Monday, July 4, 2016

పప్పుచెక్కల కనకమ్మ- చిన్నకథ


వేటపాలెం అంటే బైటి వాళ్లకి జీడిపప్పు గుర్తుకు రావచ్చేమో కానీ.. అక్కడ పుట్టి పెరిగిన మాకు మాత్రం అంతకు మించిన రుచిగా ఉండే కనకమ్మ పప్పుచెక్కలు గుర్తుకొస్తాయి.
మా చిన్నప్పుడు వేటపాలెం చాలా చిన్నఊరు. మద్రాసు హైవే రోడ్డైనా కనకమ్మ కొట్టు మలుపును తప్పించుకు పోయేందుకు లేదులారీ డ్రైవర్లు.. బస్సు డ్రైవర్లు.. బాణలి పెట్టున్న సమయంలో అటుగాని వస్తుంటే బళ్ళు పుకొని మరీ  పప్పుచెక్కలు పొట్లాలు కట్టించుకొని పోతుండేవాళ్ళు. ఆలస్యమయినా ప్రయాణీకులకుకూడా  పెద్ద అభ్యతరం ఉండేది కాదు. వాళ్లకి మాత్రం కనకమ్మ పప్పుచెక్కలేమన్నా చేదా!
మొదటాట సినిమాకు పోయేందుకు మా అమ్మావాళ్లు ప్రోగ్రామ్ వేసినప్పుడల్లా.. సినిమాకన్నా ముందు కనకమ్మ పప్పుచెక్కల రుచి గుర్తుకొచ్చి నోట్లోకి నీళ్ళు వచ్చేవి మా పిల్లలకు. సినిమా చూసి తిరిగొస్తూ దారిలో ఆగి అమ్మావాళ్లు కొనిచ్చే పప్పుచెక్కలు కరకరలాడించుకొంటూ ఇంటికొస్తేగాని  మంచినిద్ర పట్టేది కాదు మాకు.
ఇష్టాన్నీ ఒక పట్టాన బైటపెట్టని మా నాన్నగారూ అమ్మ తెచ్చే పప్పుచెక్కలకోసం అప్పటివరకు భోజనం చెయ్యకుండా కూర్చొనుండేవాళ్ళు!
పపుచెక్కల కనకమ్మతో మా పిల్లకాయలకి మరో పండుగ అనుబంధంకూడా ఉంది.
వినాయకచవితి పూట తొమ్మిదిమంది వినాయకుళ్లను చూసి.. తొమ్మిది ఇళ్ల పెద్దలతో శాపనార్థాలు పెట్టించుకొంటే పిల్లల ఆయుర్దాయానికి ఢోకా ఉండదని ఓ నమ్మకంమా పిల్లల తిట్లుతినే  పెద్దలజాబితాలో  కనకమ్మస్థానం ఎప్పుడూ పదిలంగా.. ప్రథమంగానే ఉండేది.
మగదిక్కులేని ఒంటరి ఆడమనిషిని కవ్వించి తిట్లు తినడం మా పిల్లలకి సులభంగా ఉండేది. ముళ్లజిల్లేళ్ళు.. రాళ్లు..  సేకరించుకొని తెల్లారకుండానే కనకమ్మ ఇంటిముందు చల్లేవాళ్లం. మా అల్లరి బృందానికి సాంబడు నాయకుడుఆమె ఆపకుండా శాపనార్థాలు పెడుతుంటే వీనులకు విందైన సంగీతం వింటున్నంత ఆనందం కలిగేది మా పిల్లకాయలకి. 'మీ దెవసం చెయ్య!' అంటూ కొత్త కొత్త తిట్లు  కనిపెట్టి మరీ ఆమె రెచ్చిపోతుంటే పిచ్చ ఆనందంతో సాంబడు గంతులేయడం నాకిప్పటికీ బాగా గుర్తు.
కనకమ్మ దుకాణాన్ని అక్కణ్ణుంచి లేపేయించాలని పక్కనున్న హుస్సేస్ సాహెబ్ ది ఎప్పణ్నుంచో పథకం. కనకమ్మకు అత్తగారినుంచి వచ్చిన ఆస్తి  చిన్న పెంకుల వసారా. రెండు పెద్ద భవంతుల మధ్య దిష్టిపిడత మాదిరిగా ఉన్నదని హుస్సేన్ సాహెబ్ చిరాకు!.
