యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే
సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు'
ఇహ పరాల
అభ్యుదయం కోసం ఈ పుణ్యభూమి ఋషులు సామాన్యులకు అనుగ్రహించిన ఈ శ్లోకం అంతరార్థం గ్రహిస్తే చాలు.. మనిషి ఈ భువిమీదే దివిలో
మాదిరి
దివ్యంగా జీవితం కొనసాగించేయవచ్చు. పాదాల అడుగులు
నేలను తాకిస్తూ ఆకాశాన ప్రభవించే సూర్యభగవానుడికి దోసిలి నిండిన జలంతో నమస్కారాలు చేయడం వెనక .. నేల, నింగి,
గాలి, నిప్పు.. కు నీరూ తోడుగా జత కలిసినప్పుడే జీవితం సుసంపన్నమయేదన్న సూత్రం
ఇమిడి ఉంది.
మనం మనకు తెలుసు అనుకున్న అంశాలను గురించి పునర్విచారణ
చేయవలసిన అవసరం నానాటికీ పెరుగుతున్నది. అందులో నదీ నదాల
అంశం ప్రధానమైన వాటిలో ఒకటి. 'కలకల స్వన సలిల ఋక్ఛంద
వేద సంలాప'గా కృతయుగాన మురిపించిన కైలాస గంగ
'నరక భీకర తమో గర్భఘూర్ణిత భయద వైతరణి వేణి'గా చెడి- కలియుగాన్ని వణికించేస్తోంది . ఎందుకో ఆ మర్మం కనిపెట్టాలి.
నదులకు అడ్డంగా కట్టిన ఆనకట్టలను వట్టి మట్టి కట్టలుగా భావించలేదు భారతీయులు
ఎన్నడూ.
'ఆధునిక దేవాలయాలు'గా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
అభివర్ణించడంలోని ఆంతర్యం ఆ జలాశయాలూ దేవాలయాలకు మల్లే జీవితాన్ని పునీతం
చేస్తాయన్న ఆధ్యాత్మిక భావనే. కోవెలకు కోనేరుల్లాగా.. ఈ కొత్త దేవాలయాలకు పారే ప్రవాహాలే
కోనేరులు.
కోనేటి స్నానం వల్ల
ఎంత పుణ్యమో నిర్థారించేందుకు లేకపోయినా.. ఈ పారే కోనేటి చలవ వల్ల అనేకమైన ప్రజోపయోగాలు చేకూరుతున్నాయి.
గంగ అంటే కేవలం జలధార కాదు. అదో జీవధార. ఈ దేశంలో నీరు ఏ రూపంలో ఉన్నా గంగగానే భావిస్తారు భారతీయులు. గంగ నీటికి పర్యాయ పదం.
నీరు జీవితానికి ఆధారం. జలాధారిత జీవ
జాలమే కాదు..
భూమ్యాకాశాల మధ్య జీవించే జీవ సముదాయాలూ
జలాశయాలకు సమీపంగానే సంచరిస్తాయి. రామాయణ కాలంనాటి గంగావర్ణన ఇందుకు నిదర్శనం. గంగ రెండు గట్లకు వరుసుకొని పెరిగిన దట్టమైన అడవుల నుంచి బయటికి వచ్చిన
దిట్టమైన ఏనుగుల గుంపు నదిలోకి దిగి నీళ్లు తాగుతున్నప్పుడు.. నీటి అడుగుల నుంచి మొసళ్లు
వాటిని లంకించుకోవడం కోసం వడుపుగా
కాచుకొనుండడం..
వాల్మీకి మనోహరంగా వర్ణిస్తాడు. తాబేళ్లు,
పాములు, చేపలు వంటివి మన కంటికి బైటకు కనిపించే కొన్నిరకాల జలచరాలు మాత్రమే. భూచరాలకన్నా 35 శాతం ఎక్కువగా జీవ జాతులు నీటి
అడుగుల్లో జీవిస్తున్నాయని పర్యావరణవేత్తలు
చెబుతున్నారు. ఇంత అందమైన గంగ భూమ్మీదకేమీ ఉట్రవుడియంగా వచ్చి పడలేదు. భగీరథ ప్రయత్నం అవసరమైంది. మనిషి నిర్లక్ష్యం వల్ల
క్రమంగా ఆ జలవనరులన్నీ కాలుష్య కాసారాలుగా
మారిపోతున్నాయి క్రమ క్రమంగా.
