Sunday, December 12, 2021

పుల్లవిరుపు మాటలు భలే తీపి - సరదాకి -కర్లపాలెం హనుమంతరావు సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట కాలమ్ ప్రచురితం )

 పుల్లవిరుపు మాటలు భలే తీపి - సరదాకి 

-కర్లపాలెం హనుమంతరావు   


 వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజాస్వామికవాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధానకారణం.   

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. కట్టుకున్నదాని కోపాన్ని ఏ రవ్వల సెట్టుతోనో, చీకట్లో కాట్లట్టుకునో పోగొట్టవచ్చు.   రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు, గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం! తలట్టుకొని ఉండేవాళ్లే సజీవులై ఉండుంటే!  తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చచ్చుట ఖాయమ’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దురాలోచనలే తప్ప దూరాలోచన తక్కువ కాబట్టే కథ అక్కడి నుంచి కంచిపోలేదు. కానీ ఇది కలియుగం బ్రాండు ప్రజాస్వామ్య బేండు మేళం. ఇండియన్ నేతకు ఓటరు అజాతు శత్రుత్వం మీద బొత్తిగా నమ్మకం కుదరక గందరగోళం.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకని నాయకులు ఎన్నికల దుర్దినాలు గడిచే దాకా ఓటరుకు దేవతాపీఠాలు అప్పగించెయ్యడం వెనుక బోలెడంత పొలిటికల్ బ్యాగ్రౌండ్ వర్కుండేది అందుకే మరి!

'గడియలోపల తాడి కడగి ముత్తునియగా తిట్టిన మేధావిభట్టు కంటె/

రెండు గడెల బ్రహ్మదండి ముండ్లన్నియు డుల్ల దిట్టిన కవిమల్లు కంటె

మూడు గడియలకు మొనసి యత్తిన గండి పగుల దిట్టిన కవిభాను కంటె

అరజాము లోపల చెరువు నీళ్ళింకంగ దిట్టిన బడబాగ్ని భట్టు కంటె

ఉగ్రకోపి నేను ఓపుదు శపియింప క్రమ్మరింప శక్తి కలదు నాకు

వట్టి మ్రాను జిగురు బుట్టింప, గిట్టింప బిరుదు వేములాడ భీమకవిని' అంటూ వెనకటికి ఓ ముక్కోపికవి తన శాపదానుగ్రహ శక్తిని గూర్చి గొప్పలుపోయాడు.

భీమకవి బడాయి జస్ట్ ఓ మచ్చుక. తిని హరాయించుకొనే వికటరసాస్వాదులకు తెలుగు కవుల షష్ఠాష్టకాలు  అష్టాదశ పురాణాలకు మించి సుష్టైన విందు. కాసుల పురుషోత్తమం అని మరో కవి మహాశయుడు పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువంతటి శ్రీవారిని పట్టుకుని దులపరించేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులు! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మ అయితే, నువ్వే ఏదో  కామితార్థుడికి మల్లే వీర పోజు! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మాజీగారయితే  ఇంటి పెద్దగా ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుక్కూర్చుంటివి! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి  తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీ కెందుకు పెద్దమనిషీ  పతితపావనుడువన్న   బిరుదంత బారుగా? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు వట్టి  దామోదరుడివి(పనికిమాలినవాడివి)’ అంటూటే అది  తిట్టో మెప్పో తెలీక  ఆ దేవుడే గుళ్లోని రాయికి మల్లేనే గట్టెక్కడ బయటపడుతుందోనని   గమ్మునుండిపోయాడు! 


నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయినో మెట్టు కిందికి దిగజార్చడవేఁ. దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షనుంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్క దేవుడిదిక్కు భక్తుడికి ఠక్కున బంపర్గా  ఆఫరయే సీజనిది. 

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో ఠక్కున మటుమాయం చేసెయ్యచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయగాడు  మరీ పాతకాలం నాటి నాటు రథాలను మాత్రమే నమ్ముకునే ఉత్సవ విగ్రహంలా పడి ఉండటం లేదిప్పుడు! 

డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా ఓటు మిషను మీట నొక్కే మనిషి ఎదుగుతున్నాడు. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పదివేలన్నా చేత పెట్టనంటే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే ప్రయోజకత్వం దాకా పరిపక్వత సాధించాడు. ముష్టి మున్సిపాలిటీ ఎన్నికలక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే నేతలే ఓటర్ని ఈ స్టేటు దాకా ఎగదోసుకొచ్చింది. జిల్లేడుకాయకు మసిపూసి మారేడుకాయ చేసే ఇంద్రజాలం మరింకెంతకాలమంట? కడుపులో మంటలు ఎగసిపడితే  ఓటరే   నేత ముఖాన కసి కొద్దీ బుడ్ల కొద్దీ సిరాలు పూసి, బురద జల్లే క్రేజీ  రోజులు! ఎంత కేజ్రీవాల్సులోనైనా కదలికలు రాక ఛస్తాయా!

