Thursday, April 16, 2020

ఆంగ్ల మాధ్యమం ఉత్తర్వుల పట్ల ఉన్నత న్యాయ స్థానం తీర్పు ప్రశంసనీయం !



ఇప్పటి మన సర్కారు బళ్లల్లో తెలుగు సతుకులే చట్టుబండల్లా సాగుతున్నాయి. ఇంకా ఇంగ్లీషు చదువులా? ! అవెంత లచ్చనంగా ఉంటాయో అందరికీ తెలుసు | అసలు 5 తరగతుల వరకు పసిబిడ్డ కంటి ముందు తల్లి పలికే భాష తాలూకు అక్షరం తప్ప మరోటి కంటబడదాదు . ఎంత డబ్బు ఉబ్బు ఉన్నవాడి బిడ్డలకైనా  అదే నియమం నిర్బంధంగా అమలు చెయ్యాలి ! 
కాన్వెంటు బోర్డు కనబడినప్పుడే   పెట్టిన వాళ్ళకు జనం  బడితెపూజ గాని చేసుంటే   సమాజానికి ఇప్పుడు  ఈ భ్రష్టత్వం తప్పుండేది. చక్కగా చదువుకోవలసిన పసిబిడ్డ అక్షరాభ్యాసంలో కూడా పుస్తకాల పేరుతో బండెడు బండెడు చెత్తా చదారమా? యూనీఫారాల వంకతో బట్ట ముక్కల  వ్యాపారమా  ? ఇంగ్లీషు బళ్ల వెనకా ఎంత పెద్ద పెద్దల లాలూచీ  తంత్రం దాగుందో! అర్ధముయితే మామూలు జనం ' ఛీ ' కొడతారు .
చదువు సంధ్యలు సరిగ్గా వంటపట్టనోళ్లు, పుట్టీ పుట్టగానే కంటి ముందు డబ్బు కట్టలు , కాసులు పోసేస్తే చాలు  ఏదైనా పట్టుకు పిసికేసే  నౌకర్లూ,  చాకర్లూ ఇంటి  నిండా  మట్టంగా కనిపించే  నడమంత్రపు సిరిగాళ్ల వల్లనే ఈ గల్లాపెట్టె చిల్లర వ్యాపారాలు! కనీసం కులపరంగా సంక్రమించే వృత్తి మీద అయినా ధ్యాసపెట్టరు. నామర్దాగా భావిస్తారు. బడితెల్లా  ఎదిగిన తరువాత ఆ గాడిదలు  వుత్తిగా  తిని తొంగున్నా లోకానికి  అదో కొంత మేలు. ఊహు(! మళ్లా తండ్రుల్లాగా, తాతల్లాగా గల్లాపెట్టెలు గలగల్లాడాలి. ఏ గడ్డైనా సరే గతికి గడించాలని కుతి. నిజంగా జీవితంలో ఎన్నో  కష్ట నష్టాలకు  ఓర్చి  ఒక్కొక్కటిగా నిచ్చెన మెట్లు ఎక్కుతూ పైకొచ్చిన  బుద్ధిమంతులను చూపించి .. వాళ్లంతా  మిమ్మల్ని  తొక్కేసే పైకొచ్చారన్నట్లు నమ్మించెయ్యడం! వాళ్లంత వాళ్లని  చేస్తామని కన్యాశుల్కంమార్కు గిరీశాలను మించి గప్పాలకు దిగంగానే ..వెంకటేశంలా  అమాయకులు, ఏ విషయమూ లోతుగా అర్థం చేసుకోవడం అంతగా పట్టుబడే వాతావరణంలో పెరగని   బడుగు జాతి తమ్ముళ్లు   పైపై ప్రలోభాలకు  గురికారా? ఇంగ్లీషు ముక్క పుట్టినప్పటి బట్టి నాలుక్కింద నలక్కపోతే   వాళ్లను సర్కారు కొలువులు దగ్గరిక్కూడా  రానివ్వవు; అమెరికాలాంటి అగ్రరాజ్య లక్ష్మమ్మలు తమ డాలర్ దుర్గాల  వైపుకి తొంగైనా చూడనివ్వవు - అని బుర్ర శుద్ధిచేస్తారు.ఈ బ్రెయిన్ డ్రెయిన్ వల్లనే తల్లిదండ్రులు ఇట్లా చిన్నబడి దశ నుంచే తల్లిభాష నుంచి తమ పసిబిడ్డలను  దూరంగా లాగేయడం! దురదృష్టం ! 
