గాంధీజీ జయంతి సందర్భంగా
'హే.. గాంధీ!' పిలిచాడు రామచంద్రుడు. 'మహాత్మా! నువ్వు బతికున్నంత కాలం 'రఘుపతి..
రాఘవ.. రాజా.. రాం..' అంటూ పద్దాకా రాంకీర్తనలతో నా బుర్ర వూరకే
తోమేవాడివి! సబ్ కో సన్మతి ప్రసాదించమని
సతాయించేవాడివి! ఆ రఘులు, రాఘవులు, రాజాలు,
రాం వగైరాలంతా నీ రామరాజ్యం కలలకు ఎలా ‘రాం.. రాం’లు చెప్పే
పనిలో విరామం లేకుండా శ్రమించేస్తున్నారో.. తెలుసా!’
‘నారాయణ.. నారయణ! అల్లా,, అల్లా! భగవంతుడి బిడ్డలమే మేమల్లా! అలా అనుకొని సర్దుకు పోరాదా సద్గుణాభిరామా!'
'ఆ అల్లా వచ్చి నచ్చి చెప్పినా మీ నారాయణా..
సత్యనారాయణలంతా ఆవలి సంతలో చేరి పుల్లలు
పెడుతున్నారు కదయ్యా కొల్లాయి బాపయ్యా!’
చింతనలో పడ్డాడు గాంధీజీ.
సందు చూసుకొని అందుకొన్నాడు ఆంజనేయుడు 'బాపూ!
నాకూ నరలోకంనుంచి సమాచారం ఉంది. తమరు
సత్యంతో చనిపోయేదాకా చచ్చేటన్ని ప్రయోగాలు చేసి చూపించారా! తమరి వారసులమని బీరాలు పోయే నేతలు ఇప్పుడక్కడ ఆ సత్యాలన్నీవట్టివే.. వట్టి నేతిబీరకాయలేనని
గట్టిగా నిరూపించే పనిలో బిజీగా ఉన్నారు! ఏది సత్యమో.. ఏదసత్యమో తెలీనంత అయోమయంగా అన్ని
రంగాల్లో ప్రయోగాలు సాగిపోతున్నాయి స్వామీ
అక్కడ!’
‘అసత్యంతోనా ప్రయోగాలు?!'
‘మరే! ఎన్నికలలా తన్నుకు రాగానే ముందు
అసత్యమే సత్యం మేకప్పేసేసుకొని తైతెక్కలాడేస్తోంది! ఏ పార్టీల ఎజెండాలయితేనేమి.. అన్నీశుద్ధబద్ధాల
ప్రయోగశాలలుగా తయారవుతున్నాయి! ఎన్ని లక్షల కోట్లక్రమార్జనల
ఆసామైనా .. ఎన్నికల సంఘం ముందు ఒక్క డొక్కు కారుకు మాత్రమే ఓనరు! ఆస్తి పాస్తులకన్నా..
అప్పులు, పన్నులు, పస్తులైనా ఉండి కట్టి చావాల్సిన
శిస్తులే బొచ్చెడు!'
'మరంత కష్టంలో ఉండీ మరెందుకు స్వామీ కోట్లు దండిగా వదిలే ఆ పాడు ఎన్నికల్లో పాల్గొనేదా ఆసామీ?!'
'ప్రజాసేవ యావ మహాత్మా! గ్రాము ఎత్తు జనంరుణమైనా తీర్చకోకుంటే
ప్రజాజీవితానికి అసలు పరమార్థమే లేదు పొమ్మని.. . తవఁరే ఎప్పుడో
సేవాగ్రాములో సెలవిచ్చారంట కదా!’
'అనుమానం అవమానం సుమా!
నిజంగానే ఆ ప్రజాసేవకులు
నా సిధ్ధాంతాలను నమ్మి ఎన్నికల్లో నిలబడుతున్నారేమో.. హనుమా?'
'మరే! వాళ్లంత ఉగ్ర సేవకులు కాబట్టే తమరు తాగద్దన్నారని ఉగ్గబట్టిన కల్లు గట్రాలలా మురికి వాడలకొదిలేసారు. ఫక్తు
సీమ సరుకుతో తాము సర్దుకుపోతున్నారు. ఖరీదైన కరేబియన్ డ్రగ్గుల్తో
సరిపుచ్చుకుంటూ..