పాలిటిక్స్ అంటేనే శతకోటి దరిద్రాలకు అనంతకోటి చిట్కాల ఫీల్డు కదా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు పోషించుకుంటున్నట్లు?  కోన్ కిస్కాగొట్టంగాళ్ల కోపతాపాలన్నీ ఒకే షేపుకి మళ్ళించడం ఆ ముఠాల ఎత్తుగడ. ఎన్నికలివిగో.. ఈ ఎల్లుండి పొద్దున్నే ఆనంగానే,  చల్లంగా  వరాల జల్లులు కురిపించేస్తే సరి! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకోవచ్చు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా? చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుందిగ!  అయినా తిట్లకూ ఉట్లు తెగే సత్యకాలమా ఏంటిదీ   .. పిచ్చిగానీ? 

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలకు భక్తుల తిట్లు తప్పడం లేదు కదా!  ‘ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!” అంటూ భక్తులు   తిట్టిపోసినా  దేవుళ్లే  కిమ్మనడంలేదిప్పుడు!  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరు చెప్పి నోరుజారారనో,  లైంగిక దృష్టితో వేధింపులకు దిగజారారనో    మనిషి మధనపడ్డం.. యుద్ధకాండ  మొదలెట్టడం   విలువైన ప్రజాస్వామ్యంలో  ‘దండుకోవలసిన సమయాన్ని’  శుద్ధ దండగ చేసుకోడం కదూ!  

దూర   దూరంగా తగలడితే తూలనాడుకొనే పగే ఊండదు. ఒకే చూరు కింద పది రోజులు చేసిపోయే కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముట  ముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి. జానా బెత్తెడు భరత భూమి మనది. మూడు వేల చిల్లర పొలిటికల్ పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు.  మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రారాదంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్య జరిగిన గలాటా మాటేమిటి మరి  ? 

‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునుండిపోయాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట అంటించలా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు, బాకులు విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు, అవాకులు చెవాకులు తప్పవు! క్లైమాక్సులో ఆ మాత్ర్రం తిట్ల వాసన కూడా తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీగా వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ డైలాగులు దంచి కొట్టే    నటులూ పొలిటికల్ ఎంట్రీలిస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాలిక్కి పదును పెట్టే ప్యూర్ ఫుల్ టైం పొలిటికల్  లీడర్ల  మీదనే అందరి నిందలు! 

 తిట్టించుకొనే వాడి మనసు చివుక్కుమంటుందో లేదో తెలీదు. వినే వీనులకు మాత్రం వీనులకు  భలే పసందైన విందు పరుష పురాణం. చట్టసభల్లో జుట్టూ జుట్టూ పట్టుకునే కురుక్షేత్ర సంగ్రామానికి ముందు రెండు వైపుల నుంచి లైవ్ లో వినిపించే సంస్కృతం ఎంత లవ్లీగా ఉంటుందనీ! సమయానికి ప్రసారాలు కట్ అయ్యాయని జనం సరదా కోసం  చిందులేయరు గదా? కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే భాగ్యం మిస్సయిపోతామనేగదా జనం బాధ !

 బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ చేసుకుని  చచ్చిపోతే నరకంలో మనకేమీ మడత మంచాలేసి హాయిగా బజ్జోమనరు కదా! దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పితో ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వడ్డిస్తారు. 

తిట్లన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగకుంకలు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది. తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు కొన్ని కోట్లున్నాయీ దేశంలో బైటపడుతుంది! 

రాచి రంపాన పెట్టే పై దేవుళ్లనేమీ పట్టించుకోకుండా కిందున్న సాటి నేతల మీదనే ఎందుకిన్ని సూటిపోటీ మాటలు?

 భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించేటప్పుడు పశ్చిమ దిక్కుగా ఉన్న బ్రహ్మ ముఖం నుంచి ఆరభటీవృత్తితో కూడిన రౌద్రం ఉత్పన్నమయిందని 'భావప్రకాశం'లో శారదాతనయుడు శలవిచ్చాడు. ఆ దక్షాధ్వర ఘట్టంలో పోతనగారి హింసనచణ ధ్వంసరచనకు  మించి సాగుతుందా ఇప్పడు పొలిటికల్ ఫీల్డులో కోపతాపాల సీన్లు? ఉత్తిగా వేలెత్తి చూపమనా ఓటుకు అన్నేసి వేలిచ్చి ఎన్నికల్లో దేవులాడింది లీడర్లు?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసారు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసారు. ఎవరి అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న. కోపం ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడైనా     ఆ రామదాసుగారి విచక్షణా బుద్ధికి? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లు?  


