Thursday, January 13, 2022




 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 


పదండి ముందుకు.. పదండి తోసుకు! 


-కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


ఆఫీసుకు పోగానే, 'ఆలస్యమయిందే' అనడి గాడు కామేశం . 


' బండిమొండికేసింది. పాద యాత్ర చేసొచ్చా' అన్నా. 


అలాంటి మాటలే. అన్నందుకు బాసు చేత చచ్చే చివాట్లూ తిన్నా. 


'ఎప్పుడూ విమానాల్లో ఎగిరేవాడు ఎప్పు డైనా రెండడుగులు నడిస్తే జాలి పడతారు. క్రీస్తు పుట్టక ముందెప్పుడో అయిదొందలేళ్ల కిందట సిద్ధార్థుడు మహారాజు కొడుకై ఉండీ రథం దిగి నడిచాడని మనమిప్పటికీ గొప్పగా చెప్పుకుంటాం . పల్లెల్లో ఆడవాళ్లు  నీళ్ళ కోసం మైళ్లకొద్దీ నడుస్తారు.... ఎవడికి పట్టింది? డొక్కుబండి మీద తిరిగే నీబోటివాడు.. బోడి.. నడిస్తే ఎవడిక్కావాలి. పాకితే ఎందుకు జాలి? నువ్వేమన్నా వై. యస్.వా.. ఎమ్మెస్ బాసువీ  నీ వెంటబడి మరీ పొగట్టానికి' అన్నాడు కామేశం.


యస్. వై.యస్.. అంటే గుర్తొచ్చింది. పేపర్లలో వారం పది రోజుల్నుండీ ఆయన్దే  ఊసంతా. 


ఊసుపోక కాంటీన్లో ఆ విషయమే కదిపా.  చర్చ అంటే కామేశం రెచ్చిపోతాడు. పైపెచ్చు హస్తం అభిమాని.


''అందుకే 'దేశం' ఉసూరుమంటుంది. హనుమంతుడు. కుప్పిగంతులేస్తుంది. మంత్రదండముందా అని మంత్రులు దండె త్తుతుంది. వై .. ఎప్పుడనాలో... యస్.. ఎప్పు డనాలో తెలిసిన గడుసువాడు నాయకుడైతే విపక్షం, స్వపక్షంలోని విపక్షం కూడా పక్ష పాతం లేకుండా ఏకపక్షంగా ఇలాగే పక్ష వాతం పాలబడుతుంది. మొత్తానికి గురు వును ముంచిన శిష్యుడు మా'వాడు' ' అన్నాడు కామేశం కులాసాగా. 


'గురువెవరు గురూ? '


' పేరెందుకులే.. బాధపడతావు. పైసా ఖర్చుపెట్టి పది రూపాయలు ప్రచారం చేసు కొనే విద్యకు మెరుగు పెట్టి అసలు ఏ పెట్టు బడీ లేకుండానే కీర్తిని రాబట్టే కొత్త టెక్నిక్  కనిపెట్టాడే ఆయనే శిష్యుడు. నడక తనది. తిమ్మిరి 

సీ యమ్ ది.  పాదాలు తనవి . బొబ్బలు తనవాళ్లవి.  పెడబొబ్బలు పెడుతున్నారుగా.. వినపట్టంలా? ' ముసిముసి నవ్వులు నవ్వాడు. 


' అవును హస్తం పాదయాత్ర వట్టి సర్కస్ ఫీట్' అంటున్నారు చాలమంది' 

అన్నా అక్కసుకొద్దీ. 


ఆయన నడక పడక అలా అంటున్నారు. గానీ, పాదయాత్ర సూపర్ హిట్. దిగ్విజ "యంగా నడుస్తున్నది మూడో వారం... ఓవర్ టేక్ చెయ్యాలంటే ఒహటే దారి. పరిగెత్తే యాత్ర పెట్టుకోవటమే! 


' వైయస్ కీ  వయసులో నడవాలని మనసెందుకైంది బాస్? 


సిటీలో నీళ్ళు లేవు. కరెంటు లేదు. పొల్యూషన్. ఎండలు మండిపోతున్నాయి. రైలెక్కుదామంటే పట్టాలు తప్పుతాయని

భయం. బన్సెక్కుదామంటే లగేజ్ ప్రాబ్లమ్. కార్లలో షికారు చేసే రోజులా..  కావు. అసెంబ్లీ సీజన్ అయిపోయింది. కరవుకు తప్ప మీడియాలోదేనికీ కవరేజీ లేని రోజులు. ఏవరేజిగా ఆలోచించగల ఏ నాయకుడికి అయినా  వచ్చే ఐడియానే ఈ అనంత ఆక్రందన! ... చూశావుగా ఎంత స్పందనో! దటీజ్ అవర్ బాస్' 


'అవునవును ఇది చూసే సీమ అవేదన.. కోస్తా అవస్త... గట్రాలు బైలుదేరాయని  జైలుదేరాయని నా థీరీ.  కరవు రోజుల్లో ఎవరు  పల కరించినా జనం బావురుమనటానికి సిద్ధంగా ఉంటారనేదే వీటి వెనక సిద్ధాంతం  . అవునా?' 


' దేవుడు బుట్టలో ఉన్నాడనే యమునా నది వసుదేవుడికి దారిచ్చింది. ప్రతిపక్షం బుట్టలో పవరుందని పసిగట్టింది కనకనే 'వార్ '  అయినా.. తె.రా.స. వారయినా... ఎవరైనా దానికి దారిస్తున్నది. బుష్ కా  మాత్రం పుష్ ఉండుంటే దండయాత్రకు బదులు ఇరాకులో పాదయాత్ర చేస్తుండే వాడు. ఏ చిరాకు లేకుండా చవురు బావులు చులాగ్గా దక్కుండేవి. మీ ముఖ్య

మంత్రిగారిరవైనాలుగ్గంటలూ నిద్రపోకుండా... నిద్రపోనీయకుండా 'జన్మభూమో అని వెంటబడుతుంటే జనంలో చైతన్యం మరీ ఎక్కువైనట్లుంది... ప్రతిపక్షం వెంట బడి పోతున్నారు.' 


