'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.
పెన్ పవర్ పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నాను. ఏ అంశం మీద రాద్దామా అని ఆలోచిసున్నా. తెగడంలేదు'
'ఈ మధ్య నీ రాతల్లో కాస్త సీరియస్ నెస్ ఎక్కువయింది. బ్రేకింగ్ గా ఉంటుంది .. ఏదైనా, లైటర్ వీన్ ట్రై చెయ్యరాదూ ?' అని గొణిగింది అంతరాత్మ.
'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'
చిరాకు పడ్డా.
ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా మనసులుంటాయా? అక్కడికి మీ మనుషులు అవి చెప్పే మాటలే వింటున్నట్లు.. మహా! నేను జంతువులాంటి దాన్ని. నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ ఉండవు.. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి ఉండి నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది?'
నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ పెట్టే నస చెవినపడగానే. 'మా పాతకాలం తెలుగు సినిమాలలో అంతరాత్మలు శుభ్రంగా ఏ టినోపాలుతో ఉతికిన ఇట్లాగే ఏ తెల్ల వస్త్రాలో ధరించి అద్దంలో నుంచో, స్తంభంలో నుంచో అడగా పెట్టకుండా వద్దనకుండా ఊరికే తెగ నసపెడుతుండేవి. చాలా సమయాలల్లో ఒకటి కాదు, రెండు కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం అదో సరదా వాటికి. పాత్ర ఎస్వీ రంగారావు సైయిల్లో చేతిలో ఉన్న మందు సీసా విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలుగా మారుమోగేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యేదే కాదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని రాలేదు కదా! కరోనా రోజులు .. ఎటూ బైటికి పోయే ఛాన్సు నాకుండదీని గాని పసిగట్టావా ఏందీ!'
'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ మోతాదులోనే నా ఆర్భాటం ఉంటుంది, అసలు చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పాలిటిక్సు పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకులాగే సమ హోదాతో జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు గిలికిపారెయ్ రాదూ ఈ దఫాకు! సరదాగా అందరు చదువుకుంటారు!'
'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందని మహానుభావా కొత్తగా మన పాఠకులు చదివి ఎంజాయ్ చేసేందుకు? జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు సంబధమైన సజ్జెక్టులన్నీ నీ లాంటి అంతరాత్మలు నసలు పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనక ‘
'ఆపవయ్యా రైటర్ ఆ అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు మనుషులకే పరిమితయినట్లు ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే అసలైన జంతువులు. ఏ సాధుశీలి లోపల ఏ మేకవన్నె పులి నిద్రోతుందో, ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘ అంటేనే ఉలిక్కి పడి చచ్చే పిల్లుంటుందో.. అంతరాత్మలకు మాకానువ్వు కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఒకటి చెబుతా.. ముందు విను! ఆనక నీకు యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’
జంతువులు అసలేవీ ఆలోచనల్లాంటి సృజనాత్మకమైన పనులు చేయలేవని కదూ మీ మనుషుల బడాయి ఊహలు! ఆహారం, నిద్రా మైథునాల్లాంటి సహజాతాలకు మాత్రమే మొగ్గుచూపే బుద్ధి వాటిదని కదూ మీ మేధావుల వెధవాలోచనలు! జంతుజాలం భాష నువ్వు డీ-కోడ్ చెయ్యలేవు. కనక కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ బుర్రకెక్కదు. వాటికి అసలు మాట్లాడటమే రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా! వాటి మాటల సారం నీకు అర్థమయితేనా! మనిషిగా పుట్టించినందుకు నువ్వా బ్రహ్మయ్య మీదనే నేరుగా దాడికి దిగిపోతావు!’
ఈ సారి ఏ హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు హరిద్వారం , ఋషీకేశం కూడా టచ్ చేసి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు గాని, రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలియదు. పక్షులూ, జంతువులతో మాట్లాడ గలగడం వాస్తవానికి ఓ గడసరి విద్య. మేక కనపడితే గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగు!
