుతుందనీ?!

ఇప్పటికే వేలాది మందిని గుట్టు చప్పుడు కాకుండా చంపేసింది,
లక్షలాదిమందిని వ్యాధి లక్షణాలున్న అనుమానితులుగా మార్చి రచ్చచేస్తోందీ..
కరోనా రక్కసి! ఇడి, సిఐడి,  సిబిఐ తరహాలో తమాషాగా సాగదు ఈ కరోనా వైరస్సు
దాడి! పంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన మార్చి 11 కు చాలా ముందు
నుంచే  ప్రపంచాన్ని అరాచకంలో ముంచెత్తేందుకు చాపకింద నీరులా
ముంచుకొచ్చిందీ మహమ్మారి. ప్రపంచ పర్యాటక రంగం మొత్తం కరోనా వేటుకు
కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ రంగం కాళ్లు రెండూ కర్కశంగా విరిచేసింది..
కనకనే నడకలో ఎక్కడా నిలకడనేదే లేకుండ పోయింది షేర్లకు.

డైమండ్ ఒక చేత పెట్టి డైఫర్ మరో చేత పెడితే  డైఫరుకే మొగ్గు చూపే
సిగ్గుమాలిన కాలం కరోనా పుణ్యమా అని ఇప్పుడు దాపురించిందన్నది చివరి మాట.
నూట పాతిక  ఏళ్ల పిదప మొదటి సారి తిరుపతి వెంకన్న దర్శనం భక్తులకు
మూతబడింది. కరోనా వైరస్సు  సోకితే పరమాత్ముడికీ పారాసిటమాల్ వాడేసే
శుభఘడియలు ఎంత వేగిరం వచ్చేస్తే లోకానికి అంత  శ్రేయస్కరం! కరోనా- ఫాల్స్
గాడ్ పేరుతో వీడియో గేమ్ విడుదలవడం ముఖ్యమా?  కరోనా వైరస్ పీడ విరగడకు
మందు కనుగొనగొనడం ముఖ్యమా? వార్తాపత్రికలనూ  ఈ కరోనా పాతరేయేకముందే
మనిషి మేల్కొనాలి.

కూడు పెట్టని కులాలు, మనసు నింపని మతాలు, ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు..
ఇవా మనుషుల మధ్య మత్సరాలు పెరిగేందుకు కారణాలు కావడం? శుద్ధే కాదు బుద్ధీ
తరిగిన మనిషిని దారిలో పెట్టేందుకు రాలేదు కదా ఈ కరోనా వైరస్ మహమ్మారి?
కరోనా వైరస్  కు కులం అడ్డు రాలేదు. మతం అంటు సోకలేదు. ఆ వర్ణం కావాలని ఈ
వర్ణం వద్దని అనుకోలేదు. డబ్బున్న పెద్దమనిషి కదా అని దయచూపించిందిలేదు.
కళల్లో నిష్ణాతుల మీద కనికరం చూపించింది లేదు. పసిపిల్లల నుంచి, ముదుసలుల
వరకు కరోనా వైరస్ కామించని వర్గం కనిపించదు. మనిషి పశు పక్ష్యాదుల మీద
దౌర్జన్యానికి దిగిన తీరునే కరోనా ఇప్పుడు మనిషి సామర్థ్యం మీద సవాలు
విసురుతున్నది. కరోనా వైరస్ ను తప్పు పట్టే ముందైనా మనిషి  ఆత్మవిమర్శ
చేసుకోవడం అవసరం.

యే కరోనా.. వో కరోనా(ఇది చెయ్యి.. అది చెయ్యి) అంటూ  ఎవరినీ దేబిరించదు
కరోనా. కంటికి కనిపించదు కానీ.. మానవుడు చెయ్యలేని ఘనకార్యాలెన్నే
చిటికెలో చేసేస్తున్నదిప్పుడు. ఎంత కఠినసమస్యలనయినా  ఇట్టే మటుమాయం
చేసేస్తోంది. కేజ్రీవాల్ అంత కష్టపడ్డా సాధించలేని దిల్లీ కాలుష్యాన్ని
చిటికెలో తీర్చేసింది. మనకూ, పాకిస్తానుకు, చైనాకు, మధ్యన సవాలక్ష గగనతల
విమానయాన ఆంక్షలు గదా ఎప్పుడూ! ఇప్పుడు కరోనా వైరస్  దెబ్బకు చడీ చప్పుడు
లేకుండా  ఏ ఒప్పందాలతో పనిలేకుండా ఆ ఆంక్షలన్నీ రాత్రికి రాత్రే రద్దు !
 కరోనా వైరస్ రెండో దశలో భారత్ ఉందిప్పుడు. ఈ దశలో చైనా అప్రమత్తమైతే..ఈ
దశలోనే ఇటలీ, ఇరాన్ నిర్లక్ష్యం చేశాయ్. ఈ దశలో చైనా ప్రజలు ఇంట్లో
ఉంటే.. దశలోనే ఇటలీ, ఇరాన్ ప్రజలు రోడ్లపై తిరిగారు. ఈ దశలో చైనాలో
కేసులు మాత్రమే పెరిగితే.. ఈ దశలోనే ఇటలీ, ఇరాన్ లో మరణాల రేటు
రెచ్చిపోయింది. ఈ రెండు, మూడు దశలే మనకిప్పుడు  కీలకం! ప్రజలకైనా..
ప్రభువులకైనా!
లోకాలకు ఉత్పాతాలు తప్పవని దాదాపు అన్ని మతగ్రంథాలలోనూ హెచ్చరికలు
ఉన్నాయి. క్రీస్తు మతం డూమ్స్ డే అన్నదాన్నే హైందవమతం మహాప్రళయం
అంటున్నదేమో! ఎన్ని ఉపద్రవాలు ముంచుకొచ్చినా సొంత తెలివితేటలు సానబట్టి
బైటపడే గడుసుతనం మనిషిది. ఇప్పటి వరకు. ప్లేగు, కలరా వంటి మహమ్మారులు
ప్రపంచాన్ని వణికించిన రోజుల కన్నానా ఇప్పుడు ముంచుకొచ్చే కరోనా వైరస్
వైభోగం? ఆఖరికి  మనిషి ఎట్లాగో ఈ కష్టాన్నుంచి బైటపడడం ఖామయే! కాని ఈ
కష్టకాలంలో  నేర్చుకున్న జీవిత పాఠాలే కదా భావి ఉజ్వలతకు దోహదించేవి!
అవునా.. కాదా? కరోనా! ఇంతకు మించి క్యా కహోనా?!
***

బంధుపురాణం - కర్లపాలెం హనుమంతరావు -ఈనాడు -సంపాదకీయమ్

 


భార్యా పుత్రులు గత జన్మ తాలూకు రుణదాతలు. మనం ఎగేసిన బాకీలను వసూలు చేసుకునెందుకు వదలకుండా వెంటాడి సంసార చక్రబంధంలో ఇరికించి చక్రవడ్డీతో సహా బకాయిలు సుప్తా రాబట్టుకుంటే తప్ప వదిలిపెట్టని నక్షత్రక వంశ సంజాతలు- అన్నాడు వెనకటికి ఓ అప్పులు ఎంతకీ తీరని ఓ అప్పుకవి. ఆలుబిడ్డలనే అప్పులోళ్ల కింద చూపెట్టిన ఆ మహానుభావుడు మరి చుట్టపక్కాలను ఏ జాతిలో చేరుస్తారో .. తెలీదు!

