'నోబెలు.. నోబెలు అంటా తెగ వాగుతున్నారీ మధ్య
దొరబాబులంతా!
ఆ బెల్లేంటన్నా?’
'ఆ
వివరాలన్నీ ఏకరువు పెట్టాలంటే ఓ లోటాడు టీనో,
ఓవల్టీనో తాగి రావాలి! మూడే ముక్కల్లో
ముక్కాలంటే..
ఇంత దాకా ఎవరికీ
తట్టని కొత్త వింతో.. విశేషమో బైటపెట్టిన
బుద్ధిమంతుణ్ని వెతికి పట్టుకొని 'చబాష్!'
అంటూ జబ్బ మీదో చరుపు చరిచి మెళ్లో ఓ బిళ్లేయుడన్న మాట!'
'భలే! అట్లయితే ఆ నోబెలు బిళ్లలన్నీ మనోళ్ల మెళ్లలోనే కదా ఏళ్లాడెయ్యాలా! వింతలూ విశేషాలూ కనిపెట్టుళ్లో
మనోళ్లకి మించిన మోపుగాళ్లు పెపంచికం
మొత్తంలో ఎవురున్నార్లే.. ఏడేడ ఎతుక్కొచ్చుకున్నా!’
'ఆహాఁ! అంతగా మన బాబులంతా కనిపెట్టేసిన ఆ వింతలూ
విశేషాలూ ఏంటో?'
'అన్నీ తెల్సిన
పెద్ద బుర్రకాయవి..
ఆ ఎద్దేవాలే ఒద్దన్నా! దేశభక్తి దెబ్బతింటది. అర్దసున్నా అన్నా ఎవుళ్లకీ ఓ
పట్టాన అర్థం కాని మొరట్రోజుల్లో నిండు
గుండు సున్నా కనిపెట్టిందెవళ్ళంట? కన్నాలేయుడు, సున్నం పెట్టుడంటే.. సన్నాసోళ్లు చేసే బేవార్సు పన్లంటవు.. తెల్సును.
కానీ కన్నమేయుడు కూడా ఓ కళే కదన్నా! అదేందో ‘మట్టి బండి’ నాటకంలో దొంగాడెవుడో మొట్టమొదటి
సారి మహా సుందరంగా గోడక్కన్నం కొట్టి మరీ లోపలికి జొరబడ్డడంట గదా! ఆడి
మెడకేసెయ్యెచ్చు కదన్నా ఈ నోబెల్లు బిళ్లోటి తెచ్చి? సుదర్శన చక్రం
కనిపెట్టుడే కాదు..
దాన్నడ్డమేసుకొని ఎట్లాంటి కథలను ఎట్లా నడిపించినాడో మన కన్నయ్య మహాభారతంల!
దేవుడు కదా! మరా మహానుభావుడి మెళ్లో ఆ నోబెల్లు బిళ్లేసినా.. పురుషార్థం ప్లస్
పున్నెం కూడా దక్కుదలవుతుంది కదా అన్నా! రామాయణంల
విమానాలు? పిట్టలకే సరిగ్గా రెక్కలు మొలవని కాలంలో మన కాడ మంధర గిరి పర్వతాలు గాల్లో
గిరగిరా గింగిరాలు తిరిగాయంట కదా! ఎడతెరిపి లేకుండా రోజుల్తరబడి ఎడాపెడా
ఝడివానలు కుర్సి దడ పుట్టించినా గోవిందుడు
ఆ గోవర్ధనం కొండను అమాంతం గోటి మీదెత్తుకొని గొడుగులా నిలబెట్టిండు
కదా! గొడుగంటే ముసుగు దెయ్యమని గడగడలాడి చచ్చినాడు సీమ తెల్లోడు! ఆడికి పడాలా.. మరి మనోడి
మెడకి పడాలా నోబిలు బిళ్ల? తెల్లోడికి అక్షరం
ముక్కంటే ఏంటో తెలీని కాలంల మన
భాగోతం రుక్మిణమ్మ కృష్ణ పర్మాత్ముడికి ప్రేమ
లేఖ పంపించింది.. పరమ డేరింగా రుక్మిణీ
దేవిది! తాటాకు బద్దతో నాలిగ్గీసుడు కూడా తెల్లోడి పరమ నామర్దానా! అవాకులూ చవాకులంటూ
ఎవరేం పేలితే నేమిటికిలే! అసలు రాసే కళంటూ
ఓటి తాటాకుల మీద పుట్టించిందెవుళ్లు?మనమే
కదన్నా! చీకట్లో కళ్లు కానరాక ఆఫ్రికను
బండోళ్లు కొండ తొర్రల్లో వళ్ళు దాచుకొన్న వేళ మనోళ్ళు
అలికిణ్ని బట్టి మెకాల ఎంటబడి మరీ ములుకులేసారు !
