Thursday, September 30, 2021

తెలుగు భాష ప్రాచీనత విశిష్టతలపై రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు



రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే  రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని భాషలకు ఒకే తరహా హోదా ఉంటుంది. ఒక భాషకు ప్రాచీనత దృష్ట్యానో, మరే ఇతరేతర కారణాలతోనో 'క్లాసికల్' బిరుదు తగిలించబూనుకోవడం రాజ్యాంగ రీత్యానే సమ్మతం కాదు. కాని, ఉత్తర భారతం పెద్దన్న పాత్ర  పెత్తనం కారణంగా హిందీకి లభించే ఆదరణ దక్షిణాదిన ఏ ద్రవిడ భాషకూ దక్కడం లేదు. అందులోనూ తెలుగు భాష పరిస్థితి నానాటికి తీసిపోవు నాగం బొట్లు సామెతలా తయారయింది.

తమిళ భాషకు మాత్రమే క్లాసికల్ హోదా దక్కడం ద్రవిడభాషా రాజకీయాలలోనూగల పక్షపాతం ఇందుకు నిదర్శనం. తమిళనాట రాజకీయాలు ప్రారంభం నుండి భాషతో సమ్మిళితమయివుండటం, కేంద్రంలోని ప్రభుత్వాలను   తమిళ  పక్షాలు ప్రభావితం చేయగలగడం వంటివి ఉపరితలంలో కనిపించే కొన్ని రాజకీయ, సాంస్కృతిక కారణాలు. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలుగుభాషకు శాపంగా మారాయి.

తమిళుల తరహాలో తెలుగువారికి స్వీయభాషకు సంబంధించిన భాషాఉద్యమాలు, బలమైన సాంస్కృతిక ఆకాంక్షలు లేవు. పేరులో తెలుగు ఉన్నప్పటికి తెలుగుదేశం ఒక రాజకీయపక్షంగ  తెలుగు భాష సమున్నతి కోసం నిజాయితీతో చేపట్టిన చర్యలు శూన్యం. గతంలో కేంద్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం నిర్వహించగల ప్రముఖ పాత్ర వుండీ, భాష కోసమై  చేపట్టిన ఒత్తిడి కార్యక్రమాలు  ఏవీ  లేవు. రాజకీయపార్టీలను తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఓటర్ల మనోభీష్టాలకు అనుగుణంగా ఎదగడం ద్వారా అధికారం చేపట్టే లక్ష్యంతో పనిచేయడమే  రాజకీయపక్షాల స్వాభావిక లక్షణం.

 

ఇక్కడగల మరో విచిత్రం గమనించాలి. 'క్లాసికల్ లాంగ్వేజ్' అనే పదాన్ని తెలుగులో ప్రాచీనభాషగా  తర్జుమా చేసుకుని భాషకు సంబంధించిన వయస్సు నిర్ధారణపై పేచీలకు దిగడం చూస్తున్నాము. న్యాయానికి క్లాసికల్ అనే ఆంగ్లపదానికి విశిష్టత, శ్రేష్టత సమానార్థకాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ఒక భాష క్లాసికల్ లక్షణం కేవలం ఆ భాష వయసును బట్టే కాక, ఆ భాషకు ఉండే విశిష్టత ఆధారంగా కూడా నిర్ధారించడం ఉచితం.

విశిష్టతకు భాష సుసంపన్నత ఒక్కటే కారణం కాబోదు. అంతకు మించి భాషకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి, మరింత వివరంగా చెప్పాలంటే పునాది కూడా గణనకు తీసుకోవాలి. ఆంగ్లభాష ఎంత సుసంపన్నమైనప్పటికి యూరపులో గ్రీకు భాషతో సమానమైన హోదా సాధించలేకపోవడం గమనార్హం. వేరొక సంప్రదాయం నుండి ఉద్భవించినప్పుడు, ఎంత సుసంపన్నమైనప్పటికి భాషకు స్వతంత్ర ప్రతిపత్తి లభించదు. సంగమ సాహిత్యంలో తమిళభాషకు సుమారు 1000, 1500 సంవత్సరాల వెనుకనే స్వతంత్ర సాహిత్య అస్థిత్వం ఉంది. క్లాసికల్ భాష సరితూగే ప్రమాణమే అది.

 

వాస్తవ దృష్టితో పరిశీలిస్తే అసలు ఈ 'క్లాసికల్' అనే పదమే దేశీయమైనది కాదు,  యూరపు సంబంధితం. అక్కడ వారు పైన చెప్పిన కారణాలతో ఆంగ్లానికి కాక గ్రీక్ భాషకు క్లాసికల్ హోదా కట్టబెట్టారు. మనం మన భాషా సంస్కృతులకు వేరే ప్రమాణాలు నిర్ధారిచుకోవలసిన అగత్యం ముందు గుర్తించాలి. ప్రస్తుతమున్న ప్రమాణాలను బట్టి చూసుకున్నా క్లాసికల్ హోదా సాధించిన తమిళ భాషకు మించి వయసు, విశిష్టతల దృష్ట్యా సంస్కృత భాషకు ఈ హోదా దక్కడం సబబు. అందుకు భిన్నంగా తమిళభాషకు ప్రాచీన హోదా పట్టం కట్టడం వెనుక ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రాజకీయాలే ప్రధాన కారణం.

 

తమిళానికి మూలం సంగమ సాహిత్యం. దాని వయసు సుమారు క్రీ.శ అయిదో శతాబ్ది వరకు విస్తరించినట్లు పరిశోధకులు చెప్పే మాట. (ప్రముఖ భాషా పరిశోధకుడు డాక్టర్ కె.ఎ. నీలకంఠ శాస్త్రి వాదన ప్రకారం తమిళ భాష ప్రాచీనత క్రీ.శ. 300 శతాబ్ది అయినా కాదు.) అత్యంత ప్రాచీనత తన ప్రత్యేకతగా  చెప్పుకునే తమిళానికి ఉన్న స్వతంత్ర పునాది ఏమిటో, దానికి సమానమైన లేదా మించిన వయసు, విశిష్టతలు తతిమ్మా భాషలకు ఎందుకు లేవో.. ఎక్కడా ప్రమాణపూర్వకమైన ప్రయాగాల ద్వారా నిర్దారణ కాలేదు.  కాని  తమిళభాషకు ప్రాచీన హోదా కల్పించారు! కేవలం రాజకీయ కోణం మాత్రమే దీని వెనుక అన్నది సర్వే సర్వత్రా భాషాపండిత లోకంలో వినవస్తున్న మాట. కాదనగలమా?

(తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత - కల్లూరి భాస్కరంగారి పరిశోధన వ్యాసం ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

01 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...