అటు కొలువులకు చాలని విద్యాప్రమాణాలు, ఇటు కులవృత్తులకు కొరగాని అరకొర పరాయి భాష దర్పాలు! బాగుచేసే నెపంతో  పాడుచేసేందుకే  ఈ ఉబ్బు ఉబ్బిన  బడుద్ధాయిలు ప్రయివేటు విద్యా సంస్థలు పెట్టుకునేది. ఎటూ సర్కారుల్లో ఉండేది తమ బోటి దర్జావర్గాల వారే ! కాబట్టి ఖజానా సొమ్మును ఫీజు రియంబర్స్ అనే  నాజూకు  పేరుతో ( అర్హతలు ఉన్న ఏ కొద్ది మందికో ఇట్లాంటి వెసులుబాట్లు తప్పక   కల్పించాల్చిందే..  అభ్యంతరంఉండనక్కర్లేదు) ఐక్యూలతో నిమిత్తం లేకుండా  అందరినీ  ఒకే క్యూలో నిలబెట్టి చేర్చుకుంటే జనం సొత్తు తేరగా ఒల్లుకోవచ్చు . పొల్లు అయితేనేమి .. దొరల చదువులు చెప్పిస్తున్నారన్న కృతజ్ఞతా భావన అమాయక పేదవర్గాలలోముప్పరిగొనే   విధంగా చేసి బలమైన ఓటు బ్యాంకు స్థిరపరుచుకునే దొంగెత్తు ప్రాథమిక స్థాయిలో  పరిసరాలతో సంబంధం లేని పరాయి భాషను పసి మెదడుల అలసేలా పడేసి రుద్దడం . 
అందరికి అన్నీ తెలుసు. వృత్తికి, కొలువుకు రెండిందాలా చెడే వంచిత వర్గాలకు తప్ప ఇంగ్లీషు చదువు వెనకున్న కుతంత్రం. ఇప్పడు జగన్ బాబు వంతు! రేపు వస్తే గిస్తే  చంద్రబాబుదైనా  .. ఇంకో చపలచిత్తం  బాబుదైనా ఇదే తంతు ! నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజాయితీ ఉన్న నాయకులకు మంచి చెడులు పారదర్శకంగా ప్రజలకు  వివరించే సదవకాశం. ఆ సాహసం చెయ్యలేని మేడిపండు రాజకీయం జీవం పోసుకున్న క్షణం నుంచే ప్రజాహితం మరణకాలం మరింత ముందుకు జరిగినట్లయింది. జనం మేలు నిజంగా కోరుకునే ప్రజాహితవాదులే తల్లిభాష జవజీవాలకు ఇక  దిక్కు. 
తల్లిభాష ప్రయోజనాలు ఒకళ్లొచ్చి ప్రత్యేకంగా  చెప్పడమేంటి.. సిల్లీ గాక పోతే! తమది కానిది తతిమ్మా భాషలలో మరేదైనా సరే పసిమెదడుల వికాసానికి ఏ విధంగా అడ్డొస్తుందో  వివరించే  దుర్గతి తెలుగువాడికే పట్టడం  నిజంగా ఒక దురదృష్టo. నిజానికి ప్రజలు వరసబెట్టి ఎన్నుకునే ప్రభువుల   నిర్వాకం ! 

