Saturday, March 13, 2021

నరక బాధలు- -కర్లపాలెం హనుమంతరావు - సరదా కథానిక

 







చరవాణి గణగణ మోగుతున్నది. చిరాగ్గా అందుకున్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు చిటపటలాడిపోతున్నాడు అవతలి వైపు నుంచి. 'వరదలా పోటెత్తిపోతున్నాయి మహాప్రభో మానవాత్మలు! వీటితో వేగడం నా వల్ల కావడం లేదు. న్యాయ, చట్టం, హక్కులంటూ ఏవేవో కొత్త వాదనలతో తల బొప్పికట్టించేస్తున్నాయి. మన రాజ్యాంగం మాంధాతల కాలం నాడు రాసిందట! మార్చి తీరాల్సిందేనని మఠం వేసుక్కూర్చున్నాయి నరకం ఎంట్రీ దగ్గర! కొన్ని స్వర్గ ద్వారాలకు అడ్డంగా పడుకున్నాయి!' చిత్రగుప్తుడి గగ్గోలు.

'చచ్చి పైకొచ్చిన ఆత్మల పాప పుణ్యాల విచారణ చకచకా సాగితేనే కదా.. అవి యధాలోకాలకు వెళ్లి నరకంలో జాగా దొరికేది!'

'నిజమే కానీ ఆ ఇంగితం ఉంటే ఇన్నిన్ని ఒకే సారి ఇక్కడి కెందుకొచ్చిపడాతాయి? లోపలి ఆత్మలు బైటికి పోలేక, బైటి ఆత్మలు లోనికొచ్చే అవకాశం లేక చెకింగ్ పాయింట్సు దగ్గర పెద్ద స్టార్ల కొత్త సినిమా మొదటాట ముందుండే సినీ థియేటర్లను మించి నరకంగా ఉన్నాయి మహాప్రభో! కిం కర్తవ్యం?'

'మన కింకరాధములంతా అక్కడ ఏంచేస్తున్నారయ్యా?' హూంకరించాడు యమధర్మరాజు.

'అంతా ఆత్మల గుంపు మధ్యలో ఇరుక్కుపోయారు మహాప్రభో! ఎవరు కింకరుడో, ఎవడు పాపాత్మగల నరుడో .. తేడా తెలీకుండా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఏం చెయ్యమని సెలవు? సలహా కోసమే తమరికిలా ఫోన్ చెయ్యడం!'

'సలహాదారుడి నువ్వే కదయ్యా! ఆలోచింఛమని నన్ను శ్రమ పెట్టొద్దు' కంగారుపడ్డాడు యమధర్మరాజు.

'పోనీ నేరవిచారణాల్లాంటివేమీ లేకుండానే నేరుగా స్వర్గంలోకి తోసేద్దామా ప్రభూ! ఇప్పుడీ మోడల్ న్యాయవ్యవస్థకే కింది లోకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందిమరి! స్వర్గంలో కూడా బొత్తిగా పనీ పాటా లేక ఇంద్రాదులంతా కొత్త కొత్త బాలీవుడ్ మూవీలతో ఎంజాయ్ చేస్తున్నారు'

'త్రిమూర్తులు ఊరుకుంటారా పిచ్చి చిత్రగుప్తా! ఇంద్రుడు, కుబేరుళ్లాంటి కొద్ది మంది మీదే సర్వేశ్వరుల కెప్పుడూ కరుణా కటాక్షాలయ్యా బాబూ! సందెక్కడ దొరుకుతుందా.. నన్నీ పీఠం మీద నుంచి కిందకు లాగి తొక్కిపడేద్దామన్న అక్కసు బోలెడంత మందికుంది. ఆ మంద నిశ్శబ్దంగా ఊరుకుంటుందా?త్రి మూర్తుల బుద్ధి మాత్రం తిన్నగా ఉంటుదన్న గ్యారంటీ ఏముంది? చేసిన పాపాలకు కిందా శిక్షలుండక, పైనా శిక్షలు పడక దుర్మార్గులు తప్పించుకుంటే సన్మార్గం మీద ఇంకెవరికయ్యా ఆసక్తి మిగిలుండేదీ?'