లేనప్పుడు ఉండాలనిపించేది, ఉన్నప్పుడు తరిమికొట్టాలనిపించే జాతిలో ముందు వరసలో ఉండేది బంధువర్గాలే. బాబాయ్.. మామయ్యా, అత్తమ్మా, పిన్నమ్మా అంటూ ముత్తాతల దగ్గర్నుంచి మునిమనవళ్ల వరకు అందరూ దగ్గర ఉన్నప్పుడు అదో ధీమాగా ఉంటుంది.. కానీ బీమా పట్టానే తొందరగా పండే ప్రమాదం ముంచుకొస్తుంది. వచ్చినోళ్లందరికి భోజన, వసతి, వినోదాది సౌకర్యాలు సమకూర్చే బాధ్యత నిర్వహించే కొద్దీఆరంభంలో దేవుళ్లుగా సంతోషం కలిగించిన అతిధులు కాలం గడిచే కొద్దీ కాలయముడి దూతలు అనిపిస్తారు! పూర్వకాలంలో ఎవరూ ఇహ వద్దన్న విరక్తి స్థిరపడ్డ తరువాత ఏ కాశీకో వంటరిగా ప్రయాణం కట్టే సంప్రదాయం ఉండేది. 'కాశీకి పోయాను రామా హరీ! గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ!' అని వెనకటి పాత సినిమాలో రేలంగోడు కాషాయం ధరించి నటించినట్లు కాదు. అచ్చమైన సన్యాసం స్వీకరించి బంధు మిత్రులందరి మీదుండే అవ్యాజ ప్రేమసర్వాన్ని త్యజించి సన్యాసిగా రూపాంతరం చెందిన తరువాతనే శ్రీ శంకరులు హిందూమతాన్ని ఓ గాడిన పెట్టగిలిగింది. 

కార్య సాధనకు బంధుమిత్రుల సహకారం అవసరం. కార్యవిఘాతానికీ బంధుమిత్రులే చాలా సందర్భాలలో కారణభూతం. ముఖ్యంగా రాజకీయాలలో. కష్టపడి పైకొచ్చిన జీవి కష్టపడుతూనే ఉంటాడా! ఆ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకొనే పరంపర ఒకటి పుట్టుకొస్తుంది. జాతీయ రాజకీయాలలో అత్యంత ప్రముఖ పాత్ర వహించి  స్వాతంత్ర్య సముపార్జన అనంతరం ఆశేతు హిమాచల పర్యంతం బంధువర్గాన్ని సాధించుకున్న  మహాత్మా గాంధీకి తన పెద్ద కుమరుడు రూపంలో ఒక బంధుత్వంలోని చేదుఅనుభవం జీవితాంతం వెంటాడింది. 

భారతంలో శ్రీకృష్ణుణ్ని పాండవులు బంధువుగా భావించి గౌరవించారు. ఆ యదువంశజుడు కష్టమొచ్చినప్పుడు తనను తలచుకున్న వాళ్లందరిని ఏదో ఓ రూపంలో ఆదుకున్న ఆ పద్బాంధవుడే . ఆఖరుకు చిన్ననాటి గురుకుల చేల కుచేలుడుని కూడా బీదరికంతో  తన దగ్గరకు వచ్చినప్పుదు నోరు విప్పి అడగక ముందే  ఆదుకున్న ఔదార్యమూర్తి.  

కొందరు బంధువులుగా ఉంటూనే వినాశనం నెత్తికి తెచ్చిపెడతారు.  శకుని అందుకు చక్కని ఉదాహరణ. రామాయణంలో ఏ సంబంధం లేక పోయినా ఉడుత దగ్గర నుంచి, జటాయువు వరకు  శ్రీరామ చంద్రుడిని కష్టకాలంలో ఆదుకున్నాయి. కానీ సుఖాలు అనుభవించవలసిన సుముహూర్తాన్ని సుదూర తీరాల దాకా తరిమి కొట్టింది తల్లి తరువాత తల్లంతటి  పినతల్లి..  కైకేయి! 

బంధువర్గాలు విస్తరిస్తే  రాజ్యాలకు స్థిరత్వం ఉంటుందన్న దృష్టి కోణంలో గతంలో రాజులు తోటి రాజులతో పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బంధువర్గాలను పెంచుకునేవారు. యుద్ధంలో విజేతలైనా పరాజితుల వంశంలోని కన్యలను  కళ్యాణమాడే పద్ధతి వెనక ఉన్న రహస్యం ,, తదనంతరం పరాజితులు  ప్రతీకారేచ్ఛతో ఎదురుదాడికి దిగకుండా ఉండటమే. చరిత్రలో ఈ వ్యూహం అద్భుతంగా ప్రయోగించిన ఆచార్యుడు చాణక్యుడు. 

బంధుత్వాలు మతం, కులం, జాతి ఒకేలా ఉండటం చూసుకునే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. ఉపాధుల కోసమై వలసలు పెరిగిన పంథొమ్మిదో శతాబ్దం నుంచే ఖండాతర బంధుత్వాలకు పునాది పడింది. 

నవనాగరీక ప్రపంచంలో అంతార్జాల సమాచార విప్లవం పుణ్యమా అని జాత్యంతర వివాహాల మూలకంగా కొత్త రకం బంధుత్వాలకు రూప కల్పన జరగడం ఇప్పుడిప్పుడే ఆరంభమయింది. 

ముందు ముందు గ్రహాంతర బంధుత్వాలకూ బీజాలు పడే లక్షణాలు కనిపిస్తున్నాయి.  ఏదేమైనా .. 'ప్రపంచమంతా నా వాళ్లు.. ప్రజలంతా నా బంధువులే' అంటూ విశ్వమానవత వెల్లివిరిసే మంచిరోజులు వస్తాయని ఆశిద్ధాం

-కర్లపాలెం హనుమంతరావ01 -01 -2021


బోథెల్; యూఎస్ఎ


ఏది స్వర్గం, ఏది నరకం? -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం - ఈనాడు, 22 -05 -2011)

 ఏది స్వర్గంఏది నరకం?

