Sunday, June 28, 2020

కర్షకా! -శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి- సేకరణః కర్లపాలెహనుమంతరావు




కొలములని జాతులని మేలుకోవలనుచు
పేరు పేరున భేదభావ
ముగ్గడించుట యవనికో యొప్పుగాని
కర్షకా, నీకు జెల్లదా కాపథంబు!
***


ఆలతో లేగపిండుతో అహరహంబు
కాపురము సల్పు నీ కేల కాని త్రోవ!
నిఖిల జీవుల కాశ్రయ నిలయమైన
కృషియె నీ జీవితమునకు గీర్తి తెచ్చు.
***
కలిమిలేముల త్రొక్కిళ్ల వలన నమిత
మోద ఖేదము లందుట కాదు నీతి;
కాలచక్రంబు పరవళ్లు లీల దాటి
వడిదుడుకు లేక మసలుట గడుసుదనము.
***
వేడి వెలిగ్రక్కు పడమటి గాడుపులకు
గాంతి తరిగిన తీవెల దొంతియట్లు
విమల పూర్వసత్సంప్రదాయములు నేడు
సన్నగిల్లుట గురితింపు మన్న నీవు!
***
పాలకుల వేషభాషల ప్రాభవమున
పాలితుల వైఖరియు మారుపాటు నొందు;
అందు విద్యాధికుల సంఘమందు ముందు
గలుగు పరిణామ మది నీకు హితము గాదు!
***
సర్వశాస్త్త్ర విచారము సలిపి విభుధ
సంఘ మూహించి విజ్ఞానసార మెల్ల
నాట పాటల ననుభవమున
చిత్తమున హత్తుకొనుట నీ వృత్తియగును.
***
వర్తకము రాచఠీవి సంప్రతులజులుము
చదువుసంధ్య వారి సంసారగోష్ఠి
సర్వమానవగ్రాసవాసముల తృప్తి
నీదు వృత్తికి శాఖలై నెత్తికెక్కె!
***
దున్నగా దూడల జేరు నన్న రీతి
కాయకష్టంబు వంక కేగకయె, దండి
 లాభముల కాసపడి మాయవైభవంబు
లంది కులికెడి వ్యక్తుల నయయుమన్న.
**
పరుగు పరుగున బ్రాప్తించు పాలకన్న
నిలిచి శాంతించి త్రావిన నీరె మేలు;
లక్షల కొలంది జేకూర్చు లాతివృత్తి
కన్న శ్రేయంబు నీ వృత్తియన్న నిజము.
***
పశుపతికి నీకు సంబధ బాంధవంబు
లుండు నన్న అసత్యము మేముండు నన్న!
శిశువు కన్నను నిచ్చలు పశువు నెంతో
గారవింతురు నీవుగా కేరు చెపుమ!
***
అలు- పిల్లలు జెల్లలు-నాలుపిండు
గొడ్డుగోదలు-దూడలు-దొడ్డు లొక్క
చేతిన నడిచిన రీతి నున్న
గలుగు సంతోష మింతని చెప్పగలమె!
***
ఆరుగాలము కష్టించి ఆలుమగలు
బిడ్డపాపలు తమ దృష్టి పడ్డ మెదుకె
యారగింతురుగా కంతె, పారతంత్ర్య
బుద్ధి యవ్వారి పొంతకు పోవదన్న!
***
అతని కష్టార్జితమున కాసపడెడి
'పర భృతంబుల' లెక్కకు తరుగులేదు,
వాని 'సిద్ధాన్నము'ను నోటవైచుకొనుచు
నెగిరిపోజూచు డేగ ల వెన్నో కలవు!
***
నారుపోసినవాడెపొ నీరు వోయు
నను వేదాంత సూక్తి నీ కమృతగుళిక;
నమలి భక్షించుకన్నను నాణె మరయు
మ్రింగుటే యన్న సూక్తి యెరుంగవన్న.
***
లోకమును ధాత సృజియించుగాక, దాని
తిండి దండిగ సృష్టించు తెరవు నీదె,
ఉద్ధియగుదువు ధాతకు నోయి నీవు
చూడ నెచ్చటిదో యీ చుట్టరికము.
***
'ఆత్మవ త్సర్వ భూతాని'యనెడి మాట
అక్షరాలను బాటింప నర్హు డెవడో!
ఎవరి కయ్యది సరిపడు నవని నీకు
దప్ప తక్కినవారిలో నెప్పుడైన?
-శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి
(ఆంధ్రపత్రిక- శ్రీ చిత్రభాను సంవత్సరాది)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
28 -06 -2020












No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...