 మన సమస్యలు ఎప్పుడూ చచ్చేవేగా!'

'ఎప్పటి మాదిరి సమస్యలయితే ఎప్పట్లానే డీల్ చేద్దుము ప్రభూ! ముక్కుతూ మూలుగుతూనే విధులు పాత పద్ధతుల్లో చక్కబెట్టడం న్యావ్యవస్థలకేం కొత్త కాదు గానీ ఎక్కడైనా! ఇప్పుడొచ్చిపడే కేసులను నా కోటి పుటల చిట్టాలోని ఏ ఒక్క ఆర్టికలూ పరిష్కరించేది కాదు మహాప్రభో! అన్నదాతలను, ఆడబిద్డలను, బ్యాంకు మదుపుదారుల్లాంటి అమాయక జీవులను యదానపెట్టుకునే  పాపాత్ములకు ఎలాంటి శిక్షలు అమలు చెయ్యాలో .. కరతలామలకం నాకు. కానీ కన్నబిడ్డ చెప్పకుండా పెళ్లి చేసుకుందని కక్ష కట్టి ఇంటల్లుడిని  కోటిచ్చి మరీ చంపించిన త్రాష్టులు విచారణకొస్తున్నారు. విచారించి తగు సమయంలో కఠినాతి కఠినమైన శిక్షలు వేసే కొలువులు చేపట్టీ.. చట్టంలోని లోసుగుల్ని చూపెట్టి దోషుల్నికాపాడే దుష్టులూ పైకొచ్చేస్తున్నారు విచారణలకు. పండంటి ఇద్దరు బిడ్డల తల్లై ఉండీ.. కొత్త మొగుడు మరోడుంటేనే పండగలా ఉంటుందని పాత మొగుడి తలపండు రోకలిబండతో బద్దలేసే ఇల్లాళ్లూ ఇక్కడ విచారణకొచ్చేస్తున్నారు మహాప్రభో!  ఏ పుటలో ఏ క్రిమినల్ కోడ్ సరైన శిక్షలు  సూచించిందో చూద్దామన్నా కన్నీళ్ల మధ్య ఒక్కక్షరం ముక్క కనిపించి చావడంలేదు..'

చిత్రగుప్తుడి గొంతులోని వణుకు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోంది 'చాలా గడుగ్గాయి ఆత్మలు తమకు బదులు తమ ప్లీడరు ఆత్మలను పంపి వాదనలు చేయిస్తున్నాయి! చేయని పుణ్యాలను క్లయిమ్ చేసే క్లయింట్లు కొంత మందైతే, చేసిన పాపాలను తాము నేరుగా  చెయ్యలేదని బుకాయింపులకు దిగే రువాబు ఆత్మలు వాటికి డబుల్! చచ్చి వచ్చినవాళ్లంతా చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటే.. విచారణ ప్రారంభించడమే చచ్చే చావుగా ఉంది. మరి ముగింపుకు స్వస్తి పలికేదెప్పుడో ముకుందుడికైనా తెలుస్తుందో లేదో..'

'విచారణ అయిందాకా నరకలోకంలోనే పడుంటారు కదా! మధ్యలో నీ కేంటయ్యా బాధ చిత్రగుప్తయ్యా?'

'బసే' పెద్ద సమస్యగా మారిందిప్పుడు మహాప్రభో! నేర నిర్దారణ అయిందాకా  అందరం మహాత్ముల కిందే లెక్క. అందాకా పుణ్యాత్మలకే స్వర్గ సుఖాలకు హక్కులుంటాయో .. మాకూ అవి దక్కి తీరాల్సిందే' అనే బ్యాచి ఎక్కువయిపోతోంది మహాప్రభో! సంఘాలు కడుతున్నాయి ప్రేతాత్మలు. మన నరక చట్టాల మీద వాటికే మాత్రం ఖాతరీ లేదు. ఆ నాస్తికులతో కల్సిపోయి మన పిచ్చి కుంకలు కింకరులు కూడా సంకరమయిపోతున్నారు  అరివీరభయంకరా! ఏమి చెయ్యమని సెలవు?'

