శబ్దరత్నాకరం
ప్రకారం 'అధిక్షేపం' అంటే దూఱుట, బెదిరించుట. 'వొక్కొక్కడికీ
ఎవడికి వాడికి/ నాలుగ్గోడల నడిం ప్రపంచం/ కల్చర్- కంచం, మంచం/
యెవడికి వాడికి యెవడిది వాడిది!' 'కల్చర్ అండ్ అనార్కీ' కవితలో కవిపూషా చేసిందీ అధిక్షేపాన్నే!ఇష్టంలేని ఎదుటిమనిషి
లోపాల్ని ఏదోవిదంగా ఎత్తిచూపాలనుకోవడం మానవతత్వంలోని బలహీనత. తప్పును సరిచేయాలన్న సద్బుద్ధి
కావచ్చు.. దుష్ప్రచారం చేయాలన్న దుర్భుద్దీ కావచ్చు. విశ్వనాథవారు 'శ్రీ'కారాలు విరివిగా
వాడతారని దేవీప్రసాదు 'అచ్చుత్తించు శ్రీ ప్రెస్సులో శ్రీ అచ్చుల్ సరిపోయి ఏడ్చినవటోయ్ శ్రీ
విశ్వనాథేశ్వరా!' అని వెటకారం చేయడం ఏ కోవకు చెందిందో ఎవరికి
వారు అవగాహన చేసుకోవాలి.
పిల్లిమీదా
ఎలుకమీదా పెట్టి అన్యాపదేశంగా ఎత్తిపొడిచే వ్యంగ్యవిధానాన్ని పాశ్చాత్యులు 'సెటైర్' అంటారు.
జోనాథన్ స్విఫ్ట్ తనకాలంనాటి పాలకుల లోపాలని ఈ పద్ధతిలోనే గలివర్స్ ట్రావెల్సులో
ఎత్తిచూపాడు. మన ఆదికావ్యం రామాయణం పుట్టడానికీ వాల్మీకులవారి అధిక్షేపమే
మూలకారణం. క్రౌంచ పక్షుల జంటను విడదీసిన నిషాదుణ్ణి 'ఆట్టే
కాలం బతకవ'ని ఆ కవి తిట్టిపోయడం అధిక్షేపం కిందే లెక్క. చేతి
ఉంగరం పోయిందని చెరువుమీద, రాసేందుకు పత్రాలివ్వలేదని
తాటిచెట్టుమీద అలిగి కవులు తిట్టిపోసిన అధిక్షేప సాహిత్యానికి ఆంధ్రభాషలో
కొదువలేదుగానీ అదంతా వైయక్తిక అధిక్షేప విభాగం. సమాజాభివృద్ధికి దోహదపడ్డ సాంఘిక
అధిక్షేపాన్ని గూర్చి పరిచయం చేయడమే ఈ చిరువ్యాసం ఉద్దేశం.
జీవితం
అంటే మంచి చెడుల సమ్మిశ్రితం. చెడును ప్రతిఘటించడం ఒక ఎత్తైతే.. ఆ శక్తి లేనప్పుప్పుడు పరోక్షంగానైనా ఎత్తిపొడవడం
మరో ఎత్తు. మహాభారతం విరాటపర్వంలో కీచకుడి చేత పరాభవానికి గురైన పాంచాలి
ధర్మజునిముందు తన గోడు వెళ్లబోసుకోవాలన్న తొందరలో సభామండపంలోకి
వచ్చేస్తుంది.'పలుపోకల పోవుచు వి/చ్చలవిడి
నాట్యంపు సూపు చాడ్పున' పాంచాలి అలా దూసుకు రావడాన్ని ధర్మజుడు ఆక్షేపిస్తాడు. భర్త
మందలింపుకు నేరుగా బదులీయలేని దుస్థితి పాంచాలిది. బదులియ్యకుండా ఉండలేనీ మనస్థితి. అందుకే 'నాదు వల్లభుండు నటు డింత నిక్కంబు/
పెద్దవారియట్ల పిన్నవారు' అంటో ప్రత్యధిక్షేపాన్నిఆశ్రయిస్తుందా సాథ్వి.