'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అంటాడు 'కొత్త సిలబస్' కవితలో బాలగంగాధర్ తిలక్. ఆ  పాత 'కొత్త సిలబస్' కు ఈ ట్వంటీ ట్వంటీస్ లో కూడా  శిల వేయద్దంటే ఎలా? కొత్త తరం నేతల్నయినా  ఫాలో అవ్వద్దంటే ఎలా? అదేం ‘లా’? నో..వే ! నేటి తరం నేతల దారి నేరుగా బూతుల భాగోతాల ‘హై వే’ పైనే!

బూతుందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలవా? అని మనగలవా? ఎంతాచారం వప్పచెప్పిన  పెద్దాయన అయినా ఆ కూటికే పోక తప్పని కాలమిది నాయనా! జనస్వామ్యం గ్రహచారం అలాగుంది మరి.  ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా తిరుగుతోంది. ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటుండ బట్టే శనిగ్రహం అనే   ముద్ర పడింది.  ‘విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి’ అంటూ మరో నింద పడ్డానికి సిద్ధంగా కూడా      ఉంది!  

 స్వగృహంలో పడగ్గదయినా  సరే నో ప్రాబ్లం!   చాటుగా ఓ నాలుగు బూతు సినిమా పాటలు బై హార్ట్ చేసుకునే బైటికి రమ్మనండి రాజకీయ పరమపద సోపానంలో నిచ్చెనలుండి చచ్చినా .. లేకపోయినా పైకెగబాకాలనుకునే పట్టుదల వదలని విక్రమార్కు మార్క్ నేతలందరూ!   చక్రం తిప్పాలన్న కుతి ఒక్కటుంటే చాలదు! వక్రమార్గంలో అయినా పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక తప్పదు. 

  'పురాస్త్రరసగిరి రుద్రే ష్యకచటహ మాతృకా నింద్యాః' అంటే అర్థం తెలుసా? పోన్లెండి! అజ్ఞానం కూడా ఒక్కోసారి ప్రాణానికి తెరిపే. కానీ అజ్ఞాతంగా అదే ఒక్కోసారి మహా హాని. 'శ్రీవాణి గిరిజాశ్చిరాయ' అన్న ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఓ 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే ఇరుక్కుపోయింది. 'ఆ.. అంతా చాదస్తం' అనుకోవద్దు ప్రమాదం ! నన్నెచోడుడూ  'శ్రీవాణీం ద్రామరేం ద్రార్చిత' అంటూ 'మ'గణం తరువాత 'ర'గణం ఉండే స్రగ్ధరతో అశ్రద్ధగా కుమారసంభవం ఆరంభించి  యుద్ధంలో దారుణంగా మరణించాడు! తిట్ల వల్ల ఎదుటి త్రాష్టుడికి ఎంత నష్టమో తేలక పోవచ్చునెమో కానీ తిట్టే తిట్టు స్పష్టంగా లేకుంటే కుంటి కూత కూసిన వాడికే ముందు మూడేది. అనని ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతలు కూడా అన్నట్లు ప్రచారంలో కొచ్చేసే  సామాజిక మాధ్యమాల కాలం బాబూ ఇది   ! గాంధీజీ నీతుల మీదింకా నమ్మకమున్నది ముష్టి మూడు కోతులకే!  మిగతా జాతి  మొత్తం  తూలనాడే కొత్త నాయకత్వం వైపు ఒరుగుతున్నదిప్పుడు! 

బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనడం.. రామాయణంలో రామా అనే శబ్దం వద్దనడమంత అసంబద్ధం. అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.  తిడితే తప్ప నెగ్గ లేని నేతలకు ‘తిట్లు వద్దు.. కోపాన్ని ఉగ్గబట్టుకో’ మంటూ  చొప్పదంటు సుద్దులు చెప్పడమెందుకు?   ఎన్ని తట్టల నోట్ల కట్టలైనా సాధించిపెట్టలేనంత పాజిటివ్ ఇమేజ్.. తిట్టు పదాల ఎమేజింగ్ పవర్లో ఉంటున్నప్పుడు ఏ  ప్రవక్తో ఎన్నడో చెప్పిన పిచ్చి ప్రవర్తనతో   ఇప్పుడు పొడిచేదేముంది! 

తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని ఇంకా సందేహమా? కొందరు సీనియర్ నేతల్ని  ఎన్ని తిట్టీ   నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా కాలమ్  వేస్ట్!

***

కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట కాలమ్ ప్రచురితం ) 


                            


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...