' సలహాదారుడంటే సమస్యలు ఏకరువు పెట్టడం వరకేనా? పరిష్కారాలు కనిపెట్టే పనిలేదా?' గయ్యిఁ మన్నాడు యమధర్మరాజు మరేం చెయ్యాలో పాలుపోక.

'అన్నమాట ఎలాగూ అన్నారు. మరో ఉన్నమాటా సెలవిచ్చుకుంటాను సమవర్తీ! స్థల, వ్యవసస్థలే కాదు ప్రస్తుత సమస్యలు, వనరులు కూడా క్రమంగా అడుగంటిపోతున్నవి మహాత్మా!' చిత్రగుప్తుల వారి ముక్కు చీదుడు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోన్నది.

'సర్దుకో.. సర్దుకో! కలహభోజనుడు ఇటే వస్తున్నాడు. ఆ మహానుభావుడి చెవిన గాని బడితే మన పరువు వైతరణిలో కలిసిపోడం ఖాయం' చరవాణి చటుక్కున కట్టేశాడు యమధర్మరాజు కంగారుగా.

'నారాయణ.. నారాయణ! నా మీదనేనా నాయనా వ్యంగ్యబాణాలు! నరక లోక వైతరణికి పుష్కరాలొచ్చినట్లున్నాయే.. జీవాత్మల తాకిడి ఎక్కువైందీ! చిత్రగుప్తుల వారితో సహా తమరంతా విచారణలెలా చెయ్యాలో దిక్కు తోచక  గుడ్లుతేలేసారని   ముల్లోకాల్లోనూ నవ్వుకుంటున్నారయ్యా! ముందా పరిహాసాల సంగతి చూసుకో యమధర్మరాజా!'

'సంక్షోభంలో ఉన్నాం. హాస్యానికి ఇదా సందర్భం నారదా!'

సంక్షోభం నుంచే సంక్షేమం రాబట్టుకోవాలయ్యా పిచ్చి యమధర్మరాజా! ఇన్ని సార్లు టాలీవుడ్డెళ్లి వాళ్ల టాకీలల్లో నటించొచ్చావే! భూలోక వాసులను చూసైనా నేర్చుకోరాదా?'

'సినిమాలు వేరు. పాలనలు వేరు. మాది వనరుల  సమస్య మహర్షి నారదా! భారీగా పెరిగిపోతోందిక్కడ పాపాత్మల జనాభా!నిభాయించుకురావడ మెలాగో తేలకే..'

'దీనికే ఇలా దిగాలుబడితే ఎలాగయ్యా పిచ్చిరాజా! ముందున్నది ముసళ్ల పండుగ! భూలోకంలో కరోనా అని ఓ కొత్త ముసలం బైలుదేరింది.  ఇంకో రెండు నరకాలు నువ్వు అద్దెకు తెచ్చుకున్నా చాలని పరిస్థితి..'

'బెదరగొట్టకపోతే.. బయటపడే దారేదో చూపించి పోరాదా నారాదా!'

