రాళ్ళలో చెక్కినవి, రంగులతో పూసినవి రూపకళ కిందకొస్తాయి,
ఆంధ్రుల రూపకళ ప్రపంచ వ్యాపితం; విశ్వరూపకళతో ప్రభావితమైన భారతీయ రూపకళ ద్వారా ప్రకటితమవుతుంది కనుక.
మనషి రూపాలను కల్పన చేసే గుహకళకు సుమారు 30 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందంటారు! మధ్యప్రదేశ్ హోషంహాబాద్ గుహకళ ఈ ఊహకు కారణం. అక్కడి రూపకళ స్పెయిన్ దేశపు గుహచిత్రాల ప్రభావితం.
చూసే దానికి నకలు తయారుచేసే తపన మనిషికుండే స్వాభావిక లక్షణం. ఆ లక్షణం నుంచి పుట్టుకొచ్చిందే రూపకళ.
ఆదిమానవుడుకి జంతువుల కొవ్వు, రక్తం గోడరాతలకు ఊతంగా ఉపయోగించాయి. ఒక జంతువు రూపం కల్పించి దానిలో
బల్లెం గుచ్చినట్లు చిత్రిస్తే అడవిలోని ఆ తరహా జంతువు సులభంగా చస్తుందనే సంకేతం
ఇచ్చినట్లన్నమాట.
ఒక ప్రయోజనం కోసం ప్రారంభమైన చిత్రకళ
క్రమంగా సౌందర్యకళగా మారిన క్రమం అర్థమయితే అబ్బురమనిపిస్తుంది. కాని, మొహంజొదారో నాగరికతకు ముందున్న ఈ చిత్రకళ క్రమపరిణామానికి చెందిన చారిత్రక
ఆధారాలేవీ ఇప్పటి దాకా లభ్యమయ్యాయి కాదు.
ఆర్యులకు సభ్యత మినహా మరేమీ తెలియని
మొహంజొదారో నాగరికత ముందు కాలానికే ద్రవిడులలోని సభ్యత చాల ఉన్నత స్థితి అందుకున్నట్లు
చరిత్ర చెబుతున్నది. కాకపోతే ఆంధ్రులు ఆర్యులా, ద్రవిడులా అన్నది ఒక
ప్రశ్న. రెండు తెగల సమ్మిశ్రితం అన్న వాదనలోనే నిజం పాలు ఎక్కువ.
ఆంధ్రులుగా భావింపబడిన శాతవాహనులు
క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాల నుండి క్రీ.శ ఒకటి రెండు శతాబ్దాల
దాకా భారతదేశాన్ని పరిపాలించారు. వారి పాలన కేవలం ఆంధ్రభూమి వరకే పరిమితం కాదు.
మగధ వరకు విస్తరించి ఉంది.
అజంతా గుహలలోని మొట్టమొదటి గుహ
ఆంధ్రుల సృష్టే. అట్లాగే సాంచీ స్తూప ప్రాకార నిర్మాణం కూడా. అక్కడి ఆ గుహకళ ఒక
దృశ్య సంగీతం. తెలుగు శిల్పుల పోగారింపుపని ప్రతిభ విమర్శకుల వేనోళ్ల పొగడ్తలకు
పాత్రమయింది.
శిల్పికి చిత్రకళ ప్రావీణ్యం అవసరం.
చిత్రకళకు నాట్యకళ నేర్పరితనం, నాట్యకళకు సంగీత జ్ఞాన నిష్ణాణత,
సంగీత జ్ఞానానికి సాహిత్య మర్మం అవసరం. వెరసి శిల్పి కాదల్చుకున్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞ అలవరుచుకోవలసి ఉంది.
ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వెలసింది. ఆ
కొండ నిర్మాణంలో ఆంధ్ర శిల్పులదే సింహభాగం. కొందరు అనుకున్నట్లు నాగార్జునుడు
ఆంధ్రుడు కాదు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వం నిర్వహించేందుకు విచ్చేసిన
బీరారు ప్రాంతీయుడు.
ఇక్ష్వాకులకు అసలు చిత్రకళ ప్రవేశమే
లేదు. వీరి తదనంతరం వచ్చిన పల్లవుల చలవే రూపకళ వికాస దర్శనం. ఆంధ్ర శిల్పుల కళ్లు ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనడానికి పల్లవులు నిర్మించిన మహాబలిపురమే ఒక ఉత్కృష్ట
ఉదాహరణ. తమ పరిసరాలను, పశుపక్ష్యాదులను శిలలపై చిత్రించిన ఆంధ్రుల శిల్పకళ
అపూర్వం.
తదనంతరం వృద్ధిలోకి వచ్చిన ఆదర్శవాదం
కాకుండా మహాబలిపుర శిల్పకళలో వాస్తవిక వాదం చోటుచేసుకోవడం విశేషం. ఆంధ్ర శిల్పుల
వాస్తవిక వాద చిత్రకళ ఒక్క అజంతా కుడ్య చిత్రాల మీదనే కాకుండా పుదుక్కోట సంస్థాన
పితన్న దేవాలయం గోడల మీది బొమ్మలు మీదా కనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం
దృష్టిని విశేషంగా ఆకర్షించింది మాత్రం అజంతా కుడ్య చిత్రకళ.
