Thursday, December 1, 2016

పెళ్ళి చేసి చూడు!- పెద్దనోట్ల రద్దులో- సరదా గల్పిక


పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు  కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన  హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!
'పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు' అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే కక్కులా ఆగదు కదా! అందుకే కక్కా లేక.. మింగా లేక పాపం గుడ్లనీరు కక్కుకున్నాడు మా గవర్రాజు. ఆడబిడ్డను కన్న తండ్రులందరికీ ఆ గాలివారంత గుండె నిబ్బరం  ఉండడు! మేట్రిమోనియల్ మొదలు.. పిల్లని మెట్టినింట్లో దిగబెట్టిందాకా  దుడ్డు సంచుల్తోనే కదా ఏ శుభ కార్యమైనా? దుడ్లు దండిగా ఉన్నా సంచులు విప్పే ధైర్యం చాలకే గవర్రాజుకా గుడ్లు.. నీళ్లు! 
పెళ్లి కాబట్టి పిల్ల, పిల్లాడి జాతకాలు జత కలిసాయో.. లేదో చూసుకొన్నారు గానీ.. ప్రధాని మోదీజీ జాతకచక్రం కూడా ఈ మ్యాచికి మ్యాచవ్వాలన్న ఆలోచన రాలేదు.. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు! మోదీజీ మూడ్ ను గురించి ఏమాత్రం ఉప్పందినా  ఈ మూడు ముళ్ల ముచ్చటకిన్ని ముళ్ళు పడకుండా ముందస్తు చర్యలు తప్పక తీసుకొనిండేవాడే.  ఎప్పట్నుంచో రాజకీయాల్లో నలుగుతున్న ఘటం మా  గవర్రాజన్న! ఏదేవైఁనా ఒక్కసారి గుండెలమీది కుంపట్ని దించేసాయలనుకున్నాక.. దింపకపోతే ఆ కాకకి  గుండెలు మొత్తం మండే  ముప్పుంది.  ఆ ముప్పునుంచి తప్పించుకొనాలనే కాక  ఉన్న నలుపులో ఒక శాతమన్నా తెలుపవుతుందన్న యావా తోడయింది. శుభలేఖ వీడియోలు  బాలివుడ్ మెగామోవీ స్థాయిలో వైరలవడానికి అదే కారణం. 'మన్ కీ బాత్' అంటే ఎప్పట్లా ఏవో మనసులోని ముచ్చట్లు  బైట పెట్టుకుంటాడనుకొంటే.. పిల్ల మనువుకే మొప్పొచ్చే మెగాబాంబ్ బ్లాస్ట్ చేసేసాడు మోదీ సాబ్!
పెళ్ళంటే పప్పు కూడని పెద్దల శాస్త్రం. ఆ పప్పులో వేసే ఉప్పుకే చచ్చే కరువొచ్చి చచ్చిందిప్పుడు. పాతరేసిన పాత పెద్ద నోట్లమీదున్న భరోసాతో బంధుమిత్రలందరినీ 'సపరివార సమేతంగా' విచ్చేసి  చందన తాంబూల సత్కారాలందుకొని వధూవరులనాశీర్వదించమని ప్రార్థించాడు. 'మాయా బజారు' మార్కు 'వివాహ భోజనాలు' మహా ఆర్భాటంగా ఏర్పాటయ్యాయని టాకొస్తే చాలు.. మరో రెండు శాతం బ్లాక్ వైటవుతుందని   మా  గవర్రాజు తాలూకు ఆడిటర్ల బడాయి. పెద్ద నోట్ల రద్దుతో మనీ బజారు మొత్తం కుదేలవడంతో  మా వాడికిప్పుడు  బేజారు!
పంచ భక్ష్య పరమాన్నాల మాట ఆనక.. పాయసంలో వేసే పంచదారక్కూడా చిన్న నోట్లే కావాలని చిల్లర వ్యాపారులు అల్లరి మొదలు పెట్టేరు. పది రూపాయలైనా సరే బిళ్లగా కనబడితే .. బిచ్చగాడి బొచ్చెలోకి విసిరేసే దర్జా మా గవర్రాజు బాబుది. యాబై నోటే రంగులో ఉంటుందో కూడా మర్చి పోయిన మా దసరా బుల్లోడికి  ప్రధాని రద్దు  ప్రకటన మర్నాటినుంచి పిల్ల పెళ్ళంటే  పెద్ద 'చిల్లర' వ్యవహారంగా మారి కూర్చుంది. 