సన్నకారు
తాగుబోతులు పుచ్చుకునేందుకు వీలుగా చీపు
లిక్కరు బట్టీలు పెట్టి తంటాలు పడిపోతున్నారు’ అబ్కారీ వసూళ్ళే ఇప్పటి బీద సర్కార్లక్కూడా నిక్కచ్చి ఆదాయం
బాపూజీ! జనమూ జాతిపిత జ్ఞాపకాలను మర్చిపోలేక నలిగిపోతున్నారు, తవఁరి జయంతి, వర్ధంతుల రోజుల్లో కూడా మందు
దుకాణాలు బందు పడున్నా ఏ సందులోని
షట్టరు సందుల నుంచో పుడిసెడైనా పుచ్చుకొంటే గానీ పునీతులైనట్లు అనిపించటంల్లేదెవ్వరికీ స్వామీ!’
'రామ!.. రామ! రామరాజ్యం వస్తే జగమంతా తెగ
సుఖిస్తుందని కదయ్యా హనుమా నా కల?’
‘సుఖపడే పాలన యధేఛ్ఛగానే కొనసాగుతోంది
లేవయ్యా స్వామీ కింది లోకంలో! పబ్బుల్లో రాసలీలల
స్వేఛ్చకు పెద్దింబ్బందులేవీ లేవు. మోక్షమందించే బాబా డేరాలు వందలొందలుగా పెరిగి
పోరూనే ఉన్నాయ్ గొంది గొందికీ! మాయా మర్మాలతో పలు రకాల ప్రయోగాలు సాక్షాత్తూ న్యాయదేవత కళ్లముందే సాఫీగా సాగిపోతున్నప్పుడు ఇహ మన సుగుణాభిరాముడొచ్చి నేరుగా పాలనలో జోక్యం చేసుకొంటే,,
ఏమంత బావుంటుంది చెప్పు బాపూజీ?’
‘ఆ కొంటెతనమే వద్దు!
అక్కడికీ ‘చెడు- వినొద్దు.. కనొద్దు.. అనొద్ద’ని చెవినిల్లు కట్టుకొని మరీ పోరి పోరి వచ్చాను కదా బతికున్నంత కాలం! నా మొత్తుకోళ్ల
ఫలితం నిల్లైనట్లేనా మరి! హరి.. హరీ!’
'చెడు' అన్న పదం మాత్రం మా చెడ్డ ఇబ్బందిగా ఉన్నట్లుంది మహాశయా తమరి శిష్యబృందాలకి!ఆ
‘అనద్దు.. కనొద్దు.. వినద్దు’ అన్న సూత్రం మాత్రం గట్టిగా పట్టుకొని మా చెడ్డ నిబద్ధతతో పాటిస్తున్నార్లేవయ్యా
నేతా.. జనతా!
'రామ..
రామ!'
'అలా ‘రామా.. రామా’ అంటు అల్లల్లాడినా బూతు మాటగా మారి అల్లరైపోతునదయ్యా కిందంతటా. ఏ ప్రవచానానికి ఎవరు ఏ పెడర్థం లాగి రాద్దాంతం చేస్తారో.. ఏ మేధావి ఎప్పుడే
చచ్చు సిద్ధాంత పట్టుకుని పుస్తకంతో పరువు తీస్తాడో.. ఏ ముఖ పుస్తకం టపా ‘ఠపా’ల్మని పేలి ఎవరు ఎప్పుడు టపా కడతారో .. అంతా
గందరగోళంగా ఉంది కింద భూగోళంలో! జీవించే హక్కు..'
'హక్కనుకుంటామే గానీ..
జీవితం క్షణభంగురమే కదా చిరంజీవీ వాస్తవంగా చూస్తే!'
'నిజవేఁకానీ స్వామీ.. మరీ భంగుతాగిన మాదిరి తక్కుతూ తారుతూ నా జీవించేదీ? ఎంత
ఇబ్బందిగా ఉంటుందీ అర్బకుడికి? తమరు స్వాతంత్ర్యం తెచ్చి డెబ్బై ఏళ్ళు దాటినా దెబ్బై పోతున్నాడయ్యా
సామాన్యుడింకా కింది లోకంలో!’
‘అవును. హనుమ చెప్పినవన్నీ అక్షరాలా నిజమే బాపూజీ! మళ్లీ నువ్వే ఓ సారి నీ భరత ఖండం వెళ్లి రావాలి?’ రామచంద్రుని స్వరం.
భక్తిగా లేచి నిలబడ్డాడు బాపూజీ.. సామాను సర్దుకుంటో!
'బొడ్దులో గడియారం, చేతిలో కర్ర, కొల్లాయి
గుడ్డ, కళ్ల జోడు! బోసి నవ్వుతో ఇంత సజీవంగా వెళితే పిచ్చి నేతలతో
ప్రమాదమేమో చూసుకో లోక నాయకా!’
'నడి రోడ్లమీద అడుగడుగునా నా విగ్రహలే కదా వెలిసున్నాయి స్వామీ! మరి వాటికి లేని ప్రమాదం..?’