నదులు అనాదివి
'.. that ancient river,
the river Kishon, O my soul, thou hast trodden down strength' అన్న హోలీ బైబిల్ వెర్స్ 21.. ఆంధ్రదేశంనుచి సముద్రంలో కలుస్తున్న కృష్ణానదిని గురించిన ప్రస్తావనే అన్నది చరిత్రకారుల అభిప్రాయం. తెలింగాణా (తరువాతి రూపం తెలంగాణా) పదంలోని తొలి 'తెలి'
భాగం గోదావరి నదికి
సంబంచించినదనీ మరో అభిప్రాయం. ఉత్తర
ప్రాంతాలనుంచి దక్షణాదికి వచ్చే సంచార జీవులు, బౌద్ధ
యాత్రికులు,
తెలిభాష పలికే గోదావరి ప్రాంతంలో తొలి అడుగు వేసేవారని.. నదులకు.. జనజీవనానికి మధ్య ఉండే లంకెను క్రీ. శ 102నాటి గ్రీకు భౌగోళికుడు టాలెమీనే తేల్చి చెప్పాడు. ప్రాంతాలు నదుల పేర్లతో ప్రసిద్ధమవడం
అనాదిగా మనం చూస్తున్న చారిత్రక సత్యం! మంజీరికా దేశమని
బౌద్ధ వాజ్ఞ్మయంలో పేర్కొన్న ప్రాంతం నేటి మంజీర తీరంలో వర్ధిల్లే మెతుకు సీమ. గోదావరి నది వడ్డున సాగే సంతల్లో
ఏనుగులతో ఉల్లిగడ్డలు మోయించి తెచ్చే వారు, వరద కోతలకు తరచూ గురైనందువల్లే
గోదావరి తీరాన ఇనుప ఖనిజంతో తయారైన నాణేలు నేటికీ బైటపడుతుంటాయి. నీటికి సమీపంగా మసలే జాతుల వికాస
ప్రగతి మిగతా జాతుల అభివృద్ధి కన్నా ఎన్నో రెట్లు వేగవంతంగా సాగిన్నట్లు చరిత్ర
రుజువులు చూపిస్తున్నది. నీటి కోసం, నీటిలో వాటాల కోసం రాతియుగం నాటి నుంచే కాదు.. రాకెట్టు యుగం దాటి దూసుకొస్తున్నట్లు చాటుకునే ఈ
అత్యాధునిక యుగంలో కూడా కొట్లాటలు తప్పడం లేదు.
నీరు నిత్యావసరం
నీరు జీవితానికి ప్రతీక. నీరు లేనిదే జీవి లేదు. జీవనమూ లేదు.
నీటికి అందుకే జీవనం అనే మరో పేరుంది. నీరెక్కడుంటే అక్కడ జీవి ఉండే ఆస్కారం ఉంది కాబట్టే.. గ్రహాంతరాలలో నీటి జాడలకోసం అంతరిక్ష శాస్త్రం అంతలా పరిశోధనలు సాగిస్తోంది. వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ భూ వాసి
నీటి నిజమైన విలువ తెలుసుకోలేక.. నిర్లక్ష్యం
చేస్తున్నాడు.
తనకు తానుగా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు. నీరు శిశువులా అవతరిస్తుంది. మనిషి జీవితంలానే పయనం కొనసాగిస్తుంది. కొన్ని చోట్ల పొంగులతో..
కొన్ని చోట్ల వంపులతో ముందుకు సాగి వార్థక్యంలోలాగా సంగమ
స్థానంలో బలహీనపడి సాగర సంపర్కంతో ఉనికిని
కోల్పోతుంది.
బిందువు నుంచి సిందువుదాకా నది సాగించే ప్రయాణ మార్గమే
జీవజాతులమీద ప్రభావం చూపించేది. ప్రధానంగా అనాదిగా మానవ జాతి నది నడక వల్ల అధికంగా ప్రభావితం అయింది.
ఏ నది కథ అయినా ఒకే మాదిరిది. జన్మస్థలం.. పయన మార్గం..
సంగమ తీర్థాల్లోనే తేడా! ఏ నదీ ప్రవాహలు
స్నానయోగ్యాలు,
ఏ నదీమ తల్లి గర్భంలో ఏ జాతి జీవ
సంపద వర్ధిల్లుతున్నది.. ఆ వివరాలన్నీపూసగుచ్చినట్లు ఋషులు
గ్రంథస్థం చేసిన జ్ఞానభూమి ఈ గడ్డ. గోదావరిలా తెల్లంగా.. కృష్ణవేణిలా నల్లంగా.. రంగుల్లో భేదాలున్నా..
రుచుల్లో
రకాలున్నా .. స్రవంతులన్నీ జీవ శిశువులకు
ఆప్యాయంగా చన్నిచ్చి పోషించే తల్లులే! నదులను నదీమ తల్లులుగా భావించుకోవడంలోని ఆంతర్యం కేవలం భౌతికమైనది కాదంటారు భారతీయులు అందుకే. భాగీరథి ఎన్ని నాగరికతలకు, జ్ఞాన మార్గాలకు
మూగ సాక్ష్యమో!