హుస్సేన్ సాహెబ్ బీడీల వ్యాపారంతో గడించిన సొమ్ముతో కనకమ్మ అత్తగారినుంచి ఒకానొకప్పుడు ఆ భవంతులున్న స్థలం మొత్తం అధికధర పోసి కొన్నాడు. హైవేమీద ఉండటం ఒక కారణమైతే.. ఏ వ్యాపారానికైనా అచ్చివస్తుందన్న సెంటిమెంటు ఒకటి. సెంటిమెంటుకి మతంతో నిమిత్తమేముంటుంది!
కనకమ్మ కొరకరాని కొయ్యగా మారింది సాహేబుకి. ఆమెచేత దుకాణం ఖాళీ చేయించాలని చూసినప్పుడల్లా కనకమ్మ బెజవాడ కనకదుర్గమ్మే అయేది. స్థానిక ఎమ్మెల్యే ప్రాబల్యంతో హుస్సేన్ సాహెబ్  కనకమ్మమీద  వత్తిడి పెంచిన రోజుల్లో ..
ఒకరోజు మద్రాసునుంచి పొన్నూరు పోతూ తమిళనాడు గవర్నరుగారి సతీమణిగారి కార్లు కనకమ్మ దుకాణంముందు రెండుగంటలపాటు  ఆగాయి! తిరిగి వెళ్లే  కాన్వాయిలో ఉన్న వాళ్లందరి చేతుల్లో పప్పుచెక్కల పొట్లాలు చూసి ఊరు ఊరంతా  అవాక్కయింది!
తరువాత విచారణలోగాని తేలలేదు..  కనకమ్మ బంధుబలగం సామాన్యమైంది కాదని. ఆమెతో పెట్టుకొంటే 'గురువుగారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది' అని ఎమ్మెల్యే తప్పుకోవడంతో హుస్సేన్ సాహేబు ఇంకేమీ చప్పుళ్లు చెయ్యలేక చతికల పడిపోయాడు.
మనుషులు ఊరుకున్నారని కాలం రుకుంటుందా! నాలుగేళ్ళు గడిచేసరికి కనకమ్మ ఫొటోకి దండ పడింది.
ఆమె పప్పుచెక్కల దుకాణం రూపం మారింది. అది ప్పుడు దిక్కూమొక్కూలేని ఆడవాళ్లకు.. పిల్లజెల్లాకు మళ్ళీ నీడ దొరికేదాకా ఆశ్రయమిచ్చే ఉచిత మధ్యంతర ఆశ్రమం. ప్రభుత్వ ఆర్థికసాయానికి తోడు కనకమ్మ పప్పుచెక్కలు అమ్మి పీనాసితనంతో కూడేసిన ఐదు కోట్లు మదుపుతో మొదలయింది స్వచ్చంద సేవాగృహం.
వినాయక చవితి పండుగనాడు పిల్లలచేత రాళ్లేయించుకొని 'మీ దెవసం చెయ్య!' అంటూ  పడరాని తిట్లు తిట్టిపోసిన కనకమ్మ వాస్తవంలో అనాథ పిల్లలెరూ నిజంగాదెవసం సాలుకారాదన్న మంచి ఉద్దేశంతో స్థాపించిన ఆ సేవాగృహానికి ఇప్పుడు ధర్మకర్త మా సాంబడే!
ఇప్పటికీ ప్రతీ చవితినాడు ఊళ్లోని పిల్లకాయలు ఆ  వసతిగృహంమీద రాళ్లేస్తుంటారు. వసతిగృహంలోని  పెద్దలు పిల్లల్నితిట్లతో దీవిస్తుంటారు. లాగే   జరాగలన్నది చనిపోయేముందు కనకమ్మ చివరి కోరిక!
పండగ తొమ్మిది రోజులూ కనకమ్మ దుకాణం పప్పుచెక్కలు ఊరి పిలలకీ.. పెద్దలకీ ఉచితంగా  పందేరం కూడా

*** 
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...