ఎడారోళ్లు బట్టలు
కట్టుకోడం కూడా రాక మొరటుగా తిరుగే రోజుల్ల మన దేవుళ్లు పట్టు పీతాంబరాలు, బనారస్, బద్వాల్ చీరలు.. మేచింగు బ్లౌజుల్లో కళ్లు
మిరిమిట్లు గొలిపేటట్లు ఊర్లూ వాడలూ ఊరేగినారు.
ఎన్ని వింతలూ..
విశేషాలూ! అన్నీమన వేదాల్లోనే
ఉన్నాయషంటే మళ్లీ తొండంటన్నారు ఆ పడమటి
వెధవాయిలు!
వెదికే ఓపిక లేకో..
ఓర్చుకొనే గుణం లేకో మనల్ని వెర్రి పప్పల కింద జమ కట్టేసి ఈ నోబెల్లులు
గట్రాలన్నింటికీ ఆమడ దూరంలో అట్టే పెట్టేసే
కుట్రేదో గట్టిగా నడుస్తుండాదని నా డౌటన్నా!’
'ఊహపోహల్నన్నింటినీ
ఊరికే పోగేసి 'ఊహూఁ!
మన కొక్కటైనా నోబెల్ గిట్టుబాటవడం లేదం’టూ రట్టు చేస్తున్నావ్ తమ్మీ! నీ కతలు నీకు ముద్దేమో కానీ ఆ తాతల్నాటి స్టోరీలేవీఁ
వాళ్లకొద్దు! నీకై నువ్వుగా సొంతంగా..
తాజాగా కనిపెట్టిన నిజమైన వింతో.. విశేషమో ఏవఁన్నా ఉంటే.. గింటే..
బైట పెట్టబ్బీ! బట్టబుర్రకు జుట్టు మొలిచిందనే కట్టు కతలు కుదరవు! తర్కంతో రుజువు
కావాల.
మన సి.వి. రామన్ సర్ కి గణితంలో నోబెల్ వచ్చింది చూడు అట్లాగా?’
'అరేఁ! భలే గుర్తు చేసినావన్నా! అదే అరవదేశంలో మరో రామరయ్యరు కూడా.. నా సామి రంగా.. ఆకు పసర్నుండి గేసునూనె పిండాడన్నా! దుబాయ్.. అరబ్బు దేశాల ఎదాన బోలెడంత డబ్బు పోసి కొంటున్నాం కదా గబ్బు సరుకు! ఆ దుబారా తగ్గించే కొత్త ఐడియా చేసిండు
కదా! మరందుకైనా ‘చబాష’ ని భుజం తట్టి ఓ
నోబెల్ బిళ్ళ ఆ అయ్యరాయన మెళ్లో వేసెయ్యచ్చు కదా? అట్లాంటి గోసాయి చిట్కాలు మరన్ని పుట్టుడుకి
ఆస్కారమొచ్చుండెడిది! నిధుల కొరతో అంటా అల్లాడతా
అట్టా దేశాలట్టుకు తెగ తిరుగుతన్నాం కదా మనం! ఆ గండం నుండి
గట్టెక్కించుడికి ఓ సన్యాసి.. ఆ మధ్య.. పాపం కష్టపడి కల గన్నాడు. లంకెబిందెల జాడ ఎక్కడుందో బైటపెట్టిండు. అయినా ఏం చేసినం? సర్కారు సొమ్ముతో గోతులు సగం తవ్వినాక..
అందరూ నవ్వుతున్నరని ఆనక మరి కాస్త సొమ్ముతో పూడ్చేసినాం! పెపంచకం మొత్తం ముందు అల్లరి
పాలయ్ పొయ్యినామా లేదా! ఆర్థిక తత్వవేత్త.. ఆ సారు
ఎవరూ.. ఆట్టే నోరు తిరిగి చావదు నాకు.. ఈ
పెద్ద పెద్దోళ్ల పేర్లు.. ‘
‘డాక్టర్ అమర్త్య
సేన్ ‘
‘ఆఁ.. ఆఁ.. ఆ మర్త్యంసారు
కిచ్చిన నోబిళ్ల బిళ్లే మరి మన లంకెబిందెల సన్నాసి కీ ఇచ్చుండచ్చుగా?’