మహాభారతంలో గంగ భీష్మపితామహుడికి తల్లి. గంగానది చూపులకు కేవలం ఓ జలధార మాత్రమే కావచ్చు కానీ ప్రకృతి ప్రేమికులకు ఆ రాయంచ నడకల నంగనాచి ఒక సౌందర్యలహరి, రామాయణంలో వాల్మీకి చేసిన గంగావర్ణన ఓ
కమనీయమైన అనుష్టుప్ గానం. దిగితే కానీ
లోతు తెలీని ఈ మాదిరి నదులు దేశం
నిండా 500కు పైగానే ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల
అంచనా.
నదులను అనుసరించి ఏర్పడ్డ నగరాలే నదుల ఉనికికి యమగండాలుగా మారడం ఆందోళన కరం. 'నదులే కదా?
మనకేమిటికిలే?' అని చిటికెలేసి
ఆవలించి నిద్రకి జారుకుంటే మెలుకొచ్చే
వేళకి కళ్లముందు కనిపించేది గుక్కెడు నీటికి కరువ్వాచే ఎడారి మేటలు! ఒడ్డునే నిలబడి ఓ చెంబెడు నీళ్లు ఒంటి మీద వంపుకొని.. మరో చెంబు భద్రంగా బంధు మిత్రులకని
వెంట తెచ్చుకొనే పాటి భక్తి శ్రద్ధలతో సరిపుచ్చుకుంటే చాలదు. నదుల కాలుష్యం నివారణకు ప్రభుత్వాలు, ప్రజలు
చేయవల్సింది సముద్రమంత ముందు ఉంది. మనదేశంలో
ప్రవహించే 500
నదుల్లో ప్రధానమైన జీవనదులు కేవలం పదిమీద ఓ నాలుగు. ఆ కాసిని జీవనదులమీద
ఆధార పడే నూటికి 85
మంది బతుకులీడుస్తున్నారు. తెల్లవాడి రాక ముందు దేశంలోని
నదులన్నీ నిండు కుండల్లాగా కళ కళ లాడుతుండేవి. పారిశ్రామీకరణ
అంతగా పుంజుకోని కారణాన సకాలంలో వర్షాలు
విస్తృతంగా పడుతుండేవి.
ఏటా వచ్చిపడే వరదలతో సర్దుబాటు చేసుకు బతికే సగటు
భారతీయుడికి తెల్ల వ్యాపారి అత్యాశల మూలకంగా వర్షాబావం, కరవు కాటకం అంటే ఏమిటో చవిచూడా
ల్సొచ్చింది. తక్షణ లాభాలకు
కక్కుర్తి పడి ఘరానా వ్యక్తులు చేసే జలదోపిడీకి అడ్డుపడనందు వల్ల చివరికి ఇప్పుడు
మిగిలింది తాగు.. సాగు యోగ్యం కాని అపార జల కాసారాలు! వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర నదులు కేవలం గత రెండు శతాబ్దాలలో
కాలుష్యమయం అయిపోవడం ఆందోళనకరం. గతంలో తొలి జామున నదీ తీరాన నిలబడి గుప్పెడు జల
గుక్కెట పడితే అమృతం సేవించినంత స్త్రాణ ఉద్దీపమయేది. నదుల్లోకి ప్రవహించే మురికిని చూస్తూ ఇప్పుడెవరైనా అంత సాహసానికి ఒడిగట్ట గలరా? దేశరాజధానిని ఆ స్థాయికి తెచ్చిన యమునా నది ప్రస్తుతం ఒక మృత ప్రవాహం. నదుల విస్తీర్ణం రోజు రోజుకూ
కుచించుకు పోతోంది.
గత ముప్పై ఏళ్లల్లో కృష్ణవేణి 60 శాతం చిక్కిపొయిందని ఓ అనధికారిక అంచనా.
నదుల జల లభ్యతలోనూ గణనీయమైన తగ్గుదల. క్రమప్రవాహాలలోనూ
నిలకడలేమి.
భూతాపం, అకాల వర్షాలు వంటి
ప్రకృతి వైపరీత్యాలకు మనిషి నిర్లక్ష్య
ధోరణీ తోడయి నదుల రూపు రేఖలకు చెరుపు కలుగుతోందన్న మాట వంద శాతం నిజం. గట్లను యధేచ్చగా తవ్వుకుంటు పోతుంటే
దేశంలోని అన్ని నదులకు సరస్వతీ నది దుర్గతి ఖాయం. ఇసుక దోపిడీ ఇప్పుడు సాగుతున్న విశృంఖలంగా ఇంతకు మునుపెన్నడూ లేదని స్థానికులు
వాపోతున్నా..
పట్టించుకొనే పాలకులు కరువవుతున్నారు.
నదుల ఒడ్డున పచ్చదనం జీవనదుల జవసత్వాలను మరింత పెంచుతుంది. వరదల ముప్పును తగ్గిస్తుంది. కరవు కాటకాలను
నివారిస్తుంది.
భూగర్భ జలాలు పెరుగుతాయి.
