(కార్ట్యూనిస్ట్ మల్లిక్ గారికి కృతజ్ఞతలతో)
సుబ్బాయమ్మ చాలా ఆశబోతు. విలాసవంతమైన జీవితం
మీద తగని మోజు. తన భర్త తన
నాలుగు
కోట్లకు బీమా చేశాడన్న విషయం తెలిసినప్పటి
బట్టి అప్పటి వరకు ఆమె లోపల దాగి ఉన్న కోరికలన్నీ ఒక్కసారి పడగ విప్పి ఆడటం మొదలుపెట్టాయి.
తన స్వర్గసుఖాలన్ని భర్త చావుతో
తప్ప మొదలు కావు- అన్న విషయం సుబ్బాయమ్మకు అర్థమయింది. అందుచేత విలాసవంతమైన
జీవితం గడపడానికి ఆమె తాళి కట్టిన భర్తను
చంపాలని నిర్ణయించుకుంది. అందుకోసమై
ఆమెకు ఒక కిరాయి హంతకుడి తోడు కావాలి. బోలెడన్ని సి.ఐ.డి ఎపిసోడ్లు వచ్చీ రాని హిందీ నాలెడ్జ్ తోనే చూసి ఒక అవగాహన తెచ్చుకుంది.
కొన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా అక్కడా ఇక్కడా విషయ సేకరణ కూడా చేసి చివరకు ఒక పర్
ఫెక్ట్ మర్డర్ ప్లాన్ కు బ్లూ ప్రింట్ తయారు
చేసుకుంది. ఆ స్కీమ్ ను ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు ఆమెకు ఒక కిరాయి షూటర్ సాయం పట్టాలి.
సినిమాలలో తప్ప నిజమైన జీవితంలో డబ్బులకు
కాల్చే తుంటరి కుంకలు ఎక్కడ ఉంటారో, ఎట్లా ఉంటారో ఆ ఇల్లాలుకు పాపం ఇప్పటి వరకు తెలిసే
అవకాశం లేదు. అత్తగారి తలరాత బాగుండి పెందరాళే తన దారిన తాను ప్రశాంతంగా పైకెళ్లిపోవడంతో
ఇలాంటి కిరాయి గూండాలతో ఇప్పటి వరకు పనిపడలేదు. అతి కష్టం మీద వచ్చీ రాని ఇంగ్లీషు నాలెడ్జ్ తోనే
ఇంటర్నెట్ అంతా గాలించి గాలించి చివరికి ఒక కిరాయి హంతకుడి అడ్రస్ పట్టుకోగలిగింది సుబ్బాయమ్మగారు.
ఆ కిరాయి గూండాని తన కారులో తిప్పుతూ ఎప్పుడు,
ఎక్కడ, ఏ విధంగా గుట్టు చప్పుడు కాకుండా తన భర్త పని పట్టాలో పూసుగుచ్చినట్లు పదే పదే
వివరించింది. ‘ఎన్నో నెలల పాటు ఎంతో శ్రమకు ఓర్చి ఉన్న తెలివితేటలన్నీ ఉపయోగించి తయారుచేసుకున్న
స్కీమ్. ఒక్క చిన్నపొరపాటు జరిగినా మొత్తం వ్యవహారం తలకిందులయిపోవడం ఖాయం. ఫర్ఫెక్ట్
షూటర్ వన్న ట్రాక్ రికార్డ్ చూసే కాస్త రేట్
ఎక్కువైనా నిన్ను కష్టపడి గాలించి పట్టుకున్నది. అన్నీ అనుకున్నట్లు గాని సజావగా జరిగిపోతే
నీకు మరో ఒక అరశాతం అదనం బోనస్ కింద చెల్లించడానికైనా సిద్ధం. కానీ ఎక్కడా నా జోక్యం ఉన్నట్లు చిన్న క్లూ అయినా వదిలిపెట్టి
పోవద్దు. రేపు ఉదయానికల్లా నేను నా భర్త చావు వార్త చల్లంగా పోలీస్ స్టేషన్నుంచి వినితీరాలి’ అంటూ పది
రకాలుగా జాగ్రత్తలు చెప్పి తను సీనులో నుంచి తప్పుకుంది.