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం - ఈనాడు, 22 -05 -2011)

 

ఏ రహస్య సృష్టి సానువులనుంచో జాలువారే కాంతి జలపాతం ఈ జీవితం... జనించేదెవరి వలనచలించేదెందు కొరకులయించేది ఏ దిశకుఅన్నీ ధర్మసందేహాలే. అసలు కిటుకు ఆ కమలాసనుడికైనా తెలుసో లేదో! మానవుడు బుద్ధిజీవి. రాశి చక్రగతులలో/ రాత్రిందిన పరిణామాలలో/ బ్రహ్మాండ గోళ పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువుకా ప్రేరణకేది మూలకారణమో అంతు తేలేదాకా ప్రయాణం మానడు. అదే చిత్రం. గ్రహరాశుల నధిగమించి/ గగనాంతర రోదసిలో/ గంధర్వ గోళగతులు దాటిన మనిషి ఓ వంక నెలవంకనంటివస్తాడు... మరోవంకమరణానంతరం జీవితం ప్రశాంతంగా సాగేటందుకు చుక్కలకు ఆవలి దిక్కున ఎక్కడో చక్కని లోకాలు చక్కర్లు కొడుతున్నాయని బలంగా నమ్ముతుంటాడు... అదింకో విచిత్రం. మార్గాలురూపాలు వేరువేరైనా స్వర్గాలునరకాలు అన్న భావనలు అన్ని మతాలకూ ఒకేలా ఉండటం అన్నింటికన్నా చిత్ర విచిత్రం! 'పుణ్యం చేసుకున్నవారు మరణానంతరం దైవదూతలుగా తేలియాడే ప్రేమారామ'మని యూదుల స్వర్గధామాన్ని అభివర్ణిస్తారు. 'అమృతం కురిసిన రాత్రి'లో బాల గంగాధర్‌ తిలక్‌ వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలబడినప్పుడు- పాదాల తారామంజీరాలు ఘల్లు ఘల్లుమని మోగించుకుంటూ వయ్యారంగా ఆకాశమార్గాన పరుగులెత్తుతూ పరవశం కలిగించింది బహుశా అలాంటి దేవతా ప్రేమమూర్తులేనేమో!

 

ఆ అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులుభావుకులకు విశ్వసాహిత్యంలో కొదవే లేదు. కాళిదాసునుంచి మిల్టన్‌దాకాకృష్ణశాస్త్రినుంచి కవి తిలక్‌వరకూ దివిసీమ అందాలను గురించి పలవరించనిదెవరుమనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డు పెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచాన్ని గురించే! 'అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవఅంటూ అమరపురి వైభోగాలను కలవరించిన తీరుకు మునిముచ్చులకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడునే గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? 'దిగిరాను దిగిరాను దివినుంచి భువికిఅని భావకవి వూరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల సాము గరిడీలట పద్మసంభవవైకుంఠభర్గసభలు! ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంతా సాధారణమైన సాధనేనా?! కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్పవృక్ష చ్ఛాయల్లో పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల వెచ్చని ఒడి... అమర గానం... అమృతపానం... అవో... ఏ మర్త్యప్రాణిని ఝల్లుమనిపించవు?! ఏడు వూర్ధ్వ లోకాలనే కాదు... ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'ఆ నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకుఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?! కాలదండం పాలబడకుండా కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి మార్గం. 'దైవమూ-దయ్యమూపాపమూ-పుణ్యమూస్వర్గమూ-నరకమూమందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందుఅంటాడు కవి ఎమ్మాగోల్డ్‌. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమాలిన వారలగుచు గదుకక యెవరో/ బతిమాలిన నల్లినకట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.

 

స్వర్గంనరకం- మానవ మనోమందిరంలోని రెండు వూహా లోకాలు అయితే కావచ్చు... మరి మహనీయుల ఆ కమనీయ కల్పనల వెనకున్న తపనో?! మానవుడనే శిలను మాధవుడనే శిల్పంగా తొలిచి భువిని భువర్లోకంగా మలచాలనుకోవడం మహదాశయం కాదా?మహాభారతంలో స్వర్గారోహణం వేళ ధర్మజునితో యమధర్మరాజు అన్నట్లు 'స్వర్గ నరకాలు వేరువేరుగా లేవు'. తన సంతోషమె స్వర్గంతన దుఃఖమె నరకమనే గదా సుమతీ శతక కర్త సుభాషితం. 'తృప్తిచెందని నరుని సప్త ద్వీపంబులైన చక్కంజేయునే! అక్షరంబులు నాలుగు కుక్షిలో వేసి అక్షరంబేదో తెలుసుకో మనసాఅని హెచ్చరించారు వేదాంతులు. నిగమంబులు వేయి చదివినా జీవిత సారం ఒంటబట్టనివాడికి ఏ ముక్తిమార్గమూ సుగమం కాదు. జీవితాన్ని చెదలపుట్టలో చీకిన ఆకులు తిని బతికే మకిలి పురుగులాగా చీదరించుకొనే వాదం ఎంత అసంబద్ధమో... విడివిడి భాగాల కలివిడితో తయారైన ఓ భౌతిక యంత్రంతో పోల్చి చూడటమూ అంతే అహేతుకం. శాస్త్ర నిఘంటువు నిర్వచనానికి అందనిదంతా అసత్యమన్న వాదనా సత్యదూరమే. క్రాంతి దర్శకులు వెలుగు చూపరు. వారు చూపిన దారిని పట్టుకుని జీవితాన్ని వెలిగించుకోవలసింది మనం. ఆ తెలివిడే జ్ఞానం. ప్రేమను మూలధనంగా పెట్టి జీవితాన్ని వ్యాపారంగా మలుపుకోవాలనుకునే బేహారులకు- లాభం స్వర్గంనష్టం నరకం. విజయం స్వర్గంఅపజయం నరకం. దుఃఖం నరకంసుఖం స్వర్గం. ఠాగూర్‌ గీతాంజలి ప్రార్థన ప్రకారమైతే- ఎక్కడ జ్ఞానం నిత్యం వెల్లివిరుస్తుంటుందో అదే శాశ్వత స్వర్గం. కాలసంక్షిప్త చరిత్ర గ్రంథకర్తఅయిదు దశాబ్దాల బట్టి చావుబతుకుల సరిహద్దుల వద్ద తచ్చాడుతూనే మానవ చరిత్ర పురోగతికి అసమానమైన సేవలందిస్తున్న శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ 'స్వర్గం మిథ్యఅని చేసిన తాజా వాదాన్ని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. మానవజాతి అభివృద్ధికోసం తపించే వారెవరికైనా అడుగడుగునా గుడే కనిపిస్తుంటుంది. అందులో వెలిగే దీపం భావవాదులకు దైవం అయితే... భౌతికవాదులకు జ్ఞానం. చూపులు వేరైనా చూస్తున్నది ఒకటే. అదే దైవజ్ఞానంజ్ఞానదైవం. తేడా లేదు- రెండూ ఒకటే.

