బ్యాంకోళ్ల కన్నా బంకోళ్లు బెటరబ్బీ! బిచ్చగాడిని చూస్తే చాలు.. చిల్లర ‘గాడ్' ను చూసినంతగా పొంగిపోతారు. బ్యాంకోళ్లకే ఎందుకో.. బిచ్చగాళ్లంటే బచ్చాగాళ్లకన్నా హీనం!
యాచకులం..
మాదేవఁన్నా నీచకులవాఁ? ఆ మాటకొస్తే
ఈ జంబూద్వీపంలో జంపకానా పర్చుకుని అడుక్కోని
జమీందారు ఉన్నాడా అంట? ‘గజ గజానికీ ఓ గాంధారి కొడుక’న్నాడబ్బా కవి గజ్జెల మల్లారెడ్డి.
ఆ మహానుభావుడే కానీ ఇంకా బతికుండుంటే.. ‘అడుగడుక్కీ ఓ అడుక్కునే డబ్బాగాడు’ అనుండేవాడే..
నో డొట్!
ఉద్యోగాలు అడుక్కుంటున్నారు.
ఉపాధులు అడుక్కుంటున్నారు. ‘నిధుల మొర్రో!’ అంటో ముఖ్యమంత్రులే కేంద్రం కీలక ముఖ్యుల
వెంటబడి మరీ వేడుకొంటున్నారు. సర్కారాఫిసుల్లో మంచి మంచి పోస్ట్ల కోసం బేవార్సాఫీసర్లు సైతం ప్రజాప్రతినిధుల సిఫార్సులకోసం ఏం ఫార్సులు చేస్తున్నారో
చూస్తున్నారా లేదా? అరెఁ! జానా బెత్తెడంతుండడు.. బడి గుంటడు.. ఆడూ జాంపండులాగా ఝమఝమలాడుతుందని ఈడూ పాడూ కూడా చూడకుండా.. కంటబడ్డ ప్రతీ ఆడపిల్ల వీపెనకాల బడి ‘ప్రేమ భిక్షో’ అంటూ గోకుతుంటడు! కేడీలకూ క్షమాభిక్షలే! రౌడీలకూ ప్రాణభిక్షలే! ఇహ రాజకీయాల్లోకట్లా లగెత్తి చూడండెహె!
పాత తప్పులనుంచి మినహాయింపులు కోరేదొహడు! కొత్త తప్పులకోసం ముందస్తు బెయిళ్లు అడిగేదొహడు.!
అడుక్కోడానికి లేని ఐటం ఒక్కటైనా మాకు మిగిల్చినార్రా నారాయణా మన పెద్దమనుషులంతా కల్సి
ఈ పుణ్యగడ్డలో! డప్పేసుకోకూడదంటారు. నిజవేఁ కానీ.. నిజం కూడా ఒప్పేసుకోవాలి కదా జనమంతా!
‘ధర్మా’నికో రూపాయో.. అర్థో దయచేయించడయ్యా.. అమ్మా అంటూ తండ్రుల్నీ.. తల్లుల్నీ దయనీయంగా అడుక్కొనే అమాయకులం మేమొక్కళ్లమే బాబులూ ఈ భూమ్మీద కొట్టొచ్చినట్లు
కనిపించేదీ!
ఎండనకా, వాననకా, చలికీ,
మురిక్కీ ముక్కీ మూలిగీ, తినీ
తినకా.. ఇంత మిగుల్చుకుంటున్నందుకా మా చిల్లర బిళ్లలమీదింత కంటు బ్యాంకోళ్లకు!
తినకా.. ఇంత మిగుల్చుకుంటున్నందుకా మా చిల్లర బిళ్లలమీదింత కంటు బ్యాంకోళ్లకు!