‘నోరు లేని విగ్రహాల
కథ వేరయ్యా పిచ్చి బాపూజీ! గల్లీ బుల్లి నాయకులు .. ఎన్నికలప్పుడు
కటౌట్లు గట్రా పడిపోకుండా నిలబెట్టుకోడానికి ఆ విగ్రహాలు పనికొస్తాయి! పండగలు,
పబ్బాలప్పుడు దండలవీ వేసి దండాలు దస్కాలు
పెట్టుకునేందుకైనా నీ బొమ్మ బండలు ఉండాలి..
తప్పదు! ఉన్నట్లుండి నువ్విలా ప్రాణాలతో వెళతానంటేనే నాయకుల గుండెలు గుబ గుబ లాడేది’
‘పోండి స్వామీ మీరు మరీను!
కొత్త రెండువేల నోటుమీదా నా మొహమే మళ్లి ముద్రించారు తెలుసా మర్చిపోకుండా!’
‘కింద ‘మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ’ అని రాయిస్తే గానీ తవఁరెవఁరో ఈ నాటి జ్ఞానులకు తెలిసే అవకాశం
లేదు స్వామీ!
'భలే తాత మన బాపూజీ' అంటూ
బడిపిల్లల చేత మాత్రమే పాడిస్తున్నారంటేనే బడా నేతల తలల్లో ఏం దురాలోచనలున్నాయో
తెల్సిపోతోంది. పిల్లకాయలకి మాత్రమే నువ్వో
రోల్ మోడలుకు! పెద్ద తలకాయల రీతి రివాజులకు నువ్వో రోడ్ రోలర్.’
‘హేఁ!
రామ్!'
'చెవులిలా గట్టిగా మూసేసుకుని
ఇక్కడ కుమిలిపోతూ కూర్చుంటే లోకం ఇంతకన్నా ఎక్కువగా కుళ్ళిపోతుందయ్యా అక్కడ బాపూజీ!
ఎల్లుండే నీ జయంతి. ఎక్కడున్నా నీ వారసులమని చెప్పుకొనే
వారంతా ఆ రాజ్ ఘాటు సంతకు హాజరవుతారు ఖాయంగా. మంచి అదను. ఇది తప్పితే మళ్ళీ వర్ధంతి వరకు
నీకే దొర అప్పాయింటుమెంటూ దొరికి
చావదు'
'ఏం చెయ్యమని నీ సెలవు శ్రీరామచంద్రా?'
'ఏం చేస్తావో..
ఎలా దారికి తెస్తావో.. నీ ఇష్టం! వారసులమని ఒకళ్లు.. జాతిపిత సిద్ధాంతాలకు తామే అసలు కళ్లమని
మరొహళ్లు!
రాజకీయ స్రవంతిలోకి వరదలా వచ్చి పడుతున్నదయ్యా బాపూ ఎక్కడా పనికిరాని మకిలి సరుకంతా!
ప్రక్షాళనే తక్షణం చేప్పాట్టాల్సిన పెద్ద సంస్కరణ’
'చిత్తం స్వామీ!
ఇదిగో
బైల్దేరుతున్నా!'/
'ఇలాగా! ఏ తెలుగు దేశం శివప్రసాదో మారు వేషంలో వచ్చాడని దులుపుకు పోతారయ్యా
పెద్దలంతా!.
వంటికి వెండి పూత దట్టంగా పట్టించు! ఓ గంట ముందే వెళ్లి ఆ ఎండలో నీ రాజఘాటు గేటు
బైట శిలావిగ్రహంలా నిలబడి పో! ఆషాఢభూతుల చూపు నీ మీద పడ్డ తరువాత.... ఇహ నీ ఇష్టం'
ఆంజనేయుడు దుడ్డుకర్ర అందించాడు.
కొల్లాయి గుడ్డ ఇంకాస్త గట్టిగా బిగించి ఛంగున ఛంగున ముందుకు దూకే ఆ సత్యాగ్రహిని ఆపి ‘తాజా ప్రధాని మోదీజీ కూడా అక్కడ నువ్వు
ప్రబోధించిన ప్రక్షాళనా కార్యక్రమాన్నే
మహా దీక్షగా కొనసాగిస్తున్నాడు. ఆ మహానుభావుడి రామరాజ్య స్థాపన పుణ్యకార్యానికి నువ్వూ ఓ చెయ్యి వేయి మహాత్మా! జనం కలలు కనే సుపరిపాలన స్థాపనకి నువ్వే మళ్లీ వెళ్ళి ఓ ఇటుకరాయి వేసెయ్యి
మహర్షీ!’ అంటూ ఆశీర్వదించాడు ఆ శ్రీరామచంద్రమూర్తి.
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సెప్టెంబరు- 30- 2017 -సుత్తి మెత్తంగా కాలమ్)
No comments:
Post a Comment