Saturday, December 31, 2016

హ్యాపీ న్యూ యియర్ !- కర్లపాలెం హనుమంతరావు


కొత్త సంవత్సరం రానే వచ్చింది. సంబరాలు పడిపోతున్నాం అందరం. సహజం. కొత్త ఏదైనా ఉత్సాహంగానే ఉంటుంది. ఉండాలి. కొత్త వాహనం.. కొత్త కాపురం మాదిరి. వాడకం పెరుగుతున్న కొద్దీ కదా వాటి కొత్త కష్టాలు అనుభవంలోకొచ్చేది!అందాకా అందరికీ 'నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అపశకునమేదో 'ధ్వని'స్తున్నదంటారా? 'శుభవాఁ అని పెళ్లి జరుగుతుంటే.. మంగళ వాయిద్యాల మధ్య ఈ తుమ్ముళ్లేవిఁటి?!' అని చిరాకా? కానీ.. 'కీడెంచి మేలంచమ'ని కూడా అన్నారు కదండీ!ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తకోసం!
పాత తీర్మానాలు మళ్ళీ కొత్తగా తీసుకునేందుకు  కొత్త సంవత్సరానికి మించిన మంచి అదను మరోటి లేదనుకోండి. 'ఉగాది' ఉన్నా అది అచ్చంగా  తెలుగువాళ్ల ఉత్సాహం. ప్రపంచ వ్యాప్తంగా మన ప్రతిజ్ఞలు.. ప్రమాణాలు వినబడాలంటే కొత్త ఏడాదే సరైన సందర్భం. ఉగాదిలో ఒకింత మత పరమైన తంతూ ఉంటుంది. ఉగాది పచ్చడి గొంతుకడ్డం పడుతుంది.  షడ్రుచులంటారే  కానీ.. అదేందో.. ఎంత మామిడి ముక్క, అల్లం తొక్క, బెల్లం పిక్క, చెరుకు చెక్క, ఉప్పుతో రంగరించినా ఒక్క వేపచేదే నాలిక్కి తగిలేది! అదీగాక.. తెల్లారగట్టే లేచిపోవాలి. అభ్యంగన స్నానాదులాచరించాలి. అట్లాంటి తంటాలేవీ ఉండవు. కాబట్టే న్యూ ఇయర్ నిజమైన  పండగయింది నేటి కుర్రకారుకి.  వచ్చింది ఉగాది కాదు. కాబట్టి ఇప్పుడా రచ్చొద్దు. కొత్త సంవత్సరం  గూర్చి కొద్దిగా చర్చించుకొంటే సందర్భ శుద్ధిగా ఉంటుంది.. కదూ!
కొత్త ఏడాది రావాలంటే ముందటి ఏడాది పోవాలి ముందు. పాతది పోతూ.. కొత్తది వచ్చే సంధికాలం అర్థరాత్రి. పన్నెండు గంటల్లో ఆ  ఆఖరి గంట చివర్లో లోకం  సంధి జ్వరం వచ్చినట్లు వెర్రెత్తి పోతుంది! అట్లాంటి ఊగిపోయే అవకాశం మన పండగల్లో ఒక్క పోలేరమ్మ జాతర్లలో గణాచారి కొక్కళ్లకే దక్కేది.  అమెరికా ఖండం ఆ చివర్నుంచి.. ఆఫ్రికా ఖండం ఈ చివర్దాకా.. భూగోళమంతటా  అఖండమైన గోల. నిజవేఁ కానీ అంతతా ఒకే సారి ఊగుళ్ళు తూగుళ్ళూ ఉండవు. మనమిక్కడ రాత్రి భోజనానికని కూర్చున్న సమయంలో ఇంకెక్కడో జనం 'హ్యాపీ న్యూ యియర్' అంటూ టపాసులు పేలుస్తారు. ఇంకెక్కడో 'కొత్తేడాది సంబరాలు' అంబరాన్ని అంటే వేళకి మనం పడకమీద గుర్రు కొడుతుంటాం. కాకపోతే అన్ని చోట్లా అందరికీ  కామన్ గా కనిపించే దృశ్యం మేందంటే.. పోలీసులు.. తుపాకులూ గట్రా భయం లేకుండా   ఎవరికి తోచినట్లు వాళ్లు యధేఛ్ఛగా  అల్లర్లు చేసుకోవచ్చు ఆ నాలుగ్గంటలూ. విచ్చలవిడితనానికి విడిగా ప్రభుత్వాల పర్మిషన్లు అక్కర్లేని  క్షణాలు ఏడాది మొత్తంలో ఆ ఒక్క నాలుఘ్ఘడియలే!
మన దగ్గర మందూ మాకుతో కుర్రకారు సిద్ధంగా ఉంటారు చాలా ముందునుంచే. డ్రంకెన్ డైవ్ ని సహించవఁటారుగానీ పోలీసులు అదొట్టి  'ప్రెస్' మార్కు  బెదిరింపే.  కొత్త సంవత్సరం మూడ్ కి దూరంగా ఉండేందుకు పోలీసోళ్లేవఁన్నా   ప్రవరాఖ్యుడి  చినతమ్ముళ్లా?
ఈ అరుపులూ.. ఆగవఁతా బహిరంగంగా జరిగే వీరంగం. క్లబ్బుల్లో, పబ్బుల్లో ఇంతకు పదింతల తతంగం సాగుతుందంటారు. ఆ స్వర్గ కార్యకలాపాల్లో అన్ని వర్గాల   తలకాయలు దూరడం విధాయకం. కాబట్టి  తెల్లారింతరువాత ఎవరూ తలకాయలు పట్టుకొని విచారించే అవసరం ఉండదు.. ఒక్క హాంగోవరు తగులుకుంటే తప్ప.
