Saturday, March 13, 2021

నరక బాధలు- -కర్లపాలెం హనుమంతరావు - సరదా కథానిక

 







చరవాణి గణగణ మోగుతున్నది. చిరాగ్గా అందుకున్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు చిటపటలాడిపోతున్నాడు అవతలి వైపు నుంచి. 'వరదలా పోటెత్తిపోతున్నాయి మహాప్రభో మానవాత్మలు! వీటితో వేగడం నా వల్ల కావడం లేదు. న్యాయ, చట్టం, హక్కులంటూ ఏవేవో కొత్త వాదనలతో తల బొప్పికట్టించేస్తున్నాయి. మన రాజ్యాంగం మాంధాతల కాలం నాడు రాసిందట! మార్చి తీరాల్సిందేనని మఠం వేసుక్కూర్చున్నాయి నరకం ఎంట్రీ దగ్గర! కొన్ని స్వర్గ ద్వారాలకు అడ్డంగా పడుకున్నాయి!' చిత్రగుప్తుడి గగ్గోలు.

'చచ్చి పైకొచ్చిన ఆత్మల పాప పుణ్యాల విచారణ చకచకా సాగితేనే కదా.. అవి యధాలోకాలకు వెళ్లి నరకంలో జాగా దొరికేది!'

'నిజమే కానీ ఆ ఇంగితం ఉంటే ఇన్నిన్ని ఒకే సారి ఇక్కడి కెందుకొచ్చిపడాతాయి? లోపలి ఆత్మలు బైటికి పోలేక, బైటి ఆత్మలు లోనికొచ్చే అవకాశం లేక చెకింగ్ పాయింట్సు దగ్గర పెద్ద స్టార్ల కొత్త సినిమా మొదటాట ముందుండే సినీ థియేటర్లను మించి నరకంగా ఉన్నాయి మహాప్రభో! కిం కర్తవ్యం?'

'మన కింకరాధములంతా అక్కడ ఏంచేస్తున్నారయ్యా?' హూంకరించాడు యమధర్మరాజు.

'అంతా ఆత్మల గుంపు మధ్యలో ఇరుక్కుపోయారు మహాప్రభో! ఎవరు కింకరుడో, ఎవడు పాపాత్మగల నరుడో .. తేడా తెలీకుండా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఏం చెయ్యమని సెలవు? సలహా కోసమే తమరికిలా ఫోన్ చెయ్యడం!'

'సలహాదారుడి నువ్వే కదయ్యా! ఆలోచింఛమని నన్ను శ్రమ పెట్టొద్దు' కంగారుపడ్డాడు యమధర్మరాజు.

'పోనీ నేరవిచారణాల్లాంటివేమీ లేకుండానే నేరుగా స్వర్గంలోకి తోసేద్దామా ప్రభూ! ఇప్పుడీ మోడల్ న్యాయవ్యవస్థకే కింది లోకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందిమరి! స్వర్గంలో కూడా బొత్తిగా పనీ పాటా లేక ఇంద్రాదులంతా కొత్త కొత్త బాలీవుడ్ మూవీలతో ఎంజాయ్ చేస్తున్నారు'

'త్రిమూర్తులు ఊరుకుంటారా పిచ్చి చిత్రగుప్తా! ఇంద్రుడు, కుబేరుళ్లాంటి కొద్ది మంది మీదే సర్వేశ్వరుల కెప్పుడూ కరుణా కటాక్షాలయ్యా బాబూ! సందెక్కడ దొరుకుతుందా.. నన్నీ పీఠం మీద నుంచి కిందకు లాగి తొక్కిపడేద్దామన్న అక్కసు బోలెడంత మందికుంది. ఆ మంద నిశ్శబ్దంగా ఊరుకుంటుందా?త్రి మూర్తుల బుద్ధి మాత్రం తిన్నగా ఉంటుదన్న గ్యారంటీ ఏముంది? చేసిన పాపాలకు కిందా శిక్షలుండక, పైనా శిక్షలు పడక దుర్మార్గులు తప్పించుకుంటే సన్మార్గం మీద ఇంకెవరికయ్యా ఆసక్తి మిగిలుండేదీ?'

