Saturday, June 19, 2021

నవ్వు అరవై విధాల మేలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

 



 

హాసం పరమేశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' అన్న ఆదిదేవుని  సంస్తుతే ఇందుకు ఒక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయలు వెన్నెలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా సాగుతోంది.. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి పెదవులపై చిరుదరహాసాలు! ఎవరికి వారుగా ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం.. తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఇక్కడి ఉదహృతానికి సంబంధించిన ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసురవధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు పోతన. భామ మందహాసం అదే. హరిని, అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం  ఏ భావంతో తేరిపార చూశాడో.. నీలాపనిందల పాలయ్యాడు చవితి చంద్రుడు. హాసానికి, పరిహాసానికి మధ్య ఉండే పలుచని మేలితెర మూలకంగానే భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాలపాలయింది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటూ హాసంపై గల పరిమితులను గుర్తుచేసే శతక పద్యమూ మనకొకటుంది. 'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.

 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలపు మొరటు మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి  గౌరవ స్థానమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచి ఉచ్ఛరించినా, పదాలు అడ్డదిడ్డంగా మార్చి కూర్చినా, చేష్టితాలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా.. అనేకానేక సవాలక్ష  వంకర టింకర విన్యాసాలింకేవైనా ప్రదర్శించినా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను పువ్వుల్లా రాల్చవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు,ఆ కన్నుల్లో నిప్పురవ్వలు రాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని తతిమ్మా మరో ఎనిమిది.. మొత్తంగా ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రలు పోషించిన హాసవైవిధ్యాన్ని రసప్లావితంగా ప్రదర్శిచి 'ఆహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాలను గురించి కాళిదాసు మొదలు కృష్ణదేవరాయల దాకా, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి వరకు అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ భారతీయ సాహిత్యంలో కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకు  మించి శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేసిన మాటా వాస్తవం. మే మొదటి వారాంతంలో వచ్చే  'ప్రపంచ నవ్వుల దినం'  ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!

ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని కరోనా తరహా పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధుల పై ఇంకెన్నో అధ్యయనాలు, మరింకెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా ఆ పరిశోధనాఫలాలలో కొన్నైనా! ఆ వెసులుబాటు లేనితనమే వీలున్నంత మేర మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత  కల్పిస్తున్నది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు. సరికదా, అందుకు విరుద్ధంగా ఆరోగ్యానికి అరవై రకాల మేలు కూడా. చాలా అధ్యయనాల్లో హాసోల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాసచికిత్సా విధానమే నవ్వుల దినోత్సవ నేపథ్యం.  కారణమేమీ లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయని కటారియా వాదం. నవ్వు రక్తవాహికలను విశాలపరుస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తిని విరోధిస్తుంది.  రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం వంటివి వందలాది లాభాల్లో ఒకటి మాతమే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు.. దానికే పది నిమిషాల పాటు వ్యాయామం చేసినంత మేలు. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటురాయిలా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపకా నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న  ప్రధాన స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీదనే సేవకు సదా సిద్ధంగా  ఉంటుంది. ఆ హాస సేవికకు పనికల్పించేందుకే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా.. పుట్టుకొచ్చింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...