కొత్తేడాదంటే కేవలం ఒక్క మందు కొట్టే సంబరవేఁ కాదు.  గ్రీటింగుల పండక్కూడా. యియర్ ఎండింగెప్పుడూ మంత్ ఎండిగులోనే రావడం కాలం పన్నే కుట్ర. ఇప్పుడంటే ఇంటర్నెట్లాదుకుంటున్నాయి. గతంలో తపాలావారే దిక్కు. ధరలు ఆకాశంలో విహరించే రోజుల్లో   ఆ కార్డుల కొనుగోలో  గగనకుసుమం.  స్టాంపులంటించి కవర్లు పోస్టుబాక్సుల్లో వేయడం    తలకు మించిన వ్యవహారం.  అయినా పాలుమాలేందుకు లేదు. తల తాకట్టయినా పెట్టి జరిపించాల్సిన తంతు.  పక్షంరోజులకు ముందునుంచే రాబోయే కొత్తేడాదికి  'నూతన సంవత్సర శుబాకాంక్షలు' ఆశిస్తూ కార్డులూ, కవర్లూ వచ్చి వెళుతుండేవి.. అటూ ఇటూ. 'ఇచ్చుకొన్న వాయినం .. పుచ్చుకొన్న వాయినం' తంతే ఈ శుభాకాంక్షల తీరు ఏ మాత్రం తేడా పడ్డా సో కాల్డ్ స్నేహ బందం  సిమెంట్ తక్కువ వంతెనలా కుప్పకూలడం ఖాయం.  పత్రికలేవీ గ్రీటింగులు పంపవు. అయినా రచయితలు 'మీ/మా' పత్రిక అభివృద్ధిని కాంక్షించాలి. బాసాసురులు పెదవైనా విప్పరు. ఐనా ఉద్యోగస్తుడు  పళ్లికిలిస్తూ పండో.. ఫండో ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలి.   గుత్తేదారుకి  దారులు తెరిచేదే శుభాకాంక్షల సులువుసూత్రమే. కార్యకర్త ఖర్మను తేల్చేదీ ఈ కొత్తేడాది శుభాకామనలే.  పరిశోధన విద్యార్థి పరిశ్రమను కడతెర్చే తారక మంత్ర మీ కొత్తేడాది గ్రీటింగ్సులోనే దాగుంటుంది.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. తీర్మానంబులు. పాతవే కావచ్చు కానీ  మళ్ళీ కొత్తగా తీసుకోవాలి.  శ్రీవారులకు ధూమపానం మైన్ సబ్జెక్ట్. అదే వారు.. అదే కుటుంబం.. అదే శపథం.. తారీఖొక్కటే తేడా! ఇలాళ్లెవరూ  ఇలాంటి  డొల్ల తీర్మానాల జోలికి రారు. వాళ్లకే దురవాట్లు ఉండవు. టీ.వీ వాచింగ్, శారీస్, గోల్డ్..  షాపింగులు దురవాట్లేనన్న మగవాళ్లు భూమ్మీద మిగిలుండరు. బొట్టికాయలమీదే  ఈ కొత్తేడాది తీర్మానాల వత్తిడి ఎక్కువగా ఉంటుంది.. పాపం! చెడ్డ మాటలు, చెడు స్నేహాలు, హోంవర్కు వాయిదాలు, వీడియో గేమ్సు , లంచ్ బాక్సు తిళ్లు, అబద్ధాలాడ్డాలు, చెల్లాయిల్నేడిపించడాల్లాంటి.. సవాలక్ష శపథాలుంటాయి లిస్టులో.   ఏ శపథం ఎప్పుడు నెరవేర్చాలో టైం టేబుల్  సరిగ్గా పడక .. పడకెక్కేస్తాయన్ని ప్రమాణాలు. అన్నీ నెరవేర్చేస్తే వచ్చే ఏటికేవీఁ మిగిలుండవన్న ముందు చూపు వాళ్లది.  
కాలక్రమాన కాలగర్భంలో కలిసి పోయేవే ఏ తీర్మానాలెవరెంత సీరియస్సుగా తీసుకొన్నా. కాకపోతే  తీర్మానాలతో  తోటివారికి సంతోషం కలిగించే అపూర్వా వకాశం ఈ కొత్త సంవత్సర పర్వదినం.
కొత్తేడాది సీజన్లో పత్రికలన్నీపాత వ్యాసాలే  పునః ప్రచురిస్తాయి.  తీరిక లేని పాతమిత్రులు ఎంత దూరంలో ఉన్నా  తీయని గొంతుల్తో శుభాకాంక్షలు తెలిపే  ఏకైక  శుభ సందర్భం నూతన సంవత్సరవం! కొత్తేడాది వచ్చేది పెద్ద పండుగ రోజుల్లోనే కాబట్టి.. ఇంట్లో ఎదిగిన గుండెలమీది కుంపట్లున్నా.. ఇంటిముందు వేసేందుకు  రవంత జాగా ఉన్నా.. కొత్తేడాది తెల్లారు ఝామున  ముంగిట్లో కనిపించే ముగ్గుల్లో తప్పని సరిగా కనిపించే అందమైన వాక్యం 'హ్యాపీ న్యూ ఇయర్!'
మామూలు మనిషి రోజువారీ బతుకు సినిమా కాదు. వ్యాపారం కాదు. రాజకీయం అంతకన్నా కాదు. ఏడాదంతా జరిగిన ముఖ్యమైన సంఘటనలు సింహావలోకనం చేసుకొనే అవసరం సాధారణ జీవికి ఏ మాత్రం ఉండదు. రోజూ 'తినుచున్న అన్నమే తినుచున్నవాడు' వాడు. కొత్తేడాది కాబట్టి ఆ రోజుటి పత్యేకత టీవీలిచ్చే  సరికొత్త చెత్త మరికొంత.
ఎవరెవరి వెంటో పడి సాధించుకొచ్చిన డైరీకి పసుపు కుంకుమలైనా అద్దకుండా  అద్దాల పుస్తకాలరలో ఓ మూల సర్దిపెట్టుకొనే సర్దా సగటుజీవి నిజజీవితంలో నిజంగా  జరిగే మార్పు మాత్రం ఒకటుంటుంది.. గోడమీది పాత క్యాలెండరు చెత్త బుట్టలోకెళ్లి.. దాని స్థానంలో కొత్త క్యాలెండరు వేలాడ్డం. గతంలో ఎరగని  ఎలక్టానిక్ మీడియా అందుబాట్లో ఉంది కాబట్టి  ముక్కూ ముఖమైనా తెలియని ఫేసు బుక్కుమిత్రులక్కూడా ఇలా  "హ్యాపీ న్యూ యియర్"
అంటూ శుభకామనలు తెలియచేసుకొనే సులువు దొరికింది.
  పాతవన్నీ రోతగా భావించి రద్దు చేస్తున్న పిదప కాలంలో అదృష్టం బాగుండి  ఓ మూడు ముక్కలు మాత్రం ప్రతీ కొత్తేడాది మొదటి రోజున అందరి మనసులనూ అందమైన ఊహల ఉయ్యాలలో ఊగిస్తూనే ఉంది. ఆ మూడు ముక్కలతోనే మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ చిన్న వాక్యానికి స్వస్తి చెబుతున్నాను.  