కేవలార్థమే కాదు.. సందర్భాన్నిబట్టి మరో అర్థమూ స్ఫురింపచేసే 'ద్వని'
కావ్యానందాన్ని ఇనుమడింపచేస్తుంద'ని
ధ్వన్యాలోక కర్త ఆనందవర్ధనుడి వాదన. అభిధ(శబ్దవృత్తి), లక్షణ
వ్యాపారాలే కాకుండా పదానికి వ్యంజకత్వం అనే మరో బాధ్యతా ఉందన్నది ఆయన సిద్దాంతం.
ఎత్తిపొడుపు, వెక్కిరింత, విసురు,
విరుపువంటి ప్రక్రియలెన్నోఈ బాధ్యతను విర్వర్తించే అధిక్షేప
విభాగాలే. వీరేశలింగంవంటి వైతాళికుల చొరవతో తెలుగులో ఈ విభాగాలకు సాంఘికోద్ధరణ
బాధ్యతా పెరిగింది.
ఆత్కూరి
మొల్ల రామాయణం పీఠికలో 'మును సంస్కృతముల దేటగ/
దెనిగించెడి చోట నేమి దలియక యుండన్/ దన
విద్య మెఱయ గ్రమ్మఱ/ ఘన మగు సంస్కృతము జెప్పగా రుచి యగునే!' అంటూ డాంబికాచారాలని తూర్పార పట్టింది. ఆ
తీరులోనే వీరేశలింగం డాంబికాల డొల్లతనాన్ని బైటపెడుతూ 'అభాగ్యోపాఖ్యానం'
వంటి అధిక్షేప కావ్యాలు
అల్లారు. నవ్విస్తూనే అధిక్షేపించే ఈ కావ్యాలు ప్రహసనాలుగా ప్రసిద్ధం.
విమర్శలపాలైనవారికీ తీవ్రంగా ప్రతిస్పందించ బుద్దేయదు.. సరి కదా
ఆత్మవిమర్శద్వారా స్వీయసంస్కరణకు ఈ రకమైన అధిక్షేపం చక్కని అవకాశమూ
ప్రసాదిస్తుంది. విమర్శ విమర్శకోసమే కాకుండా సంస్కరణ అంతిమ లక్ష్యంగా సాగే
అధిక్షేపాన్ని అందుకే సంఘసంస్కర్లలు ఉత్తమమైనదని నెత్తిన పెట్టుకునేది. చిలకమర్తి
గణపతి, మొక్కపాటి పార్వతీశం, పానుగంటి జంఘాలశాస్త్రి, గురజాడ గిరీశం.. మనిషిలోని, సంఘంలోని వక్రబుద్ధి,
అమాయకతల పోతబోసిన అధిక్షేప పాత్రలు. కాళ్లకూరివారు- వరవిక్రయం వంకబెట్టి వరకట్నాలను
తునుమాడితే.. గురజాడగారు గిరీశం భుజంమీద అధిక్షేపంతుపాకి పెట్టి కన్యాశుల్కంమీద యుద్ధం ప్రకటించారు. కవిరాజు
సూతపురాణం పేరుతో పౌరాణికాల పాతకాలను ఎండగడితే.. చమత్కారం,
వెక్కిరింతలనే జోడుగుర్రాలమీద అధిక్షేపరథాన్ని దౌడుతీయించిన ఘనుడు జలసూత్రం
రుక్మిణీనాథశాస్త్రి. కాకపోతే అదంతా వైయక్తిక వ్యంగ్య వైభోగంలో భాగం. కుసంఘానికి
ఒక స్థాయిలో చురకలు అంటించిన వైప్లవికుడు శ్రీ శ్రీ. 'జమీందారు
రోల్సు కారు, మహారాజు మనీపర్శు/ మరఫిరంగి, విషవాయువు,
మాయంటావా? అంతా/ మిథ్యంటావా?' అంటూ
ముద్దులవేదాంతిని సైతం వదలక తలంటు పోసిన మహాప్రస్థానం ఆధునిక యుగంలో అత్యధికుల
ఆమోదం పొందిన అతిపెద్ద అధిక్షేప
విన్యాసం. 'సులభంగా సూటిగా చెప్పేసి, ఇంత
ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి ఇవ్వరని
స్త్రీలమీదా, దేశనాయకులమీదా, కవులమీదా
గంపెడంత అసహనం వెళ్ళగక్కిన చలం సైతం శ్రీ శ్రీ 'ఎకసెక్కాలని'
ఎరక్కపోవడం క్షమించరాని విషయం'గా
ఒప్పుకున్నాడు. శ్రీరంగంవారి ధోరణిలోనే
వీరంగం వేసిన మరో ఎత్తిపొడుపుల
కత్తివీరుడు ఆరుద్ర. 'ఏకపత్నీవ్రతము/ ఎలుగెత్తి మనమతము/ వేల్పు భార్యలు శతము/ ఓ కూనలమ్మ!'