‘ఆపరా బాబూ నీ ఊక దంపుళ్లు! కొత్తగా కనిపెట్టుడంటే..
ఎప్పటెప్పటి సొల్లు కతలో వప్ప చెప్పుడు కాదు! ఆడ బడితల మొండాలకి తుఛ్చులు
అప్ప చెల్లెళ్ల తలలు మార్చుతున్నరు! ఆపరేషన్ మిషతో పరేషాన్ చేసి పేషెంటు కిడ్నీలు చాటుగా అమ్మేసుకొంటున్నరు. అట్లాంటి దిక్కుమాలిన
పన్లక్కాదబ్బీ నోబెళ్లు ఇచ్చుడు? పేదోడికి చవగ్గా చక్కటి చదువు చెప్పించు! మంచి మంచి
కొలువులు సర్కార్లవి ఇప్పించు! ఎప్పుడో ఏకలవ్యుడు వేలు కోసిచ్చిన పాత కహానీ
లిప్పుటి నోబెళ్లకు పనికి రావబ్బీ! న్యూసెన్సు కతలు కాదు.. న్యూ సైన్సు
స్టోరీలేమైనా నీ కాడ ఉంటే షార్ట్
లెన్తులో వినిపించు.
మెరికలు అమెరికాలోనే కాదు. మన కాడా ఉన్నారని నిరూపించు! నిధులు రాబట్టుకొనేటందుకు.. సేద్యం, వైద్యం,
విద్యలాంటి ప్రధాన సామాజికి రంగాలు సజావుగా నడిచుకునేటందుకు..
మద్యం అమ్మకాల మీదే నిండా ఆధారపడ్డంతో మనది
వట్టి గాన్ కేసని తెలిపోయిందబ్బీ ప్రపంచ దేశాలల్ల? అయినా మన ప్రతిభ నొహళ్లు చూసి బెల్లు
కొట్టేదేందిలే? మెచ్చి బోబెల్ బిళ్లల్తెచ్చి
మెళ్లో వేసేదేందిలే?’
'ఔనన్నా1 ఆ నోబెళ్ళూ బిళ్లలిచ్చే
బాబులు ఎలుకల్ని పట్టి వాటి మీద ప్రయోగాలు చేసున్నరు. మనమో? ఆ ఎలుకల్నే మౌసుల కింద మార్చేసి ప్రపంచం మొత్తం నివ్వెర పడేట్లు
సాఫ్టువేర్లు పుట్టిస్తున్నం. మన కాడ కాకులక్కూడా లెక్కలు నేర్పించేయగల కాకల్తీరిన సర్కారు
నౌఖర్లు మస్తుగున్నరు.
బల్ల కిందుగా పింకు గాంధీ బొమ్మలో కట్టగా కనిపించకుంటే.. ఎంత బుల్లెట్ రైలు దస్త్రాన్నైనా నత్తకన్నా
కుంటిగా నడిపించగల గడుసులున్నరు. ‘కనిపెట్టుడు’ ఏ బుర్ర తక్కువ ఎదవైనా చేసే కార్యమే!. 'కనికట్టు చేయడు’లోనే అసలైన బుధ్ధి
దాగుందన్నా!
ఆ గుట్టుమట్లన్నీ మన దేశంల గుట్టకీ పుట్టక్కూడా తెల్సును! అది గుర్తించకుండా ఎన్ని నోబెల్లు బిళ్లలు ఎంతమంది సైన్సోళ్లకి, సాహిత్యాలోళ్ళకి, సంగీతాలు వాయించుకొనేటోళ్లకి, శాంతి మార్గాల వెదికి
పెట్టేటోళ్లకిచ్చినా ,, నో యూజ్! ఎవళ్లూ మన మెళ్లకి ఆ
నోబెల్లు బిళ్లలెయ్యక పోతేనేంటంట? మన బిళ్లలు మనమే మన మెళ్లకు ఏసేసుకుంటే పోలా! మన బెల్లులు మనమే ఘల్లు ఘల్లుమని మోగించేసుకొంటే దూల తీరలా!’
‘అదీ దెబ్బరా అబ్బీ! సెల్ఫ్ డబ్బా కొట్టింగులో ప్రపంచకం మొత్తంలో మనల్ని మించిన మోపుల్లేరు..
ఇహ ముందూ పుట్టబోరు. అలాగని మన బెల్లు
మనమే కొట్టుకుంటుంటే చాలబ్బీ.. అదే వెయ్యి నోబెళ్లు మెళ్లో వేళ్ళాడే పెట్టు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా.. కాలమ్-04-11-2017)
***
No comments:
Post a Comment