H A P P Y     N E W    YEAR 
- కర్లపాలెం హనుమంతరావు


Saturday, December 10, 2016

పెళ్లిల్లో ఆర్భాటాలంత అవసరమా?!- ఈనాడు సంపాదకీయం

'పెళ్ళిచేసి చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఏ గృహస్థుకైనా ఈ రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు 'ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే'! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్నప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న ఆ వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభకార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే. ఆ బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు! 'అన్నింటికి సైచి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి అంతరిక్షనౌక ప్రయోగంతో సరిగ్గానే పోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్యమన్న అతగాడి చమత్కారం- అణాపైసల్లో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణ మండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదుపులో ఉండొచ్చు గానీ, అతిథుల ఆ పూట ఆకలి దప్పికలను ఏ సూపర్‌ కంప్యూటర్‌ అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు.

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగేది! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజనాదికాల కోసమేనని ఓ సంస్కృత శ్లోక చమత్కారం. 'జలసేవన గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడిలేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు ఓ భోజనప్రియుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మరి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరసపెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డు పెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవితానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని?! కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్‌'! పరగడుపున రాజులాగా, అపరాహ్ణం మంత్రిలాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికీ మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో అది శిరోధార్యం.

కల్యాణమంటే ఇద్దరు ఒకటయ్యే అర్థవంతమైన ముచ్చట. ఆత్మీయులు, బంధుమిత్రుల ముందు ఆ వేడుక ఎంత ప్రశాంతంగా జరుపుకొంటే అంత ముద్దు. అప్పు చేసి గొప్పగా పప్పన్నం పెట్టాలనుకోవడం తప్పు, అంతకుమించి ముప్పు. 'జుట్టెడు గడుపుకై చొరని చోట్లు చొచ్చి/ పుట్టెడు కూటికి బతిమాలే' అభాగ్యులు కోట్ల సంఖ్యలో పోగుపడిన దేశంలో విందు పేరిట అనవసర భేషజాలు, ఎడాపెడా వృథా చేయడాలు దారుణ నేరాల పద్దులోకే చేరతాయి. ఎంత భీమ బకాసురులైనా త్రిషష్టిత(63) సంవర్గ రస భేదాలను ఆస్వాదించడం కుదిరే పని కాదు. గొప్పకోసం చేసి చివరకు చెత్తకుప్పలమీదకు పారేసే విస్తరాకుల్లోని ప్రాణశక్తి ఎందరెందరినో ఆకలిచావుల పాలబడకుండా కాపాడగలదు. అటుకులు పిడికెడేనని కృష్ణయ్య కుచేలుడిని కాదు పొమ్మన్నాడా? బంధుమిత్రత్వాలకు విందుభోజనాలు కొలమానాలు, ప్రాతిపదికలు కానేకాదు. దేహమనే దేవాలయంలో ఆత్మారాముడి సంతృప్తికి ఫలం తోయం పరిమాణంతో కాక... ప్రేమతోనే నిమిత్తం. తినగ తినగ గారెలు వెగటు. ఆకలి సూచికలో అరవై మూడో స్థానంలోని మనదేశంలో అంత వెగటు పుట్టేదాకా తినాలనుకోవడమే అపచారం. వండి వృథా చేయడం క్షమించరాని నేరం. విందు వినోదాల్లో సాధారణంగా పదిహేనునుంచి ఇరవైశాతం దాకా ఆహార పదార్థాలు వృథా అవుతాయని ఆవేదన చెందుతున్నారు- 'హంగర్‌ ఎలిమినేషన్‌ అండ్‌ యూ' వ్యవస్థాపకులు వి.రాజగోపాల్‌. ఆ ఆవేదనలో కచ్చితంగా అర్థముంది. చెత్తకుండీలవద్ద ఎంగిలి విస్తళ్ల కోసం కుక్కలమధ్య కొట్లాడే కోట్లాది అన్నార్తులున్న అన్నగర్భ మనది. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి వైభోగంగా వివాహం చేసుకున్నా ఒకే వంటకానికి పరిమితం కావాలనే చట్టం తెచ్చే ఆలోచన మన పాలకులకు కలగటం ముదావహం. పొరుగున పాకిస్థాన్‌లో ఉన్నట్లు ఏకపాక శాసనం ఇక్కడా వచ్చేదాకా ఎందుకు... మనమందరం ముందుగానే మేలుకుందాం. స్వచ్ఛందంగా ఆహారవృథాను అరికడదాం. ఇంటికీ ఒంటికీ దేశానికీ అంతకంటే చేసే మేలు, సేవ ఏముంటుంది?

