Saturday, April 25, 2020


తేంక్స్
-పాటిబండ్ల రజని
అంతేనంటావా ఆర్యపుత్రా!
అంతే అయ్యుంటుందిలే!
కురచ దుస్తులు వేసుకున్నందుకే
రావణుడలా సీతను మోహించి ఉంటాడు
ద్రౌపదిని స్విమ్ డ్రస్సులొ చూసిన తాపానికి
కీచకుడు చెర పట్టి ఉంటాడు
 అర్థ నగ్న వస్త్ర ధారణతోనే అహల్య
సురపతి మతి పోగొట్టి ఉంటుంది.
అంతే అయుంటుందిలే
అంతకు మించి ఏమన్నా
అభాండమే అంటావు నువ్వు
యుగాలుగా పెరుగుతున్న మగమదానికి
కావలి కాస్తున్న మనుధర్మం
కోడలి ఆత్మ గౌరవం మాటే మరచి
అత్త కొట్టడం నేరం కాదని సెలవిచ్చిన వేళ
త్రిపత్నీ  పరివేష్ఠుతుడైన  నాయకుడి కాల్మొక్కి
కుమారిత్వం శోధన పేరిట
ఆంతరంగిక గతాన్ని తలకో  చెయ్యీ వేసి
తవ్వి పోస్తున్న ఈ నేలపై
రెండు చెవుల మధ్య ఉన్నది కాక
రెండు కాళ్ల మధ్య కేంద్రమే దిశానిర్దేశం  చేస్తుండగా
మానవత్వానికి వేసే ఉరి
మగసిరిగా మురిసేది వయాగ్రేనేరా!
మేకపిల్ల ఏ నీళ్ళు తాగినా
ఎగువ నీళ్లే ఎంగిలయే ప్రవాహాలు
మీ మెదళ్లలో ఇంకా జీవనదులుగా  ఉన్నాయని
అరిటాకూ ముల్లూ తుమ్మెదా మధువూ
పదబంధాలను మించి
విస్తృతమవుతున్న సంబంధాల నుంచి
అక్షరమైనా నేర్వలేదని
నువ్వు నిరూపించాక కూడా
నిజమే!
ఎన్ని కొడవళ్లని పదును పెట్టగలం బాబూ?
ఒక్క వేటుకు వెయ్యి మానులు నరికే
కొత్త ఆయుధం కనిబెడతాం గానీ!
(ఆంధ్ర్రజ్యోతి -వివిధ -21, సెప్టెంబర్. 3009 ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...