 మన సమస్యలు ఎప్పుడూ చచ్చేవేగా!'

'ఎప్పటి మాదిరి సమస్యలయితే ఎప్పట్లానే డీల్ చేద్దుము ప్రభూ! ముక్కుతూ మూలుగుతూనే విధులు పాత పద్ధతుల్లో చక్కబెట్టడం న్యావ్యవస్థలకేం కొత్త కాదు గానీ ఎక్కడైనా! ఇప్పుడొచ్చిపడే కేసులను నా కోటి పుటల చిట్టాలోని ఏ ఒక్క ఆర్టికలూ పరిష్కరించేది కాదు మహాప్రభో! అన్నదాతలను, ఆడబిద్డలను, బ్యాంకు మదుపుదారుల్లాంటి అమాయక జీవులను యదానపెట్టుకునే  పాపాత్ములకు ఎలాంటి శిక్షలు అమలు చెయ్యాలో .. కరతలామలకం నాకు. కానీ కన్నబిడ్డ చెప్పకుండా పెళ్లి చేసుకుందని కక్ష కట్టి ఇంటల్లుడిని  కోటిచ్చి మరీ చంపించిన త్రాష్టులు విచారణకొస్తున్నారు. విచారించి తగు సమయంలో కఠినాతి కఠినమైన శిక్షలు వేసే కొలువులు చేపట్టీ.. చట్టంలోని లోసుగుల్ని చూపెట్టి దోషుల్నికాపాడే దుష్టులూ పైకొచ్చేస్తున్నారు విచారణలకు. పండంటి ఇద్దరు బిడ్డల తల్లై ఉండీ.. కొత్త మొగుడు మరోడుంటేనే పండగలా ఉంటుందని పాత మొగుడి తలపండు రోకలిబండతో బద్దలేసే ఇల్లాళ్లూ ఇక్కడ విచారణకొచ్చేస్తున్నారు మహాప్రభో!  ఏ పుటలో ఏ క్రిమినల్ కోడ్ సరైన శిక్షలు  సూచించిందో చూద్దామన్నా కన్నీళ్ల మధ్య ఒక్కక్షరం ముక్క కనిపించి చావడంలేదు..'

చిత్రగుప్తుడి గొంతులోని వణుకు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోంది 'చాలా గడుగ్గాయి ఆత్మలు తమకు బదులు తమ ప్లీడరు ఆత్మలను పంపి వాదనలు చేయిస్తున్నాయి! చేయని పుణ్యాలను క్లయిమ్ చేసే క్లయింట్లు కొంత మందైతే, చేసిన పాపాలను తాము నేరుగా  చెయ్యలేదని బుకాయింపులకు దిగే రువాబు ఆత్మలు వాటికి డబుల్! చచ్చి వచ్చినవాళ్లంతా చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటే.. విచారణ ప్రారంభించడమే చచ్చే చావుగా ఉంది. మరి ముగింపుకు స్వస్తి పలికేదెప్పుడో ముకుందుడికైనా తెలుస్తుందో లేదో..'

'విచారణ అయిందాకా నరకలోకంలోనే పడుంటారు కదా! మధ్యలో నీ కేంటయ్యా బాధ చిత్రగుప్తయ్యా?'

'బసే' పెద్ద సమస్యగా మారిందిప్పుడు మహాప్రభో! నేర నిర్దారణ అయిందాకా  అందరం మహాత్ముల కిందే లెక్క. అందాకా పుణ్యాత్మలకే స్వర్గ సుఖాలకు హక్కులుంటాయో .. మాకూ అవి దక్కి తీరాల్సిందే' అనే బ్యాచి ఎక్కువయిపోతోంది మహాప్రభో! సంఘాలు కడుతున్నాయి ప్రేతాత్మలు. మన నరక చట్టాల మీద వాటికే మాత్రం ఖాతరీ లేదు. ఆ నాస్తికులతో కల్సిపోయి మన పిచ్చి కుంకలు కింకరులు కూడా సంకరమయిపోతున్నారు  అరివీరభయంకరా! ఏమి చెయ్యమని సెలవు?'