అంటూ కూనారిల్లుతున్న మతతత్వంమీద పూలకత్తితో దాడికి దిగాడు. కాకపోతే
పూలదెబ్బలకన్నా.. కత్తివాదరల చురుకే ఎక్కువ. గజ్జెలమల్లారెడ్డి గేయాలైతే
దుష్టసంఘంమీద గజ్జెకట్టిన జజ్జనక జనారేలే!
కడుపులోని
బాధను కన్నీళ్ళతో కడిగేందుకూ అదిక్షేపం నిక్షేపంగా పనికొస్తుందని నిరూపించిన
కారుణ్యకవి జాషువా. 'కనుపడలేదు దైవతము గాని పదార్థము
భారతంబునన్/ గనుపడలేదు వర్ణమునకన్న
పిశాచము భారతంబునన్/ కనుపడలేదు సత్కులముకన్న మహాభారతంబునన్/గనుపడలేదు పంచమునికన్న
నీచపుజంతువేదియున్' అన్న జాషువా వ్యాఖ్య నిమ్న కుల వివక్షను
ప్రశిస్తున్న అధిక్షేపమే!
'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి మూడ్రోజుల్లో
కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా భావించే కూపస్థమండూకత్వం కన్యాశుల్కం నాటికే తెలుగునాట వేళ్లూనుకుని విస్తరిస్తుండటం
గురజాడవారిని కలిచి వేసినట్లుంది.
సమాజాన్ని సామూహికంగా కుంగదీసి వ్యక్తి చైతన్య వికాసాలను అట్టడుగు స్థాయికి
అణగదొక్కేవి ఇట్లాంటి మూఢనమ్మకాలే. సమాజ
ప్రగతిరథానికి నిరోధకంగా మారే ఈ మహమ్మారులమీద గురజాడ ఎత్తిన అధిక్షేప వజ్రాయుధమే
కన్యాశుల్కం నాటకం.
సామాజిక
అధిక్షేపానికి వేమన సాహిత్యం మకుటాయమానం. 'విప్రులెల్ల జేరి వెర్రికూతలు కూసి/ సతిపతులను గూర్చి సమ్మతమున /మును
సుముహూర్తముంచ ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలేసిన విశ్వదాభిరామన్న మన యోగివేమన.
సహజ
విద్యావికాసానికి గ్రంధఛాందసభాష పెద్ద అడ్డంకి.
వందేళ్ల కిందటే వివరాలతో సహా
గురజాడ సమర్పించిన డిస్సెంటు
పత్రమే తెలుగుభాషాచరిత్రలో ఇంతవరకు నమోదైన
అతిపెద్ద అధిక్షేప పత్రం. స్త్రీ ఆత్మ స్వాతంత్ర్యం కోల్పోతున్న తీరును
ప్రత్యక్షరంలోనూ అధిక్షేపించిన చలం సాహిత్యం అరుణాచలమంత ఉన్నతం. ఉద్వేగం, ఉత్తేజం ఉండకపోవచ్చుకానీ కొకు సిరా
రాసిందంతా సామాజిక హిపోక్రసీమీద వామపక్ష అధిక్షేప పూత. నేలబారు పాత్రలతో
కిక్కిరుసుండే రావిశాస్త్రి కతలన్నీ మేకవన్నెపులులపైన గోవులు విసిరే కొమ్ములు. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి
మార్క్సు కావాలా?/నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే
నేరస్థుడు లేడు'
అంటారు గుంటూరు శేషేంద్ర. నరమ్ నరమ్ గా ఉంటేనేమి అధిక్షేపంగీర
శర్మస్వరంలోనూ షడ్జమంలో మోగుతోంది. ఎన్ని రకాలుగానైనా లెక్క పెట్టి చూడండి..