అన్ని రోజులూ ఎప్పట్లానే డబ్బున్నరాజాలవనుకున్నాడు మా రాజు. ఆ ధీమాతోనే  పిల్ల మామగారిముందు  పెళ్ళేర్పాట్లను గూర్చి తుపాకి రాముణ్ని మించి గొప్పలు పోయాడు. పెళ్ళారు అడక్కముందే మూడ్రోజుల పెళ్ళి.. ముఫ్ఫై రకాల వంటకాలు.. మహారాజా ప్యాలెస్ పందిళ్లు.. కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు లైట్లు! ఇహ పట్టు బట్టలు.. నగా నట్రలు.. విందు వినోదాల జాబితా చెప్పనే అక్కర్లేదు.  మారిన పరిస్థితుల వల్ల కిలో బెల్లానిక్కూడా  కొత్త రెండు వేల నోటు బైటికి తీయాల్సొస్తుందిప్పుడు. బ్యాంకోళ్లు విదిల్చే ముష్టి రెండున్నర లక్షల్తో ఇహ లక్షణంగా పెళ్ళి చేసే మాట కేవలం కల్లోనే!
పెళ్లంటే తాళాలు.. మేళాలంటారు. బీరువా తాళాలేవీ బైటికి తీయకుండా ఎంత ఘనంగానైనా చేసుకోండంటున్నారు ఆర్బీఐ గవర్నరు గారు! ఇదేం మేళం?బాజా భజంత్రీలు మోగించే వాడికైనా బయానాకింద తాంబూలంలో విధాయకంగా పెట్టివ్వడానికి కనీసం ఓ వందో.. అదొందలో ఉండాలి గదా? వంద నోటు కనిపించదు. కొత్తైదొందల నోటు కరుణించదు! పెళ్ళనుకుంటున్నప్పట్నుంచీ పిల్లదాని అత్తారిల్లు ఎలాగుండబోతుందోనని అల్లాడిపోతున్న గవర్ర్రాజుకిప్పుడు  గవర్నరాఫ్ ఆర్బిఐ గ వైఖరి ఎలాగుంటుందోనన్న బెంగ మొదలయింది. మామూలు పెళ్లయితే మగ పెళ్లివాళ్లని చూసుకుంటే సరిపోయేది. ఈ పెద్ద నోట్ల రద్దు తరువాత సర్కారు పన్నుల శాఖవాళ్లను కూడా చూసుకోవాల్సొస్తోంది. పాయసంలో రెండు జీడి బద్దలెక్కువ పడ్డా ఈడీ శాఖ వివరాలడిగేస్తుంది. పిల్ల, పిల్లాడికి పళ్లెంలో  పట్టు వస్త్రాలు పెట్టిద్దామన్నా అమ్మకాల పన్ను శాఖెక్కడ పట్టుకుంటుందోనని పీకులాటయిపోయింది! పెళ్లి పీటలమీద  కట్నకానుకలు చదివింపులప్పుడు కూడా లెక్కగా రాసుకునే బంధువుల పక్కనే ముక్కాల పీటేసుకొని బైఠాయిస్తుంటిరి ఆదాయప్పన్ను డేగ గాళ్లు! అడకత్తెర్లో పోక చెక్క బతుకై పోయింది పాపం మా గవర్రాజు బతుకు. పెద్ద నోట్ల పాతర దొడ్డెనకుందన్న నిబ్బరం.  అత్తారేవీఁ అడగనే లేదు.  పిలదాని మెళ్లో నిఖార్సైన  నవరసుల నాన్తాడు నాలుగైదు కిలోలది   ప్రొద్దుటూరు సరుకు దిగేస్తానన్నాడు. దాంతాడు తెగ.. ధడాల్మనీ రద్దు పిడుగొచ్చి పడుతుంద నెవడు కలగన్నాడు? వట్టి దారప్పోగుకింత పసుపు ముద్ద రాసి సొంఠికొమ్ము తాళి  వేలాడేస్తానంటూ  నానుస్తున్నాడిప్పుడు పాపం!   తక్కువ చేస్తే వియ్యాలవారితో తంటా! ఎక్కువ చేస్తే ఎన్ఫోర్సుమెంటు పెద్దల్తో పెంట!