(ఈనాడు- సంపాదకీయం, ఈనాడు, 05-05-2011)

Thursday, December 1, 2016

పెళ్ళి చేసి చూడు!- పెద్దనోట్ల రద్దులో- సరదా గల్పిక


పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు  కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన  హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!
'పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు' అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే కక్కులా ఆగదు కదా! అందుకే కక్కా లేక.. మింగా లేక పాపం గుడ్లనీరు కక్కుకున్నాడు మా గవర్రాజు. ఆడబిడ్డను కన్న తండ్రులందరికీ ఆ గాలివారంత గుండె నిబ్బరం  ఉండడు! మేట్రిమోనియల్ మొదలు.. పిల్లని మెట్టినింట్లో దిగబెట్టిందాకా  దుడ్డు సంచుల్తోనే కదా ఏ శుభ కార్యమైనా? దుడ్లు దండిగా ఉన్నా సంచులు విప్పే ధైర్యం చాలకే గవర్రాజుకా గుడ్లు.. నీళ్లు! 
పెళ్లి కాబట్టి పిల్ల, పిల్లాడి జాతకాలు జత కలిసాయో.. లేదో చూసుకొన్నారు గానీ.. ప్రధాని మోదీజీ జాతకచక్రం కూడా ఈ మ్యాచికి మ్యాచవ్వాలన్న ఆలోచన రాలేదు.. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు! మోదీజీ మూడ్ ను గురించి ఏమాత్రం ఉప్పందినా  ఈ మూడు ముళ్ల ముచ్చటకిన్ని ముళ్ళు పడకుండా ముందస్తు చర్యలు తప్పక తీసుకొనిండేవాడే.  ఎప్పట్నుంచో రాజకీయాల్లో నలుగుతున్న ఘటం మా  గవర్రాజన్న! ఏదేవైఁనా ఒక్కసారి గుండెలమీది కుంపట్ని దించేసాయలనుకున్నాక.. దింపకపోతే ఆ కాకకి  గుండెలు మొత్తం మండే  ముప్పుంది.  ఆ ముప్పునుంచి తప్పించుకొనాలనే కాక  ఉన్న నలుపులో ఒక శాతమన్నా తెలుపవుతుందన్న యావా తోడయింది. శుభలేఖ వీడియోలు  బాలివుడ్ మెగామోవీ స్థాయిలో వైరలవడానికి అదే కారణం. 'మన్ కీ బాత్' అంటే ఎప్పట్లా ఏవో మనసులోని ముచ్చట్లు  బైట పెట్టుకుంటాడనుకొంటే.. పిల్ల మనువుకే మొప్పొచ్చే మెగాబాంబ్ బ్లాస్ట్ చేసేసాడు మోదీ సాబ్!
పెళ్ళంటే పప్పు కూడని పెద్దల శాస్త్రం. ఆ పప్పులో వేసే ఉప్పుకే చచ్చే కరువొచ్చి చచ్చిందిప్పుడు. పాతరేసిన పాత పెద్ద నోట్లమీదున్న భరోసాతో బంధుమిత్రలందరినీ 'సపరివార సమేతంగా' విచ్చేసి  చందన తాంబూల సత్కారాలందుకొని వధూవరులనాశీర్వదించమని ప్రార్థించాడు. 'మాయా బజారు' మార్కు 'వివాహ భోజనాలు' మహా ఆర్భాటంగా ఏర్పాటయ్యాయని టాకొస్తే చాలు.. మరో రెండు శాతం బ్లాక్ వైటవుతుందని   మా  గవర్రాజు తాలూకు ఆడిటర్ల బడాయి. పెద్ద నోట్ల రద్దుతో మనీ బజారు మొత్తం కుదేలవడంతో  మా వాడికిప్పుడు  బేజారు!
పంచ భక్ష్య పరమాన్నాల మాట ఆనక.. పాయసంలో వేసే పంచదారక్కూడా చిన్న నోట్లే కావాలని చిల్లర వ్యాపారులు అల్లరి మొదలు పెట్టేరు. పది రూపాయలైనా సరే బిళ్లగా కనబడితే .. బిచ్చగాడి బొచ్చెలోకి విసిరేసే దర్జా మా గవర్రాజు బాబుది. యాబై నోటే రంగులో ఉంటుందో కూడా మర్చి పోయిన మా దసరా బుల్లోడికి  ప్రధాని రద్దు  ప్రకటన మర్నాటినుంచి పిల్ల పెళ్ళంటే  పెద్ద 'చిల్లర' వ్యవహారంగా మారి కూర్చుంది. 
అన్ని రోజులూ ఎప్పట్లానే డబ్బున్నరాజాలవనుకున్నాడు మా రాజు. ఆ ధీమాతోనే  పిల్ల మామగారిముందు  పెళ్ళేర్పాట్లను గూర్చి తుపాకి రాముణ్ని మించి గొప్పలు పోయాడు. పెళ్ళారు అడక్కముందే మూడ్రోజుల పెళ్ళి.. ముఫ్ఫై రకాల వంటకాలు.. మహారాజా ప్యాలెస్ పందిళ్లు.. కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు లైట్లు! ఇహ పట్టు బట్టలు.. నగా నట్రలు.. విందు వినోదాల జాబితా చెప్పనే అక్కర్లేదు.  మారిన పరిస్థితుల వల్ల కిలో బెల్లానిక్కూడా  కొత్త రెండు వేల నోటు బైటికి తీయాల్సొస్తుందిప్పుడు. బ్యాంకోళ్లు విదిల్చే ముష్టి రెండున్నర లక్షల్తో ఇహ లక్షణంగా పెళ్ళి చేసే మాట కేవలం కల్లోనే!
పెళ్లంటే తాళాలు.. మేళాలంటారు. బీరువా తాళాలేవీ బైటికి తీయకుండా ఎంత ఘనంగానైనా చేసుకోండంటున్నారు ఆర్బీఐ గవర్నరు గారు! ఇదేం మేళం?బాజా భజంత్రీలు మోగించే వాడికైనా బయానాకింద తాంబూలంలో విధాయకంగా పెట్టివ్వడానికి కనీసం ఓ వందో.. అదొందలో ఉండాలి గదా? వంద నోటు కనిపించదు. కొత్తైదొందల నోటు కరుణించదు! పెళ్ళనుకుంటున్నప్పట్నుంచీ పిల్లదాని అత్తారిల్లు ఎలాగుండబోతుందోనని అల్లాడిపోతున్న గవర్ర్రాజుకిప్పుడు  గవర్నరాఫ్ ఆర్బిఐ గ వైఖరి ఎలాగుంటుందోనన్న బెంగ మొదలయింది. మామూలు పెళ్లయితే మగ పెళ్లివాళ్లని చూసుకుంటే సరిపోయేది. ఈ పెద్ద నోట్ల రద్దు తరువాత సర్కారు పన్నుల శాఖవాళ్లను కూడా చూసుకోవాల్సొస్తోంది. పాయసంలో రెండు జీడి బద్దలెక్కువ పడ్డా ఈడీ శాఖ వివరాలడిగేస్తుంది. పిల్ల, పిల్లాడికి పళ్లెంలో  పట్టు వస్త్రాలు పెట్టిద్దామన్నా అమ్మకాల పన్ను శాఖెక్కడ పట్టుకుంటుందోనని పీకులాటయిపోయింది! పెళ్లి పీటలమీద  కట్నకానుకలు చదివింపులప్పుడు కూడా లెక్కగా రాసుకునే బంధువుల పక్కనే ముక్కాల పీటేసుకొని బైఠాయిస్తుంటిరి ఆదాయప్పన్ను డేగ గాళ్లు! అడకత్తెర్లో పోక చెక్క బతుకై పోయింది పాపం మా గవర్రాజు బతుకు. పెద్ద నోట్ల పాతర దొడ్డెనకుందన్న నిబ్బరం.  అత్తారేవీఁ అడగనే లేదు.  పిలదాని మెళ్లో నిఖార్సైన  నవరసుల నాన్తాడు నాలుగైదు కిలోలది   ప్రొద్దుటూరు సరుకు దిగేస్తానన్నాడు. దాంతాడు తెగ.. ధడాల్మనీ రద్దు పిడుగొచ్చి పడుతుంద నెవడు కలగన్నాడు? వట్టి దారప్పోగుకింత పసుపు ముద్ద రాసి సొంఠికొమ్ము తాళి  వేలాడేస్తానంటూ  నానుస్తున్నాడిప్పుడు పాపం!   తక్కువ చేస్తే వియ్యాలవారితో తంటా! ఎక్కువ చేస్తే ఎన్ఫోర్సుమెంటు పెద్దల్తో పెంట!
సంభావన పంతుల్నుంచి.. సన్నాయి  భజంత్రీల దాకా అందరి చేతుల్లో తలా ఓ కొత్త రెండు వేల నోటు పెట్టుకుంటే పోతే .. ఇహ అల్లుడి పెట్టుపోతలప్పుడు పెట్టుకోడానికి మిగిలుండేది నోట్లకట్టకు మిగిలుండే ప్లాస్టిక్ బాండే! భూనభోంతరాళు దద్దరిల్లేట్లు పిల్ల పెళ్లి చెయ్యాలని పాపం ఇంతప్పట్నుంచి అడ్డమైన గడ్డి కరిచీ ఈ పెద్ద నోట్లు పోగేసాడు మా గవర్రాజు. ఇప్పుడు అలక పాన్పుమీద అందరల్లుళ్లల్లా ఏ బైకో.. టీవీనో.. టాబ్లెట్టో.. అడిగుంటే..  అదో రకం! చెక్కో.. డ్రాఫ్టో.. నెఫ్టో.. నెట్టో.. డెబిటో.. క్రెడిటో.. ఆ కార్డులు గీకో.. కంప్యూటర్ మీటలు కొట్టో అల్లుడి ముచ్చట తీర్చుండే వాడు! ముందనుకున్న కట్నంలో మిగిలున్న బకాయి మూడుకోట్లు మొత్తం చిల్లర పైసల రూపంలో ఒకే మూటగా చెల్లించాలని మంకు పట్టు పట్టుక్కూర్చున్నాడు! చెల్లని వెయ్యి నోటులా వెల వెలా పోతున్న మా గవర్రాజన్న ముఖం చూస్తుంటే.. చెప్పద్దూ.. పాపం.. ఆ మాజీ
టాటా చైర్మన్ మిస్త్రీ మొహమే మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది!తల తాకట్టైనా పెట్టి పెళ్లి గండం గట్టెక్కే తల్లిదండ్రులకీ దేశంలో కొదవేం లేదు కానీ.. తాకట్టుకొట్టు వాడి గల్లా పెట్లోనైనా లెక్కకు పనికొచ్చే చిల్లర ఉండాలి కదా!
చిల్లరమీదే కదా ఇవాళ దేశంలో ఈ అల్లరి ఆర్భాటమంతా?