(సంపాదకీయంఈనాడు, 22 -05 -2011)

_____________________

గల్పిక : చెట్టుకు చాదస్తం జాస్తి!

 గల్పిక : 

చెట్టుకు చాదస్తం జాస్తి!

 

- కర్లపాలెం హనుమంతరావు 


చెట్టుకు చాదస్తం జాస్తి. నరికినా అవి నరజాతిని  ప్రేమిస్తాయి. ఊడలు పెరికినా, వేరుతో సహా వూడబెరికినా తాను ఎండకు కాగుతూ నీడను ఇవ్వాలనే చూడడం చెట్టు  చాదస్తమా? కొమ్మలు విరుచుకు పోయే దొమ్మీజాతిని సరసకు రానీయనే కూడదు కదా వాస్తవానికి! రాళ్లేసి పళ్లు రాలగొట్టుకునే రాలుగాయిల మీద పూలు కురిపించే చెట్టును వట్టి 'ఫూల్' అనాలా? చెట్టు తన  పట్టలు చీల్చుకు పోతున్నా పట్టించుకోదు.. సరి కదా తానే తన తొర్రలో ఆ త్రాష్టుడు పైపైకి ఎగబాకేటందుకు వీలుగా మెట్లు తయారుచేయడం  విచిత్రమే! చెట్టంత ఎదిగిన మనిషి చెట్టుకు అపకారం తలపెట్టినా ఒక్క తిట్టు పదమైనా విసరడం ఎబ్బెట్టు చెట్టుజాతికి! నిలవ నీడలేని నిర్భాగ్యుడికి తనే కుదురు కడుపులో ఇంత  వెచ్చని చోటిచ్చే దయామయ జీవి లోకంలో చెట్టు కాక మరొకటి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడోనని సందేహించే మీమాంసకులకు.. ఉంటే గింటే ఎలా ఉంటాడోనని తర్కించే  ఆలోచనాపరులకు తనే దేవుడునని చెట్టు ఎప్పుడూ నోరు విప్పి సందేశమిచ్చుకోదు. గొప్ప గొప్ప సేవల నిశ్శబ్దంగా చేసుకుపోవడమే తరువు తత్వం తప్పించి గొప్పలు చెప్పుకునే నైజం చెట్టుకు వంటబట్టలేదు. వంటచెరుకుగా తనను వాడుకొమ్మన్నది.. కొమ్మలు ఎండిన తరువాత! తిండి సరుకుగా కండలు పెంచుకొమ్మనీ కాయా కసరూ, పండూ, పసరూ  విసుగూ విరామం లేకుండా కర్ణుని మించి ఎల్లవేళలా అందించేది చెట్టు. ఒక్క మనిషికనే కాదు నిజానికి చెట్టు సృష్టిలోని  తతిమ్మా అన్ని జీవులకు అమ్మను మించిన అమ్మ! అమ్మదయినా అడగనిదే పెట్టే ఔదార్యం కాదు. ఆమెయినా ఆ చెట్టు కొమ్మ ఇచ్చిన కాయా కసరు, పళ్లూ పూలతోనే సంసారం సాకేది. వంటికి చుట్టుకునే బట్ట చెట్టు ఇస్తేనే కదా వచ్చేది! కంటికి పెట్టుకునే కాటుకైనా సరే.. కాలి బూడిద అయిన పిదప మిగిలిన మాసిక నుంచే  వచ్చేదని తెలుసా! జీవుల సేవ కోసమై నేల తల్లి కడుపున పడినప్పటి బట్టే చెట్టు విత్తనమై మొలకెత్తాలని ఎంతలా తపిస్తుందో మనిషికి తెలియదు. అదనుకు పదునుగా వానలు పడితే ఆనందంగా వేళకు పంటగా మారి మన ఇంట చేరి గోదాము గుంటలో ఓ మూల దానానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి కరవు రక్కసి రక్కేసిపోతుంది. మరోసారి వరద వచ్చి వంగడం కొట్టుకుపోతుంది. ఇంకోసారి ఏ పురుగో పుట్రో కుట్ర పన్నినట్లు తిండిగింజను తన్నుకుపోతుంది. ప్రకృతి ఉక్రోషం, ప్రకృతి సంతోషాలతో నిమిత్తంలేని సేవాతత్వం చెట్టూ చేమది.  కాబట్టే తాలూ తప్పను కూడా వదలకుండా ఏ తవుడో, చొప్పగ మార్చి సాగుపశువుల  కడుపు నింపేది. నమ్ముకున్న ఏ జీవినీ వదిలేసే ఊహ చెట్టుకు ఎప్పుడూ రాకపోవడం  సృష్టి విచిత్రాలలోకెల్లా విశేషవైన పెద్ద విచిత్రం. అగ్గి పెట్టే వంటచెరుకు నుంచి అగ్గిపెట్టెలో మండే పుల్ల సరుకు వరకు అన్నింటా చెట్టు మహావిశ్వరూపమే. చెట్టు విశ్వంభర! చెట్టు కలపగా ఇళ్లు కడుతుంది. చెట్టు  ఆకులై దడులు నిలబెడుతుంది. చెట్టు దుంగలై తల కాచినప్పుడే మనిషి ఒక ఇంటివాడుగా మారే అవకాశం. చెట్టాపట్టాలేసుకు తిరగవలసిన స్నేహితుడు చెట్టు మనిషికి.  అమ్మ పక్కన చేరి నసపెట్టే పసికందుకు  తాను ఊయల; అన్నీ వదిలి లోకం విడిచిపెట్టే మనిషిని ఆఖరి మజిలీ వరకు వదిలిపెట్టని  పేటిక చెట్టు. పాడు లోకం అని ఎంత ఈసడించిపోతున్నా తానో పాడెగా తోడుగా వచ్చే ఆత్మబంధువు కూడా ఆ చెట్టే సుమా! మట్టితో మనిషి  మమేకమయే చోటుకు గుర్తూ చిగురిస్తూ పైకి మొలచిన మొలకే సుమా!  గుర్తుగా  పూలిస్తుంది సరే.. ఆ పూలకు తావీ  ఎందుకనిస్తున్నట్లో చెట్టు? మానవత్వం ఎంత సుగంధభరితమై పరిమళించాలో చెట్టు ఇచ్చే సందేశం  మిత్రమా అది! పండు ఇస్తుంది.. సరే పండుకు రుచి ఎందుకు జతచేస్తుందిట చెట్టు? మనిషితత్వం ఎట్లా పండించుకొనాలో గురువులా తరువు బోధించే జీవనసూతం సుమా అది! కాలానికి సూచికలు చెట్టు ఎదుగుదల దిగుదలలే! ఏమీ విగలదనే వైరాగ్యం ఎంత అవాస్తవమో గ్రీష్మం వెన్నంటి వచ్చే వసంతంలో పూచి  చెట్టు జీవిత పరమార్థం ప్రకటిస్తుంది. రాతి కుప్పలు, ఇసుక తిప్పలు, జలగర్భాలు.. చివరికి బురద కూపాలు.. ఏదీ చెట్టు చివుళ్ల పచ్చని పలకరింపుకులకు బహిష్కృతం కాదు. అడిగితే బెరడునైనా మందుకు ఇచ్చేందుకు బెట్టుచేయని చెట్టు నుంచి మనిషి ఏమి పాఠం నేర్చుకుంటున్నట్లు? కట్టు బట్ట నుంచి, కొట్టుకు తినే కాయా, కసరు వరకు దాన కర్ణుడిని మించిన ఔదార్యం ప్రదర్శిస్తుంది కదా చెట్టు! నివారణలోనే కాదు, రోగ నిదాన చికిత్సలో సైతం వేరు, కాండం, మూలిక. ఆకు, పసరు, లేహ్యం, లేపనాలుగా   మొక్క చేసే సేవకు ఇంగితమున్న ఏ మానవుడైనా సాగిలపడి మొక్కాలి కదా నిజానికి? జ్ఞాన సింధు బుద్ధుడికి  గురువు తరువు; నేటి మనిషి మొరటుతనంతో  తరువు పరువు కోలుపోతున్నది; గుండె చెరువవుతున్నది.  కోరినది ఏదైనా మారు పలుకు లేకుండా సృష్టించైనా ప్రసాదించే కల్పతరువు పౌరాణికమైన కల్పన  కావచ్చునేమో’. కానీ  వాస్తవ జగత్తులోనూ గడ్డిపోచ నుంచి, గంధపు చెక్క దాకా మనిషి జీవితంలోని ఏ భాగమూ వృక్షజాతి ప్రమేయం వినా వృద్ధిచెందే అవకాశం సున్నా! దాల్చిన చెక్కా.. పూరి జగన్నాథుడు తాల్చిన చెక్కా.. మచ్చుక కై చెప్పుకునే చెట్టు తాల్చే సహస్రాధిక అవతారాలలో కొనే ముచ్చట్లు! చెట్టుకూ మనిషికీ మట్టే తల్లి. ఒకే తల్లి బిడ్డలై పుట్టినా ఇద్దరి తత్వాల మధ్య ఎందుకింత తారతమ్యం? దాని పొట్ట కొడితే తప్ప తన బతుకు గడవని చెట్టు పైన మనిషి దావవత్వం అభ్యంతరకరం. సౌహార్ద్రం సంగతి ఆనక.. కనీసం సోదరభావమైనా ప్రదర్శించే ఆలోచన నాగరీకత నేర్చినా మనిషి చేయడంలేదు.  విచారకరం! 'వృక్షో రక్షతి రక్షతః'  చాదస్త సుభాషితం కాదు. 'చెట్టును బతకనిస్తేనే చెట్టు బతకనిచ్చేది' అన్న పర్యావరణ సూత్రం  ఎంత సత్వరం వంటబడితే మనిషి మనుగడ కొనసాగింపుకు అంతటి మేలు! 