ఎంత పోరితేనో గానీ  విద్యాహక్కు చట్టం మనం సాధించుకోలేకపోయాం.  ఇంకా సాధించవలసిన హక్కులు ఎన్నో ఉన్న మాటా నిజం. దక్కుదల అయిన  హక్కుల పైనే ఆయా బాధ్యులు   చిత్తశుద్ధితో చేపట్టవలసిన  చర్యలు ఇంకా బోలెడు ఉండి పోయాయి ' పెండింగ్ ' లో ! 
సర్కారు బడులు నడుస్తున్న తీరు లోపాల పుట్ట.  ఆడపిల్లల అవసరాలు చాలా చోట్ల ఇంకా తీరవలసి ఉంది. బడి పుస్తకాల బరువు మీద చట్టాలైతే వచ్చాయిగానీ ఆచరణ విషయంలో అంతా తూతూ మంత్రo సామెతే . చట్టం అంగీకరించిన  విద్యార్థుల, గురు శిష్యుల దామాషాలను  తమాషాగా తీసుకొనే దృశ్యమే అసేతు హిమాచల పర్యంతం కనిపించేది. రవాణాసౌకర్యాల మాట దైవమెరుగు, నిర్దేశిత పాఠ్య ప్రణాళికలలోనే మెరుగుదలకై తీసుకొనే చర్యలు  శూన్యం. రాజకీయ అవసరాలను తీర్చే  బోధనేతర కార్యక్రమాలలో గురువులే కాదు , శిష్యుల పాత్రా  తాతలకాలాన్ని కూడా ఇప్పుడు తలదన్నుతోంది. అడపా దడపా శ్రీ కోర్టులు 'ఛీ(' కొట్టినా దులపరించేసుకుని నాలుగ్గోడల మధ్యన రేపటి తరాలకు విద్యాబుద్ధులు మప్పే పని నుంచి గురువులను తప్పించడం, ఆ లెక్కలు ఈ లెక్కలంటూ ఉళ్లు పట్టుకు తిరిగి రమ్మనడం తిక్కప్రభువులకు రానురాను మరీ ఎక్కవవుతున్నది. ఒప్పందాల ప్రకారం చెల్లించే నెలసరి జీత భత్యాలకే దిక్కులేని పరిస్థితుల్లో అదనపు పని భారానికి అదనంగా  చెల్లించమని గురువు కోరడం  సర్కారు పెద్దలకు దురాశ అనిపిస్తున్నదిప్పుడు. హమీలిచ్చిన  ఉద్యోగాలు లేవు. కంటి తుడుపు కింద  పెట్టిన అర్హతా  పరీక్షల ఫలితాలు వేళలకు ఎందుకు వెలువడవో విధాతకైనా తెలియం 'దేవ'రహస్యాలయిపోయాయి . ఇచ్చా పూర్వకంగా ప్రాణవాయువు గొట్టం ప్రభుత్వ విద్యాశాఖఅనే  రోగి ముక్కు నుంచి ఏ క్షణాన   ప్రభుత్వాలే ఉడలాగేస్తాయో! ఇన్ని అయోమయ  అస్తవ్యస్త పరిస్థితుల మధ్య..  అవతల కార్పొరేటు. ప్రయివేటు విద్య నిర్వాహకులకు  ఇంటట్లుళ్లకు మించి తామే పరోక్షంగా మనుగుడుపులు  చెల్లిస్తూ కూనారిల్లే సర్కారు బళ్లచదువులకు  ఒక్క పంతుళ్లను మాత్రమే బకరాలను చేస్తున్నారు. చూచిరాత తప్ప..  ఆలోచించి మాత్రమే సమాధానాల పత్రాలు నింపాలన్న ప్రాథమిక ఇంగితం ఎన్నడో మసకేసిన పరీక్షల విధానం నుంచి మంచి ఫలితాలు రాబడితేనేమి ? రాబట్టకపోతేనేమి? ఎండవానలకు, చలిగాడ్పులకు  గట్టిగా తట్టుకొని వరసగా వారం పాటయినా  నిలకడగా ప్రభుత్వ పాఠశాలలు నడవలేని నిర్వాకం కళ్లారా చూస్తూ .. ఎంత గతిలేని బడుగుజాతి సంసారయినా బాగుపడాలని కోరుకునే తన బిడ్డ భవిష్యత్తును   బందీలదొడ్డి బడులకు వదిలేయగలడా? 