' సలహాదారుడంటే సమస్యలు ఏకరువు పెట్టడం వరకేనా? పరిష్కారాలు కనిపెట్టే పనిలేదా?' గయ్యిఁ మన్నాడు యమధర్మరాజు మరేం చెయ్యాలో పాలుపోక.

'అన్నమాట ఎలాగూ అన్నారు. మరో ఉన్నమాటా సెలవిచ్చుకుంటాను సమవర్తీ! స్థల, వ్యవసస్థలే కాదు ప్రస్తుత సమస్యలు, వనరులు కూడా క్రమంగా అడుగంటిపోతున్నవి మహాత్మా!' చిత్రగుప్తుల వారి ముక్కు చీదుడు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోన్నది.

'సర్దుకో.. సర్దుకో! కలహభోజనుడు ఇటే వస్తున్నాడు. ఆ మహానుభావుడి చెవిన గాని బడితే మన పరువు వైతరణిలో కలిసిపోడం ఖాయం' చరవాణి చటుక్కున కట్టేశాడు యమధర్మరాజు కంగారుగా.

'నారాయణ.. నారాయణ! నా మీదనేనా నాయనా వ్యంగ్యబాణాలు! నరక లోక వైతరణికి పుష్కరాలొచ్చినట్లున్నాయే.. జీవాత్మల తాకిడి ఎక్కువైందీ! చిత్రగుప్తుల వారితో సహా తమరంతా విచారణలెలా చెయ్యాలో దిక్కు తోచక  గుడ్లుతేలేసారని   ముల్లోకాల్లోనూ నవ్వుకుంటున్నారయ్యా! ముందా పరిహాసాల సంగతి చూసుకో యమధర్మరాజా!'

'సంక్షోభంలో ఉన్నాం. హాస్యానికి ఇదా సందర్భం నారదా!'

సంక్షోభం నుంచే సంక్షేమం రాబట్టుకోవాలయ్యా పిచ్చి యమధర్మరాజా! ఇన్ని సార్లు టాలీవుడ్డెళ్లి వాళ్ల టాకీలల్లో నటించొచ్చావే! భూలోక వాసులను చూసైనా నేర్చుకోరాదా?'

'సినిమాలు వేరు. పాలనలు వేరు. మాది వనరుల  సమస్య మహర్షి నారదా! భారీగా పెరిగిపోతోందిక్కడ పాపాత్మల జనాభా!నిభాయించుకురావడ మెలాగో తేలకే..'

'దీనికే ఇలా దిగాలుబడితే ఎలాగయ్యా పిచ్చిరాజా! ముందున్నది ముసళ్ల పండుగ! భూలోకంలో కరోనా అని ఓ కొత్త ముసలం బైలుదేరింది.  ఇంకో రెండు నరకాలు నువ్వు అద్దెకు తెచ్చుకున్నా చాలని పరిస్థితి..'

'బెదరగొట్టకపోతే.. బయటపడే దారేదో చూపించి పోరాదా నారాదా!'

'భూలోకాన్ని మించిన పాప్యులేషన్ టయ్యా నీ బోడి నరకానిది? దేశాలుపట్టి పోయిన వాళ్లు పోగా  ఇప్పటికీ ప్రపంచంలో అయిదో వంతు జనాభాకి భారద్దేశమే వసతిగృహం, విడిదిగృహం. జనాభానే నిజంగా సంక్షోభానిక్కారణమయితే పొరుగునున్న చైనాతో అది పోటీ పడ్డమెందుకు? వరదల నుంచి వడగళ్ల దాకా, హత్యల నుంచి  రాజకీయ కక్షల దాకా, ఎబోలా, కరోనా లాంటి రోగాలు రొప్పులతో మీ దగ్గరి కొచ్చి పడే శాల్తీల శాతమెంతో తెలుసా?ముష్టి ఒక్కటి. ఆ ఒక్క శాతానికే నువ్వింతలా  బిక్కమొగమేస్తున్నావే! తతిమ్మా తొంభై తొమ్మిది మందితో కింది లోకాలు ఎలా వెలుగొందిపోతున్నాయో .. ముందో సారి కళ్లకు చుట్టూ ఇదిగో ఈ అంజనం పులుముకుని మరీ బాగా పరికించి చూడూ!'

