వేదకాలంలోనే మానవ సమాజాన చాతుర్వర్ణ
విభజన(నాలుగు కులాలుగా విడిపోవడం) జరిగినట్లు రుగ్వేదం
పురుష సూక్తం బట్టి అర్థమవుతోంది.
‘బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః
ఊరూ త న్య యద్వైశ్యః పద్బ్యాం శూద్రో అజాయత’
రుగ్వేదం(10-90-12)
బ్రాహ్మణులు భగవంతుడి ముఖం నుంచి జన్మిస్తే భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు జీవం పోసుకొన్నారని.. కడజాతివాళ్ళు
మాత్రం దేవుడి కాళ్ల నుంచి పుట్టుకొచ్చారని .. కళ్లతో
చూసినట్లే అల్లిన కట్టుకథల ప్రచారం చాలా కట్టుదిట్టంగానే జరిగింది. ఆ తరహా
ప్రచారాలకు పూనుకొన్నదీ సర్వోన్నత వర్గమే. దానికి కింది
ఇద్దరు ఉన్నతవర్గాల మద్దతు! ఇందులో ఏదో మతలబుందని అప్పట్లో ఆలోచన రాకపోయింది
కడజాతులకు.
కాలంతో పాటు బుధ్ధి వికసిస్తున్నదిప్పుడు. కాబట్టే
బోలెడన్ని అనుమానాలు పెద్దల బుధ్దుల మీద! తప్పేముంది?!
వర్ణవ్యవస్థ నిర్మాణం ఎప్పుడు సామాజికంగా స్థిరపడిందో.. అప్పటి నుంచే ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు.. ఉన్నవారు,
లేనివారు- అంటూ గుంపుల
మధ్య గోడలు లేచాయి.
వివాదాలూ మొదలయ్యాయి. వేదాల్లోనే ఇందుకు రుజువులున్నాయి, అంతా కలసి మెలిసి అన్నదమ్ముల్లా సహృద్భావంతో జీవిస్తుంటే 'సంవనీ రుషి' నోటి నుంచి 'సమన్వయంతో జీవించండి!'
లాంటి హితోక్తులు వెలువడాల్సిన అగత్యమేముంది?
'కలసి ఉండండి!
కలసి తినండి! మనసులు
కలుపుకొని మాట్లాడుకోండి! పురాతన దేవతలకు మల్లే కలసే ఉపాసనలు
చేసుకోండి!’అంటూ బ్రహ్మాండ పురాణంలో సూక్తులు వినిపించే అవసరం కలగదు కదా!
వేదపన్నాలు నాగరికంగా, బుధ్దిపరంగా అభివృధ్ధి చెందిన మేధోవర్గాలకు మాత్రమే బుర్రకెక్కే వాఙ్మయం. ఆ దేవనాగరీక భాషాప్రవచనాలు, శిష్టోచ్చారణలు సబ్బండజాతుల మతులకు ఓ పట్టాన ఎక్కేవి కావు. అతి తక్కువ శ్రమతో అపార,మైన ఉమ్మడి సామాజిక
సంపదలు సొంతానికి పోగేసుకు అనుభవించే
సౌకర్యం వర్ణవ్యవస్థ ద్వారా ఉన్నత వర్గాలవారికి సంక్రమించింది. చెమటోడ్చి
సమాజానికి ఇంత కూడూ గుడ్డా నీడా కల్పించే నిజమైన కింది శ్రామిక జీవుల నుంచి ప్రశ్నలు ఎదురైతే
ఉత్పాతాలు తప్పవన్న స్పృహ ఉన్నత వర్గాలవారికి ఉంది. సమాజ రథాన్ని తమ శక్తికి మించి ఈడుస్తోన్న కింది వృత్తులవారిని ఎప్పుడూ
చెప్పుచేతల్లో పెట్టుకొనేందుకు అందుకే ఒక ఉపాయం అవసరమయింది. ఆ అవసరంలో నుంచి
పుట్టుకొచ్చినదే జానపద వాఙ్మయం. జానపదులకు బోధపడే సాహిత్య రూపంలో కట్టుదిట్టంగా
కథలు, కబుర్లూ దిట్టంగా పుట్టించి ముమ్మరంగా
ప్రచారంలో పెట్టబట్టే నిమ్నజాతులు
తాము గీచిన గీటుకు కట్టుబడి ఉన్నాయి.
శిష్ట సమాజానికి వేదాలు ఎంత ప్రామాణికమో. పామరులకు ఈ
జానపద వాఙ్మయం అంతే ప్రామాణికం, శిష్టులకు
పురాణాలకు మల్లే కులపురాణాలు
జానపదులకు శిరోధార్యాలు.
కులాల పుట్టుక,
కుల మూలవిరాట్టుల జన్మవృత్తాంతాలు, కులవృత్తుల ఆవిర్భావం,
వాటి స్వరూప స్వభావాలు అత్యంత సూక్ష్మంగా, శక్తివంతంగా,
నిజమైనవే అన్నంత పకడ్బందీగా
అనేక గ్రామీణ కళా రూపాలలో దిగువ జాతుల వారి మెదడుల్లోకి చొప్పించబడ్డాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ తరహా మందిసాహిత్యంలో కడజాతులవారు పాటించి తీరవలసిన నియమ నిబంధనలు ఎన్నో ఉంటాయి. సమాజ సౌధ నిర్వహణ
భారం మొత్తం తమ తమ వృత్తిధర్మాల నిబద్ధత పునాదుల మీదే నిలబడి ఉన్నదన్న భ్రమ కడజాతులవారి నరనరాలలో కాలక్రమాన జీర్ణించుకుపోయింది.
నాటుమనిషి ఎదురు ప్రశ్నలు అడిగినా, ఎదురుగా నిలబడి ఏ మాత్రం పొగరుగా తల ఎగరేసినా సమాజం మొత్తానికి చేటు తప్పదన్న భయం పామర లోకంలో యుగాల బట్టి చాలా బలంగా
నాటుకుపోయింది. పెను ఉత్పాతాలు తప్పించవలసిన
విధి జానపద సాహిత్యం మాధ్యమంగా ఆ విధంగా బడుగువర్గాల భుజస్కంధాల మీద మాత్రమే మోపి తమ తమ భద్రజీవితాలకు ఎప్పటికీ ముప్పు రాకుండా తగు
జాగ్రత్తలు తీసుకొన్నాయి చాతుర్వర్ణ వ్యవస్థలోని పై రెండు మూడు అంచెలు! అర్థం
పర్థం లేనివి జానపదులు చెప్పుకొనే కథలు అనుకోవడం తప్పు. లోతుగా ఆలోచిస్తే అసలు పరమార్థం
బైటపడుతుంది,
-కర్లపాలెం హనుమంతరావు
29 -07 -2018
No comments:
Post a Comment