ఆలోచన మనిషిని నడిపిస్తుంది. మనసును పరుగులు పెట్టిస్తుంది. పరిపక్వత చెందిన మేథలో పరిణతి చెందిన ఆలోచనలు ఉద్భవిస్తాయి. మనిషి మనీషిగా మారినా, రాక్షసుడిగా రూపొందినా అది అతని మెదడు పొరలలోని ఆలోచనల నుంచి పెల్లుబికే చైతన్యమే.
మావవతను దుర్లభమని ఎంచి, పరమానందమును పొందలేక, మద మాత్సార్యాలు కామ లోభాలకు
దాసుడనై తిరిగినట్లు నరాధముల చేరి సారహీన కార్యాలు తలపడ్డట్లు, నాదయోగి
త్యాగరాజస్వామివారు తన పంచరత్న కీర్తనలలో వాపోయారు.
కోపం శతృవని, పరనింద మృత్యువని, విషయవాంఛలు ఉరితాళ్లని నమ్మి,
తెలుసుకొని,కొలవలేక పోయానని ఆ కొండలరాయని
తిరుమల విభువుని శ్రీనివాసును పదకవితపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సంకీర్తనల
ద్వారా స్తుతించి ఆవేదనను వ్యక్తీకరించాడు.
రాధమాధవుల శృంగార భావనా ప్రపంచంలో
మనలను ముంచెత్తే రచనలు చేసిన క్షేత్రయ్య సైతం తన పదాలలో పెడ ఆలోచనలు చేసే
దురింతాలపై వేసిన సందర్భాలూ కద్దు.
'అబ్బ తిట్టెనంచు'
తన బుద్ధిమాంద్యతను గురించి స్వచ్ఛమైన తేట తెలుగులో రామదాసు
ఉటంకించాడు.
ఎవరెన్ని అన్నా ఏమి అన్నా తమ మెదడులో
కదలాడే దురాలోచనలను గురించి చివరకు
పశ్చాత్తాపం ప్రకటించినవారే. ప్రయోజనం లేని పనికి పాకులాడడం, అర్థం లేని అవసరాలకు వెంపర్లాడడం కేవలం అవివేకుల లక్షణం మాత్రమే.
ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సమానమైన మనస్సు ఉండవలసిన యువత
ఆలోచనల్లో కూడా విద్యుత్ ప్రవహించాలి. విజ్ఞత ఉండాలి కాని తమస్సు కాదు. వివేకం
ఉండాలి కాని విశృంఖలత్వం కాదు. సాహిత్యానికి కూడ సమకాలీన సమాజంలో జరుగుతున్న
దురంతాలపై సదాలోచన అనే విల్లు ఎక్కుబెట్టి అక్రమాలకు మూలం ఎక్కడ నుంచి
ప్రారంభయిందో కనిపెట్టి, నిరసిస్తూ సంఘానికి పట్టిన మకిలిని
రూపుమాపడే ధ్యేయంగా కృషి చేయాలి. నాన్
ఋషిః కురుతే కావ్యం - ఋషి కానివాడి కావ్య సృష్టి చేయలేడు అనే నానుడి ఎందుకు పుట్టిందో అంతరార్థం తెలుసుకొని
రాతగానిగా తన వంతు కర్తవ్యం నిర్వహించాలి.
-కర్లపాలెం హనుమంతరావు
01 -09 -2021
బోథెల్,
యూ.ఎస్.ఎ
No comments:
Post a Comment