అధర్మరావణంమీద అధిక్షేపబాణం ఎక్కుబెట్టని కవిరామత్వం కలియుగంలోకూడా కలికానికి
కానరారు.
ఉద్యమంనుంచి
ఉద్యమం రూపుమార్చుకునే ప్రతిమలుపులోనూ పాతధోరణిమీద కొత్తవాదం సంధించేది
అధిక్షేపాయుదాన్నే. కొట్టొచ్చినట్లు కనిపించేది ముందుతరాన్ని తదనంతరతరం
కొట్టేందుకు రావడమే! 'చచ్చిన రాజుల పుచ్చిన చరిత్ర
గాధల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవులు కోసి అడగాలనుంది మానవ
పరిణామశాస్త్రం నేర్పిందేమని?'(జ్వాలామ్ముఖి- సూర్యస్నానం)
అని నిలదీయడమంటే పాతచరిత్రనంతా 'ఛీ'
కొట్టడమేగా!
వలస, భూస్వామ్య, ధనస్వామ్య
అవశేషాలన్నింటిపైన పుట్టిన ఏవగింపుకు విరసం ఒక బాహాటమైన అధిక్షేప రూపం.
వర్ణాశ్రమధర్మాలు, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ, మూర్ఖపు అలవాట్లు, మూఢనమ్మకాలు, జన్మ కర్మ భావనలపై అతర్కిక విశ్వాసాలపై ఎక్కుపెట్టిన అధిక్షేపపుతూటా ఈ
శతాబ్దారంభంనుంచీ మొగ్గతొడిగిన దళిత ఉద్యమం మాట. 'చెప్పులు
కుట్టేవాడు- చెప్పులు తొడుక్కుంటే చెప్పరాని కోపం/ చెరువులు తవ్వేవాడు- చెరువులో
నీళ్ళు ముట్టుకుంటే సహించరాని కోపం/ పొలాలు దున్నేవాడు- కాస్తంత భూమి కావాలంటే
నేరం/ కాళ్ళమీద పడేవాడు- కాస్త లేచి నిలబడితే ఈ వ్యవస్థకి ద్రోహం' అన్న స్పృహ అట్టడుగు బడుగుకి ఏర్పడటమంటే అధిక్షేపం అక్షరం అంగీ
తొడుక్కున్నట్లే!
'పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళిచేస్తానని/పంతులుగారు అన్నప్పుడే
భయం వేసింది/ ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమొచ్చినప్పుడు సెలవివ్వడు/అని అన్నయ్య
అన్నప్పుడే అనుమానం వేసింది/వాడికేం మగమహారాజని ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది/
పెళ్ళంటే 'పెద్దశిక్ష' అని/ మొగుడంటే స్వేచ్చాభక్షకుడని/మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/
మమ్మల్ని విభజించి పాలిస్తోందని' (సావిత్రి) - స్వశరీరంమీద
సంపూర్ణ హక్కులకోసం అమల్లో ఉన్న సకల సామాజిక సాంస్కృతిక విలువలను బహిరంగంగా
అధిక్షేపించడం ఆరంభించిన అతివ దిక్కార స్వరం అది. మైనారిటీలూ ఈ గడ్డమీద పుట్టినందుగ్గాను తమకు దక్కవలసిన సహజ హక్కులకోసం ఎలుగెత్తి వివక్షను
ఆక్షేపిస్తున్నఅధిక్షేపయుగం ప్రస్తుతం నడుస్తున్నది.