- కర్లపాలెం గనుమంతరావు 

10 - 10 - 2021 


బోథెల్ ; యూ. ఎస్.ఎ

అడ్డదారి - కథానిక కర్లపాలెం హనుమంతరావు - (ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురితం)

అడ్డదారి - కథానిక

కర్లపాలెం హనుమంతరావు


సులభ కెనరాబ్యాంకులో ఆఫీసర్. 

ఇయర్ ఎండింగ్ సీజన్.  ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా  ఉంటోంది ఎప్పటిలానే. 

తొందరగా తెముల్చుకుని బైటపడదామన్నా చీకటి పడనేపడిందా పూట.  పైన దట్టంగా మబ్బులు కూడా. సెల్ చూస్తే  టైమ్  ఏడుకు  ఇంకా ఐదే నిముషాలున్నట్లు గత్తర పెడుతోంది! ఆర్టీసి క్రాస్ రోడ్స్ కు వెళ్లే  లాస్ట్ బస్ టంచనుగా ఏడింటికి వచ్చి పోతుంది. 

ఎంత గబగబా అడుగులు వేసినా కనీసం పదినిముషాల నడక 

బస్టాండుకు. దాదాపు పరిగెత్తినంత పనిచేసిందామె. 

 నిర్మానుష్యంగా ఉంది బస్టాండంతా! డైలీ తనతో పాటు వచ్చే గ్యాస్ ఆఫీస్ పిఆర్ఓ  లేడీ   కూడా కనిపించలేదక్కడ. 

సామాను సర్దుకుంటోన్న పల్లీల అవ్వను అడిగింది సులభ  'సిటీకీ పోయే ఏడింటి బస్సు పోయిందా అవ్వా?' 

'ఇప్పుడే పోయింది బిడ్డా! ఇంకే బస్సులూ  రావే!ఎట్టా చేస్తావూ?'    తట్ట నెత్తికి  ఎత్తి పెట్టుకుని జాలిగా అడిగిందా అవ్వ. 

'ఏదైనా ఆటో చూస్తాలే! నువ్ పో!'

'పెద్ద మబ్బు తల్లీ! చినుకులు రాల్తావున్నాయి!  ఏ ఆటో సచ్చినోడు ఇటేపొచ్చి చస్తాడో! పాపం, ఆడబిడ్డవి! బేగి ఇల్లు చేరుకో తల్లీ!' అని గొణుక్కుంటూ వెళ్లిపోయిందా అవ్వ . 

సులభకు అప్పుడు గాని అర్థమయింది కాదు తన పరిస్థితి. 

బస్సు లేక, ఆటో దొరక్క, ఈ గాలివానలో ఇక్కడే ఇరుక్కుపోతే నలభై కిలో మీటర్ల దూరంలో ఉండే ఇల్లు చేరేదెట్లా? 

ఉన్న ఒకట్రొండు చిన్న దుకాణాలు కూడా కట్టేసుకుంటున్నారు మెల్లమెల్లగా! 

బస్టాండులో  ఆడమనిషొక్కతే బిక్కు బిక్కు మంటూ నిలబడుండటం అప్పుడే దారే పోయే మనుషుల కంట్లో  పడ్డం మొదలుపెట్టింది. ఒకళ్లిద్దరు మగాళ్లయితే మొరటుగా నిలబడి తేరిపారా చూస్తూ పోవడంతో భయం పట్టుకుంది సులభకు. 

'ఎంత తొందరగా ఇక్కణ్ణుంచీ కదిలితే అంత సేఫ్!'   