'భూలోకాన్ని మించిన పాప్యులేషన్ టయ్యా నీ బోడి నరకానిది? దేశాలుపట్టి పోయిన వాళ్లు పోగా  ఇప్పటికీ ప్రపంచంలో అయిదో వంతు జనాభాకి భారద్దేశమే వసతిగృహం, విడిదిగృహం. జనాభానే నిజంగా సంక్షోభానిక్కారణమయితే పొరుగునున్న చైనాతో అది పోటీ పడ్డమెందుకు? వరదల నుంచి వడగళ్ల దాకా, హత్యల నుంచి  రాజకీయ కక్షల దాకా, ఎబోలా, కరోనా లాంటి రోగాలు రొప్పులతో మీ దగ్గరి కొచ్చి పడే శాల్తీల శాతమెంతో తెలుసా?ముష్టి ఒక్కటి. ఆ ఒక్క శాతానికే నువ్వింతలా  బిక్కమొగమేస్తున్నావే! తతిమ్మా తొంభై తొమ్మిది మందితో కింది లోకాలు ఎలా వెలుగొందిపోతున్నాయో .. ముందో సారి కళ్లకు చుట్టూ ఇదిగో ఈ అంజనం పులుముకుని మరీ బాగా పరికించి చూడూ!'

'అబ్బా! గొంది గొందికి బృందావనాలు! సందు సందుకీ మధ్యన సందు లేకుండా జనాల సందళ్లు! ఎవడి కడుపు చూసినా బాన షేపు, ఎవతె తలను చూసినా నెత్తిన గోల్డు కొప్పు, ఏ బుడ్డోడి జేబు తడిమినా స్మార్ట్ ఫోను, ముసిలోడి పక్కన చూసినా సింగపూరు సిగారు! ఏట్లా సాధ్యమయిందంటావ్ ఇంత అసాధ్యమైన లీల! ఒక్కసారి ఆ తారక మంత్రమూ నా చెవిన వేసి పోరాదయ్యా నారదా?'

'బావుంది. అట్లా మర్యాదగా అడిగావు కనక చెప్పబుద్ధవుతుంది. ఓ సారి నీ  చెవ్విటు పారేయ్'

'…………'

'ఆర్నీ! అదా సంగతి! అర్థమయింది  మహర్షీ.. కష్టం గట్టెక్కే పద్ధతి! 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్!'  అని ఇప్పుటిగ్గాని మా మట్టి  బుర్రలకు తట్టింది కాదు. మా దగ్గర పేరుకుపోతోన్న నరాత్మలతో వనరుల సాధనెలాగో ఇప్పుడో దారి దొరికింది. '

'శుభం! ఎలాగూ జమిలి  ఎన్నికల గంట  ఏ క్షణంలోనైనా మోగవచ్చు.  ఈ మధ్యలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల సహకార బ్యాంకుల నుంచి.. రాష్ట్ర స్థాయిలో పురపాలక సంఘాలు వంటి వాటికి పోటీలు తప్పవంటున్నాయి. ఎన్నిక ఏదయినా ఎన్నో చేతులు అవసరం. బూతుల్లోపల.. బైటా కూడా చేతులతోనే అవసరం. ఓటు యంత్రం మీటలు నొక్కాలి. ఓట్ల ప్రచారంలో రాళ్లేయాలి.  గుర్రాల మీద ఎక్కించి వూరేగడం ఓల్డ్ ఫ్యాషన్. నేరుగా కొని తెచ్చుకున్న  కార్యకర్తల భుజాల మీదెక్కి ఊరేగినప్పుడే బోలెడంత కిక్కు. మొన్నీ మధ్య అమెరికా ట్రంపొచ్చినప్పుడు కూడా కోట్లాది మంది జమకూడక పోయుంటే మన పరువు గంగలో కలసిపోయుండేది. '

'ముందు భూలోకంలోని ఈ బ్రోకర్లతో కనెక్షన్లు పెట్తుకోవయ్యా!ఒక్క నరకమేంటి  మరో నాలుగు రకాల నరకాలకు సరిపడా వనరులు వాళ్లే సమకూర్చి పెడతారు. '

'ధన్యవాదాలు నారద మహర్షీ!'

'నారాయణ! నారాయణ! అన్నట్లు ఆ కమ్యూనిస్టు నారాయణ పుసుక్కున ఏదో అని ప్లానంతా పాడు చేసే లోపలే కార్యరంగంలోకీ దూకు'

***

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...