Saturday, December 31, 2016

హ్యాపీ న్యూ యియర్ !- కర్లపాలెం హనుమంతరావు


కొత్త సంవత్సరం రానే వచ్చింది. సంబరాలు పడిపోతున్నాం అందరం. సహజం. కొత్త ఏదైనా ఉత్సాహంగానే ఉంటుంది. ఉండాలి. కొత్త వాహనం.. కొత్త కాపురం మాదిరి. వాడకం పెరుగుతున్న కొద్దీ కదా వాటి కొత్త కష్టాలు అనుభవంలోకొచ్చేది!అందాకా అందరికీ 'నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అపశకునమేదో 'ధ్వని'స్తున్నదంటారా? 'శుభవాఁ అని పెళ్లి జరుగుతుంటే.. మంగళ వాయిద్యాల మధ్య ఈ తుమ్ముళ్లేవిఁటి?!' అని చిరాకా? కానీ.. 'కీడెంచి మేలంచమ'ని కూడా అన్నారు కదండీ!ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తకోసం!
పాత తీర్మానాలు మళ్ళీ కొత్తగా తీసుకునేందుకు  కొత్త సంవత్సరానికి మించిన మంచి అదను మరోటి లేదనుకోండి. 'ఉగాది' ఉన్నా అది అచ్చంగా  తెలుగువాళ్ల ఉత్సాహం. ప్రపంచ వ్యాప్తంగా మన ప్రతిజ్ఞలు.. ప్రమాణాలు వినబడాలంటే కొత్త ఏడాదే సరైన సందర్భం. ఉగాదిలో ఒకింత మత పరమైన తంతూ ఉంటుంది. ఉగాది పచ్చడి గొంతుకడ్డం పడుతుంది.  షడ్రుచులంటారే  కానీ.. అదేందో.. ఎంత మామిడి ముక్క, అల్లం తొక్క, బెల్లం పిక్క, చెరుకు చెక్క, ఉప్పుతో రంగరించినా ఒక్క వేపచేదే నాలిక్కి తగిలేది! అదీగాక.. తెల్లారగట్టే లేచిపోవాలి. అభ్యంగన స్నానాదులాచరించాలి. అట్లాంటి తంటాలేవీ ఉండవు. కాబట్టే న్యూ ఇయర్ నిజమైన  పండగయింది నేటి కుర్రకారుకి.  వచ్చింది ఉగాది కాదు. కాబట్టి ఇప్పుడా రచ్చొద్దు. కొత్త సంవత్సరం  గూర్చి కొద్దిగా చర్చించుకొంటే సందర్భ శుద్ధిగా ఉంటుంది.. కదూ!
కొత్త ఏడాది రావాలంటే ముందటి ఏడాది పోవాలి ముందు. పాతది పోతూ.. కొత్తది వచ్చే సంధికాలం అర్థరాత్రి. పన్నెండు గంటల్లో ఆ  ఆఖరి గంట చివర్లో లోకం  సంధి జ్వరం వచ్చినట్లు వెర్రెత్తి పోతుంది! అట్లాంటి ఊగిపోయే అవకాశం మన పండగల్లో ఒక్క పోలేరమ్మ జాతర్లలో గణాచారి కొక్కళ్లకే దక్కేది.  అమెరికా ఖండం ఆ చివర్నుంచి.. ఆఫ్రికా ఖండం ఈ చివర్దాకా.. భూగోళమంతటా  అఖండమైన గోల. నిజవేఁ కానీ అంతతా ఒకే సారి ఊగుళ్ళు తూగుళ్ళూ ఉండవు. మనమిక్కడ రాత్రి భోజనానికని కూర్చున్న సమయంలో ఇంకెక్కడో జనం 'హ్యాపీ న్యూ యియర్' అంటూ టపాసులు పేలుస్తారు. ఇంకెక్కడో 'కొత్తేడాది సంబరాలు' అంబరాన్ని అంటే వేళకి మనం పడకమీద గుర్రు కొడుతుంటాం. కాకపోతే అన్ని చోట్లా అందరికీ  కామన్ గా కనిపించే దృశ్యం మేందంటే.. పోలీసులు.. తుపాకులూ గట్రా భయం లేకుండా   ఎవరికి తోచినట్లు వాళ్లు యధేఛ్ఛగా  అల్లర్లు చేసుకోవచ్చు ఆ నాలుగ్గంటలూ. విచ్చలవిడితనానికి విడిగా ప్రభుత్వాల పర్మిషన్లు అక్కర్లేని  క్షణాలు ఏడాది మొత్తంలో ఆ ఒక్క నాలుఘ్ఘడియలే!