ఇంగితం హెచ్చరించడంతో సెల్ తీసి రాజశేఖర్ నెంబర్  నొక్కింది. రెండు కాల్సయినా   రెస్పాన్స్ లేదు. రాదని తెలుసు. శేఖర్ సెల్ ఈ టైములో ఆఫ్ లో ఉంటుంది!   అతగాడు అక్కడెక్కడో మాధాపూర్ చివర్లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అనలిస్ట్.  డ్యూటీ స్టార్టయ్యే ముందు డైలీ టీం డిస్కషన్  ఉంటుంది. ఆ టైమ్ లో సెల్ ఆన్-లో  ఉండదు. అది రూలు. రోజూ తను ఇంటికి చేరిం తరువాత మెసేజ్ పెట్టినా  వెంటనే రిప్లై రాదందుకే.  రూల్స్ స్ట్రిక్టు గా పాటించక తప్పని  ఆ కంపెనీలో  ఆఫీసు వదిలిందాకా శేఖర్ తో  కాంటాక్టంటే స్ట్రిక్ట్లీ వయా మెసేజెస్సే! 

అన్నీ తెలిసీ కాల్ చెయ్యడం.. కంగారు అణుచుకోలేకే! లక్కీగా భర్త నుంచి ఏదైనా సలహా  వస్తుందని కూడా ఆశ. కుదరక, మెసేజ్ పెట్టి నడక మొదలుపెట్టింది సులభ!

నిజంగానే లక్కీ! శేఖర్ నుంచి కాల్! సులభ చెప్పేది సగమే విని 'గొప్ప చిక్కుల్లో పడ్డావ్ సులభా! ఆ ఏరియా అస్సలు సేఫ్ కాదు. ముందేదైనా దొరికిన వెహికల్ పట్టుకుని యాదగిరి టాకీస్ సెంటర్  దాకా వచ్చేసెయ్! బేరం గీరుతూ కూర్చోక ఆటో దొరికితే. మీ లేడీస్ కు అదో వీక్ నెస్! సెంటర్ కొచ్చేయగానే మెసేజ్ పెట్టు. ఇట్లాగే ఏ టాయ్ లెట్ లోకో  దూరైనా మాట్లాడతా! ఇప్పటికే చాలా టైమయింది. బాస్ పిలవకముందే వెళ్లాలి' అంటూ కాల్ కట్ చేశాడు రాజశేఖర్.

ఒకటి రెండు ఆటోలు వస్తున్నట్లే వచ్చి దూసుకుపోయాయి. జల్లు జోరు పెరిగింది. ఇంటికి కాల్ చేస్తే చాలా సేపటికి గానీ ఎత్తారు కాదు అత్తగారు. 'ఎక్కడున్నావు సులభా?' పెద్దావిడ కంగారు. 'పిల్లలిద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఇప్పటికే నిన్ను గూర్చి అరడజను సార్లు అడిగారు. తొందరగా రా!' ఆమె బెంగ  ఆమెది. 

విషయం చెప్పి 'కాస్త లేటవచ్చేమో అత్తయ్యా! పిల్లలకు సర్ది చెప్పండి! కాస్సేపు చదువుకుని పడుకోమనండి! మీరూ తినేయండి! నా కోసం వెయిట్ చెయ్యద్దు! షుగర్ టాబ్లెట్స్ వేసుకోడం మాత్రం మర్చిపోవద్దు' అని ఫోన్ పెట్టేసింది. 

ఎవరో ఆటోవాడు ఎదురుగా బండి నిలిపి 'ఎక్కడికమ్మా పోవాలి?' అనడిగాడు. 

'చిక్కడపల్లి వస్తావా?' ఆశగా అడిగింది సులభ. 

'సిటీలోకి పర్మిషన్ లేదు మేడమ్! కావాలంటే యాదగిరి సెంటర్ దాకా వస్తా! వందవుద్ది' అన్నాడు కరాఖండిగా.  

బండిలో ఎక్కి కూర్చున్న  తరువాత గొణుక్కుంది సులభ  'అందరూ అంతే! అవకాశం వస్తే ఏదీ  వదిలిపెట్టరు.. ఐదు కిలో మీటర్లు కూడా ఉండదు సెంటర్. ముప్పై అంటేనే గొప్ప. మీటరు వేస్తే పరిస్థితి అర్థమవుతుంది.'

 భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చి కిమ్మనకుండా  కూర్చుండిపోయింది. 'ఎట్లాగో అట్లా క్షేమంగా ఇల్లు చేరితే చాలు. అదే పది వేలు' అనుకుంది  పదో సారి. 

వర్షం దంచి కొడుతుంటే టార్పాలిన్ కవర్ రెండు వేపులా కిందికి దించాడు ఆటోఅబ్బాయ్!

 

బండి ఎటు పోతుందో అర్థమవడం లేదు. డైవర్ వేసుకున్న పాన్ పరాగ్ వాసనకు కడుపులో దేవుతున్నట్లుంది.  కర్చీఫ్ తీసి ముక్కులకడ్డు పెట్టు క్కూర్చుంది. 

పది నిముషాలు కూడా నడిచింది కాదు.. బండి ఆగిపోయింది. డైవర్ రెండు మూడు సార్లు  పెడల్ గేర్ లాగి లాగి ట్రై చేశాడు. బండి మొరాయింపులు  మానలేదు.

'ఏమయింది?' భయంగా అడిగింది సులభ. 

వాడు బదులేమీ ఇవ్వకుండా  ఆటో దిగి వెనక ఏదో సరిచేయడానికి తంటాలు పడుతున్నాడు. ఈ సందులోనే రెండు మూడు సార్లు ఫోన్లు. సంభాషణంతా ఏదో అర్థం కాని భాషలోనే. బహుశా గోండు అయుండాలి.

రిపేరింగు  వాడి వల్ల కాలేదు లాగుంది. 'ఆటో దిగండమ్మా!' అన్నాడు టార్పాలిన్  కవరొకటి పక్కకు తొలగతోసి. 

బైటికి తొంగి చూసింది సులభ. కటిక చీకటి. వీధి దీపాలు వెలుగు దూరం నుంచి కనిపిస్తోంది. తనెక్కడుందో అర్థం కాలేదామెకు. 

కిందికి చూస్తే గలగలా శబ్దం. పాదాలు తడిసేటంత లోతులో రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయ్. 

'ఇదేంటి? ధియేటర్ దాకా కదా తీసుకెళ్లాలి' అంది సులభ కోపాన్ని దిగమింగుకుంటూ. 

'అల్లదిగో ఆ ఎత్తు మీద కనిపిస్తావుందే.. అదే  థియేటర్! బండి ట్రబులిచ్చింది. చూస్తున్నారు కదా! దిగి నడుచుకుంటూ వెళ్లండమ్మా.. పైసలిచ్చి' అన్నాడు  నిర్లక్ష్యంగా ఆటో మనిషి.