గొప్పోళ్లెంత ప్రమాదకరవోఁ తెలిసీ
కాస్తింత కనికరించి కరచాలనం చేసేసినా
చాలు.. ‘హిఁ.. హిఁ’ అంటూ ఉహూఁ తెగ ఇచ్చకాలు పోతుంటారు బ్యాంకోళ్లు! లోళ్లకు లోళ్లు కరెన్సీ నోట్లు గోతాల్లో కుక్కి తెచ్చి దొంగ
లాకర్లు నింపేస్తుంటారని కాబోలు! ఆ డేరా బాబాగాడు ఎంత డేంజరు బాబులూ? ఆ బాపతు కీచక యోగులకన్నా యాచకులం.. అభాగ్యులం మేమెందులో బిలో యావరేజి
వినియోగ దారులం? దారుణంగా మంది సొమ్ము దోచేసే బడా బాబులకూ ఏదేదో చేసేసే బ్యాంకులోళ్లు.. ఏదో అడ్డమైన చోటా
నానా గడ్డి గాదం కరిచి కూడేసుకున్న మా 'చిల్లర' సొమ్మును చూస్తే మాత్రం.. 'ఛీఁ.. ఛీఁ' అంటూ ఓ సైడుకు నెట్టేస్తారు! గుమ్మం గేటు దాటైనా లోనికి రానీయరు! ఇదేనా
సమాన ధర్మమంటే? రిజర్వు బ్యాంకోళ్లైనా సమాధానం చెనుతారా? ఊహూఁ.. నోరు విప్పరు!
అడుక్కు తినే వాళ్లమనా అంత లోకువా? మ్యాన్! లోకంలో మా కన్నా తక్కువ 'తినే'
జెంటిల్మేన్లెక్కడున్నారో
కమాన్..
చూపించండి! సాక్ష్యాత్తు మన విత్తశాఖామాత్యులవారే స్వయంగా 'పెద్ద పెద్దోళ్ళే బ్యాంకుల్ని నిండా
ముంచేస్తున్నారు.
మొండి బకాయిల్ని కొండల్లా పెంచేస్తున్నారం'టో సెలవిచ్చారా లేదా మొన్నీ మధ్యనే మన
హైడ్రాబేడ్ మీటింగులో? వెరీ బ్యాడ్! ఇక్కడ తేరగా
బ్యాంకు సొమ్ము తెగ బొక్కేసి
ఎక్కడో పక్క దేశం ఏ.సీ లాడ్జీల్లో లార్డ్ లిన్లిత్ గో లా పక్కలు పర్చుకు బబ్బున్న బకాసురుల
జాబితా ఏ వీకీలీక్సు అసాంజే బాబో
బైటకు తీస్తే తప్ప.. బ్యాంకు అప్పుల వంకతో
‘చిల్లర పన్ల’క్కక్కుర్తి పడే షికారీ బ్యాచీలెక్కువో.. 'చిల్లర' బిళ్లలేరుకు బతికే మా బికారీగాళ్ల మదుపులెక్కువో లెక్కలు తేలవు! పోనీ.. పనామా లెక్కలకైనా
పంగనామాలెట్టకుండా కుండబద్దలు కొట్టే గుండె
దైర్యమెవరికైనా ఉందెమో చెప్పుండ్రీ!..
ఆ మాటకొస్తే బ్యాంకోళ్ళ యాపారం మాత్రం మా బిచ్చగాళ్ల యాయవార సూత్రం కాదా? గుడి మెట్లమీద మేం జోలె పర్చుక్కూర్చుంటే.. గాజద్దాల వెనకాల
గా తెల్ల కాలరు బాబులు డాబుగా
జోగుతుంటారు! గంతేగా తేడా! కాణీకి..
ఏగాణీకీ ఏ ‘జి. ఎస్. టి’
టాక్సులు గట్రా గోల్లేకుండా ఫ్రీగా 'ధర్మం' ఫ్యామ్లీ ప్యాకేజీ
దయగా ప్రసాదించే ఉధ్దారకులం
మేం. ఉధ్దరంగా ఒక్క చిల్లి పైసా అయినా మదుపుకు అదనంగా విదిల్చ బుద్ధికాని
‘ఎగ్స్ట్రా బ్యాంకు సర్వీస్ టాక్సు’ మోతగాళ్లా కంజూస్ ఇంగిలి పింగీస్ గేస్
బీస్ బాస బాసులా బ్యాంకులోళ్లు!
కోట్లు కుమ్మరించి ఆడే
వన్ డే క్రికెట్టు వండరైనా ఓ ‘వన్ రుపీ కాయిన్’
గాల్లో ఆడితే గానీ తరువాయి తమాషాకి తెర లేవదు కదా! చిల్లర బిళ్లలని ఇంకా మా సంపాదనమీదింత చిర్రుబుర్రులెందికంట బ్యాంకోళ్లకు? చిరగవు.