మన దగ్గర మందూ మాకుతో కుర్రకారు సిద్ధంగా ఉంటారు చాలా ముందునుంచే. డ్రంకెన్ డైవ్ ని సహించవఁటారుగానీ పోలీసులు అదొట్టి  'ప్రెస్' మార్కు  బెదిరింపే.  కొత్త సంవత్సరం మూడ్ కి దూరంగా ఉండేందుకు పోలీసోళ్లేవఁన్నా   ప్రవరాఖ్యుడి  చినతమ్ముళ్లా?
ఈ అరుపులూ.. ఆగవఁతా బహిరంగంగా జరిగే వీరంగం. క్లబ్బుల్లో, పబ్బుల్లో ఇంతకు పదింతల తతంగం సాగుతుందంటారు. ఆ స్వర్గ కార్యకలాపాల్లో అన్ని వర్గాల   తలకాయలు దూరడం విధాయకం. కాబట్టి  తెల్లారింతరువాత ఎవరూ తలకాయలు పట్టుకొని విచారించే అవసరం ఉండదు.. ఒక్క హాంగోవరు తగులుకుంటే తప్ప.
కొత్తేడాదంటే కేవలం ఒక్క మందు కొట్టే సంబరవేఁ కాదు.  గ్రీటింగుల పండక్కూడా. యియర్ ఎండింగెప్పుడూ మంత్ ఎండిగులోనే రావడం కాలం పన్నే కుట్ర. ఇప్పుడంటే ఇంటర్నెట్లాదుకుంటున్నాయి. గతంలో తపాలావారే దిక్కు. ధరలు ఆకాశంలో విహరించే రోజుల్లో   ఆ కార్డుల కొనుగోలో  గగనకుసుమం.  స్టాంపులంటించి కవర్లు పోస్టుబాక్సుల్లో వేయడం    తలకు మించిన వ్యవహారం.  అయినా పాలుమాలేందుకు లేదు. తల తాకట్టయినా పెట్టి జరిపించాల్సిన తంతు.  పక్షంరోజులకు ముందునుంచే రాబోయే కొత్తేడాదికి  'నూతన సంవత్సర శుబాకాంక్షలు' ఆశిస్తూ కార్డులూ, కవర్లూ వచ్చి వెళుతుండేవి.. అటూ ఇటూ. 'ఇచ్చుకొన్న వాయినం .. పుచ్చుకొన్న వాయినం' తంతే ఈ శుభాకాంక్షల తీరు ఏ మాత్రం తేడా పడ్డా సో కాల్డ్ స్నేహ బందం  సిమెంట్ తక్కువ వంతెనలా కుప్పకూలడం ఖాయం.  పత్రికలేవీ గ్రీటింగులు పంపవు. అయినా రచయితలు 'మీ/మా' పత్రిక అభివృద్ధిని కాంక్షించాలి. బాసాసురులు పెదవైనా విప్పరు. ఐనా ఉద్యోగస్తుడు  పళ్లికిలిస్తూ పండో.. ఫండో ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలి.   గుత్తేదారుకి  దారులు తెరిచేదే శుభాకాంక్షల సులువుసూత్రమే. కార్యకర్త ఖర్మను తేల్చేదీ ఈ కొత్తేడాది శుభాకామనలే.  పరిశోధన విద్యార్థి పరిశ్రమను కడతెర్చే తారక మంత్ర మీ కొత్తేడాది గ్రీటింగ్సులోనే దాగుంటుంది.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. తీర్మానంబులు. పాతవే కావచ్చు కానీ  మళ్ళీ కొత్తగా తీసుకోవాలి.  శ్రీవారులకు ధూమపానం మైన్ సబ్జెక్ట్. అదే వారు.. అదే కుటుంబం.. అదే శపథం.. తారీఖొక్కటే తేడా! ఇలాళ్లెవరూ  ఇలాంటి  డొల్ల తీర్మానాల జోలికి రారు. వాళ్లకే దురవాట్లు ఉండవు. టీ.వీ వాచింగ్, శారీస్, గోల్డ్..  షాపింగులు దురవాట్లేనన్న మగవాళ్లు భూమ్మీద మిగిలుండరు. బొట్టికాయలమీదే  ఈ కొత్తేడాది తీర్మానాల వత్తిడి ఎక్కువగా ఉంటుంది.. పాపం! చెడ్డ మాటలు, చెడు స్నేహాలు, హోంవర్కు వాయిదాలు, వీడియో గేమ్సు , లంచ్ బాక్సు తిళ్లు, అబద్ధాలాడ్డాలు, చెల్లాయిల్నేడిపించడాల్లాంటి.. సవాలక్ష శపథాలుంటాయి లిస్టులో.   ఏ శపథం ఎప్పుడు నెరవేర్చాలో టైం టేబుల్  సరిగ్గా పడక .. పడకెక్కేస్తాయన్ని ప్రమాణాలు. అన్నీ నెరవేర్చేస్తే వచ్చే ఏటికేవీఁ మిగిలుండవన్న ముందు చూపు వాళ్లది.  