సకాలంలో సాదారణ స్థాయి వర్షాలు కురుస్తాయి. వాతావరణం హఠాత్పరిణామం నివారిస్తుంది. భూమి కోతలను
నిరోధించవచ్చు. నీటి నాణ్యత పెరుగుతుంది. భూసారం మెరుగవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన జీవ వైవిధ్యం కొనసాగుతుంది.
మనం పురాణలలోని వృత్రాసురులమా? దేవేంద్రులమా?
పురాణాలలో వృత్రుడు నదులను నలుదిశలనుంచి కట్టిపెట్టి కట్టడి చేసాడని
వినికిడి.
ఇంద్రుడు వజ్రాయుధంతో వాడి దౌష్ట్యాన్ని నేల కూల్చి జల
విముక్తి కావించాడు.
పారే పారే నీటివాలును స్వలాభం కోసం మళ్లించడం.. నదులని పూడ్చి స్వార్థ ప్రయోజనాల కోసం భవంతులు నిర్మించడం, విషపదార్థాలు ఉత్పన్నమయే కర్మాగారాలను అక్రమ
మార్గాల్లో నిర్మాణం చేసి.. బై ప్రొడక్టు
కాలుష్యాలను నిశ్శబ్దంగా నదుల్లోకి వదులడం, తాగు.. సాగు నీటిని నిరుపయోగం చేసే స్వార్థపర వర్గాలేవైనా.. అవన్నీ ఆ
వృత్రాసురుడి కలియుగ వారసులుగానే భావించాలి. దేశంలోని
ఐదొందల నదుల్లో 2012నాటి లెక్కల ప్రకారం
121
నదులు నిరుపయోగంగా మారిపోయాయి. మరో మూడేళ్లల్లో కాలుష్య నివారణ చర్యలు ముమ్మరం చేయకపోతే
మరన్ని నదులు మృతప్రాయమవుతాయని కేంద్ర కాలుష్య నివారన మండలి తాజా నివేదికలో
హెచ్చరించింది. జల
కాలుష్యాధముల ఆట కట్టించే పర్యావరణ
కార్యశీలులే ప్రజావళికి ఇవాళ్టి
నిజమైన దేవేంద్రులు. భగీరథుడు భువికి దించిన గంగ పవిత్రులైన అరవై వేలమంది
సగరులకు స్వర్గలోకం రుచి చూపించింది. ప్రవహించిన దారి పొడుగునా అడుగు అడుగునా పేరుకున్న
భస్మరాసులను పరిశుభం చేసింది. అంత
మహిమాన్విత జీవదాత గంగామాత తిరిగి అంతే
పునీతంగా భూమి తల్లి కడుపు తడపాలంటే
కంటి తుడుపు చర్యలు కాదు. కావాల్సింది.. కఠినమైన
నిర్ణయాలు.
చిత్తశుధ్ధి నిండిన సంకల్పాలు.. మొక్కవోని దీక్షతో ముందుకు పోయే కార్యాచరణలు.
|
|
నదుల అనుసంధానం
వ్యవసాయ దేశం మనది.
అధిక భాగం
వర్షాధారితం. జల వనరుల నిలవ విధానాలు మెరుగు పడితే
తప్ప సాగురంగం లాభదాయకం కాబోదు. ఆ దిశగా చర్చలు దశాబ్దాల బట్టి
కొనసాగుతూనే ఉన్నా..
మోదీ ఆధ్వర్యంలోని ఎన్ డి యే అధికారంలోకి వచ్చిన తరువాతే నదుల అనుసందాన
కార్యాచరణమీద మళ్లీ దృష్టి మళ్లింది. ఈ
బృహత్తర పథకాల సాకారతకు జాతీయంగా.. అంతర్జాతీయంగా సవాలక్ష సవాళ్లు. డాక్టర్ కేఎల్ రావు
కేంద్రమంత్రిగా ఉన్నహయాంలోనే గంగను కావేరీకి మళ్లించే రెండువేల చిల్లర కిలోమీటర్ల పొడవు అనుసంధాన
పథకం ప్రతిపాదన దశదాకా వచ్చింది. అట్లాంటి భారీ పథకాలు ఆచరణ యోగ్యం
కావంటూ అప్పటి ప్రభుత్వాలు తిప్పిగొట్టిన తరువాత మిగులు జలాలు నీటి తరుగున్న చోట్లకు తరలించే చిన్న పథకాలకు
జాతీయ జలవనరుల సంఘం ప్రాథాన్యత ఇచ్చింది. అస్తమానం వరదలు సృష్టించే ఉత్తరాది
జీవనదుల నీటిని తరచూ కరువుల పాలయ్యే
దక్షిణానికి తరలించడం ఉభయత్రా మేలే కదా!
సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో, 2002 అక్టోబరు
31నాటి కేంద్రం తీర్మానంతో ఎనిమిది మంది సభ్యులుండే టాస్క్‌ఫోర్సు ఏర్పాటయి 2016 డిసెంబరు 31 నాటికి నదుల అనుసంధాన
ప్రక్రియ పూర్తవాలని ఆదేశించడంతో 14 హిమాలయ నదులు, 16 ద్వీపకల్ప నదుల అనుసంధాన ప్రణాళిక సిద్ధమయింది.
పర్యావరణ వేత్తల నిరసనలు, సామాజిక శాస్త్రవేత్తల
భిన్న వాదనలు, గంగానదిలో తగినంత నీరుందో లేదో.. అధిక వ్యయ ప్రయాసలకోర్చి పథకం అమలు
చేసినా ఆశించినంత ఫలం చేకూరుతుందో లేదో అని ఎన్నో గుంజాటనలు. అధిక వ్యవసాయోత్పత్తికి, జల విద్యుత్ ఉత్పాదనకు, జలమార్గంలో
రవాణాకు దోహదపడుతుంది కాబట్టి నదుల
అనుసంధానం అమలు సాంకేతికంగా లాభదాయకమేనన్న వాదన ఊపందుకున్న తరువాతే పథకాల్లో కదలిక మొదలయింది.
తాగు, సాగు నీటి కొరతకు చక్కటి పరిష్కారం కాబట్టి పర్యావరణ సమస్యలను కొంత మేర పక్కకు
పెట్టినా తప్పేముంది? గంగ- కావేరీ అనుసంధాన ప్రాజెక్టు మొత్తానికి మోదీ హయాంలోనే మొదలవడం ముదావహం. గంగలోతమ వాటా నీటికి ఇప్పటికే కటకటగా
ఉందని.. దేశం ఎడారిగా మారుతుందని బంగ్లాదేశ్
భయం. పథకం పట్టాలెక్కాలంటే ఆ దేశం అనుమతి
తప్పనిసరి. కోసి, గండకి, కర్నాలి,
మహాకాళిల వంటి గంగ ఉపనదుల నీటి తరలింపులకు
నేపాలు కొండ ప్రాంతాల్లో భారీ జలాశయాలు నిర్మాణాలు తప్పని సరి. నేపాలు అందుకు ఒప్పుకోవాలి. గంగ- బ్రహ్మపుత్ర అనుసంధానానికి కాలువల త్రవ్వాలి. బంగ్లా అందుకు అనుమతి ఇవ్వాలి.
జాతీయమైన చిక్కులూ తక్కువేమీ లేవు. నీటి హక్కులు
కోల్పోయే ఎగువ రాష్ట్రాలు సహజంగానే అనుసంధానానికి అడ్డు. లాభ నష్టాలను బట్టి మధ్యనుండే రాష్ట్రాలు తమ వైఖరులను మార్చుకోవడం! ఒక్క దిగువునున్న రాష్ట్రాలకు మాత్రమే నదుల అనుసంధానంలో ఆసక్తి జాస్తి.
మహానది మిగులు జలాల నుంచి 230 శతకోటి ఘనపుటడుగుల(శ.కో.ఘ.) నీటిని చేర్చి, మరి కొంత గోదావరి
జలాలతో కలిపి మొత్తంగా 769
శ.కో.ఘనపుటడుగుల నీటిని గోదావరినుంచి.. కరవుతో అల్లాడే కృష్ణ, పెన్న, కావేరి, వైగా
నదీ బేసిన్లకు మళ్లించాలన్నది జాతీయ జలవనరుల సంస్థ ప్రతిపాదనలలో ఒకటి. మహానదిలో
మిగులు జలాలు లేవని ఒడిశా మొండి చెయ్యి చూపుస్తున్నది. ఎగువ నీరు తరలి వస్తేనే గానీ గోదావరి జలాలు దిగువకు వదిలేది లేదన్నది ఆంధ్రప్రదేశ్ పట్టుదల..
15 ఏళ్లనాటి అంచనాల ప్రకారం రు. 5.60 లక్షల కోట్లు.
ఆలస్యమయే కొద్దీ ఆ వ్యయం తడిసి
మోపెడవుతూనే ఉంటుంది.. జాతి భావి విశాల ప్రయోజనాల దృష్ట్యా పథకాలు
సత్వరం పట్టాలెక్కాలి కనక భా.జ. పా నే కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్రాల్లోనూ అదే పార్టీ ప్రభుత్వాల్లో ఉన్న
యు.పి..
ఎం.పి ల కు సంబంధించిన 'కెన్-బెత్వా నదుల అనుసంధానం' ముందుకు తెచ్చింది. ఆ పథకం పూర్తి చేసి మిగతా
ప్రాజెక్టులకు స్ఫూర్తి నివ్వాలని ప్రధాని
సంకల్పం.
