Thursday, December 31, 2015

శునక పురాణం- ఓ సరదా గల్పిక




 




కుక్కలమీద కథలు సరదాగానే ఉంటాయి. కక్కకథే చేదు. ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు సృష్టిలో. ఎవరికీ లేని కడగండ్లు మా కుక్కజాతికే!కుక్కలంటే విశ్వాసానికి మారుపేరు అంటారు. మంచిమాటే. కానీ మా విశ్వాసానికి వీసమెత్తైనా విలువేదీ?

మా జంతుజాలం దృష్టిలో మనుషులంతా పాతసినిమా రాజనాలలు. సూర్యకాంతాలు. కుక్క కంటబడితే చాలు  రాళ్లతోనో, కర్రలతోనో  కొట్టాలని మీకు మహా కుతి. ఆత్మరక్షణకోసం మేం కాస్త నోరు చేసుకొన్నామా.. ‘పిచ్చికుక్క’ అని ముద్దరేసి  మరీ వేపుకుతింటారు. మున్సిపాల్టీ బండ్లకోసం పరుగులు పెడతారు!

మా కుక్కలు.. వరాహసోదరులు.. నోరు చేసుకోకుంటే మీ స్వచ్చభారతులు ఎంత కంపుకొట్టేవో! ఆ విశ్వాసమైనా లేని కృతఘ్నులు మీ మనుషులు!

కుక్కకష్టాలు  ఒక్క మనుషులతోనే కాకపోవచ్చు !  కుక్కలకే కుక్కలంటే పడి చావదన్నమాటా నిజమే కావచ్చు.  కాని .. ఆ దొబ్బుతెగుళ్ళన్నీ మీ పొలిటీషియన్లని, టీవీ సోపుల్ని  చూసే  అబ్బుంటాయని నా డౌటు.

'అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. .. సబ్బుబిళ్ల కాదేదీ కవిత కనర్హం' ఆహాహా! ఎంత గొప్పగాచెప్పాడండీ  మీ మహాకవి! ఆ మహానుభావుడికేమో మెమొంటోలు..  చప్పట్లు! మా మీదకు మాత్రం రాళ్ళూ  రప్పలు! మీ హిపోక్రసీని చూస్తే ఎంత బుద్ధిగా ఉండే కుక్కకైనా కసిగా కరవ బుద్ధేస్తుంది!

 

 

‘మీ గొడవలన్నీ మాకెందుకులే!' అని ఓ మూల దాలిగుంటలోపడి వుంటామా ! 'కరిచే కుక్క అరవదు' అని మీకు మీరే డిసైడై పోయి.. మా వెంటబడతారు. ‘చదువులన్ని చదివి చాల వివేకియై /కపట చిత్తుడైన బలునిగుణము/దాలిగుంతనెట్టి దలచిన చందమౌ /విశ్వదాభి రామ వినుర వేమ!’ అంటూ పద్యాలకు తగులుకుంటారు. విని విని పిచ్చెత్తి  కరిచేదాకా వదిలి పోరు .   కరుపుకి, అరుపుకి లింకేం పెట్టుకోరాదని మా రాజ్యాంగంలో ఏ సెక్షను కిందే క్లాజులో రాసుందో? ! అరుస్తూ కరుస్తారు. కరుస్తూనే  అరుస్తారే..మరి మీ మనుషులూ! మీకో నీతి.. మాకో రీతీనా! సిల్లీ!  కుక్కై పుట్టే కన్నా అడవిలో పిచ్చిమొక్కై పుట్టడం మేలనిపిస్తుంటుందొక్కోసారి. 'మొక్కేకదా అని పీకేస్తే .. పీక తెగ్గోస్తా!' అన్న అన్నగారి పంచ్  గుర్తుకొస్తుంది! పిచ్చిమొక్కకిచ్చేపాటి విలువైనా మా కుక్కజాతికివ్వడం లేదీ  మనిషి. మరీ టూ మచ్! ‘అందితే తోక.. అందకుంటే మూతి!’మీ  మనుషులది. ఐ హేట్యూ మ్యాన్!

అమెరికాలో పుట్టే అదృష్టం అన్ని’డాగు’లకూఉంటుందా ? ! అక్కడైతే.. డెమోక్రటిక్ ఒబామానుంచి.. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ దాకా.. పార్టీపరంగా ఎన్ని చీలికలు ఏడ్చినా.. మా పెట్ జంతువులపట్ల  ఒకటే పాలసీ! ఇంటిసభ్యులకన్నా ఎక్కువగా చూసుకుంటారు.   పెళ్లిళ్ళు, పేరంటాలు, సీమంతాలు, పురుళ్లు.. అన్నీ మనుషులకు మించి  జరిపించే గొప్పశునకప్రేమికుల దేశం అమెరికా.  భూతలంమీది కుక్కలస్వర్గం. బుద్ధభగవానుడు పుట్టిన మీ  ‘లైట్  ఆఫ్ ఏసియా’నో! శునకాలపాలిటి భూలోక  నరకం.