'అబ్బా! గొంది గొందికి బృందావనాలు! సందు సందుకీ మధ్యన సందు లేకుండా జనాల సందళ్లు! ఎవడి కడుపు చూసినా బాన షేపు, ఎవతె తలను చూసినా నెత్తిన గోల్డు కొప్పు, ఏ బుడ్డోడి జేబు తడిమినా స్మార్ట్ ఫోను, ముసిలోడి పక్కన చూసినా సింగపూరు సిగారు! ఏట్లా సాధ్యమయిందంటావ్ ఇంత అసాధ్యమైన లీల! ఒక్కసారి ఆ తారక మంత్రమూ నా చెవిన వేసి పోరాదయ్యా నారదా?'

'బావుంది. అట్లా మర్యాదగా అడిగావు కనక చెప్పబుద్ధవుతుంది. ఓ సారి నీ  చెవ్విటు పారేయ్'

'…………'

'ఆర్నీ! అదా సంగతి! అర్థమయింది  మహర్షీ.. కష్టం గట్టెక్కే పద్ధతి! 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్!'  అని ఇప్పుటిగ్గాని మా మట్టి  బుర్రలకు తట్టింది కాదు. మా దగ్గర పేరుకుపోతోన్న నరాత్మలతో వనరుల సాధనెలాగో ఇప్పుడో దారి దొరికింది. '

'శుభం! ఎలాగూ జమిలి  ఎన్నికల గంట  ఏ క్షణంలోనైనా మోగవచ్చు.  ఈ మధ్యలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల సహకార బ్యాంకుల నుంచి.. రాష్ట్ర స్థాయిలో పురపాలక సంఘాలు వంటి వాటికి పోటీలు తప్పవంటున్నాయి. ఎన్నిక ఏదయినా ఎన్నో చేతులు అవసరం. బూతుల్లోపల.. బైటా కూడా చేతులతోనే అవసరం. ఓటు యంత్రం మీటలు నొక్కాలి. ఓట్ల ప్రచారంలో రాళ్లేయాలి.  గుర్రాల మీద ఎక్కించి వూరేగడం ఓల్డ్ ఫ్యాషన్. నేరుగా కొని తెచ్చుకున్న  కార్యకర్తల భుజాల మీదెక్కి ఊరేగినప్పుడే బోలెడంత కిక్కు. మొన్నీ మధ్య అమెరికా ట్రంపొచ్చినప్పుడు కూడా కోట్లాది మంది జమకూడక పోయుంటే మన పరువు గంగలో కలసిపోయుండేది. '

'ముందు భూలోకంలోని ఈ బ్రోకర్లతో కనెక్షన్లు పెట్తుకోవయ్యా!ఒక్క నరకమేంటి  మరో నాలుగు రకాల నరకాలకు సరిపడా వనరులు వాళ్లే సమకూర్చి పెడతారు. '

'ధన్యవాదాలు నారద మహర్షీ!'

'నారాయణ! నారాయణ! అన్నట్లు ఆ కమ్యూనిస్టు నారాయణ పుసుక్కున ఏదో అని ప్లానంతా పాడు చేసే లోపలే కార్యరంగంలోకీ దూకు'

***

 

ఆచార్యదేవోభవ! ఉపాధ్యాయ దినోత్సవం - కర్లపాలెం హనుమంతరావు

 







 'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు







కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

(ఈనాడు, 05-09-2009)

 

పశురాజ్యం పార్టీ వర్ధిల్లాలి! – సరదాకే -కర్లపాలెం హనుమంతరావు

 


'' ఫర్ 'ఏపిల్' ఏంటి..విడ్డూరంగా! '' ఫర్ 'ఎనిమల్'..'బి' ఫర్ బఫెల్లో.. 'సి' ఫర్ కౌ..'డి' ఫర్ డాంకీ..ఇలా ఏవైనా జంతువుల పేర్లు పెట్టుకోవచ్చుగా ! తమరి ఆత్మ గౌరవానికి భంగమా?