ఎవరితో సంబంధం లేదు కాబట్టి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు
మళ్ళించే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి ఆంధ్రప్రదేశ్ దిగ్విజయంగా
పూర్తిచేసింది. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు కృష్ణా డెల్టాకు నీరంది రైతుల పంట తంటాలకు
కొంతలో కొంతైనా పరిష్కారం దొరికింది.
అదే స్ఫూర్తి మిగతా అన్ని రాష్ట్రాలు మనస్ఫూర్తిగా ప్రదర్శిస్తే నదుల
అనుసంధానం మరీ అంత అసాధ్యమయిన పథకం కాబోదు. . పర్యావరణం,
విద్య, వైద్యం, తాగునీరు వంటివి మౌలిక అవసరాలు, జలాశయాల నిర్మాణాల్లో నిర్వాసితుల తరలింపులు తప్పనప్పుడు.. ముందస్తుగానే వాటికి సంతృప్తికరమైన ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే లేనిపోని
న్యాయపరమైన చిక్కులతో వృథా కాలయాపన తప్పినట్లవుతుంది.
రాబోయే మూడు దశాబ్దాలలో ఇప్పటి జనాభా 167 కోట్లకు మించుతుందని ఓ అంచనా. అప్పటి
నీటి సమస్యలకు ఇప్పటినుంచే పరిష్కారం వెదక్కబోతే తిప్పలు తప్పవు. నదుల అనుసంధానం
తప్పించి మరో సులభ పరిష్కారం కనిపించదు. అదీ అంత
సులభంగా వగదిగే మార్గం కనిపించడం లేదు. ప్రపంచ జల
వనరుల్లో నాలుగు శాతం గల భారత దేశానిది తన నదీ జల్లాలో కనీసం రెండు శాతమైనా సద్వినియోగం చేసుకోలేని
నిశ్చేష్టత్వం.
నదుల అనుసంధాన
మహాక్రతువు నిష్టతో పూర్తి చేస్తే వరదల ముప్పునుంచి తప్పించడమే కాదు.. కరవు పీడిత ప్రాంతాలకు జల సిరులు వరంగా దక్కించినట్లవుతుంది. దశాబ్దం కిందటి నాటి ప్రధాని మానస పుత్రిక ఈ నదుల అనుసంధానం మహాయాగం. దస్త్రాలలో దుమ్ముకొట్టుకొనే ఈ భూరి భగీరథ పథకాలకు కనీసం మోదీ హయాంలోనైనా
వెలుగు సోకితే సర్వ భారతావని సుజలాం సుఫలాంగా మారి తీరుతుంది.ఆహారం,
విద్యుత్తు, తాగునీటి
సమస్యలకు నదుల అనుసంధానమే ఏకైక పరిష్కారమని దాదాపు దేశంలొని నలభై చిల్లర మేధావులు
నొక్కి చెబుతున్నప్పుడు..
మీన మేషాలు లెక్కించడం పొరపాటు. ఏ సందేహాలకైనా సమాధానాలు చెప్పేందుకు జలరంగ నిపుణులు ముందుకొస్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే ఆ
కాస్త అమృతం కూడా విషమయమయిపోదా?
భారత దేశంలో నదుల పట్ల ఉన్నంత భక్తి
గౌరవాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఋషులు, ఆధ్యాత్మిక చింతనాపరుల బోధనల ఫలితం ఇదంతా. ఏటా నదుల్లో
మునిగే పుష్కర సంస్కృతి వెనక ఉన్నది ఒక్క
ఆధ్యాత్మిక భావనే కాదు. కోట్లాదిమంది కుంభమేళావంటి పుష్కర ఘట్టాలలో కలబడి పునీత స్నానాలు చేయడం వేరే సంస్కృతలవారికి ఎప్పటికీ
అంతుబట్టని ఎనిమిదో వింత!
తరాల అభిరుచుల్లో
ఎంతో మార్పు కనిపిస్తున్నా నదీ నదాల పట్ల చూపించే భక్తి ప్రవత్తుల్లో మాత్రం కించిత్తయినా గౌరవ మర్యాదలు తగ్గకపోవడాన్ని ఎలా
అన్వయించుకోవాలో తెలీక తలలు బాదుకునే పాశ్చాత్యులు బోలెడంత మందున్నారు. వరదలొస్తే
శాంతించమని పూజలు చేస్తాడు.
కరువులొస్తే కరుణించమని ప్రార్థిస్తాడు భారతీయుడు. నదులను తల్లులుగా భావించి తమ ఉనికికి ఫలానా నదీ తీరాలు మూలాలని సమంత్ర
పూర్వకంగా చెప్పుకొనే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా కనిపిస్తుంది.