కాలక్రమాన కాలగర్భంలో కలిసి పోయేవే ఏ తీర్మానాలెవరెంత సీరియస్సుగా తీసుకొన్నా. కాకపోతే  తీర్మానాలతో  తోటివారికి సంతోషం కలిగించే అపూర్వా వకాశం ఈ కొత్త సంవత్సర పర్వదినం.
కొత్తేడాది సీజన్లో పత్రికలన్నీపాత వ్యాసాలే  పునః ప్రచురిస్తాయి.  తీరిక లేని పాతమిత్రులు ఎంత దూరంలో ఉన్నా  తీయని గొంతుల్తో శుభాకాంక్షలు తెలిపే  ఏకైక  శుభ సందర్భం నూతన సంవత్సరవం! కొత్తేడాది వచ్చేది పెద్ద పండుగ రోజుల్లోనే కాబట్టి.. ఇంట్లో ఎదిగిన గుండెలమీది కుంపట్లున్నా.. ఇంటిముందు వేసేందుకు  రవంత జాగా ఉన్నా.. కొత్తేడాది తెల్లారు ఝామున  ముంగిట్లో కనిపించే ముగ్గుల్లో తప్పని సరిగా కనిపించే అందమైన వాక్యం 'హ్యాపీ న్యూ ఇయర్!'
మామూలు మనిషి రోజువారీ బతుకు సినిమా కాదు. వ్యాపారం కాదు. రాజకీయం అంతకన్నా కాదు. ఏడాదంతా జరిగిన ముఖ్యమైన సంఘటనలు సింహావలోకనం చేసుకొనే అవసరం సాధారణ జీవికి ఏ మాత్రం ఉండదు. రోజూ 'తినుచున్న అన్నమే తినుచున్నవాడు' వాడు. కొత్తేడాది కాబట్టి ఆ రోజుటి పత్యేకత టీవీలిచ్చే  సరికొత్త చెత్త మరికొంత.
ఎవరెవరి వెంటో పడి సాధించుకొచ్చిన డైరీకి పసుపు కుంకుమలైనా అద్దకుండా  అద్దాల పుస్తకాలరలో ఓ మూల సర్దిపెట్టుకొనే సర్దా సగటుజీవి నిజజీవితంలో నిజంగా  జరిగే మార్పు మాత్రం ఒకటుంటుంది.. గోడమీది పాత క్యాలెండరు చెత్త బుట్టలోకెళ్లి.. దాని స్థానంలో కొత్త క్యాలెండరు వేలాడ్డం. గతంలో ఎరగని  ఎలక్టానిక్ మీడియా అందుబాట్లో ఉంది కాబట్టి  ముక్కూ ముఖమైనా తెలియని ఫేసు బుక్కుమిత్రులక్కూడా ఇలా  "హ్యాపీ న్యూ యియర్"
అంటూ శుభకామనలు తెలియచేసుకొనే సులువు దొరికింది.
  పాతవన్నీ రోతగా భావించి రద్దు చేస్తున్న పిదప కాలంలో అదృష్టం బాగుండి  ఓ మూడు ముక్కలు మాత్రం ప్రతీ కొత్తేడాది మొదటి రోజున అందరి మనసులనూ అందమైన ఊహల ఉయ్యాలలో ఊగిస్తూనే ఉంది. ఆ మూడు ముక్కలతోనే మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ చిన్న వాక్యానికి స్వస్తి చెబుతున్నాను.  


H A P P Y     N E W    YEAR 
- కర్లపాలెం హనుమంతరావు


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...