జింజాం త్రోపస్, జావా, నియాండర్లల్, సోలో, స్టీన్ హోం లాంటి దశలన్నీ దాటేసి హోమో సెపైన్స్ గా అవతరించి ప్రకృతి మీద పూర్తి ఆధిపత్యం సంపాదించినట్లు విర్రవీగే దశలో మనిషి పొగరును అణచడానికి సృష్టి ఉనికిలోకి వచ్చిన కొత్త మహమ్మారి కరోనా వైరస్ ఉపద్రవం. ఆకూ అలమల సేకరణ దశ నుంచి, ప్రకృతి వనరుల రహస్యాలను ఒక్కొక్కటినే ఛేదించుకుంటూ.. విశ్వాంతరాళలోకి రాకెట్లు తోలే వికాస స్థాయి వరకు చేరిన మనిషి తెలివితేటలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అగత్యమైతే లేదు. కానీ మనిషి ఆలోచనలు ఒక చోట నిలబడతాయా? నిలబడితే వాడు మెదడు గల మనిషవుతాడా? సృష్టిలో తతిమ్మా జంతుజాలల కన్నా తనకు అదనంగా లాభం చేకూరింది చంచలించే మెదడు స్వరూపం అని ముందు అర్థం చేసుకున్నాడు. సామాజికంగా, సామూహికంగా రోజుకు కొన్ని వేల కొత్త పదాల సృష్టి మెదడు లేకుండా సాగే వ్యవహారం కాదుగదా? బయో మెడిసిన్ అంటూ మొదలు పెట్టి ఇప్పుడు బయోవార్ వరకు ఆలోచన సాగించడం మనిషి మెదడులో పుట్టుకొస్తున్న కొత్త ఆలోచనల వల్లనే అర్థమవుతుంది.
మనిషి మెదడు బరువు సగటున మూడు పౌన్లు అని ఒక అంచనా. రష్యన్ రచయిత్ తుర్జనీవ్ మెదడు బరువు నాలుగు పౌన్ల చిలర. ఫ్రెంచి రచయిత్ అనటోల్ ఫ్రాన్స్ మెదడు బరువు ప్రపంచంలో కెల్లా చిన్నది. బరువు రెండు పౌన్ల పై చిలుకు.ఈయనా రచయితే. ఇద్దరికీ ప్రపంచ సాహిత్యంలో సమానంగానే పేరుంది. మెదదు బరువు సంగతి ఆనక, ముందు ఉన్న మెదడు చేత సక్రమంగా చాకిరీ చేయించుకునే ఇంగితం కదా ప్రధానం! బుర్ర ఎంత పెద్దదయి వుండీ ఏం ప్రయోజనం బుద్ధి కురచనైతే! బుద్ధి పెద్దదై బుర్ర బరువులో తేడా వచ్చినా మానవాళికి పోయేదేం లేదు. తమ కంటే ఇతర జాతులు తెలివిలో తక్కువవి, ఆ కారణం చేత అవి స్వాతంత్ర్యానికి అనర్హమని నిన్న మొన్నటి వరకు యూరోపియన్లు, వలసదార్లు నమ్ముతూ వచ్చారు. తెల్లవాళ్లకు తమ బుద్ధి కౌశలం మీద అతివిశ్వాసం. సాటి నీలివర్ణంవాళ్ల తెలివితేటలను మీద కొంచెంచూపు. కాని చరిత్ర తిరగేస్తే నాగరికతను సానుకూల పరిచిన వివిధ వస్తు సముదాయం సృష్టికర్తలలో నల్లజాతీయులే అధికం. నిన్న మొన్నటి వరకు బానిసలుగా బతుకులు బరువుగా ఈడ్చిన జాతులు ఎన్నో గత శతాబ్దిలో విమోచనాలు నడిపి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సాధించడం చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. బైటికి అనరు కానీ ఇప్పటికి సామ్రాజ్యవాదుల మనసుల్లో తమ ఆదిక్యతాభావన పైన విపరీతమైన విశ్వాసం కద్దు. దానిని ప్రశ్నించే వర్గాల మీద అంతే విద్వేషమూ సహజంగా వెంట ఉంటుంది కదా! సందు దొరికితే తమ ఉక్రోషం తీర్చుకునే అవకాశం పెత్తందారి వర్గాలు ఎన్నటికీ వదులుకోవు. మొన్న అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రో- అమెరికన్ అకారణ దారుణ మరణం వెనుక తాత్కాలికమైన కోపతాపాలు ఒక్కటే కారణం అనుకోవడం సరికాదు. ఒక్క అమెరికా అనే కాదు.. ప్రపంచమంతటా ఇప్పుడు నడుస్తున్నవి విద్వేష పురాణాలే అనిపిస్తుంది. ఒక దేశంలో రంగుల తేడా అయితే, మరో దేశంలో మతాల మత్సరం. ఇంకో ప్రాంతంలో కులాలపై చిన్నచూపు. కరోనా ప్రబలిన కొత్తల్లో అకారణంగా చైనాను అమెరికా నిందించడం, మతావేశాలు పెచ్చరిల్లే ప్రస్తుత సందర్భంలో భారతదేశంలో మైనారిటీ మతాన్ని మూలకారణంగా ప్రచారం చేసే ప్రయత్నమూ ఇవన్నీ మనిషి మెదడులోని చీకటి పార్శ్వం చురుకుతనం పుణ్యం. అన్ని ఆధిక్యతల మీద ఆధిక్యత ప్రదర్శించేది