'మే' అనకపోతే వాడి పారేసిన నీ చెప్పుల జోడు తెచ్చి నా మెడకు వేలాడ కట్టు!’
'అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే
'సర్కార్ల పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవే నంటావా ?' అని కాకి మూకల నడిగి చూడు! 'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు నుండిపోదు .. గ్యారంటీ ‘ అంయీ సోది కహానీలు మొదలుపెట్టేసిందీ వెధవ సూక్ష్మగ్రాహి అంతరాత్మ!
గలగల, వలవల, గడగడల్లాంటి జంటపదాలు మన తెలుగురచయితలకు మల్లే చెత్తచెత్తగా వాడే శక్తి పద్దస్తమానం 'కిచకిచ'లాడే పిచ్చుకమ్మకుందని దాని కోతలు! 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లో చదివే మీ బదుద్ధాయికి తెలీకపోవచ్చునేమో కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ వేసినా 'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లు చెప్పేస్తుందిట! కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో 'బుష్' నామధేయులు ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందని ఈ అంతరాత్మ ప్రబోధం! పార్వతీదేవికున్న పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని ఆవు తెలుసును. ఆ జ్ఞానం మనిషి జన్మ మహోదాత్తమైనదని అనుక్షణం ఉబ్బెత్తు ఛాతీలు తిప్పుకుంటూ తిరిగే మీ మనుషులకే ముందు తెలియాల్సి వుంది. ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ఏమంటారో ఏ క్రాష్ కోర్సులో చేరకముందే ఈజీగా తెలిసిపోయింది. చెప్పుకుంటు పోతే ఈ జంతు విజ్ఞానానికి ఆదీ.. అంతూ దొరకదు. కానీ ఆఖరుగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించకపొతే పశుపక్ష్య జాతులకు పూర్తి న్యాయం జరిపించినట్లు కాదు. నెమలీ ! నెమలీ ! ఈ మనిషిని గురించి జంతుజాలం ఏమనుకుంటున్నదో ఒక్క ముక్కలో చెప్పి ముగించమంటే
'క్రాక్' అంటూ ఇంచక్కా తోకూపుకుంటూ నిలబడుతుంది.' అని ముక్తాయించేసింది నా అంతరాత్మ.
నెమలిని అడ్డమేసుకుని తన మనసులోని ముక్కని అంతరాత్మ అట్లా బైటకు నెట్టేసిందన్న గుట్టు అర్థమముతూనే ఉంది.
మనిషికి తొలి శత్రువు ఎక్కడో లేడు. మన మనసులోనే ఓ మూల నక్కి ఉండి మనతోనే ప్రతిక్షణం దొంగ తిళ్లు తింటూ మనం కాక్స్ లా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం గమ్మునుండి పోతున్నాడు. దెబ్బతిని కిందపడితే మాత్రం ఇట్లా బైటికొచ్చి కుక్క మీదా నెమలి మీదా పెట్టి దెప్పుతుంటాడు. ఈ అంతరాత్మ కన్నా ఏ శత్రువు మాత్రం మనిషికి చేసే చెరుపేముందిక?
నిజమైన మిత్రుడే అయిఉంటే తప్పు చెయ్యక ముందే నచ్చ చెప్పి తిప్పలు తప్పించాలి కదా అంతరాత్మ! అందుకే పాలిటిక్సులో పైకి రావాలనుకునే మొండి నేతలు గుండెల్లోనే ఉండి పద్దస్తమానం ఘోష పెడుతుండే ఈ వెధవ అంతరాత్మలను అప్పోజిషన్ పార్టీ శాల్తీల కన్నా హీనంగా లెక్క గట్టి పురుగుల్లా చీదరించుకునేది*
- కర్లపాలెం హనుమంతరావు
( పెన్ పవర్ దినపత్రిక ప్రకాశం ఆదివారం సంచికలో ప్రచురణ )
No comments:
Post a Comment