వానలు కురవనప్పుడే కప్పలు ఇక్కడ గుర్తుకొచ్చేది.  పోకిరీల ఊరేగింపులకే గాడిదలు అవసరం పడేది! పెట్రోలూ , డీజెలూ  గట్రా రేట్లు తగ్గించాలన్న డిమాండ్లు పుట్టినప్పుడే బండ్లీడ్చే బుల్సు పిక్చర్లో కొచ్చేది! 'అక్కరకు రాని చుట్టము.. మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము.. గ్రక్కున విడువంగ వలయున'ని మళ్లీ నీతిశతకాలు!  సెంటిమీటరుకో సుమతి మహాశయుడితో కిక్కిరిసున్న  సమాజంరా బాబూ  మీ మనుష్యలది! ఒక్క కుక్కలకనేముందిలే! అన్ని జంతుజాలాలకూ మతులు పోతున్నాయీ  పుణ్యభూమిలో!    

దొంగల్ని పట్టే దివ్యమైన కళ మా దగ్గర ఉందని చేరదీస్తారా! దానికీ రాణింపు రానివ్వని కుళ్ళు మనుషులది! పోలీసుపటాల్లోకి పెద్ద పటాటోపంగా తీసుకున్నట్లు లెక్కలుంటాయి! కుక్కలకు వాసన పసిగట్టడంలో శిక్షణ ఇచ్చే  వంకతో లక్షల కోట్లు కొట్టేస్తారు! అదృష్టం కొద్దీ అవకాశమొచ్చి మేం ఏ దొంగవెధవనో పట్టుకొన్నా ఫలితం సున్నా. మేం పసిగట్టిన ఏ దొంగవెధవైనా మినిమమ్  మూడు రోజులన్నా  లాకప్పులో ఉంచరు.     ఎఫ్ఫైఆర్ల దగ్గర్నుంచే యవ్వారాలు మొదలు దొంగ పోలీసులకు.. దొర మార్కు దొంగలకు మధ్య! రొట్టెముక్కలు విసిరి తోకలు ఊపించుకోడానికి..  పక్కింటివాళ్ల ముందు  గొప్పలు చూపించుకోడానికే మా కుక్కలు మీ మనుషులకు! షేమ్.. షేమ్!

బేసికల్ గా భైరవజాతి అంటేనే ఎందుకో మనుషులకు చీదర.  అన్నం కరడింత పారేస్తే జన్మంతా పెరట్లో పడంటుందన్న  చులకనా!

ఆడించేందుకు కోతులు, కొండముచ్చులు, పాడించేందుకు కోకిలలు, చిలుకలు, తలాడించేందుకు గంగిరెద్దులు, గొర్రెపోతులు, కొట్టు చచ్చేటందుకు  కోళ్ళు, కొక్కిరాయిలు, ఢీడిక్కీలు కొట్టుకొనేందుకు పొట్టేళ్ళు, దున్నపోతులు! ఒక్కో దురదకి ఒక్కో జంతువు మనిషికి! మా కుక్కలతో మాత్రం ఏ అక్కరా లేదు.చీ.. ఎంత కుక్కబతుకయిపోయిందిరా గాడ్  మా డాగులది !

అసలు ! కుక్కలకి, కుక్కులకి ఏమంత పెద్ద తేడా ఉందిట! కుక్కలం మీరు తిన్న ఎంగిళ్ళు నాకితే.. కుక్కులు తిన్న ఎంగిళ్లు మీరు నాకుతారు! దొంగచాటుగా మెక్కే అ కుక్కేశ్వర్లకేమో వేలకు వేలు జీతభత్యాలు! దొరబాబుల్లా ఎంగిళ్లకు ఎగబడే మాకు మాత్రం దుడ్డుకర్రలతో ఘనసత్కారాలు!