అబ్బో! 'మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఏనిమల్' అని మళ్లీ మీరేగా లెక్చర్లు దంచేదీ! అంటే 'ఏనిమల్ ఈజ్ ఆల్సో  ఏ సోషల్ మ్యాన'నేగా అంతరార్థం?

ఎదుకో ఆ చిరాకూ? తమరు పడీ పడీ  దణ్ణాలూ దస్కాలూ పెట్టుకునే దేవుళ్ళందర్నీ వీపుల మీదెక్కించుకుని ఊరేగించే దెవరూ? మేం కాదూ! ఆదిదేవుడికి వాహనం మా మహానంది. ఆ నందిని బంగారంతో తాపడం చేసందిస్తే సరి.. మా షోగ్గా  షోకేసుల్లో దాచేసుకుని తెగ మురిసానందిస్తారు! నిజం నందిని మాత్రం పంది కన్నా హీనంగా ఇంటెనకాల గొడ్లచావిట్లో మురికి గుంటల మధ్య బందీ చేస్తారు. దాని నోటి కాడ గడ్డిని మీరు మేస్తారు. పేరు వినీ వినగానే తమరికి ముచ్చెమటలు పోస్తాయే..   మృత్యు దేవత యమధర్మరాజా వారి వాహనం ఏదీ? ఎనుబోతు. కాలయముణ్ణి చూస్తే కాళ్ళు వణుకుడూనూ.. మా దున్నపోతును చూస్తే చిన్న చూపూనా! అందుకే  మీ  మనుషులందరిదీ ద్వంద్వ నీతనేది.

మీకన్నా మేమెందులో తీసిపోయామో! కులాలు, మతాలు, రంగులు, హంగులు అంటూ మీలో మీకే ఎన్న్ని అంట్లూ..సొంట్లు! పేరుకే మా నెత్తిమీదవి కొమ్ములు. అసలు కుమ్ముళ్లన్నీ రక రకాల  పార్టీల పేర్లతో  మీవి. పైపెచ్చు మీ రొచ్చు కీచులాటల మధ్యలోకి ఏ సొమ్మూ సంబధం లేకపోయినా 'ఎద్దులూ.. మొద్దులూ..దున్నపోతులూ.. గొడ్దుమోతులూ' అంటో  మా పేర్లు లాక్కొచ్చి  తిట్లూ.. శాపనార్థాలా!

మా సాయం లేకపోతే మీ వ్యవసాయం క్షణం ముందుకు సాగదు. మేం కాడిని వదిలేస్తే  మీ బండి గజం ముందుకు నడవదు. మా దూడల్ని  దూరంగా నెట్టేసి మా పాలు మీరు కాఫీలు టీనీళ్ళకు వాడేసుకుంటున్నా.. పోనీలే పాపం.. మీ పాపానికి మీరే పోతారని చూసీ చూడనట్లు పోతూ ఉంటే..  మా పోతులంటే మీకింత అలుసా?

 మా గొడ్డూ గోదా గాని రోడ్డు కడ్డం పడితే మీ బుల్లెట్ ప్రూఫులూ, బుగ్గ కార్లూ ఒక్కంగుళం ముందుకు జరగ్గలవా? తోక ముండిచిందాకానే మేం గంగి గోవులం.  లిక్కరు పాకెట్లకు .. చిల్లర నోట్లకు.. కుక్కల్లా తోకూపే మీ బక్క ఓటర్లం కాం మేం! చెత్తనేతల మీద విసుగెత్తున్న  జనం విసిరే పాత జోళ్లలోనుంచీ మా నిరసనలు  వినిపిస్తునే ఉంటాం.