మోదీజీ ఆర్థిక  సంస్కరణల పుణ్యం! రాబోయే రోజుల్లో పెళ్లి చూపుల్నుంచే పెను మార్పులు తథ్యం! పిల్లాడిది 'ఆధారపడే ఉద్యోగమా?.. ఉపాధా?' అన్న ఆరా ఆనక తీరిగ్గా.  ముందసలు 'ఆధార్ కార్డు ఉందా.. లేదా' అని  తరిచి చూడడం ముఖ్యం పెళ్లికూతురు తరుఫు వాళ్లకిక.  ఆరోగ్య పరీక్షల ధృవీకరణ పత్రాలు  వెంట లేకుండా వధూవరులెవరూ పెళ్లి చూపులకు సిద్ధమవలేరు. రోజులకొద్దీ బ్యాంకులముందు.. ఏటియంల ముందు ఎండ.. వాన.. చలి.. కాలుష్యాలకు తట్టుకొని  తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడేపాటి  శరీర దార్ధ్యం కాబోయే భర్తగారికి తప్పని సరి. ఒక్కో బ్యాంకుకొక్కో శాల్తీ.. ఏటియంతో కలిపి కుటుంబానికో   డజను జతల కాళ్లు   తప్పని సరి. ఆపాటి బిడ్డల్ని కనేపాటి ఆరోగ్యం కాబోయే భార్యకూ కంపల్సరి!
ఏమో.. ముందు ముందు మరిన్ని తీవ్రమైన చర్యలుంటాయని సంకేతాలిస్తున్నారు కదా మోదీజీ ఇప్పట్నుంచే!
-కర్లపాలెం హనుమంతరావు



 (వాకిలి- అంతర్జాల పత్రిక- డిసెంబరు- 2016-లాఫింగ్ గ్యాస్ గా ప్రచురితం)

Wednesday, November 23, 2016

మూడు “ప్రార్థన” పద్యాలు
రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ప్రార్థన పద్యాలు అనంగానే, సాధారణంగా మనకు గుర్తుకొచ్చేవి మనం చిన్నప్పుడు బట్టీ పట్టిన పద్యాలు. “ తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌,” అన్న పద్యమో, “సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ,” అన్న శ్లోకమో, లేకపోతే, “తుండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్‌” లాంటి పద్యమో చటుక్కున స్ఫురిస్తుంది.