కిరాయి హంతకుడు అనుకున్న ప్లాన్ ప్రకారమే
పర్ఫెక్ట్ గా ఆపరేషన్ సక్సెస్ జేసినట్లు తెల్లారుఝామున పోలీసుల నుండి వచ్చిన భర్త మర్డరైన
వివరాలన్నీ విన్నాక సుబ్బాయమ్మకు నిర్ధారణయింది. మనసులోనే కిరాయి హంతకుడి అంకితభావానికి
ముగ్ధురాలైంది. బైటికి మాత్రం విషాద వదనంతో పోలీసు స్టేషనుకు పరుగెత్తింది. పోలీసు
జీపులోనే భర్తను షూట్ చేసిన స్పాట్ కు వెళ్లి చూసింది సుబ్బాయమ్మగారు. పోలీసులు చూపించిన
స్థలమంతా రక్తంతో చెల్లాచెదరుగా ఎర్రబడి భీభత్సంగా ఉంది. భర్త ఉదయంపూట వ్యాహ్యాళికని
వెళుతూ ధరించిన దుస్తులు పోలీసులు ఇప్పుడు చూపించినవే. ‘మీ హజ్బండ్ ఫేస్ కూడా చూపిద్దామని
అనుకున్న మాట నిజమే కాని.. పోస్ట్ మార్టం చేసే వైద్యుడు ఊరికి వెళ్లే తొందరలో ఉండడం వల్ల
మీరు రాకముందే డెడ్ బాడీని తరలించ వలసి వచ్చింది. సారీ! ఇంకా మీకు మీ భర్త బతికే ఉన్నాడన్న
నమ్మకం ఉంటే చెప్పండి. బాధితుల డౌట్సన్నీ క్లియర్ చేసే బాధ్యత పోలీసు డిపార్ట్ మెంట్ గా మాకు చాలా
ముఖ్యమైనది’ అన్నాడు స్టేషన్ ఆఫీసర్.
‘ఇన్ని ఆధారాలు చూపించారు. ఇంకా అనుమానం
ఎందుకు సార్? కానీ, నా భర్త వట్టి అమాయకుడు.
చీమకైనా అపకారం జరిగితే విలవిలలాడే సౌమ్యుడు. ఎవరికి ఏం ద్రోహం
చేసాడని.. పాపాత్ములు బంగారం లాంటి మా ఆయన్నిలా పొట్టనపెట్టుకున్నట్లు? ఆ దుర్మార్గులను
సాధ్యమైనంత తొందరగా పట్టుకుని ఉరికంబం ఎక్కించండి సార్! అప్పుడే చచ్చి స్వర్గంలో ఉన్న
మా శ్రీవారి ఆత్మకు శాంతి’ అంటూ వెక్కిళ్ల మధ్యనే పెద్ద పెద్ద సినిమా డైలాగులు గుప్పించేస్తోన్న
సుబ్బాయమ్మగారి చెవుల్లో ‘ఎప్పటి దాకానో ఎందుకు డియర్ సుబ్బాయ్! హంతకుల్ని
ఇప్పుడే పట్టేస్తే పోలే! ముందు నువ్వు కళ్లు
శుబ్బరంగా తుడుచుకో! ఒక్కసారి తేరిపారా చనిపోయిన
నీ మొగుణ్ని చూసుకుందువు గాని’ అన్న గొంతు వినిపించింది. ఆ గొంతు తన భర్త కామేష్ దే! కొయ్యబారి
పోయిన సుబ్బాయమ్మగారు గాభరాగా ఎదుటనే నిలబడున్న భర్తను చూసి’ కామేష్! నివ్వింకా బతికే
ఉన్నావా? మరి నా దగ్గర పది లక్షలు నొక్కేసిన ఆ చచ్చినోడు..!’
‘ఇక్కడే ఉన్నాను మేడమ్ గారూ! మీరు ప్లానంతా మా పోలీసోళ్లకు మించి మహా పకడ్బందీగా తయారుచేశారు. మెచ్చుకోక తప్పదు. కానీ.. కిరాయి హంతకుడు విషయంలోనే చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ‘అండర్ కవర్’ అన్న మాట సరిగ్గా అండర్ స్టాండ్ అయినట్లు లేదు.. ప్రొఫెషనల్ పోలీస్ కు ఫ్రొఫెషనల్ కిల్లర్ అన్న అర్థం చెప్పుకుని నా అడ్రస్ దొరకపుచ్చుకుని వెంటబడ్డారు.. సారీ!’ అంటూ సుబ్బాయమ్మగారి బంగారు గాజు చేతులకు ఇనుప గాజుల్లాంటి బేడీలు తగిలించేసి చిలిపిగా నవ్వాడు ప్రొఫెషనల్ పోలీసాఫీసర్. అతగాడే తాను ప్రొఫెషనల్ కిల్లర్ అనుకొని ప్రాణం మీదకు తెచ్చుకున్న పోలీసు మనిష’ని అప్పుడు గాని అర్థమయింది కాదు, పాపం, సుబ్బాయమ్మ గారికి.
‘అందుకే ఇంగ్లీషు కోచింగ్ క్లాసుల్లో చేరినప్పుడు మార్నింగ్ షోల కోసమని సగంలో క్లాసులు ఎగ్గొట్ట కూడదు. ఫలితం
ఇప్పుడనుభవిస్తున్నా.. ఛీఁ’ అంటూ చేతికున్న ఇనప
బేడీలతోనే తల తటా తటా మొత్తేసుకుంది పాపం మేడమ్ సుబ్బాయమ్మ గారు!’
-కర్లపాలెం హనుమంతరావు
21 -09 -2020
***