అక్కరయిన దాకా మాకు దణ్నాలు దస్కాలు. అక్కర తీరినాక  గొడ్దుమోతులని ఎకసెక్కాలా? పుష్టిగా ఉన్నంత కాలం మా పుష్టభాగాల క్కూడా పూజలూ.. పునస్కారాలు. కాస్త ఈడిగిల పడితే చాలు కబేళాలకు ఈడ్చి పారేయడాలా?! మీ కడుపుకిన్ని తిండి గింజ లందించే అన్నదాతలమే.. మానోటి కాడి ఎండుగడ్డి కాడ క్కూడా పాలుమాలుతారా? నేతంటే మోతగా మేత మేసేవాడనేనా మీ అర్థం? మా కాలి గిట్టల్నుంచీ నెత్తిమీది కొమ్ముల్దాకా దేన్నీ వదిలి పెట్టరా  మీరు! అచ్చమైన  పచ్చి వ్యాపారానికి అచ్చుపోసిన శాల్తీలు మీరు.

సిగ్గు ఎగ్గు లేకుండా నడి బజారులో మీరు నిలబెట్టే  బడిత బొమ్మల మానం పేడముద్దల మాటున దాచి కాచి కాపాడే శ్రీకృష్ణ పరమాత్ములం మేం. మేం నోరు చేసుకోబట్టే  మీ వీధులు చెత్తకుండీల కన్నా మెరుగ్గా ఉంటున్నాయి. బ్రిటన్ మహారాణి విక్టోరియా మ్యాడం కన్నా ఎక్కువ గ్లామరున్న మూగ జీవాలం మేం. మీ అభిమాన నటవిరాట్టులు గ్రాఫిక్సుల్లోఎన్ని  కుప్పిగంతులు వేసినా రావడం లేదు హిట్లు. మేం మాత్రం ఇలా కాస్త తోకలు  కదిలించినా చాలు చప్పట్లే చప్పట్లు. కోట్లే కోట్లు.

మాతోనే మీకు  అక్కర తప్ప మీరు తిని పారేసిన అరటి తొక్కతో కూడా మాకు  అవసరం పడదు. ఎన్నికల్లో మీకు మేమే పార్టీ గుర్తులం. మీ ఎన్నికల  ప్రచారాల హోరుకీ  మళ్ళీ మేమే ఆసరా. మీరు బాదే డోళ్ళు చచ్చినాకా మాట్లాడే మా వంటి తోళ్ళ నోళ్ళే. మీ మీ అధిష్ఠానాల ముందు మీరు ఊదే బూరాలు మా కొమ్ములు విజయ గర్వంతో చేసే హాహాకారాలు. మీకూ  మాకూ తేడా ఏముంది?మీరు చేతుల్తో వీపులు తోముకో గలరు. మేం తోముకోలేం. మేం తోకల్తో ఈగలు తోలుకోగలం. మీరు  తోలుకొంటారా?

ప్రజాసేవలో మేము మీరెన్నుకున్న ప్రతినిథులకన్నా ఎన్నో రెట్లు మెరుగు జీవులం. దున్నేకాలంలో దూరం పోయి.. కాసే కాలంలో కోడవలి తెచ్చే భడవలం కాం మేం. మాతో మీకు వారసత్వం పేచీ రాదు. కుంభకోణాల గోల ఉండదు.

పశువులనీ.. మనుషులనీ విభజించి చూస్తున్నారు చూడండీ..అదే సబబైన పద్దతి కాదన్నదే మా ఆవేదన. జనాభా లెక్కలు తీసినప్పుడల్లా 'ఓహో వందా పాతిక కోట్లు దాటేసిందండోయి  దేశ జనాభా'అంటో  ఒహటే దండోరా. అందులో అందరూ మనుషులే ఉన్నారా? నిజాయితీగా లెక్కలు తీసి చూడండి! మెజారిటీ మా పశువుల జాతిదే!  మీ మందల్ల్ల్లో మా పశువులెన్ని కలిసున్నాయో లెక్క లు తేలాలి ముందు. మా పోరాటం ఆ దిశగా సాగేందుకే ఈ మా కొత్త పార్టీ. దేశ జనాభాలో మెజార్టీ మా పశువులే అయినప్పుడు మీ  పాడు మనుషులకేల ఊడిగం చేయాలన్నది మా వాదన.