నేను ప్రస్తావించబోయే ప్రార్థన పద్యాలు, మనం చిన్నప్పుడు నేర్చిన పద్యాల వంటివి కావు. అంతేకాదు. మనం పెద్దైన తరువాత, ఏ కావ్యాలనుంచో, ప్రబంధాలనుంచో, నేర్చుకున్న పద్యాలూ కావు. అంటే, “శ్రీరామా కుచమండలీ మృగమద శ్రీగంధ సంవాసిత స్ఫారోదార భుజాంతరుండు,” లేదా, “అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి చన్‌ కబళించబోయి,” లాంటి శృంగారరస భూయిష్టమైన ప్రార్థన పద్యాలు అసలే కాదు.

చిన్నప్పటి ప్రార్థన పద్యాల్లో, నాకు మంచి జరగాలనో, లేకపోతే నేను ప్రారంభించిన పని సవ్యంగా నిర్విఘ్నంగా జరగాలనో, అనే స్వార్థఫలాపేక్షత ఉంటుంది. కావ్యప్రబంధ ప్రార్ధన పద్యాల్లోకూడా ప్రభువుకి, తనకీ శుభం జరగాలనే వాంఛ ఉంటుంది.

ప్రార్థన అంటే, అడగటం, యాచించడం అని అర్థం. తనకి నప్పిన దేవుడినో దేవతనో తన మంచి కోసం యాచించటం ప్రార్థన ముఖ్య లక్ష్యం. ఆలోచించి చూస్తే, ప్రభువుకి శుభం కోరుకుంటూ, దేవుణ్ణి యాచించడం కూడా స్వార్థమే. ప్రభువు బాగుంటే, కవికీ సుఖమే.

ప్రార్థన పద్యంలో, సాధారణంగా మనం కవి ఏమి కోరుతున్నాడో అన్నదానికి ప్రాధాన్యత నిస్తాము. కవిని వ్యక్తిగా చూడం. కవి ఏ విషయాలకు, ఎందుకని ప్రాథాన్యతనిస్తున్నాడో పట్టించుకోము. నేను వ్యాఖ్యానించబోయే ప్రార్థన పద్యాలలో కవి నమ్మిన విలువలు తన కోరికలకన్నా ముఖ్యం.

నేను ప్రస్తావించబోయే మొదటి “ప్రార్థన” పద్యం యాచన పద్యమే కాని, స్వార్థం కోసం అడుక్కునే పద్యం కాదు.

దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 1963 లో రాసిన పద్యం “ ప్రార్ధన.”

దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపాసర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళనుండి వారిపూజారులనుండి
వారి వారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురుపరంపరనుండి
దేవుడా
నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం వున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
విరివిగా వున్న విచిత్ర సౌధం మాది
కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం
బ్రతుకుపొడుగునా స్వతంత్రం
కొంచెం పుణ్యం కించిత్‌ పాపం
కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
హాయిహాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మాచుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు

దేవుడా
కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
మాసిపోయిన అక్షరాల్ని వివరించు
రహస్యసృష్టి సానువులనుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
చావు పుట్టుకలమధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకే ఒక అలంకారం
మజిలీ మజిలీ కి అలిసిపోతున్నాం
మలుపుమలుపికీ రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాంపుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని
ఆదమరిచి కాసేపు విశ్రమించడానికనుమతించు తండ్రీ.

ఈ పద్యాన్ని మూడు భాగాలు చేసి చూస్తే వ్యాఖ్యానం తేలిక. మొదటి భాగంలో, కవి ఫలానా ఫలానా వాళ్ళబారినుంచి నా దేశాన్ని రక్షించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. యాచిస్తున్నాడు అన్నా తప్పు లేదు. దేశప్రజలని ముఖ్యంగా రాజకీయ దురంధరులనుంచి రక్షించమంటున్నాడు. పెద్దపులులనీ, పెద్దమనుషులనీ (వీళ్ళు కవి ఉద్దేశంలో రాజకీయ నాయకులే) ఒకే ఊపులో కలిపాడు. అది చక్కని విశేషం. నిజమో కాదో నాకు తెలీదు కానీ, పెద్దపులి తను కన్నపిల్లలని, తనే తింటుందని నానుడి.. అంతే కాదు. ఈ పెద్దపులి జాతివాళ్ళు, “నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాలు,” కూడాను. వాళ్ళబారినుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాడు, తిలక్‌. ఈ భాగంలో తిలక్‌ గొప్ప అభ్యుదయవాదిగా (progressive) కనిపిస్తాడు. అంతేకాదు, ఇంతకు పూర్వం ప్రజలలో “దేవుడి” గురించి స్థిరపడ్డ అభిప్రాయాలని ఖండించిన వాడిగా కనిపిస్తాడు.

రెండవ భాగంలో తన దేశప్రజల ఆశలు, ఆవేదనలు, వాళ్ళ చిరు కోరికలు ఆ దేవుడికి చెప్పుతున్నాడు. “కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం, బ్రతుకుపొడుగునా స్వతంత్రం, కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ చాలు మాకు తండ్రీ,” అని చెపుతూ, “సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయిహాయిగా బ్రతుకుతాం,” అని హామీ ఇస్తున్నాడు. మొదటి భాగంలో దేవుడు చెయ్యవలసిన పని పూర్తి చేసినతరువాతే ఈ హామీ అని మనం ఊహించుకోవాలి. రెండవ భాగానికొచ్చేటప్పటికి, తిలక్‌ మానవతావాదం, humanism ని మనం చూస్తాం.

మూడవ భాగం మొదటి నాలుగు చరణాలూ చదవంగానే తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో అని నా భావం) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. తరువాతి పాదాలలో కవిగా తిలక్‌ నిజస్వరూపం కనిపిస్తుంది. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకేకవి రాయగలడు? ఆఖరి పాదాల్లో వెంటనే తన నిసృహ, disappointment కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.

తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌ కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి. అందుకనే ఈ పద్యం ఈ శతాబ్దానికి మప్పే చక్కని ప్రార్థన పద్యం అంటాను.

