'ఎవరదీ?'
నేనే బాబాయ్!
ఛత్రపతిని'
'వానా వంగడం ఏవీ లేదు కదట్రా! ఇప్పుడీ నడివీధిలో ఒక్కడివే గొడుగేసుకొని ఏవిట్రా
విచిత్రంగా!'
'ఇవాళ 'గొడుగుల దినం' కదా
బాబాయ్.. అమెరికాలో! .. అందుకనీ..'
'మూలన పడున్న ఈ ముతక గొడుగుని బ్సిటికి తీసి ఇలా ఊరేగిస్తున్నానంటావ్! అదేదో దేశంలో జరిగే 'దినం' పేరు చెప్పి ఇక్కడిలా వూరికే ఊరేగుతున్నావంటే
ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదురా బాబ్జీ!.. అమెరికానుంచి
పట్టుకొచ్చిన పైత్యమేమో అనిపిస్తున్నది!'
'సీమదొరలకి మనలాగా గొడుగులు.. గిడుగులు జాన్తా నై బాబాయ్! పరమ నామర్దా కూడా! వాళ్ళు నెత్తిన పెట్టుకొనేది
‘టోపీ’ ని!. మనమే! ఎండకూ వానకూ మాడును కాచి కాపాడే గొడుగుని వాడకం అయినాక గోడకు వేలాడదీసేది!'
'అబ్బో! టిక్కెట్టిచ్చి గెలిపించిన పార్టీ అధికారంలోకి రాలేదని.. దాన్నో
మూలన పడేసిని ఘనుడివి!
ధర్మా పన్నాలొద్దు! మన వాళ్ళు గొడుగుల్ని పనయినాకా అటకెక్కిస్తారని కదూ నీ వెధవ అభియోగం! చేతిలో గొడుగు లేకుండా కాలు బైటపెట్టని తరం మా నాన్నగారిది! మా తాతల కాలంలో అయితే గొడుగు
పెద్దరికానికో ముఖ్యమైన గుర్తు. పాత సినిమాలు చూస్తావో..
లేదో! రాజ్ కపూర్ .. నర్గీస్ దత్తుల ప్రేమకహానీలో గొడుగుదే పెద్ద పాత్ర!
పిలగాడివి.. నీకు చరిత్ర తెలీదు. ఛాంబర్లేనుకు గౌరవం పెంచిందీ.. చార్లీ చాప్లిన్కి
గుర్తింపు తెచ్చి పెట్టిందీ ఈ ఛత్రమే ఛత్రపతీ! శివాజీ మహారాజుకి ఛత్రపతి బిరుదెలా
గౌరవం పెంచిందో తెలుసా! రాయలవారికి తన వెనక గొడుగు పట్టి పరుగెట్టే గోపాలుడంటే గొప్ప ప్రీతి. రాయసానికే కాదు ఛత్ర చామరాలు.. దైవత్వానికీ పెద్ద ఆకర్షణలే బాబూ మన
సంప్రదాయంలో. రాళ్ళవాన బారినుంచి ఆబాలగోపాలాన్ని కాపాడేందుకు
బాలకృష్ణుడు గోవర్ధన్నాని గొడుగులా ఎత్తి పట్టుకొన్న వైనం నీకు తెలుసా? బలిని పాతాళం అడుగున తొక్కేందుకు బయలుదేరిన అవతార
మూర్తి వామనుడి నెత్తిమీదా అలంకారంగా ఉండేది ఈ గొడుగే! ఏదుకొండలవాడి కొండకి ఏటేటా అరవదేశంనుంచి
తరలి వచ్చే గొడుగుల ఉత్సహం సందడి నీకు తెలీదులాగుంది! నీకు తెలిసిందల్లా మీ మార్కు
రాజకీయాల్లో ఏ ఎండకు పట్టే ఆ గొడుగులూ,,
ఏకఛ్చత్రాధిపత్యంకోసం పక్క
పార్టీలనుంని అభ్యర్థులను గొడుగు కర్రలేసి లాక్కోవడాలు!'
'రాజకీయాల్లో ఉన్నామని కదూ మా మీద ఈ రాళ్ల విసురుళ్లూ?! ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గాలివాటం సరుకు పుట్టాగొడుగుల్లా పుట్టుకొస్తున్న
మాటా నిజమే! కానీ కారణం ఎవరు
బాబాయ్? ఎన్నికల సంఘాలే 'గొడుగు'ను గుర్తుగా అంగీకరించాక మా నేతల ఒక్కళ్లమీదే ఇలా బురద చల్లుళ్లు.. ఏవన్నా
బావుందా! చెత్త నేతల గతం తెలిసీ నెత్తికి గొడుగు పడుతున్న ఓటర్లది అసలే తప్పు
లేదంటాప్ .. పాపం!'
'నీతి నిజాయితీలనేవి బొత్తిగా లేని రాజకీయనాయకులే అందరూ.. అని నేనడంలేదులేరా నాయనా! ఒహటీ అరా ఒకవేళ అలాంటి చాదస్తులు ఇంకా ఎక్కడైనా మిగిలున్నా
.. మీ తరం వాళు వాళ్లకిస్తున్న మర్యాదల మాటేమిటీ? వయసుమీద పడిందనో.. వంట్లో ఓపిక
సన్నిగిల్లిందనో.. ఏదో ఒహ వంక కనిపెట్టి పాతకాలంనాటి పనికిరాని గొడుగులకు మల్లే
గోడలకు వేలాడదీయడంలా!.. ఎందుకురా అర్థాంతరంగా ఇప్పుడంతలా నవ్వులూ!'