'అవును స్పూర్తి సి.యమ్ ది. కీర్తి వై.యస్ ది . ప్రజల వద్దకు పాలన చివరి సీనులో ప్రజల వద్దకు ఆలనగా ఎలా మలుపు తిరిగిందో చూడు. దటీజ్ పొలిటిక్స్.. ' 


' కరవులో రాజకీయం సబబా గురూ !' 


' పడనివాళ్ళు అలా అంటుంటారుగానీ నడక పవరు నీకేం తెలుసు? పదవులు పోయిన పాండవులకి పాదయాత్ర చేస్తేగాని మళ్ళీ రాజ్యం

దక్కలేదు. ఉన్న ఊళ్ళో ఉప్పు దొరక్కటండీ  గాంధీగారు ' పదండి దండిగా! 

ఉప్పు చేద్దా' మని దండియాత్రకని బైలుదేరిందీ! ప్రజల్లో స్థానం కోసం అప్పుడప్పుడూ ఇలాంటి డప్పు ప్రస్థానాలు, ప్రజాప్రస్థానాలు..

పుట్టుకొస్తుంటాయి మహాశయా! మావో  మహాశయుడు  కూడా డెబైయేళ్ల కిందట ఎన్నో వేలకిలోమీటర్లిలాగే నడిచాడయ్యా మహానుభావా...! ' 


' పొద్దుపొడిచింది మొదలు పొద్దు గడిచిందాకా ఇళ్ళల్లో ఇల్లాళ్లు తిరిగేదానికి మీటరేస్తే ఇంతకన్నా ఎన్నో వేల రెట్లు తిరిగుంటారు బాస్: ఇదో పెద్ద మేటర్ కాదు. శాసనసభల్లో ముక్కలు ముక్కలుగా చేస్తారే మన నాయ కులు... వాకౌట్లు..., వాటినన్నింటినీ కలిపి కూడితే మావో ప్రస్థానానికన్నా మరో మీటర న్నా పొడుగుండుంటుంది. ' 


' పాదయాత్రలెన్ని యోజనాలున్నాయన్నది కాదు ప్రశ్న.. జనా

లకెన్ని ప్రయోజనాలున్నాయన్నది పాయింట్. ' 


' రాముడు నడిచిన బాటలో రాయిక్కూడా ప్రాణం వస్తుంది. మా పెద్దాయన నడుస్తున్న బాటలో ఊళ్లకి ఊపిరి వస్తుంది. అన్న నడిచే బాటలోని ముళ్లని లక్ష్మణస్వామి ముందే ఏరి ' పారేసినట్లు... మా నాయకుడు నడుస్తున్న దారిలోని పెండింగ్ పన్లన్నింటినీ ప్రభుత్వం ముందే పూర్తిచేస్తున్నదా లేదా?  అదే పెద్ద ప్రయోజనం. పేపరు చూట్టంలా? '  అన్నాడు ఎద్దేవాగా. 


' అది చూసే మా దిబ్బపాలెం మామయ్య ఆ పెత్తనం మీదేసుకుని నెత్తి మీదకు తెచ్చుకున్నాడు' అన్నా చివరికి. 


' ఎవరా దిబ్బపాలెం మామయ్య? ఏమిటా కథ? ఎప్పుడూ చెప్పలేదే? ' అనడిగాడు కామేశం. 


' ఇప్పుడు చెబుతున్నా. విను. మా మామయ్య దిబ్బపాలెం ఉప సర్పంచి.  నీకులాగే పెద్దాయనకు పెద్ద అభిమాని.  రూట్ లేకపోయినా పాలెం మీద నుంచి పాద యాత్ర ఏర్పాటు చేసుకున్నాడెలాగో తంటాలు పడి . ఉప్పందిన అధికారులు ఏం చేశారో తెలుసా? రాత్రికిరాత్రి ఆత్రంగా ఊరి బైటి  చెత్తనంతా ఊళ్ళోకెత్తిపోసి... పెద్దా యన దారి మాత్రం ఫినాయిల్ పెట్టి కడి గేసి కూర్చున్నారు. ' 


' నమ్మేదేనా? .... ఏ పేపర్లో రాలేదే? ' 


' అన్నీ పేపర్లో రావు. అడుగో.... మా మామయ్య ఊళ్ళో వాళ్లు తంతారని మా ఇంట్లో దాక్కున్నాడు. అడుగు! ' అన్నా  అప్పుడే మా ఆఫీసుకొచ్చిన మా మామయ్యని చూపించి . 


'నిజమేరా అబ్బాయ్..' అని అడక్కుం డానే అన్నీ ఆయనే చెప్పుకొచ్చాడు 'సర్ పంచి పదవికి తాడేస్తే.. ఉన్న ఉప సర్ పంచి పదవి ఊడినట్లయింది. నా పని. ఎన్నికలయితేగాని అన్ని విషయాలూ తేలవు' అన్నాడు దిగులుగా.


' పోనీలే అంకుల్... ఓడితే మాత్రమేం.. ఒలింపిక్స్లో మారథాన్ రేసని ఉందొకటి దానికి పనికొస్తుంది మన కాంగిరేసు' అన్నాడు కామేశం ఓదార్పుగా.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...