నే చెప్పబోయే రెందవ ప్రార్థన పద్యం, చెరబండరాజు (బద్దం భాస్కర రెడ్డి) రాసిన “వందేమాతరం.” ఇది సెప్టెంబర్‌ 1968 లో వచ్చిన పద్యం. దిగంబరకవుల మూడవ సంపుటి, “నేటి కుష్ఠు వ్యవస్థపై దిగంబరకవులు,” లో మొదటి పద్యం.

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటొమీద గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో
కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో
వీధిన బడ్డసింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం.

చెరబండరాజుకి భారతదేశం, భారతమాత, దేవతా మాత. ఏమీ చేతకాని, ఏమీ చెయ్యలేని కన్న తల్లి. దేవత. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి, ఆ దైవత్వం ఒక ప్రతీకగా వాడాడు చెరబండరాజు. ఆ దేవత అందం, యవ్వనం, ముఖ్యంగా శీలం గురించి జుగుప్స కలిగించే మాటలు వాడుతాడు. మాతృదేశం పై విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు. చరణం చరణం లోనూ తన బాధ, కోపం వ్యక్తం అవుతుంది. “నోటికందని సస్యశ్యామల సీమ,” తన భారత మాత.

తన మాతృదేశదేవత ధైర్యం, దీనత్వం, శోకం, తనని నిలువెత్తునా సిగ్గుతో ముంచేస్తాయి. ఆ దేవత గమ్యం అగమ్యం అయ్యిందని అని వాపోతాడు. అంతకు ముందు ఏ కవీ వాడని ఉపమానాలు, ప్రతీకలూ, అప్పటిలో నవ కవిత్వానికి shock treatment ఇచ్చాయని ఒప్పుకోక తప్పదు. “సమాజం అంతగా పతనమైందా?” అన్న మకుటంతో రాచమల్లు రామచంద్రా రెడ్డి సంవేదన లో ఈ సంకలనాన్నీ సమీక్షిస్తూ దుమ్మెత్తి పోశాడు. ఆ రోజుల్లో దిగంబరకవులు కవిత్వానికి ఇచ్చిన shock treatment గుర్తించలేకపోయాడు. ఇప్పుడు, మూడున్నర దశాబ్దాల తరువాత, భారతమాతలో, అంటే సామాన్య ప్రజల జీవితంలో వచ్చిన మార్పు పరంగా ఈ పద్యాన్ని పరిశీలిస్తే, చెరబండరాజుకి ఆరోజుల్లో వచ్చిన కోపం సబబేనని అనిపించక మానదు. అంతేకాదు. ప్రపంచీకరణకు వ్యతిరేకత ప్రతిధ్వనించే ఈ పద్యం, సమయోచితమైన పద్యం.

చెరబండరాజు నాస్తికుడు. ఇది ప్రార్థన పద్యం అన్నందుకు నేను సంజాయిషీ చెప్పు కోవాలి. తిలక్‌, చెరబండరాజు, ఇద్దరూ, భారతదేశ శ్రేయస్సు కోరుకుంటూ బాధ పడ్డవాళ్ళే. తిలక్‌, తనకు తెలియని దేవుణ్ణి మార్పు కోసం ప్రార్థించాడు, ఆ దేవుడు ఏమీ చెయ్యలేడని తెలిసికూడా. చెరబండరాజు తను చిత్రించిన దేవత, తన భారతదేశం, గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్న దేవత. మార్పు కోసం తపించే కవికి దేవత. మార్పు తప్పకుండా రావాలనే కోరిక, మార్పు తప్పకుండా వస్తుందనే గాఢ నమ్మకం ఉండబట్టే ఇంత విసురుగా రాయగలిగాడు. ఆ నమ్మకం అతనికి ఉందని నేను నమ్మబట్టే, ఇదికూడా ప్రార్థన పద్యం అన్నాను.

మూడవ ప్రార్థన పద్యం, జి. యస్‌. రామ్మోహన్‌, ఏప్రిల్‌ 2003 న ఆంధ్రజ్యోతి లో ప్రచురించిన, “యుద్ధప్రభు స్తోత్రము.” ముందుగా పద్యాన్ని చదవండి. ఒకటి కి రెండుసార్లు చదవండి. అప్పుడు దీనిని ప్రార్థన పద్యం అని ఎందుకు అన్నానో బోధ పడచ్చు.

పెద్ద శబ్దముతోనూ, మిరుమిట్లు గొలుపు కాంతులతోనూ నీ రాకడ ప్రకటించుచున్న ప్రభువా
పూమొగ్గలకు కరవాలము బదులొసగిన కరుణామయుడా
పసిబుగ్గలను లోహవిహంగాలతో గిల్లిన క్షిపణాగా
ముల్లోకములకు శక్తిమంతుడవైన అయ్యా
నిన్నేమని పిలిచెదము తండ్రీ.
లక్షలాది ఆదిమవాసుల బలిపీఠమును ఆసనముగా
మార్చుకున్న రారాజా
ఏడుజాములలో మెసపొటేమియా చంద్రుణ్ణి ఎర్రబార్చిన వాడా
ఆదియు అంతమూ మూలమూ లేక అంతటా నీవై
కంచరగాడిదలా సంచరించు సర్వేశ్వరా
అణువు పరమాణువు అన్నీ తానైన వాడా
నిన్నెన్నని అనమురా నాయనా
రంగునీళ్ళిచ్చి రక్తాన్ని కొలుచుకు పోగలిగిన బుద్ధిశాలీ
సమాచారమే జ్ఞానమని, బలమే సత్యమని మా చక్షువులు తెరిపించిన దివ్యమూర్తీ
నీ రక్తముతో పాప పరిహారము చేసుకొనుటకు లోకము వేచియున్నది నాయనా
నీఘనతను బలపరుచుటకు
ఒక శిలువను తయారుచేయుచున్నారము తండ్రీ.
ఆమెన్‌