చిల్లులు పడవు. చెవఁట గబ్బు కొట్టవు.
చీపు రాతలుండవు. కాస్తింత బరువు ఎక్కువనే కానీ.. పరువు తక్కువ పేపర్ కరెన్సీకన్నా కాపర్
మనీనే ఎన్నందాల పోల్చినా మన్నికైనది. ఎన్ని చేతులు
మారినా వన్నె తగ్గనిది. చిల్లర బిళ్లలంటే
మరెందుకంట బ్యాంకోళ్లూ మీకంత వళ్లు మంట?!
కరేబియన్ దీవుల్లో ముద్దర్లేసు కొనొచ్చినా నిద్దర మత్తులో గభాల్న డిపాజిట్టు
చేసేసుకొంటారు! కాస్తింత పెద్దనోటుగా కనిపిస్తే చాలు.. దద్దర్లాడిపోతూ కళ్లకద్దేసుకొని
మరీ కాతాల్లో కాత్రంగా జమేసుకొంటారు. పక్క పాకిస్తానోడి జిరాక్సు నోటుక్కూడా 'నో' చెప్పనంత ఉదారుడు కదా మన బ్యాంకు సోదరుడు! మరి మేకిన్ ఇండియా సరుకు మా
చిల్లర నాణేలంటేనే ఎందుకో అంతలేసి బాదరింగ్స్..
బ్రదర్స్? ..
దొంగ నోట్లుంటాయేమో కాని.. దొంగ బిళ్లలుంటాయా
చెప్పు సోదరా!
ఇహ సత్తు బిళ్లలంటారా? కలరు జిరాక్సుకో రెండ్రూపాయిల కాయిన్ పారేసినా చాలు.. రెండువేల కొత్తనోట్లో
రెండు మూడు వందలు... కట్టలు కట్టలుగా బైటికి తన్నుకుంటూ వచ్చే రోజులు. చచ్చు సత్తు బిళ్లలెవరండీ బాబూ చచ్చీ చెడి తయారు
చేసేదీ కరువుల్లో? రాటు దేలిన స్మగ్లర్లకే సర్క్యులేటు చేసే జబ్బ సత్తువ లేనప్పుడు
ఇహ మా సత్తెకాలం సత్తెయ్యలకా ఆ ఉపరి ఓపికలేడ్చేదీ? సిల్లీ!
మాట వచ్చింది కనక మనలో
మన మాట! సూటు కేసుల్లో డబ్బు దాచే కేటుగాళ్లక్కూడా
చిల్లర నాణేలే సూటు, కాస్తింత చోటు ఎక్కువ కావాలి తప్పిస్తే.. ఏ కక్కసు దొడ్డి అడుగున ఎన్నేళ్లు
కుక్కిపెట్టినా చెత్త నోట్ల మాదిరి చెదలు
పట్టవు.
అధాటున ఏ ఆదాయం పన్ను యమకింకర్లొచ్చి వాలినా కౌంటింగుకొక
పట్టాన లొంగి చావవు చిల్లర కాయిన్లు. లెక్కలు తేలాల్సిందేనని మరీ అంత మంకుపట్టు పట్టే జె.డి. లక్ష్మీనారాయణ బాపతు
జీళ్ళపాకాలూ ఉంటారంటారా!ఇహ వాళ్ల ఖర్మ.. వేళ్లు కొంకర్లు పోవడం తప్ప తప్పులు
ఛస్తే బైట పడనే పడవు.
ఏ నగదుతోనైనా ఎసుంటి నగా నట్రా యవ్వారాలసలు
బొత్తిగా పొసగవని ఢిల్లీ సర్కారోడే ఎప్పటి కప్పుడు జెల్లకాయలు కొట్టేస్తున్నప్పుడు..