'తిట్టకపోతే
ఖలుడే కాదు దేవుడూ దారికి రాడు'అని
కొందరి విశ్వాసం. ' ఆండ్రుబిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగాని/
మొదటినుండియు నీవు దామోదరుడవే' అంటూ శ్రీకాకుళాంధ్ర దేవుణ్ణి
కాసుల పురుషోత్తమ కవి పనిగట్టుకుని తిట్టిపోసింది బహుశా ఈ ఉద్దేశంతోనే కాబోలు!
సున్నితమైన తిట్లు, సుతారమైన హాస్యంతోకలగలిపి వడ్డిస్తే
మెక్కేవాడికైనా భుక్తాయాసం తెలియకపోవచ్చు. వట్టి తిట్లపురాణాలు పుట్లకొద్దీ పండిచినా
కాలాన్ని మాయం చేసి ఆట్టేకాలం నిలవలేవు. 18వ శతాబ్దంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక
వెలుగు వెలిగిన వాంచానాథుడు తదనంతర
పాలనలో ప్రజాపీడనకు కినిసి రాజును నేరుగా హెచ్చరించే అవకాశం కానక మహిషాన్ని
అడ్డుపెట్టుకుని ఒక అధిక్షేప శతకం చెప్పుకొచ్చాడు. రాజును దారికి తెచ్చిన ఆ మహిష శతకం అధిక్షేపధర్మ ఉదాత్త నిర్వహణకు
ఉత్తమ ఉదాహరణ.
'మెఱుగు వేయకగాని మృదువుగా దన్నము/.. సాన వెట్టక మణి చాయ
మిక్కిలి కాదు/.. ముక్కు నుల్చక దీప మెక్కువ వెలుగీదు/.. ఖలుడు గుణవంతుడౌను చకార
గుళ్ళ' అంటూ చేట్రాతి
లక్ష్మీనరసింహంకవి చెప్పిన కోదండరామ శతకపద్యం సద్భావంతో అర్థంచేసుకొంటే అవహేళన
సాహిత్యంలోని ఔషధగుణం అవగతమవుతుంది. 'ఎమితిని సెపితివి
కపితము/
బ్రమపడి
వెరిపుచ్చకాయ వడిదిని సెపితో /ఉమెతకయను
తినిసెపితో /అమవసనిసి అన్నమాట' అంటూ అల్లసాని పెద్దనవంటి ఉద్దండుణ్నీ దద్దమ్మని ఎద్దేవా
చేసే వికటమనస్తత్వం పొటమరించనంతవరకు నిరసన సాహిత్యమూ రసహృదయాహ్లాదకరమే!
భగవద్గీతకు
ఉత్తరగీతలు రాసుకున్న ఉదాత్త జాతి మనది. పాణినీయంవంటి సూక్ష్మశాస్త్రగ్రంథాలకూ
అసంగత్వ మంటని రసోద్దీప అధిక్షేపాలొస్తే అస్వాదించిన హస్యస్ఫూర్తి మనది.
హాస్యరసాధిదేవతగా వినాయకుణ్ణి కొలిచే జాతికి అధిక్షేపమంటే ఏవగింపు ఉంటుందనుకోలేం.
జాతి మత భావోద్వేగాలమీద మితి మీరిన వెటకారానికి పోతే ఏమవుతుందో ఇటీవలే
ఫ్రెంచిపత్రిక ఛార్లో హెబ్డో వ్యంగ్యచిత్రం సృష్టించిన కలకలం హెచ్చరిస్తోంది.
వ్యక్తి శ్రేయస్సు, జాతి సౌభాగ్యం ఆకాంక్షించని ఏ
అధిక్షేపమైనా వ్యక్తిగత అసహనానికి, అనారోగ్య మానసానికి
మాత్రమే దుష్టదృష్టాంతంగా మిగిలిపోతుంది.
పరిమితులు ఎరిగి పరభాషా సాహిత్య వరవడుల్లోనే తెలుగు అధిక్షేపమూ మునపటి దారినే
భావికి సౌభాగ్యసోపానంగా శోభాయమానంగా సంఘసేవ చేస్తుందని .. చేయాలని
ఆకాంక్షిద్దాం***
-కర్లపాలెం హనుమంతరావు
(మిసిమి- మాసపత్రిక- నవంబరు 2015లో ప్రచురితం)
No comments:
Post a Comment