స్నాయుపుష్టి(శరీర ఆంతరంగిక నిర్మాణం), దేహయష్టి రెండూ పుష్కలంగా ఉండే గ్రీకో-గాంధార కళ కొట్టొచ్చినట్లు కనిపించే ఈ గుహకళ వాస్తవానికి ఆంధ్రులది కాదు. గ్రీక్ దేశం వెళ్లి మనవాళ్లే నేర్చుకున్నారో, మనవాళ్ల దగ్గరకొచ్చి గ్రీకులే నేర్పారో.. ఆధారాలు దొరకలేదు ఇప్పటి వరకు.
కళింగగాంగుల కాలంలో స్థూపకళ విస్తృతంగ
వర్ధిల్లింది. వీరి జమానాలో నిర్మితమయిన కోణార్క దేవాలయంలో కూడా ఆంధ్ర శిల్పుల ఉలి
చప్పుళ్లే ఎక్కువ. పల్నాడులో కనిపించే గోలిశిల్పం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకు తోబుట్టువు. ఈ విలువైన శిల్పాలన్ని ఇప్పుడు విదేశీయుల
అధీనంలో ఉన్నాయి. స్వాతంత్ర్య సంపాదన కాలంలో బ్రిటిష్ దొరలతో విస్తృతమైన ఒడంబడికలు జరిగాయి. కాని వేటిలోనూ
విలువైన మన శిల్పాలు తిరిగి ఇచ్చే విషయం ప్రస్తావనకైనా రాలేదు. విచారకరం.
భారతీయ చిత్రకళకు జహంగీర్, షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం. షాజహాన్ ప్రత్యేకంగా శిల్పులను రావించి
పరిసరాలలోని వస్తువులను చిత్రించే వాస్తవిక వాదాన్ని ప్రోత్సహించాడు.
చిత్రించే క్రమంలో కన్ను వస్తువును చూపే క్రమాన్ని యథాతథంగా చిత్రించడమే వాస్తవిక వాదం. పెద్ద కొండ అయినా దూరం నుంచి చిన్నదిగాను, చిన్న పూలమొక్క అయినా దగ్గర నుంచి పెద్దదిగాను కనిపిస్తుంది. మన చిత్రకారులు ఈ దృష్టి క్రమాన్ని పట్టించుకోకుండా పెద్ద కొండను ఎప్పుడూ పెద్ద పరిణామంలోనూ, చిన్ని మొక్కనూ అట్లాగే చిన్ని పరిణామంలోనూ చిత్రించే కళకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారతీయ చిత్రకారులకు దృష్టి క్రమం (పెర్ స్పెక్టివ్) తెలియదనే వాదు ఒకటి ఉంది. ఇది పడమటి దేశాలలో అనుసరించే యథార్థవాదానికి విభిన్నమైన ఆథ్యాత్మిక వాదం. పునరుజ్జీవ యుగానికి ముందు పశ్చిమ దేశాలలో కూడా తమ చిత్రాలలో మూడ తలాలు కాకుండా ఒకే తలం చూపించేవారు.
మన దేశంలో కొంతకాలం చిత్రకళ్ల పూర్తిగా స్థంభించిపోయింది. ఆంధ్రుల కళా అందుకు మినహాయింపు కాదు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు చిత్రకళలో కూడా ఒక ఉద్యమం అలలాగా ఎగిసిపడటంతో తిరిగి ఆంధ్రుల కళకు జీవమొచ్చింది.
ఆంధ్రదేశంలో మూడు ప్రధాన శాఖలున్నాయి; రెండు బెంగాలీ శాఖలు, ఒకటి బొంబాయి శాఖ. అడవి
బాపిరాజు వంటివారిది ఒక శాఖ, శ్రీ దేవీ ప్రసాదరాయ్ వంటివారిది రెండో శాఖ. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు వద్ద విద్య నభ్యసించిన శిష్యపరంపర
ప్రవేశపెట్టిన బొంబాయ్ శాఖ మూడవ రకానిది.
చిత్రకళకు ఏ కొద్దిగానో ప్రోత్సహమున్నది.
కాని, మూర్తికళను పట్టించుకునే నాథుడు ఆంధ్రదేశంలో నాడూ
లేడు, నేడూ లేడు. గుంటూరు జిల్లాలోని పురుషత్ గ్రామంలో ఈ
మూర్తికళ మీద ఆధారపడి జీవించే ముస్లిం కుటుంబాలున్నా.. అదే ఆదరువుగా జీవితం గడిపే
పరిస్థితులు లేవు. కుడ్య చిత్రకళ కనుమరుగవుతున్న అమూల్య సంపదల జాబితాలోకి క్రమంగా జారిపోతోన్నది అనేదే
ఆఖరి చేదు సత్యం.
(సంజీవ దేవ్ వ్యాసాలు- ఆంధ్ర శిల్పుల
రూపకల్పన ఆధారంగ)
-కర్లపాలెం హనుమంతరావు
02 -10 -2021
బోథెల్; యూ.ఎస్.ఎ
No comments:
Post a Comment