హరప్పా నాగరికత సింధునదీ ప్రభావంతో ఏర్పడ్డది. గంగానదీ తటాకం పొడుగూతా వేద సంస్కృతి ఈ నాటికీ నిరాటంకంగా వర్ధిల్లుతోంది. ఆచార్య నాగార్జునుడు కృష్టానదీ తీరంలొ కొలువు తీరి ఉన్నప్పుడే బౌద్ధారాధనను ఓ
సువ్యవస్థగా మార్చి విశ్వం నలుదిక్కులా ప్రచారం చేయించింది. పవిత్ర పుణ్యక్షేత్రాలు, పాలనాకేంద్రాలన్నీ
దాదాపుగా నదీ తీరాల్లో వెలసిల్లినవే! యమునా నది
వడ్దున హస్తిన,
అడయార్, కూపమ్ నదుల తీరంలో
చెన్నయి,
మూసీ నది తటాకాన భాగ్యనగరి. అమరావతి వంటి ఆధునిక రాజధాని
నిర్మాణానికీ కృష్ణానదీ తటాకమే ప్రాతిపదిక అయింది. పౌరుల నిత్య జీవితావసరాల నదులే ప్రధాన
ఉపాధులయినప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాల
దృష్టీ సహజంగానే వాటిమీద నుంచి పక్కకు
మళ్లదు.
అందుకే కేంద్రం గంగానది పారిశుద్యం.. రాష్ట్రాల హరిత దినోత్సవాలు!
రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి నీటి వనరులమీద నుంచి ఏ నాడూ
పక్కకు మళ్ళడం లేదు. తెలంగాణా ప్రభుత్వం
చెరువుల ప్రక్షాళన,
ఆంధ్ర ప్రదేశ్ అందుకొన్న జలరాశికి హారతి ఇందుకు ఉదాహరణ. పక్కా అధ్యాత్మిక కార్యక్రమంగా జలరాశికి
హారతి బైటికి కనపడుతున్నా..
ఆ పథకం
వెనకున్నది వాస్తవానికి ప్రజా సంక్షేమ కాంక్షే!
నీరుంటే చెట్లు కాదు. చెట్లుంటేనే నీరు.
ఇప్పుడున్న అటవీ సంపదను రక్షించుకోవడంతో పాటు.. కొత్త అటవీ వాతావరణాన్ని సృష్టించుకొంటేనే పర్యావరణానికి నూతనోత్తేజం
సిద్ధించేది.
ఒక్క రోజులో కోట్లాది మొక్కలు నాటి కొత్త గిన్నీస్
రికార్డులు సృష్టించడం కన్నా.. నాటిన మొక్క ఏ మేకా
మెక్కేయకుండా వృక్షంగా అభివృద్ధి అయే దాకా పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడే
పర్యావరణానికి మళ్ళీ ప్రాణం పొసినట్లయేది. అడవులు పెరిగితే
వర్షాలు పెరుగుతాయి.
బక్క చిక్కిన జలాశయాలకు కొత్త కళలు వచ్చేస్తాయి.
ఉన్న జల వనరులు వృథాగా ఉప్పు
సముద్రాల పాలవకుండా పౌరులలోనే జల సంరక్షణ స్పృహను మరింత రగిలించవలసిన తరుణం ఆసన్నమయింది.
నదులు కలుషితం కాకుండా కఠిన చర్యలు కావాలి. పరిశ్రామిక
వ్యర్థాలు నదుల్లోకి వదలకుండా తగిన నిఘా అవసరం. ఇప్పటికే
కలుషితమైన జలాలను ప్రక్షాళించే కార్యక్రమాలు మరింత చిత్తశుద్ధితో ముందుకు సాగాలి. నదీ తటాకాలు అక్రమాక్రమణలకు గురి
కాకుండా రక్షించాలి.
విచక్షణారహిత
జలవినియోగానికి అడ్డుకట్ట పడాల్సుంది. నదీ ప్రవాహాల
సహజ మార్గాలు మళ్లింపుకు గురికాకుండా చూడడం చాలా ముఖ్యం.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటి
పరిరక్షణ ప్రధాన బాధ్యతగా పాలకులంతా గుర్తిస్తున్న వేళ నదుల
అనుసంధానం క్రమంగా ఊపందుకోవడం ముదావహం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు జలవనరుల
పరిరక్షణ
విషయంలో నిరంతరం జాగరూకతతో పలుసంక్షేమ పథకాలకు శ్రికారం చుట్టడం పర్యావరణవేత్తల
ప్రశంసలూ అందుకొంటున్నది. ఇటీవలే రెండు రాష్ట్రాలలో మొక్కలు నాటే వివిధ పథకాలు
ముమ్మరమవడం గమనార్హం.
నదుల అనుసంధానంలో భాగంగా అతి తక్కువ కాలంలో గోదావరి నదీజలాలను పట్టిసీమకు మళ్లించి కొత్త
రికార్డు సృష్టించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది. తెలంగాణా అంతటా చెరువుల మరమ్మత్తులు
మునుపెన్నడూ లేనంత ఉద్యమ దీక్షతో కొనసాగడమూ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు
ముందుచూపు పర్యావరణ పరిరక్షణ చర్య.