దాలిగుంటలో నిద్రోయే సమయంలో రాయేసే రాలుగాయిని రక్తాలొచ్చేటట్లు   కరవాలా? ‘రా.. రమ్మ’ని పిలిచి ముద్దులు పెట్టుకోవాలా? ఏ కుక్కయినా  బేడ్ మూడ్ లో ఉండి   కసిబట్టలేక కాస్త కండ ఊడేటట్లు  కరించిందే అనుకోండి! ఇక కుక్క జాతి మొత్తానికి ఆయువు మూడిందే! మీ సోషల్ మీడియా నిండా  మా గురించి చెడామడా  వార్తలు! లోకమంతా మా కుక్కల దాడితోనే అల్లకల్లోలమైపోతున్నట్లు బిల్డప్పులు ప్రసార మాధ్యమాల్లో!  మాకూ ప్రత్యేకంగా పత్రికలు.. టీవీలుగాని ఉండుంటేనా! మీ మనుషులు చట్టసభల్లో చేరి  చేసే నానాయాగీని నిప్పులతో కడిగి మరీ చెరిగేసేవాళ్లం! చూస్తున్నాంగా రోజూ టీవీల్లో   మీ గౌరవనీయుల యాత్రల తీరు! మా బజారు కుక్కలుకూడా సిగ్గుతో తలలు దించుకొంటున్నాయి మీ కుక్క మొరుగుళ్లతో . ప్రజాస్వామ్యం జోలికి పోనందుకు మహా సంబరంగా ఉంది సుమా మాకిప్పుడు. 

ఆ మాటకు మామీదా సభాహక్కుల తీర్మానం  బనాయిస్తారు కాబోలు! ఫర్వానై! న్యాయస్థానాల్లోనే తేల్చేసుకుందాం తేరే..మేరే బీచ్ కీ యే  ఖిచ్.. ఖిచ్!

బర్త్ కంట్రోలుకని మా కుక్కల్ని బలవంతంగా మున్సిపాల్టీ బళ్లల్లో కుక్కేయడం     కుక్కల హక్కులకు భంగకరం.  బొద్దింకలమీద బయోలజీ విద్యార్థులు ప్రయోగాలు,   ఎలుకలపై  నెవరెండింగ్  జీవశాస్త్ర పరిశోధనలు, కోతులు గట్రా జాతులకు  కత్తికోతలూ! మనుషులమీదా  మా జంతువులు ఇదే మాదిరి బలవంతపు   పరిశోధనలకు తెగపడితే! హక్కు  ఉల్లంఘనలు  అన్ని ప్రాణులను  సమానంగానే హింసిస్తాయి బ్రదర్స్ !

ఎవర్ననుకొని ఏం లాభం ! ఆ దయామయుడికే మామీద కనికరం కరువైనప్పుడు! ఆ పెద్దాయనకూ మాకూ పెద్దతేడా ఏముందని? జి.. ఓ.. డి అయితే గాడ్!  డి.. ఓ.. జి గా రివర్సు చేస్తే డాగ్! కష్టం వస్తే ‘ఓ మై గాడ్’ అంటారే గానీ.. ‘ఓ మై డాగ్’ అనరెవరూ! సరికదా 'గాడ్'గారి ముందు పడీ పడీ పొర్లుదండాలు పెట్టే మూడీ మనుషులు డాగ్ పేరు వింటే మాత్రం  దుట్టు కర్రతో  వెంటబడతారు! మ్యాడ్.. మ్యాడ్.. మ్యాడ్ మీ  హ్యూమన్ వరల్డ్!

శునకానికి కనకంతో రైమింగున్నందుకైనా  పోనీలే అనిపించదా మీ  పెద్దమనుషులకు ! 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మాను' అంటూ మా పైన వెటకారాలు న్యాయమా ? ! ఇప్పుడేదో ఆ  సింహాసనాలని కరుచుక్కూర్చున్న పెద్దమనుషులంతా పెద్ద   సుపరిపాలన సాగిస్తున్నట్లు! మా జాతికి విశ్వాసమనే  అర్హతైనా  ఉంది. మీనేతల కది  ఓట్లు పడే సరుకు.  

ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది . ఆదిశంకరులకి  జ్ఞానబోధ జరిగిన  కథ మా జాగిలాల మీదే. జనమేజయుడి యజ్ఞవాటికలో    సరమ  బిడ్డ ఆడుకొన్నది నూ దేవ శునకం తోనే.   మహాప్రస్థానికని బైలుదేరిన ధర్మరాజుని  అన్నదమ్ములతో కలసి అనుసరించిన శునక జాతి వారసులం మేం.  ‘భగవద్గీత’సైతం   ప్రస్తావించే  మాజాతి  రాత ప్రస్తుతం   దయనీయం . 

‘కుక్కగా పుడితే తప్ప కుక్క కష్టాలు మీ తలకెక్కవు. అనుభవిస్తే తప్ప తెలిసిరానివి మా బాధలు. అందుకైనా .. ఓ భగవాన్.. ఈ మనుషులంతా  ఇండియాలో వీధికుక్కలు గ జన్మించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నా!



***



(కర్లపాలెం హనుమంతరావు(వాకిలి- జనవరి 2016 సంచికలో ప్రచురితం)

 





 

 

 

 


కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- జనవరి 2016 సంచికలో ప్రచురితం)




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...