కొత్తవైతే ఏంటంటా.. రెండువేల నోట్లు జేబీల్లో
పెట్టుకు దర్పంగా తిరగడానికి తప్ప కొట్లో ఇంత జిలేబీ చుట్ట కొని నోట
పెట్టుకోటానికైనా అక్కరకొస్తుందంటావా
అక్కా? ఎక్కడ చూసినా మూత బడ్డ ఏటియంలే మతి పోగొట్టేస్తుంటే ఎనీ టైం మనీ నీడ్సుకి ఇహ మీదట మా
బిచ్చగాళ్ల బొచ్చెల గూడ్సే జనాలకు కూడ్స్.. కుమ్మక్స్! బిల్ గేట్స్ ఇప్పట్టున ఇండియా కొచ్చినా ఇదే గతి.
బ్యాంకోడికి మల్లే భిచ్చగాడూ 'బొచ్చె డౌన్' సమ్మెకు దిగేస్తే..
ఛేంజనేది దొరక్క ముంబయ్ ఎక్స్ఛేంజయినా
ఢమాల్మని క్రాషవడం ఖాయం! బుకీల సంగతేవోఁగానీ బాబులూ.. బికారులం
మేం కరువైతే మాత్రం బుల్లియన్
మార్కెట్టైనా 'బేర్'
మంటూ కుప్పకూలక తప్పదు తమ్ముళ్లూ!
కార్లో పెట్రోలుకోసం టూ థౌంజడేవఁన్నా పచేస్తుందేవోఁ
కానీ..
కారుటైర్లో గాలికి మాత్రం
టూ రూపీ కాయినే కంపల్సరీ. రైతు బజార్లో బడి రోజంతా చక్కర్లు కొట్టు.. నీ బ్లడీ
పచ్చనోటుకో పుచ్చొంకాయొచ్చినా ఒట్టే! వందనోట్లు వందున్నా ఒన్ రుపీ కాయిన్ కన్నంలో పడితే గానీ ఏ శాల్తీ
బరువునూ వెయింగ్ మిషను తూయదు! పిలగాడి పీచు
మిఠాయి కోరిక ఏ పిచ్చి పచ్చనోటూ చస్తే తీర్చదు. చిల్లర చేతిలో లేందే పైకెక్కద్దని హూంకరిస్తాడు
బస్ కండక్టర్.
హుండీలో హండ్రెడ్ నోటేసేపాటి భక్తి ఎంత ఘనాపాటి భక్తుడికైనా ఉంటుందా ఏవిఁటీ? లక్ష్మీపూజ
రోజు లక్ష్మీ మిట్టలైనా చిల్లర బిళ్లల కోసం దేవుళ్లాడాల్సిందే కదా! బ్యాంకులోళ్లు ఎట్లగూ
నోరెళ్ల బెట్టేస్తారు. దేవుళ్ల ముందు ఆ సంకట
స్థితిలో భక్తులు అప్రతిష్ట కాకుండా కాపాడేది
గుడి చిడీలమీద తిష్ఠేసుక్కూర్చునే మా మాదా కబళం తిరిపంగాళ్లమేనండీ బాబులూ!
బిచ్చగాడంటే చిల్లర ప్రసాదించే 'గాడ్'. గుళ్లో దేవుళ్లు కూడా హారతి పళ్లెంలోకో
రూపాయి బిళ్లను మించి ఆశించనప్పుడు. బ్యాంకులోళ్లకే మరెందుకు
మా చిల్లర జమలమీదంత మజాకు?
ఏ సర్కారోడూ మా గోడు వినిపించుకోడు. ఏ రిజర్వు బ్యాంకోడూ మా
మొర ఆలకించుకోడు. కనకనే మా కాంచన్రాయి దాసు
బాసు ఆ కలకత్తా హై కోర్టు తలుపు నంతలా తట్టేస్తున్నది. ఏ నెగోషియబుల్ యాక్టు కోడైనా తోడుగా వస్తుందేమోనని మా గోడు.
అన్నట్లు.. మా యాచ’కుల’పోళ్లందరం కలసి ఆ వకీలు బాబుకు వకాల్తా ఫీజుకింద సమర్పించుకున్నదీ అక్షరాలా రెండు నిండు బస్తాల ‘ఘట్టి’
రుపాయి బిళ్లలే సుమండీ.. నమ్మండీ!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- కాలమ్- 14-09-2017)
(ఆంధ్రప్రభ దినపత్రిక- కాలమ్- 14-09-2017)
***