జలసిరికి హారతి
నదుల అనుసంధానం,
చెరువులు బావుల తవ్వకాలతో సరిపెట్టకుండా.. నీటికీ ప్రజలకూ మధ్య గల ఆధ్యాత్మిక అనుబంధాన్నీ పునరిద్ధరించే ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మొదలయ్యాయి. గంగానదికి
వారణాశి,
హరిద్వార్లలో పట్టే రీతిలో.. గోదావరికి రాజమండ్రిలో,
కృష్ణమ్మ తల్లికి విజయవాడ ఇబ్రహీంపట్నంలో నిత్య హారతులు
పట్టే ఆధ్యాత్మక పథకమొకటి ఈ మధ్యనే మొదలయింది. కేవలం
జీవనదులుగా భావించే కృష్ణా గోదావరులకే కాకుండా.. జనజీవనానికి
అమృత పానీయం అందించే జల వనరులు చెరువులు, బావులు, వాగులు,
వంకలు.. చిన్నవా.. పెద్దవా అన్న బేధం లేకుండా అన్నింటికీ నిత్య హారతులు అందించాలన్న చంద్రబాబు
వినూత్న ప్రయోగం స్వఛ్చమైన మనసున్న వారంతా తప్పక స్వాగతించాలి. నదంటే ఓ నీటి ప్రవాహం. నీరు దేవత ఎలా
అవుతుంది? అని వాదించే వ్యక్తిని మూడు రోజుల పాటు ఓ నిర్జల స్థలంలో ఉంచి నాలుగో పూట
గుక్కెడు నీరు అందించండి! నదికి కాదు .. ముందా లోటా నీటికి నమస్కరిస్తాడు. తాగే నీరే కాదు, పీల్చే గాలి, తినే తిండి వాదనకు
కేవలం బౌతిక రూపాలే కావచ్చు కాని .. వాస్తవంలో అవి
జీవి ప్రాణదీపం ఆరిపోకుండా అడ్డుపడే దైవిక హస్తాలు! బతుకు ఇచ్చినందుకు,
బతకనిస్తున్నందుకు, బతికున్నంత కాలం
బాగోగులు చూసుకొంటున్నందుకు కన్నవారంటే గౌరవాభిమానాలు కనబరుస్తున్నప్పుడు.. ఆ వాత్సల్యమే చవి చూపించే ప్రకృతి శక్తుల పట్లా కృతజ్ఞత చూపించడం మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? నదులకు హారతులు ఇవ్వడం ఇవాళే కొత్తగా పుట్టుకొచ్చిన సంప్రదాయం కాదు. పాప ప్రక్షాళన జరుగుతుందన్న ఆశతోనే కదా భగవంతుడి ముందు భక్తితో మోకరిల్లేది. నదిదీ దైవ స్వభావమే.
ఎంత మురికి వదిలినా
కిమ్మనదు.
ఎవరు తన ఒడికి చేరబోయినా 'వద్దు..
పొమ్మన'దు. దైవత్వానికి ఇంతకన్నా మెరుగైన ఔదార్యమేముంది? దేవతా మూర్తులకు హారతులు పట్టటంలో లేని అభ్యంతరం జలరాశికి హారతులు పట్టడంలో
ఎందుకు చూపెట్టడం?
పైకి పూజా విధానంగా అనిపించే ఈ
నిత్యారాధన వెనక లోతైన సంక్షేమ ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జలవనరుల కలుషితానికి జనంలో భయం కలగజేయడం ఈ పూజా పునస్కారాల వెనకున్న అసలైన
ఆంతర్యం.
కాలుష్యాలు, మానవ
విసర్జితాలు,
చెత్తా చెదారం నిర్లక్ష్యంగా వదిలే జనం దుర్లక్షణానికి దైవంగా భావించే
జలవనరులను దూరంగా ఉంచాలన్నదే ఈ ప్రయత్నం వెనకున్న సంక్షేమ భావం. ఎంత వరకు
సఫలీకృతమవుతుందో ముందు ముందు చూడాల్సుంది. ఆసాంతం విజయవంత అవకపోయినా.. కొంతలో కొంత సత్ఫలితాలను ఇచ్చినా 'జలసిరికి హారతి'
లక్ష్యం సక్రమంగా నెరవేరినట్లే!. ప్రభుత్వాలు ఆచరించే జలకాలుష్య నివారణ చర్యలకు ఒక మంచి
వాతావారణం జనంనుంచి రాబట్టడానికి మించి జలహారతి ప్రసాదించే మంచి ఫలితం ఏముంటుంది?
--కర్లపాలెం హనుమంతరావు
(చిత్రాలు-motivateme.in- సౌజన్యంతో- దన్యవాదాలతో)
(ఆంధ్రప్రభ, దిన పత్రిక 23-09-2017 నాటి సంపాదకీయ పుట వ్యాసం)