'ఎట్లానయ్యా! ఇంత నీళ్లల్లో! చీకట్లో! నాకిదంతా కొత్త చోటు!' అంది సులభ మొండిగా. 

'బండి ట్రబులిస్తే నాదా తప్పు!   ఏం మాట్లాడతవ్! ముందు గాడీ దిగుండ్రి! పైసల్దియుండ్రి! ముచ్చట్లు ఆనక ! నే పోవాల!' 

డైవర్ మాటల్లో ఎంతో తేడా! ఏం చెయ్యాలో పాలుపోలేదు బ్యాంకాఫీసర్ సులభాకుమారికి. 

పర్సు  తీసి యాభై నోటు అతగాడి చేతిలో పెట్టింది. 'ఇంకో ఇరవై ఇయ్యమ్మా! ఇంత బారిస్ లో  కూడా గీడ  దాకా తోలుకొచ్చినా. కష్టం చూడరా దొరసానులు!'

వాడి దబాయింపుకు వళ్ళు మండింది. కానీ, ఒంటరి ఆడది. అక్కడున్న పరిస్థితుల్లో ఏం చేయగలదు తను? 

బైలుదేరే ముందు ఆటో నెంబరైనా నోట్ చేసుకోలే.. కంగారులో. ఎంత పెద్ద మిస్టేకయిందో  ఇప్పుడర్థమవుతోంది.

మరీ రచ్చ చేస్తే మొదటికే మోసమవుతుందేమో! వాడు  పర్సు మొత్తం గుంజుకున్నా తానేంచేయగలదు! 

ముందెట్లాగో కొంప చేరాలి. మారు మాట్లాడకుందా మరో ఇరవై వాడి చేతిలో పడేసి బండి దిగిపోయింది సులభ. 

వాన జోరు అట్లాగే ఉంది. వళ్లంతా తడిసి ముద్దయిపోయిందప్పటికే. హ్యాండ్ బ్యాగ్ ను జల్లుకు అడ్డుగా పెట్టుకొని దూరంగా కనిపించే థియేటర్ వైపుకు అడుగులు వేసింది  సులభ. 

నడక అలవాటే పూర్తిగా తప్పిపోయిందీ మధ్యన! పదడుగులు పడేసరికి నీరసం ముంచుకొచ్చింది. ఆయాసం కూడా. థియేటర్ సెంటర్ చాలా మెరకలో ఉంది. అంత ఎత్తు తానిప్పుడు  ఎక్కగలదా!..  అదీ వాన నీరు ధారగా ఫోర్సుగా కిందికి జారుతున్నప్పుడు!

దారి సరిగ్గా కనపడ్డం లేదు. ఎక్కడ ఏ గుంటలేడ్చాయో  పాడు ..  తెలీదు! మ్యాన్ హోల్సు గానీ ఉండి  కాలు  వాటిలో  పడితే! వణుకొచ్చింది సులభకు!  

కాళ్ల కింద నుంచి ఏదో జర జర పాకి పోయినట్లనిపించింది. ఏడుపొక్కటే తక్కువ పాపం  బ్యాంకాఫీసర్ సులభమ్మకు..ఆ క్షణంలో! 

'ఎక్కడికమ్మా! ఈ యేల  అట్లా ఒంటిగా  పడిపోతావుండావు?'  

ఆ గొంతు వినిపించిన వైపుకు చూస్తే ఓ సగం కూలిన పెంకుటింటి  వసారాలో ముసిలామె కనబడింది వానజల్లుకు తడవకుండా ఓ వార కూలబడి!

'ఆ థియేటర్ సెంటర్ దాకా పోవాలవ్వా! అక్కడికి బస్సులొస్తాయిటగా! నాది  సిటీ!' అంది సులభ.

'ఈ ఎత్తు యేపు ఎందుకు బిడ్డా?   అసలే సరిగ్గా ఉండత్తల్లీ అటేపు! ఇంత లావు  వర్షంలో జారకుండా పోగలగవనే! తాగుబోతు సచ్చినోళ్లు అంకాళమ్మ గుడి కాడ అంకఛండాలప్పనులు చేస్తావుంటారమ్మా అహర్నిశలూ! ఒంటరి ఆడబిడ్డవి. ఈ టైములో..  నిన్ను గాని ఇట్లా   చూస్తే  వదిలేస్తారనేనా     త్రాష్టులు!' అంది అవ్వ.

అప్పుడు చూసుకుంది సులభ తన వంటి వంక. వర్షానికి తడిసి ముద్దయిన బట్టలు  వంటిని దాచిపెట్టే డ్యూటీకి ఎప్పుడో రిజైన్ చేసేశాయి. లోపలి తెల్ల రంగులు దుస్తులు  అంత చీకట్లో కూడా మెరుపులొస్తున్నప్పుటు బైటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

ఆటో మనిషి తన వంక అదోలా చూడడం అప్పుడు గుర్తుకొచ్చి సన్నటి వణుకు వచ్చింది.. కానీ తమాయించుకుందెలాగో!

'అవ్వా! ముందు ఇల్లు చేరడం కావాలి  నాకు.  దేవుడిదే భారం ! మూడు కిలో మీటర్లు నడిచొచ్చా! ఇంకో రెండు కిలో మీటర్లేగా..'

'ఇట్టా చుట్టూ  తిరిగిపో తల్లీ!  అయితే ఇంకో రెండు కిలోమీటర్లవుద్ధి ఎక్కువ అయిన ఆలీసం ఎట్లాగూ అయింది గదా! పెద్ద ముండాదాన్ని! ఎందుకు చెబుతా వున్నానో అర్థం చేసుకో బిడ్డా! రోడ్డు వారా లైట్లుంటాయి కిందైతే. వచ్చే పోయే జనాలు కనపడతా వుంటారు. నీ అదురుష్టం బావుంటే అటేపెళ్లే బళ్ళు తగలచ్చు. చౌరాస్తా కాడ పోలీసు ఠాణా కూడా   ఉండింది బిడ్డా!' అంది అవ్వ తడుముకుంటూ చేతిలోకి ఊత కర్ర తీసుకుని ఇంట్లోకి  పోతూ!  

సులభ గొప్ప  మీమాంసలో పడిపోయింది. కష్టమైనా సరే, ఎత్తు దారి ఎక్కేసి తొందరగా సెంటర్ కెళ్లి పోవడమా? 

అవ్వన్నట్లు, పోలీసు స్టేషనూ, జనసంచారం, లైట్లూ ఉండే పల్లం దారెంట పడి సెంటర్ చేరుకోడమా?  