ఒకప్పటి ఉత్తర ప్రదేశ్ అమాత్యవర్యులు అజం ఖాన్ గారి రాంపూర్  బందిల దొడ్దినుంచి ఈ మధ్యనే స్వేచ్చా ప్రపంచంలోకొచ్చి పోయాయి  ఏడు ఎనుబోతులు. ఆ చైతన్యమూర్తులు స్ఫూర్తితోనే  మేమూ అర్జంటుగా ఓ ఫ్రంటును కట్టే ఏర్పాట్లలో ఉన్నాం. దేశ జనాభాలో   దామాషా ప్రకారం చూసుకున్నా అధికార పీఠం మా పశుజాతికే దక్కడం న్యాయం. శతాబ్దాలు గడిచి పోతున్నా మా పశుభాషకు ఇంకా అధికార హోదానే దక్క లేదు. 

ఏ సేవలూ అందించకుండానే ఎన్నికల్లో నిలబడి ఎందరో  ప్రజానాయకులుగా తయార వుతున్నారు. మేం మాత్రం ప్రజాసేవలో  ఎవరికి తీసి పోయాం?  తేనీరు అమ్మే మనిషి ప్రధాని పదవికి పోటీ పడుతుండగా లేనిది.. తేనీటిలోకి పాలందించే పశువులం అధికారంలో మా పాలు కోరుకోవడంలో తప్పేముంది? రాబోయే ఎన్నికల్లో మా  పశుజాతి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇదే తగిన అదనని అభిప్రాయ పడుతున్నాం.

ఇప్పుడున్నవన్నీ నకిలీ పశుప్రభుత్వాలు.అసలైనపశువుల పాలనెలా ఉంటుందో ఒక అవకాశమొస్తే రుచి చూపిస్తాం.

ఇల్లంతా యథేచ్చగా  కలాపులు చల్లుకోవడానికి  గోమయం ఉచితంగా సరఫరా చేస్తాం. ఏడాదికి వంద పిడకలు సబ్సిడీ ధరలో ఆడపడుచులకు అంద చేస్తాం. పిల్లా జెల్లాకు నీళ్లు కలపని పాలు గొడ్లు ఇళ్లముందే  పిదికిచ్చి పోయే ఉచిత  పథకాలు ప్రవేశ పెడతాం. ఇంటింటికీ ఒక 'స్టేటాఫ్ ఆర్ట్' గొడ్ల చావిడి.. పండగ రోజుల్లో పుణ్య సంపాదనకు భక్తుల సన్నిధానికే సుష్టైన పుష్టభాగాలున్న గోదేవతల తరలింపు ఇవీ మాకు మాత్రమే సాధ్యమయిన సేవా పథకాలు. గద్దె నెక్కే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి! మా గొడ్డు గోదా నుంచి వీలైనంత సహకారం రాబట్టి ప్రజాసేవను ఇంకెన్ని విధాల మెరుగు పరచాలో పశుప్రేమికులనుంచి సూచనలు కోరి అమలు చేసే  దిశగా మరింత అంకితభావంతో మా వంతు ప్రయత్నాలు విధిగా చేస్తాం.

చెత్త నేతల పాలనతో విసుగెత్తి ఉన్న ఓటరు మహాశయులారా! 'ఏమో.. దున్న ఎగరా వచ్చు!' అన్న ఒకే  ఒక్క నమ్మకంతో   మాకూ ‘ఒక  అవకాశం’ ఇచ్చి చూడమని ప్రార్తన!

అంబే.. పశు రాజ్యం పార్టీ!  అంబే.. అంబే!

 దున్నపోతుల ప్రభుత్వం! అంబే.. అంబే .

ఎనుబోతుల నాయకత్వం! అంబే..అంబే!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...