'గోడకు వేలాడె గొడుగు గుర్తుకొచ్చిందిలే బాబాయ్! చూసేందుకది అచ్చంగా చెట్టుకొమ్మకు
వేలాడే గబ్బిలం మాదిరిగా
ఉంటుందిగదా! నవ్వాగలేదు!'
'గోడకు వేలాడుతున్నా.. వీధిలో ఊరేగుతున్నా.. గొడుగులది ఎప్పుడూ గబ్బిలాల
రూపమేరా బాబిగా! పిచ్చుకలు.. పిచ్చికాకులు
అంతరించిపోతున్నాయని అంతలా ఆక్రోశ పెడుతున్నారే జనాలు! మరి ఇప్పుడీ గొడుగులకు పడుతున్న దుర్గతులను
గురించి పట్టించుకోరా ఎవ్వరూ!! ఎందుకు?'
' గొడుగు ఈ ఈ-కాలం తరానికి కి బొత్తిగా పొసిగే సరుకు
కాదులే బాబాయ్! మూడు కాళ్ళ ముసలయ్యలక్కూడా
గొడుగుతో బైట కనబడ్డం పెద్ద నామర్దా అయిపోయిందిప్పుడు. చరవాణుల్లో సందేశాలందించేందుకే రెండు చేతులూ
చాలడం లేదు సుందరాంగులకి.. మళ్లీ గొడుగొకటి నెత్తిమీదకంటే పెద్ద
గొడవలయిపోతాయి! ఎన్నిరంగులు.. హంగులతో హొయలు పోయే సరుకు సంతలోకొస్తే
మాత్రం ఛత్రాన్ని కొనే చాదస్తం
ఎవరికుంటుంది .. చెప్పు! గొడుగులకన్నా.. చరవాణి తొడుగులు అమ్ముకోవడం
లాభదాయకం అనుకుంటున్నారు బజారు వ్యాపారస్తులు! రద్దీగా ఉండే బస్సుల్లోకి తోసుకొని ఎక్కడం రాక కిటికీ చువ్వలగుండా సీటుమీద చేసుకొనేందుకు మినహా ఇప్పుడీ గొడుగు కర్రలు ఎందుకూ పనికొస్తున్నాయి
చెప్పూ! ఎన్నికల సంఘమొక్కటే దీనిమీదింకా ముచ్చట పడుతున్నది. అభ్యర్థికి గుర్తుగా అదింకా
దీన్ని ఆమోదిస్తుండటమే ఒహ గొప్ప విషయం. 'ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం' ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి
చట్టబద్ధమైన ప్రజాస్వామిక హక్కుగా జనం ఎందుకు ఆమోదించడం లేదో అర్థం కాకుండా ఉంది నాకిప్పటిక్కూడా!’
'జనామోద ప్రమోదాలమీదే ఇంకా మన నేటి రాజకీయాలు నడుస్తున్నాయనే నన్ను భ్రమ పడమంటావుట్రా సన్నాసీ! ఇప్పుడు నువ్వు ఈ
గొడుగు పట్టుకు తిరగాడినికి కారణం నిజంగా అమెరికా గొడుగుల పండుగ' సందర్భం అవునో కాదో చేప్పేపాటి జ్ఞానం నాకు లేకపోవచ్చుగాని.. ఇక్కడ
నడుస్తున్న రాజకీయం మాత్రం అమెరికా తరహా జనామోద అధ్యక్ష ఎన్నికల తరాహాలోవి
కాదని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అదేంటిరా! మాట పూర్తి కాకుండానే ఎక్కడికా
పరుగులు! అరేయ్.. ఛత్రపతీ! నిన్నే!,, నిన్నే!..'
'సార్! ఇప్పుడా గొడుగు వేసుకొని ఉరకలెత్తుతున్న మనిషి ఎవరో చెప్పగలరా?'
'ఛత్రపతి! అదేనయ్యా! మొన్నటి మన నగర పాలిక ఎన్నికల్లో మనమంతా ఓట్లేసి గెలిపించిన వార్డు
అభ్యర్థి! ఇంతకీ మీరు ఎవరు? మా ఛత్రపతితో మీకేంటి అంత గత్తర?'
'సార్! మీ ఛత్రపతి
ఎన్నికల్లో గెలిచిన తరువాత సర్కారు పార్టీలోకి గెంతాడు కదా! నగర పాలిక కార్యాలయంలో
గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తానని నా దగ్గర ఐదు లక్షలు నొక్కేసాడు. ఇప్పటి వరకు నౌఖరీ
లేదు.. కదా.. కనీసం.. నా డబ్బులు
తిరిగివ్వమని అడుగుతున్నా .. ప్రయోజనం లేదు. ఎదురు పడ్డప్పుడల్లా ఇలా ఏ గోడనో..
గొడుగునో.. చాటు చేసుకొని.. మొహం తప్పించేస్తున్నాడు..'
ఇప్పుడర్థమయింది..
ఎండా వానా ఏవీ లేక
పోయినా .. ఇలా వీధిలోకి వచ్చినప్పుడల్లా గొడుగు ఎందుకు వాడుతున్నాడో మా ఛత్రపతి!
అమెరికా ‘గొడుగుల పండుగా’ కాదు.. పాడూ కాదు! ఇది ఇండియా
రాజకీయాల గొడవ!
***
కర్లపాలెం హనుమంతరావు
(అమెరికాలో జూలై 6 గొడుగుల పండుగ- ఆ సందర్భంగా)
No comments:
Post a Comment