పెద్దావిడ. ఈ లొకాలిటీ మనిషి. ఏ అనుభవం మీద ఇంతలా చెబుతోందో? కాస్త చుట్టు తిరుగుడైనా రోడ్డు వారగా పోవడమే మేలు అనిపించింది సులభకు. వచ్చిన దారినే మళ్లీ  కాళ్లూ కాళ్లూ కొట్టుకుంటూ వెనక్కు  తిరిగి రోడ్డు బాట వేపుకు నడక మొదలుపెట్టిందాఖరుకు. 

రోడ్డు మీద ఇందాక తనెక్కి వచ్చిన ఆటో కనిపించలేదు! ముసలవ్వ చెప్పిన పోలీస్ ఠాణా దాటుతుండగా ఉప్పల్ గుండా పోయే బస్సొకటి కనిపించింది.  చెయ్యెత్తంగానే ఠక్కుమని ఆగింది. గభాలున ఎక్కి ఓ  సీటులో కూలబడ్డ  తరువాత గాని ఊపిరి తేలికగా వచ్చింది కాదు. 

'బాగా తడిసిపోయారే.. పాపం!'  అంది లేడీ కండక్టర్ సికిందరాబాద్ స్టేషన్  టిక్కెట్ కోస్తూ! 

బస్సు సిటీ జౌట్-స్కర్ట్స్ లోకి  ఎంటరవగానే దిగిపోయి   దొరికిన ఆటో పట్టుకుని ఇల్లు చేరింది సులభ. అప్పటికి  రాత్రి పది..  పది!  . 

అత్తగారు బోజనం కూడా చేయకుండా జాగారం చేస్తున్నారు.. పాపం.. తన కోసమే   ఎదురు తెన్నులు చూస్తూ. పిల్లలు తమ తమ రూముల్లో పడి నిద్రపోతున్నారు. భర్తకు మెసేజ్ పెడదామని సెల్ బయటకు తీస్తే అప్పటికె ఐదు  మిస్డ్ కాల్స్ .. పది  మెసేజెస్సూ! 

తనే కాల్ చేసింది భర్తకు!  వెంటనే ఎత్తేడు రాజశేఖర్! ఎంత సేపు అలాగే ఫోనులో భోరుమని ఏడ్చేసిందో మాటా పలుకూ లేకుండా! అత్తగారు అలా అమ్మలా వెన్ను నిమురుతూనే ఉన్నారు భర్తతో సంభాషణ కొససాగుతున్నంత  సేపూ!

---

మర్నాడు బ్యాంకుకి శెలవు పెట్టేసింది సులభ. అటు మర్నాడు బ్యాంకు కెళ్లినప్పుడు రాత్రి అనుభవాన్ని తన కొలీగ్సుకు  చెబుతుంటే.. అంతా విన్న తరువాత మూర్తి అన్నాడు  చివర్లో 'సులభగారూ! మీరు ఆ అవ్వ చెప్పినట్లు విని మంచి డెసిషన్ తీసుకున్నారు.  ఆ రూట్ లో పైకి  వెళ్లకపోవడమే మంచిదయింది. నిన్న రాత్రి  సరిగ్గా అదే స్పాట్లో .. పాపం..  గ్యాస్ కంపెనీలో పన్చేసే      పి ఆర్ వో.. ఎవరో పాపం.. ఆవిడ.. దొంగ రాస్కెల్స్ బారిన  పడి సర్వనాశనం జరిగపోయింది  !' అంటూ ఈనాడు రంగారెడ్డి ఎడిషన్ లోని ఓ పేజీ పరిచి చూపించాడు. 

'సామూహిక అత్యాచార ప్రయత్నం'  శీర్షిక కింద ఫలానా మహిళా ప్రయాణీకురాలిపై తుంటరులు  తలపెట్టిన గ్యాంగ్ రేపుకు  సంబంధించిన వార్తాంశం అది. 

తమ తమ వాహనాలలో ఎక్కే ఒంటరి స్త్రీలను మాయమాటలు చెప్పి దారి మళ్లించడం. ఆనక మిత్రబృందంతో  కలసి లొంగతీసుకోవడం..  గురించి వివరంగా రాసిన ఆ కథనం  చూడగానే  సులభ గుండెలు ఒక్కసారి గుభేల్మన్నాయి!   

ఠాణాలో స్టేషన్ ఆఫీసర్ వెనక చేతులు కట్టుకు నిలబడ్డ రేపిస్టుల ఫొటోలో  మొన్న రాత్రి తాను ఎక్కిన ఆటో డ్రైవరు కూడా ఉండడం చూసి ఆమె అవాక్కయిపోయింది కొన్ని క్షణాలు!

అంతకు మించి షాకిచ్చిన వార్తాంశం  అక్కడే మరోటి కనిపించింది సులభకు! 

అదే ఫొటోలో పోలీసులకు అసుంటా దూరంగా బెంచీ మీద ముణగదీసుకుని కూర్చోనున్న ఆడమనిషి..  వేరెవరో కాదు..   'మెరక బాటలో  తనను పైకి వెళ్లకుండా వారించిన  పుణ్యమూర్తి .. ముసిలవ్వ! 

ఆ పాడు   ఘోరానికి    సరిగ్గా తన కొంపే వేదికవడంతోసరిగ్గా   కళ్లు లేకపోతేనేమీ, ఆ గుడ్డి అవ్వ చూడలేకపోయిందిట!   చేతిలోని ఊత కర్రతో అందినోడి నడ్డి   అందినట్లు విరగ్గొట్టేసివట !    

'ఆనక పోలీసోళ్లకు  సమాచారం అందించిందీ  ఆ ముసిల్దే మేడమ్! మా పేటలో అందరూ మా గొప్పగా చెప్పుకుంటుండ్రు.  ఆ రేప్ కేసు  త్రాష్టుల్లో తన కొడుకుండాడని  తెలిసీ    వెనక్కి తగ్గడం లేదీ    గుడ్డితల్లి' అంది బైటి  నుంచి      టీ.. కాఫీలు తెచ్చిచ్చే  మహాలక్ష్మి.  

'నువ్వు   అడ్డదారిలో పోతుంటే ఆపగలిగిన ఆ గుడ్డితల్లి తన  కొడుకు అడ్డదారిలో పోతుంటే ఆపలేకపోయింది చూశావా సులభా!సరే అయినా సరే..     చట్టానికి పట్టిచ్చే  అవకాశం రాగానే అంతలా తెగించేసింది! .. రియల్లీ హ్యట్సాఫ్ టు ధి  గ్రేట్ మదర్!' అంటూ విషయం విన్న రాజశేఖర్ కామెంట్ పాస్ చేస్తుంటే       సులభ  కళ్లల్లో నీళ్లు  గిర్రున  తిరిగాయి! 

కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక 27 -01 -2013 ప్రచురితం)

***


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...