Wednesday, August 1, 2018

సొంత ముద్ర- పోతన- ఓ ఉదాహరణ- తెలుగు వెలుగు ప్రచురణ 'ఏ వలరాజు భార్యను, నుపేంద్రుని కోడల శంభుచేత నా
దేవరఁ గోలుపోయి కడు దీనత నొందుచున్నదానఁ రం
డో వనవీథి నున్న ఖచరోత్తములార! దిగీంద్రులార రం
డో వనవాసులార వినరో మునులార! యనాథవాక్యముల్!'
(నేను మన్మథుడిభార్యను. విష్ణుమూర్తి కోడలును. శివుడి మూలకంగా నా భర్తను పోగొట్టుకొని మిక్కిలి దుఃఖంలో ఉన్నదానిని. అడవుల్లో, ఆకాశంలో ఉండేవాళ్లు, మునులు .. అంతా రండి! ఈ అనాథ మాటలు వినండి!- అని ఈ పద్యానికి అర్థం.
వీరభద్ర విజయము లోని రెండో ఆశ్వాసం 124వ పద్యం)
***

కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికని భర్తను చేర్పించిందో మధ్యతరగతి గృహిణి. ఆ పరీక్షలు ఈ పరీక్షలంటూ లక్షలు మింగి చివరకు చేతులెత్తేసారు ఆ ఐదునక్షత్రాల ఆసుపత్రి దొరలు. మృతదేహాన్ని వరండాలో పడేసి ఒక అరగంటలో స్థలం ఖాళీ చేసెయ్యాలని కూడా హెచ్చరించారు. బతికుంటే బలుసాకైనా తినచ్చన్న గంపెడాశతో వంటి మీది బంగారాన్ని కూడా భర్తవైద్యానికని వెచ్చించిందా పిచ్చితల్లి. ఇల్లూ .. వాకిలీ లేవిప్పుడు. అయిన వాళ్లెవరూ లేరు ఆదుకునేందుకు.  ఎక్కడో ఏదో జరిగింది. ఆసుపత్రి వర్గాలు ఏదో చేసాయి! ఇదీ అని ఇతమిత్థంగా చెప్పలేక పోవచ్చు కానీ.. ఖచ్చితంగా మోసమయితే ఏదో జరిగింది. అంత పెద్ద ఆసుపత్రి నిర్వాహకులని నిలదీయడమెట్లా? ఎదురు తిరిగి నిలబడేందుకైనా ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా ఇలాంటి విషాదఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా! అలాంటి సందర్భాలలో బలహీనులు, దిక్కూ దివాణంలేని అభాగ్యులు ఏ విధంగా స్పందిస్తారో రోజూ మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ముఖపరిచయం లేక పోయినా దారేపోయే దానయ్యలందర్నీ పేరు పేరునా పిల్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూనే ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు బక్కజీవులు. ఆ పనే చేసున్నది ఇక్కడ రతీదేవి కూడా!
ఇంద్రుడు పంపించాడని బండశివయ్య గుండెల్లో బొండుమల్లెల పరిమళాలు పూయించాలని పూలబాణాలతో సహా మహా ఆర్భాటంగా ఊరేగుతూ వచ్చాడు భర్త వలరాజు(ఆహాఁ! ఎంత చల్లని తెలుగు పలుకు). దేవయ్య మీద దాడికని  బైలుదేరే ముందు అక్కడికీ ఒక ధర్మపత్ని బాధ్యతగా ముందొచ్చే ముప్పును గూర్చి హెచ్చరించింది రతీదేవి. అతివిశ్వాసంతో శివయ్య మీద ప్రణయసైన్యాన్ని వెంటేసుకొని మరీ దాడి చేసి చివరకు ఆ ముక్కంటి మూడోకంటి నిప్పురవ్వలకు కాలి బూడిదపోగయ్యాడు! శివయ్య చేసింది అన్యాయం. కానీ ఆయనేమో దేవతలకు దేవుడు. ఎవరయ్యా ధైర్యంగా ఎదురు నిలబడి అడగగలరు? అట్లాగని మనసారా ప్రేమించి పెళ్లాడి కడదాకా జీవితాన్ని పంచుకొందామన్న గంపెడంతాశతో గృహస్థధర్మం స్వీకరించిన స్త్రీమూర్తి చూస్తూ వూరుకుంటుందా? ఏదేమైనా సరే.. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఎదురునిలబడాలనే అందరు ఇల్లాళ్ల మాదిరి రతీదేవి పంతం పట్టింది. అందుకే ఆ దుర్ఘటన జరిగిన వనంలోనే బూడిదకుప్ప ముందు  కూలబడి అక్కడి వనవాసులను, ఆకాశజీవులను, ఆఖరికి ఆ శివయ్యే సర్వస్వమనుకొనే మునిగణాలను కూడా తన మొర ఆలకించమని వేడుకొంటున్నది పరమ దయనీయంగా! మామూలు మానవులకే కాదు దివ్యశక్తులున్నాయని మనం నమ్మే దేవుళ్లు కూడా కష్టసుఖాలు ఎదురైనప్పుడు మనలాగే భావోద్వేగాలకు లొంగిపోతారా? అని ప్రశ్న వేసుకొంటే కొన్ని కొత్త విషయాలు కొన్ని బైటికి వస్తాయి. అవి కావ్యరచనకు సంబంధించిన రహస్యాలు.
బమ్మెర పోతనకూ ఈ దైవికశక్తుల మీద సామాన్య పాఠకులకు  మల్లేనే విపరితమైన విశ్వాసం ఉంది. చాలా సందర్భాలలో ఆ కవే స్వయంగా శ్రీరామచంద్రుడు తన వెనక ఉండి మహాభాగవత రచన చేయించాడని చెప్పుకొన్నాడు. అయినా పోతన ఇక్కడ దివ్యజీవి రతీదేవిని అన్యాయానికి గురైన ఒక సాధారణ అనాథ స్త్రీ మూర్తిగానే ఎందుకు చిత్రించినట్లు? సృజన రహస్యమంతా అక్కడే ఉంది.
కవి కావ్యరచన చేసే సందర్బంలో తన కృతి పదిమంది చదివి తాదాత్మ్యం చెందాలని కోరుకొంటాడు. ఆ విధంగా తన్మయత్వం చెందాలంటే రచనలోని పాత్రలు దేవుళ్లైనా, దానవులైనా మానవుల మాదిరే భావోద్వేగాలు ప్రదర్శించక తప్పదు. అప్పుడే చదివే పాఠకుడు తన స్వభావంతో.. తన పరిసరాల నైజంతో ఆ పాత్రలను 'ఐడెంటిఫై' చేసుకునేది. తన రచన చదివే పాఠకులు ఎవరో ముందే నిశ్చయించుకొనే కవి/ రచయిత ఆ రచనను తన సొంత స్థాయికి కాకుండా పాఠకుడి మేధోస్థాయికి తీసుకువెళతాడు.  కథాకాలం ఏదైనప్పటికీ, కథన కాలానికి పాఠకుల భావోద్వేగస్థాయికి తగినట్లు సాగే రచనే పదికాలాల పాటు కాలానికి ఎదురీది నిలబడేది.
పై పద్య కర్త బమ్మెర పోతన అని ప్రత్యేకంగా చెప్పపనిలేదు. ఆ  అచ్చు తెలుగు పదాల పొహళింపు, ద్రాక్షాపాకరస ధార, చెవులకు ఇంపనిపించే శబ్దాలు పొదిగి  చేసే పదప్రయోగాలు, సందర్భానికి తగ్గట్లు ఛందో వృత్తాల వాడకం.. ఇత్యాదులన్నీ బమ్మెర పోతన 'ముద్ర' ను పట్టిచ్చేస్తాయ్.
రచన చదివినప్పుడే ఫలానా కవిది/రచయితది ఈ కర్తృత్వం అని పాఠకుడు గుర్తు పట్టే విధంగా రచన సాగితే.. అదే ఆ కవి ముద్ర.
ప్రతీ కవి, రచయిత, కళాకారుడు తనదైన  సొంత 'ముద్ర' స్థాపించుకున్నప్పుడే  సాహిత్యంలో అతని పేరు చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉండేది.
కొత్తరచయితలు పాత రచయితల నుంచి నేర్చుకొనే అనేకమైన  సృజన లక్షణాలలో 'ముద్ర' కూడా ఒక  ముఖ్యమైన సుగుణం.
-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో ప్రచురితం)

No comments:

Post a Comment