సంభావన పంతుల్నుంచి.. సన్నాయి  భజంత్రీల దాకా అందరి చేతుల్లో తలా ఓ కొత్త రెండు వేల నోటు పెట్టుకుంటే పోతే .. ఇహ అల్లుడి పెట్టుపోతలప్పుడు పెట్టుకోడానికి మిగిలుండేది నోట్లకట్టకు మిగిలుండే ప్లాస్టిక్ బాండే! భూనభోంతరాళు దద్దరిల్లేట్లు పిల్ల పెళ్లి చెయ్యాలని పాపం ఇంతప్పట్నుంచి అడ్డమైన గడ్డి కరిచీ ఈ పెద్ద నోట్లు పోగేసాడు మా గవర్రాజు. ఇప్పుడు అలక పాన్పుమీద అందరల్లుళ్లల్లా ఏ బైకో.. టీవీనో.. టాబ్లెట్టో.. అడిగుంటే..  అదో రకం! చెక్కో.. డ్రాఫ్టో.. నెఫ్టో.. నెట్టో.. డెబిటో.. క్రెడిటో.. ఆ కార్డులు గీకో.. కంప్యూటర్ మీటలు కొట్టో అల్లుడి ముచ్చట తీర్చుండే వాడు! ముందనుకున్న కట్నంలో మిగిలున్న బకాయి మూడుకోట్లు మొత్తం చిల్లర పైసల రూపంలో ఒకే మూటగా చెల్లించాలని మంకు పట్టు పట్టుక్కూర్చున్నాడు! చెల్లని వెయ్యి నోటులా వెల వెలా పోతున్న మా గవర్రాజన్న ముఖం చూస్తుంటే.. చెప్పద్దూ.. పాపం.. ఆ మాజీ
టాటా చైర్మన్ మిస్త్రీ మొహమే మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది!తల తాకట్టైనా పెట్టి పెళ్లి గండం గట్టెక్కే తల్లిదండ్రులకీ దేశంలో కొదవేం లేదు కానీ.. తాకట్టుకొట్టు వాడి గల్లా పెట్లోనైనా లెక్కకు పనికొచ్చే చిల్లర ఉండాలి కదా!
చిల్లరమీదే కదా ఇవాళ దేశంలో ఈ అల్లరి ఆర్భాటమంతా?

మోదీజీ ఆర్థిక  సంస్కరణల పుణ్యం! రాబోయే రోజుల్లో పెళ్లి చూపుల్నుంచే పెను మార్పులు తథ్యం! పిల్లాడిది 'ఆధారపడే ఉద్యోగమా?.. ఉపాధా?' అన్న ఆరా ఆనక తీరిగ్గా.  ముందసలు 'ఆధార్ కార్డు ఉందా.. లేదా' అని  తరిచి చూడడం ముఖ్యం పెళ్లికూతురు తరుఫు వాళ్లకిక.  ఆరోగ్య పరీక్షల ధృవీకరణ పత్రాలు  వెంట లేకుండా వధూవరులెవరూ పెళ్లి చూపులకు సిద్ధమవలేరు. రోజులకొద్దీ బ్యాంకులముందు.. ఏటియంల ముందు ఎండ.. వాన.. చలి.. కాలుష్యాలకు తట్టుకొని  తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడేపాటి  శరీర దార్ధ్యం కాబోయే భర్తగారికి తప్పని సరి. ఒక్కో బ్యాంకుకొక్కో శాల్తీ.. ఏటియంతో కలిపి కుటుంబానికో   డజను జతల కాళ్లు   తప్పని సరి. ఆపాటి బిడ్డల్ని కనేపాటి ఆరోగ్యం కాబోయే భార్యకూ కంపల్సరి!
ఏమో.. ముందు ముందు మరిన్ని తీవ్రమైన చర్యలుంటాయని సంకేతాలిస్తున్నారు కదా మోదీజీ ఇప్పట్నుంచే!
-కర్లపాలెం హనుమంతరావు



 (వాకిలి- అంతర్జాల పత్రిక- డిసెంబరు- 2016-లాఫింగ్ గ్యాస్ గా ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...