దేవుళ్ళు తాము చంపిన రాక్షసుల పేర్లు బిరుదులుగా తగిలించుకోడం సరదా కోసం కాదు. పూజించే భక్తులను రాక్షసత్వంతో ప్రవర్తించవద్దని హెచ్చరించడం కోసం. వినాయకుడిని 'ధూమకేతవే నమః' అని కీర్తించడంలో కూడా ఇట్లాంటి ఓ గట్టి హెచ్చరికే దాగివుంది.చెడ్డపనులు చేస్తే మళ్లీ రాక్షస ప్రవృత్తితో జన్మ ఎత్తాల్సొస్తుందనే బెదురు గతంలో బాగా ఉండేది. కానీ అట్లా ఎత్తిన జన్మలో కూడా కొన్నైనా మంచి పనులు చేస్తే ఈ దుర్జన్మ పీడా వగదిదుతుందన్న ఊరటా పురాణేతిహాసాల తాలూకు కథలలో కనిపిస్తుంటుంది. ఈ సందర్భంగానే ధూమాసురుడు అనే దుర్మార్గుడిని గురించి కొంత చెప్పడం.
పుట్టింది రాక్షస జాతిలోనే అయినా ధూమాసురుడు
వేదాలను మొత్తం కంఠోపాఠం చేశాడు. చదివిన చదువుకు.. నడిచే తీరుకు బొత్తిగా
సంబంధం ఉండదనడానికి ఈ దుర్మార్గుడి దుష్ప్రవర్తనే సరైన దృష్టాంతం. శివుడికి భక్తుడు అయివుండీ భృగువుతో సంవాదం చేసే పాటి పాండిత్యం సాధించినా
రజోగుణం ప్రబలినప్పుడు మాత్రం యుద్ధాలు చేయాలని, దేవతలనే
వాళ్ళు ఎక్కడున్నా వెదికి మరీ చీల్చి చెండాడాలని అణుచుకోలేనంత కుతిగా ఉండేది
అతగాడికి. అట్లాంటి తీటలు తీరడం కోసం జైత్రయాత్రలు చేయడం, దేవతలను
చెండుకు తినడం రాక్షస జాతికి సహజమే అయినా, దేదేవతలకు
మాత్రం పద్దాకా ఏదో ఓ రాక్షసాధముడి
కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.
ధూమాసురుడి దెబ్బకు తట్టుకోలేక ఎప్పట్లానే
శివుడిని ఆశ్రయిస్తే,
ఆయనా ఎప్పట్లానే ఆశ్రితులను కాపాడే పని పెద్దకొడుకు వినాయకుడికి
పురమాయించాడు.
తండ్రి ఆజ్ఞ! తప్పుతుందా! ఏం
చేద్దామా అని బొజ్జ గణపతయ్య బుర్ర బద్దలు చేసుకొనే సమయంలో తరుణోపాయంగా మాధవుడు అనే
బ్రాహ్మడి కుటుంబం తాలూకు తంటా ఒకటి తెలియవచ్చింది. సంతానవతి
కాని కారణాన మాదవుడు భార్య సుముదను
వదిలేస్తానని తరచూ బెదిరిస్తుంటాడు. ఆమెకు మరో దారి లేక నారాయణుడిని
ఆశ్రయించడం, ఆ సందు చూసుకుని వినాయకుడు ఆమె గర్భంలో జొరబడ్డం
జరిగిపోతుంది.
యుద్ధానికని
బయలుదేరే ధూమాసురుణ్ణి ఈసారి
ఆకాశవాణి గట్టిగానే హచ్చరిస్తుంది. 'చావు మూడే రోజు దగ్గర్లోనే
ఉంది. ఇట్లా సుముదమ్మ కడుపులో జీవం
పోసుకొంటోంది' ఆవటా అని. ఎంత రాక్షసుడికైతే మాత్రం ఎదుటి
వాళ్లను ఏడిపించి చంపడం సరదా గానీ, స్వయంగా చావును కావులించుకోవడానికి సరదా ఎందుకు
పుడుతుంది? అందరికి మల్లేనే ఆ రాక్షసుడూ మృత్యుభయంతో
యుద్ధాలు గిద్ధాలు కట్టిపెట్టి ఇంచక్కా దక్కిన రాజ్యాన్ని చక్కగా 'రామరాజ్యం' మోడల్లో 'ధూమాసుర రాజ్యం' గా
సుప్రసిద్ధం చేద్దామని సిద్ధమయిపోయాడు.
అందుక్కారణం అతగాడి కొలువులో కనీసం ధర్ముడు అనే ఒక్క మంచి మంత్రైనా ఉండి
రాజుకు హితబోధ చేయడం. తతిమ్మా కొలువు కూటానికి ఇది మహా కంటకంగా మారింది. ధర్ముడు
లేని సందు చూసుకొని ధూమాసురుణ్ని రెచ్చగొట్టేస్తారు.
అటు ధర్ముడు ఇటు దుర్మార్గులైన తతిమ్మా
మంత్రులు..
దోళాంళనల మధ్య ఊగిసలాడే ధూమాసురిడి వికారాలకు అమృతంలా అనిపించే సలహా
ఎవరిస్తారో తెలీదు కానీ.. ఇస్తారు. ఆ
వికృత ఆలోచన కార్యరూపమే సుమద కడుపులో
ఎదిగే వినాయకుణ్ణి సంపూర్ణాకారం తీసుకోక ముందే సఫా చేసేయడం.
ధూమకాసురుడి ప్రయత్నం వృథా అయిందని, ఆ దుర్మార్గుడే వినాయకుడి చేతిలో చివరికి
ఖతమయ్యాడని వేరే చెప్పక్కర్లేదు కానీ, ఇక్కడ చెప్పవలసిన అసలు
ముఖ్యమైన మాట మరోటి ఉంది. చరిత్ర ఎటూ మనకు
పట్టదు. కనీసం మనం నెత్తికెత్తుకొని
నిత్యం పూజించే పురాణాలు, ఇతిహాసాలలో కనిపించే ఈ తరహా
నీతికథలనయినా మన సో కాల్డ్
ప్రజానేతలు సమయ సందర్భాలను బట్టి ఖాతరు
చేస్తుంటే ఎన్నుకునే సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకపోను. ఇప్పుడు జరుగుతున్న 'రఘు
రామరాజు కారాగార కఠిన దండన' కథా కమామిషు
వింటుంటే మంచి పాలకులు మనకు ఇక సంప్రాప్తించే యోగం ఉందా' అని
బాధేస్తుంది.
మనుషుల .. ముఖ్యంగా రాజకీయాలలో నలిగే
పెద్దమనుషుల మతిమరుపు రోగం బాగా ఎరిక
కాబట్టేపాపం వినాయకుడు దుర్మార్గుడైన ధూమాసురుడిని మళ్లీ కనిపించకుండా
శిక్షించినా.. తన పేరులో అతగాడి పేరు దూర్చుకుని 'ధూమకేతువు'ను అని కూడా గుర్తు చేయడానికి పదే
పదే ప్రయత్నిస్తున్నాడు. పాలకుల పెడబుద్ధులు సరిచేయడం భగవంతుడి తరమైనా అవుతుందా? చూద్దాం!
- కర్లపాలెం హనుమంతరావు
12 -06 -2021
No comments:
Post a Comment