గ్రీకు పురాణాలలో ఆరెజ్‌ (Ares) అనబడేవాడు యుద్ధ దేవుడు. మన దేవుళ్ళలో కేవలం యుద్ధం యుద్ధంకోసమే కోరే దేవుడెవడూ ఉన్నట్టూ కనిపించడు. ఈ ఆరెజ్‌ గురించి కొంత వివరణ అవసరం. ఆరెజ్‌, గ్రీకు పురాణాలలో జూస్‌ అనే వాడి కొడుకు. గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఆరెజ్‌ కి సరదా. వీడికి, యుద్ధంలో గెలుపు, ఓటమీ ముఖ్యం కాదు, కేవలం రక్తపాతమే ముఖ్యం. పరమ దుర్మార్గులు వీడి సహాధ్యాయులు. ఎల్లప్పుడూ వీళ్ళవెన్నంటి కరువుకాటకాలు, బాధ, సంక్షోభం ఉంటాయి. ఆరెజ్‌ అన్నా, వాడి పనులన్నా, వాడినాన్న జూస్‌ కి కూడ అసహ్యమే! యుద్ధప్రభు స్తోత్రాన్ని, ఈ నేపథ్యంలో చదవాలి.

అయితే, ఈ పద్యం రామ్మోహన్‌ ఎవరిని ఉద్దేశించి రాసాడో చెప్పడం అనవసరం అనుకుంటాను. ఈ పద్యంలో వ్యాజ స్తుతి లేదు, వ్యాజ నిందే ఉన్నది. ప్రతి ఒక్క పాదమూ, ఒక వ్యంగ్య సూక్తి. పాదపాదనికీ కొట్టొచ్చినట్టు కనుపించేది ప్రస్తుత ప్రపంచ రాజకీయాలపై వ్యంగ్యం. మతానికి సంబంధించిన పూర్వకథలన్నీ కవి వ్యంగ్యానికి చక్కని ప్రతీకలు. అనవసరమైన అరుపులు, అర్థంలేని నినాదాలు ఏమీ లేకుండా, ఈ క్రొత్త “యుద్ధదేవుని” పై సహజమైన అసహ్యతను, చక్కని చిన్న చిన్న మాటలలో పేర్చి, ఈ “దేవుడి” నిజ స్వరూపాన్ని బట్టబయలు పెట్టిన పద్యం ఇది. ఈ మధ్య కాలంలో ఇంత చక్కని వ్యంగ్య పద్యం రాలేదు.

ఆరెజ్‌ తో నే పోల్చిన ఈ యుద్ధదేవుడి లక్షణాలు చాల విచిత్రంగా కనుపిస్తాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర. “లక్షలాది ఆదిమవాసులను బలిపీఠమును ఆసనంగా చేసుకొని, అణువు పరమాణువు తానేఅయి, రంగునీళ్ళిచ్చి రక్తం కొలుచుకోపోగలిగిన బుద్ధి శాలి, ఈ “దేవుడు.” వీడి రక్తముతో పాపపరిహారం చేసుకోటానికి లోకం వేచియున్నది అన్న పాదం చదవగానే, ఒక్క క్షణం క్రీస్తు ప్రభువు స్పృహకి రాక మానడు. కానీ ఆ పాదంలో క్రీస్తు ప్రసక్తి ఏమాత్రమూ లేదు. క్రీస్తు కి పూర్తిగా వ్యతిరిక్త ప్రతీక, ఇది. క్రీస్తు ప్రభువుకి శిలువ వేయడం మూలంగా ప్రపంచ ప్రజల బాధలు మరుగున పడలేదు కానీ, ఈ యుద్ధ ప్రభువుని శిలువపైకెక్కించితే, ప్రపంచ ప్రజలు కాస్తన్నా సుఖపడతారన్న నమ్మిక ఈ పద్యం వెనుక ఉంది.

ఇంతకు ముందు చెప్పిన రెండు పద్యాలనీ ప్రార్థన పద్యాలు అన్నందుకు నామీద కోపాం రాక పోవచ్చు. కానీ, ఇది ప్రార్థన పద్యం అన్నందుకు, చాలమందికి కోపం రావచ్చు. నా ఉద్దేశం లో ఈ పద్యం, పై రెండు పద్యాలకన్నా గొప్ప పద్యం. విలువ కట్టలేని, విలువ కట్టకూడని పద్యం. రక్తం కోరే “ప్రభువు” ల బలాధిక్యతని ఈసడించుకునే పద్యం. ఇది ఏ విధంగానూ యాచన పద్యం కాదు. ఇది మనమందరం అహర్నిశలూ గుర్తుంచుకోవలసిన మంచి పద్యం. అందుకనే ఇది ప్రార్థన పద్యం.

ఆఖరిగా ఒక మాట.

ఋగ్వేదంలో పదవ మండలంలో నూటముప్ఫై ఒకటవ సూక్తం, నాసదీయ సూక్తం అంటారు. ఏదు శ్లోకాలలో సృష్టి క్రమాన్ని సూచిస్తూ చెప్పిన సూక్తం, నాసదీయ సూక్తం. ఆఖరి శ్లోకం సృష్టికర్త (?) అస్తిత్వాన్ని, ఎరుకనీ, శంకింస్తుంది. ఈ సృష్టికర్త (?) పరమ అమాయకుడా??

ఋగ్వేదంలో దేవతలపై ప్రార్థనలన్నీ ఒక ఎత్తు. ఈ ఒక్క సూక్తం ఒక ఎత్తు. ఈ సూక్తాన్ని అనేకమంది అనువదించారు, వ్యాఖ్యానించరు. దీనిపై బోలెడు రాశారు. ఈ సూక్తంలో ఏదవ శ్లోకంఇది.

ఇయం విసృష్టిర్యత అ బభూవ
యది వా దధే యది వా న
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్‌ త్సో
అంగవేద యది వా న వేద
Whence all creation had its origin,
he, whether he fashioned it, or whether he did not,
he who surveys it all from highest heaven,
he knows – or may be even he does not know.
– A. L. Basham’s translation.
నేను చెప్పిన మూడు ప్రార్థన పద్యాలలో, ముఖ్యంగా చివరి రెండు పద్యాలనీ కాస్త లోతుగా తరిచి చూస్తే, పైన చెప్పిన ఋగ్వేద సూక్తం ఆఖరి శ్లోకం ఆఖరి పాదం స్పర్శ కనిపించక మానదు. ఆలోచించండి

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...