అంతిమంగా ఆర్థికకోణమే. డబ్బు శక్తి పెట్టుబడిదారుడికి తెలిసినంతగా కార్మికుడికి తెలిసే అవకాశం లేదు. ఇవాళ చైనా అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్నంగా సాగుతున్న పోరుకు కూడా ఈ ఆర్థికమే మూల కారణం. గత శతాబ్దమంతా తన కర్రపెత్తనం మీద ప్రపంచాన్ని నడిపించిన అమెరికాకు కొత్త శతాబ్దిలో పరిస్థితులు చేజారిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపించడంతో ఆందోళన పెరిగినట్లు అర్థమవుతూనే ఉంది. ప్రపంచ మార్కెటు గతంలో మాదిరి గుత్తంగా తన దగ్గరే ఉండే పరిస్థితులు కచ్చితంగా లేవు. ఉత్పత్తి రంగంలో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ అశేషమైన మానవ వనరులు, మేధో వనరులకు తోడుగా మంచి ప్రణాళికతో ముందుకు దూసుకొస్తున్న చైనా జోరుతో అమెరికా బెంబేలెత్తుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. మరో మూడు దశాబ్దాలకు శతవర్షోత్సవంలోకి అడుగుపెట్టబోతున్న చైనా ప్రపంచ మార్కెటు మీద తన పట్టు పూర్తిగా బిగించేందుకు ఎన్ని చెయ్యాలో అన్నీ చేయడం గమనించవచ్చు. స్వావలంబన దిశగా స్థిరబడుతూ ప్రపంచమంతా తన ఉత్పాదక వస్తువుల మీద ఆధారపడేలా ఆ దేశం వేసే అడుగులతో అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా పోటీపడే అవకాశం లేదు. అందుకే చైనాను వంటరి చేసి ఆర్థికంగా దమ్మున్న దేశాలను తన వైపు ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా చైనా లేని జి- 7లో భారత్ లాంటి అభివృద్ధి చెందే దేశాన్ని కూడా కలుపుకోవాలని కొత్త ఎత్తుకు తెరలేపింది. ఏళ్ల తరబడి ఒకే ఆట ఆడుతున్న అమెరికాకు ఇప్పుడు ఆ విడగొట్టి పాలించే ఎత్తు పారడం కష్టంగా ఉంది. అమెరికా చైనా వస్తువుల మీద ఆధారపడి ఉండటం, చైనాకు ఏ విదేశీ వత్తాసు వస్తూత్పత్ప రంగంలో అవసరం లేకపోవడం ప్రధానకారణాలు. ముఫ్ఫై ఏళ్ల కిందటి చైనాకు ఇప్పటి చైనాకు హస్తిమశకాంతరం తేడా ఉంది. ఎంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసుకుంటూ ఒక లక్ష్యంతో ముందుకు దూసుకుపోయే చైనీయుడి మెదడు బరువు, కొన్ని దశాబ్దాల తరబడి అభివృద్ధి రంగంలో అగ్రగామిగా ఉంటూ వచ్చిన అమెరికన్ జాతీయుడి మెదడు బరువు కన్నా తక్కువ అవడం ఇక్కడ గమనించక తప్పని ముఖ్యమైన అంశం. 'స్నేహితులను ఎలా సంపాదించాలి?' అనే పేరుతో గొప్ప గొప్ప హిట్ ఫార్ములాలతో వక్తిత్వవికాస గ్రంథాన్ని రాసిన డేల్ కేర్నజీ.. ఆంగ్లేయుడు.. ఆనక ' డబ్బు ఎలా సంపాదింఛాలి?' 'కోటీశ్వరులు ఎలా కావాలి?' అంటూ ఆర్థిక సంబంధమైన పుస్తకాలనూ రాసిన విషయం మనం మర్చిపోకూడదు. అదే బాటలో నడిచిన పార్కిన్ సన్లు, లారెన్స్ పీటర్ల తరహాలో ఏ పుస్తకాలో రాయడంలో కాకుండా దేశ జి.డి.పి ని పెంచే కృషిలో పెట్టి తన మెదడు బరువును నిరూపించుకుంటున్నాడు ఇవాళ చైనా జాతీయుడు. 'బుర్ర తాటికాయంత ఉంటే ఏం లాభం.. బుద్ధి చింత పిక్కంత 'అని తెలుగులో ప్రచారంలొ ఉన్న సామెత సారాంశం ముందు అర్థం చేసుకోవాలి. వట్టిగా యాప్స్ నిషేధించినా చైనాకు వచ్చే నష్టం తాత్కాలికమే అని మనమూ తెలుసుకోవడం మేలు. అంతకు అంత గుంజే మరేదో ఆర్ర్థిక తారక మంత్రంతో నష్టం పూడ్చుకోగలడు. చైనాను చూసైనా మనం మన స్వంత కాళ్ల మీద నిలబడే మంచి తంత్రం గ్రహించడమే మేలు. ఈ కయ్యాలు, కాలు దువ్వుళ్లు ఎత్తుల తతంగాలన్నీ ముగించుకున్నాక!
***
- కర్లపాలెం హనుమంతరావు
Karlapalwm2010@gmail.com
+918142283676
No comments:
Post a Comment