తెలుగో .. ఇంగ్లీషో .. తన సంతానం గట్టిగా నాలుగు ముక్కలు పొట్టకు పట్టించుకుని తన కాళ్ల పైన తాను సొతంత్రంగా జీవిక గడుపుకుంటే.. అదే పది వేలనుకునే  కన్నవాళ్లే నిజానికి కోట్లలో  కనిపిస్తారు ఈ దేశంలో. ఆ తరహా వాతావరణం  నుంచి సర్కారు బడులను  దూరం చేసిన నిర్వాకం ప్రభుత్వాలదే. మొన్నటి దిల్లీ ఎన్నికలలో చీపురుకట్ట పార్టీకి అంత పెద్దెత్తున మద్దతు కూడిరావడంలోని ప్రధాన కారణాలలో కేజ్రీవాలు సర్కారు విద్యపట్ల కనబరిచిన అపరిమిత శ్రద్ధ. కోర్పొరేషన్ పాఠశాలలనూ కార్పొరేట్ చదువుల కొట్లకు మించి విద్యా ప్రమాణాలలో  , రవాణా, సౌకర్యరంగాలలో అభివృద్ధి చెయ్యడం. 
విద్యాహక్కు  కల్పించిన సౌకర్యాల  మీద మరింత శ్రద్ధ పెంచి ప్రభుత్వవిద్య పరంగా కనీసం ప్రాథమిక స్థాయి  వరకైనా మాతృభాష మాధ్యమ విషయంలో  పట్టు పెంచాలి నిజానికి. అందుకు విరుద్ధంగా సామాజిక శాస్త్రవేత్తల శాస్త్రబద్ధ వాదనలను వినేపాటి చొరవైనా చూపకుండా  రాత్రికి రాత్రే రాష్ట్రమంతటా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అంటూ  జగన్ బాబు ప్రభుత్వం వేసిన వీరంగాలు వీగిపోవడం ప్రస్తుతానికే   ఉరట కలిగించే అంశం . ప్రజాహితం కోరుతూ  తమ ముందుకు వచ్చిన  వ్యాజ్యాలను క్షుణ్ణంగా  విచారించి ప్రభుత్వం తెచ్చిన అదేశాలు విద్యాహక్కు  చట్ట స్థూర్తికి పూర్తిగా విరుద్ధంగా  ఉన్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం  కొట్టివేసింది. తర్పుపాఠం పూర్తిగా బైటకు రాక మునుపే ప్రభుత్వంలోని  ప్రముఖులు కొందరు విరుద్ధ తీర్పును ఎప్పటిలాగానే ' చంద్రబాబు వత్తాసు ' వర్గానికి అంటగట్టే ప్రయాస ప్రారంభించేసారు. రాష్ట్రం జగన్ బాబు జాగీరూ కాదు. చంద్రబాబు ఇంద్రభవనమూ కాదు . రాష్ట్రానికి సంబంధించిన ప్రతి వ్యవహారమూ  రాష్ట్రంలో పుట్టి పెరిగి ఎదో విధంగా ఈ  రాష్ట్రంతో సంబంధ బాంధవ్యాలు కలిగివున్న   ప్రతి తెలుగువాడిదీ - అన్న ఇంగితం ప్రభుత్వాయి 
 నడిపే వారికి ఉండాలి  ముందు . అప్పుడే ప్రాథమిక విద్య పరంగా తాము తమ కుండే లాభాల దృష్టితో  తీసుకున్న ఈ  ఇంగ్లీషు మాధ్యమం తొందరపాటు ఆదేశాలను కొట్టి పారేసిన కోర్టు ఉత్తర్వుల్లోని ఉచితానుచితాలు బుర్రకెక్కేది. 
***

కర్లపాలెం హనుమంతరావు 
16 - 04 - 2020 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...